ఈ ఫోటోలో అట్లా తోపుడు బండి పక్కన నిలబడిన ఈ ఆసామిని చూడండి!
ఒక తోపుడు బండికి మహా కవుల బొమ్మలు అద్దిన తోరణాలు కట్టి, ఆ బండిలో కవిత్వ పుస్తకాలు వేసుకుని, హైదరాబాద్ నగర రహదారుల పైకి అట్లా తోసుకుంటూ వొచ్చి, జనంతో కవిత్వ పుస్తకాలు కొనిపించే ఒక సాహసానికి పూనుకున్న ఇతడిని చూస్తే మీకేమని అనిపిస్తోంది ?
‘భలే వారే … చూడడానికి జీవితంలో అన్నీ అమరిన వెల్ – ఆఫ్ మ్యాన్ లా వున్న ఇతడు తోపుడు బండి నడపడం ఏమిటండీ బాబు ?’ అని నవ్వుకుంటున్నారు కదూ !
నిజమే … ఈయన ‘జీవితంలో అన్నీ అమరిన వెల్ – ఆఫ్ మ్యాన్’ అన్నది నూరుపాళ్ళ నిజం !
హాయిగా ఇంట్లో కూర్చుని చేసుకోగలిగే వ్యాపారం వున్నా, తనకు స్పూర్తిని యిచ్చిన, తనను మనిషిని చేసిన ‘కవిత్వం’ కోసం ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాడు -
ఈ ఆలోచన వెనుక చిన్న నేపథ్యం కూడా వుంది.
గడిచిన డిసెంబర్ – జనవరి నెలలలో హైదరాబాద్ , విజయవాడ లలో జరిగిన పుస్తక ప్రదర్శన లలో వాసిరెడ్డి వేణుగోపాల్ గారి స్టాల్ ఒక వైపు, కవిసంగమం స్టాల్ మరొక వైపు అమ్మిన కవిత్వ పుస్తకాల సంఖ్య చూసి, ఈయనకి ఒక విషయం బోధపడింది.
జనానికి కవిత్వం పట్ల ఆసక్తి వుంది. పేరు మోసిన పుస్తక ప్రచురణ సంస్థలు కవిత్వాన్ని ‘అసింటా పెట్టడం వలన’ కవిత్వ పుస్తకాలు జనానికి అందుబాటులో లేకుండా పోయి, ‘ఇప్పుడు కవిత్వం ఎవ్వరికీ పట్టదు ‘ అన్న ఒక నిరాశాపూరిత వాతావరణం నెలకొన్నది. అది ‘పూర్తి నిజం’ కాదనీ, సరైన రీతిలో కవిత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకు వెళ్ళ గలిగితే వాళ్ళు కవిత్వాన్ని ఆదరిస్తారనీ అతడికి ఆ పుస్తక ప్రదర్శనలు తెలిపాయి –
అందుకే, మంచి సాహిత్యాన్ని ప్రజలకు చేరువగా తీసుకు వెళ్ళడం కోసం ఒకప్పుడు తెలుగునేల మీద గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు, వట్టికోట ఆళ్వారు స్వామి లాంటి మహనీయులు వేసిన ఒక దారిని స్పూర్తిగా తీసుకుని, ‘తోపుడు బండి పైన కవిత్వ పుస్తకాలు పెట్టుకుని నగర రహదారుల పైన తిరుగుతూ అమ్మడం’ అన్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. అతడి ఆలోచనకు, యాకూబ్, ఎన్ వేణుగోపాల్, మిమిక్రీ శ్రీనివాస్, వాసిరెడ్డి వేణుగోపాల్, అరవింద్ లాంటి మిత్రుల ప్రోత్సాహం తోడయింది. ఆదివారం ఉదయం రామనగర్ నుండి మొదలు పెట్టి నెక్లెస్ రోడ్ అడ్డా దాకా వొచ్చి అక్కడ సాయంత్రం దాకా వుండి కవిత్వ పుస్తకాలు అమ్మాడు. సోమవారం అంతా ఉస్మానియా విశ్వ విద్యాలయం పరిసర ప్రాంతాలలో ఈ పుస్తకాల బండిని తిప్పాడు. పుస్తకాలు తీసుకోవడానికి కుటుంబ సమేతంగా వొచ్చిన ఒక ప్రొఫెసర్ గారు ‘గొప్ప పని చేశారు’ అంటూ మెచ్చుకున్నారు.
విచిత్రం ఏమిటంటే, ఈ ‘తోపుడుబండి మనిషి’ తానొక గొప్ప పని చేసానని అనుకోవడం లేదు. ‘నాకు కవిత్వం అంటే వున్న అభిమానంతో తెలుగు కవిత్వాన్ని బతికిన్చుకోవాలన్న తపనతో నా బుర్రకు తట్టిన ఈ పని మొదలు పెట్టాను’ అంటున్నాడు.
అంతే కాదు – ‘రెండు తెలుగు రాష్ట్రాలలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఈ తోపుడుబండి పైన తెలుగు కవిత్వ పుస్తకాలు అమ్మాలనేది నా కల. డబ్బు ఖర్చయినా సరే – ఆ పని చేసి తీరతాను’ అంటున్నాడు.
‘కవిత్వాన్ని బతికించుకోకుండా భాష ఎట్లా బతుకుతుంది ? … భాషని బతికించుకోలేని జాతికి మనుగడ ఏముంటుంది ?’ అని వాపోతున్నాడు!
అతడికి వున్నది తెలుగు కవిత్వం పట్ల ‘ప్రేమని మించిన పిచ్చి’ ఏదో వుందని అనిపించడం లేదూ ?!
తోపుడు బండి చుట్టూ చేరిన కొందరు మిత్రులు అన్నారు -
‘ఊరికొక మంచి గ్రంథాలయం ఏర్పాటు చేసి, అందులోకి పుస్తకాలు కొనే ప్రణాలికలు ప్రభుత్వం రూపొందించాలి’
‘అన్ని విశ్వ విద్యాలయాల ఆవరణ లలో కొత్త సాహిత్యం అమ్మకానికి ఉండేలా ఆయా విశ్వ విద్యాలయాలు ఏర్పాట్లు చేయాలి’
‘కవులు / రచయితలూ ఒక కో ఆపరేటివ్ సంస్థగా ఏర్పడి పుస్తకాలు అచ్చువేసుకోవడం , అమ్ముకోవడం అనే కార్యక్రమాలకు వీలుగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి’
‘……………………….. …..’ ‘………………………. …………….’ ‘……………………….. ……….’
భాషా దినాల పేర, భాషా సాహిత్య సంస్కృతుల పరిరక్షణ పేర, రాజకీయ నాయకులనీ, సినిమా వాళ్ళనీ, చివరికి సాహిత్య దళారులనీ వేదికలెక్కించి చిత్ర విచిత్ర కార్యక్రమాలు జరిపే మన ప్రభుత్వాలకు ఇట్లాంటి నిజమైన సాహిత్యాభిమానుల ఘోషలు వినబడతాయా ఎప్పటికైనా ?
ఏమో ?! …. ‘తోపుడు బండి ‘ కదిలింది కదా ! … ఇక చూడాలి !!
ఏదేదో చెప్పాను గానీ, ఈ ‘తోపుడు బండి మనిషి ‘ పేరు చెప్పనే లేదు కదూ !
ఇతడి పేరు …. సాదిక్ అలీ . పేరు మోసిన జర్నలిస్టు …. సొంత ఊరు ఖమ్మం … హైదరాబాద్ లో నివాసం ….
facebook లో దొరుకుతాడు …. ‘తోపుడుబండి’ అనే పేరు మీద ఒక పేజి కూడా ఓపెన్ చేసాడు !
-కోడూరి విజయ్ కుమార్
__________________________________
గడప గడపకూ కవిత్వం: సాదిక్
1. సాదిక్, మీకు కవిత్వం మీదనే ఎందుకు ఇంత ప్రేమ?
సాహిత్యంలో కవిత్వం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అదొక కళ .అందరికీ సాధ్యమయ్యే పని కాదు.కొన్ని భావాలను వ్యక్తం చెయ్యటానికి వచనం కన్నా కవిత్వమే బాగా ఉపయోగ పడుతుంది. చిన్నప్పుడు చదువుకున్న పారిజాతాపహరణం కానివ్వండి, ఇతర ప్రబంధాలు కానివ్వండి, మహా ప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి, ఇవి రెండూ కవిత్వం పట్ల ప్రేమను పెంచాయి. వచనంలో వాడే పద ప్రయోగాలకన్నా, కవిత్వంలోని పద ప్రయోగాలు బాగా నచ్చుతాయి.
2. తోపుడు బండి ఆలోచన- అంటే అది తోపుడు బండే-అన్న ఆలోచన ఎలా వచ్చింది?
హైదరాబాద్,విజయవాడ బుక్ ఫెయిర్ లలో స్టాల్ కి వచ్చిన అనేక మంది కవిత్వం గురించి వాకబు చేయటం చూసి ఆశ్చర్యం వేసింది. దానికి తోడూ. మేము చాలా మంది కవుల కవిత్వాన్ని అలవోకగా అమ్మగలిగాం.ఇక్కడ పరిస్థితి ఇలా వుంటే, తరచూ కవిసంగామంలోనూ,ఇతరత్రా కవిత్వ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కవులు తమ పుస్తకాలను అమ్ముకోలేక ,కాంప్లిమెంటరీ కాపీలు,ఉచిత పంపిణీ కార్యక్రమం చూసి బాధేసింది. వాళ్ళు కవిత్వాన్ని మార్కెట్ చేసుకోలేక పోవటం, మార్కెట్ చేసేవాళ్ళు లేక ఇబ్బంది పడటం చూసాను. ఒక్క కాపీ కూడా కాంప్లిమెంటరీ ఇవ్వకండి అని చెప్పేవాన్ని.నేను స్వయంగా డబ్బులిచ్చి కొనుక్కునే వాణ్ని. ఇవన్నీ చూసాక నేనే అమ్మిపెత్తోచ్చుగా అనే ఆలోచన వచ్చింది.
గతంలో విశాలాంధ్ర వాళ్ళు మొబైల్ వ్యాన్లలో పుస్తకాలు అమ్మటం చూశాను. వాటికన్నా ప్రజలకు సన్నిహితంగా వెళ్ళాలంటే,అందరికీ బాగా పరిచయమైన తోపుడుబండి అయితే మంచిది అనుకున్నా.శారీరక ఆరోగ్యానికి అవసరమైన కూరగాయలు, పళ్ళు ఆ బండ్ల మీదే కదా కొంటున్నారు, మానసిక ఆరోగ్యానికి అవసరమైన కవిత్వాన్ని ఎందుకు కొనరు? అన్పించింది. ఎక్కడో సుల్తాన్ బజార్ ,అబిడ్స్ వెళ్లి కొనటం కుదరని వాళ్లకు, వాళ్ళ గడపకే తీసుకెళ్తే కొంటారు కదా అనే ఆలోచన నుంచి పుట్టిందే తోపుడు బండి.
3. కవిత్వంతో పాటు ఇతర సాహిత్య ప్రక్రియల పుస్తకాలు కూడా బండి మీద పెడతారా?
ఇకపోతే, ఇతర సాహిత్య ప్రక్రియల అమ్మకం, …ఇది చాలా కీలకమైన ప్రశ్న. బండి దగ్గరికి వచ్చిన వాళ్ళు కథలు, నవలలు లేవా? అని అడుగుతున్నారు. వాటికి కూడా డిమాండ్ చాలా వుంది. అలాగే ఇంగ్లీష్ పోయెట్రీ ఉందా అని కూడా అడుగుతున్నారు.వాటి గురించి ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ప్రస్తుతం నా దృష్టి, సింగల్ పాయింట్ ఫోకస్ అంతా కవిత్వమే. కవిత్వం, కవుల పరిస్థితే మరీ దారుణంగా వుంది.ముందు కవిత్వానికి గౌరవం, హోదా,పూర్వ వైభవం తేవాలన్నదే నా లక్ష్యం.ప్రజల్లో కవిత్వం పట్ల ఆసక్తి కలిగించడం.కవిత్వం కొని చదవటం అలవాటు చేయాలన్నదే సంకల్పం.
4. ఇంత వరకూ ప్రతిస్పందన ఎలా వచ్చింది?
గత రెండు రోజులుగా వస్తున్నా స్పందన అద్భుతం, అనూహ్యం. నేను చేయగలను అనుకున్నాను,కానీ,అది ఇంత గొప్ప స్పందన తీసుకొస్తుందని అనుకోలేదు.అమ్మకాలు బాగున్నాయి. ప్రజల్లో ఆసక్తీ బాగానే వుంది. త్వరలో మరికొన్ని తోపుడు బళ్ళు అవసరమవుతాయని అన్పిస్తోంది. గోరటి వెంకన్న, శివసాగర్ పుస్తకాలు కావాలని అడుగుతున్నారు.అలాగే మరికొందరు కవుల పుస్తకాలను ప్రత్యేకంగా అడుగుతున్నారు. అవి ఎవరెవరి దగ్గర వున్నాయో తెలుసుకొని,సేకరించి బండి మీద పెట్టాలనే ప్రయత్నిస్తున్నాను. అలాగే మీరు ఈ వ్యాసం ప్రచురిస్తే, దాన్ని చదివిన వారు తమ పుస్తకాలు, తమ దగ్గర వున్న పుస్తకాలు నాకు అందజేయ గలిగితే నాకు మరింత సంతోషం.
గొప్ప బండికి ఎగిరే
జెండా
ఈ వ్యాసం
కవిత్వం కోసం తపన పడుతున్న సాదిక్ గారి ప్రయత్నానికి చేదోడుగా, విజయ్ కుమార్ గారి విశ్లేషణతో కూడిన ఇంటర్వూ దానిని సారంగలో ప్రచురించడం నిజంగా మంచి విషయాలు. కవిత్వానికి తోపుడుగా ఈ బండి ఉపయోగపడాలిని కోరుకుంటూ.
ప్రారంభంలోని ఇదే ఉత్సాహం ద్విగుణీకృతమై మరింత కాలం పనిచేయాలని కోరుకుంటున్నాను.
గుడ్ వర్క్ ….సాదిక్ గారు ….
sarirakamganu manasikamganu chala kastapaditene idi sadyam. nenu ma snehitulu hbt lo undaga 80 lalo ituvanti panulu regularga chesamu. hyd lo kadu zilla kendrallo. adarana bbagundedi. ippati mee anubhavam appati maa anubhavam cheppedokkate pustakalni patakula daggaraku teesuku pogaligite tappakunda chalabaaga daggaraku teesukuntaru.manalni hattukuntaru.
subbaiah charita
సాదిక్ గారూ! కవిత్వాభిమానులు చాలా మంది ఉన్నారు, ఉంటారు, ఉండొచ్చు కానీ ఇలా భుజస్కంధాల మీద పెట్టుకొని, అభిమానుల దగ్గరకు తోసుకెళ్ళాలనే ఆలోచనే ఈ రోజుల్లో పెద్ద సాహసం. అలాంటిది ఆచరణలో పెట్టడం, దృఢనిశ్చయం తో ముందుకు సాగడం — మీకు అభివందనాలు. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారందరికీ వందనాలు.
రాజా.
I am regularly following saranga. kindly notify my of followup comments and new posts by mail.
సాదిఖ్ భాయ్ సలామాలేకుం. అమితాబ్ పక్కన కూర్చుని భొజనం చేసినవ్, సలహాలిచ్చినవ్. ఇప్పుడు కవిత్వాన్ని భుజానేసుకుని కవుల్ని తలపై మోస్తూ వీధివీధిన తిరుగుతున్నవ్. ఏ కవీ చేయని పని మీరు చేస్తున్నరు.. మీ పనిలో మాకూ వాటా ఇస్తున్నరు. మా అక్షరాల్ని పల్లెటూర్లకీ పంపుతున్నరు. మీ రుణం కవులెలా తీర్చుకుంటరు భాయ్.