ఆరోగ్యం అందరి హక్కూ …. “Sicko”

యువరాజ్ సింగ్, లీసా రే, మనీషా కోయిరాలా లాంటి కేన్సర్ బాధితులు కేన్సర్ తో పోరాడాలని సందేశాలిస్తూ అందరినీ యుద్ధ సన్నద్ధులను చేస్తుంటారు. కేన్సర్ రాగానే యువీ లాగానో, మనీషా లాగానో పోరాడి, ఏదోలా బతుకు జీవుడా అనుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు? తేడా అల్లా డబ్బున్నవాడికి యుద్ధం చెయ్యటానికి ఏకే ఫార్టీ సెవెన్ల లాంటి స్టార్ ఆస్పత్రులుంటే లేనివాడి చేతుల్లో చిన్న కట్టెపుల్ల లాటి ధర్మాసుపత్రి కూడా సరిగ్గా ఉండదు. గట్టి జబ్బులొస్తే బతుకు గాల్లో దీపమై రెపరెపలాడుతుంది. ప్రాణ దీపాలు ఆరిపోతే పట్టించుకునేవాళ్ళూ లేరు.

అమెరికాలో ఒక పెద్దమనిషికి ప్రమాదంలో మధ్యవేలు, ఉంగరంవేళ్ళ తలకాయలు రెండూ తెగిపోయాయి. వాటిని తిరిగి అంటించి నిలబెట్టడానికి ఉంగరం వేలికైతే 12 వేలు, మధ్యవేలికైతే 60 వేలు అడిగారట ఆస్పత్రిలో. ఆయనకు పాపం ఆరోగ్య బీమా లేదు. డబ్బూ లేదు. రెండువేళ్ళనీ దక్కించుకునే మార్గం లేక 12 వేలిచ్చుకుని ఉంగరం వేలిని రక్షించుకుని మధ్యవేలి తలని చెత్త కుప్పలో వదిలేశాడట. ఆరోగ్య బీమా లేని ఇంకో నిర్భాగ్యుడు మోకాలికి దెబ్బ తగిలితే స్వయంగా తనే కుట్లు వేసుకుంటూ కనిపిస్తాడు. వీరిద్దరితో “Sicko” సినిమాను మొదలు పెడతాడు మైకల్ మూర్. కానీ “Sicko” సినిమా ఆరోగ్య బీమా లేని 50 మిలియన్ల అమెరికన్ల గురించి కాదు. బీమా రక్షణ ఉన్న 250 మిలియన్ల మంది గురించే చర్చిస్తుంది.

మైకల్ మూర్ అమెరికన్. మంచి పేరున్న డాక్యుమెంటరీ దర్శకుడు. “ఫారన్ హీట్ 9/11” సినిమాతో ప్రపంచాన్ని కుదిపేశాడు. “Sicko” 2007 లో తీశాడు. ఈ సినిమా, లోపలంతా పురుగు పట్టిన ‘అమెరికన్ హెల్త్ కేర్’ మేడి పండును చాలా నాటకీయంగా, ఆసక్తికరంగా విప్పిచూపిస్తుంది.

అమెరికాలో ఆరోగ్య బీమా లేనివాళ్ళకు ఒకటే చింత. బీమా ఉన్నవాళ్ళకు మాత్రం వంద బాధలు. బీమా కంపెనీ ఏ జబ్బు కుదుర్చుకోవటానికి డబ్బులిస్తుందో, ఏ జబ్బుకు వీలు కాదంటుందో అంతా ఆ కంపెనీ ఇష్టమే. ఏ మనిషికైనా వచ్చిన జబ్బుకి అంకురం బీమా కట్టటానికి ముందే పడిందని నిర్ణయించి, ఆ జబ్బుకి వైద్యం తమ బీమా పరిధిలోకి రాదని నిర్ణయించటానికి కంపెనీలు అన్ని ప్రయత్నాలూ చేస్తుంటాయని చెప్తున్నారు బాధితులు. బీమా బాధితుల వివరాల కోసం మైకల్ మూర్ అడిగిందే తడవుగా వారంలోపునే 25,000 మంది అతనికి ఈ మెయిల్ లో తమ కథలు వినిపించారట. బీమా ఉన్నప్పటికీ అది తమ మందుల ఖర్చుకు సరిపోక, ఒక 79 ఏళ్ల పెద్దాయన మందుల కంపెనీలో వాష్ రూములు కడగటం దగ్గర్నుంచీ అడ్డమైన పనులూ చేస్తున్నాడు. దీర్ఘ రోగులైన తనకీ, భార్యకీ అక్కడ మందులు దొరుకుతాయని, అందుకని చచ్చేవరకూ ఆ పని చేస్తాననీ చెప్తున్నాడు. ఒక్కోటీ 200 డాలర్ల ఖరీదున్న పెయిన్ కిల్లర్ కొనుక్కోలేక ఆ మందు కంటే ఓ పెగ్ బ్రాందీ తనకి తనకి చాలంటోంది వాళ్ళావిడ. మధ్యతరగతి భార్యా భర్తలు లారీ, డోనా స్మిత్ లు. బీమారక్షణ ఉన్నప్పటికీ లారీ కి మూడు సార్లు వచ్చిన గుండె పోటు, డోనాకు వచ్చిన కేన్సర్ వైద్యాల దెబ్బతో వాళ్ళిద్దరూ ఇల్లు అమ్ముకుని కూతురింట్లో స్టోర్ రూమ్ లో ఇరుక్కుని బతకాల్సి వస్తుంది.

అమెరికన్ ఆరోగ్య బీమా కంపెనీలు విపరీతమైన లాభాల్లో ఉంటాయి. లాభం తగ్గకుండా ఉండేందుకు, వచ్చిన కేసుల్లో 10 శాతం కేసుల్ని బీమా పరిధిలోకి రావని డాక్టర్లు నిర్ణయించాలి. ఇది ఆస్పత్రులకూ, బీమా కంపెనీలకూ డాక్టర్లకూ మధ్య ఉండే ఒప్పందం. ఇలా ఎన్ని దరఖాస్తులను తిరగ్గొడితే డాక్టర్లకు అంత బోనస్ ఇస్తారని ఒక వైద్యురాలు చెప్తుంది. బీమా కేసులు మరీ ఎక్కువైతే వాటిని ఏదో వంకపెట్టి తిరగ్గొట్టటానికి అన్నిచోట్లా ఉన్నట్టే ఇక్కడా హిట్ మన్ ఉంటారు. లీ ఐనర్ అనే హిట్ మన్ తను చేసిన పాపాలు చెప్పేసి, ఇప్పుడు తను ఆ పని చెయ్యటం మానుకున్నానంటాడు. హ్యుమానా అనే హాస్పిటల్, తన భర్త ట్రేసీ కొచ్చిన బ్రెయిన్ కాన్సర్ కు వైద్యం నిరాకరించి, అతన్ని చావుకు ఎలా దగ్గర చేసిందో అతని భార్య చెప్తుంటే ఆ అమానవత్వం గడ్డ కట్టిన చావులా మనను తాకుతుంది.

హ్యుమానా లో పని చేసిన మెడికల్ రెవ్యూయర్ డాక్టర్ లిండా పీనో, ఆపరేషన్ అవసరమైన వ్యక్తి కేసును తిరగ్గొట్టి అతని చావుకు తను కారణమైనానని, కంపెనీకి తను చేసిన పనివల్ల ఓ అర మిలియన్ డాలర్లు మిగిలాయి కాబట్టి తన మీద ఏ కేసూ రాలేదని, తనూ డబ్బు సంపాదించుకుందని యు.ఎస్. కాంగ్రెస్ ముందు అందర్లోనూ చెప్పి పశ్చాత్తాపం ప్రకటిస్తుంది. తను తిరగ్గొట్టిన కేసుల కాగితాలన్నీ కళ్ళ ముందుకొచ్చి తనను నిలదీస్తున్నాయని బాధ పడుతుంది.

అసలీ రాక్షసత్వానికి బీజాలు 1971లో నిక్సన్ కూ, ఎడ్గార్ కైసర్ కంపెనీకీ జరిగిన ఒప్పందంతోనే పడ్డాయని చెప్తున్నాడు మైకల్ మూర్. ఆరోగ్య రక్షణ తక్కువగా ఇచ్చి ఎక్కువ లాభాలు సంపాదించే కంపెనీల వల్ల ప్రభుత్వం, పార్టీలు లాభపడతాయి కాబట్టి ఇదేదో బాగా ఉందని కైసర్ చేతిలో అమెరికన్ల ఆరోగ్యాన్ని పెట్టేశాడు నిక్సన్. దానితో పేదలకు దారుణమైన జబ్బులకు వైద్యం అసలు అందకుండా పోయింది. హిల్లరీ క్లింటన్ రాజకీయాల్లోకి వచ్చాక అందరికీ సరైన హెల్త్ కేర్ ఇవ్వాలని, దానికి తగిన విధానాన్ని ప్రభుత్వంచేత చేయించాలని చాలా పట్టుబట్టింది కానీ కంపెనీలు, కాంగ్రెస్ సభ్యులూ కలిసి ఆమె నోరు మూయించారు.

అమెరికాలో సోషలిజం వచ్చేస్తోందంటూ గోల చేశారు. ముఖ్యంగా డాక్టర్లకు మరీ భయం. గవర్నమెంట్ ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చెయ్యాల్సి వస్తుందనే ఊహే వాళ్ళు భరించలేరు. అంతగా ముదిరిపోయిన వ్యక్తివాదం. డాక్టర్లు దేశమంతా తమ చుట్టుపక్కల ఉండే అందర్నీ పోగు చేసి, ‘అందరికీ వైద్యం’ అనే విషయం ఎంత చెడ్డదో వివరించే ఒక రికార్డును వినిపించారు. రోనాల్డ్ రీగన్ గారి ఈ రికార్డు “Sicko” లో మంచి కామెడీ ట్రాక్. మొత్తానికి బీమా కంపెనీలు ఒక వంద మిలియన్ డాలర్ల దాకా ఖర్చు చేసి, హిల్లరీ తీసుకు రావాలనుకున్న హెల్త్ కేర్ పాలసీని ఓడించేశాయి. జార్జ్ బుష్ వచ్చాక మరిన్ని కొత్త పాలసీలతో మందుల కంపెనీలు కూడా బలిశాయి.

అమెరికాలో హెల్త్ కేర్ ఇలా ఏడుస్తుంటే, మైకల్ మూర్ పక్క దేశాల హెల్త్ కేర్ ఏమిటో చూద్దామని కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ తిరిగాడు. ఈ దేశాల్లో రోగులకు దొరుకుతున్న రాజభోగాలు చూసి కళ్ళు తిరిగి బోర్లా పడ్డాడు. ఎవరూ వైద్యంకోసం చేతిలోంచి పైసా ఖర్చు పెట్టక్కర లేదు. అతి తక్కువ డబ్బుకి మందులు దొరుకుతున్నాయి. కెనడాలో చేతి వేళ్ళన్నీ తెగిపోయిన మనిషికి 24 గంటల పాటు ఆపరేషన్ చేసి అన్ని వేళ్ళూ ఉచితంగా కుట్టేసి పంపించారు. మనకి వెంటనే అమెరికాలో మధ్యవేలా ఉంగరంవేలా అని వేలాడిన మనిషి గుర్తొస్తాడు. బ్రిటన్ ఆసుపత్రిలో వైద్యం పూర్తి అయిన రోగి తిరిగి ఇంటికి వెళ్ళటానికి డబ్బు లేకపోతే ఆస్పత్రి వాళ్ళే దారిఖర్చు ఇచ్చి ఇంటికి పంపటం చూశాడు మూర్. డాక్టరు సంతృప్తిగా ఎగువ మధ్యతరగతి జీవితం గడపటాన్ని చూశాడు. రోగుల చేత చెడు అలవాట్లు మాన్పించి ఆరోగ్యం బాగయేలా చేసే డాక్టర్లకు బోనస్ కూడా దొరుకుతుంది. అమెరికా కథని తిరగేసి రాసినట్టు ఉంటుంది లండన్ లో. డాక్టర్లు రాత్రీ పగలూ లేకుండా అత్యవసర పరిస్థితుల్లో రోగుల ఇళ్ళకు వచ్చి వైద్యాన్ని అందించటాన్ని రికార్డు చేశాడు మూర్. ఫ్రాన్స్ లో రోగం పూర్తిగా తగ్గేదాకా పూర్తి జీతంతో రోగికి విశ్రాంతినిచ్చే పధ్ధతి చూసి ఆశ్చర్యపోయాడు. కొత్తగా తల్లులైన ఆడవాళ్ళకు సాయం చెయ్యటానికి ప్రభుత్వం వారానికి రెండు సార్లు ప్రభుత్వోద్యోగులైన నానీలను ఆ తల్లుల ఇళ్ళకు పంపటం చూశాడు.

“ఇది ప్రజలకు చేస్తున్న ఉద్ధరింపు ఏమీ కాదు. ప్రజలనుంచి పన్నులు ప్రభుత్వం వసూలు చేస్తున్నప్పుడు ఆ ప్రజలకు రోగాలొస్తే వైద్యం అందించాల్సిన బాధ్యత నుండి ప్రభుత్వం ఎలా తప్పించుకోగలదు? రెండో ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటన్ లో మేం ఆరోగ్యరక్షణ కోసం మంచి చట్టాలు చేసుకున్నాం. వీటిని మార్చే ధైర్యం ఎవరూ చెయ్యలేరు” అంటాడు ఒకాయన.

“Sicko” లో మైకల్ మూర్ కొంతమంది రోగుల్ని వెంటేసుకుని పక్కనున్న క్యూబాకు మూడు పడవల్లో వెళ్లి, వాళ్ళందరికీ అక్కడి ఆస్పత్రిలో వైద్యం చేయించి అతి తక్కువ ఖర్చులో దొరికే మందులు ఇప్పించే సేవా కార్యక్రమం కూడా చేశాడు. వీళ్ళలో ఎక్కువమంది అగ్నిమాపక దళంలో పనిచేస్తూ, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉగ్రవాద దాడిలో నేల కూలినప్పుడు గ్రౌండ్ జీరోలో అతిగా పని చేసి, ఆ పొగల్లో నుసిలో రోగగ్రస్తులైనవాళ్ళు. వీళ్ళ అనారోగ్యాన్ని అమెరికా మామూలుగానే ఏమాత్రం పట్టించుకోలేదు. క్యూబాలో ఉచిత వైద్యం, అక్కడి అగ్నిమాపక దళం దగ్గర ఆదరణ పొంది, వీళ్ళంతా అమెరికాకు తిరిగి రావటంతో ఈ డాక్యుమెంటరీ పూర్తవుతుంది.

220px-Sickoposter
“ఎక్కడైనా మంచి కార్ తయారౌతే మనం దాన్ని డ్రైవ్ చేస్తాం. ఎక్కడో తయారైన వైన్ ని మనం ఆస్వాదిస్తాం. వాళ్ళు రోగుల్ని ఆదరించే మంచి పద్ధతిని, పిల్లలకు చక్కగా బోధించే పద్ధతిని, పిల్లల్ని చక్కగా చూసుకునే పద్ధతిని, ఒకరితో ఒకరు ఆదరణగా మెలిగే పద్ధతిని కనిపెట్టినపుడు మనం వాటిని మాత్రం ఎందుకు గ్రహించం?

వాళ్ళు “మేము” అనే ప్రపంచంలో బతుకుతున్నారు. మనలా “నేను” అనే ప్రపంచంలో కాదు. మనల్ని “నేను” లు గానే ఉంచటానికి ప్రయత్నించే శక్తులు అమెరికా ఎప్పటికీ ఉచిత వైద్యం ఇవ్వని దేశంగానే మిగలాలని కోరుకుంటాయి. వైద్యం ఖర్చులు, కాలేజీ ఖర్చులు, పిల్లల డే కేర్ ఖర్చులు ఇవన్నీ లేని అమెరికా ఎప్పటికైనా వస్తుంది. అది తప్పదు.” అంటూ ఆశగా ముగింపు వాక్యాలు చెప్తాడు మైకల్ మూర్. జనం విపరీతంగా చూసిన ఇలాటి సినిమాలు కూడా పాలసీలను అంతో కొంతో కుదుపుతాయి.

ఒబామా చొరవతో అమెరికన్ హెల్త్ కేర్ ఇప్పుడు ఒబామాకేర్ గా కొన్ని సంస్కరణలకు గురైంది. అందులో అతి ముఖ్యమైనది, ఈ సినిమాలో చర్చించిన “pre-medical condition” అనేదాన్ని బీమానుంచీ తొలగించటం. రోగులకు వైద్యం ఇవ్వకుండా చెయ్యటానికి ఈ pre medical condition ని వాడుకునే అవకాశం ఇప్పుడు కంపెనీలకు లేదు. రెండోది, అందర్నీ నిర్బంధంగా బీమా పరిధిలోకి తేవటం. వీటి ఫలితాలు రాబోయే కాలంలో తెలుస్తాయి.

*****
“Sicko” ఇప్పుడు మన దేశంలో అందరూ చూడాల్సిన సినిమా. మన ఆరోగ్య వ్యవస్థ ఇంకా తప్పటడుగుల్లో ఉండగానే కార్పొరేట్ల చేతిలోకి వెళ్ళిపోయింది. పోలియో నివారణ, కుటుంబనియంత్రణ ఆపరేషన్స్, జ్వరాలు, టీకాలు … వీటికి మించి ప్రభుత్వం మనకొచ్చే ఏ జబ్బులకూ బాధ్యత లేకుండా చేతులు దులిపేసుకుని కూర్చుంది. 80ల్లో అమెరికా నుంచీ దిగుమతైన మన గొప్ప డాక్టర్లు అపోలో ప్రతాప్ రెడ్డి, మేదాంత నరేష్ త్రెహన్ లాంటివాళ్ళు అమెరికా హెల్త్ కేర్ పద్ధతిని మనకూ అంటించారు. నగరాల మధ్యలో ఇంచుమించు ఉచితంగా భూమి కొట్టేసి, నీళ్ళు, కరెంటు చౌకగా లాగేసి, గొప్ప గొప్ప భవంతుల్లో ఆస్పత్రులు కట్టి, ఎంత డబ్బు వెదజల్లగల్గిన వాళ్లకు అంత గొప్ప స్టార్ వైద్యాలు అందిస్తున్నారు. పేరుకి వీటిలో పేదవారికి కొంత వైద్యం చెయ్యాలని నియమాలు ఉంటాయిగానీ వాటిని వీళ్ళు ఏమీ పట్టించుకోరు. అసలు స్టార్ హోటళ్ళ లాటి ఆ ఆస్పత్రుల్లో తాము అడుగు పెట్టవచ్చనే ఊహ మధ్యతరగతి వాళ్ళకే రాదు. ప్రైవేటు ఆస్పత్రుల వైభవాలు ఇలా వెలిగిపోతుంటే మరోపక్క ఛత్తీస్గఢ్ లాంటి చోట ఎలకమందుల మధ్య ఆడవాళ్ళకు ఆపరేషన్లు చేసి తిరిగిరాని లోకాలకు పంపించే సమర్థత మన ప్రభుత్వ డాక్టర్లదీ ప్రభుత్వాసుపత్రులదీ.

ముందుతరం పారిశ్రామికవేత్తల్లాంటి వారు కాదు ఇప్పటి చురకత్తుల్లాంటి కార్పొరేట్లు. నిర్దాక్షిణ్యంగా పెద్దలనుండి పేదలను కోసి అవతలపెడతారు వీళ్ళు. ముంబై టాటా మెమోరియల్ లాంటి ఆస్పత్రులను ఇప్పటి కార్పొరేట్ల నుంచీ కలలోనైనా ఆశించగలమా?

నేలా, నీళ్ళూ, కరెంటూ కారుచౌకగా ప్రైవేటు ఆస్పత్రులకిచ్చేసి, పైగా అక్కడ పేదవారికి వైద్యం చేసినందుకు ప్రభుత్వం ఆ ఆస్పత్రులకు డబ్బులు కట్టటం ఇంత జనాభా ఉన్న దేశంలో సరైన పనేనా? శుభ్రంగా, కనీసావసరాలతో ఉండే ప్రభుత్వ ఆస్పత్రులూ, వాటిలోకి చక్కటి ఆధునికమైన వైద్య పరికరాలూ, డాక్టర్లకు మంచి జీతాలూ ఇచ్చి, ప్రభుత్వ వైద్య కళాశాలలు మరిన్ని కట్టినా, కార్పొరేట్ల కిచ్చే దొంగ సబ్సిడీల కంటే ఎక్కువవుతుందా? ఎవరైనా లెక్కలు కడితే బాగుండును.
లెక్కలు సరి చూసుకునే ఓపిక ప్రభుత్వాలకు లేదు. ఎవరు సంపాదించిన డబ్బు వాళ్ళు లెక్కపెట్టుకోవటంతోనే సరిపోతోంది. స్టార్ ఆస్పత్రులు మరింత జోరుగా డబ్బులు లెక్కెట్టుకుంటున్నాయి. లక్షల ఖర్చుతో కొన్న ఒక ఆధునిక వైద్య పరికరం కోసం పెట్టిన డబ్బు కొన్ని నెలల్లోనే తిరిగొస్తుంది వాళ్లకు. ఆ పైన, కోట్లకొద్దీ లాభం. ఇవన్నీ కాక, ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా చేయించాలనుకునే వైద్యాలకు వీళ్ళ లాభం వాటా 15 శాతం దాకా కలిపి ఇవ్వాలని ఆదేశిస్తున్నారు. ఈ ప్రైవేటు డాక్టర్లు మన ప్రభుత్వ పాలసీలను అంతా అమెరికన్ పద్ధతిలోనే తమకు కావలసినట్టు మారుస్తున్నారు. వాళ్ళ డాలర్ కలల్ని నిజం చేసుకుంటున్నారు.

“Sicko” సినిమాలో చూపించిన Cigna అనే ఆరోగ్య బీమా కంపెనీ దేశీయ TTK తో కలిసి మన దేశంలో రంగంలోకి దిగిందని ఒక టీవీ వ్యాపార ప్రకటనలో చూశాను. ఇప్పుడు మధ్యతరగతి కూడా ఈ బీమా కంపెనీల వైపు చూడక తప్పటం లేదు. మన మధ్యతరగతి కూడా ఈ సినిమాలో చూపించిన “pre-medical condition”, “denial” లాంటి పరిభాషలో గిరగిరా తిరిగే రోజులు ఎక్కువ దూరంలో లేవు. కార్పొరేట్ ఆస్పత్రులూ, మందుల కంపెనీలు, డాక్టర్లూ, బీమా సంస్థలూ మధ్యతరగతి రోగులతో ఆటాడుకునే బరిలోకి మనమూ వచ్చేస్తున్నాం. ఇంకా కింది పొరల్లో ఉన్నవాళ్ళు ఇప్పటికే నిండా మునిగిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ వైద్యం ఇవ్వాలంటే ప్రభుత్వం స్టార్ డాక్టర్లకి ఆకాశంనుంచి ఎన్నెన్ని నక్షత్రాలు తెంచి ఇవ్వాలి? ప్రభుత్వం మెదడు మోకాల్లో ఉంది కాబట్టి ఈ ఆలోచనలేవీ అంటకుండా కళ్ళు మూసుకుని జాతి మొత్తాన్నే ఉద్ధరిస్తున్నామంటూ పెద్ద పెద్ద ప్రైవేటు ఆస్పత్రుల కోసం హెల్త్ పాలసీ తయారు చేస్తోంది.

అందరికీ ఉచిత వైద్యం గురించి మాట్లాడే ఒకే గొంతు ఇప్పుడు వినిపిస్తున్నది లెఫ్ట్ పార్టీలనుంచి కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచీ. ఆ గొంతును యువత అందుకుని ప్రభుత్వాలకూ కార్పొరేట్ వైద్యాలకూ ఉన్న ఫెవికాల్ బంధాన్ని తెంచి, వైద్యాన్ని అమెరికన్ మోడల్ లోకి వెళ్ళిపోకుండా, మైకల్ మూర్ చెప్పినట్టు “మేము” అని అందరూ మాట్లాడుకునే మోడల్ లోకి మళ్లిస్తే! ఎంత బాగుంటుందో! చర్చ మొదలైంది. కొనసాగించటం అందరి పనీ…

-ల.లి.త.

lalitha parnandi

“Sicko” — http://www.youtube.com/watch?v=9CDLoyXarXY

Private Operator — http://www.caravanmagazine.in/reportage/naresh-trehan-medanta-private-practice

Download PDF

16 Comments

  • మంజరి లక్ష్మి says:

    మీ వ్యాసం బాగుందండి.

  • kv ramana says:

    ప్రతి ఒక్కరికీ అవసరమైన సబ్జెక్టు మీద గొప్ప విలువైన వ్యాసం అందించారు. అమెరికాలో వైద్యం మేడిపండు అన్న సంగతిని చెప్తున్న ఈ వ్యాసం ఎందరికో కనువిప్పు. వైద్య బీమాపై మంచి లెసన్. బ్రిటన్, ఫ్రాన్స్ లలో వైద్యం గురించి మీరు చెప్పినవి ఆశ్చర్యం కలిగించాయి. ప్రపంచమంతా అలంటి పద్ధతులను పాటిస్తే బాగుంటుంది.

  • Shiva says:

    లలితా గారు,

    అత్యవసరం ఐన విషయం గురించి మాట్లాడారు.
    దీని గురించి అలోచించి నప్పుడల్లా చాల బాధగా అనిపిస్తోంది.

    1) అమెరికా వైద్య వ్యవస్థ : అక్కడ insurance కంపెనీ ల దారుణాలు చాల బాధ కల్గిస్తాయు.మా అమెరికా మిత్రులు కొంత మంది అదే ఉద్దేశం తో వున్నా ఇంకొందరు సోషల్ మెడిసిన్ అంటే బయం తో నే వున్నారు.( Socialism ని ఇష్టపడక పోవడం వేరు కానీ ఇప్పుడు కూడా వేరే ఒప్షన్స్ నే చూడక పోతే ఎలా. బహుశా కమ్యూనిస్ట్ లంటే వారి కున్నద్వేషం ఇలా బయట పడుతుందేమో. మన వివేచనా ని కప్పేసే భావాలు వ్యర్థం ). అమెరికా లో కూడా ఆల్టర్నేట్ మీడియా డెవలప్ కాలేదు అందుకే ఇలాంటి వాణ్ణి బయట పడవు. కార్పొరేట్ మీడియా దీని గురించి పట్టిచుకోదు. కొంత వరకు అమెరికా లో మాములు జనం ఇలాంటివి తెలుసుకోనివాన్ని వ్యవ్యస్థ ఉందనిపిస్తోంది. జాబ్స్ పోయినప్పుడు చాల మంది బాధ పడేది హెల్త్ Insurance పోతుందని. ఇక Health Insurance కంపెనీ ల మోసాలు & పాపాలు మీరు ఎట్లాగు చెప్పారు. ఆలోచిస్తే ఒక విషయం అర్థం కాదు. కేవలం ఏదో కారణం చెప్పి కేర్ రిజెక్ట్ చెయ్యడనికి అయితే హెల్త్ Insurance కంపెనీస్ ఎందుకు ? జనాలకు ఆ మాత్రం నమ్మకం లేని పరిస్తితుల్లో వాళ్ళు వచ్చిన జబ్బు గురించి బాధ పడాల లేక Insurance గురించి ఆలోచించాల ?

    • Lalitha P says:

      ప్రాథమిక వైద్యం, విద్య అనే వాటిలో లాభం అనే దాన్ని పూర్తిగా దూరం పెట్టాలని నా అభిప్రాయం. దీనికి కమ్యూనిజమే అక్కర లేదు. యూరప్ లో పెట్టుబడిదారీ విధానాలు లేవా? అయినా అవి సంక్షేమ రాజ్యాలుగా ఉండటం లేదా? మనం సృష్టించుకున్న పెట్టుబడి కంటే మనం తిరిగివ్వలేని మనిషి ప్రాణం చౌక అయిపోవటం దారుణం. ఒక పేరున్న కార్పోరేట్ హాస్పిటల్ లో ‘ఈ నెల కరెంటు ఖర్చులు ఎక్కువ కట్టాల్సి వచ్చింది కాబట్టి డయాగ్నొస్టిక్ టెస్టులు మరిన్ని రాయమ’ని డాక్టర్లకు ఆదేశాలు అందటం నాకు తెలుసు. చనిపోయిన మనిషిని ఐ.సి.యు. లో అద్దె కోసం మరో రోజు బతికున్నాడని చెప్పి అట్టే పెట్టటమూ జరుగుతోంది. ఇదంతా లాభాలవేట. ఈ వేట నుంచి వైద్యాన్ని తప్పిస్తే గానీ ప్రాణానికి విలువ లేదు శివ గారూ.

      • Nagarjuna says:

        మనదేశం లో ప్రభుత్వం విద్యా వ్యవస్థను జాతీయం చేయాలి. చదువులు తల్లిదండృలకు ఆర్ధికంగా మోయ లేని భారం లా తయారయ్యాయి. విద్యా వ్యవస్థలో క్వాలిటి కూడా బాగా దెబ్బ తిన్నది. ఒక్కొక్క కార్పోరేట్ స్కుల్,కాలేజి ది ఒక్కొక్క విధానం. అంతా డబ్బు మయం. దానికి తోడు కన్స్యుమరిజం మొదలయింది.

        According to the petitioner, the Students Association and Arts Society (SAAS) of the Engineering College, the organiser of the TECHOFES, released advertisements of all sorts promising prizes worth about Rs 25 lakh. The sponsors of the event included Airtel, Vodafone, Saint Gobain and Canara Bank. The winning prize for the beauty contest included a Scooty-pep, an android mobile and lots of gift vouchers, besides cash of Rs 10,000. The participants were told to be ready to do anything to entertain the crowd and attract attention.

        http://www.newindianexpress.com/states/tamil_nadu/Ban-Beauty-Shows-in-Colleges-Orders-Court/2015/02/06/article2654771.ece

      • Shiva says:

        లలిత గారు,

        నేను కూడా Europe తరహ వైద్య వ్యవస్తనే అమితంగా ఇష్టపడతాను .నిజానికి ఒక్కో వ్యవస్థ గురించి చెప్దాం అనుకుంటున్నా.తొందరలోనే రాస్తాను.

  • Satyanarayana Rapolu says:

    నమస్తే! మంచి సమీక్ష! ల.లి.త. గారికి అభినందనలు! ‘సిక్కో’ సినిమా సారాంశాన్ని క్లుప్తంగా, అర్థవంతంగా వివరించిండ్రు. పాశ్చాత్య వైద్య రంగం మీద అవగాహనకు, అందులోని డొల్లతనాన్ని అర్థం చేసికోవటానికి బాగా ఉపయోగపడుతది. 1937లో బ్రిటిష్ వైద్య రంగంలోని అనైతిక పోకడలకు చలించి ఏ.జే.క్రానిన్ వ్రాసిన నవల ‘సిటడెల్’ను గుర్తుకు తెచ్చింది ఈ సినిమా. ‘సిటడెల్’ నవలపై మాలతీ చందూర్ చాలా ఏండ్ల క్రితం ‘స్వాతి’ మాసపత్రికలో ఇటువంటి సమీక్షనే వ్రాసిండ్రు. వైద్యరంగంలోని రుగ్మత కూడా సామాజిక రుగ్మతల ప్రతిఫలనమే! కాని, వైద్య రంగానికి సోకిన రుగ్మత సమాజానికి చాలా హానికరం! వైద్యరంగంలో అతినియంత్రణ, అతిగోప్యతతో పాటు తెరవెనుక అతివిచ్చలవిడితనం ఉన్నయి. దీనివల్ల నిజాయితీ గలవారు నిర్వీర్యులుగా మిగులుతున్నరు. ఇయన్నీ సామాన్యులకు అనారోగ్యం సంభవించినప్పుడు పెనుశాపంగా పరిణమిస్తున్నయి. ఆరోగ్య సంరక్షణ రంగంలో సంస్కరణల అవసరాన్ని గట్టిగా తెలిపే అంశాలియన్ని.
    మరొక విషయం! అది భాషకు సంబంధించినది: వైద్యశాల అనే పదానికి బదులు ఆసుపత్రి అనే పడికట్టు పదం విపరీతంగా ప్రచారంలోనికి వచ్చింది. పత్రికా రచయితలు, భాషా నిపుణులు కూడా గుడ్డిగా అనుకరిస్తున్నరు, వ్రాస్తున్నరు. బ్రిటిష్ పాలనలో క్రైస్తవ మిషనరీలు ప్రజలలోనికి చొచ్చుక పోయెటానికి ఇంగ్లిష్ పదాలను దేశీ పదాలవలె మార్పు చేసిండ్రు. అందులో హాస్పిటల్ ఒకటి! ఉత్తరాదిన ‘ఆస్పతాల్’ అని, దక్షిణాదిన ‘ఆసుపత్రి’ అని మార్పు చేసిండ్రు. ఇందులో దేశీ పండితుల ప్రమేయం కూడా ఉన్నది. కాని, ఇప్పటికైనా దోషాన్ని సవరించుకోవాలె. అచ్చమైన పదం ‘వైద్యశాల’ మాత్రమే అమలులో ఉండే విధంగా భాషా వ్యవహర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసికోవాలె. హాస్పిటల్ నాలుక తిరుగని కఠిన పదమేమీ కాదు. కనుక, వికృత ఆసుపత్రి పదాన్ని వదలి, యధావిధిగా ‘హాస్పిటల్’ అనే లిప్యంతరీకరణ చేయవచ్చు. మన భాషలో సరియైన పదాలు లేనప్పుడు, అన్యదేశ్యాలను స్వీకరించవచ్చు. కాని, దాస్యభావన ఇటువంటి పరిణామానికి దారి తీసింది. వైద్యశాల, హాస్పిటల్, దవాఖాన మాత్రమే సరియైన పదాలు!

  • Satyanarayana Rapolu says:

    నమస్తే! మంచి సమీక్ష! ల.లి.త. గారికి అభినందనలు! ‘సిక్కో’ సినిమా సారాంశాన్ని క్లుప్తంగా, అర్థవంతంగా వివరించిండ్రు. అమెరికా వైద్య రంగం మీద అవగాహనకు, అందులోని డొల్లతనాన్ని అర్థం చేసికోవటానికి బాగా ఉపయోగపడుతది. 1937లో బ్రిటిష్ వైద్య రంగంలోని అనైతిక పోకడలకు చలించి ఏ.జే.క్రానిన్ వ్రాసిన నవల ‘సిటడెల్’ను గుర్తుకు తెచ్చింది ఈ సినిమా. ‘సిటడెల్’ నవలపై మాలతీ చందూర్ చాలా ఏండ్ల క్రితం ‘స్వాతి’ మాసపత్రికలో ఇటువంటి సమీక్షనే వ్రాసిండ్రు. వైద్యరంగంలోని రుగ్మత కూడా సామాజిక రుగ్మతల ప్రతిఫలనమే! కాని, వైద్య రంగానికి సోకిన రుగ్మత సమాజానికి చాలా హానికరం! వైద్యరంగంలో అతినియంత్రణ, అతిగోప్యతతో పాటు తెరవెనుక అతివిచ్చలవిడితనం ఉన్నయి. దీనివల్ల నిజాయితీ గలవారు నిర్వీర్యులుగా మిగులుతున్నరు. ఇయన్నీ సామాన్యులకు అనారోగ్యం సంభవించినప్పుడు పెనుశాపంగా పరిణమిస్తున్నయి. బీమా సంస్థలు లాభాపేక్షతో ఏర్పడ్డయి కాని, సామాజిక బాధ్యతతో కాదన్న వాస్తవం విస్మరించరాదు. ఆరోగ్య సంరక్షణ రంగంలో సంస్కరణల అవసరాన్ని గట్టిగా తెలిపే అంశాలియన్ని.
    మరొక విషయం! అది భాషకు సంబంధించినది: వైద్యశాల అనే పదానికి బదులు ఆసుపత్రి అనే పడికట్టు పదం విపరీతంగా ప్రచారంలోనికి వచ్చింది. పత్రికా రచయితలు, భాషా నిపుణులు కూడా గుడ్డిగా అనుకరిస్తున్నరు, వ్రాస్తున్నరు. బ్రిటిష్ పాలనలో క్రైస్తవ మిషనరీలు ప్రజలలోనికి చొచ్చుక పోయెటానికి ఇంగ్లిష్ పదాలను దేశీ పదాలవలె మార్పు చేసిండ్రు. అందులో హాస్పిటల్ ఒకటి! ఉత్తరాదిన ‘ఆస్పతాల్’ అని, దక్షిణాదిన ‘ఆసుపత్రి’ అని మార్పు చేసిండ్రు. ఇందులో దేశీ పండితుల ప్రమేయం కూడా ఉన్నది. కాని, ఇప్పటికైనా దోషాన్ని సవరించుకోవాలె. అచ్చమైన పదం ‘వైద్యశాల’ మాత్రమే అమలులో ఉండే విధంగా భాషా వ్యవహర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసికోవాలె. హాస్పిటల్ నాలుక తిరుగని కఠిన పదమేమీ కాదు. కనుక, వికృత ఆసుపత్రి పదాన్ని వదలి, యధావిధిగా ‘హాస్పిటల్’ అనే లిప్యంతరీకరణ చేయవచ్చు. మన భాషలో సరియైన పదాలు లేనప్పుడు, అన్యదేశ్యాలను స్వీకరించవచ్చు. కాని, దాస్యభావన ఇటువంటి పరిణామానికి దారి తీసింది. వైద్యశాల, హాస్పిటల్, దవాఖాన మాత్రమే సరియైన పదాలు!
    మార్చుకోవలసిన మరొక పదబంధం: ‘అగ్ని మాపక దళం’! ‘అగ్ని శామక దళం’ సరియైనది. జర్నలిస్ట్‌లు, రచయితలు, అధికార భాషా సంఘం వారు వెంటనే చొరవ తీసికోవాలె.

  • Satyanarayana Rapolu says:

    నమస్తే! మంచి సమీక్ష! ల.లి.త. గారికి అభినందనలు! ‘సిక్కో’ సినిమా సారాంశాన్ని క్లుప్తంగా, అర్థవంతంగా వివరించిండ్రు. అమెరికా వైద్య రంగం మీద అవగాహనకు, అందులోని డొల్లతనాన్ని అర్థం చేసికోవటానికి బాగా ఉపయోగపడుతది. మైఖేల్ మూర్ కృషి, అంతకు మించిన ఆర్తి ప్రశంసనీయం! 1937లో బ్రిటిష్ వైద్య రంగంలోని అనైతిక పోకడలకు చలించి ఏ.జే.క్రానిన్ వ్రాసిన నవల ‘సిటడెల్’ను గుర్తుకు తెచ్చింది ఈ సినిమా. ‘సిటడెల్’ నవలపై మాలతీ చందూర్ చాలా ఏండ్ల క్రితం ‘స్వాతి’ మాసపత్రికలో ఇటువంటి సమీక్షనే వ్రాసిండ్రు. వైద్యరంగంలోని రుగ్మత కూడా సామాజిక రుగ్మతల ప్రతిఫలనమే! కాని, వైద్య రంగానికి సోకిన రుగ్మత సమాజానికి చాలా హానికరం! వైద్యరంగంలో అతినియంత్రణ, అతిగోప్యతతో పాటు తెరవెనుక అతివిచ్చలవిడితనం ఉన్నయి. దీనివల్ల నిజాయితీ గలవారు నిర్వీర్యులుగా మిగులుతున్నరు. ఇయన్నీ సామాన్యులకు అనారోగ్యం సంభవించినప్పుడు పెనుశాపంగా పరిణమిస్తున్నయి. బీమా సంస్థలు లాభాపేక్షతో ఏర్పడ్డయి కాని, సామాజిక బాధ్యతతో కాదన్న వాస్తవం విస్మరించరాదు. ఆరోగ్య సంరక్షణ రంగంలో సంస్కరణల అవసరాన్ని గట్టిగా తెలిపే అంశాలియన్ని.
    మరొక విషయం! అది భాషకు సంబంధించినది: వైద్యశాల అనే పదానికి బదులు ఆసుపత్రి అనే పడికట్టు పదం విపరీతంగా ప్రచారంలోనికి వచ్చింది. పత్రికా రచయితలు, భాషా నిపుణులు కూడా గుడ్డిగా అనుకరిస్తున్నరు, వ్రాస్తున్నరు. బ్రిటిష్ పాలనలో క్రైస్తవ మిషనరీలు ప్రజలలోనికి చొచ్చుక పోయెటానికి ఇంగ్లిష్ పదాలను దేశీ పదాలవలె మార్పు చేసిండ్రు. అందులో హాస్పిటల్ ఒకటి! ఉత్తరాదిన ‘ఆస్పతాల్’ అని, దక్షిణాదిన ‘ఆసుపత్రి’ అని మార్పు చేసిండ్రు. ఇందులో దేశీ పండితుల ప్రమేయం కూడా ఉన్నది. కాని, ఇప్పటికైనా దోషాన్ని సవరించుకోవాలె. అచ్చమైన పదం ‘వైద్యశాల’ మాత్రమే అమలులో ఉండే విధంగా భాషా వ్యవహర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసికోవాలె. హాస్పిటల్ నాలుక తిరుగని కఠిన పదమేమీ కాదు. కనుక, వికృత ఆసుపత్రి పదాన్ని వదలి, యధావిధిగా ‘హాస్పిటల్’ అనే లిప్యంతరీకరణ చేయవచ్చు. మన భాషలో సరియైన పదాలు లేనప్పుడు, అన్యదేశ్యాలను స్వీకరించవచ్చు. కాని, దాస్యభావన ఇటువంటి పరిణామానికి దారి తీసింది. వైద్యశాల, హాస్పిటల్, దవాఖాన మాత్రమే సరియైన పదాలు!
    మార్చుకోవలసిన మరొక పదబంధం: ‘అగ్ని మాపక దళం’! ‘అగ్ని శామక దళం’ సరియైనది. జర్నలిస్ట్‌లు, రచయితలు, అధికార భాషా సంఘం వారు వెంటనే చొరవ తీసికోవాలె.

    • Lalitha P says:

      మీ మాట నిజమే సత్యనారాయణ గారూ! ఆసుపత్రి అని రాస్తున్నప్పుడే నాకు కొంత ఇబ్బందిగా అనిపించింది. అయినా పాత రాతలూ, అలవాట్లూ వదలవు. వైద్యశాల సరైన పదం. ‘అగ్ని మాపక’ చిన్నతనం నుండీ చదివిన అలవాటు. శమన అనే సంస్కృత పదం నుంచి వచ్చిన ‘అగ్ని శామక దళం’ బాగుంది. తెలుగు బాగా తెలిసినవారు చేసే ఇటువంటి పరిశీలన, సలహాలు రాసేవారికీ భాషకూ కూడా ఉపయోగపడతాయి. ధన్యవాదాలు.

  • Lalitha P says:

    మంజరి లక్ష్మి గారు, రమణ గారు, వ్యాసం నచ్చినందుకు సంతోషం.

  • Vijay says:

    Thanq for sharing anDi. Somehow, today, I am seeing all heart touching topics in Saranga. Health for all is a very important issue. Thanq

  • venkata ramana pasumarty says:

    లలిత గారికి నమస్కారములు ,

    చాల బాగుంది అక్క నీ వ్యాసం. నిజంగా ఈ సెఇకొ సినిమా చూసైన మన ప్రద్భుత్వం కొంచం నేర్చుకుంటే మా లాంటి మధ్య తరగతి వాళ్ళకు ఎంతో మేలు జరుగు తుంది.

  • Nagarjuna says:

    లలిత గారు,
    చాలా బాగా రాశారు. మంచి సమాచారం అందించారు. కొత్త విషయాలు తెలిశాయి. మనదేశం లో ఇన్సురెన్స్ కంపెనీలు తక్కువేమి తినలేదు. మా బంధువులోకాయన డాక్టర్, హెల్త్ ఇన్సురెన్స్ ఉంటే 15000 వేలు ఇవ్వటనికి సవాలక్ష ప్రశ్నలు వేసి చివరికి 1500 ఇచ్చారు. అప్పటికే విసిగిపోయిన అతను వచ్చిన దానిని తీసుకొని ప్రయత్నం విరమించాడు.
    ఇక కార్పోరేట్ కంపెనిలో పని చేసే వారికి ఇవే ఇన్సురెన్స్ కంపెనిలు వెంటనే ఇస్తాయి. కారణం ప్రైవేట్ కంపేనిలు వారి ఉద్యోగులందరికి కలిపి వేల, లక్షల సంఖ్యలో ఇన్సురెన్స్ కి థార్డ్ పార్టి సంస్థల ద్వారా డబ్బులు కడతాయి. ఇన్సురెన్స్ కంపేని డబ్బులు ఇవ్వకుండా విసిగిస్తున్నాయని ఫిర్యాదు చేస్తే, కంపెనీలు ఇంకొకరి దగ్గరి కి వేళతాయనే భయంతో ఇన్సురెన్స్ కంపేనిలు విసిగించకుండా వెంటనే డబ్బులు చెల్లిస్తాయి.

  • Lalitha P says:

    విజయ్, వెంకట రమణ, నాగార్జున …. ధన్యవాదాలు.

Leave a Reply to Shiva Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)