ఛానెల్ 24 / 7 – మూడవ భాగం

sujatha photo

(కిందటి భాగం తరువాయి)

“శ్రీజ ఇంకా ఏడుపు ఆపలేదు” అన్నాడు మేకప్‌మాన్ దామోదర్.

పేపర్ చదువుకొంటున్న శ్రీకాంత్ దామోదర్ వంక చూశాడు.

“ఇదేం గోలరా బాబూ పొద్దున్నే.. ఎంతసేపు ఏడుస్తుందంట..” అన్నాడు చిరాగ్గా..

“ఆవిడ్ని అంతమందిలో  అలా అరవటం బావుండలేదు సర్,” అన్నాడు దామోదర్.

“ఓహో.. తమరికీ బాధ కలిగిందన్నమాట,” అన్నాడు శ్రీకాంత్.

“నాకేమిటి సర్, ఇంతవరకూ ఆమె డ్రెస్ చేంజ్ చేసుకోలేదు. మీరు నన్నరుస్తారని వచ్చాను,” అన్నాడు దామోదర్ మొహం మాడ్చుకొని.

పేపర్ టేబుల్‌పైన పడేసి కాబిన్‌లోంచి చుట్టూ చూశాడు శ్రీకాంత్. ఎవరి పనుల్లో వారు ఉన్న అందరి చెవులూ ఇప్పుడు తన మాటనే వింటాయనిపించింది శ్రీకాంత్‌కి.

కోపం తెచ్చుకోకూడదని ఎంత కంట్రోల్ చేసుకొన్నా ఆ నిముషం నోరు ఊరుకోదు. ఇక ఆ తర్వాత ఎంత తల విదిలించినా పరిస్థితి చేతుల్లోకి రాదు. మళ్లీ ఈవిడ సీన్ క్రియేట్ చేసింది. ఎండిగారి దగ్గర క్లాసు పీకించుకోవాలి.

“ముసలాయన వచ్చాడా,” అన్నాడు శ్రీకాంత్.

“ఎవరు సార్,” అన్నాడు దామోదర్.

కళ్లెత్తి అతనివైపు చూశాడు.

ముసలాయనేమిటి.. ఆయన ఎండి చచ్చినట్టు సరిగ్గా మాట్లాడు అన్నట్లున్నాయి దామోదర్ చూపులు. వీడొక పుడింగ్‌గాడు. నన్నే కొశ్చెన్ చేస్తాడేమిటి. ఈ రోజంతా వీడికి తిండి లేకుండా, ప్రోగ్రామ్  బ్రేక్ లేకుండా చేయకపోతే మారుపేరు  పెట్టుకొంటా అనుకొన్నాడు మనసులో శ్రీకాంత్.

“దామోదర్ అస్సలే చిరాగ్గా వున్నాను. నువ్వో తద్దినం పెట్టకు పదా. ఆవిడెక్కడుంది..”

“వాయిస్ ఓవర్ స్టూడియో ఎదురుగ్,గా” అన్నాడు దామోదర్. మొహంలో మాయరోగం వదిలిందా అన్న ఫీలింగ్ ఉందనిపించింది శ్రెకాంత్‌కి.

దేవుడా.. సరిగ్గా ఎండి క్యాబిన్ ముందు ఏడుస్తూ కూర్చుందన్నమాట. ఐపోయాను ఇవ్వాళ అనుకొన్నాడు. టైమ్ చూసుకొన్నాడు. తొమ్మిదిన్నర. ఇంకేం ప్రోగ్రాం. ఇంకో అరగంటకు బయలుదేరినా స్పాట్‌కి చేరేటప్పటికే పన్నెండు. లైటింగ్ చూసుకొనేసరికి లంచ్ టైం. నాశనం చేసింది ప్రోగ్రామంతా. మనసులో తిట్టుకొనేందుకు కూడా శ్రీకాంత్‌కు ధైర్యం చాలలేదు.

“పద,” అన్నాడు లేచి నిలబడి.

లిఫ్ట్ కోసం కూడా ఆగకుండా  ఫోర్త్‌ఫ్లోర్‌కు గబగబా నడిచాడు. మెట్ల దాకా వచ్చిన దామోదర్ ఆగిపోయాడు. నవ్వొచ్చింది అతనికి. నాలుగు రోజులకొకసారి శ్రీకాంత్‌కు ఈ ఫీట్స్ తప్పవు. పాపం అనుకొన్నాడు. ఆ పిల్ల కూడా అంతే.  శ్రీజ ఏడుపు తలుచుకొంటే ఇంకా నవ్వొచ్చింది. రావటమే ఎనిమిదిన్నరకి.  శ్రీకాంత్ ముందే చెప్పాడు. తొమ్మిదికల్లా కారెక్కాలి అని. అతను వెళ్ళేదాకా చూస్తూ వింటూ ఊరుకొంది. రోజూ ఉండేదేగా అనుకొని మేకప్ అయ్యాక హెయిర్ స్ట్రెయిట్ చేయమంది. హెయిర్ డ్రస్సర్ ఒక్కో పాయ తీస్తూ స్ట్రెయిట్ చేస్తోంది.  శ్రీకాంత్ వచ్చేసరికి శ్రీజ తీరిగ్గా చెయిర్‌లో వెనక్కు వాలి మ్యూజిక్ వింటోంది. సగం సగం మేకప్ కాగానే పెద్దగా అరిచాడు.

“ఏవుంది సర్ ఫైవ్ మినిట్స్.. డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాక చేతుల పని చూద్దాం,” అంది.

“ఇంకా ఏం చేంజ్.. వేసుకొన్నవి బాగా వున్నాయ్‌లే పదా,” అన్నాడు చిరాగ్గా.

“లేదు సర్ కాస్ట్యూమర్ వెయిట్ చేస్తున్నాడు. కార్నర్‌లో ఉన్నాట్ట. షోరూమ్ నుంచి డ్రెస్‌లు తీసుకొస్తున్నాడతను. నేను వచ్చేస్తాను సర్,” అంది కూల్‌గా శ్రీజ.

శ్రీకాంత్‌కి కాస్త కోపం ఎక్కువే. గబగబా కాస్ట్యూమర్ రాజుకు ఫోన్ చేశాడు.

“సర్ ఇక్కడే షాపులో డ్రస్‌లు రెడీగా వున్నాయి. ఇదే దారికదా పట్టుకుపోండి సర్. నేను శ్రీజకు చెప్పాను,” అన్నాడు.

అతని వంకే సినిమా చూసినట్టు చూస్తోంది శ్రీజ. నీ కుప్పిగంతులు నా దగ్గరా అన్నట్లున్నాయి ఆమె చూపులు. చీటికి మాటికి అరిచే శ్రీకాంత్ అంటే వళ్ళుమంట శ్రీజకి. అతనితో పని చెయక తప్పదు. డెయిలీ ప్రోగ్రాం. ప్రతిరోజు దాదాపు షూటింగ్ వుంటుంది. రోజూ  వుండే  పనే కదా కూల్‌గా వుందాం అనుకోడు శ్రీకాంత్. కాస్త కోపం కానీ మనిషి మంచివాడే అనుకొంది శ్రీజ. ఇదాంతా నాలుగు రోజుల కొకసారి ఆఫీస్‌లో అందరికీ కనులకీ, చెవులకీ విందు. శ్రీకాంత్ టెన్షనూ, శ్రీజ కూల్‌గా కనిపిస్తూ విసిగించటం..

ఫోర్త్ ఫ్లోర్‌కి ఒక్క ఊపున పరుగు తీశాడు . ఆయాసం వచ్చింది శ్రీకాంత్‌కి. ఎదురుగ్గా కనపడుతున్న దృశ్యం చూసేసరికి గుండె గొంతులోకి వచ్చింది.

పొడుగ్గా వంగిపోయి ఎండిగారు. ఆయన ఎదురుగ్గా ఏడుస్తూ శ్రీజ. పరుగులు ఆపి నడుస్తూ వచ్చాడు శ్రీకాంత్. ఎండి ఎస్.ఆర్.నాయుడు కళ్లజోడు పైనుంచి శ్రీకాంత్ వైపు చూశాడు.

“నువ్వు ఇవ్వాళే వెళ్లిపోతావా, హెచ్ఆర్‌లో చెబుతాను సెటిల్ చెయ్యమని,” అన్నాడు కూల్‌గా.

“ఏంటి సార్” అన్నాడు శ్రీకాంట్. మళ్ళీ కంగారుగా  గుడ్ మార్నింగ్ అన్నాడు.

“నీ న్యూసెన్స్ భరించలేకపోతున్నానోయ్. రిజైన్ చేయి పోయి” అన్నాడు మళ్లీ. ఆయన గొంతులో కోపం లేదు. మాటల్లోనే అంతా.

“సారీ సర్. లేట్ చేస్తోంది సార్. ఎంతకీ తయారవదు. లోకేషన్ దూరం సార్. దిల్‌షుక్ నగర్ దాటాలి. అవతల సెలబ్రిటీ సర్. ప్రోమో షాట్ల కోసం ఇన్వైట్ చేశాం సర్. ఆమె హాఫెనవర్ టైమ్ ఇస్తానంది సర్. స్పెషల్ కుకరీ, సెలబ్రిటీ కుకర్. శ్రీజ ఎప్పుడూ లేట్ సర్,” అన్నాడు గబగబ.

ఎండిగారు తీరిగ్గా ఆమె వైపు చూశాడు. ఆయన ఎదురుగా ఎవరు వుంటే వాళ్ల సైడ్‌కి మారిపోతూ వుంటాడు.

“ఏమ్మా, ఎందుకు లేట్”

“సర్ వచ్చాను సర్. సెలబ్రిటీ వస్తున్నారు కదా సర్. మంచి డ్రెస్ కోసం కాస్ట్యూమర్ వెళ్లాడు సర్. ఆవిడ బాగా తయారై వస్తారు కదా సర్. మరి ఎలా పడితే అలా ఎలా వెళ్లాలి సర్,” అన్నది.

” ఏం చేద్దాం,” అన్నాడు ఎస్.ఆర్.నాయుడు.

శ్రీజకు కోపం దిగిపోయింది. శ్రీకాంత్‌ను ఉద్యోగంలోంచి తీసేస్తానని ఎండి అనడం లోపలనుంచి ఆనందం తన్నుకు వచ్చింది.

“ఏం లేదు సర్ బయలుదేరుతున్నాం,” అన్నాడు శ్రీకాంత్.

చైర్‌లో వెనక్కి వాలి కూర్చొంటూ, కళ్లజోడు పైనుచి శ్రీజను చూస్తూ ఏం చేద్దాం అన్నాడు ఎస్.ఆర్.నాయుడు. మళ్లీ ఆయన మొహంలో నవ్వు.

“వెళుతున్నాం సర్,” అన్నది శ్రీజ.

ఆయనకు నమస్కారం చేసి గబగబ కిందకి వెళ్లిపోయింది.

శ్రీకాంత్ వంక చూశాడు ఎండి.

“నోరు అదుపులో పెట్టుకో. ఆడపిల్లలతో ఏమిటి నీకు,” అన్నాడు చిరాగ్గా.

“ఒక్కమాట కూడ వినిపించుకోదు సర్. టైమ్ మెయింటెయిన్ చేయదు. చాలా ప్రాబ్లం,” అన్నాడు శ్రీకాంత్.

“అయితే వెళ్ళిపొమ్మని చెప్దాం,” అంటూనే అటు తిరిగి  మెసేజ్‌లు చూసుకోవటం మొదలుపెట్టాడాయన.

నన్ను పంపించకపోతే చాలు అనుకొంటూ వెనక్కి తిరిగాడు శ్రీకాంత్.

“ఏంటి.. ఏమంటాడు,” అన్నాడు పక్క లైబ్రరీలోంచే ఈ ఫార్స్ చూస్తున్న అవుట్‌పుట్ ఎడిటర్ శ్రీధర్. ఎండి గురించి ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాడతను. ఇంకో గంటలో హైద్రాబాద్‌లో జరిగిన విధ్వంసం పైన లైవ్ మొదలుపెట్టాలి. వరసగా అందరికీ ఫోన్‌లు చేసుకొని ఎండి కోసం పడిగాపులు పడుతున్నాడు.

“ఏవంటాడూ.. దాన్నీ..” అంటూనే ఎవరైనా విన్నారేమోనని చుట్టూ చూశాడు శ్రీకాంత్.

“శ్రీజని తీసేయ్యాలిట.”

“తీసి ఎక్కడ వేయాలి” నవ్వాడు శ్రీధర్.

“ఆయన నెత్తిమీద. ఇది గంటకోసారి ఆయన కాబిన్ ముందు నిలబడుతుంది. ఈవిడ పోయట్రీకి ఇన్స్పిరేషన్ ఆయనేనట”

“ఆమె పోయట్రీకి ఈ ముసలాడు ఇన్స్పిరేషనేమిటిరా. ఈవిడకు ఆయన్ను చూసి కవిత్వం పొంగటమేమిటో అర్ధం కాదు.”

శ్రీకాంత్ చిరాకు చూసి ఇంకా నవ్వొచ్చింది శ్రీధర్‌కి.

“దాని ఉద్యోగానికి ఇది పర్మినెంట్ స్టాంపు.”

“శ్రీజలాగా మన ఆఫీసులో కనీసం వందమందికి ఇన్స్పిరేషన్ ఆయన. మన డెస్క్ రమణగాడు చూడు. నిముషానికి ఓ సారి అభిసారికలాగా సార్ అంటూ  పరిగెత్తుకొస్తుంటాడు. తన లైవ్‌లో ఎటువైపు చూసినా దీపం పురుగుల్లా జర్నలిస్టులు ముసురుతుంటారని మొన్న కోర్ మీటింగ్‌లో ఎండి మూర్ఛపోయాడు. అసలింతకీ రమణగాడు ఎందుకు వచ్చాడో తెలుసా..? ఇప్పుడు ఎడిట్ అవుతున్న ప్రోగ్రామ్‌లో వైట్ షర్ట్ గ్లేర్ కొట్టిందంట. ఆ తెల్లటివి వేసుకోవద్దని కెమెరా పరశురాం చెప్పమన్నాడని వచ్చానన్నాడు. ఈ సంగతి చెప్పేందుకు రమణ రావాలా చెప్పు. ఎండీగారు రమణగాడి పొగడ్లకి  కోమాలోకి వెళ్ళిపోయాడనుకో,” అన్నాడు శ్రీధర్.

ఒక కన్ను ఎండి కాబిన్‌వైపు పెడుతూ, కేబిన్ ఎదురుగా ఆయన పి.ఏ. సరిత సీరియస్‌గా కంప్యూటర్‌కి అతుక్కుపోయి కనిపిస్తుంది. ఆమె ఎదురుగా పదిమంది ఎండిగారి కోసం వెయింటింగ్‌లో వున్నారు.

“లైవ్ వుందిరా బాబూ పోతున్నా. ఆయనకు గెస్ట్ లిస్ట్ ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది,” అంటూ అటు పరిగెత్తాడు శ్రీధర్.

సరితకు ఎదురుగా నిలబడ్డాడు. ఓ సెల్యూట్ కూడా కొట్టేశాడు.

“చాల్లే బడాయి” అన్నది సరిత నవ్వు ఆపుకొని.

“ఆయనకు పర్మిషన్ ఇవ్వొచ్చుగా నన్ను కలిసేందుకు,” అన్నాడు సీరియస్‌గా.

సరిత మళ్లీ నవ్వింది.

“ఇవ్వను,” అన్నది సిస్టంలోంచి ఏదో నంబర్ నోట్ చేసుకొంటూ.

“ప్లీజ్ మేడం. చచ్చి నీ కడుపున పుడదామన్నా టైం లేదు. టాంక్‌బండ్ మీద విగ్రహాలు మొత్తం మటాష్”

“సర్లే బాబూ ఓవరాక్షన్ ఆపి పోయి పనిచేసుకో,” అన్నదామె.

క్యాబిన్ అద్దంలోంచి ఎండి ఫోన్‌లో మాట్లాడతం కనిపిస్తోంది. అద్దంలోంచి కనిపిస్తున్న శ్రీధర్‌కి తలవూపి లోపలికి రమ్మన్నాడు.

“అదేమిటండి . విగ్రహాలన్నీ.. అబ్బ అవన్నీ అంటే నాకెంతో ఇష్టం,” అన్నది సరిత. ఎదురుగ్గా గోడపై ఫిక్స్ చేసిన టీవీలో లైవ్ చూస్తూ, చూస్తుండగానే జాషువా విగ్రహం నేలమట్టమైపోయింది.

శ్రీధర్‌కి మొహంలో నవ్వు మాయమైపోయింది.

“చరిత్రకి సాక్ష్యాలు కూడా మిగల్చరా వీళ్లు. ఏం సాధిస్తారో..” అంటూనే ఏండి రూమ్‌లోకి వెళ్ళిపోయాడు.

హుస్సేన్‌సాగర్‌పైన జరుగుతున్న విధ్వంసం లైవ్‌లో కనిపిస్తోంది. వందలకొలదీ విధ్యార్థులు దూసుకు వస్తున్నారు. విగ్రహాలు కూలిపడుతున్నాయి. పోలీస్ వ్యాన్ దొర్లి పడింది.

“అమ్మో.. టెన్షన్‌గా వుంది,” అన్నది సరిత. ఎదురుగ్గా కూర్చొన్నవాళ్లవైపు చూసి. ఎదురుగా న్యూస్ ఎడిటర్ శ్రీనివాస్ విగ్రహంలా కూర్చుని వున్నాడు. ఆయన మొహంలో ఏ ఫీలింగ్ లేదు.

“శ్రీనివాస్‌గారూ స్పాట్‌కి వెళ్ళలేదా,” అన్నది సరిత.

“సరితగారూ, ఓ నిముషం సార్‌ని కలుస్తా” అన్నాడు శ్రీనివాస్.

“ఏమయిందండీ అంటూ…” ఇంటర్‌కం ఫోన్ తీసింది.

“ప్రతి విషయం మీ పర్మిషన్ తీసుకోలేనండి” అన్నాడు శ్రీనివాస్.

సరిత మొహం మాడిపోయింది.

ఫోన్  పెట్టేసి, సార్ ఫోన్‌లో మాట్లాడుతున్నారు అన్నది శ్రీనివాస్ వైపు చూస్తూ.

“మధ్యలో నా పర్మిషన్ ఏమిటండి” అన్నది రెట్టిస్తూ మళ్లీ.

“ప్లీజ్ సరితగారూ, నన్ను వదిలేయండి. ఎల్లాగూ మీ వెర్షనే ఆయన వింటాడు. నాపైన దయదలచి నన్ను వదిలేయండి.” అన్నాడు రెండు చేతులు జోడించి.

సరిత దిక్కులు చూసింది. చుట్టూ చాలా మంది విజిటర్స్ ఉన్నారు. ఏం మాట్లాడినా శ్రీనివాస్ గొంతు పెంచేలా ఉన్నాడు.

మళ్లీ ఫోన్ తీసింది.

“సార్ శ్రీనివాస్ సార్  ఓ నిముషం మాట్లాడాలంటున్నారు.”

“శ్రీధర్‌ని పంపేస్తాను” అన్నాడు ఎస్.ఆర్.నాయుడు.

“ఏమంటాడు కుదరదు అంటున్నాడా?” గొంతు పెంచుతున్నాడు శ్రీనివాస్.

“ఆయనతో నాకేం పని లేదండి. జస్ట్ రిజైన్ చేసిన పేపర్ ఇస్తాను అంతే ” అన్నాడు పెద్ద గొంతుతో.

“శ్రీనివాస్‌గారూ ప్లీజ్. శ్రీధర్ రాగానే మీరు వెళ్లండి” అన్నది సరిత.

శ్రీనివాస్ మనసు  ఉడికిపోతుంది. వందమంది రిపోర్టర్స్‌కి న్యూ ఇయర్ కోసం టార్గెట్స్‌తో ఎడ్వర్‌టైజ్‌మెంట్స్‌ కోసం ఎంత కష్టపడ్డాను. వాళ్లు ఉద్యోగాలు మాని కంపెనీకి డబ్బు రావాలని కష్టపడ్డారు. ఒక్కో రిపోర్టర్‌కి ఐదేసి లక్షలు టార్గెట్. పాపం అంతా చేశారు. ఏం జరిగిందీ. ఒక్కళ్లకి కూడా సింగిల్ పైసా పర్సంటేజ్ ఇవ్వలేదు. మొత్తం ఎండి ఖాతాలోకి వెళ్లిపోయింది. టార్గెట్స్ పెట్టిన సంగతి, రిపోర్టర్స్ పని చేసిన సంగతి మేనేజ్‌మెంట్ దాకా వెళ్లనేలేదు. మొత్తం తన ద్వారానే వచ్చిందని ఎండి క్రియేట్ చేసుకున్నాడు. స్టాఫంతా తన పైన పడతారు. తను చీట్ చేశారంటారు. దిక్కుమాలిన ఉద్యోగం. పళ్లు కొరుక్కున్నాడు శ్రీనివాస్.

శ్రీధర్ బయటకు వస్తూ శ్రీనివాస్‌కి విష్ చేసాడు. శ్రీనివాస్ నవ్వులేని మొహంతో నిలబడ్డాడు. ఒక్క నిముషం కళ్లు మూసుకొని ఎండి రూంలోకి గబగబ వెళ్లాడు.

“శ్రీనివాస్ కూర్చోండి. లైవ్ ప్రోగ్రాం తర్వాత ఒక అరగంట ఈ టాంక్‌బండ్ విషయాలపై రౌండప్ నాదే. మూడుగంటల బులెటిన్ ముందు నా రౌండప్ ఉండాలి. లైవ్‌లో పోలీస్ అఫీషియల్స్‌ని పిలవండి.” అన్నాడు.

“సార్.. నా రిజిగ్నేషన్” అన్నాడు శ్రీనివాస్ పేపర్ ఆయన ముందుకు తోస్తూ.

“వ్వాట్.. ఎందుకు..? ఏమయింది..?” అన్నాడాయన ఉలిక్కిపడి.

“ఎందుకు లెండి సార్.. నేనీ  ఉద్యోగానికి తగను” అన్నాడు శ్రీనివాస్.

“శ్రీనివాస్ ఇవాల్టి పరిస్థితి ఇలా వుంటే, మనం ఏ  సైడ్ తీసుకోవాలో తెలియని  క్రూషియల్ పీరియడ్. ఇప్పుడు నేనేం నిర్ణయాలు తీసుకోలేను. తర్వాత మాట్లాడదాం. చూడు హుస్సేన్ సాగర్ దగ్గర ఎంత గందరగోళం..” అన్నాడాయన.

“నేను నా నిర్ణయం తీసుకొన్నాను సర్.. ఇది నా కెరీర్‌కు సంబంధించింది” అన్నాడు శ్రీనివాస్ అయన వైపు చూస్తూ.

ఎండి మాట్లాడలేదు. కాస్సేపు ఊరుకొన్నాడు.

“శ్రీనివాస్ నువ్వు మేనేజ్‌మెంట్ గుడ్‌లుక్స్‌లో వున్నావు. పొలిటికల్ ఎడిటర్‌గా ప్రమోషన్ ఇద్ద్దామనుకొంటున్నాను. అంటే నువ్వే చానల్‌కు మెయిన్ రోల్. ఆర్‌యూ హ్యాపీ నౌ…”

“నో సర్.. నేను వెళ్ళిపోతాను. సర్. నేను మీ దగ్గర ట్రెయినీగా చేరాను. నన్ను మీరు పెంచారు. కానీ నాకు డబ్బుకంటే  కెరీర్ ముఖ్యం సార్. నాకెంతో  జీవితం వుంది. నేను ఎవరినీ మోసం చేయలేను..”

ఎండి మొహం ఎర్రబడింది.

“అంటే ఏమిటి నీ ఉద్ధేశ్యం.”

“ఏవుంది సార్. అన్నింటికీ నేను అడ్డం వుంటాను. ఈ  చానల్‌లో ప్రతి ఎంప్లాయికీ జరిగే ప్రతి అన్యాయం నా చేతులపైనే జరుగుతోంది. రిపోర్టర్స్ చాలా అసహ్యించుకుంటున్నారు. వాళ్ళు కష్టపడతారు. మీకు పేరు వస్తోంది. రేపు మన రెండో చానల్‌కు కూడా మీరే హెడ్. మరి చాకిరి చేసేవాళ్ల గతి ఏమిటి?”

ఎండికి అర్ధం అయింది. పరిస్థితి ఇంకా ఎటూ పోలేదు. బాల్ తన కోర్టులోనే వుంది. శ్రీనివాస్‌కు కావలసింది ఏమిటో అర్ధం అయింది.

“ఎంటర్‌టెయిన్‌మెంట్ చానల్ వచ్చిన తర్వాత హెడ్‌గా నువ్వే వుంటావనుకున్నాను” అన్నాడు తాపీగా వెనక్కి వాలి.

శ్రీనివాస్ మొహంలో కోపం తెరలు కాస్త తొలగిపోయాయి.

“సార్…” అన్నాడు లోగొంతులో.

“శ్రీనివాస్ టీవీ21 వాళ్లు చూడు. ఏం టైటిల్ పెట్టారో. ఈ అల్లరి మూకలా రేపు పాలించేది.. బావుంది కదా” అన్నాడు.

శ్రీనివాస్ గొంతు పెగల్లేదు.

“నాకు లైవ్ వుంది. రాత్రికి మాట్లాడుకొందాం,” అన్నాడాయన లేస్తూ.

శ్రీనివాస్ పేపర్స్ తీసుకొని బయటికి వచ్చాడు. అతని మొహం వెలిగిపోతోంది.

వందమంది ఆశలు తను తీసుకువచ్చాడు. ఇప్పుడు తన ఆశ ఒక్కటే తను తీర్చుకొన్నాడు. ముప్పై ఎనిమిదేళ్లు వస్తున్నాయి. ఇవ్వాల్టికీ కారు లేదు. ఇల్లు లేదు. మొన్ననే బాబు పుట్టాడు. ఖర్చులు పెరుగుతున్నాయి. మంచి జీవితం ఇవ్వాలి వాళ్లకు. తనో రూల్ పెట్టుకుని న్యాయం ధర్మం అంటూ వేళ్ళాడలేదు. మనిషిగా మిగలాలి అనుకోకపోతే చాలు ఈ ప్రపంచంలో మహారాజుగా బతకవచ్చు.

సరిత ఎదురుగ్గా కూర్చున్నాడు. సరిత మొహంలో స్పష్టంగా నవ్వు కనిపిస్తోంది. ఎండి. పిఏ ఆమె. సమస్తం ఆమెకు తెలుసు. ఎండి బ్యాంకు ఎక్కౌంట్లు ఆమె చేతుల్లోనే వుంటాయి. శ్రీనివాస్ పాత్ర ఏమిటో, లోపల అతనేం చేయబోతాడో, ఎలా బయటికి వచ్చాడో ఊహించింది సరిత. ఇలాంటి వాళ్లని ఎండి ఎంతమందిని చూసి వుంటాడు. బంజారాహిల్స్‌లో అంత పెద్ద భవనం ఎలా కట్టేడు. పిల్లలు ఫారిన్‌లో, బావమరుదులు, మరదళ్లు ఆయన ఆఫీస్‌లో ఎంతగా పాతుకుపోయారో ప్రతి నిముషం ఎవరేం మాట్లాడుకొన్నా ఆయనకు ఇన్‌ఫర్‌మేషన్ ఎలా వస్తుందో చక్కగా తెలుసు. శ్రీనివాస్ కోపం ఎంత సేపు.

“టీ తాగుతారా శ్రీనివాస్‌గారూ,” అంది సరిత.

“వుందా,” అన్నాడు శ్రీనివాస్ నీరసంగా.

***

వచ్చే గురువారం …

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)