గాలిబ్ తో గుఫ్తగూ

saif
గాలిబ్
ఇంకా సముద్రాల్లో ఆటుపోట్లు వస్తున్నాయ్
ఇంకా పువ్వుల చుట్టూ భ్రమరాలు తిరుగుతున్నాయ్
ఆకాశం ఇష్టమొచ్చినప్పుడు రంగులు మార్చుతూనే ఉంది
విత్తనం పగిలితేనే ఇంకా పచ్చని మొక్క పుడుతుంది
గాలిబ్ ,
చీకటి ఇంకా నల్ల  బుర్ఖా వేస్తూనే ఉంది
దానికోసమే మిణుగురులు రోజంతా ఎక్కడో పడుకుంటున్నాయ్.
ఎంత ఎత్తున కట్టుకున్నా కాని
పిల్లగాలి ఇంకా కిటికి రెక్కలతో ఆడుకుంటూనే ఉంది
రాజరికం ఇప్పుడు లేదు కాని
ఇంకా అదే బీదరికం ఉంది .
గాలిబ్
నీ కవితలు ఇంకా దునియా చదువుతూనే ఉంది
ఐనా జిందగీలో జర్గాల్సినదేదో జరిగిపోతూనే ఉంది .
వర్షం వస్తే ప్రతి గోడ తడుస్తూనే ఉంది .
జలుబు కు ఇప్పుడు కూడా ఏదో ఒకటి మందు దొరుకుతూనే ఉంది
గాలిబ్,
నీ గాయాల వారసత్వం కొనసాగుతూనే ఉంది
ఇంకా గులాబి కొమ్మలకు ముళ్ళు పుడుతూనే ఉన్నాయ్ .
ముళ్ళ కంచెల్ని వాటేసుకోని పూల తీగలు బతుకుతూనే ఉన్నాయ్ .
నువ్వు లేవు అంతే ,మనుషులేం మారలేదు
జాబిల్లిలో కూడా  అదే పాత పరివర్తన వస్తూ పోతూ ఉంది .
గాలిబ్ ,
వంటవాడే మొదట రుచి చూస్తున్నాడు
పంటలేసినవాడే కోసేస్తున్నాడు
ధర్మ ప్రచారం బాగానే జరుగుతుంది
గడియారం తన ముళ్ళను తిప్పుతూనే ఉంది
గాలిబ్ ,
ఊరకనే అంతా లభిస్తుంది .
ఊరకనే అంతా పోతుంది .
దీపం చుట్టూ ఇంకా చీకటి ఉంటూనే ఉంది
ఎక్కడినుంచో ఓ కోకిల ఇంకా పాడుతూనే ఉంది
గాలిబ్ ,
అందమైన మధుపాత్రలు ఎన్నో తయారవుతూనే ఉన్నాయ్
ఎన్ని పూలతో కలిపిఉంచినా కాని వాటితోనే
మల్లెలు ఉదయానికి వాడిపోతున్నాయ్
గాలిబ్
ముందు సీట్లు ఖాలీగా ఉన్నా కాని
కొంతమంది ఇంకా వెనక నిలబడే
నీ షాయరి వింటున్నారు  .
నువ్వు వెతుకుతూ వెతుకుతూ పొయినదాన్నే
వెతుకుతున్నారు .
ఇంకా అసలైన సత్యం ఏదో దొరకలేదు .
గాలిబ్ ,
చీకటి వెలుతురులోకి
వెలుతురు చీకటిలో కి మారుతూనే ఉన్నాయ్
ఇంకా ఒకరికి ఒకరు గానే ఉంటున్నారు
శ్వాసలు లేకపోతే దేహాలు చెదలుపట్టిపోతున్నాయి.
Download PDF

15 Comments

 • mercy margaret says:

  బాగా రాసారు సైఫ్ గారు
  చీకటి ఇంకా నల్ల బుర్ఖా వేస్తూనే ఉంది
  దానికోసమే మిణుగురులు రోజంతా ఎక్కడో పడుకుంటున్నాయ్.
  – – –
  ఇంకా గులాబి కొమ్మలకు ముళ్ళు పుడుతూనే ఉన్నాయ్ .
  ముళ్ళ కంచెల్ని వాటేసుకోని పూల తీగలు బతుకుతూనే ఉన్నాయ్ .
  ——
  వర్షం వస్తే ప్రతి గోడ తడుస్తూనే ఉంది .
  జలుబు కు ఇప్పుడు కూడా ఏదో ఒకటి మందు దొరుకుతూనే ఉంది
  సూపర్బ్ సైఫ్ జీ

 • సాయి పద్మ says:

  వంటవాడే మొదట రుచి చూస్తున్నాడు
  పంటలేసినవాడే కోసేస్తున్నాడు
  ధర్మ ప్రచారం బాగానే జరుగుతుంది
  గడియారం తన ముళ్ళను తిప్పుతూనే ఉంది

  ఈ బేషరం అన్నీ చూస్తున్నాడు.. గాలిబ్ .. ఇది గుఫ్తగూ కన్నా ఎక్ జిందా దిల్ షాయర్ కీ సునేహరీ ధడకన్ లా ఉంది .. ఎక్కువ చదవకూడదు బాబోయ్ .. నిజమైన బేషరం అయిపోతాం .. బహుత్ ఖూబ్ సైఫ్ భాయి .. జలుబుకి మందంత ఖూబ్ ..

  • ఎక్కువ చదవకూడదు బాబోయ్… నిజమైన బేషరం ఐపోతాం
   హహహహ
   నా కవితల గురించి చాలా చాలా కాలానికి
   మళ్ళీ ఈ వాక్యం విన్నాను
   సచ్ హై .
   అఫ్సర్ భాయ్ కు షుక్రియ చాలా కాలానికి ఓ పత్రికకు రాయాలి అనిపించింది

 • బేషరం: నువ్వు రెండు పాదాలతో వస్తావో, పది పాదాలతో వస్తావో…వచ్చినప్పుడల్లా గుండెంత ప్రేమని తీసుకొస్తావ్…గుప్పెడు అక్షరాల్లో కొండంత భావాన్ని తుపానులా దాచుకోస్తావ్…రాయరా బాబూ…రాయ్…ఇలాగే రాయ్..

  ముఖ్యంగా ఈ లైన్లు కేవలం నావి…నా కోసమే నువ్వు రాసినవి…అవునా?

  నీ గాయాల వారసత్వం కొనసాగుతూనే ఉంది
  ఇంకా గులాబి కొమ్మలకు ముళ్ళు పుడుతూనే ఉన్నాయ్ .
  ముళ్ళ కంచెల్ని వాటేసుకోని పూల తీగలు బతుకుతూనే ఉన్నాయ్ .
  నువ్వు లేవు అంతే ,మనుషులేం మారలేదు

  • అఫ్సర్ భాయ్
   నిస్సందేహంగా
   చాలా కాలం తరువాతా
   ఇది మాత్రం మీ కోసమే
   మీరే రాయించారు
   నేను మీకెంతో షుక్రియాలు చెప్పుకోవాలి
   షుక్రియాలు అంటే దువాలు
   దువాలు అంటే శుభాలు కోరుకోవడం
   ఆమీన్

   ఇన్షాల్లాహ్
   కొత్త చిగుర్ల గురించి రాస్తుంటాను .

 • రవి says:

  పోయెమ్ భలే ఉంది! చాలా నచ్చింది.
  “ముళ్ళ కంచెల్ని వాటేసుకోని పూల తీగలు బతుకుతూనే ఉన్నాయ్.” నచ్చింది.

 • ns murty says:

  Gorey Saif Ali,

  ఇది చాలా అపురూపమైన రచన. అద్భుతంగా ఉందనడం కూడా Understatement.
  నా హృదయపూర్వక అభినందనలు.

 • buchireddy gangula says:

  సలాం –అలీ గారు
  పోయెమ్ బ్రహ్మాండం గా ఉంది –సర్

 • ఈ మధ్యకాలంలో నేను ఇష్టపడిన కవితల్లో గొప్పకవిత ఇదేనేమో,..చాలాచాలా బాగుంది,..కొద్దిగా ఖాదర్ మోహిద్దిన్ గారి నేను – నా దేవుడు ఛాయలు కనిపిస్తున్నప్పటికి,..

 • Praveena says:

  భేషరం..అధ్బుతం.

 • మూర్తి గారితో గొంతు కలుపుతున్నా. ‘అద్భుతంగా ఉందనడం Understatement

 • Mohanatulasi says:

  Each line is a fine stroy ….very sensitive one…and truly good one !

 • Dr.Ismail says:

  Excellente! Saif bhai.

 • Prasuna says:

  saif జీ, చాలా అద్భుతమైన కవిత. ఈ కవితకు అఫ్సర్ గారి కామెంటు మరో అలంకారం.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)