భార్య-భర్త

teyaku6

samanya column1చిటపట చిటపట , దభ దభ దభ దభ మని వానలు మొదలయ్యాయి. తీస్తా నది అమ్మ పెట్టే బువ్వకి నోరు తెరిచే బుజ్జి పాపాయిలా, పరుగులు పెట్టే చిన్ని బంగారు బొమ్మలా గలగలమంటూ నిండుగా పొంగి పొంగి పారుతోంది.

ఆ నదికి అటువైపొక ఊరు, ఇటువైపొక ఊరు.

అటువైపు ఊరినుండి ఒక అబ్బాయి బంధువులతో కలిసి పడవెక్కి పెళ్లిచూపులకని ఇటువైపు ఊరికొచ్చాడు. అబ్బాయి వచ్చేసరికి పెళ్ళికూతురు కాబోతోన్న ఆ పదేళ్ళ అమ్మాయి బుజ్జి మేకనొకదాన్ని తల్లి వద్ద కూర్చుండబెట్టి నాకు ఆకలి కాలేదు మొర్రో అంటున్న దాని నోరు తెరిచి ,తల్లి మేక రొమ్మును  నోట్లో కూరుతోంది.

పిల్లని చూడ వచ్చిన అబ్బాయి వయసు ఇరవై రెండేళ్ళు. అతగాడి చూపుడు వేలు పట్టుకు నిలుచున్న అతని కడగొట్టు తమ్ముడి వయసు పదేళ్ళు.
ఇచ్చి పుచ్చుకునే లెక్కల మాటలు అయ్యాక ,మరో మూడువారాలకి అమ్మాయి ఊరిలో వారి ఆకాశపు చంద్రుడు నడి ఆకాశానికి చేరి నిక్కి నిక్కి చూస్తుండగా ఘుమఘుమ మని పరిమళమై విరగబడుతున్న కడిమి పూల చెట్టు కింద ,అబ్బాయి అమ్మాయి మెడలో మంగళ సూత్రాలు వేసేసాడు.

మరి కొన్ని రోజులకి పెట పెట మంటూ ఉబ్బమారి ఎండాకాలం వచ్చి పడింది.

తాటితోపుల్లో  నల్లటి కాయలు నిగ్గుదేలి , తియ్యటి వాసనలతో నోరూరిస్తున్నాయి. కాకులు కా… కా మని చెట్ల గుబురుల్లో చేరి ఎండు గొంతులతో రొద పెడుతున్నాయి. పావురాళ్ళు నీడ వాలుల్లోకి ఒదిగి ఒదిగి కూర్చుంటున్నాయి. అలాటి రోజుల్లో నడవళ్ళు, సారెలు పట్టుకుని పడవెక్కి పక్కి చేపలంత చిన్ని చిన్ని కళ్ళల్లో ,పెద్ద పెద్ద చెరువులంత కన్నీళ్ళు నింపుకుని ఆ ఊరి పిలగాడి పదేళ్ళ పెళ్ళాం నది దాటి అత్త గారింటికి వెళ్ళింది.

అత్తగారిల్లు ఎలా ఉందీ ? ఎలా ఉందంటే కడిమి చెట్టుకి పూలు లేవు, మామిడి చెట్టుకి కాయలు లేవు. లేక పోగా  ఇల్లంతా దిభోమని నోరు తెరుచుకున్న పెద్ద పెద్ద కళ్ళ దిష్టి రాక్షసుడి బొమ్మలా ఉంది. ఆ ఇంటిని చూసి ఆ పిల్ల తన చిన్ని చిన్ని కళ్ళల్లో ఊరుతున్న నీళ్ళను చిట్టి చిట్టి చేతుల్తో ఎంత తుడిచినా…  ఆశ్చర్యం మళ్ళీ అంత ఊరుతున్నాయి.

అప్పుడేమయిందీ? ఏమయిందంటే ఆ పిల్ల మగడి కడగొట్టు తమ్ముడు ,వాడి కీలుగుర్రాన్ని, ఊగేచిలుకని, తాటి బుర్రల బండినీ తీసుకొచ్చి చూద్దూరమ్మని ఆ పిల్ల చేయి పట్టుకు లాగాడు. ఇంకానేమో బంగారు చీరలు కట్టుకున్న దేవతల గురించి, రెక్కల చేపల గురించి చాలా చెప్పాడు. అప్పుడింక కాసేపటికి ఆ కొత్త పెళ్ళికూతురు “హ ( హ ( హ” మని నాట్యగత్తెలు వేసుకునే పెద్ద గజ్జెల శబ్దం లా ఇల్లంతా మ్రోగేట్లు నవ్వింది.
మరికొన్నాళ్లకి, కొత్త వానలు కురిశాయి. నదులు జరజరమని ఎడ పాముల్లా పరుగులు పెట్టాయి. అప్పుడు ఇరవై మూడేళ్ళ ఆ పెళ్ళికొడుకు  పని మీద పరాయి దేశం బయల్దేరాడు. వెళ్తూ వెళ్తూ ,వెళ్ళే వాడల్లా వెనక్కి వచ్చి ,పెళ్లి కూతుర్ని పడక గదిలోకి తీసుకెళ్ళి, చంకనెత్తుకుని బుగ్గలు పుణికి చేతిలో నాలుగు కాణీలు పెట్టి వెళ్ళాడు.

కాలం గడిచింది. వెళ్ళిన పెళ్లి కొడుకు జాడ పత్తా తెలియనే రాలేదు . దేశమేమొ దూరమాయ…కబురు తెలిసే దారే లేకపాయ .ఇంతలోనే ఏమయిందీ … పచ్చటి చెట్లు పదిసార్లు ఆకులు రాల్చి పదిసార్లు పూలు పూసాయి, చిన్ని చిన్ని చెట్లు సాగి సాగి తెగ బారెడు ఎదిగాయి. ఆనాటి గొంగళ్ళు పాతబడి చిరిగి పీలికలయ్యాయి. అదిగో అప్పుడు పదకొండో ఎండాకాలాన, ఇరవై మూడేళ్ళ ఆ పెళ్ళికొడుకు ముప్పైమూడేళ్ళ వాడై ,కళ్ళలో కన్నెపిల్ల ఊహల కలల నక్షత్రాలను వెలిగించుకుని,నది దాటి ఊరి దారి పట్టాడు. నడుస్తూ ఉన్నాడు కదా అని మనసు ఊరికే ఉంటుందా ? నదిలోని చేపల్లా ఊహలతో తుళ్ళి తుళ్ళి గెంతుతోంది.

అట్లా తుళ్ళిపడే మనసుని అదుపులో పెట్టుకోలేక ఆ అబ్బాయి దారిలో కనిపించిన పశువుల కాపరిని “ఏరే ఏరే గరు చరువా భయ్యా మొర్ ఫూల్ బిహాయి కిత్నాదర్ బాడల్ హై ( ఒహోయ్ ఓయ్ పశువులు కాసే అన్నాయ్ !ముద్దులు మూటకట్టే నా భార్య ఎంత పెద్దదయిందో చెప్తావా ?) అని అడిగాడు. పశువుల కాపరి అడిగిన మనిషెవరో ఆనవాలు కట్టి ” ఎరే ఏరే మలంగ్ లదువా దాదా , తోర్ ఫూల్ బిహాయి టిలియా టిలియా పానీ లానాతే ” ( ఒహోయ్  ఓయ్  అన్నయ్యా  నీ ముద్దులు మూటకట్టే  భార్య చిన్ని చిన్ని బిందెల్లో నీళ్ళు తెస్తోంది ) అన్నాడు.

అతను మరి కొంత దూరం నడిచాడు. ఈ సారి మేకల కాపరి యెదురొచ్చాడు. ఆగి ” ఎరే ఏరే చెగిడి చరువా భయ్యా మొర్ ఫూల్ బిహయి కిత్నాదర్ బాడల్ హై (ఒహోయ్  ఓయ్   మేకలు కాసే అన్నయ్యా ! నా ముద్దులు మూటకట్టే భార్య ఎంత పెద్దది అయ్యింది) అని అడిగాడు, మేకల కాపరి అడిగే మనిషెవరో పొడగట్టి ,ఆ ముచ్చటా  ఈ ముచ్చటా అడిగి, మేకల్ని అటూ ఇటూ అదలాయించి ఆమన “ఎరే ఏరే  మలంగ్ లదువా దాదా ! తోర్ ఫూల్ బిహాయి జాడు జప్టా కొరోచ్చి” (ఒహోయ్ ఓయ్ అన్నయ్యా నీ ముద్దులు మూట గట్టే నీ భార్య కసువు కళ్ళాపి చేస్తోంది”) అన్నాడు.
అది వినగానే కనులముందు నిలిచిన పూర్ణ యువతిని తలచి అతనికి ఛాతీ పొంగింది,హృదయంలో తియ్యటి గమకమేదో దొరలింది. దూరం మరికాస్తా దగ్గరైంది. ఈ సారి గొర్రెల కాపరి కనిపించాడు. అతను మళ్ళీ ఆగి (ఎరే ఏరే బేడా చరువా భయ్యా మొర్ ఫూల్ బిహాయి కిత్నాదర్ బాడల్ హై ” (ఒహోయ్ ఓయ్ గొర్రెలు కాసే అన్నయ్యా !ముద్దులు మూటగట్టే నా భార్య ఎంత పెద్దదయ్యింది ”)అన్నాడు. అదివిని ఆ గొర్రెల కాపరి అడిగిన మనిషి ఆనవాలు కట్టి ,పోపిడి అడిగి ,గడ్డాన్ని పంగాల కర్రకి ఆనించి కాసేపు ఆలోచించి ,తలని అటిటు గోకి ,గొర్రెలని టర్ టుర్ మని అదలాయించి “ఎరే ఏరే మలంగ్ లదువా దాదా తోర్ ఫూల్ బిహాయి కోరామే బచ్చా కాందోచ్చే (ఒహోయ్ ఓయ్ అన్నయ్యా !నీ ముద్దులు మూటగట్టే భార్య వడిలో బిడ్డకి పాలిస్తోంది”) అన్నాడు.

అది వినీ … , వళ్ళంతా కలల కళ్ళు చేసుకున్న ఆ పూర్ణ పురుషుడు కోపం తో వాడి పోయి బారెడు బారెడు అంగలేస్తూ ఇంటికి కదిలాడు.

ఇంటికెళ్ళి చూస్తే పిల్లాడేడి ? ఎక్కడా లేడు , కేర్ … బేర్ లు కిలకిలలు ఏమీ లేవు. ఆబగా వెతుకుతున్న అతగాడి కళ్ళకి ఇంటి మూల మునగ చెట్టు కింద అప్పుడే తవ్వి పూడ్చిన తడిపొడి కొత్త మన్ను మిలమిలలాడుతూ కనిపించింది. ఎర్రటి ఆ కొత్త మట్టిపై రాలి కనిపించాయి నాలుగెనిమిది మునగ పూలు ,అదిమి పెట్టిన కన్నీళ్ళలా.

ఎందుకో ఆ రాత్రి చంద్రుడు దిగులు మబ్బుల్లో దాంకున్నాడు. వెలగాలో మానాలో తేల్చుకోలేక  మినుకు మినుకు మంటున్నదీపం బుడ్డికి పెడగా పడమటింట్లో పెళ్లి కూతురు ఒదిగి ఒదిగి కూర్చున్నది.

ఇంటికి ఉత్తరాన ఆ మూల సందులో చింత చెట్టు కింద ఎర్రటి మంట మండుతోంది. మంట దగ్గర నుండి సుయ్ సుయ్ మంటూ ఉండుండి వస్తున్న ఒక శబ్దం ఇల్లంతా వినిపిస్తోంది. ఆ శబ్దం విని విని ఇంటి పెద్ద చూరు దగ్గర తల పెట్టి “కా చొయ్  చొయ్ బేటా కా  చొయ్ చొయ్ “( ఎవరా సుయ్ సుయ్ మని శబ్దం చేసేది కొడుకా ఎవరా సుయ్ సుయ్ మని శబ్దం చేసేది?) అని  అడిగాడు.

అప్పుడు ఉత్తరం మూల నుండి ఆ ఇంటి పెద్ద ఇరవై ఒక్కేళ్ళ చిట్ట చివరి కొడుకు “దాదా దీలో పాన్ ,సే  చొయ్ చొయ్ బాబా సే చోయ్ చోయ్ ”[అన్న పాన్ ఇచ్చాడు అది తింటున్నా . అదే ఆ శబ్దం నాన్నా అదే ఆ శబ్దం ] అని బదులిచ్చాడు. కాసేపటికి ఆ చోయ్ చోయ్ శబ్దంతో నిదర మేల్కొన్న అమ్మ చూరు దగ్గర తలపెట్టి ”కా చోయ్ చోయ్ బేటా కా చోయ్  చొయ్ (ఎవరా సుయ్ సుయ్ మని శబ్దం చేసేది కొడుకా ఎవరా సుయ్ సుయ్ మని శబ్దం చేసేది?) అని అడిగింది, అప్పుడు చింత చెట్టు దగ్గర నుండి ఆవిడ కడగొట్టు కొడుకు   “దాదా దీలో పాన్ ,సే  చొయ్ చొయ్ మా ,సే చోయ్ చోయ్ ”[అన్న పాన్ ఇచ్చాడు అది తింటున్నా . అదే ఆ శబ్దం అమ్మా అదే ఆ శబ్దం ] అని బదులిచ్చాడు .

***

రాత్రి గడిచింది . సూర్యుడు చీకటిని చంపేసి , విజయగర్వంతో ఎర్రగా మెరుస్తూ ఆకాశానికెక్కాడు. పడమటింటి నుండి ,చచ్చిన చేపల్లా ఉన్న కళ్ళతో పెళ్ళికూతురు బయటకు వచ్చింది. పెరట్లో ఆ ఇంటి పెద్దలిద్దరూ ఘోల్లుమంటూ గట్టు తెగిన చెరువులయ్యారు . గడ్డ కట్టిన రక్తపు చారికలతో చింత చెట్టుకి తలకిందులుగా వేళ్ళాడుతున్న ఆ ఇంటి చిన్న కొడుకు నిర్జీవపు కళ్ళు దేనినో చివరిసారి , ఒకే ఒక్కసారి చూసుకుందామన్నట్లు ఆశగా శూన్యం లోకి తెరుచుకుని ఉన్నాయి.

Download PDF

1 Comment

  • కిరణ్ says:

    బాగుంది . కథ చదివి గుండె బరువయ్యింది . మీ శైలితో కథ పదునెక్కింది .

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)