ఛానల్ 24/7

ch24_inner

sujatha photo“కరెక్టా.. కాదా.. సరిగ్గా ఆలోచించానా…?”

దిగుతున్న మెట్టు మెట్టుకీ ఒక్కో ప్రశ్న నిలదీస్తోంది. స్వాతి డోర్ దగ్గిర కనబడగానే ఒక్కో లైటూ వెలుగుతోంది స్టూడియోలో.

సెట్ వెలిగిపోతోంది. నల్లని బ్యాక్‌డ్రాప్‌లో చమక్‌మనే కర్టెన్స్ జిగ్‌జాగ్‌గా కన్పిస్తున్నాయి. ఫ్లోర్‌లో రెండే రెండు చెయిర్స్ ఎదురెదురుగా వున్నాయి. రెండింటికీ మధ్యలో ఒక చిన్న టీపాయ్. బ్యాక్‌డ్రాప్ బ్లాక్ కలర్‌లో పైనుంచి కిందిదాకా వేలాడుతున్న డిజైనర్ బుట్టల్లోంచి వెలుగు. సీలింగ్ స్టాండ్ నుంచి రెండు లైట్లు సరిగ్గా కిందవున్న చైర్స్‌పై పడుతున్నాయి. ఎడం వైపు వున్న చెయిర్‌లో నయన కూర్చుని చేతిలో వున్న పేపర్స్ వంక చూసుకోంటోంది.

అది పగలైనా సెట్ మాత్రం నైట్ ఎఫెక్ట్‌లో వుంది. వైడ్ కెమేరాలో మొత్తం సెట్ అంతా కవరయ్యేలా మానిటర్‌లో చూసుకొంటూ అడ్జస్ట్ చేసుకొంటున్నాడు సీనియర్ కెమేరామెన్.

మెట్ల దగ్గర శబ్దం విని హలో మేడం.. అంటూ ఎదురొచ్చింది నయన స్వాతిని విష్ చేస్తూ.

చప్పట్లు కొడుతూ కెమేరామెన్స్‌ని హెచ్చరించింది నయన. నాలుగు వైపులా కేమ్స్. వెనకాల కెమేరామెన్స్. చిరునవ్వుతో స్వాతిని విష్ చేస్తున్నారు అందరూ. క్రేన్‌పైన కూర్చొన్న నరేంద్ర ఓ ట్రయల్ వేద్దామని క్రేన్ ఆపరేటర్‌ని అడుగుతున్నాడు. స్వాతిని చూసి హలో మేడం అంటూ విష్ చేశాడు. మెట్ల దగ్గరనుంచి స్వాతి చేయి పట్టుకొని నడుస్తూ సెట్ దగ్గరకు తీసుకొచ్చింది నయన.

వెల్‌కమ్ చెబుతున్నట్లు తలవంచి అభివాదం చేస్తూ నయన, “వెల్‌కమ్ మేడం,” అన్నది.

స్వాతి చైర్‌లో కూర్చుని చుట్టూ చూసింది. ఎదురుగ్గా స్క్రిప్ట్ రైటర్ పరిమళ, అసిస్టెంట్ ప్రొడ్యూసర్ రవి, ప్రొడక్షన్ మేనేజర్ నాగేశ్వరరావు నవ్వుతూ చూస్తున్నారు.

“టచప్ ఇవ్వనా మేడం,?” మేకప్‌మేన్ బెదురుతూనే అడిగాడు.

కళ్ళెత్తి అతనివైపు చూసింది స్వాతి. ఆమె వైపు చూస్తునే రెండు అడుగులు వెనక్కి వేశాడు మేకప్‌మేన్ స్వామి. ఒక్క క్షణం అతనికి భయం అనిపించింది. స్వామీ అని గద్దించే స్వాతి గొంతు చెవుల్లో మోగినట్లయింది. పదిహేనేళ్ళుగా మేకప్‌బాయ్‌గా, ఫ్లోర్‌లో అడుగుపెట్టినప్పటినుంచి అలవాటుగా వింటున్న గొంతు. వెనక్కి వెళ్లి నిలబడ్డాడు.

స్వాతిపైన వెలుతురు పడేలా అసిస్టెంట్ లైటింగ్ షేడ్ మారుస్తున్నాడు. ఆమె చెదిరిన జుట్టుపైన వెలుగు పడి జుట్టు మెరుస్తోంది. తెల్లబడిన కనుబొమలు, తలవంచుకొన్న చోటపడిన నీడ, తెల్లని ముక్కుపైన వెలుగు, ముడుచుకొన్న పెదవులు, అరవైఏళ్ళ వయసులో కూడా అపురూపమైన అందం. ఆమె అందంగా వుందా.. గంభీరంగా వుందా.. కోపంగా వుందా.. ఏదీ తెలియనివ్వని నిర్లిప్త్త. ఎన్నో ఏళ్లుగా చూస్తున్నా ఎప్పుడూ కొత్తగా.. భయపెడుతూ…

“స్వామి.. అద్దం తీసుకురా,” నయన కేక పెట్టింది.

అద్దం తీసుకొని స్టేజ్‌పైకి పరుగు పెట్టాడు స్వామి. అది తీసుకొని అద్దంలో మొహం చూసుకొంది నయన. జుట్టును చేతులతో సరిచేస్తూ వెనక్కి వేస్తోంది హెయిర్ స్టయిలిస్ట్ కమల. ప్రతి రోజూ, ప్రతి ప్రోగ్రామ్‌కి అలవాటైన ఒక పద్ధతి. స్వాతి నయన వైపే చూస్తోంది. మొహం చూసుకొని, అద్దం స్వామికి ఇచ్చేసి స్వాతి వైపు తిరిగింది నయన.

“మేడం ఓకే నా,?” అడిగింది.

స్వాతి చిరునవ్వు నవ్వింది.

కెమేరామెన్ సజెషన్స్ ఇస్తున్నాడు.

“నయనా మేడం! మీరు ఈ క్యామ్ లోకి చూడండి,” క్రేన్‌వైపు కూర్చున్న నరేంద్ర బొటనవేలు పైకి చూపించి ఓకే అన్నాడు.

“ఫ్లోర్ సైలెన్స్.. మూవ్ క్రేన్.. యాక్షన్,” అన్నాడు ప్రొడ్యూసర్ శైలేంద్ర క్రేన్ కెమేరా మూవ్‌మెంట్‌ని మానిటర్‌లో చూస్తూ. ఆన్‌లైన్ స్టూడియోలో అతని ఎదురుగ్గా వున్న మానిటర్స్‌లో నాలుగు కెమేరాల అవుట్‌పుట్ కనిపిస్తోంది. క్రేన్ పైనుంచి ఒక రౌండ్ తిరిగింది. స్వాతి, నయన కూర్చున్న దగ్గరకు జూమ్ చేస్తున్నాడు పైనుంచి నరేంద్ర. నయన మొహం క్లోజ్‌లో కనిపిస్తోంది. శైలేంద్ర మొహం పైన నవ్వు కనిపించింది. హెడ్‌ఫోన్‌లోంచి నయనకి కంగ్రాట్స్ చెప్పాడు.

నయన నవ్వింది. కెమేరా నయన క్లోజ్ చూపిస్తోంది.

“నమస్కారం. ఇవాళ ప్రపంచపు పదోవింత మీ ముందుకు తెస్తోంది టీఎవీ సెవెన్. ప్రఖ్యాత జర్నలిస్ట్, రచయిత్రి, టీవీ సెవెన్ పొలిటికల్ ఎడిటర్ స్వాతితో మనం ఈ రోజు మాట్లాడబోతున్నాం. మూడు దశాబ్దాలుగా మీడియా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకొన్న స్వాతి, జర్నలిస్ట్‌గా, కార్యక్రమ రూపకర్తగా ఎన్నో టాప్ రేటింగ్ ప్రోగ్రామ్స్ సృష్టించారు. 30 ఏళ్ళ అనుభవంతో, ప్రతిభావంతమైన రచనా సామర్ధ్యంతో ఆమె ప్రపంచం మెచ్చుకొన్న మహిళ. ఇవ్వాళ నుంచి ధారావాహికంగా ప్రసారంకాబోతున్న 60 మినిట్స్ విత్ నయనతో మొట్టమొదటి విశిష్ట అతిథిగా మీ ముందుకు వస్తున్నారు స్వాతి. నమస్కారం స్వాతి!”

స్వాతి కళ్ళెత్తి చూసి నమస్కారం చేసింది.

నయన చాలా మంచి యాంకర్. ఏపి లోవున్న న్యూస్ యాంకర్స్‌లో టాప్ త్రీలో ఒకరుగా వుంది. గలగలమనే గంగా ప్రవాహంలాగా మాట్లాడుతుంది.

ఇప్పుడు మనం స్వాతితో మాట్లాడబోతున్నామంటే 30 ఏళ్ళ మీడియా ప్రపంచంలోకి తొంగి చూడబోతున్నాం. అద్భుతమైన రచయిత్రిగా సాహితీ ప్రపంచంలో చోటు సంపాదించుకొన్న స్వాతి మీడియాలో అడుగుపెట్టారు. కాలమిస్ట్ గా , జర్నలిస్ట్‌గా, స్క్రిప్ట్‌రైటర్‌గా, డైరెక్టర్‌గా ఆమె అత్యున్నతమైన స్థానంలో వున్నారు. ఆమె జీవితంలో ప్రతి అనుభవం ఇవాళ్టి జర్నలిస్ట్‌లకు ఒక అపురూపమైన పాఠం. కమాన్ క్లాప్స్,” అంటూ నయన వంగి స్వాతి పాదాలకు నమస్కారం చేసింది.

స్వాతి లేచి నిలబడి నయనను కౌగలించుకొంది.

“థాంక్యూ. నయనా”

“నేనే మీకు థాంక్స్ చెప్పాలి మేడం. ఇవ్వాల్టి నా ప్రోగ్రాంలో మీరు రావటం నాకు ఆశీర్వచనం. మీరు ప్రపంచం ఎరిగిన జర్నలిస్ట్. మీడియా ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టించారు. ప్రసిద్ధి చెందిన ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. మిమ్మల్ని ఈ నిముషం వరకూ ప్రేక్షకులు కళ్ళతో చూడలేదు. మీరెలా వుంటారో తెలియకుండానే మిమల్ని ప్రేమించిన సాధారణ ప్రేక్షకులు మీ ముందున్నారు. వాళ్ల కోసం మీరు మనసు విప్పి మాట్లాడండి,” అన్నది నయన.

స్వాతి వైపు తిరిగాయి కెమేరాలన్నీ. అన్ని కేమ్స్‌లోనూ స్వాతి రకరకాల యాంగిల్స్‌లో కనిపిస్తోంది.

చిరునవ్వుతో నమస్కారం చేసింది స్వాతి.

“నన్ను ఆదరించిన అందరికీ నమస్కారం. మీ ప్రేమ, అభిమానం నన్నింత దాన్ని చేశాయి. నా వృత్తీ, ప్రవృత్తీ ఒక్కటే కావటం నా అదృష్టం. అక్షరాల వరసల్లో సంగీతం విన్నాను. అక్షరాల్నీ ప్రేమించాను, ఆరాధించాను. నా జీవనాధారం కూడా అక్షరాలే. నా ఆలోచనలు, ఊహలు అన్నీ ఎప్పుడూ ఏవో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తూ వచ్చాయి. నేను కలలు కన్న ప్రపంచాన్ని నా కళ్లముందుకు తెచ్చే అవకాశం నాకు కలిగింది. అదే నా అదృష్టం. నేను ఎప్పుడూ నమ్మని ఈ అదృష్టం అన్న పదాన్ని ఇవ్వాళ మీ ముందుకు తెచ్చాను. కొన్ని భావాలకు మాటలు లేవు. ఈ అదృష్టం అన్న పదం కన్నా నాకు ఇప్పుడు, ఈ క్షణంలో ఇంకేం పదం ఆలోచనలోకి రావటం లేదు.”

“కట్.. కట్..” శైలేంద్ర గొంతు మైక్‌లో వినిపించింది.

“సారీ మేడం.. ఆడియో ప్రాబ్లం వుంది,” అన్నాడు శైలేంద్ర స్వాతిని ఉద్దేశించి.

సెట్‌లో అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. స్వాతి తలవంచుకొని కూర్చుంది. నయనకు ఆమెను పలకరించే ధైర్యం లేదు. టెక్నికల్  చీఫ్ కిందకి వచ్చి మైక్స్ చెక్ చేస్తున్నాడు.

“నిన్న యూనిట్ మొత్తం అవుట్‌డోర్ వెళ్లింది మేడం. ఆన్‌లైన్ పంపించాను. ఏవో లైన్స్ ప్రాబ్లం ఇస్తున్నాయి. ఉదయం అంతా చెక్ చేశాం,” అంటున్నాడు అపాలజిటిక్‌గా.

స్వాతి కుర్చీలో వెనకి వాలి కూర్చుంది. ఎంతో మాట్లాడాలి. ఎన్నో చెప్పాలి. ఏది ముందు… ఏది వెనక… ఈ కెమేరాల ముందు ఫ్లాష్ లైట్ల వెనక, మేకప్ కాస్ట్యూమ్స్ వెనక… ఇక్కడ ఏం జరుగుతోంది? తనేం చెప్పబోతోంది? అరగంట క్రితం కాన్ఫరెన్స్ హాల్లో సి ఇ ఒ కి చెప్పిన తన నిర్ణయం గురించి ఏం ఆలోచించాలి? ఒకే ఒ క్క నెల రోజుల్లో తను ఈ ప్రపంచంలోంచి బయటికి నడిచిపోవాలి. ఈ ప్రపంచం… ఈ మీడియా… ఎవరు ఎవరికోసం నేనేదయినా చేయగలనని ఈ ఉద్యోగం గురించి చెప్పుకొంటున్నారు… మీడియా గుట్టు తను విప్పబోతుందా…?

వచ్చే గురువారం …

 Front Image: Mahy Bezawada
Download PDF

10 Comments

 • సుజాత says:

  అద్భుతంగా మొదలైంది. సుజాత గారి సీరియల్ కోసం పోయిన వారం నుంచే ఎదురు చూస్తున్నాను

 • RAVICHANDRA C says:

  సీరియల్ చాలా బాగుంది.

 • లలిత says:

  సుజాతగారూ, మనసులోమాట ….సీరియల్ కోసం ఎదురుచూస్తూ వరసలో మీకంటే ముందునేనున్నాను.

  ఎప్పుడో బాలచందర్ గుప్పెడు మనసు సీరియల్ తర్వాత అంత ఇదిగా ఎదురుచూసింది ఈ సీరియల్ కోసమే

 • renuka ayola says:

  సుజాత గారు మళ్ళీ ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మీసీరియల్ ద్వారా/ అలా సాగిపొతాము మీతోపాటు

 • G.S.Lakshmi says:

  మొదలు పెడుతూనే ఉత్కంఠ కలిగించారు పాఠకుల్లో. చాలా చాలా బాగుంది.

 • c. sujatha says:

  ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల నా ఉనికిని నిలుపుతున్న మీ అందరికీ కృతజ్ఞతలు… సి. సుజాత.

 • అద్భుతంగా మొదలయ్యింది
  బుక్ రీడింగ్ అలవాటు తో.. కొంత ఈ రీడింగ్ కూడా జోడించాలి..తప్పదిక :)

 • ఆసక్తి గా ఉంది సుజాత గారు.

  వారం వారం చదవడానికి తయారుగానే ఉంటాం. ఉత్కంఠ భరితమైన సీరియల్ రచనకు అభినందనలు.

 • syambabu injeti says:

  సుజాత గారూ,
  మీ రచనలనుండి ఎప్పుడూ ఏదో నేర్చుకోవచ్చు. మళ్ళీ రాయటం మొదలు పెట్టారు. చాలా థాంక్స్.

 • prtamiri says:

  సుజాత గారూ…
  రచన ఉత్కంఠ కలిగిస్తూ సాగుతోంది. చదువుతుంటే ఆపాలని ఎక్కడా అనిపించడం లేదు… అక్షరాల వెంట మమ్మల్ని పరుగులు తీయిస్తున్నారు… ధన్యవాదాలు…..

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)