భూక ముండు చెప్పిన “రామాయణం”

IMG_3126 అస్సలు వర్షాలు లేకపోవడం చేత ఆసారి పంట పండనేలేదు. అందుకని ”ఈసారి దేవుడా ఎలాగైనా కరుణించు”అని ప్రార్ధించి ఒకానొక ఊర్లో ఒక పేద రైతు నాగలిపట్టి తనకున్న చిన్న మడి చెక్కని దున్నుతూ ఉన్నాడు. అట్లా దున్నుతూ దున్నుతూ ఉండగా అతనికి మంచి బుజ్జి పాపాయి దొరికింది. ఆ పాపాయిని చూసి రైతు ఆశ్చర్యపడి, నేనసలే పేదరైతును , నాకసలే గంపెడు పిల్లలు,వాళ్ళకే తిండి పెట్టలేని దరిద్ర పక్షిని ఈ పాపాయికేం పెట్టగలనూ అని చెప్పి, నేరుగా తీసుకెళ్ళి వాళ్ళూరి రాజుకి ఇచ్చేసాడు.

రాజు సరేలే అని చెప్పి తీసుకున్నాడు. పేరేం పెట్టాలా అనుకుంటుంటేనూ….. సరే మడి  దున్నతా ఉంటే దొరికింది కదా (దున్నడాన్ని సీతాయ్ అంటారట) సీత అని పెడితేపోతుంది అని ఆలోచన వచ్చి సీత అని పెట్టేసారు.

సీత పెరిగి పెద్దదయ్యింది. వాళ్ళింట్లో ఎవరూ ఎత్తలేక మూలపెట్టి ఉన్న శివ ధనస్సును ,ఒక సారి ఎందుకో అడ్డం వస్తేనూ చలాగ్గా ఎత్తి అవతల పెట్టేసింది. అది చూసి సీత వాళ్ళ అమ్మ నాన్న మన సీత మొగుడు ఆ శివధనుస్సును ఎత్తగలిగే వాడైతే ఈడుజోడుగా బాగుంటారు  అనేసుకున్నారు.

అడవుల్లో ఉన్న రాముడికి సీత గురించి ఎవరో చెప్పేరు. రాముడన్నాడు “లక్ష్మణా నువ్వెళ్ళు” అని. అందుకు లక్ష్మణుడు “లేదులే అన్న ఆమె నా వదినైతే బాగుంటుంది ” అన్నాడు. సరే రాముడు ధనుస్సు ఎత్తేశాడు ,పెళ్ళైపోయింది.

సీతను తీసుకుని రాముడు అడవిలో కాపరం పెట్టాడు. ఒకసారి ఏమయిందీ…… అదే అడివికి రావణుడొచ్చాడు. అడవిలోకొచ్చాక రావణుడికి బీడీ తాగాలనిపించింది . “ఇక్కడ నిప్పు దొరికే విదాయకమెదీ” అని ఆలోచిస్తూ ,నడుస్తూ  వుంటేనూ  దూరంగా ఒక దగ్గర పొగ లేస్తూ  కనిపించింది. పొగ వస్తున్నదంటే  నిప్పు ఉన్నట్టే అర్ధం కదా అని చెప్పి,ఆ దిక్కుగా నడిచి ఒక ఇంటి ముందు ఆగి నిప్పుకోసం ఇంట్లో వాళ్ళని పిలిచాడు. సీత నిప్పుని తీసుకుని వచ్చింది. ఆమెను చూసీ చూడగానే రావణుడికి ఆశ్చర్యం వేసేసి , అబ్బ ఎంత బాగుందీ అని చెప్పి ఎత్తుకెళిపోయాడు.

రాముడు ఇంటికొచ్చి చూస్తే సీత లేదు. ఇప్పుడోస్తుంది ,అప్పుడోస్తుందీ అని ఎంత సేపు చూసినా రాకపోయేసరికి  ఎక్కడికి పోయుండొచ్చు అనుకుంటూ వెదకడం మొదలు పెట్టేరు . మొదట దారిలో కనిపించిన రేగు చెట్టుని అడిగారు, అది నాకు తెలీదు అన్నది. తరువాత పరిగ చెట్టుని అడిగారు, అదీ నాకు తెలీదు రామా అన్నది. తరువాత బకుళని (కొంగ ) అడిగారు. బకుళకి పాపం పొద్దటి నుండి ఒక్క చేపన్నా దొరకలేదాయే , అందుకని దానికి చిరాకు వచ్చి “సీతా పీతా మొయ్ నియ్ జానోతో మొయ్ పేట్ కే   చిత జానోతో ” (సీతా పీతా నాకేం తెలీదు, నా కడుపాకలి మాత్రమే నాకు తెలుసు) అని రాముడ్ని కసురుకుంది. ఆ తరువాత హనుమ అనే కోతి రాముడికి సహాయం చేసి సీతని లంకనుండి తెస్తుంది. ఇహ రాముడు, సీత ఇంటికొచ్చేస్తారు. కానీ రాముడికి మనసులో ఈ సీత వేరే మగాడి దగ్గర అన్ని రోజులు ఉండి వచ్చిందేనని చెప్పి కొంచెం మంటగా ఉంది. అంతలోకి ఏమయిందీ ,వాళ్లకి అవతల వీధుల్లో ఒక చాకలతను ఉండేవాడు. అతని భార్య పుట్టింటికెళ్ళి రావడం కొంచెం ఒక రాత్రి ఆలస్యం చేసేసింది. అందుకని వాడేం చేశాడు. “హట్ …. ఎళ్లెళ్ళు నేనేమన్నా రాముడ్నా నిన్ను ఇంట్లోకి రానివ్వడానికి” అన్నాడు. అది విని రాముడు ఇంక సీతని విడిచి పెట్టేసి  లక్ష్మణుడు తో కలిసి వేరే అడవికి వెళిపోయాడు

ఇంక నేను మాత్రం ఇక్కడెందుకు అని చెప్పి సీత ఇంకో అడివికి వెళ్లి, నారదముని ఆశ్రమంలో వుంటూ వస్తుంది.

కాలం అట్లా గడుస్తూ వుండగా , ఒకసారి సీత గుడ్డలు గుంజుకోవడానికి నదికి వెళుతుంది. అక్కడో కోతి బిడ్డని పొట్టకి అంటించుకుని ఈ చెట్టు మీదనుండి ఆ చెట్టు మీదకి ఆ చెట్టు మీద నుండి ఈ రాయి మీదకి దూకుతూ ,గెంతుతూ ఉంది. అది చూసి సీత “కోతీ….. ఇంతకు ముందైతే సరే ఇప్పుడు బిడ్డ ఉంది కదా అట్లా గంతులేస్తే బిడ్డ పడి పోగలదూ” అన్నదట. అది విని కోతి , ” సరేలేవమ్మా భలే చెప్ప వచ్చావు గానీ … నా బిడ్డ నాకళ్లెదుటే ఉంది. దాని సంగతి నేను చూసుకోగలను. ముందు నీ బిడ్డ సంగతి నువ్వు చూసుకో . ఆ నారదుడి దగ్గర వదిలేసి వచ్చావు. ఆయన అస్థమాను ధ్యానంలో ఉంటాడు అప్పుడు నీ బిడ్డకేమైనా అయితేనో” అన్నదట. అదివిని సీత భయపడి పోయి గుంజే గుంజే గుడ్డల్ని అక్కడే వదిలేసి పరిగెత్తిందట. ఆశ్రమానికెళ్ళి చూస్తే నిజంగానే నారదుడు ధ్యానంలో ఉన్నాడు. సరే అని చెప్పి సీత బిడ్డని తీసుకుని నది దగ్గరికొచ్చి బిడ్డని కనుచూపుకి దగ్గరగా పడుకోబెట్టి పని చేసుకోవడం మొదలు పెట్టింది.

అక్కడేమయిందీ, నారదుడు ధ్యానం పూర్తి చేసి కళ్ళు తెరిచి చూసాడు ,చూస్తే బిడ్దేడీ ? లేడు! నారదుడికి భయం పట్టుకుంది. ” అమ్మో ఇంకేమైనా ఉందా … సీతకి ఏమని చెప్పడం ? ” అనుకుని పక్కనే  రెల్లు చెట్టు ఉంటేనూ ,దాని పువ్వు ఒకటి తెంపుకొచ్చి మంత్రమేసి బిడ్డని చేసి యథావిధిగా పడుకోబెట్టాడు. సీత పని చేసుకుని ఇంటికొచ్చి చూస్తే ఇంకో బిడ్డ ! ఆశ్చర్యపడి ,జరిగిన విషయం  తెలుసుకుని సరేలెమ్మని ఇద్దర్నీ పెంచడం మొదలు పెట్టింది.

ఇలా కొంతకాలం జరిగింది. పిల్లలు కొంచెం పెద్ద వాళ్ళయ్యారు. పక్క అడవిలోనే రాముడు లక్ష్మణుడు ఉన్నారని తెలుసుకున్న సీత పిల్లల్ని అక్కడికి వెళ్ళవద్దని ఎప్పుడూ వారిస్తూ వుండేది . వయసొచ్చే పిల్లలు అంతా తల్లి చెప్పినట్టే వింటారా ?వినరు కదా . అట్లా ఒకసారి, తల్లి మాట వినకుండా లవకుశలిద్దరూ పక్క అడవికెళ్తారు. వెళ్ళడమే కాక ,వెంటబడి ఈ అడవి వరకూ వచ్చిన హనుమని పట్టి బంధించెసారు.  అది విని రాముడు, లక్ష్మణుడు పిల్లలి మీదకి యుద్ధానికి వచ్చారు . రాముడూ లక్ష్మణుడూ పిల్లలి మీదకి యుద్ధానికి రావడం ,పిల్లలు మాట వినక పోవడం … ఇదంతా చూసి సీతకి బ్రతుకు మీద రోత పుడుతుంది. ఆ అడవిలోనే ఒక శివమందిరం వుంటేనూ  అక్కడికెళ్ళి తనకోసం భూమిని బద్దలు చేయమని శివుడ్ని కోరుతుంది. శివుడు అట్లాగే చేయగా ,సీత భూమిలో లయమై పోతుంది .

 -కథనం :  సామాన్య

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)