సుమారు నలభై ఏళ్ళు–అమ్మ బాబోయ్…అంత సీనియర్ నా???
ఆ మాట తల్చుకుంటేనే భయం వేస్తోంది…అన్నేళ్ళయిందా మొదటి రచన చేసి?
“రమణ రాత-బాపు గీత” కాంబినేషన్ లో “ఇడ్లీ కన్న పచ్చడే బావుంది ఫేమ్ మొట్టమొదటి సారిగా వచ్చిన సంవత్సరమే నేను మంచి సాహిత్య వాతావరణం ఉన్న కాకినాడలో పుట్టి పెరిగాను. అందుకేనోమో ఇంత ఇది!
చిన్నప్పుడు తెలుగూ-గిలుగూ ఎక్కువగా పట్టించుకోక పోయినా, అక్కడ 1966లో ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించుకుని ఆంధ్రదేశం వదిలి అక్కడెక్కడో ఉన్న బొంబాయిలో, అనగా పరాయి రాష్ట్రంలో అడుగుపెట్టినప్పుడే తెలుగు భాషలో ఉన్న రుచీ, ఔన్నత్యం, సరదా అన్నీ అర్జంటుగా తెలిసొచ్చాయి. తెలుగు భాష, సాహిత్యాలపట్ల మక్కువ కూడా అంతకంటే అర్జంటుగా పెరిగిపోయింది. ఇలా లాభం లేదని కేంపస్ లో పది మంది లోపే ఉన్న తెలుగు కుర్రాళ్ళమూ, ప్రొఫెసర్లు గా ఉన్న మరొక పాతిక మంది కుటుంబాలూ కలిసి ఒక తెలుగు సంఘం పెట్టుకున్నాం. మొదటి సాంస్కృతిక కార్యక్రమంలో ఏదైనా చిన్న నాటకం వేస్తే బావుంటుంది అనుకున్నాం. కానీ ఎవరి దగ్గిరా నాటకం పుస్తకాలు లేవు. అప్పుడు టి.పి. కిషోర్ గాడు “గురూ, నువ్వే ఏదో ఒక నాటకం రాసేస్తే పోలా !” అని జోక్ చేశాడు.
అది సీరియస్ గా తీసుకుని అప్పుడు (1967) వ్రాసినదే ప్రపంచంలో చాలా చోట్ల ప్రదర్శించబడిన నా మొదటి సరదా నాటిక “బామ్మాయణం అనే సీతా కళ్యాణం”. “నువ్వు రాయగలవేమో కానీ, నటించడానికి బొత్తిగా పనికి రావు” అని ఆ నాటకాన్ని డైరెక్ట్ చేసిన జె. చంద్ర శేఖర్ (చందూ) గాడు నేను రాసిన నాటకంలోనే నాకు వేషం ఇవ్వ లేదు. ఆ కిశోర్ హఠాత్తుగా చనిపోయి చాలా ఏళ్ళయింది. చందూ జేసీ గా ఐ.ఐ.టీ లోనే ప్రొఫెసర్ గా రిటైర్ అయి, ఇప్పుడు గోవాలో ఉంటున్నాడు అని విన్నాను. బొంబాయిలో నా ఇతర తెలుగు సాంస్కృతిక మిత్రులు కొందరితో ఇంకా “టచ్” లో ఉన్నాను.
ఆ రోజుల్లోనే బొంబాయి I.I.T లో చాలా మంది అమెరికా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా నేను మటుకు “చస్తే అమెరికా వెళ్ళను” అని భీష్మించుకుని కూచునే వాణ్ణి. కానీ ఒక రోజు రామ్ కుమార్ వచ్చి, ఆ మాటా, ఈ మాటా చెప్తూ. “గురూ, ఇక్కడ సంతకాలు పెట్టూ” అని నా చేత ఏవేవో అప్లికేషన్స్ మీద దొంగతనంగా సంతకాలు పెట్టించుకున్నాడు. ఆ తర్వాత తెలిసింది తను అమెరికా గ్రీన్ కార్డ్ కి అప్లికేషన్ పెడుతూ, ఇద్దరి ఫీజులూ నా చేతే కట్టించడం కోసం మాత్రమే నా చేత కూడా అప్ప్లై చేయించాడూ అని. అతని ధర్మమా అని 1968లో నే అమెరికన్ కాన్సలేట్ వారు మా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి స్వయంగా వచ్చి, నన్ను మెచ్చి, గ్రీన్ కార్డ్ ఇచ్చినా నేను పట్టించుకో లేదు.
కానీ ఆరేళ్ళు అక్కడే లెక్చరర్ గా ఉద్యోగం వెలగబెడుతూనే 1974, అక్టోబరులో నా డాక్టరేట్ పూర్తి చేశాను. “తరవాత ఏం చేద్దాం?” అనుకోగానే, అమెరికా ఎలా ఉంటుందో చూసొస్తే పోలే? అని సరదాగా, గ్రీన్ కార్డ్ తో సహా అమెరికాలో అడుగుపెట్టాను. అప్పుడు షికాగో లో ఉన్న మా తమ్ముడి దగ్గర నాలుగు రోజులు ఉండి ” టెక్సాస్ లో ఎకానమీ బావుంది సుమా” అనుకుని, నలుగురు మిత్రులం ఒక డొక్కు కారులో రాత్రికి రాత్రి హ్యూస్టన్ వచ్చేశాం ఉద్యోగాల కోసం.
రాగానే, ఇక్కడ యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లో పోస్ట్ డాక్టరల్ ఫెలో గా చేరిపోయాను. అప్పుడు హ్యూస్టన్ లో తెలుగు అస్ఖ్హలిత బ్రహ్మచారులం అర డజను మందీ, సంసారులు పాతిక మందీ ఉండే వారు. అంటే ఈ ఇక్కడ కూడా బొంబాయి లాంటి పరిస్థితే అన్న మాట. అంటే, తెలుగు వారు తక్కువ, తెలుగు జపం ఎక్కువ. యథాప్రకారం పండగలూ, పబ్బాలూ చేసుకుంటున్నా, “శాస్త్రోక్తంగా” ఒక తెలుగు సంస్థ ఉంటే బావుంటుంది అని అందరం ఆలోచించుకుని తెలుగు సాంస్కృతిక సమితి ని హ్యూస్టన్ లో 1977 లో మొదలుపెట్టాం. అప్పటికి అమెరికాలో న్యూయార్క్, లాస్ ఏంజెలెస్, షికాగో లాంటి ఐదారు నగరాలలో మాత్రమే తెలుగు సంఘాలు ఉండేవి.
1977 లో మేము జరుపుకున్న ఉగాది కార్యక్రమంలో నేను బొంబాయిలో రాసిన మొట్ట మొదటి నాటకం “బామ్మాయణం” ప్రదర్శించాం. నాకు తెలిసీ అమెరికాలో ప్రదర్శించబడిన తొలి తెలుగు నాటకమూ, ఇంచుమించు అమెరికాలో అన్ని నగరాలలోనూ ప్రదర్శించబడిన “సరుకు ” లేకపోయినా సరదాగా ఉన్న తెలుగు నాటకమూ అదే! అతి త్వరలోనే హ్యూస్టన్ లో నేను వ్యవస్థాపక సంపాదకుడిగా “మధుర వాణి” అనే సంస్థాగత సాహిత్య పత్రిక మొదలుపెట్టాం. ఆ పత్రిక తొలి సంచికలో ప్రచురించడానికి ఎక్కువ సాహిత్యం సరుకు లేక పోయినా నా మొట్టమొదటి కథ “జులపాల కథ” వ్రాసాను. అనగా హ్యూస్టన్ లో అడుగుపెట్టిన తరవాతే నా మొట్టమొదటి కథ రాశానన్న మాట. ఇప్పటికీ చాలా మంది గుర్తుపెట్టుకున్న చిన్న కథ అది. ఇటీవలే గొల్లపూడి వారు హెమ్. టీవీ. లో నిర్వహిస్తున్న “వందేళ్ళ కథకు వందనాలు” అనే శీర్షిక కోసం ఈ కథని వారు పరిచయం చేశారు. టీవీ లో అది త్వరలోనే ప్రసారం అవుతుందట.
1977లోనే న్యూయార్క్ లో జరిగిన మొదటి అమెరికా తెలుగు మహాసభలకి చిన్న సైజు నిర్వాహకుడిగానూ, అమెరికా, కెనడాలనుంచి ఏడుగురు “తానా” సంస్థాపక డైరెక్టర్లలో ఒకడిగానూ వ్యవహరించడం జరిగాయి. వెనునెంటనే స్వర్గీయ కిడాంబి గారూ, చెరుకుపల్లి నెహ్రూ గారూ “తానా పత్రిక” ప్రారంభించి, ఆ తరువాత చాలా సంవత్సరాలు నన్ను సంపాదక మండలిలో చేర్చుకున్నారు. సుమారు పదేళ్ళ పాటు నేను రాసే కథలూ, కమామీషులూ మా “మధుర వాణి” లోనూ, తానా పత్రిక లోనూ, సావనీర్ ల లోనూ ప్రచురించబడేవి. నా రచనా వ్యాసంగంలో ఒక ప్రధాన ఘట్టం 1981లో “మహాకవి” శ్రీ శ్రీ గారు మా హ్యూస్టన్ రావడం, మా ఇంట్లో ఉన్న వారం రోజులలోనూ, “సిరి సిరి మువ్వలు”, ప్రాసక్రీడలు”, “లిమరిక్కులు” అనే మూడు శతకాలను “సిప్రాలి” అనే పేరుతో తన స్వదస్తూరీతో వ్రాసి, ఆ పుస్తకాన్ని ప్రచురించే అదృష్టాన్ని నాకు కలిగించడం, అప్పటికి నేను వ్రాసిన నాలుగైదు కథలూ చదివి “నీకు సొంత శైలి ఉందయ్యా, అది కాపాడుకో, ఎవరినీ అనుకరించకు” అని హిత బోధ చెయ్యడం, అంతే కాక నేను ఎప్పటికైనా నా నాటికల సంకలనం పుస్తకరూపేణా వేస్తానని ఊహించి, “రంగం మీద శ్రీరంగం” అనే మకుటంతో ముందు మాట వ్రాసి ఇవ్వడం వ్యక్తిగతంగా నాకు సాహిత్య స్ఫూర్తిని ఇచ్చిన గొప్ప అనుభవం.
నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ 1981 నాటి “సిప్రాలి” బహుశా అమెరికాలో మొదటి పుస్తక ప్రచురణ….అది వ్రాత ప్రతి. అలాగే “రంగం మీద శ్రీరంగం” శ్రీ శ్రీ గారు వ్రాసిన నాటికల పుస్తకాలకు వ్రాసిన ఏకైక పీఠిక. ఆలాగే అనేక మంది ప్రముఖులు, కవి పుంగవులూ, రచయితలూ మా ఇంట్లోనే బస చెయ్యడం వలన ఈ సాహిత్యం వాసన నా వంటినిండా పులుము కుంది.
1975-95 నాటి ఇంటర్నెట్ ముందు యుగంలో అమెరికా సాహిత్య వాతావరణంలో ఇంచు మించు అన్ని నగరాలలోనూ ఐదారుగురు రచయితలూ, మరి కొందరు సాహిత్యాభిమానులూ ఉండే వారు. ఇంచుమించు అందరూ స్థానిక సంస్థాగత పత్రికలో కథలు, కమామీషులూ వ్రాయడం, తానా, ఆటా మహాసభల సావనీర్లకి వ్రాయడం మాత్రమే చేసేవారు. నేను కూడా ఈ కోవకి చెందిన రచయితనే. నేను వ్రాసిన మొదటి పాతిక కథలూ ఎవరో ఒక సంపాదకుడు గారు నా నెత్తి మీద కత్తి పెట్టి, డెడ్ లైన్ పెట్టి వ్రాయించినవే! కానీ అప్పటికే తానా, ఆటాలు కానీ, స్థానిక తెలుగు సంఘాల లోనూ కులప్రాధాన్యతలు పెరగడం…మెల్ల మెల్లగా అవి సాంస్కృతిక సంఘాల బదులు రాజకీయ సంఘాలుగా మారుతూ ఉండడంతో రాజకీయ నాయకులకీ, సినిమా తారలకీ ప్రాధాన్యత పెరిగిపోయి, సాహితీవేత్తలకి ఇవ్వవలసిన ప్రాధాన్యత తరిగి ఫోయింది. ఆ తిరోగమనాన్ని గమనించి, కేవలం తెలుగు సాహిత్య పోషణ ఏకైక లక్ష్యంగా 1994 లో మేము స్థాపించిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఉత్తర అమెరికా ఖండంలో తెలుగు సాహిత్య ప్రపంచాన్ని ఒక కొత్త మలుపు తిప్పిందని సగర్వంగానే చెప్పుకోగలను.
ఈ సంస్థ అమెరికా రచయితలకి మాత్రమే 1995 లో ప్రారంభించిన ఉగాది ఉత్త్తమ రచనల పోటీలు, అమెరికా తెలుగు కథానికా సంకలనం మొదటి సంకలనం, ముఖ్యంగా అట్లాంటా లో మేము నిర్వహించిన మొట్ట మొదటి అమెరికా తెలుగు సాహితీ సదస్సు అమెరికా తెలుగు సాహిత్య ప్రపంచానికి ఒక స్పష్టతనీ, తమదే అయిన ఒక గుర్తింపునీ తెచ్చిపెట్టాయి. తొంభైలలో నడిచిన SCIT, “తెలుసా” లాంటి ఇంటర్నెట్ చర్చా వేదిక ఇంటర్నెట్ తెలిసిన రచయితలకి “సునాయాస” వేదికగా మంచి చేసినా, నియంత్రణ లోపాల కారణంగా విలువ తగ్గిపోయింది. వంగూరి ఫౌండేషన్ స్థాపించిన కారణాలని బహుశా అపార్ధం చేసుకున్న వారి చేత ఆ వేదికలో నేను వ్యక్తిగతంగా తిన్నన్ని తిట్లు ఎవరూ తిని ఉండరు. ఆ వేదిక వలన అంచెలంచెలుగా రూపొందిన సాహిత్య సామంత రాజ్యాలే ఆ తరువాత వచ్చిన ఇంటర్నెట్ వేదికలూ, కొన్ని వెబ్ పత్రికలూ “గేటేడ్ కమ్యూనిటీ” గా రూపొందడానికి దారి తీశాయి అని నా అభిప్రాయం. ముఖ్యంగా, అమెరికాలో “మంచి విమర్శకులు ఉంటేనే మంచి రచనలు వస్తాయి” అని చిత్తశుధ్దితో నమ్మినప్పటికీ, “మేమే గొప్ప సాహితీవేత్తలం, మా విమర్శకి తట్టుకునే వారే మంచి రచయితలు” అని భావించడం మొదలు పెట్టిన సాహితీవర్గాలు పుట్టుకొచ్చాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో పరిపక్వమైన తెలుగు కథావిశ్లేషకుల, విమర్శకుల అభిప్రాయాలని ఇంకా తప్పటడుగులు వేస్తున్న అత్యధిక అమెరికా తెలుగు కథలకి అన్వయం చేసి, కథకులని నిరుత్సాహపరచడం వలన అమెరికా తెలుగు కథలు ఎక్కువ సంఖ్యలో రాలేదు. “అమెరికాలో ఎక్కడ సాహితీ చర్చలు జరిగినా ఇంకా కొడవటిగంటి, రావి శాస్త్రి, ఓల్గా, రంగనాయకమ్మ మొదలైన వారి గురించే మాట్లాడుకుని గర్వంగా భావిస్తూ ఉంటారు, అమెరికా తెలుగు కథకుల గురించి ఎక్కడా చర్చలు ఎందుకు జరగవు?” అని ప్రశ్నించుకుంటే దానికి సమాధానం ఎక్కడ వ్యక్తిగత విమర్శలు చోటుచేసుకుంటాయో అనే “భయం” ఒక కారణం అయితే, అమెరికా కథకుల కథల మీద అమెరికా సాహితీవేత్తలకే సదభిప్రాయం లేదు అనేది బహుశా ప్రధాన కారణం.
ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, నా రచనలపైనా, కథా వస్తువుల ఎంపికపైనా కాస్తో, కూస్తో ప్రభావితం చేసిన, చెయ్యని విషయాలను ప్రస్తావించడానికి మాత్రమే. వంగూరి ఫౌండేషన్ సంస్థ కార్యక్రమాల ద్వారా అమెరికా తెలుగు సాహితీవేత్తల ప్రత్యేకత నిలబెట్టడానికీ, ఇతరుల చేత కూడా “ఒక కాపు కాయించడానికి” నాకున్న సమయాన్ని ఎక్కువగా వెచ్చించడం తప్ప, నా రచనాసక్తిని, నా శైలినీ ఆ సంస్థ కార్యక్రమాలు ఎక్కువగా ప్రభావితం చెయ్య లేదు అని నేను నమ్ముతున్నాను.
అప్పటికీ, ఇప్పటికీ నేను వ్రాసేన శతాధిక కథలన్నీ డైస్పోరా జీవితానికి సంబంధించినవే. అసలు ఈ డైస్పోరా అనే మాట ఎవరైనా వాడడాన్నే తప్పు పడుతూ, నన్ను ఒక కథా రచయితగా గుర్తించడానికి ఇబ్బంది పడే కొందరు అమెరికా సాహితీవేత్తలు తమ అనుయాయులవి తప్ప ఇతర రచయితల కథల్ని గుర్తించక పోవడం అందరికీ తెలిసినదే. అమెరికా కథావస్తువులు ఇంకా పరిణితి చెంద లేదు, రాసి లో కానీ వాసి లో తగిన సంఖ్యలో కథలు రాలేదు అనే విమర్శలు ఎక్కడైనా వినపడితే దానికి ముఖ్య కారణాలు అమెరికా తెలుగు సంఘాల నిరాసక్తి, కొంత మంది సాహిత్యాహంభావం, రచయితల ఆత్మన్యూన్యతా భావాలు, తెలుగు నాట కూడా అమెరికా కథకుల మీద ఉండే చిన్న చూపు వగైరాలే కొన్ని కారణాలు. ఇటువంటి సాహిత్య సామ్రాజ్య సామంతుల ప్రయత్నాలు కూడా నా రచనా శైలిని ప్రభావితం చెయ్యలేదు….అప్పుడప్పుడు కథా వస్తువులని ఎంపిక చేసుకోవడానికి అంతర్గతంగా ఉపయోగపడి ఉండ వచ్చును.
ఇక నా రచనావ్యాసంగంలో మరొక ప్రధానమైన మార్పు 2004 లో జరిగింది. ఆ యేడు “సిలికానాంధ్ర” అసోసియేషన్ వారు “సుజన రంజని” అంతర్జాల పత్రిక మొదలుపెట్టినప్పుడు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ గారు నన్ను పిలిచి ఆ పత్రికకి నెలకి ఒక కథ వ్రాయమని కోరారు. ఆ పత్రిక వ్యవస్థాపక సంపాదకులు కిరణ్ ప్రభ గారు పత్రిక రూపు రేఖలు, ఆశయాలు వివరించారు. అప్పటికే నేను “ఈ మాట” అనే వెబ్ పత్రిక సంపాదకుల కోరికపై కొన్ని కథలు రాసి ఇచ్చాను. అవి వారి “ఉన్నత” ప్రమాణాలకి తక్కువ స్థాయిలో ఉన్నా నా మీద గౌరవం కొద్దీ ప్రచురించారు అని నాకు కాలక్రమేణా అర్ధం అయింది. ఇప్పుడు ఈ కొత్త వెబ్ పత్రికకి ప్రతీ నెలా రాయాలంటే “నెల నెలా భంగపాటు” తప్పదేమో అని అనుకున్నప్పటికీ, వారి కోరిక కాదన లేక, మొదట్లో అప్పుడప్పుడు క్రమం తప్పినా, నెలకి ఒక కథ వ్రాసే నిబధ్ధ్ద్తత అలవాటు చేసుకున్నాను. కిరణ్ ప్రభ గారు కౌముది.నెట్ మొదలుపెట్టిన తర్వాత క్రమం తప్పకుండా నెలకో కథ రాస్తున్నాను. అవి ఇండియాలో కూడా “రచన” మాస పత్రికలో ఏడెనిదేళ్ళ నుంచీ ధారావాహికంగా ప్రచురించబడుతున్నాయి. ఇతర పత్రికలు ఎన్ని సార్లు నన్ను అడిగినా, వాళ్ళకి ప్రత్యేక రచనలు రాయడం వీలు పడక పోవడం నా రచనావ్యాసంగంలో ఒక లోటుగానే భావిస్తాను, కానీ “రక్షించాడు” అని నా గాఢమిత్రులూ-గూఢ శత్రువులూ” సంతోషిస్తారు కాబోలు
ఇటీవల లోక్ నాయక్ ఫౌండేషన్ వారు నాకు లక్షాపాతిక వేల రూపాయల పురస్కారం ఇచ్చినప్పుడు, ఆ సందర్భంగా “వంగూరి చిట్టెన్ రాజు చెప్పిన నూట పదహారు అమెరికామెడీ కథలు” అనే నా కథల సంపుటి ప్రచురించాం. అందులో కొన్ని తప్ప మిగిలినవన్నీ ఇదివరలోనే “అమెరికామెడీ కథలు”, “అమెరికాలక్షేపం” “అమెరికామెడీ కబుర్లు”. “అమెరి”కాకమ్మ” కథలు” అనే మకుటాలతో విడి విడి సంపుటాలుగా వచ్చినవే. వీటిల్లో మీకు నచ్చిన కథలు ఏమిటీ అని చాలా మంది టీవీ ఇంటర్ వ్యూలలోనూ, పత్రికల వారూ అడిగినప్పుడు చెప్పడం కష్టమే కానీ, నాకు బాగా పేరు తెచ్చిన కథలు నా మొట్టమొదటి “జులపాల కథ”, “రెండో జులపాల కథ”, “వాహనయోగం కథ”. “బురదావనం కథ”, చేగోడీ కంప్యూటర్ కథ”, “సంకట్ కాల్ మే బాహర్ జానేకా మార్గ్”, “దంత వేదాంతం కథ”, ఊంఠ్ గాడీ కథ”, “మైక్రోవేవోపాఖ్యానం”, “బుల్లితెరంగేట్రం”, మీ ఆవిడ ఎందుకు పుట్టిందీ?”, ..ఇలా చాలానే చెప్పుకోవచ్చును….నాట్ బేడ్..ఎటాల్! నా కథా సంపుటాలకు ముందు మాటలు రాసిన వారు గొల్లపూడి, జొన్నవిత్తుల, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, రచన సాయి, కిరణ్ ఫ్రభ మొదలైన వారు.
ఇక నాటకాలలో నేను రాసిన పాతిక పైగా నాటకాలలో అమెరికాలో బాగా పేరు తెచ్చిపెట్టినవి “బామ్మాయణం”, “మగ పాత్ర లేని నాటిక” అయితే ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చినది “అసలు ప్రశ్న”. ఈ నాటిక దూర్ దర్శన్ లో ఇండియా అంతటా చాలా సార్లు చూపించబడింది అని విన్నాను. నా నాటికలన్నీ “అమెరికామెడీ నాటికలు” అని శ్రీశ్రీ గారూ, గొల్లపూడి గార్ల ముందు మాటలతో పుస్తక రూపంలో వచ్చింది.
నా కథల్లో అప్పుడప్పుడు ప్రవేశిస్తూ అనేక మంది పాఠకులని అలరిస్తున్న పాత్ర “క్వీన్ విక్టోరియా”. “ఆవిడే లేకపోతే మీ కథలు ఎవరూ చదవరు” అన్నారు ఈ మధ్యన ఒక ప్రముఖ సంపాదకులు. ఈ పాత్ర సృష్టి, నా కథలలో ఉన్న కొన్ని బారిస్టర్ పార్వతీశం ఛాయలు, సునిశితమైన హాస్యం, వ్యంగ్యం, రాజకీయ చతురోక్తులూ మొదలైన అంశాల వలన నన్ను మొక్కపాటి, పానుగంటి, చిలకమర్తి, మునిమాణిక్యం, భమిడిపాటి, ముళ్ళపూడి మొదలైన వారితో పోల్చడం వినడానికి బాగానే ఉంటుంది కానీ, అది పూర్తిగా అతిశయోక్తే!. నేను వారిలో ఏ ఒక్కరి కాలిగోటికీ కూడా పోలను అని నాకు తెలుసు.
ఎవరు నన్ను పొగిడినా, తెగడినా..ఇటీవల నాకు మహదానందాన్ని కలిగించిన విషయం ..బాపు అంతటి మహానుభావుడు నా మీద ఒక కార్టూన్ వెయ్యడం…అది ఎమెస్కో వారు 2011 లో ప్రచురించిన “బాపు కార్టూనులు -2″ లో చోటుచేసుకోవడం ( 51 వ పేజీ). అది కిందటి నెల ఇండియా వెళ్ళినప్పుడు ఆ పుస్తకం కొనుక్కుని, అమెరికా వచ్చాక చూస్తుంటే…ఈ కార్టూన్ కనపడి ఆశ్చర్య పోయాను. ఆ కార్టూన్ బహుశా స్వాతి పత్రికలో వేశారేమో నాకు తెలియదు. నేను ఎప్పుడో మా హై స్కూల్ గురించి రాసిన కథ చదివి బహుశా బాపు గారు ఈ వ్యంగాస్త్రం సంధించి ఉంటారు. 2006 లో నా మొట్టమొదటి కథా సంపుటికి బాపు గారు ఇందుతో జత పరిచిన ముఖచిత్రం వెయ్యడం, బాపు-రమణ లు ఎంతో ఆప్యాయంగా, అద్భుతంగా ముందు మాట రాయడం, ఆ పుస్తకం అంకితం తీసుకోవడం, ఇప్పుడు బాపు గారు ఈ వ్యంగాస్త్రం సంధిస్తూ కార్టూన్ వెయ్యడం…ఈ జన్మకి ఇవి చాలు. ఇంకెవరి పొగడ్తా అక్కర లేదు
ఇలా రాసుకుంటూ పోతే…నేనే ఒక “సొంత సుత్తి: అనే వెబ్ పత్రిక పెట్టుకుంటానేమో అనే అనుమానం ఎవరికైనా వస్తే, ఆ భయం లేదు అని అభయం ఇస్తూ…శలవ్!
హ హ , సొంత సుత్తిలా లేదు సర్ .. మీరు ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నట్టుగా ఉంది .. చదువుతున్నంత సేపు ఆసక్తి తగ్గలేదు .. ఇక మీ కధల కోసం ఎదురు చూడాల్సిందే ..
ధన్యవాదాలు…
భవదీయుడు,
వంగూరి చిట్టెన్ రాజు
కొన్ని ఆసక్తికరమైన (వివాదాస్పదమైన?) అబ్సర్వేషన్లు చెప్పారు, అమెరికాలో జరుగుతున్న తెలుగు రచనా వ్యాసంగం గురించి. ఆలోచించాల్సిన విషయాలే. మీ రచనల వలన కానీ, వంగూరి ఫౌండేషన్ ద్వారా మీరు చేస్తున్న కార్యక్రమాల వల్లకానీ అమెరికా తెలుగు సాహిత్యానికి జరుగుతున్న మేలు ఎనలేనిది.
అయ్యా,
మీ సత్వర స్పందనకి నా ధన్యవాదాలు…నా సొంత అనుభవం, ఏదైనా సాహిత్య సభలలో కలుసుకున్నప్పుడు ఇతరులు నాతో పంచుకున్న వారి అభిప్రాయాలని మాత్రమే వ్రాసాను…అంత కంటే ఏమీ లేదు.
ఎవరు ఏమి చేసినా, అంతా సాహిత్యభిమానం తోటే కదా! అందుకు అందరికీ సంతోషమే!
భవదీయుడు,
వంగూరి చిట్టెన్ రాజు
డా. చిట్టెన్ రాజు గారు,
మీ సాహితీ ప్రస్తానం చదివి చాలా సంతోషించాం.
హాస్యరచయితగా మీరు అధిరోహించిన శిఖరం సామాన్యమైనది కాదు. మీ అమెరికాలక్షేపం, అమెరికాకమ్మ వగైరా కథలు చదివినవారికెవరికైనా అది అవగతమౌతుంది. పెద్ద పెద్ద వారితో మిమ్మల్ని పోల్చడం అతిశయోక్తిగా మీకు అనిపించడం మీ వినయాన్ని చూపుతుంది. మీ తెలుగు భాష, శైలి, పలుకుబడి గిలిగింతలు పెడుతుంది.
మీరు సాహిత్యానికి చేసిన, చేస్తున్న సేవ అనన్య సామాన్యం.
మీరు నమ్మిన నిజాన్ని నిష్కర్షగా, వ్యంగం, హాస్యం జోడించి చెప్పడంలో, మీ ధైర్యం వెల్లడౌతోంది. మీ మీద మీరు జోకులు వేసుకోవడమనే విషయంలో మీరు ముందుంటారు. ఇది ఈ రోజుల్లో ఒక అరుదైన విషయం.
రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నాటక నిర్వాహకుడిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా ఎందరో రచియతల్నీ, రచయిత్రుల్నీ ప్రోత్సహిస్తూ, వంగూరి ఫౌండేషన్ స్థాపించి దేశవిదేశాల్లో ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులు నిర్వహిస్తూ తెలుగు భాషామతల్లికి ఇంతటి గొప్ప సేవ చేస్తున్న మీరు ఒక ఒక సంస్థ గానీ వ్యక్తీ కారు అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎప్పుడో సీ.పీ. బ్రౌన్ గారు తెలుగు భాష కి అటువంటి సేవ చేసారు అని విన్నాం. ఈ నాడు మిమ్మల్ని కళ్ళారా కంటున్నాం.
భవదీయుడు
రమణ బాలాంత్రపు
నా మీద మీ సదభిప్రాయాలకి సంతోషం….అందులో కొంత అయినా నిజం ఉందేమో అని నాకే అనుమానం వేసేస్తోంది సుమా!…..
భవదీయుడు,
వంగూరి చిట్టెన్ రాజు
చిట్టెన్ రాజు గారూ,
చదువుతున్నంత సేపూ మొహం మీద చిరునవ్వు చెరక్కుండా అతికించి ఉంచే మీ సున్నీమైన హాస్యానికి నేను చలా పెద్ద పంకాని! నేను90 ల్లో కాలేజీ లో చదువుతున్న రోజుల్లో ప్రతి నెలా రచన లో మీ కథ కోసం ఎదురు చూసి చదివి హాయిగా నవ్వుకుని “భలే ఉన్నాయి రాజుగారి అమెరికా కబుర్లు” అనుకునే వాళ్ళం ఇంటిల్లి పాదీనూ!(వాటిలో ముగ్గురు స్నేహితులు ఒక అపార్ట్ మెంట్ ట్ తీసుకుని వంటలొండి వంటిల్లు తగలెట్టినంత పని చేసే కథ ఒకటి ఉండాలి..పేరు గుర్తు లేదు)
మీ హాస్యంతో పాటు మీరు అడపా దడపా అమెరికా మనుషుల మీదో సంఘాల మీదో, సాహిత్యం మీదో అలవోగ్గా వేసే చురకలు కూడా ముంతకింద పప్పులా ఘుమ ఘుమ లాడతాయి.
మీ సాహితీ ప్రస్థానం సారంగ కి కొత్త రంగులద్దింది
మీ స్పందనకి….ధన్యవాదాలు.
కథ మాట ఎలా ఉన్నా…నేను వంట చేసి ఇల్లు తగలబెట్టబోయే సందర్భాలు ఖచ్చితంగా ఉన్నాయి….చాలా సార్లు నిజంగానే చెయ్యి కాల్చుకున్నాను….కోసుకున్నాను….
…వంగూరి చిట్టెన్ రాజు
మహారాజశ్రీ (ఇది డాక్టర్ క౦టే పెద్ద స౦బోధనే అనుకు౦టున్నాను) చిట్టెన్ రాజు గారూ,
“ఐ హావ్ బీన్ హియర్ సో లా౦గ్ దట్ ఐ హావ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ది బిల్డి౦గ్” అన్నట్టు ఇది మీ సొ౦త సుత్తి లాగ లేదు. స౦క్షిప్త, నిర్మొహమాట అమెరికా సాహితీ చరిత్రకి ము౦దు మాటలా ఉ౦ది. అన్నట్టు శ్రీ శ్రీ గారు మీకు సొ౦త శైలి ఉ౦ది అని నిజవేఁ చెప్పారు (ఏదో వొచ్చి మీ యి౦టో ఉన్న౦దుకు మొహమాట పడి అన్నట్టు లేదు) దానితో ఇప్పటి వరకూ చాలా మ౦దిని అలర౦చారు. హాయిగా అలాగే క౦టిన్యూ అయిపో౦డి. మేమూ ఎప్పటి లాగానే మీ కధల కోస౦ ఎదురు చూస్తూ ఉ౦టాము.
డాక్టర్ గారూ….
శాస్త్రం ప్రకారం నేను “బ్రహ్మశ్రీ” అవుతానేమో కానీ….”పద్మశ్రీ” లాంటిది చస్తే అవను….అంచేత మీరు ఎలా సంబోధించినా పరవా లేదు. హాస్యం మాట ఎలా ఉన్నా..నేను “సారంగ” లో నెల నెలా రాద్దామనుకుంటున్నది నా సొంత కథలే…అవి నచ్చితేనే వారు వేసుకుంటారు…
అన్నట్టు మీరు మూడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకి వచ్చినప్పుడు చెప్పిన “ఒకే రోగం ఉన్న ఇంత మంది రోగులని ఒకే చోట నేను ఎప్పుడు చూడ లేదు” అని ఒక నిపుణూడిగా చెప్పిన “జోకు” తలుచుకున్నపుడల్లా నవ్వు కుంటూ ఉంటాను….అదీ హాస్యం అంటే!
…వంగూరి చిట్టెన్ రాజు
అయ్యా చిట్టెన్ రాజు మహోదయా,
మీతో నా రెండు సంవత్సరాల IIT సాంగత్య కాలంలో గాని, తమర్ని ఇటివల భాగ్యనగరంలో కలిసినప్పుడు గాని, మీ రచనలు చదివినప్పుడు గాని స్ఫురణ కి వచ్చేది ఒకే అనుభూతి.
ఇదేమి వైపరీత్యం అని అడగకండి.సంతాప సభలు మినహాయించి, మీనుంచి పట్టుమని మూడు వాక్యాలు ఏకబిగిన అంతర్లీనంగా హాస్యం లేకుండా వెలువడితే ( ఆ హాస్యం పండనీ పండకపోనీ, నా తలకి ఎక్కనీ ఎక్కకపోనీ), ఆ క్షణంనుంచీ నేను నా భార్యతో పెద్దమనిషి తరహాగా ప్రవర్తిస్తానని నాకు నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను.
ఇన్ని సంవత్సరాలు గడిచిపొయినాయి. మిమ్మల్ని తలుచుకున్నప్పుడల్లా నేను ముసిముసి నవ్వులు నవ్వుకుంటూనే ఉన్నాను.
నా భార్య గిరిజ నష్ట పోతోంది!
ఇరువురం మీ సంజాయిషీ కోరుతున్నాము.
ప్రాణం తియ్యకయ్యా, మహాశయా…నా మూలాన నీకూ, గిరిజకీ గొడవలు రాకుండా….”హాస్య తంటాలు” పడతాను…ఇదేదో మీ సంసారం గురించి మాత్రమే కాదు…..నమ్మండి, నమ్మకపొండి….మా ఆవిడ పేరు కూడా గిరిజ…చాలా?
ఏది, ఏమైనా….”సారంగ’ లో నా వ్యాసం చదివినందుకు, స్పందించినందుకూ నాకు మహానందంగా ఉంది…
ఓరి నాయనోయ్…..ఎప్పటి ఐ.ఐ.టీ…మనిద్దరం ఒక నాటకంలో వేషం వేసి…(నేను వెయ్య లేదు కానీ, డైరెక్ట్ చేసినట్టు జ్ఞాపకం…అవునా…) సుమారు నలభై ఏళ్ళు అయింది అనుకుంటాను….కిందటి నెల హైదరాబాద్ లో కలుసుకోవడం బావుంది కానీ….అది గట్టిగా ఐదు నిముషాలు కూడా లేదు…అది బాగా లేదు… నువ్వు ఇంకా అప్పటి లాగా ఇంకా పొడుగ్గానే ఉన్నావు….అది బాగానే ఉంది….
…వంగూరి చిట్టెన్ రాజు
ప్చ్, మా ఆవిడ (మీ కానాడ మనిషేనండి, ఆయ్) తంటాలు ఎప్పటికి తీరేనో!
క్షంతవ్యుడు
చిట్టెన్ రాజు గారూ …..అద్భుతం ….సున్నితంగా సూటిగా అప్పుడప్పుడూ చురకలతో ….గిలిగింతలు పెట్టారు ….next ఇష్యూ కసం ఎదురుచూస్తూ ………నమస్సులతో …భువనచంద్ర
అయ్యా….మీరే…మా భువన చంద్ర మహాశయులే….భలే, భలే…మీరు కూడా నా “సుత్తి” చదివారంటే…నా జన్మ ధన్యమే…..ఆవిడ కూడా చదివారా?
నేను “చురకలు” వేసిన మాట కొంచెం నిజమే కానీ….అవి నాక్కుడా వేసుకుంటాను…టిట్ ఫర్ టాట్ అనమాట…తెలుగు సాహిత్యం, అందునా అమెరికాలో చాలా గొప్పగా ఉండే చారిత్రక అవకాశాన్ని ఇక్కడి వాళ్ళు పోగొట్టుకోకూడదన్నదీ, అందుకు ఎవరూ తెలిసో, తెలియకో అడ్డు పడకూడదనీ నా కోరిక….
Chittenrajugaru
Mee sahithi prayanam heroin leni pranayam ga undi ( Appu Thacchu kadu)
Sahasra shubhakankshalu Anandabharitham ,amogha slesham ,adbhutha hasya prabhanjamnam , adhyathmikaniki velthundemo chudalani undi
bhavadeeyudu
Sonty Sriram
మహాశయా..
మీ స్పందనకి మహానందం…..
నేను వ్రాసేది ఆధ్యాత్మకతకి వెళ్ళదు అని చెప్పగలను….ఎందుకంటే…దేముడికి దణ్ణం పెట్టుకోవడమే కానీ…కోరికలు కోరి ఆయన్ని ఇబ్బంది పెట్టడడం నాకు చేత కాదు. అన్నట్టు..మీరు ఏదో Heroin అన్నారు….అలాంటి మత్తు పదార్ధాలు ఎందుకూ? నేను ఎప్పుడు “సాహిత్యం మత్తులోనే” ఉంటాను అని మా హీరోయిన్ అనబడే అర్ధాంగి అంటూ ఉంటుంది…
—-వంగూరి చిట్టెన్ రాజు
CHALA SANTHOSAHM MEE VRASINDI CHALA SANTHOSHANGA CHADIVA I AM VERY VERY HAPPY TO KNOW UR LIFE AND EFFORTS. TELUGU MEEDHA TELUGU KALALA MEEDHA AND TELUGU RACHANA LA MEEDHA MEEDU VUNNA ABHIMANAM ASAKTHI CHALA CHALA ANANDAM KALIGINCHAIE ENKA ENTHA TELUGU BAKTHULU VUNNARU ANEDI CHALA CHALA HAPPY MOROKA SARI MEE GURINCHI NAA SPANDANA VIVARANGA VRASTHANU TELUGU TYPING RAADU IF ANY WRONGS EXCUSE ME ALL THE BEST ONCE AGAIN I APPRCIATE UR EFFORTS AND VICTORIES GOOD CONGRATS THANK U MY BLESSINGS TO U MY BOY AND TP UR FAMILY HAPPY SHIVARAATHRI
CHALA SANTHOSAHM MEE VRASINDI CHALA SANTHOSHANGA CHADIVA I AM VERY VERY HAPPY TO KNOW UR LIFE AND EFFORTS. TELUGU MEEDHA TELUGU KALALA MEEDHA AND TELUGU RACHANA LA MEEDHA MEEDU VUNNA ABHIMANAM ASAKTHI CHALA CHALA ANANDAM KALIGINCHAIE ENKA ENTHA TELUGU BAKTHULU VUNNARU ANEDI CHALA CHALA HAPPY MOROKA SARI MEE GURINCHI NAA SPANDANA VIVARANGA VRASTHANU TELUGU TYPING RAADU IF ANY WRONGS EXCUSE ME ALL THE BEST ONCE AGAIN I APPRCIATE UR EFFORTS AND VICTORIES GOOD CONGRATS THANK U MY BLESSINGS TO U MY BOY AND TP UR FAMILY HAPPY SHIVARAATHRI
మీ స్పందనకి ధన్యవాదాలు సారూ…..నాకు తెలుగు ని ఇంగ్లీషు లో రాయడం రాదు….క్షమించాలి..
…వంగూరి చిట్టెన్ రాజు
శ్రీ వంగూరి చిట్టెన రాజు గారూ,మీ కలం ధార నిజంగా హాస్యం, చమత్కారం, యధార్థం మిళితమైన కళా ధార. మీ వ్యాసం చదివి, నేనే అ సంఘటలన్నీ ప్రత్యక్షంగా చూసినట్టు ఒక అనుభూతి కలిగింది. అమెరికాలో సాహిత్యాభిమానులకు తెలుగు భాష లోని కొత్త రుచులని చవి చూపి, రచయితా రచయిత్రులను ప్రోత్సహించి, వంగూరి ఫౌండేషన్ ద్వారా ఎంతో సేవ చేసిన మీకు నమస్కారములతో, రేవతి అడిదం.
మీ ప్రశంసలకి నా ధన్యవాదాలు…
—-వంగూరి చిట్టెన రాజు
మీరు రాసే ఏ పత్రికలోనైనా, మొదట నా కళ్లు పరిగెట్టేది మీ కాలం వైపే. ఇలాగే చితక్కొట్టండి.
అదే నా ప్రయత్నం..కానీ అప్పుడప్పుడు నన్నే చితక్కొడతారు ..ఏంచేస్తాం…అనుభవిస్తాం..
చిట్టెన్ రాజు గారు,
జంధ్యాల గారి పాత్రలు మరియు కధనాలు, రేలంగి మరియు రమణారెడ్డి గార్ల హావభావాలు ఇలా నవ్వుతో గిలిగింతలు పెట్టేవాళ్ళు ఊరికినే ఆరోగ్యాన్ని పాఠక (లేదా ప్రేక్షక) మహాశయులకు విరివిగా పంచి ఇచ్చేసే మహానుభావులు అనిపిస్తుంది. మీ ‘సంకట్ కాల్ మే బాహార్ జానేకా మార్గ్ ‘ కధ ని ఈ పాటికే అనేక సార్లు మిత్రుల సమక్షంలో ప్రస్తావించి ఉన్నాను.
అందువలన మీ బోటి వాళ్ళు వ్రాసినది సుత్తి కాదని నా నమ్మకము.
కేవలం స్టేజి మీద మీ మాటలు మాత్రమే విని ఇలా మాట్లాడేది ‘చిట్టెన్ రాజు గారు మాత్రమే’ అని గుర్తు పట్టగలిగాను. అంటే మీ హాస్యం పవర్ ఏమిటో చెప్పకనే చెప్పినట్టయ్యింది.
ధన్యవాదాలు,
నారాయణ.
రచన పాఠకుడిగా మీ కథలు మీ ఫౌండేషన్ ద్వారా మీరు జరిపే కార్యక్రమాల గురించి కొద్దో గొప్పో తెలుసు .సారంగలో చాలా విషయాలు తెలిసాయి.మొన్న టెంపుల్ టెక్సాస్ సాహిత్య వేదిక కార్యక్రమంలో కలుసుకునే అవకాశం లభిస్తుందనుకున్నాను.
కానీ ఏందువల్లో మీరు రాలేదు.ఏది ఏమైనా మీ మాతృ భాషాభిమానం కొనియాడదగినది.
తుమ్మూరి రాంమోహన్ రావు
చిట్టెం రాజు గారూ! మీరన్నట్టే మీ రచనా వ్యాసంగానికి వేరే సర్టిఫికెట్లు అవసరం లేదు— బాపుగారి ముఖ చిత్రాలంకరణ, ముళ్ళపూడి వారి ముఖద్వార పలకరింపు-ముందుమాట- చాలవూ!!! అదనంగా దరిమిలా వారే వేసిన కార్టూన్ ఒకటైతే, శ్రీరంగం వారు ముందుగానే మీ ఇంట చేసిన వీరంగం మరొహటుండగా– ఎవడికండీ మిమ్మల్ని సర్టిఫికేట్ అడిగే దమ్మున్నదీ!
రాజా.
మీరన్నది కరెక్టే… కానీ పూర్తిగా కాదు…రచయితకి కావలసినది ముందు సర్టిఫికెట్లు అనే మత్తు మందు…ఆ విషయంలో నేను అదృష్టవంతుదినే.. రెండోది “డబ్బు”… ఆ ఒక్కటీ అడక్కు అని వేరే చెప్పక్కర లేదు.