చిన్నోడి అమ్మ

RaviVerelly (2)
 
ఖాళీ అయిన కేరింతల మూటలు విప్పుకుంటూ 
బావురుమంటున్న ఇంటి ముందు
 
లోకంలోని ఎదురుచూపునంతా
కుప్పబోసి కూర్చుంటుందామె.  
 
పసుపు పచ్చని సీతాకోక చిలుక
పంచప్రాణాలని మోసుకొచ్చే వేళయింది.
 
పాలపుంతల నిడివి కొలిచొచ్చినంత గర్వంగా
విచ్చుకున్న రెప్పల్లొంచి వ్యోమగామిలా దిగుతాడు వాడు.
  
ఏళ్ళ ఎదురుచూపులు
ఆత్మల ఆలింగనంలో  
చివరి ఘట్టాన్ని పూర్తిచేసుకుని 
పలకరింతల పులకరింతలు ఇచ్చిపుచ్చుకుంటాయి
 
ఊరేగిస్తున్న దేవుని పల్లకి
భక్తుల భుజాలు మారినంత పవిత్రంగా
పుస్తకాల సంచి భుజాలు మారుతుందప్పుడు.
 
నాలుక రంగు చూడకుండానే
 ఐస్క్రీమ్ బార్ తిన్నాడో
పసిగట్టే ఆమె కళ్ళు
లంచ్ బ్యాగు బరువు అంచనా వేసి తృప్తిగా నవ్వుకుంటాయి.
 
వాడు  దార్లో పాదం మోపుతాడో తెలీక
రోడ్డుకీ ఇంటికీ ఉన్న  మాత్రం దూరం
లెక్కలేనన్ని దార్లుగా చీలి ఆహ్వానిస్తుంది.
poem (2)
 
ఆమె వెనకాలే వస్తూ వస్తూ
తలలెత్తి చూస్తున్న గడ్డిని ఓసారి పుణికి
చెట్టుమీని పిట్టగూట్లో గుడ్ల లెక్క సరిచూసుకుని 
ముంగిట్లో కొమ్మకు అప్పుడే పుట్టిన గులాబీకి ముద్దుపేరొకటి పెట్టి
నిట్టాడి లేని దిక్కుల గోడలమీద
ఇంత మబ్బు ఎలా నుంచుందబ్బా అనుకుంటూ
అటు ఇటు చూస్తాడు.  
 
అంతలోనే 
పొద్దున్నే వాణ్ని వెంబడించి ఓడిపోయిన
తుమ్మెదొకటి
కొత్త పూలను పరిచయం చేస్తా రమ్మని
ఝూమ్మని వానిచుట్టూ చక్కర్లు కొడుతుంది.
 
పసిపిల్లల చుట్టే తుమ్మెదలెందుకు తిరుగుతాయోనని 
ఆమె ఎప్పట్లాగే ముక్కున మురిపెంగా వేలేసుకుని
వాణ్ని ఇంట్లోకి పిలుస్తుంది.
 
పొద్దున్న ఆమె అందంగా రిబ్బన్ ముడి వేసి కట్టిన లేసులు
వాడు హడావిడిగా విప్పి 
చెవులు పట్టి సున్నితంగా కుందేళ్ళను తెచ్చినట్టు
అరుగు మీద విప్పిన బూట్లను ఇంట్లోకి తెస్తాడు.
 
దాగుడుమూత లాడుతూ
బీరువాలో దాక్కున్న పిల్లోనిలా
ఇంట్లో ఉన్న ఆటబొమ్మలన్నీ
వాడి పాదాల సడి కోసం
చెవులు రిక్కించి వింటుంటాయి.
 
పువ్వుమీద తుమ్మెద లాండ్ అయినంత సున్నితంగా
వాడు ఆమె వొళ్ళో వాలిపోయి 
కరిగించి కళ్ళ నిండా పట్టి మోసోకోచ్చిన క్షణాల్ని
జాగ్రత్తగా
ఆమె కాళ్ళ ముందు పోసి పూసగుచ్చుతాడు.
 
ఆమె ఎప్పుడో నేర్చుకుని మరిచిపోయిన
కొన్ని బతుకు పాఠాల్ని
మళ్ళీ ఆమెకు నేర్పుతాడు
 
తిరిగి ప్రాణం పోసుకున్న ఇల్లుతో పాటూ
ఆమె అలా వింటూనే ఉంటుంది
తన్మయత్వంగా.
 
 
(స్కూల్ బస్సు కోసం రోజూ ఇంటిముందు కూర్చుని ఎదురుచూసే చిన్నోడి అమ్మకు)
చిత్రం: జావేద్
Download PDF

27 Comments

  • స్వాతీ శ్రీపాద says:

    రవి గారు
    మాటలు చాలవు కవిత ఎలా ఉందో చెప్పేందుకు

  • Narayana says:

    రవి గారు,

    అద్భుతమైన కవిత్వం చెప్పారు.
    ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం స్కూల్-బస్ ల దగ్గర తల్లుల మనోభావలతో పాటు,
    పసిడి పసి బాల్యం గురించి హృద్యంగా హత్తుకునేట్టు కవితను అలవోకగా రాసేశారు.
    అభినందనలు.

    చాలాబాగుంది.

    నారాయణ గరిమెళ్ళ.

  • Narayana says:

    కవితకు జావేద్ గారు గీసిన చిత్రం
    కవితంత శోభాయమానంగా బాగుంది.

    నారాయణ గరిమెళ్ళ.

  • Saikiran says:

    చిన్నోడి వెనకాలే పరుగులెత్తిస్తూ చదివిస్తున్నదండి ఈ కవిత.
    ఒక సన్నివేశాన్ని ఇలా కవిత్వాత్మకంగా ఎలా చెప్పవచ్చో అనేదానికి ఈ కవిత ఓ పాఠం.

  • జ్ఞాన చక్షువుతో పరిశీలన, సన్నివేశాన్ని కవిత్వీకరించే విధానం తెలిసుండటం (దాదాపు ప్రతీ కవితలొను ఉండే విషయం అందరికీ తెల్సినవె) కవికుండాల్సిన కనీసార్హతలు, దీనికితోడుగా భాషపై అధికారం, పట్టు- ఇవన్నీ మీకు పుష్కలంగా ఉన్నాయి. ప్రతీ వాక్యం చదివించేదిగా ఉంది…మంచి కవితని అందించారు రవీ.మళ్ళీ మీ దూపలొని కొన్ని కవితలు గుర్తొచ్చాయి..

  • dasaraju ramarao says:

    పువ్వుమీద తుమ్మెద లాండ్ అయినంత సున్నితంగా…’ లాండ్ ‘అనే ఒక్క పదం చేర్చి ఆ వాక్యాన్ని ఎంత రసాత్మకం చేసారో- .బాల్యం ఎంత మార్ధవమైనదో , చేష్టలెంత అబ్బురమైనవో, తల్లీ బిడ్డల ప్రపంచమెంత తాదాత్మకస్థాయిని మీటేదో , ఏ ఈర్షాళువు సోకని ఆ జగత్తుని అధ్బుతావిశ్కరణ గావించారు రవివీరెల్లి గారూ , సంతృప్తి గా అభినందనలు…

  • Prasuna says:

    చాలా చాలా బాగుందండి కవిత.

  • అద్భుతం . ఎంత బాగా చెప్పారు చిన్నోడి గురించీ .. వాడి అమ్మ గురించీ . అభినందనలు

  • సో క్యూట్ స్వీట్ సింపుల్ పోయెం రవి గారూ..

    మా పిల్లల తోటి ఆడి వాళ్ళ చిన్నతనం తో చిగురించిన మనసు రోజులు గుర్తొచ్చాయి.. మిస్ దోస్ డేస్…

  • సింపుల్ స్వీట్ క్యూట్ పోయెం రవి గారూ..

    పిల్లల చిన్నతనం లో మనసు ఆనందపడిన పసితనం గుర్తొచ్చింది

  • K.Geeta says:

    బడి నుంచి ఇంటికి వస్తూన్న పిల్లాడి కోసం అమ్మ ఎదురుచూపు కవిత చదివి,నాకు నా కవిత “బడి పాపాయి” (http://kalageeta.wordpress.com/2010/11/19/%E0%B0%AC%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%AA%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF/)
    రాసినప్పటి దృశ్యాలు కళ్ల ముందు నిలిచాయి. మా పెద్దాడిని మొదటి సారి బళ్లో దింపి, ఇంటి కొచ్చి వెక్కి వెక్కి ఏడ్చిన పసి తనం జ్ఞాపకం వచ్చింది. పిల్లలు బడికెళ్లేది కాస్సేపే అయినా ఎన్నో రోజులు అయిపోయినట్లు కలిగే అమ్మ మనస్సు లోని సున్నితమయిన బాధని ఎంత బాగా పట్టుకున్నారు!!! కవిత ‘చాలా బావుంది’ అనేది చాలా చిన్నమాట-

    అయితే కవిత ముగింపు వాక్యం చమక్కు వెలిగినట్లుంటే ఇంకా బావుంటుందేమో- ఒక్కసారి చూడండి-
    అభినందనలతో
    – కె.గీత

  • ns murty says:

    రవి గారూ,

    మీ కవితలో చెప్పిన సున్నితమైన భావాలతో పాటు, కవితలో మీరు create చేసిన ambiance చాలా చక్కగా ఉంది.

    అభినందనలు.

  • చాలా బావుంది రవి గారు!

  • పసిపిల్లాడి మనసు తల్లి ప్రేమ రెండూ రంగరించి అల్లిన తీరు చాలా నచ్చింది సార్.. హృద్యంగా వుండి మనసును తేలిక పర్చింది.. అభినందనలతో..

    వర్మ..

  • కోడూరి విజయకుమార్ says:

    రవీ!
    స్కూలు నుండి వొచ్చే పిల్లాడి కోసం ఎదురు చూసే తల్లిని, ఆ తల్లి చెంతకు చేరే పిల్లాడిని, ఎక్కడా కవిత్వాంశ లుప్తమవకుండా, ఒక దృశ్య కావ్యంలా ఈ కవిత రాసారు… అభినందనలు!

  • Manasa Anil says:

    పసివాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం అర్థం చెసుకోలేని అద్భుతమైన ఆకర్షణ ఏదో ఉన్నట్టే, మీ ఈ కవితలోనూ గొప్ప సౌందర్యం కనపడుతోందండీ!

    ముఖ్యంగా “చెవులు పట్టి సున్నితంగా కుందేళ్ళను తెచ్చినట్టు” – వాహ్! What an expression!
    ఇక – ఈ రెండు పాదాలూ చదివి అవాక్కైపోయానంతే..

    “ఊరేగిస్తున్న దేవుని పల్లకి
    భక్తుల భుజాలు మారినంత పవిత్రంగా
    పుస్తకాల సంచి భుజాలు మారుతుందప్పుడు.

    నాలుక రంగు చూడకుండానే
    ఏ ఐస్క్రీమ్ బార్ తిన్నాడో
    పసిగట్టే ఆమె కళ్ళు
    లంచ్ బ్యాగు బరువు అంచనా వేసి తృప్తిగా నవ్వుకుంటాయి.”

    చిన్నోడి నాన్న కూడా అమ్మైన క్షణాలివి :))) ( Or he is also an excellent husband sharing his wife’s feelings to this extent) :p
    Thanks a lot!

  • రమాసుందరి says:

    చాలా బాగుంది.

  • సాయి పద్మ says:

    ఆమె వెనకాలే వస్తూ వస్తూ
    తలలెత్తి చూస్తున్న గడ్డిని ఓసారి పుణికి
    చెట్టుమీని పిట్టగూట్లో గుడ్ల లెక్క సరిచూసుకుని
    ముంగిట్లో కొమ్మకు అప్పుడే పుట్టిన గులాబీకి ముద్దుపేరొకటి పెట్టి
    నిట్టాడి లేని దిక్కుల గోడలమీద
    ఇంత మబ్బు ఎలా నుంచుందబ్బా అనుకుంటూ
    అటు ఇటు చూస్తాడు. ..

    అబ్బా ..ఎంత గొప్ప భావం అండీ .. ఇవాల్టి పిల్లల కి అవి తెలుసో లేదో ..నాకు అవగాహన కి అందదు గానీ.. గొప్ప మార్దవమైన భావన .. కొన్ని , ఇంగ్లీష్ పదాలు లేకుండా ఉండే కవిత ఇంకా బాగుండేడెమో .. మీరు అంతకన్నా సున్నితమైన తెలుగు పదాలు రాయగలరు కాబట్టి . కొన్ని వాక్యాలూ, పదాలూ ..అలా గుర్తుండే మంచి కవిత.

  • Praveena says:

    ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను….
    “ఊరేగిస్తున్న దేవుని పల్లకి
    భక్తుల భుజాలు మారినంత పవిత్రంగా
    పుస్తకాల సంచి భుజాలు మారుతుందప్పుడు”….ఎంత నిజం కదూ!
    “లంచ్ బ్యాగు బరువు అంచనా వేసి తృప్తిగా నవ్వుకుంటాయి.”…. లంచ్ తినకుండా వచ్చిన నాడు చిన్న బుచ్చుకునే తల్లి మనసు. అయ్యో లంచ్ తినలేదే అని డిన్నర్ లో ప్లేట్ నిండా అన్నం కలిపి తినిపించేయ్యాలనుకునే పిచ్చి తల్లి మనసు.
    …. ఇలా రాస్తూ పొతే ప్రతి వ్యాక్యానికి నా అనుభవాన్ని జత చెయ్యగలను.
    చాల చాలా బాగుంది రవి గారు.

  • మధురమైన భావలాలిత్యం, ఆత్మీయతను సున్నితంగా, సుందరంగా ప్రదర్శించిన తీరు బాగున్నాయి.

  • కవిత చదివి ఎంతో ఆత్మీయంగా స్పందించిన మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. మీ ఆశిస్సులు, సూచనలు నాకెంతో విలువైనవి.

    ప్రచురించిన సారంగ సంపాదకులకు, బొమ్మ గీసిన జావేద్ గారికి ధన్యవాదాలు.

  • veldandi Sridhar says:

    బాల్యపు సీతకోక చిలుకల తోటలో సంచరిన్చినట్టుగా ఉంది. ప్రతీ పాదం ఒక గొప్ప అనుభూతిని పంచుతుంది. అమ్మ చేతి పాల గోకు తిన్నట్టుగా ఉంది. లేత పాదాల తడి హృదయాన్ని ఆవరించినట్టుగా ఉంది.
    అభినందనలు…. వెల్దండి శ్రీధర్

    • శ్రీధర్ గారు,
      చాలా థాంక్స్.

      “పాల గోకు” ఈ పదాన్ని ఎన్నాళ్ళకు విన్నా. అమ్మ, ఊరు గుర్తొచ్చాయి.

      ఇప్పుడు మైక్రోవేవ్ లో జీరో పర్సెంట్ పాలను ఎంత వేడి చేసినా ఏముంది :-) “పాల గోకు” లేదు “పాల గోకు” ను గీకి తీసే ఆ గవ్వా లేదు ఇప్పుడు.

  • Mohanatulasi says:

    splendid poetry Ravi garu!

  • రుషులు లౌకిక సంబంధాలను తెంచుకున్న వారు. కవి అలా కాదు మన మద్యనే ఉంటూ..మన లాగే ఆహార విహార వ్యవహారాదుల్లో పాల్గొంటున్నట్లు పాల్గొంటూనే..మన కన్నా విభిన్నంగా లోకాన్ని దర్శించ గల సమర్థత కలవాడు. కవుల కళ్ళకు గుండెకాయలూ..గుండెకాయలకు కళ్లూ వేళ్లాడుతుంటాయి కాబోలు. మన రాతల్లో మామూలుగా శబ్దించే అక్షరాలు.. వాటి అర్థాలు.. కవి చేతిల్లో సీతాకోక చిలుకలెలా అవుతాయో! ‘నాన్ రుషిః కురుతే కావ్యమ్’ అన్న వాక్యం నిజమైతే కావచ్చు కానీ.. అది సంపూర్ణ సత్యమేనా? రుషి మార్గం లోకి మనం ప్రయత్న పూర్వకంగా నడవాలి. కాస్త కనుసైగ చేస్తే చాలు కవి ఒక స్నేహితుడికి మల్లే మన మార్గంలోకి వచ్చి మనతో కలిసి నడిచినట్లే నడుస్తూ.. మనతో ముచ్చట్లాడుతున్నట్లే ఉంటుంది. ఆ ప్రయాణంలో మనం చేరే గమ్యం మాత్రం మనం వంటరిగా వెళితే సొంతంగా అనుభవమయ్యేది కాదు. కవి చూపించే ఆ కొత్త లోకాన్ని చూసి ఆశ్చర్య పోతాం. మన కళ్లకు ఆ రంగులు అంతకు ముందు ఎందుకు కనిపించలేదో కదా అనిపిస్తుంది! కల్పనా?భాషా?భావమా? కవి ఏ మంత్రదండంతో మనకో కొత్త బంగారులోకాన్ని చూపించేది? కల్పన ఐతే కావచ్చు కాని.. అది మరీ చిన్నతనంలో అమ్మ చెప్పే’రాజు-రాణి’ కథల్లోని స్వర్గలోకమో.. అక్కడి దాకా పాకే పూలచెట్టు తీగో కాదు. వేళ్ళు భూమిలోనే వుంటాయి.. చిగుళ్ల చివళ్ళకు మాత్రం తారా సందోహం తళతళలాడుతో వేళాడుతుంతుంది. పోనీ..భాష అందామా? సాధారణంగా మనలో మనం మాట్లాడుకునే ముచ్చట్లే .. కొట్లాడుకునే ఆ పదాలతోనే కవి సుందరమైన ప్రేమ సుమమాలలను పరమ అందంగా అల్లేస్తాడు మరి. వింతంతా భావంలో దాగుండే భేదమేనేమో! మన కళ్ళకు మామూలుగా కనిపించే పచ్చ రంగు స్కూలు బస్సు కవి కళ్ళకు ‘పసుపు పచ్చని సీతాకోక చిలుక’ మల్లే కనిపిస్తుంది. బడి నుంచి తిరిగి వచ్చిన మన పిల్లవాడు మనకు ‘బడి నుంచి నలిగి వచ్చిన పిల్లవాడే’. కవికో? ‘పాలపుంతల నిడివి కొలుచుకుని వస్తున్న వ్యోమగామి’. కవి ఒక సారి మనకి చెవిలో ఆ రసరహస్యం ఊదేసినాక ఇహ ఎప్పుడు ఎక్కడ ఏ పచ్చ స్కూలుబస్సు కంటబడ్డా సీతాకోక చిలుకమల్లే అనిపించడమే కాదు.. సీతాకోక చిలుక అగుపించినా.. పిల్లల పచ్చ స్కూలుబస్సే గుర్తుకొస్తుంది. నగ్నంగా..సూటిగా..కట్టె విరిచి పొయిలో పెట్టినట్లుగా చెబితే అది కవిత్వమెలా అవుతుంది? భావన ఒక మిఠాయి ఐతే.. ఆ మిఠాయికి చుట్టిన రంగు రంగుల కగితం కవి ఎంచుకునే పదాలు. శ్రవణానందాన్నందించే అందమైన ఆడపిల్ల ముంజేతి కర కంకణం నిర్మాణానికి స్వర్ణకారుడు కర్మాగారంలో ఊక పొయ్యిసెగ వేడిమిని ఎంతలా సహిస్తో ఇంతింతి చిన్ని చిన్ని బంగారు రంగు రాళ్ళను, రజను పొళ్ళను గాజుల మీద లక్క మైలుతిత్త మిశ్రమాలతో కలిపి పొదుగుతాడో! నవమాసాలు నానాఅవస్థలు పడ్డా, పండంటి బిడ్డ కంటపడి.. పదిమంది నోటా బంగారు కొండ అనిపించుకుంటే చాలు.. పురిటి నొప్పులన్నీ ఇట్టే చప్పున మాయమై పోతుంది తల్లి మనసు. కవి మనసూ అంతే. పురాణ కవితో.. ప్రబంధ కవితో.. భావ కవితో..అభ్యుదయ కవితో.. విప్లవ కవితో.. భావం- సందర్బాన్ననుసరిస్తో సాగిస్తున్న మహా ప్రస్థానంలో ప్రస్తుతం నడుస్తున్నది వైయక్తిక..విశ్వాత్మక.. అనుభవాత్మక.. నిరలంకారిక.. నిరాడంబర పద.. అతి నూతన భావాత్మక ..ద్వన్యాత్మక.. అన్యాపదేశ.. వ్యక్తీకరణే ఆధునికాంతర ధోరణి అనుకుంటే..ఈ లక్షణాలన్నీ సలక్షణంగా పుణికి పుచ్చుకున్న అక్షర కణిక రవి వీరెల్లి ‘చిన్నోడి అమ్మ’

    ఉదయం ఎనిమిదింటికేమో పిల్లాడిని ముస్తాబు చేసి బడి బస్సెక్కించిదా తల్లి. ఏళ్ళతరబడి ఎదురు చూపులు ఎలా అవుతాయో?!.. అని మనమా ఆశ్చర్య పోతుంటామా.. ‘ఏళ్లేమిటి.. యుగాలవాలి కాని’ అని ఆ అమ్మ మనసనుకుంటుంది!ఆషాఢ మాస ప్రథమ దివసాన ఆకాశ మార్గాన సాగే కారు మేఘాన్ని చూసిన యక్షుడి మనసును కాళిదాసు ఆవహించినట్లు.. ఆ తల్లి చిత్రమైన మనసులోకి విచిత్రంగా పరకాయ ప్రవేశం చేయగలిగాడు కనకనే రవి పుస్తకాల సంచిని ఉరేగే దేవుని పల్లకీగా మార్చేసి తల్లి బిడ్డల్ని భుజాలు మార్చుకునే భక్తులుగా చూడ గలిగాడు. రావాల్సిన బస్సు కొసం ఎదురుతెన్నుల చూసే తల్లి ఆ నిలువు కాళ్ల ఉద్యోగం నిర్వహించే ఆ కాస్సేపూ ఖాళీగా ఉండలేక పోవడం, ఖాళీ కేరింతల మూటలు విప్పుకుంటూ బావురుమంటున్న ఇంటి ముందు.. లోకంలోని ఎదురుచూపునంతా కుప్పబోసి కూర్చోనుండటమూ.. ఇదంతా మరేమిటి?తల్లి బిడ్డలంటే ఒకే పేగుకి రెండు తలలు కదా! తప్పక అవి విడిపోయినా..తిరిగి కలిసినప్పుడు మాత్రం ..ఒకే ఆత్మ రెండు ముక్కలు పునరాలింగనం చేసుకున్నట్లే ఉంటాయి మరి. విడిపోయి గడియయిందా..యుగమయిందా..అన్నది కాదు లెక్క.. అరనిమిష విరహానంతర దశా ఆత్మల ఆలింగనాలంత గాఢంగానే ఉంటుంది కాబోలు. ‘ఆత్మల ఆలింగనం’ అన్న పదబంధం ఎంచుకోవడంలోనే కవి ప్రతిభ కనబడుతోంది. ఒక దశ దాకా ‘పిల్లవాడిని గురించి పిల్లవాడికన్నా ఎక్కువ తెలిసుండేది తల్లికే’ అన్నది మానసిమశాస్త్రవేత్తలూ ఒప్పుకుంటున్న సత్యం. ఆ ‘పసుపు పచ్చని సీతాకోక చిలుక..పంచప్రాణాలని మోసుకొచ్చే వేళలో పాలపుంతల నిడివి కొలిచొచ్చినంత గర్వంగా.. విచ్చుకున్న రెప్పల్లొంచి వ్యోమగామిలా దిగే చిన్నోడిని ఆత్మాలింగనం చేసుకుంటో పలకరింతల పులకింతలతో పాటు దేవుడి పల్లకీలాంటి పుస్తకాల సంచీనీ భుజం మార్చుకుని ఇంటి దేవాలయం వేపుకి సాగివచ్చే ఆ చిన్నోడిని.. ఆ అమ్మచిన్నోడిని చూసీ చూడంగానే..రాసుకున్నవీ నాలుగు ముక్కలు. పసివాడి నాలుక రంగు చూడకుండానే ఏ ఐస్క్రీమ్ బార్ తిన్నాడో పసిగట్టే తల్లి కళ్ళలోని ఆ మెస్మరిజం లాంటిదేదో.. మంచి కవిత్వం కంటపడగానే మురిసిపోయే నా మానసునూ ఆవరించి ఉండాలి.
    రవి కవితకు ఇది విశ్లేషణ అనడం పెద్ద మాట. నా ‘స్పాంటేనియస్ రియాక్షన్’ అని సరిపెట్టుకుంటే సరి పోతుంది. రాసి చాలాకాలమైనా ప్రకటించక పోవడానికి నాసహజ లక్షణమైన బద్ధకం ఒక పెద్ద కారణం. అసమగ్రమే ఐనా ఈ రాతకీ మాత్రమైనా వెలుగు చూపించకపోతే రవి ప్రతిభకు వచ్చే లొటేమీ లేదు కానీ..నా ‘పాటు’ వృథా ఐపోతుందేమోనని స్వార్థం. నా సాహసానికి మన్నించి..నా తప్పుల్ని సహించమని విజ్ఞులకి విన్నపం.
    ‘చిన్నోడి అమ్మ’ అమ్మ రవి వీరెల్లికి ఆలస్యంగానైనా అభినందనలు. ఇంత మంచి కవిత చదివించినందుకు ‘సారంగ’కు డిలేడ్ ధన్యవాదాలు.

  • Garimella Nageswararao says:

    చాలా బాగుంది…పసితనం లోనికి..అమ్మ మనసలోనికి ఒకేసారి పరకాయ ప్రవేశం చేసి రాసినట్టు వుంది అభినందనలు

  • kalyani vutukuri says:

    చాల బావుంది

Leave a Reply to సాయి పద్మ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)