మంచి ముత్యాల్లాంటి పద్యాలు

br passport

ఎప్పుడు పుట్టిందో, ఎక్కడ పుట్టిందో! సుమారు రెండు వేల సంవత్సరాలుగా నడుస్తోంది తెలుగు పద్యం. దీనితో కలిసి మనమూ నాలుగు అడుగులు వేద్దామంటారా. రండి మాతో పాటు. పద్యం కోసం పాదయాత్ర. పాడిందే పాటగా ఎక్కిన గుమ్మమే ఎక్కడం కాదు. భక్తితో భజన చెయ్యడమూ కాదు. చూడవలసిన చోట్లు కొన్ని ఉన్నాయి. ఎవరూ అంతగా దృష్టి పెట్టనివి. అవి చూద్దాం.

సముద్ర గర్భంలో ఆల్చిప్పలుంటాయనీ, వాటిలో ముత్యాలుంటాయనీ, వాటిని పట్టి తెచ్చి అమ్ముతారనీ విన్నాం. కానీ ఈ ముత్యాల వేట ఎలా ఉంటుందో తెలీదు. దీన్ని సూర్యాస్తమయం తారకోదయాలతో పోల్చి చెబుతున్నాడీ కవి.

178. చం.     శరనిధి సాంధ్యరాగ మనుచక్కని బచ్చెన యోడనెక్కి, దు
స్తరతర రశ్మి బద్ధ రవి జాలికు నీటను ముంచి, మౌక్తిక
స్ఫుర దురు శుక్తికల్గొని, నభోధరణిన్ సమయంపు బేరి ని
బ్బరముగఁ గొట్టి, రాలుచు సుపాణు లన, న్విలసిల్లెఁ దారకల్
(మిత్రవిందాపరిణయము. కుం. వేం. ఆ. 5. పద్య. 11.)

ముత్యాల వ్యాపారి కథను ముడిపెట్టాడు ఈ పద్యం లో – కవిగారు.

బేహారి –
బేరి = వ్యాపారి. సమయము అనే వ్యాపారి (బేరి). సాంధ్యరాగము అనే చక్కని రంగు
(బచ్చెన) ఓడను ఎక్కి సముద్రంలోకి (శరనిధి) ముత్యాలకోసం వెళ్ళాడు. సూర్యు డు (రవి)
అనే జాలరిని (జాలికున్ ) ఎక్కిం చుకుని మరీ వెళ్ళాడు. మధ్యలోకి వెళ్ళాక ఈ జాలికుణ్ని
శరనిధిలోకి దింపాడు. నడుముకి పొడవైన – తెగిపోని (దుస్తరతర) త్రాడుతో కట్టి
(రశ్మిబద్ధ) నీటను దించాడు. (రశ్మి = కిరణం. కిరణబద్ధుడై రవి పడమటి సముద్రంలోకి
మునగడం).

ఆ జాలరి – సముద్రగర్భంనుంచి ముత్యాలతో నిండి ఉన్న (మౌక్తికస్ఫురత్ ) పెద్ద పెద్ద
ఆల్చిప్పలు (శుక్తికల్) తెచ్చి తన బేరికి అప్పజెప్పాడు. ఆ శుక్తికలను ఆకాశమనే నేలమీద
(నభో – ధరణిన్ ) పోసి, లోపలి ముత్యాలు చితికిపోకండా నిబ్బరంగా వాటిని పగలగొట్టి,
వాటినుంచి ఆ సమయపు బేహారి (బేరి) రాల్చిన మంచి ముత్యాలు (సుపాణులు) అన్నట్టుగా
– ఆకాశంలో తారకలు విలసిల్లాయి.

చం.     సమయమహేంద్రజాలకుఁడుసారసమిత్రుఁడనేటి పద్మరా
గము వెస మాయఁ జేసి, కుతుకంబున “హా”యని నీలపంక్తులన్
భ్రమపడఁ జూపి “ఝా” యనుచుఁ బల్కి సుపాణులఁ జేసి చూపెఁ జి
త్ర మనఁగఁ బ్రొద్దుగ్రుంకెఁ దిమిరం బెసఁగెన్ దివినొప్పెఁ దారకల్
(హంసవింశతి, ఆ. 2. పద్య. 173.)

సూర్యుడు ఎర్రగా అస్తమించగా, నల్లని చీకటి పంక్తులు కమ్ముకున్నాయి. ఆకాశంలో తెల్లగా మిలమిలలాడుతూ నక్షత్రాలు కనిపించాయి. ఈ పరిణామక్రమం ఎలాగుందంటే:  కాలం అనే గొప్ప ఇంద్రజాలికుడు తన మంత్రదండం తిప్పి సూర్యుడనే (సారస మిత్రుడు-అనేటి) పద్మరాగమణిని చిటుక్కున (వెసన్) మాయంచేసి, ఆనందంతో (కుతుకంబునన్) ‘హా’ అని అరుస్తూ మరోసారి మంత్రదండం తిప్పి ప్రేక్షకులు భ్రమపడేట్టు ఇంద్రనీలమణుల్ని (నీలపంక్తులన్) చూపించాడు. పద్మరాగాన్ని నీలమణులుగా మార్చేసినట్టు. అంతటా నల్లటి కాంతులు పరుచుకున్నాయి. ఇప్పుడు మరోసారి దండం తిప్పి ‘ఝా’ అని అరుస్తూ ఇంద్రనీలాలను మంచిముత్యాలుగా మార్చేసి (సుపాణులన్-చేసి) చూపించాడు. ఆహా! ఎంత చిత్రం! ఎంత చిత్రం! అన్నట్టుగా-సూర్యబింబం క్రుంకింది, తిమిరం వ్యాపించింది (ఎసఁగెన్), ఆకాశాన తారకలు పొడిచాయి.

శైవల నీలముం గమలశాలియునైన యగడ్త నీరు ప
ద్మావళి వ్రాఁత తోడి కరకంచుగ నొప్పుచుఁ గోట శాటిలా
గై వఱలంగ హర్మ్య కనకాంశు నికాయము పేరఁ దత్పుర
శ్రీ విలసిల్లు నభ్రచర సింధువు-మౌళికి మల్లెదండగన్
(కళాపూర్ణోదయము 01-112)

ఇది ద్వారకా పురలక్ష్మి. ఈవిడ ఒక బంగారు చీర (శాటి) కట్టుకుంది. ప్రాకారమే (కోట) ఆ చీర. సౌధాల బంగారపు (కనక) అంశునికాయము- కాంతిపుంజం పేరుతో (వంకతో) అది అచ్చమైన శాటిలాగా భాసిస్తోంది (శాటి=చెంగావి చీర). ఈ శాటికి-కరక్కాయ రసంతో తీరిచి దిద్దిన అంచు ఉంది. కరక-అంచు. కరక్కాయ రసం కనక-నల్లటి అంచు. ఈ అంచుమీద ఉన్న వ్రాతపని (అద్దకం పని) పద్మాల వరుస. పద్మావళి దీని బోర్డరు. ఇంతకీ ఈ వ్రాతపనితో కూడిన కరకంచు ఏమిటి- అంటే-అగడ్త నీరు. నీరు మరి తెల్లగా ఉంటుంది కదా అది నల్లటి అంచు ఎలా అవుతుంది? నాచు తీగలు (శైవలం) కారణంగా అగడ్తనీరు నీలంగా ఉంది. కనక- కరకంచుగా ఒప్పుతోంది. అగడ్తలో –వికసించిన పద్మాలు చాలా చాలా ఉంటాయి కదా! అందుకని అగడ్తనీరు కమలాలు కలది కూడా (శాలియున్) అయ్యింది. ఇలా మొత్తానికి అగడ్తనీరు- పద్మావళి వ్రాఁతతోడి కరకంచుగన్ ఒప్పింది ఆ శాటికి.

హర్మ్య కనకాంశు నికాయము అనే బంగారు చీర ధరించిన తత్పురశ్రీ తన సిగలో ఒక మల్లెదండ తురుముకుంది. ఏమిటి ఆ మల్లెదండ అంటే- అభ్రచర సింధువు. దేవతల నది. ఆకాశగంగ. తెల్లగా ఉంటుంది గదా! అది ద్వారకాపుర లక్ష్మీదేవి మౌళికి మల్లెపూదండ కాగా-ఆ తల్లి అద్భుతంగా విలసిల్లుతోంది. జయహో! పింగళి సూరనా!!

చం.    పనుపడు వేణునాళములు పగ్గములుంబలెఁ గ్రింద బర్వు శో
భన కిరణప్రకాండములు భాసిలఁ జందురుఁడొప్పె నెంతయున్
మనసిజుఁ డెల్లప్రాణుల మనంబులు చేలుగ రాగబీజముల్
పెను జతనంబుతోడ వెదఁ బెట్టెడు రౌప్యపు జడ్డిగం బనన్
(ప్రభావతీప్రద్యుమ్నము. ఆ. 4. పద్య. 124.)

పూర్వకాలంలో పొలంలో విత్తనాలు నాటడానికి ‘జడ్డిగం’ అనే యంత్రం వాడేవారు.  ఇది ఒక పెద్ద పిడత. విత్తనాలు నింపి, దీనికి వెదురు గొట్టాలనమర్చి, వాటిద్వారా విత్తనాలు చాళ్ళలోకి జాలు వారేట్టు చేసేవారు. దీన్ని నాగలికి అమరుస్తారు. నాగలిని గిత్తలు లాగుతాయి. వాటి పగ్గాలు రైతు పట్టుకుంటాడు. పిడత ఖాళీ కాగానే మళ్ళీ విత్తనాలు నింపుతాడు. ఇదీ దీని కథ. చంద్రుడిని ఇటువంటి జడ్డిగంగా పోలుస్తూ కొత్త ఊహచేస్తున్నాడు కవి. విత్తనాలు నాటడంకోసం వెదురుగొట్టాల మాదిరి (వేణునాళములు) అలాగే పగ్గాల మాదిరిగానూ క్రిందకు జాలువారే అందమైన కిరణాలతో వెలుగొందే (కిరణప్రకాండములు భాసిలన్) చంద్రుడు- ఎంతయున్ ఒప్పెన్. ఎలా? మన్మథుడు (మనసిజుఁడు), ప్రాణులందరి మనస్సులు అనే చేలల్లో అనురాగబీజాలు, ఎంతో శ్రద్ధతో (పెను జతనంబు) నాటడానికి (వెదబెట్టుట) ఉపయోగిస్తున్న – వెండి (రౌప్యపు) జడ్డిగంలాగ చంద్రుడు కనిపిస్తున్నాడు.

Download PDF

3 Comments

 • RammohanRao thummuri says:

  చక్కని పద్యాలను మీరు విడమర్చి చెప్పడం చాలా బాగుంది.అంతరార్థం పూర్తిగా తెలిస్తే కలిగే ఆనందమే వేరు.ఏది ఏమైనా
  పద్య ప్రియులకు అపురూపమైనది ఈ శీర్షిక.గతనెల 17 న డల్లాస్ నగరం లో జరిగిన నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం
  పద్యానికి పెద్దపీట వేయటం కన్నులారా గాంచి పులకించి పోయాను.తెలుగు పద్యం చిరంజీవి.

 • మంచి ముత్యాల్లాంటి పద్యాలు

 • Manasa says:

  రామబ్రహ్మం గారి చేతుల్లో పడ్డ పద్యాలంటే నిజంగా స్వాతిముత్యాలేనండీ, ఇన్నాళ్ళూ ఈ శీర్షిక ఎలా మిస్ అయ్యానో! మీకు కృతజ్ఞతలు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)