తిరోగమన పాఠం ‘ఉత్తమ కథ’ లక్షణమా?

 

 కథకి పెద్ద పీట వేయాలన్నది సారంగ వార పత్రిక లక్ష్యాల్లో ఒకటి. అందులో భాగంగానే ప్రతి వారం కథకి సంబంధించిన   ఏదో ఒక శీర్షిక వుండాలన్నది సారంగ ప్రయత్నం. ఇప్పటికే చిరపరిచితమయిన ఉమా మహేశ్వర రావు శీర్షిక ‘కథా సమయం’తో పాటు మరో కొత్త కథా శీర్షిక ఈ వారం నించి మొదలవుతుంది.

 ‘చిత్ర’ కలం పేరుతో కథాభిమానులకు పరిచితమయిన వీవీయస్ రామారావు గారు ఈ నెల నించి ‘కథాచిత్రం’ శీర్షిక ద్వారా ‘సారంగ’ పాఠకులను పలకరించబోతున్నారు. కథని ఒక లోతయిన ఆలోచనా ప్రక్రియగా చూడడం ఆయన విమర్శ మార్గం. ఒక కథ చదివాక పాఠకుడిలో ఎలాంటి ప్రశ్నలు రేకెత్తవచ్చు అన్న ఆలోచనతో కథని భిన్న కోణాల నుంచి చూసుకునే దృష్టి రచయితలకు ఏర్పాడాల్సిన అవసరం వుందని చిత్ర అంటారు.

*

2003 ఇండియా టుడే మార్చి 18 – 25 సంచికలో చోరగుడి జాన్‌సన్‌గారు ‘మట్టి పక్షులు’ అనే కథ రాశారు. ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ఉత్తమ కథగా ఎన్నికైంది. రచయిత దీన్ని కథ అన్నారు కాబట్టి సంపాదకులు సరే అన్నారు కాబట్టి అలాగే కానిద్దాం. వాళ్లని అక్కడే వదిలేద్దాం.

దీంట్లో పాత్రలు రెండు. ఇద్దరూ దళితులే “అంజయ్య పుట్టిన ఏడాదికే తండ్రి చనిపోయాడు. తల్లి ఊర్లో రైతుల ఇళ్లల్లో చాకిరీ చేసి కొడుకుని పెంచింది.” అంజయ్య టీచరయ్యాడు. మరో టీచరమ్మని పెళ్లాడాడు. ఇద్దరు కొడుకుల్నీ, కూతుర్నీ ఇంజనీర్లని చేసేడు. పెద్ద కొడుక్కి మంచి వుద్యోగం రాలేదనీ, మరీ లో పే ఆఫర్ చేస్తున్నారనీ “దిగుల్తో, ఆలోచనల్లో వున్నాడు. చలికాలం అర్ధరాత్రి రైల్వే స్టేషన్లో అతనికి డానియెల్ కలుస్తాడు. సిగరెట్లు కాలుస్తూ పెద్ద వుపన్యాసం యిస్తాడు. చివరికి అంజయ్యకు మనసులో అనిపించింది. “తన కుటుంబంలో మరొక తరం తన వృత్తిలోనే ఉండి  ఉండాల్సిందని”

అదండీ విషయం. అంతా చదివేక అజ్ఞానానికి హద్దు లేదనిపిస్తే మన తప్పు కాదు. వెనక్కి వెనక్కి పరిగెట్టమని  చెప్పే ఈ కథ వుత్తమకధ కావడానికి కారణాలు  వెతికి తీరాలి.

ఇంతకీ అంజయ్య బాధేమిటి? ఎందుకు? ఈ ఆలోచనలు? ఏమిటి దుఃఖం  అని చూస్తే కొడుక్కి పెద్ద జీతంతో గొప్ప వుద్యోగం- ముతగ్గా చెప్పాలంటే కాలు మీద కాలు వేసుకుని అజమాయిషీ చేసే అవకాశం రాలేదని. వ్యవస్థా యంత్రాంగంలో చోటు దక్కలేదని.. సరే ఆశ తప్పు కాదు. ఆలోచన సరిగ్గా వుండాలి. కథ మొదట్లోనే పోరాట క్షేత్రంలో అసమానతలు వున్నాయా?” అని ఆలోచించిన అంజయ్య “ఎక్కడో ఏదో మతలబుంది. పట్టుకోవడానికి ప్రయత్నించాలి”  అన్న అంజయ్య, మనలో ఆసక్తి రేకెత్తించిన, అంజయ్య చివరికిలా దిగజారిపోవడానికి డానియెల్ వుపదేశమే కారణం అయితే గురువుగార్ని పుఠం పెట్టవలసిందే. ఈ డానియెల్ అనే వ్యక్తిదంతా అజ్ఞాన ప్రదర్శన. అచారిత్రకం, అవాస్తవం. తిరోగామి  ఆలోచనావిధానం. ఇతను ఈ దోపిడీ వ్యవస్థకి నమ్మిన బంటు. జీతం బత్తెం లేని నౌకరు.

చరిత్ర చూస్తే అరవై డెబ్బైలనాటికి మన దేశంలో భూస్వామ్య వ్యవస్థకి కీళ్లు కదిలిపోయాయి. పెట్టుబడిదారీ ఈడేరింది. ఫలితంగా అసమానతలు తీవ్రమయ్యాయి. కులవ్యవస్థకి, కులవివక్షకి అవి జోడయ్యాయి. మరోవైపున అవే పెట్టుబడిదారీ విస్తరణకు అడ్డంకయ్యాయి. ఆ సమయంలో అంబేద్కర్ ధర్మమా అని రిజర్వేషన్లు ఒక చిన్న మార్గం కావడంతో కొద్దిమంది చదువు సాయంతో ఒక స్థాయికి చేరుకున్నారు. భద్ర జీవితానికి, అజమాయిషీకి అలవాటు పడ్డ వీళ్లు క్రమంగా ప్రభువులకీ, వారి అవసరాలకీ, ఆలోచనలకీ దాసులుగా మారేరు.(మాంచెస్టర్ సిండ్రోం) ప్రభువుని మించిన ప్రభుభక్తి ప్రదర్శిస్తారు. ఇది సూత్రం ఇది చరిత్ర. ప్రతి సమూహం నుంచీ కొంతమంది విధేయుల్ని తయారుచేసుకోడం వ్యవస్థ కొనసాగింపుకి  అవసరమే. ట్రేడ్ యూనియన్లు, దళితులు, స్త్రీలు, మైనారిటీలు ఇలా విడగొట్టి తాయిలాలిచ్చి తన వాళ్లుగా చేసుకోడం వ్యాపారసూత్రం. అందుకే డానియల్ పదే పదే దళితుల్ని తప్పు పడతాడు. ఎద్దేవా చేస్తాడు. దళితులు వగైరాలో చేసే కనీసపు పోరాటాలు కూడా ఆయన్ని బెంబేలెత్తిస్తాయి. మధ్యతరగతిగా మారిన మిధ్యామేధావులు కులాంతరీకరణ చెందే క్రమంలో వర్గాంతరీకరణ చెందారు. చర్చిల్లో కూడా రకరకాల వివక్షల్ని మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. డానియల్ తన శబ్దాతిసార ప్రకోపంలో ఏమన్నాడో చూద్దాం.
“చదువయిపోయిన ఏడాదికే నీకు గవర్నమెంటు వుద్యోగం దొరకటం నీకున్న అర్హతని బట్టి వచ్చిందే కానీ అది ఏ ఒక్కరి ఆయాచిత ధర్మం కాదు” అనడం పరిపూర్ణమైన అబద్ధం.
డానియల్‌కి తన షావుకారు సిఫార్సు వల్ల వుద్యోగం వచ్చింది. అలా సిఫార్సులు లేని అసంఖ్యాక దళితులు మట్టిలోనే మిగిలేరు.

ఇతర కులాల  స్తోమత కలిగినవాళ్లతో “మనం పోల్చుకోవటం మొదటి తప్పు” అని అంతరాల్నీ, కులవివక్షనీ మహాగట్టిగా బలపరుస్తాడు. ఈ పేరా అంతా చదువుతుంటే మనకి విశ్వనాధవారు గుర్తొస్తారు. ఇద్దరి భావాల్లోనూ, తత్వంలోనూ ఏ మాత్రం తేడా కనబడదు. ఆయనది సంస్కృతవేదం. డానియల్‌ది ఇంగ్లీషువేదం.

“మంచిని సవ్య దృక్పధంతో చూడలేకపోవడం రెండో తప్పు” అని తప్పంతా దళితుల పైకి, బలహీనులపైకి నెట్టేసి, వ్యవస్థ అంతా మంచిదని ప్రకటిస్తారు ఈ విస్సన్నగారు!!
“ఏమి సృష్టించుకుంటావు అనేది నీ నైపుణ్యానికి సంబంధించిన విషయం” అని మేనేజ్‌మెంట్ గురూ పాత్రలోకి దూరి గంభీరమైన ప్రకటన చేస్తారు. చరిత్ర పట్ల, సూత్రాల పట్ల అత్యంత కనీసపు అవగాహన లేని  వాగాడంబరం. ఏ నైపుణ్యం వుందని, అంజయ్య పేపర్లో చూసి కాపీ కొట్టి పరీక్షలు పాసైన దుర్గాప్రసాద్ ఇంజనీరింగు కాలేజీకి యజమాని అయ్యాడు?ఇంజనీరు కావాలనుకున్న అంజయ్య ఆలోచనలు అడివూళ్లో అలా అయ్యవారుగా తెల్లవారేయి” అని రచయిత స్పష్టంగా రాశాడే! భాష భావాల రూపం అనుకుంటే “సృష్టి” “నైపుణ్యం” ఎవరి భావాలివి? ఎవరికి పనికొస్తాయి??

మధ్యలో మంచి హాస్యమూ వుంది. “దేశానికి స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసి, పోరాటాలు చేసిన వేలాది కుటుంబాలు స్వాతంత్ర్యం వచ్చాక సహజంగానే తొలి పంక్తిలో అధికార విందుకు సిద్ధమయ్యాయి” అయ్యా! అదీ సంగతి! 2003లో చిన్న పిల్లాడైనా నమ్ముతాడా ఈ విషయం? బొబ్బిలి, భోపాల్, తిరుచ్చి వగైరా జమిందార్లు త్యాగాలు చేసేరు. వాళ్ల పొలాలు పండించి కుప్పలు పోసిన దళితులు ద్రోహులుగా మిగిలేరు! దగాకోరు మాటలు , మోసకారి వుపన్యాసాలు! ఎందుకంటున్నాడు అలా? వినండి.. వాళ్ల క్లెయింని నువ్వూ, నేనూ కాదనగలమా? అంతిమ ఫలాల దగ్గర నా వాటాకు ఇన్ని రావాలీ అంటే నీకు ఇవ్వడానికి ఎవడూ ఒప్పుకోడు” అని స్పష్టం చేశాడు. రిజర్వేషన్లు అడగొద్దని మహోపదేశం చేస్తున్నాడు. అదంతా తప్పని తేల్చేసేడు. బూట్లు తుడిచిన బ్రాహ్మణ పిల్లల్ని మించిపోయేడు. అక్కడితో ఆగుతాడా? “గాంధీజీలో మనకు కావల్సిన మంచిని తీసుకోవడానికి మనకు అభ్యంతరం ఎందుకు వుండాలి?” అని దళితుల్ని గుడ్లు వురిమాడు.

అబ్బా!! సరే! పైగా మన ఏకవాక్య ఎజెండా రాజ్యాధికారం” అంటూ ఏకంగా అంబేద్కర్‌నే తప్పు పట్టే స్థాయికి ఎదిగిపోయేడు (దళితులకి రాజ్యాధికారం అన్నది అంబేద్కర్ వాక్యం) ఇంకా అంటాడు ” ఏ అద్భుతమో  జరిగి నిజంగానే మన దోసిళ్లలోకి వచ్చి పడితే అది చేజారిపోకుండా పట్టుకోగలిగిన బాహుబలం మనకుందా?” అని దళితుల్ని కించపరుస్తూనే ప్రభువుల పంచన చేరమని ప్రబోధిస్తాడు. నిరంతరం శ్రమ చేసిన బాహువుల్లో బలం లేకుండా ఎందు కుందని మాత్రం ఆలోచించడు.
“ఉన్న ఊళ్లో వునికి ప్రశ్నార్ధకమైతే దానికి అడివి జవాబు ఎలా అవుతుంది? మన మానవ వనరు అంతా యాంటీ ఎస్టాబ్లిష్‌మెంటు దృక్పధం అలవర్చుకుంటూ పోతే సవ్య దిశలో యోచించడానికి మనకి మిగిలే  సమూహాలేవి? అన్న డానియల్ ప్రభు వర్గాల ప్రధాన ప్రచారక పదవికి ఎంతైనా అర్హుడే. ముస్లీంలంతా టెర్రరిస్టులు. దళితులు నక్సలైట్లు. ఆహా! ఏమి జ్ఞానం!!!

దళితుల్ని నిందిస్తున్న డానియల్ కారణాలు వెదకడు. ప్రభుత్వంతో ప్రజలు ఘర్షణ పడుతున్నారంటే వాళ్లు కోపంగా వున్నారని. బాధల్లో వున్నారని అర్ధం. ప్రభుత్వాలతో ప్రజలు పడే ఘర్షణే చరిత్ర. ఆక్రమంలో ఎవరు ఎటు వున్నారనేది చాలా ముఖ్యం అవుతుంది. డానియల్ వఱడు కాదు. వీర బొబ్బిలీ కాదు. అదొక డాన్ జువాన్. మేకల మందలో తోడేలు. “గ్రామీణ  కూలీలు విశాల భూభాగాలకు తరలిపోతే అది వారి ప్రతిఘటనా శక్తిని తగ్గిస్తుంది. పట్టణాల్లో కేంద్రీకరించబడ్డ కూలీలకు పోరాట శక్తి పెరుగుతుంది”అని మహాశయుడు అన్నాడు. మరి గ్రామాల్లోనే వుండిపొమ్మని దళితులకి బోధించడం అంటే వ్యవస్థ కొనసాగింపుకి కొమ్ము కాయడమే. దళితులకీ, కూలీలకీ డానియల్ ఇస్తున్న సందేశం ఏమిటి? మట్టిని కాల్చి ఇటుకలమ్ముకొమ్మనీ, తేనేపెట్టెలు పెట్టి అమ్ముకొమ్మనీ, పాలు పెరుగు అమ్ముకోమనీ, ఆకుకూరలు ఆమ్ముకొమ్మనీ.

ఓహో డానియల్ మహర్షీ! మనువుని మించిన మహాగురువు. వేదాన్ని మించిన మహామేధ! పొలాలన్నీ కంపెనీల చేతుల్లో వుంటే ఎవరి పొలాల్లో మట్టి తీసి ఎక్కడ కాల్చాలి? ఏ చెట్లకి తేనె పెట్టెలు పెట్టాలి? గేదెల్ని ఎక్కడ మేపాలి? ఆకుకూరలు ఏ రైతుల పొలాల్లో పండించాలి? “ఎంట్రప్రెన్యూర్”  ప్రావీణ్యత ఎలా చూపించాలి? చిల్లర వర్తకంలో చొరబడుతున్న లక్షల కోట్ల డాలర్‌ల విదేశీ పెట్టుబడికి పోటీగా వీళ్లని నిలబెట్టడం ఎందుకు? వరద వుదృతిలో పిల్ల చేపలూ, పిత్తపరిగెలూ కొట్టుకుపోతాయి. పెట్టుబడిదారీ పెరిగే కొద్దీ చిన్నచిన్నవైపోయిన కమతాలు గుత్తపెట్టుబడి  పుట్టుకతో కార్పోరేట్ భూఖండాలుగా మారిపోయిన విషయాన్ని ఎంగెల్స్, లెనిన్‌లు పదెపదే ప్రస్తావించారు.మన వర్తమానం మరోసారి అది రుజువు   చేసింది.
రాసుకుంటూ పోతే ప్రతి వాక్యాన్ని ఖండఖండాలు చేయాలి. మీ సమయం వృధా. విషయానికొస్తే నిరుద్యోగం పెరిగిపోవడం ఒక చారిత్రక విషాదం. ఇంజనీర్లకే కాదు కూలీల్లోనూ భయంకరంగా పెరిగింది. కారణం పెట్టుబడిదారీ విధానం కొంతకాలం ప్రభుత్వ రంగ సంస్థల పేరుతో స్టేట్ కాపిటలిజం నడిచి వ్యక్తి పెట్టుబడిని పెంచింది. అంజయ్యలూ, డానియల్‌లూ తయారయ్యేరు. ఇప్పుడు డిజిన్వెస్ట్‌మెంట్ తారకమంత్రమైంది. ఈ క్రమంలో అత్యధికంగా నష్టపోతున్నది దళితులు, ఆదివాసీలు, ఇతర బలహీనవర్గాలు. దీన్ని “ప్రభుత్వ పాత్ర అయిపోయింది” అని డానియల్ సమర్ధించడం ప్రజల్ని తప్పుదోవ  పట్టించడమే.

2003లో వుపన్యాసమిస్తూ దళితుల్ని, ఇంకా గ్రామాల్లోనే వుండమని చెప్పడం అచారిత్రకం. ప్రజావ్యతిరేకం. ఆర్ధిక సూత్రాలకు పొసగని ఆలోచన ఇది.

ఒక రంగంలో వచ్చిన పెట్టుబడిదారీ విధానం అన్ని రంగాలకీ వ్యాపిస్తుందనీ, గ్రామీణ పరిశ్రమలు కనుమరుగౌతాయని, మిగిలిన ఒకటీ రెండూ కూడా అమానుషమైన పరిస్థితుల్లో స్త్రీలూ, చిన్న పిల్లలూ లాంటి చవక శ్రమపై ఆధారపడి హీనమైన దోపిడీ చేసి చివరగా వూపిరాడక చస్తాయని మహాశయుడు స్పష్టం చేశాడు.

సరే ఆయనతో డానియల్‌కి పేచీ వుండొచ్చు.

సోషల్ మేష్టారుగా పాతికేళ్లు పైన పని చేసి భూపోరాటాలకి సానుభూతి చూపించిన వుపాద్యాయ సంఘం నాయకులైన అంజయ్య, కనీసం ప్లానింగ్ కమీషన్, జాతీయ అభివృద్ధి మండలి, జాతీయ నమూనా సర్వేలు రాసినవి గానీ, టన్నులకొద్దీ వచ్చిన ప్రభుత్వపు రిపోర్టులు కానీ కనీసం తిరగేసి వుంటే గ్రామాల్లోనే వుండిపోవాలన్న ఆలోచనకి రాడు. ఇంతకీ డానియల్ ఒక్కడే కాదు. అంజయ్యా దొంగే.
“జిల్లా నాయకత్వ పదవి రాగానే జిల్లా కేంద్రానికి దగ్గరగా బదిలీ” చేయించుకుని రిలాక్స్ అయినవాడు ఏం సేవలు చేసి వుంటాడో ఊహించడం కష్టం కాదు.

 (కవర్ పెయింటింగ్ : ఎస్వీ రామశాస్త్రి ) 

Download PDF

14 Comments

 • Syamala Kallury says:

  కథ బాగుంది కానీ కథలా లేదు, కథాకథనశక్తి తక్కువగా విమర్ర్శనాత్మక విశ్లేషణ ఎక్కువగా వుంది, మంచి వ్యాసంగా ఎక్కువ రాణించి వుండేది. అల్లాని రచయితా చెప్పిన సందేశంలో అసంబద్దత వుందని కాదు. కథలామాత్రం లేదు. narrativity తక్కువ అని మాత్రం ఉద్దేశ్యం.

 • raghava charya says:

  సమాజం నుంచి దేవుడిని, మనిషి నుంచి కులాన్ని, మనసు నుంచి ఆలోచనని, జీవితం లోంచి అవసరాలని, ప్రావీన్యత లోని కీర్తి కాంక్షని, దృశ్య-శ్రవణాల వల్ల కలిగే అభిప్రాయాలని… వగైరా … తొలగించడం యెంత తేలికో గుడులు-చర్చిలు-మసీదులు చెప్పలేకపోయినా…సెక్యులర్ చరిత్ర చాలా స్పష్టంగా చెప్పింది. మనిషి జీవనాన్ని- మనసు గమనాన్ని వన్ పర్సెంట్ చూడగలిగిన వాళ్ళంతా కవులు, మేధావులుగా మారిపోతున్న ఈ రోజుల్లో.. ‘మనిషి’ అనిపించుకునే అర్హతను, మనిషిగా జీవించ గలిగే లక్షణాన్ని వన్ పర్సెంట్ అయినా తెలుసుకోగలగడం కష్టమే మరి. కండల్లో బలాబలాలు, ఆలోచనల్లో బలాబలాలు, అనుభవాల్లో బలాబలాలు, కలం పదునుల్లో బలాబలాలు, ఆడ మగల బలాబలాలు, భావ వ్యక్తీకరణలో బలాబలాలు, సమ సమాజ స్థాపన ఎలా జరగాలన్న వాదనల్లో బలాబలాలు వగైరా కలగలిసి ప్రపంచాన్ని ‘విలేజ్’గా మార్చాయి. ఇండియన్ విలేజ్ ని ఛీ అన్న వాళ్ళంతా గ్లోబల్ విలేజ్ ని ఒప్పుకున్నారు. అందుకే మట్టిని నమ్ముకున్న వాళ్ళని ఒప్పించి మట్టిని అమ్ముకునేలా చేసారు. అంజయ్యలు, దానియేల్లు, చిత్రలు, సారంగలు చరిత్రకు కొత్త కాదు. మనమే మనకు కొత్త. అందుకే ఏదో చెప్పాలని తాపత్రయం (నాకు లాగా).

 • NavyMan says:

  అసలు ఈ వ్యాసం ఎందుకు రాసారో, ఎం చెప్పాలనుకున్నారో, ఏం అర్ధం కాలా … క్షమించండి. వ్యాసం హెడ్ లైన్ చాలా తెలివిగా పెట్టి లేని సమస్యని సృష్టించి పరిషకరించారని నా చిన్ని బుర్ర అనుకుంటోన్ది.

  లేకుంటే ఎప్పుడో పది సంవత్చరాల కాలం నాటి కధమీద ఇంత విశ్లేషణ ఎందుకో .. అసలు ఆ కధకు ఉత్తమ బహుమతి ఎందుకు వచ్చిందో కూడా మనకు తెలీదు. కధ ఎవరికీ గుర్తు లేదు కూడా . ఈ hypothesis అవసరమా. దానికి విశ్లేషణ, సమర్ధింపు ఇంకా అవసరమా. వర్గ లోచనాలు పక్కన పెట్టి కధను కధగా చూద్దామండీ – ఒక సగటు పాటకుడు /సాహిత్యాభిమాని.

 • manjari lakshmi says:

  చిత్రగారి ఇంత చక్కని విమర్శని ఎందుకు అర్ధం చేసుకోలేక పోతున్నారు. గ్రామాలలో కూలిపోతున్నవ్యవస్థల్ని, బతుకీడ్చటమే కష్టంగా ఉన్న ఆ పరిస్తితిల్ని అర్ధం చేసుకోకుండా అక్కడే ఉండాలని చెప్పటం తిరోగమనం కాదా. రచయితలకు ముందు చూపుంటేనే అది ప్రజలకు/పాఠకులకు ఉపయోగం. డానియల్ అనే వాడు ప్రజల పరిస్థితికి కారణమైన ప్రభుత్వాలను, దాని వెనకనున్న గుత్త పెట్టుబడిదారి వ్యవస్థను ఏమనకుండా ఉండటం చూస్తే అతను ఎవరి కొమ్ము కాస్తున్నాడో అర్ధం కావటం లేదు. దాన్నే కదా చిత్ర గారు విమర్శించింది.
  అయతే నాకీ కింద వాక్యం అర్ధం కాలేదు:
  “చదువయిపోయిన ఏడాదికే నీకు గవర్నమెంటు వుద్యోగం దొరకటం నీకున్న అర్హతని బట్టి వచ్చిందే కానీ అది ఏ ఒక్కరి ఆయాచిత ధర్మం కాదు” అనడం పరిపూర్ణమైన అబద్ధం. డానియల్‌కి తన షావుకారు సిఫార్సు వల్ల వుద్యోగం వచ్చింది. అలా సిఫార్సులు లేని అసంఖ్యాక దళితులు మట్టిలోనే మిగిలేరు.” ఇలా చెప్పింది డానియలేనా. మరి నీకు (అంజయ్య) బదులు నాకు అని ఉండాలి కదా.

  • chitra says:

   మేడం గారూ డేనియల్ మాట్లాడినది అంజయ్య గురించే .అంజయ్య కి ఉద్యోగం ఒక రాజకీయ నాయకుని సిఫార్సు వాళ్ళ వచిందని రచయితా రాసారు

 • NavvyMan says:

  మంజరి గారూ , కధలో ఉన్న విషయం మీద నాకు సమస్య లేదు. చిత్ర గారు ఆ విషయాన్ని వ్యతిరేకించడం మీద కుడా సమస్య లేదు. సమస్యల్లా, తిరోగమనానికి ఉత్తమ కధ కి ముడి పెట్టడం. కధలో విషయం కన్నా, కధనం, భాష, స్పందనాసామర్ధ్యం ఇలాంటివన్నీ కదండీ కధను ఉత్తమం చేసేది.

  ఉదాహరణకి తెలంగాణా కావాలని రాస్తే ఉత్తమ కధ కాకూడదు అంటే ఎలా ఉంటుంది? బ్రాహ్మణున్ని దొంగగా చూపిస్తే ఉత్తమ సినిమా కాకూడదు అంటే ఎలా? ఏది తిరోగమనం, ఏది కాదు అన్నది ఆయా పాఠకుల గత వర్తమాన పరిస్థితుల బట్టీ ఉంటుంది కదన్దీ.. అదీ నా బాధ.

  • chitra says:

   సార్ మీ మెయిల్ ఇస్తే మాట్లాడుకుందాం చిత్రామారావు@జిమెయిల్.కం

 • Thirupalu says:

  మీ రెత్తి చూపిన విమర్శ అన్యాయ మైనది,అమానుషమైనదీ, కొండకచో విపరీతమైనది మేము వర్ణవ్యవస్త పునరజ్జీవనము కావింప నిచ్చి యించి ఇటువంటి కధలకు ఉత్తమ అవార్డు ను భహుగా భహూక రించు చున్నారము. మీరు వ్యతిరేకించుట ఎంత మాత్రము సహింప దగినది కాకయున్నది. విభేదించి రే పో విమర్శించ నేల? ఇండియా టుడే వంటి పత్రికలను నడుపు చున్నది ఎందులకు?

 • Kavitha says:

  విమర్శలో మరీ ఇంత శాడిజమా? అసలు మీ దృష్టిలో ఏవి ఉత్తమ కథలు? పోనీ ఒకే ఒక్క ఉత్తమ కథ రాసి చూపిద్దురూ?

  • CHITRA says:

   నమస్తే . బావుంది . సరే కాని రాచమల్లు వారు రాసిన గొప్ప కథ ఏది ? కే వి రమణ రెడ్డి గారు లేదా త్రిపురనేని వారు ఎన్ని గొప్ప కథలు రాసారు / రాచపాలెం వారు లేదా కోడూరి?.

   • CHITRA says:

    సారూ ఒక్కసారి నరసింహ శర్మ గారు రాసిన వారసత్వం కానీ కుటుంబరావు గారిని కానీ గోకలే ని కానీ చదవకూద డా

 • kavitha says:

  అంత గొప్ప వారితో పోలిక ఏం బావుంటుంది చెప్పండి?

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)