అలవోకగా ఆమె అద్భుత జలవిన్యాసం!

br passportఎప్పుడు పుట్టిందో, ఎక్కడ పుట్టిందో! సుమారు రెండు వేల సంవత్సరాలుగా నడుస్తోంది తెలుగు పద్యం. దీనితో కలిసి మనమూ నాలుగు అడుగులు వేద్దామంటారా. రండి మాతో పాటు. పద్యం కోసం పాదయాత్ర. పాడిందే పాటగా ఎక్కిన గుమ్మమే ఎక్కడం కాదు. భక్తితో భజన చెయ్యడమూ కాదు. చూడవలసిన చోట్లు కొన్ని ఉన్నాయి. ఎవరూ అంతగా దృష్టి పెట్టనివి. అవి చూద్దాం.

**

          క్రీడాభిరామం శ్రీనాధుడిదే. మన వరంగల్లులోదే. అక్కడ ఒక చిన్నది అలవోకగా ఒక ప్రదర్శన ఇస్తోంది. కళ్ళు చెదిరిపోయే ప్రదర్శన .చూద్దామా-

        చం.      వెనుకకు మొగ్గ వ్రాలి కడు విన్నను వొప్పఁగఁ దొట్టి నీళ్లలో          

                   మునిఁగి తదంతరస్థమగు ముంగర ముక్కునఁ గ్రుచ్చుకొంచు లే

                   చెను రసనాప్రవాళమున శీఘ్రము గ్రుచ్చెను నల్లపూస పే

                   రనుపమలీల నిప్పడు చుపాయము లిట్టివి యెట్టు నేర్చెనో

(క్రీడాభిరామము – పద్యం. 146)

ఓరుగల్లులో ఒక పడుచుపిల్ల చేస్తున్న అద్భుత విన్యాసాలను చూసి మంచనశర్మ ఆశ్చర్యచకితుడవుతున్న సందర్భం.

ఆ పడుచుపిల్ల – నిండా నీళ్ళున్న తొట్టెలోకి తన ముక్కెరను (ముంగర) విసిరేసింది.  ఆ తొట్టె చెంత – ప్రేక్షకులవైపు తిరిగి బోసి ముక్కుతో నిలబడింది.  చేతులు పొట్టకి పెట్టుకుని – అలవోకగా వెనక్కి వంగింది (మొగ్గవ్రాలి).  తొట్టె అంచుకి తన వెన్ను తాకకండా వంగింది.  తొట్టెనీళ్ళలోకి చాలా నేర్పు (విన్ననువు) ఒప్పేట్టు తలా మెడా ముంచింది.  అంతే నేర్పుగా అలవోకగా లేచి నిలుచుంది. ఇప్పుడు ఆమె ముక్కుకి ముంగర మెరిసిపోతోంది. చప్పట్లే చప్పట్లు.

చేటలో నల్లపూసలు పోసుకుంది.  ఒక చేత్తో పట్టుకుంది.  దారం ఎక్కించిన సూదిని మరో చేత్తో పుచ్చుకుంది.  చిగురాకులాగా ఎర్రగా ఉన్న తన నాలుకతో అతివేగంగా (శీఘ్రము) ఆ నల్లపూసలను దారానికి దండ గుచ్చింది.  సాటిలేని రీతిలో (అనుపమలీలన్‌) ఒయ్యారంగా నల్లపూసలపేరు తయారు చేసింది.  మళ్ళీ చప్పట్లే చప్పట్లు.

ఈ పడుచుపిల్ల ఇలాంటి విద్యలూ ఉపాయాలూ ఎన్ని నేర్చిందో ఎలా నేర్చిందో కదా – అని మంచనశర్మ ఆశ్చర్యపోయాడు.

Download PDF

7 Comments

 • పున్నమరాజు says:

  గురువు గారూ .. ‘పాద’ ప్రణామాలు !! – పున్నమరాజు ఉమామహేశ్వరరావు (93973 93993 )

 • నమస్తే! పద్యం తాత్పర్యం ఎక్కడైనా దొరుకుతుంది.మీ వంటి పండిత కవుల నుంచి పద్యాల ‘లోపలి’ అంద చందాలని వినాలనుంది గురువుగారూ! నేటి తరానికి నాటి పద్యం మీద గల చిన్నచూపును పోగొట్టే చక్కని చమత్కారాలనూ చవిచూపించరూ!

 • Ramana Balantrapu says:

  గురు దేవోభ్యోనమః
  మీ పాఠక మిత్ర వ్యాఖ్యానానికి మేము దాసొహం. మీ ఈ పధ్ధతి నా లాంటి చాలామంది పామరుల్ని పద్య భక్తులుగా చేస్తొంది.
  మీ “పద్య కవితా పరిచయం” చదివి ముగ్ధుణ్ణై పోయాను. దాని కారణంగానే తెలుగు పద్యం మీద మమకారం పెంచుకున్నాను.
  నాకు పద్య మాధుర్యాన్ని రుచి చూపించిన మీకు నేను సదా కృతఙ్ఞుణ్ణి.
  భవదీయుడు
  బాలాంత్రపు వెంకట రమణ

 • Gannavarapu Narasimha Murty says:

  పడుచు పిల్ల విన్నాణము నతి రమణీయముగా శ్రీనాథుడు వర్ణిస్తే ఆ పద్యానికి చక్కని వ్యాఖ్య నిచ్చారు శ్రీ బేతవోలు రామబ్రహ్మము గారు. కృతజ్ఞతలు !

 • మాస్టారూ, ఇక్కడ మీ దర్శనం ఎంతో సంతోష కారణం. హనుమంతరావుగారి విన్నపమే నాదీను. అదీను, కేవలం ఒక్క పద్యం కాక, ఒక సన్నివేశమో, ఘట్టమో చెబితే ఇంకా పసందుగా ఉంటుంది.

 • ns murty says:

  మాస్టారూ,

  ఈ చతుర విన్యాసాలతో పాటు, పద్యాలలో నిక్షిప్తమైన ఖగోళ విషయాల ప్రస్తావన ఎక్కడైనా మీకు లభ్యమైతే దయచేసి చెప్పగలరు. ఆ కాలంలో మనకు తెలిసిన రోదసీ పరిజ్ఞానాన్ని ఆవేశంతో కాకుండా, పరిశోధక విద్యార్థుల్లా సప్రామాణికంగా బేరీజు వేసుకుందికి అవకాశం ఉంటుంది.

  నమస్సులతో

 • Rammohan Rao says:

  ఇలాంటి పద్యరత్నాలెన్నో మీలాంటివారు వెలికి తీసి చూపుతుంటే తెలుగు పద్య ప్రకాశం ఇనుమడిస్తుంది. ఇలా ప్రత్యేకంగా చదివిన పద్యాలు స్మృతి పథం లో చిరస్థాయిగా నిలుస్తాయి.బేతవోలు గారూ మీకు నా నమస్సులు.—వాధూలస

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)