సూరప రాజు గారి నుంచి – నా దాకా…..!

chitten raju

ఆరేడేళ్ళ  క్రితం ఒక రోజు సాయంత్రం ఒక తొంభై ఏళ్ళ పెద్దాయన కాకినాడలో మా “వంగూరి హౌస్” అనబడే ఇంటి గుమ్మం ముందు ఆగి, లోపలికి చూసి , కాస్సేపు తారట్లాడి వెళ్ళిపోవడం మా మూడో అన్నయ్య డా. సుబ్రహ్మణ్యం) కిటికీలోంచి చూశాడు.

ఆ మర్నాడూ అదే సమయానికి ఆయన వచ్చి, తలుపు తట్టి లోపలికి వచ్చారు. తన పరిచయం చేసుకుని, తాను అసలు వంగూరి ఇంటి పేరుగలవాడే కానీ, అజ్జరపు వారికి దత్తత వెళ్ళినట్టూ, తన చిన్నప్పటి నుంచి తన పూర్వీకుల ఫొటోలు రెండు ఉన్నాయి అని చెప్పి ఆ రెండు ఫొటోలూ మా అన్నయ్య కిచ్చాడు. వంగూరి వారు తణుకు దగ్గర ఉన్న సిధ్ధాంతం గ్రామ కరణాలు అనీ, ఆ ఇంటి పేరుగల వారందరికీ అదే స్వగ్రామం అనీ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే మా అన్నయ్య కి ఎవరో పేషేంట్స్ వచ్చారు.

“సారీ, సార్, మనం రేపు తీరిగ్గా మాట్లాడుకుందాం. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి. నేనే వస్తాను” అని అన్నాడు మా అన్నయ్య.  “అలాగే, తప్పకుండా, మన వంశ చరిత్ర గురించి నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తాను” అని ఆయన వెళ్ళిపోయారు. రెండు, మూడు రోజుల తరవాత మా అన్నయ్య వాకబు చేస్తే ఆ పెద్దాయన అంతకు ముందు రోజే చనిపోయారు అని తెలిసింది. ఆయన కుటుంబ సభ్యులెవరికీ ఆయన చెప్పదల్చుకున్న వివరాలు ఏమీ తెలియవు. ఇందుతో ఆయన మా అన్నయ్య కిచ్చిన ఒక ఫొటో జతపరుస్తున్నాను. అందులో ఎవరు, ఎవరో ఎవరికీ తెలియదు. కానీ, నేను తలపాగా పెట్టుకుని, పంచెకట్టుకుంటే అచ్చు ఆ ఫొటోలో మొదటి వరస కుర్చీలలో ఎడం పక్కనుంచి మూడో పెద్దమనిషిని నేనే అని చాలా మంది భ్రమ పడ్డారు.

అదేం వేళా విశేషమో తెలియదు కానీ 2007 లో మేము మొట్టమొదటి ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు హైదరాబాద్ లో నిర్వహించినప్పుడు తణుకు నుంచి ఒకాయన ఫోన్ చేసి పదేళ్ళ వాళ్ళమ్మాయి తెలుగులో అనర్గళంగా ఉపన్యాసం ఇవ్వగలదని చెప్పి, ఆ మహాసభలలో తనకి అవకాశం ఇమ్మని కోరుతూ ఫోన్ లోనే ఆ అమ్మాయి చేత నాతో మాట్లాడించారు.  ఆ పాప పేరు శృతి. ఆ మహాసభలో తెలుగు భాష గొప్పతనం మీద అద్భుతంగా మాట్లాడి సతీ సమేతంగా బాపు-రమణ లనీ, సినారే లాంటి వారి పెద్దలనీ ఆకట్టుకుంది. నన్ను పిలిచిన ఆయన పేరు వంగూరి కిషోర్. తణుకులో లాయరు. మా ఇంటి పేరే కాబట్టి వారి పూర్వీకులు కూడా అక్కడికి దగ్గరలోనే ఉన్న సిద్దాంతం గ్రామం అని తెలియగానే ఆయన సహాయంతో నేను, మా పెద్దన్నయ్యా, ఆఖరి చెల్లెలు ఉషారేవతీ, యింకా ఇతర కుటుంబ సభ్యులమూ సిద్దాంతం వెళ్ళాం.

మా పూర్వీకుల స్వగ్రామం చూడడమే కాకుండా కూడా ఆ పెద్దాయన ఇచ్చిన ఫోటోలు, మా దగ్గర ఉన్న మరికొన్ని ఫోటోలూ కూడా పట్టుకెళ్ళి, అక్కడైనా మా ఇంటి పేరు గల వారు ఉంటే, వారి దగ్గర సమాచారం సేకరించి, మా వంశ చరిత్ర తెలుసు కుందామనీ, వీలయితే వ్రాసుకుందామూ అనీ నా కోరిక.  మొత్తానికి సిద్దాంతం వెళ్లి, అక్కడ వంగూరి వెంకట్రామయ్య గారు అనే ఆయన్ని కలుసుకుని ఆయనకీ, మాకూ తెలిసిన వంశ వృక్షం వివరాలనూ పంచుకున్నాం.  నాకు నిరాశ కలిగించిన విషయం అ పెద్దాయన మా అన్నయ్య కి ఇచ్చిన ఫోటో లో ఉన్నవారెవరూ ఆయనకీ తెలియకపోవడం. అన్నట్టు ఆయన కూడా లాయరే!. ఆయన కొడుకూ లాయరే!vanguri2_708400

రెండేళ్ళ క్రితం మా చిన్నన్నయ్య అమెరికా వచ్చినప్పుడు నేనూ, సియాటిల్ లో ఉండే మా రెండో చెల్లెలు అన్నపూర్ణా, లాస్ ఏంజెల్స్ లో ఉండే మా తమ్ముడు హనుమంత రావు ఇంట్లో ఒక వారం రోజులు మా వంశ చరిత్ర సమగ్రంగా రూపొందించే ప్రాజెక్ట్  మీద పని చేశాం. మా వంశ చరిత్ర తో మొదలు పెట్టి నా సొంత డబ్బా కొట్టుకునే స్వార్ధం నాదే అని ఒప్పేసుకుంటున్నాను.  మేము నలుగురం అన్ని వివరాలూ క్రోడీకరించుకుని , అందరిలోకీ నా ఒక్కడికే రచనా వ్యాసంగం మీద ఆసక్తి ఉంది కాబట్టి మా వంశ చరిత్ర కి అక్షర రూపం కలిగించే బాధ్యత నా మీదే పడింది.  వంశ వృక్షం రూపొందించడం, కొన్ని వందల ఫోటోలని ఒక ప్రణాళిక ప్రకారం సమకూర్చడం మా అన్నపూర్ణ కొడుకు..వంశీ (మా మేనల్లుడు) సాంకేతిక సహాయం తో మొదలుపెట్టాము.

కానీ మా అందరి దురదృష్టవశాత్తూ మేము లాస్ ఏంజెలేస్ లో కలుసుకున్న తరువాత నెల తిరగకుండానే అక్కడే తన పెద్ద కొడుకు ఇంట్లో ఉండగా మా చిన్నన్నయ్య హఠాత్తుగా గుండె పోటుతో మరణించాడు. మా తరంలో ఆయన మరణమే మా కుటుంబంలో మొదటిది.  మా చిన్నన్నయ్య పేరు ప్రభాకర మూర్తి రాజు. మా మాతామహుల పేరు. వృత్తి రీత్యా లాయరు. ఆ తరువాత మా పెద్దన్నయ్య గత సంవత్సరం నవంబర్ లో తన 80 వ ఏట కాకినాడలో పోయాడు. ఆయన పేరు సూర్యప్రకాశ రావు. మా పితామహుల గారి పేరు. వ్యవసాయదారుడు. వీరిద్దరూ మా వంశ చరిత్ర మీద చాలా ఆసక్తి ఉన్నవారు. ఇప్పుడు నేను వ్రాస్తున్న ఈ వివరాలు చాలా మటుకు వారిద్దరూ చెప్పినవే. వారికి ఈ వ్యాస పరంపర చూపించే అదృష్టానికి నేను నోచుకోలేదు.

ఇక, క్లుప్తంగా చెప్పాలంటే మా వంగూరి వారి వంశానికి మూల పురుషుడు సుమారు క్రీ. శ. 1650 ప్రాంతాలకి చెందిన సూరప రాజు గారు అని మా పరోశోధనలో తేలింది. ఆయన కుమారులలో ఒకరి పేరు బాపిరాజు గారు. మరొకరైన చిట్టెన్ రాజు గారి పేరే ఎనిమిది తరాలలో నిలబడి నాకు కూడా అదే పేరు పెట్టారు. ఆ చిట్టెన్ రాజు గారి కుమారులైన నందప్ప, రాజన్న, గోపన్న, మల్లప రాజు గార్లలో (సుమారు క్రీ. శ. 1750) మల్లప రాజు గారి సంతతే మేము.

నాలుగవ తరానికి చెందిన చిట్టెన్ రాజు (సుమారు క్రీ. శ. 1780), ఆయన కుమారులు వెంకట రత్నం, సర్వేశం, శంకరయ్య గార్లు. ఇందులో సర్వేశం గారి ఏకైక కుమారులు మళ్ళీ చిట్టెన్ రాజు గారే (సుమారు క్రీ. శ. 1840). ఆరవ తరానికి చెందిన ఈయన మా ముత్తాత గారు. అప్పటి నుంచీ మా వంశ చరిత్ర బాగానే తెలుస్తోంది. క్రీ. శ. 1820 ప్రాంతాలలో సిద్దాంతం గ్రామంలో విపరీతమైన క్షామం సంభవించింది. 1857  లో గోదావరి ఆనకట్ట కట్టిన తరువాత సర్వేశం గారు యానాం-తాళ్ళ రేవు ప్రాంతాలకి వలస పోయారు.  మా ముత్తాత గారు, ఆయన సోదరులు శంకరయ్య గారూ తాళ్ళ రేవు నుండి రంగూన్ కి ఎగుమతి-దిగుమతి వ్యాపారం చేసేవారు. కానీ ఆ వ్యాపారం ఫలించక, మా ముత్తాత గారు విశాఖ జిల్లా లోని తొండంగి గ్రామానికి నివాసం మార్చి అక్కడ సర్వేయర్ గా పనిచేసే వారు. ఆయన మొదటి భార్య జగదాంబ గారు 1868 లో ఒక మగ పిల్ల వాడిని కానీ పురిట్లోనే చనిపోయారు. మహాత్మా గాంధీ కూడా మా అదే సంవత్సరం పుట్టడం కేవలం యాదృచ్చికం. ఆ పిల్ల వాడి పేరు సూర్య ప్రకాశ రావు గారు. ఆయనే మా తాత గారు.

జగదాంబ గారు పోయిన తరువాత మా ముత్తాత గారు మళ్ళీ వివాహం చేసుకున్నారు. కానీ, ఆ సవితి తల్లి ఆదరంగా చూడని కారణం వలన మా తాత గారు పదేళ్ళ దాకా స్కూల్ కి వెళ్ళకుండా ఆట పాటల తోటే కాలక్షేపం చేసేవారు. అది చూసి “అయ్యో, శుభ్రంగా చదువుకోవలసిన కుర్రాడు పాడయిపోతున్నాడే” అని ఆయన మేనమామ గారైన కుంటముక్కల హనుమయ్య గారు వారి స్వగ్రామం అయిన దొంతమ్మూరు  (తూ.గో. జిల్లా కిర్లంపూడి దగ్గర) తీసుకెళ్ళి, తాము ధనవంతులు కాక పోయినా మా తాత గారిని స్కూల్ లో చేర్పించారు. అంత ఆలస్యంగా స్కూల్ లో చేరినా, మా తాత గారు స్వతహాగా తెలివైన వారు కాబట్టి కష్ట పడి చదువుకుని , మెట్రిక్ మొదటి రేంక్ లో పాసయ్యారు.  అది చూసి పిఠాపురం రాజా వారూ మా తాత గారికి స్కాలర్ షిప్ ఇచ్చి మద్రాసు లో లా డిగ్రీ చదివించారు. చదువుకునే రోజుల్లోనే మా తాత గారికి తాళ్లూరి వారి ఇంట పుట్టిన ఆదిలక్ష్మీ మాణిక్యాంబ గారితో వివాహం జరిగింది. ఎంతో అందంగా ఉండే మా బామ్మ గారికి నల్లగా ఉండే మా తాత గారి తో పెళ్లి చెయ్యడానికి ఎంతో తర్జన భర్జన పడినప్పటికీ, ఆయనది మహర్జాతకం కాబట్టి మా బామ్మ గారి తల్లిదండ్రులు ఒప్పుకున్నారుట.

మద్రాసులో లాయర్ డిగ్రీ పూర్తీ చేసుకుని మా తాత గారు కాకినాడలో సుమారు 1905 ప్రాంతాలలో లీగల్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అతి త్వరలోనే మొత్తం తూర్పు గోదావరి జిల్లాకే ఆయన అగ్రగణ్యుడిగా నిలిచారు.

ఆ రోజుల్లో మా తాత గారు కాకినాడ దేవాలయం వీధిలో నివసించే వారు. వారింటి వెనకాలే మా మాతామహులు నండూరి మూర్తి రాజు గారు, మా అమ్మమ్మ ఉండేవారు. అందుచేత పరిచయాలు ఉండేవి.  పెళ్ళి అయి చాలా కాలమే అయినా మా అమ్మమ్మకి అప్పటికి యింకా పిల్లలు లేరు. కానీ, మా బామ్మ గారికి  అప్పటికే ముగ్గురు ఆడ పిల్లలు. (సుబ్బలక్ష్మి, వెంకాయమ్మ, హనుమాయమ్మ). మా బామ్మ గారికి నాలుగో సంతానంగా నవంబర్ 30, 1907 నాడు  మా నాన్న గారు పుట్టారు. ఆ సమయంలో మా తాత గారు కోర్ట్ లో ఉన్నారు. కొడుకు పుట్టిన కబురు తెలియగానే, ఒక తోటి లాయర్ “ఏమోయ్ , ప్రకాశ రావూ,  ముగ్గురు ఆడపిల్లల తరువాత కొడుకు పుట్టాడు కదా. ఎలా సెలబ్రేట్ చేస్తావూ ?” అని చాలెంజ్ చేసారుట. “సరే, ఈ రోజునుంచీ బారసాల నాటి దాకా నాకు వచ్చిన డబ్బంతా బారసాల కే ఖర్చు పెడతాను” అన్నారుట మా తాత గారు. ఇక చూసుకోండి…అంతవరకు ఫీజులు ఎగ్గొట్టిన వాళ్లందరూ అర్జంటుగా చెయ్యడంతో మొత్తం ఆ పది రోజుల్లోనూ పదమూడు వేల రూపాయలు రాగా, మా తాత గారు అంతా మా నాన్న గారి బారసాల నాడు వెయ్యి మందికి పైగా అన్నదానం కింద ఖర్చు పెట్టారుట. ఈ రోజుల లెక్కలో బహుశా అది కొన్ని లక్షల రూపాయలు అవుతుందేమో!

మా నాన్న గారి తరువాత మా బామ్మ గారికి మరో ఇద్దరు ఆడపిల్లలు (సూర్య భాస్కరం, రంగనాయకమ్మ) పుట్టారు.  అంటే, మా బామ్మ గారికి, తాత గారికీ మా నాన్న గారు ఒక్కరే కొడుకు. ఐదుగురు కూతుళ్ళు(మా మేనత్తలు). మా ఆఖరి మేనత్త పుట్టినప్పుడు  ఒక చిన్న విచిత్రం జరిగింది.  ఆ రోజుల్లో, ఇప్పటికీ కొంత మంది పాటిస్తున్న ఒక ఆచారం లేదా నమ్మకం ఉండేది. అదేమిటంటే, సంతానం లేని వారు బాలింత రాలి చేత తాంబూలం, కాయం తీసుకుంటే పిల్లలు పుడతారుట. ( మా చిన్నపుడు నాకు ఈ కాయం అంటే ప్రాణం. భలే రుచిగా ఉండేది. మా ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు పురుడు పోసుకునే వారు కాబట్టి ప్రతీ రోజూ ఈ కాయం దొరికేది).  మా ఆఖరి మేనత్త పుట్టినప్పుడు , మా అమ్మమ్మ (బాపనమ్మ) మా బామ్మ (మాణిక్యాంబ) గారికి తాంబూలమూ, కాయం ఇచ్చారు.

అప్పుడుమా తాత గారు, బామ్మ గారు (సూర్య ప్రకాశ రావు గారు, మాణిక్యాంబ గారు)మా తాత గారు, బామ్మ గారు (సూర్య ప్రకాశ రావు గారు, మాణిక్యాంబ గారు) మా బామ్మ గారు “మీకు అమ్మాయి పుడితే మా అబ్బాయికిచ్చి చేసుకుంటాము” అన్నారుట. ఆ దేవుడి దయ వలనో, ఆ నమ్మక బలమో తెలియదు కానీ. ఏడాది తిరక్కుండానే , ఆగస్ట్ 11, 1916  నాడు మా అమ్మ పుట్టింది. అప్పటికే మా మూర్తిరాజు తాత గారు కాకినాడ వదిలి జేగురు పాడు వెళ్ళిపోయారు. కానీ, మా అమ్మకి పదకొండో ఏట పెళ్లి సంబంధాలు చూడడం మొ

దలు పెట్టినప్పుడు మా బామ్మ గారి మాటలు గుర్తుకి వచ్చి వంగూరి వారి అబ్బాయి కి పెళ్లి అయిందా, లేదా అని వాకబు చెయ్యడానికి మా అమ్మమ్మ తమ్ముడు (పేరు తెలియ

దు. అద్దంకి సూర్యనారాయణ మూర్తి గారు అని నా ఊహ) కాకినాడ వెళ్ళారు.  మా నాన్న గారు కొవ్వూరు లో ఏదో సంబంధం చూడడానికి వెళ్తూ , వెనక్కి వచ్చే దారిలో జేగురు పాడులో మా అమ్మని చూసి, సంబంధం ఖాయం చేసుకున్నారు. ఆ విధంగా మా అమ్మ నండూరి సర్వలక్ష్మి కే, మా నాన్న గారు వంగూరి వెంకట రామలింగేశ్వర శర్మ గారికీ ఫిబ్రవరి 28, 1926  నాడు వివాహం జరిగింది. 1932  లో మా పెద్దన్నయ్య (సూర్య ప్రకాశ రావు, మా తాత గారి పేరు ) పుట్టుక తో మా తరం మొదలయింది.

ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవలనది ఏమిటంటే, ఎంతో బీదరికం అనుభవించి, కేవలం స్వశక్తితో, లాయర్ వృత్తిలో రాణించి, లక్షల కొద్దీ ఆస్తి సంపాదించి, కొన్ని వందల మందిని చదివించి, శక్తికి మించి తృణప్రాయంగా  దాన ధర్మాలు చేసిన మా తాత గారు సూర్య ప్రకాశ రావు గారు, మా బామ్మ గారు మాణిక్యాంబ గారి పుణ్యం ఫలమే ఈనాడు సుమారు  150 పైగా ఉన్న మా సమిష్టి కుటుంబం అంతా అనుభవిస్తున్నాం.  1951 వ సంవత్సరం డిశంబర్ లో ఒకే రోజున పొద్దుట మా తాత గారూ, సాయంత్రం మా బామ్మ గారు సహజ మరణం పొందారు. అప్పుడు నాకు ఆరేళ్ళు. వారిద్దరి వర్చస్సూ , ఆప్యాయతా నాకు ఇప్పటికీ, ఎప్పటికీ, కలకాలం గుర్తు ఉంటుంది.  ఇందుతో వారిద్దరి ఫోటో జతపరుస్తున్నాను. జన్మ జన్మలకీ  వారికి నేను ఋణగ్రస్తుడనే.

 

Download PDF

12 Comments

 • “…అప్పుడు నాకు ఆరేళ్ళు. వారిద్దరి వర్చస్సూ , ఆప్యాయతా నాకు ఇప్పటికీ, ఎప్పటికీ, కలకాలం గుర్తు ఉంటుంది….” సత్యం పలికారు.

  అన్నట్టు మా ముత్తాత ఫోటో ఒకటి ఉంది మా ఇంట్లో…అలాగే ఆ కాలం ఫోటోలు ఏవీ చూసినా ప్రస్ఫుటంగా కనిపించేది “తలపాగా”. ఆ కాలంలో తలపాగా ధరించడం గౌరవానికి చిహ్నం & సర్వసాధారణం అనుకొంటాను.

 • MJ says:

  చిట్టెన రాజు గారు,

  మీ వంశ వృక్షాన్ని చాలా చక్కగా విశదీకరిమ్ చారు. గమ్మత్తుగా ఉండే మీ పేరు వెనకాల చరిత్ర ఇప్పుడు తెలిసింది.

 • Chitten Raju Vanguri says:

  ధన్యవాదాలు…సార్

 • కాస్త ఆగితే ఎవరు తొక్కుకుంటూ మనల్ని దాటుకుపోతారో అని పరుగులెట్టే ఈ కాలానికి మన మూలాల్ని పట్టిచూపే రచనలు అవసరం. ి
  సామాజిక ప్రయోజనం ఏమిటి అన్న వాదన సాహిత్యంలో వ్యాపించాకా, ఇలాంటి రచనలు (జ్ఞాపకాలు అనుభవాలు వంటి్వి కూడా) తగ్గిపోయాయి. మన దురదృష్టం కొద్దీ

  మరిన్ని ఉదంతాలు జతచేస్తే బాగుండే దనిపించింది.

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   ధన్యవాదాలు , సార్…

   బాగా తెలిసినవీ, కొంచెం కొంచెం తెలినవీ ఉదంతాలు చాలానే ఉన్నాయి….వీలున్నంత వరకూ వ్రాయడానికి ప్రయత్నిస్తాను…కానీ సంపాదకులకీ, పాఠకులకీ నచ్చకపోతే ..ఆమె సంగతులు…

   నా మాట ఎలా ఉన్నా ….పాఠకులకి వారి వారి పూర్వీకులూ…అనుభవాలూ గుర్తుకొస్తే అదే పది వేలు…

   –వంగూరి చిట్టెన్ రాజు .

 • ఎంతో బావుంది సార్. మన దేశంలో ఏది ముట్టుకున్నా బహు ప్రాచీనం అని చెప్పుక్నే అలవాటే తప్ప evarikI వెనక్కి వెళితే రెండు తరాలకి అవతల ఎం జరిగిందో తెలియదు.

  • Chitten Raju Vanguri says:

   నా జీవితంలో ఇవాళ బావుంది …నిన్న పరవా లేదు, రేపటి సంగతి ఏమిటీ..అనే తపనలో బతుకుతున్న మన సమాజంలో వెనకటి తరాలకి వెళ్ళవలసిన అవసరం,ఎవరికీ లేదేమో! కానీ ఆ అవకాశాన్ని కల్పించుకుని ఆనందించే వాళ్ళు ధన్యులు అని నా అభిప్రాయం. ఇదంతా కేవలం వ్యక్తిగత ఆనందం కోసమే. కానీ నా లాగ “సొంత డబ్బా” కి ఉపయోగించుకునే వాళ్ళు కూడా ఉంటారు. ముళ్ళపూడి గారు చెప్పినట్టు “కొందరిని ధరించాలి. మరి కొందరిని భరించాలి”

   ఇక మన దేశంలో “పాత గొప్ప” ని చెప్పుకుని యావత్ ప్రపంచంలో మనదే మొట్టమొదటి, అత్యున్నత “సంస్కృతి” అనుకునే వారిని ఒక్క సారి మన టీవీలలో కానీ , పత్రికలలో కానీ వచ్చే కొన్ని వార్తలని చూడమని చెప్పండి. నాకు అయితే సిగ్గు గా ఉంటుంది. కొన్ని విషయాలలో వేల సంవత్సరాల మన “సంస్కృతి” మనకి అందింఛినది ఇదా” అని తలుచుకుంటే భయం వేస్తుంది.

   –వంగూరి చిట్టెన్ రాజు

 • ramana baalantrapu says:

  డా. చిట్టెన్ రాజు గారు….
  చాలా ఆసక్తికరంగా ఉంది.
  పుస్తకరూపంలో తీసుకువస్తే బాగుంటుందని నా భిప్రాయం.
  భవదీయుడు
  రమణ బాలాంత్రపు
  యెమెన్

  • Chitten Raju Vanguri says:

   తప్పకుండా….కానీ దానికి ఇంకా చాలా తతంగం ఉంది కదా!

 • ఆసక్తికరంగా ఉందండి.
  రాజమండ్రి లో మా తాతగారి ఇంటెదురుగా ఓ అజ్జరపువారిల్లు ఉండేవారు. ఆయన కాకినాడ ఇంజినీరింగ్ కాలేజి ప్రిన్సిపల్ గా కూడా చేసారు. ఇప్పుడా ఇల్లు లేదులేండి. మెస్ పెట్టేసారు అక్కడ.

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   మీరు చెప్పిన రాజమండ్రి అజ్జరపు ఆయన పేరు శ్రీరామారావు. ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ గా పని చేసాడు. అతను నాకు కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ లో జూనియర్. ఇప్పటికీ చాలా మంచి మిత్రుడు. కాకినాడ వెళ్ళినప్పుడల్లా కలుస్తాం. మీ పూర్వీకుల విశేషాలు జాగ్రత్త పెట్టుకొండి.

   .
   .

 • venki says:

  నమస్కారం,
  మాది తుని దగ్గర సూరవరం అని ఒక గ్రామం .
  ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం, నా ఫ్రెండ్ ని మన ఊరిపేరు సురవరం అని ఎందుకు వచ్చింది అని అడిగితె, ఎవరో సూరప రాజు ఉండేవారంట / పరిపాలించేవారో ఇక్కడ అలా పేరొచ్చింది అని చెప్పాడు .
  అది నిజమో కాదో తెలియదు , మళ్లి చాలా సంవత్సరాలకి ఆ పేరు వింటున్నాను , అందులో ను మీ సురపరాజు గారు తొండంగి లో ఉండేవారు అని చెప్పారు , తొండంగి తుని సూరవరం వీటిలో రాకపోకలు బాగా ఎక్కువగా ఉంటాయి .
  మీకు ఏమన్నా పనికొస్తుందేమో అని చెప్తున్నాను .

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)