వీలునామా – 3వ భాగం

Sharada1

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

మర్నాడు పొద్దున్నే ఎల్సీ తీరిగ్గా పేపరు చదువుతోంది. పేపరులో ఒక మూల హోగార్త్ గారి వీలునామా విశేషాలన్నీ వున్నాయి, ఎస్టేటు కొత్త హక్కుదారుడికి అభినందనలతో సహా.
“జేన్! చూడు! ఇప్పుడు ఇదంతా పేపరులో రాసి మన పరువు తీయాలా? ఇంకా నయం, నీ గురించీ, విలియం గురించీ ఏమీ రాయలేదు. లేకపోతే, అతనేదో నిన్ను కాదన్నాడనీ, నువ్వందుకు భోరుమని ఏడుస్తున్నావనీ కూడా కథలల్లే వాళ్ళు, ” ఆ పేపరు అక్కకి చూపిస్తూ చికాగ్గా అంది ఎల్సీ.

“చుట్టూ వున్న మనుషులు ఏమనుకుంటున్నారు, ఏమంటున్నారు అన్న విషయాలని మనం నియంత్రించలేం కదా? అందుకే వాటి సంగతి వదిలేయ్. నేను థాం సన్ గారింటికెళ్ళొస్తాను.”

***

జేన్ వెళ్ళేసరికి అప్పుడే మిస్ థాంసన్ పేపరు చదివి లేవబోతున్నారు. శ్రీమతి డాల్జల్ ఇచ్చిన ఉత్తరం తీసుకొని ప్రవేశించింది జేన్.

అరవై యేళ్ళ మిస్ థాంసన్ ఆరోగ్యంగా, చలాకీగా వుంది. ఆవిడ కళ్ళు చురుగ్గా, నోరు చిరునవ్వుతో విచ్చుకొనీ వుంది. ఇప్పుడిప్పుడే యవ్వనం లోని మెరుపు స్థానం లో వార్ధక్యం వల్ల వచ్చే హుందాతనం స్థిరపడుతోంది.

శ్రీమతి డాల్జల్ గారు కేవలం జేన్ ని పరిచయం మాత్రమే చేసారు తన చిన్న వుత్తరంలో. అందువల్ల జేన్ రాకకి కారణమేమై వుంటుందో ఊహించలేకపోయారు ఆవిడ. ముందుగా జేన్ ని కూర్చోమని, ఆ పైన వచ్చిన పని విచారించారు.

“మేడం! నేనొక చిక్కు పరిస్థితిలో మీ సలహా సహాయాల కొసం వచ్చాను. మా మామయ్య రాసిన వీలునామా సంగతీ, నేనూ మా చెల్లెలూ చిల్లి గవ్వ లేకుండా వీధిలో నిలబడ్డ సంగతీ మీరీ పాటికే విని వుంటారు.”

“అవునమ్మా! మీ మామయ్య ఎందుకలా చేసారో! పాపం, మీ పరిస్థితి చూస్తూంటే జాలేస్తూంది.”

“మేడం! మా మావయ్య ఎప్పుడూ మిమ్మల్ని ఆదర్శంగా చూపించి, ఆడవాళ్ళు తలచుకుంటే చేయలేనిది లేదు అని చెప్పేవారు. అందుకే నేను మిమ్మల్ని సహాయం అడుగుతున్నాను. దయచేసి, నన్ను పనిలో పెట్టుకోని మీ వ్యవసాయం పనులు నేర్పండి. నేను మీ డబ్బు లెక్కలు చూడగలను, ఉత్తరాలు రాసి పెట్టగలను, ఇల్లు చక్క బెట్టగలను. మీకు పనిలో సహాయపడుతూ నేనూ వ్యవసాయం నేర్చుకోగలను. నన్నూ నా చెల్లెల్నీ రోడ్డు మీద నిలబడే పరిస్థితి నుంచి మీరే కాపాడ గలరు.”

మిస్ థాంసన్ ఆమె కేసి జాలిగా చూసి తల అడ్డంగా తిప్పారు.

“హాయ్యో! పిచ్చి తల్లీ! స్కాట్ లాండ్ లో వ్యవసాయం చాలా డబ్బూ శ్రమా తో కూడిన విషయం. నువ్విపుడు చేసి పెడతానన్న పనులు  చిల్లి గవ్వ ఖర్చు లేకుండా నేనే చేసుకోగలను. బహుశా ఇంకో పదేళ్ళ వరకూ చేసుకోగలను. నాకు కావాల్సిన సహాయం ఆడవారి పనుల కోసం కాదు, మగవారు చేయగలిగే పనులు. అంటే గుర్రబ్బండీ వేసుకొని సంత కెళ్ళి సామాన్లు కొనటం, అమ్మి పెట్టటం, పొలాలన్నీ చుట్టి రావటం లాటివి. పెద్దదాన్నవుతున్నాను కదా, బయటికి వెళ్ళలేకపోతున్నాను.  నీకు ఏదైనా సహాయం చేయాలనే వుంది. కానీ, ఇప్పటికే నా సహాయం కోసం ఎదురు చూస్తూ బోలెడు మంది మేనల్లుళ్ళూ, మేనకోడళ్ళూ, అక్క చెల్లెళ్ళ పిల్లలూ వున్నారు. వారిని కాదని నిన్ను పనిలో పెట్టుకుంటే నన్ను కాకులు పొడిచినట్టు పొడుస్తారు. అందుకే ఈ మధ్యనే మా చెల్లెలి కొడుకు జాన్ ని పై పనుల్లో సహాయానికి పెట్టుకున్నాను. ఇంకా నేను పనిలో పెట్టుకుని తిండి పెడతానని జాన్ తమ్ముళ్ళూ కాచుకోని వున్నారు.”

జేన్ నిరాశగా తల దించుకొంది.

“నిజమే! మీ పరిస్థితి నాకర్థమవుతూంది. ప్రపంచంలో ఏ దిక్కూ లేని అనాథలం నేనూ, మా చెల్లి అంతే! మీలా మాకూ ఒక బంధువుండి వుంటే మాకూ ఎవరైనా పని చూపించి వుండే వారేమో! పోనీ, ఏం చేస్తే బాగుంటుందో సలహా ఇవ్వండి!”

“జేన్! నేను ఈ వ్యవసాయం ఒక విచిత్ర పరిస్థితిలో చేపట్టాను. మా నాన్న వున్న డబ్బంతా పెట్టి ఇంత పెద్ద పొలం కొని దాన్ని సరిగా సాగు చేయలేక పోయాడు. ఫలితంగా చాలా డబ్బు నష్టం వచ్చేది. ఆయనకి కొడుకులు కూడ లేరు. మేం ముగ్గురం అక్క చెల్లెళ్ళమే. ఏం చేయాలో పాలుపోని స్థితిలో, పొలం అమ్మడం ఇష్టం లేక నేను దీని బాధ్యత తీసుకున్నాను. అతి కష్టం మీద, నష్టాలన్నీ పూడ్చుకొని లాభాలు సంపాదించాను. నాకు కష్టపడే మనస్తత్వం తో పాటు పొలం పనుల మీద ఇష్టం కూడా వుండడం వల్లనే అదంతా సాధ్యమయింది.”

“అదృష్టవంతులు మీరు. నాక్కూడా కొంచెం డబ్బు వుండి వుంటే నేనూ ఏదో వ్యాపారమో, వ్యవసాయమో మొదలు పెట్టి వుండగలిగేదాన్ని,” దిగులుగా అంది జేన్.

“అవును జేన్. ధైర్యమూ, ఆరోగ్యమూ, యవ్వనమూ తప్ప మరేమీ లేకుండా ప్రపంచంలో నెగ్గుకురావటం ఆడదానికి కష్టమే. పెళ్ళి చేసుకోవడమో, లేదా ఎవరింట్లోనైనా పిల్లల్ని చూసుకొనే గవర్నెస్ గా చేరడమో తప్ప వేరే దారి లేదు. దురదృష్టవశాత్తూ పెళ్ళిళ్ళ మార్కెట్టూ, గవర్నెస్సుల మార్కెట్టూ ఆడపిల్లలతో కిక్కిరిసి పోయి వున్నాయి. మనలాంటి వాళ్ళం ఇంకే పని చేసినా సంఘానికి నచ్చదు.”

“ప్రపంచం చాలా పెద్దది కదా! ఏదో ఒక పని దొరకకపోదు లెండి.”

“మరీ మీ మావయ్య చాలా అన్యాయం చేసారు జేన్. మీ ఇద్దరికీ కొంచెమేనా డబ్బు ఇచ్చి వుండవలసింది. అప్పుడు నాలా ఎక్కడైనా వ్యవసాయం చేయగలిగేవారు కదా!”

“కావొచ్చు! కానీ, డబ్బు ఒకళ్ళు ఇస్తే వచ్చే ఆనందం కన్నా, మనం సంపాదించుకుంటే వచ్చే ఆనందం ఎక్కువ కదా! ఆ ఆనందాన్ని మా అనుభవం లోకి తేవటం కొసం ఆయన అలా చేసారేమో! ఎవరికి తెలుసు?”

“నీ గురించి నాకు భయం కానీ అనుమానం కానీ లేవు జేన్. తెలివైనదానివీ, ధైర్యస్థురాలివీ. మీ చెల్లెలూ నీ లాటిదైతే….”

“ఏలాటిదైనా, మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం!” మధ్యలోనే అందుకుంది జేన్.

“అయితే మరీ మంచిది. మీక్కావల్సిన ధైర్యాన్ని ఆ ప్రేమే ఇస్తుంది. నా మాట విని ఎడిన్ బరో వెళ్ళండి.అక్కడ మీకు ఉద్యోగావకాశాలు ఎక్కువ. అక్కడ మీకు తెలిసిన వాళ్ళెవరైనా వున్నారా?”

“ఎవరూ లేరు.”

“ఇప్పుడు ఆస్తంతా అనుభవించబోయే అబ్బాయి, మీ కజిన్, అతను ఏదైనా సహాయం చేయడా?”

“అతను స్నేహంగానే వున్నాడు, కానీ వీలునామా ప్రకారం అతను మాకేవిధంగానూ సాయపడకూడదు.”

“డబ్బు ఇవ్వక్కర్లేదు. ఉద్యోగాలు వెతికి పెట్టొచ్చు. మీ గురించి అక్కడా ఇక్కడా చెప్పి సాయ పడొచ్చు కదా?”

“అతనూ అదే అన్నాడు. ఒకసారి ఎడిన్ బరో వెళ్ళి చూస్తాను. అక్కడ వుండడానికే అధారమూ లేదు. అతని ఇంట్లోనే వుండక తప్పదు. హోటాళ్ళల్లో వుండగలిగేంత డబ్బు లేదు.”

“అవును, అతని ఇంట్లో వుండడమే మంచిది. ప్రయాణాలకీ వాటికీ వీటికీ బోలేడు డబ్బి అవసరమవుతుంది జేన్. ఈ అయిదు పౌండ్లూ వుంచు,” డెస్క్ లోనించి అయిదు పౌండ్ల నోటు తీస్తూ అన్నారు మిస్ థాం సన్. ఆ డబ్బు తీసుకోవటానికి అభిమానం అడ్డొచ్చినా, ఆవిడన్న మాటల్లో నిజం వుండడం వల్ల, మౌనంగా ఆ నోటు అందుకొంది జేన్.

జేన్ ఇంటికొచ్చేసరికి ఎల్సీ తన దిగులు నుంచి తేరుకుంది. ఆ రోజు పేపర్లో వచ్చిన కవితల స్థాయి చుసి ఏల్సీ ఆశలు చిగురించాయి. నిస్సందేహంగా తాను అంతకంటే మంచి కవిత్వం రాయగలదు. పేపరుకి అడపాదడపా కవితలు రాసి పంపి డబ్బు సంపాదించటానికి ప్రయత్నిస్తే, అన్న ఆలోచన వచ్చిందామెకు. గబ గబా పుస్తక తెరిచి రాసుకోవటం మొదలు పెట్టింది.

అక్క తిరిగి రాగానే, కూర్చో బెట్టి తన కవిత్వం వినిపించింది.

“చాలా బాగుంది ఎల్సీ! ఇంత తొందరగా ఎలా రాసావు?”

“నిజంగా బాగుందా? ఏదైన పేపరుకి పంపనా? వేసుకుంటారంటావా?”

“నాకు కవిత్వం గురించీ, సాహిత్యం గురించీ పెద్దగా తెలియదు కానీ, పంపించు! వేసుకుంటారనే అనిపిస్తుంది!”

“హమ్మయ్య! జేన్! నీ మాటంటే నాకెంతో గురి. నీలాటి తెలివైన మనిషికే నచ్చింది, కాబట్టి ఇదిచాలా మందికి నచ్చుతుండొచ్చు!”

ఎల్సీ ఉత్సాహమూ, సంతోషమూ చూసి జేన్ కూడా నిరాశ లోంచి బయటికొచ్చింది.

“అవును ఎల్సీ! నీలాటి సున్నిత మనస్కులు రాసే భావాలూ, భాషా, చాలా మందికి, ముఖ్యంగా స్త్రీలకి చాలా నచ్చుతుంది. పోనీలే, ఇద్దరిలో ఒక్కరికైనా కాస్త వెలుతురు కనిపిస్తుంది. ఎందుకంటే, నే వెళ్ళిన పని మొత్తంగా కాయే!” అంటూ మిస్ థాం సన్ తో భేటీ గురించి వివరంగా చెప్పింది.

“పొద్దున్న ఫ్రాన్సిస్ దగ్గర్నుంచి ఒక ఉత్తరం వచ్చింది. మనిద్దరినీ వీలైతే ఎడిన్ బరో రమ్మనీ, అక్కడేదైనా ఉద్యోగం దొరకచ్చనీ రాసాడు. వెళ్ళక తప్పేట్టు లేదు! మరి నువ్వూ వస్తావా?” ఎల్సీని అడిగింది.

“జేన్! నాకా ఉద్యోగాల మీద ఆసక్తీ లేదు, వస్తాయన్న ఆశా లేదు. నేనెందుకు చెప్పు, అక్కడికి, డబ్బు దండగ కాకపోతే? అయితే నీకొక్కదానికీ వెళ్ళటానికి ఇబ్బందిగా అనిపిస్తే తోడుగా తప్పక వస్తాను!”

“అదీ నిజమేలే! అయితే నువ్విక్కడే వుండు! ఆ కవిత్వాన్ని పేపరుకి పంపడం మర్చిపోకు మరి! నేనిప్పుడే వెళ్ళి  నేనొస్తున్నానని ఫ్రాన్సిస్ కి ఉత్తరం రాసి పోస్టు చేయిస్తాను. ఎంత తొందరగా ఉద్యోగం దొరికితే అంత మంచిది.”

***

 (సశేషం)

 ముఖ చిత్రం : మహీ పల్లవ్

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)