మిగిలినదంతా మా అమ్మ పంచిపెట్టిన ప్రేమామృతమే!

అమెరికాలో మా అమ్మతో నేనూ, మా తమ్ముడూ

chitten rajuనాకు పట్టిన అదృష్టం చాలా మందికి పట్టదు. ఎండుకంటే నేను ఒక రకంగా వికటకవినే! అంటే మా అప్పచెల్లెళ్ళూ –అన్నదమ్ములలో ఎటు నుంచి లెక్క పెట్టినా నాది ఐదో నెంబరే!. అంటే ముగ్గురు అన్నయ్యలు, ఒక అక్క వెరసి నాకంటే నలుగురు  పెద్ద వాళ్ళు, ఒక తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్ళూ వెరసి నాకంటే నలుగురు చిన్న వాళ్ళు. పంచ పాండవులం అయిన మా అన్నదమ్ములలో నేను నకులుణ్ణి.  వీళ్ళలో ఏ ఒక్కరూ లేకుండా ఉండే నా చిన్నతనాన్ని ఊహించలేను. ఆ రోజుల్లో యింకో పదిమంది అన్నదమ్ములూ, అప్పచెల్లెళ్ళూ ఉంటే బావుండును అనిపించేది. బాగా చిన్నప్పుడు ఆ మాటే మా అమ్మతో ఒక సారి అంటే “నోర్ముయ్” అని తిట్టి “ఆ ఇద్దరికీ బతికే యోగం లేదు రా” అంది. అంటే మా అమ్మ జన్మనిచ్చిన పదకొండు మందిలో ఇద్దరు బాలారిష్టాలు దాటలేక పోయారు. అందులో ఒకడు నాతో పుట్టిన కవల పిల్లాడు. కానీ మా తాత గారూ, బామ్మ గారూ, ఆ మాట కొస్తే, మా అమ్మా, నాన్న గార్ల ఉదార స్వభావం వలన మా బంధువులనీ, వారి పిల్లలనీ మా ఇంట్లోనే ఉంచుకుని చదువు చెప్పించడంతో ఎప్పుడూ ఇంట్లో ఉండే వాళ్లూ వచ్చే పోయే వాళ్ళతో సుమారు వంద మంది జనాభాతో కాకినాడలో మా ఇల్లు కళ, కళ లాడుతూ ఉండేది.  ప్రతీ రోజూ తెల్లారరగట్ట లేచిన మా పొయ్యిలో పిల్లి మధ్యాహ్నం అరగంట కునుకు తీసి మళ్లీ అర్ధరాత్రి దాకా పడుకునేది కాదు. అలాగే ఎంత మంది వంట వాళ్ళు ఉన్నా, పని వాళ్ళు ఉన్నా మా అమ్మ నడుము వంచిన నడుము ఎత్తేది కాదు.

మా అమ్మ పేరు సర్వలక్ష్మి. అది నాకు ఎంతో ఇష్టమైన పేరు. అలాగే మా బామ్మ గారి పేరు మాణిక్యాంబ గారు. అది కూడా నాకు చాలా ఇష్టమైన స్వచ్చమైన తెలుగు పేరు.   మా అమ్మకి తన పదకొండే ఏట మా నాన్న గారితో పెళ్లి అయింది. ఆ రోజులల్లో అది బాల్య వివాహం క్రింద లెక్క కాదు. తరవాత కాపురానికి వచ్చినప్పటి నుంచీ మా బామ్మ గారి హయాంలో ఇంటి నిర్వహణ మా అమ్మ చేపట్టింది. టూకీగా చెప్పాలంటే ప్రతీ రోజూ వంద మందికి అన్నం వార్చే పెద్ద కంచు గుండిగలూ,  అంత మందికీ సరిపడా పులుసు, చారూ  కాచే గంగాళాలూ, కూరా, పచ్చడీ వగైరాలకి గిన్నెలూ, రాచ్చిప్పలూ, పాల గదిలో నిలువెత్తు కుండలో రోజుకి ఇరవై నాలుగు గంటలూ బొగ్గ్గుల మీద వేడిగా కాగుతూ ఉండే ఆవు పాల కుండా, గేదె పాలకి మరొక కుండా, అటక మీద అరవై రకాల ఊరగాయల పింగాణీ జాడీలు, మడి బట్టలు ఆరేసుకునే దండేలు అర డజనూ, వంటింటి వెనకాల ఆడ వారి కోసం  చిన్న నుయ్యి, అక్కడికి వంద గజాల దూరంలో మగ వారి స్నానాల కోసం పెద్ద నుయ్యి, నీళ్ళు తోడుకునే చేదలూ, బకెట్ లూ, ఎవరైనా గ్లాసులో, చెంబులో నూతిలో పారేస్తే  దిగి తెచ్సుకోడానికి రెడీ గా అందుబాటులో ఉండే నిచ్చెనా, ఇంటిల్లిపాదికీ వేన్నీళ్ళు కాచుకునే నీళ్ళ పోయ్యీ, దాని మీద రాగిదో, ఇనపదో తెలియకుండా రెండు అంగుళాల మందం ఉన్న “మసి పూసిన పెద్ద డేగిసా”,  బొగ్గుల బస్తాలూ, కట్టెలూ, వేన్నీళ్ళూ, చన్నీళ్ళూ తొలకరించుకోడానికి  సిమెంటు నీళ్ళ కుండీలూ,  పసుపూ, కుంకుమా, నూనె, రెడీ స్టాకులో పొద్దున్న లేవగానే అందరికీ అందుబాటులో ఉండేలా కచికా, వేప పుల్లలు, బొగ్గు, “కోతి” మార్కు పళ్ళ పొడి, బినాకా టూట్ పేస్ట్, వెదురు బద్దలూ,  లైఫ్ బోయ్, లక్స్ వగైరా సబ్బులూ, కుంకుడు కాయలు, బట్టలు ఉతుక్కునే సబ్బూ, నీలి మందూ, పండగలూ, పబ్బాలూ వస్తే కావలసిన స్పెషల్ వస్తువులు, అర డజను కత్తి పీటలు, చిన్న, పెద్దా కత్తులూ, కొబ్బరి కోరే చేతి యంత్రమూ, పెద్ద, చిన్న, బుల్లి రుబ్బు రోళ్ళూ, కారాలు కొట్టుకోడానికి రాళ్ళూ, రోకళ్ళూ, రెండు మూడు సైజులలో పాతిక పైగా పీటలూ,  అందరికీ విడి, విడి గా వెండి కంచాలూ,  పాతిక పైగా నులక, నవారు, మడత మంచాలూ, పూజ గది సామాగ్రీ  మొదలైన కొన్ని వందల వస్తువులకీ మా అమ్మే “సప్లై చైన్ మరియు మెయింటేనెన్స్  మేనేజర్”. ఈ రోజుల్లో ఆ ఉద్యోగానికి గంటకి మూడు వందల డాలర్లు పెట్టి ఒక SAP ప్రోగ్రామర్ ని పెట్టుకున్నా మా అమ్మ కాలి గోటికి సరిపోరు అని నా అభిప్రాయం. ఇలా అంటున్నాను అని ఏమీ అనుకోకండి. మీ అమ్మ కూడా మా అమ్మలాంటిదే కదా!

మా తల్లిదండ్రులు సర్వలక్ష్మి , రామలింగేశ్వర శర్మ గారు

మా తల్లిదండ్రులు సర్వలక్ష్మి , రామలింగేశ్వర శర్మ గారు

ఈ పై లిస్ట్ ఎందుకు వ్రాశానంటే, వీటిల్లో పసుపూ, కుంకుమ లు మాత్రమే నేను అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ వాడ లేదు—ఏదో డ్రామాల్లో ఆడ వేషాలు వేసినప్పుడు తప్ప. కానీ మిగిలిన వాటిల్లో వంట సామాగ్రి తప్ప మిగిలినవన్నీ చిన్నప్పుడు నా రోజు వారీ జీవితంలో భాగమే కాబట్టి, నా చిన్నతనం ఎంత పరమాద్భుతంగా గడిచిందో ఊహించుకో వచ్చును. 1996 లో కాకినాడనీ, నా చిన్నతనాన్నీ “దురదృష్టవశాత్తూ” వదిలేశాక ఆధునిక వంట సామాగ్రి ని వాడే అలవాటు అయిపోయింది కాబట్టి, ఇప్పుడు నా జీవితం ఎలా ఉందో కూడా ఊహించుకో వచ్చును. అప్పుడప్పుడు టీవీ లలో “ఇప్పుడు మీరు క్వార్టర్ సైజ్ సాస్ పాన్ లో రెండు వంకాయ ముక్కలు ముక్కలు వేసి, ఒక చెంచాడు నూనె వేసి…  “ అనే వంటల కార్యక్రమాలు చూస్తూ మా ఆవిడ నోట్స్ రాసుకుంటూ ఉంటే నేను కడుపుబ్బ నవ్వుకుంటూ ఉంటాను. మరుక్షణం మా అమ్మని తల్చుకుని గుడ్లమ్మట నీరు తుడుచుకుంటూ గదిలోకి పారిపోతాను.

మా అమ్మకి ఏదో చిన్న సైజు మడీ, తడీ తప్ప ఎవరినీ బాధించి, సాధించే ఛాందసం ఉండేది కాదు. మా నాన్న గారు పోయిన తరువాత మా పట్టుదల మీద మా అమ్మ అమెరికా వచ్చి లాస్ ఏంజేలేస్ లో మా తమ్ముడి ఇంట్లో ఆరు నెలలు, హ్యూస్టన్ లో మా ఇంట్లో ఆరు నెలలూ ఉంది. వచ్చిన రోజే “ఈ ఫ్రిజ్ లో ఒక అర నాకు కేటాయించండి. అంతే. అందులో నా పాలూ, పళ్ళూ, తినుబండారాలు విడిగా పెట్టుకుంటాను. తక్కిన అరలలో మీరు ఏం అఘోరించినా నాకేం పరవా లేదు. మీ వెధవ అమెరికా అలవాట్లు మీవి. మీ స్నేహితుల ఇళ్ళకి వస్తాను కానీ ఎవరింట్లోనూ భోజనం చెయ్యను. కావాలంటే అందరినీ మనింటికే భోజనాలకి పిలవండి. లింగూ, లిటికూ అంటూ ఇద్దరినీ, ముగ్గురినీ పిలిస్తే నేను వంట చెయ్య లేను. కనీసం పాతిక మందిని అయినా పిలవండి. బజారుకెళ్ళి కాస్త పెద్ద మూకుడూ, గిన్నెలూ పట్టుకు రండి. పట్టుమని పది చెంచాలు కూడా పట్టవు మీకున్న గిన్నెల్లో. ఈ వెధవ దేశం ఇలా ఉంటుంది అని తెలిస్తే ఓ ఓ గుండిగా, ఓ గంగాళమూ తెచ్చుకుందును.” అంది మా అమ్మ. నాకు తెలిసీ వంట చెయ్యడానికి ఏ నాడూ ఏ ఎలెక్త్రికల్  పరికరమూ మా అమ్మ వాడ లేదు. వాడ లేక కాదు. ఇందుతో మా చిన్నప్పటి అమ్మా, నాన్న గార్ల ఫోటో ఒకటీ జతపరిచాను. మా అమ్మ అమెరికా వచ్సినప్పటి ఫోటో ఒకటి,

అమెరికాలో మా అమ్మతో నేనూ, మా తమ్ముడూ

అమెరికాలో మా అమ్మతో నేనూ, మా తమ్ముడూ

మా అమ్మ జ్జాపక శక్తి అమోఘం.  ఒక సారి అమెరికాలో ఒకావిడని చూసీ చూడగానే “నువ్వు ఫలానా కదూ. నీ పెళ్లి ఫలానా తారీకున ఫలానా అబ్బాయితో ఫలానా సత్రంలో ఫలానా పురోహుతుడి గారే కదూ జరిపిస్తా. నేను నీ పెళ్ళికి వచ్చాను లే. ఆ పురోహితుడు మంత్రం తప్పు చదువుతుంటే మీ అమ్మకి చెప్పాను.” అనగానీ ఆవిడ బిత్తర పోయింది. ఈ యావత్ భూ ప్రపంచంలో మా అమ్మ ఎవరినైనా ఎప్పుడైనా కలుసుకుని ఉంటే మా అమ్మ ఎప్పుడూ మర్చిపోయేది కాదు. నాకు తెలిసీ మా అమ్మకి తన 83  సంవత్స’రాల జీవితంలో ఆరోగ్యపరంగా ఎప్పుడూ ఏ డాక్టర్ నీ చూడవలసిన అవసరం రాలేదు. అన్నింటి కన్నా ఆశ్చర్యం .. శతాధికంగా ఉన్న మా బంధు వర్గంలో ఏ ఒక్కరి చేతా, ఏ నాడూ, ఒక్క “చెడ్డ” మాట అనిపించుకో లేదు. అలనాటి సమాజంలో ఈ రకమైన వ్యక్తిత్వం నమ్మశక్యం శక్యం కాని నిజం.

ఎవరినైనా సరే, ఆత్మీయంగానే తప్ప, ఆదరంగానే తప్ప, అన్యోన్యంగానే తప్ప, మరే విధంగానూ చూడని, చూడ లేని మా అమ్మ 1999  లో ఎవరికీ ఏ విధంగానూ ఇబ్బంది కలిగించకుండా సునాయాస మరణం పొందింది. కబురు తెలియగానే నేనూ, మా తమ్ముడూ పెద్ద కర్మ నాటికి కాకినాడ చేరుకున్నాం.  తన ఆస్తిపాస్తులన్నీ దాచుకున్న ఒక రేకు సూట్ కేస్ ని,  ఆమె కోరిక ప్రకారం అందరి సమక్షం లోనూ తెరిచి చూసాం. నాలుగో తరగతి వరకూ మాత్రమే చదువుకుని ఒక జీవిత కాలం కేవలం కుటుంబం కోసమే తన జీవితాన్ని పణంగా పెట్టి, తన కడుపున  పుట్టిన తొమ్మండుగురు పిల్లలనీ, వారితో సరిసమానంగా వందలాది  బంధువుల్నీ తన ప్రేమతో, ఆప్యాయతతో, అభిమానంతో, బాధ్యతతో తీర్చిదిద్దిన (నండూరి) వంగూరి సర్వ లక్ష్మి అనే మా అమ్మ పదిలపరుచుకున్న ప్రాపంచిక ఆస్తి కాళిదాసు మాళవికాగ్నిమిత్రం పుస్తకం, తను ఆఖరి రోజులలో కాలక్షేపం కోసం ఆడుకున్న పేక ముక్కలు, దేముడికి రోజు వెలిగించుకునే పత్తి వత్తులూ, అగరొత్తులూ వగైరా మాత్రమే!  మిగిలినదంతా మా అమ్మ పంచిపెట్టిన ప్రేమామృతమే! దానికి అంతు లేదు. ఈ ప్రపంచంలో నాకంటే అదృష్టవంతుడు ఇంకెవరూ లేరు.

 

Download PDF

14 Comments

  • renuka ayola says:

    అమ్మలకి మనమేమి ఇవ్వగలం అమ్మని తలచుకుని కన్నీళ్ళు పెట్టడం తప్ప …

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      ఏ అమ్మకైనా మనం ఏమీ ఇవ్వక్కర లేదు…ఆ మాట కొస్తే ఆవిడ ఎప్పుడైనా కన్నీళ్ళు పెట్టుకుంటే అవి తుడవాలి తప్ప మనం మనం కన్నీళ్ళు కూడా పెట్టుకోకూడదు. ఏమంటారు?

      –వంగూరి చిట్టెన్ రాజు

  • అదృష్టవంతులు… ఆవిడా, మీరూ.. ఇద్దరూను !

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      ఏమో….నేను ఆవిడకి మిగిలిన సంతానం లాగానే తప్ప స్పెషల్ “గర్వకారణం” కాదు అని అనుకుంటున్నాను.

      –వంగూరి చిట్టెన్ రాజు

  • Uma Bharathi says:

    మీ వ్యాసం ‘అమ్మ’ గురించి ఎంతో బాగుంది… మీలా – కొందరిలా ‘మా అమ్మ నా అదృష్టం’ అనుకుంటే, కష్టపడే అమ్మలే ఉండరు ఈ లోకంలో … రాజు గారు…

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      ధన్యవాదాలు, ఉమ గారూ..

      –వంగూరి చిట్టెన్ రాజు

  • Dr. Murty Jonnalagedda says:

    ఆమ్మ అన్న అత్య౦త మధురమైన పదాన్ని పలికినప్పుడల్లా ఏ లోక౦లో ఉన్నా ఆ తల్లి పులకిస్తు౦ది. అది పేగు బ౦ధ౦. మీ చిన్నతనపు స్వర్ణయుగాన్ని కళ్ళకు కట్టినట్టుగా వివరి౦చిన విధాన౦, అది మీ హృదయ౦పై ఎ౦త బలమైన ముద్ర వేసి౦దో నేను ఊహి౦చగలను, అర్ధ౦ చేసుకోగలను. ఎ౦దుక౦టే నేను ఖచ్చిత౦గా అలా౦టి పరిస్థితుల్లోనే పెరిగాను. అటువ౦టి తల్లి కన్న బిడ్డనే. మొన్న మా ఆవిడ ఉసిరికాయ పచ్చడి వడ్డిస్తు౦టే, “మా అమ్మ ఉసిరికాయ పచ్చడి వడ్డిస్తే నన్ను, పెరట్లోకి వెళ్ళి దాన్లోకి చిదపడానికి కొత్తిమిర, పచ్చిమిరపకాయి కోసుకు రమ్మనేది” అన్నాను. తల్లిని తలుచుకుని ఎప్పుడూ కన్నీళ్ళు పెట్టకూడదు, వారి గొప్ప జీవితాలను గర్వ౦గా గుర్తుకు తెచ్చుకుని పెదవులపై చిరునవ్వు తెచ్చుకోవాలి. బహుశా మన౦ ఎప్పుడూ క౦టతడి పెట్ట కూడదనే మన తల్లులు కోరుకు౦టారనుకు౦టాను.

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      మీరన్నది ఖచ్చితంగా నిజం. నాకు తెలిసీ ఏ అమ్మ, ఈ పిల్లలకీ మంచే తప్ప మరోతి కోరుకోదు….తానా పిల్లలకే కాదు…పిల్లలందరికీ కూడానూ…

      –వంగూరి చిట్టెన్ రాజు

  • bhasker says:

    ‘అమ్మ’ మీ తలపుల్లో ఇంత పచ్చగా వుండడం చదివి హృదయం బరువెక్కింది. చటుక్కున మా అమ్మ గుర్తుకు వచ్చింది. అమ్మ నామ వాచకం కాదు. సర్వనామం. అమ్మ గురించి మేం మీ అంతగా రాయలేం.కాని మా అందరి అమ్మల్ని కూడా మీరు అద్దంలో చూపించారు. కంటి తడి ఇంకా ఆరటం లేదు. మాటలకందని చెమ్మ అది….!
    భాస్కర్ కూరపాటి/హ్యూస్టన్.

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      అమ్మ గురించి అందరు వ్రాయ లేక పోవచ్చునేమో కానీ…అమ్మ మాటలకందని మామిడి చిగురు….చెమ్మ కానక్కర లేదు.

      –వంగూరి చిట్టెన్ రాజు..

  • ఇన్నిసార్లూ నవ్వించిన రాజు గారు ఈసారి బాగా ఏడిపించారు. అటువంటి వాతావరణమూ, అలాంటి అమ్మలూ చాలామంది గుర్తుకొచ్చి ఎందుకో చెప్పలేనంత దిగులేసింది.

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      దిగులెందుకూ….అన్నీ గుర్తుకు వస్తే ఆనందించాలి….అన్నీ “మిస్” అయిపోతున్నామే అని కాస్త నిట్టూర్పు పరవా లేదు…కానీ దిగులు పడితే అమ్మకి బావుండదు!

      –వంగూరి చిట్టెన్ రాజు

    • అమ్మని తలచుకుంటూ ఏడ్చినా అది ఆనందమే కదండీ… :)

      • వంగూరి చిట్టెన్ రాజు says:

        అవును..అమ్మని తలచుకుంటూ ఏడుస్తూ ఆనందించినా, ఆనందిస్తూ ఏడ్చినా ఒకటేనెమో!

Leave a Reply to శ్రీన పాండ్రంకి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)