మూడు ముక్కలయిన గుండె కోత “మొరసునాడు కథలు”

MorasunaduKatalu

భాషాప్రయుక్త రాష్ట్రవిభజన, పరిపాలనా సౌలభ్యం కోసమే అనడం నిజమే అయినా, ఒకే భాష మాట్లాడుతున్నవారు, వేర్వేరు రాష్ట్రాలలో కొందరైనా మిగిలిపోవడం, ఆ భాషకు జరిగిన అన్యాయానికి గుర్తే! ఎక్కువమంది మాట్లాడుతున్న భాషగా గుర్తింపు పొందిన తెలుగు భాష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో తమిళనాడు, మైసూరు, ఒడిశా, మధ్యప్రదేశ్ మున్నగు ప్రాంతాలలో ఎంతోమంది తెలుగువారిని పోగొట్టుకుంది. తమిళనాడులో దాదాపు యాభై శాతాన్ని మించి ఉండిన తెలుగు ప్రజల సంఖ్య,  2012 నాటి తమిళనాడు ప్రభుత్వ గెజిట్ ప్రకారం కేవలం రెండు శాతం మాత్రమే అనడం సాంస్కృతికంగా, ముఖ్యంగా భాషాపరంగా తెలుగు వారు నష్టపడుతున్న విధానానికి ఆనవాలు.

ఈ నేపథ్యంలో, యిటీవల వెలువడిన “మొరసునాడు కథలు” అన్న ముప్ఫైకథలతో కూడిన సంకలనం పేర్కొనదగినది. ఆంధ్ర, కర్ణాటకం, తమిళ రాష్ట్రాలుగా ముక్కలైన మొరసునాడులో నివసిస్తున్న రచయితల రచనలివి. తెలుగు భాషాభిమాని,  ప్రళయకావేరి కథల రచయిత,   యీ పుస్తక సంపాదకులలో ఒకరు అయిన స.వెం. రమేశ్ గారు

మొరసునాడును గూర్చి చేసిన విశ్లేషణ గమనింపదగినది. మొరసు అంటే గులకరాతినేల అని అర్థం. గాంగ, రాష్ట్ర కూట రాజవంశస్థుల మధ్య జరిగిన పోరాటాలకు నెలవైన ఈ మొరసునాడు, ప్రాచీన ప్రాకృత శాసనాలలో ‘ సణ్ణనాడు’ గా చోళుల కాలంలో ‘చోళమండలం’గా నొలంబరాజుల కాలంలో ‘నొలంబవాడి’ గా పిలువబడినా క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దపు

శాసనాలలో మొరసునాడుగా గుర్తింపబడింది.

ఆంధ్రప్రదేశ్ లోని పాత కుప్పం, పలమనేరు, పుంగనూరు, హిందూపురం తాలూకాలు, మదనపల్లి తాలూకాలోని ఎక్కువ భాగం,    కర్ణాటకలోని కోలారు, చిన్నబళ్ళాపురం, బెంగుళూరు నగరంలోని అన్ని ప్రాంతాలూ, బెంగుళూరు పరిసర ప్రాంతాలైన పెద్ద బళ్ళాపురం, దేవునిపల్లి, కొత్తకోట తాలూకాలు,  తమిళనాడు లోని హోసూరు, డెంకణి కోట తాలూకాలు, వేపనపల్లి ఫిర్కాలు కలిస్తే మొరసునాడు అవుతుందట! ఈ మొరసునాడులో  మొత్తం మీద యాభై శాతం తెలుగువారు, ముప్ఫైశాతం కన్నడిగులు, పది శాతం తమిళులూ, పదిశాతం యితర భాషలు మాట్లాడేవారున్నారట!

ఈ సంకలనం లోని కన్నడ కథల్లో తొమ్మిదింటిని నంద్యాల నారాయణరెడ్డి గారు, ఒక్క కథను కె.యెస్. నరసింహమూర్తి గారు తెలుగులోకి అనువదించగా, తమిళనాడు నుండి తీసుకున్న పది కథలూ తెలుగులో వ్రాసినవే కావడం అక్కడి వారి తెలుగు భాషాభిమానానికి పతాకనెత్తుతూంది.

మూడు ముక్కలైన మొరసునాడు లోని తెలుగు ప్రజల ఏకీకృత  సాంస్కృతికాంశాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికీ, పరిశోధకులకూ మంచి ఆధార గ్రంథంగా ఉపకరించే ఈ “మొరసునాడు కథలు” తెలుగు సాహిత్య సరస్వతికొక విలువైన ఆభరణంగా అమరిన గ్రంథం. శతాబ్ద కాలాన్ని అధిగమించిన  తెలుగు , కన్నడ కథలు జానపద

స్థాయినుండి గ్లోబలైజేషన్  ప్రభావం దాకా గల విస్తార పరిథిలో సాగగా, తమిళనాడులోని తెలుగు కథలు ఎక్కువమందివి పదేళ్ళ ప్రాయపు పసితనంతో కూడినవైనా, తాము నష్టపోతున్న తమ సాంస్కృతిక విలువలను కాపాడుకోవాలన్న తపనకు అద్దం పట్టేవిగా ఉన్నాయి.

ఈ కథలనన్నిటినీ చదివిన తర్వాత, మానవుని జీవితంలో అత్యంత సాదారణంగా కనిపించే మౌలికాంశాలు, ఏ ప్రాంతంలో నివసించే వారిలోనైనా సమానమైనవే అన్న సత్యాన్నిమరోసారి గుర్తు చేసుకుంటాం. జీవితాలను తలక్రిందులు చేయగలిగిన శక్తి అంతటా సమానమే అని గమనిస్తాం.

స్వాతంత్ర్యానంతరం మనుష్యుల జీవితాల్లో వచ్చిన వేగవంతమైన మార్పులు. ప్రాచీన విలువలను విధ్వంసం చేసే దిశగా పయనించడం, మానసికంగా మారలేని, ఆర్థికంగా పురోగమనం సాధించ వీలుకాని పెద్దల జీవితాలు సంక్షోభంలోకి నెట్టివేయబడటం, యీ స్థితి మానవసంబంధాలపై చూపే ప్రభావం (రానున్న శిశిరం) యీ కథల్లో కనిపిస్తాయి.

ప్రపంచీకరణ ప్రభావం కులవృత్తులను అంతరింపజేసి, జీవితాలను తలక్రిందులు చేయడాన్ని (అన్నంగుడ్డ) కరుణరసాత్మకంగా వివరిస్తాయి. ఫ్యాక్టరీలకోసమని,  కార్ఖానాల కోసమని, పంట చేలను సెజ్ లుగా గుర్తించి, నామమాత్రపు ధరలు చెల్లించి స్వాధీనం చేసుకునే ప్రభుత్వం, భూస్వాములను కూలీలుగా ఎలా మారుస్తుందో, ఆ ప్రాంతపు ప్రజలు పొలాలను, ఊర్లను కోల్పోయి నిలువనీడలేక వలసవాదులుగా ఎలా మారిపోతున్నారో, మనసును పరిమళింపజేసే మట్టి వాసనలను కోల్పోయి, స్వచ్చమైన ప్రాకృతిక సౌందర్యం కోసం ఎలా వెదుక్కుంటున్నారో చెప్పే కథలు ( మా ఊర్లుఎత్తేస్తారా…!, బి.డి.ఎ.వెలినెలవు & చిక్కతాయమ్మ నేల) గుండెను తడి చేస్తాయి.

దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న కొడుకు నుండి ఉత్తరం రావడం ఆలశ్యమైతే, తరంగాల్లా పుట్టే ఆలోచనల్తో సతమతమయ్యే తండ్రి మనసు (తరంగాలు)కు అద్దంపట్టే కథలు, రెండు సంవత్సరాలకొకసారి కూడా గ్రామంలోని తలిదండ్రులను చూసిరావడానికి తీరికలేని కొడుకుకోసం బియ్యాన్ని, కూరగాయలను మూటలుకట్టే తల్లి, ఈ సారి వచ్చేటప్పుడు తనకొక చీరను తెచ్చిపెట్టమని, కొంగున ముడివేసి యున్న రూపాయలను కొడుకు చేతిలో పెట్టే (అమ్మకొక చీర) కథలు మనసును తడిచేసే అపురూపమైన అక్షర శిల్పాలు.

స్వార్థ రాజకీయాలు,  గ్రామీణ ప్రజల ఐక్యతారాగాలను రూపుమాపి, విధ్వంసాలను సృష్టిస్తున్న  (ఇసుక) అమానవీయతను, ఆకాశరామన్న ఉత్తరం ఆధారంగా తనిఖీకి వచ్చిన అధికారికి ఆతిథ్యమిచ్చి, రాత్రిపూట అతడు నిద్రిస్తున్న యింటితో బాటు ఫైలును కూడా తగలబెట్టిన ( తనిఖీ) దౌష్ట్యాన్ని చూసి ఉలిక్కి పడతాం.

వేటగాడి ఉచ్చులో తగుల్కున్న జింకపిల్లలా మగవాడి మోసానికి సులభంగా లొంగిపోయిన చదువుకున్న యువతి ( జింకపిల్ల ),  ప్రేమించిన యువతి మరొకరితో చనవుగా మాట్లాడటాన్ని కూడా సహించలేని వారు (ఎదగలేనివారు),  లేచిపోయి, మోసపోయిన భార్యను ఆదరించిన మనసున్న మనిషి ( వెంకటగాని పెళ్ళాము ), బస్సులో దొరికిన తొమ్మిది లక్షల రూపాయలను డిపోలో అప్పగించిన నిజాయితీని,  చేతకానితనంగా నర్ధారించిన లోకరీతి ( మీరైతే ఏం చేస్తారు?),  తన జన్మకు సంబంధించిన రహస్యాన్ని చెప్పి, తత్ఫలితంగా తన ఆస్తి మీద హక్కునూ, తన ఉనికినీ కోల్పోయి, ఆత్మహత్య చేసికొన్న చంద్రంలాంటి వ్యక్తులు (నేను చంపిన యువకుడు ) , మట్టిగాజులు కొనడానికయ్యే ఐదు రూపాయలను భర్తకు తెలియకుండా దాచడంలో సంఘర్షణ పడిన యాది ( యాది పండగ సంత చేసింది)వంటి నిరుపేదలు, తనను నిర్లక్ష్యం చేసిన కొడుకు కోడళ్ళ మన్నన పొందిన”‘ కూరాకవ్వ”లు, తెలుగు నేల వైశాల్యాన్నిగుర్తుచేస్తూ ఆలోచింపచేసే హాస్యరసస్ఫోరకమైన “కూరేశికాశిరెడ్డి ” వంటి వారు, జీవనం కోసం ఎన్నో వ్యాపారాలు మార్చి, “చివరిమజిలీ” గా  రాజకీయాల్లో కుదురుకున్న తారానాథ్ వంటి బ్రతకనేర్చిన వారు….. ఇలా ఎందరినో,– అనునిత్యం మనకు అక్కడక్కడా తటస్థపడే ఎందరినో — కళ్ళముందు నిలుపుతాయీ కథలు.

అంతే కాదు, మనం నష్టపోతున్న కుటుంబ సంబంధాలను అందంగా గుర్తుచేస్తాయి.  నాన్నమ్మల అకళంకమైన ప్రేమను కోల్పోయి, జీవచ్చవాల్లా బ్రతుకుతున్నమనుమలను ( శబ్దాల వెలుగులో ), అపారంగా వర్షించే మేనత్తల ఆప్యాయతలను, (కావేరత్త మడుకు), తనకేదో అయ్యిందన్న అనుమానంతో క్రుంగిపోయి ఆరోగ్యాన్ని దిగజార్చుకుంటున్న వెంకన్నను, ఉపాయంతో స్వస్థుణ్ణి చేసిన పెద్దమ్మల మానవత్వంతో కూడిన సమయస్ఫూర్తిని (నీడ నీళ్ళు), పరిచయం చేసే ఈ కథలు, మనలోని బాల్యాన్ని తట్టిలేపి, మనం ఈ తరానికి అందకుండా చేస్తున్న అపురూపమైన ఆనందాలను మనముందు ప్రశ్నార్థకంగా నిలుపుతాయి. హాలుక్కమ్మగా పూజలందుకుంటున్న మాతృమూర్తి ( రగిలిన పేగు) కథనం, సాంస్కృతిక సంపదగా మిగిలిన ‘గౌరమ్మ పండగ ‘లు, ‘పాటలపెట్టి ‘శిన్నమ్మలు,  రైతుకూ, ఎద్దుకు ఉన్న బాంధవ్యాన్ని హృద్యంగా అందించే ( జంకనపల్లి దేవగౌని జాలెద్దు ), కథనాలు, గ్రామీణ సంస్కృతీ ప్రత్యేకతను చాటుతాయి.

ఇవన్నీ ఒక యెత్తు కాగా, సంవత్సరమంతా పండిన పంటను, ఏనుగుల బారినుండి కాపాడుకునే నేపథ్యంలో, అనునిత్యం జీవన పోరాటాన్ని సాగిస్తున్న ఒక భౌగోళిక వర్గపు ప్రజల సామాజిక జీవితాలకు ప్రతీకలుగా (జాడ, ఏనుగుల బాయి ) కనిపించే కథలు మనం తినే ఆహారం వెనుకనున్న జీవనావేదనలను గుర్తుచేస్తాయి. ఈ సామాజిక జీవన పోరాటాన్ని ‘ అల్లమదేవి ‘ కథతో కలిపి, తమ వాడ స్త్రీల మానరక్షణకు ఉపయోగించుకున్న ( సిడి మొయిలు ) మహిళల వీరోచిత కృత్యం ఆలోచింపచేస్తుంది.

“ఇంటిముందర పిల్లలు” చేసే అశౌచ్యం అనే అత్యంత ప్రాథమికావస్థ స్థాయి నుండి మొదలై, సెజ్ లు, ప్రపంచీకరణ నేపథ్యాలు, జీవితాలను తలక్రిందులు చేసే పరిస్థితులను వివరిస్తూ, మనం కోల్పోయిన, కోల్పోతున్న ఆప్యాయతాను రాగాలను,మట్టి వాసనలను, పండుగల సంస్కృతినీ, మట్టికీ మనిషికీ మధ్యనున్న సంబంధాలను, ఆదరంగా గుర్తుచేస్తూ సాగిన ఈ కథలు, భౌతికంగానే కాదు, మానసికంగా కూడా మనిషి ఎదగవలసిన ఆవశ్యకముంది అన్న జీవన నేపథ్యాన్ని వివరించడం మరువలేదు. అప్పన్నపదాలు, నారాయణతాత తత్వాలను గుర్తు చేయడమేగాక, అనంతమూ, మహాశక్తిమంతమూ అయిన మనస్సు పోకడలను కరుణార్ద్రంగా వివరిస్తూనే( జాన్ పాల్ చేసిన బీరువా కథ ), అనశ్వరమైనది ఏదివుందో, అది నశ్వరమై కనిపించే లోకం ద్వారానే మనుష్యునికి అందుతుందనే అద్వైత భావంతో (మధుర మీనాక్షి ) కూడిన జీవన తాత్వికతనూ వివరిస్తాయి.

ఈ కథలను చదివినపుడు, మనం పొందే మరో మధురానుభూతి, మొరసునాడులో ప్రతిఫలిస్తున్న మాండలిక భాషాసౌందర్యాన్ని ఆస్వాదించడం  వలన కలిగే అనుభూతి. ముఖ్యంగా కన్నడ, తమిళ ప్రాంతాలలో వాడుకలో మిగిలి ఉన్న తెలుగు పల్కుబడులు, ఆయా భాషలతో కలగలసి ఏర్పడిన కొత్త పదబంధాలు మనస్సులను పరిమళింప జేస్తాయి. సోరంపు రెక్కలు(కిటికీ తలుపులు), బెడుకు (దీపం)లు, తీరాటు(యూనిఫారం)లు, తేటంగా పటం (మ్యాప్) లు,  నేల కంజము( ధాన్యం పాతర)లు, తొణేకత్తె( తొండ)లు, చెలువు(ఖర్చు)లు, పోటుముట్టు (ఆయుధాలు) లు, మంగళం(ఫోర్టికో)లు, కలకుండు(ఊరకుండు)లు, పొక్కిపోవిడి(వదంతి)లు, బానము(ఆకాశము), జాలుమట్లు( చారలు), సారిగ( పెద్ద పొలం)లు — వంటి పలుకు బడులు, మాండలికాలుగా రూపుదిద్దుకుంటూ తెలుగు భాషా పరిథిని పెంచుతున్నాయి.

తెలుగు భాషా సౌరభాలు మనలను ముంచెత్తుతున్న  ఈ పుస్తకాన్ని  చదివి ముగిసిన తర్వాత, మంచికథలను చదివామన్న ఆనందంతోబాటు, చిక్కి పోయిన తెలుగునాడు పరిథిని, మరిచిపోయిన సాంస్కృతిక పరీమళాలను తలచుకొని మనసు మూగబోతుంది.

మన సంస్కృతిని శ్వాసింపజేసే ఈ మొరసునాడు కథల సేకరణలో తోడ్పడిన ఎందరో మహానుభావులకు, కథల ఎంపికలో పాలుపంచుకున్న, మధురాంతకం నరేంద్ర గారికి, ఆర్.ఎం.ఉమామహేశ్వరరావుగారికి, సంపాదకులు స.వెం. రమేశ్ గారికి, స. రఘునాథ్ గారికి తెలుగు భాషా ప్రేమికులు ఋణపడి ఉంటారు, యింత మంచి కథల హారాన్ని తెలుగు సాహిత్యంలో చేర్చినందుకు.

భాషాపరంగా, సాంస్కృతికంగా,తెలుగునాడుకు ఉపబలకంగానున్న మొరసునాడు, దీనికి దక్షిణంగా ఉన్న వరుసనాడు (తేని జిల్లా లోని మరొక తెలుగు తావు)లను గూర్చిన పరిశోధనవైపు విశ్వవిద్యాలయాలు దృష్టిని సారించ వలసిన అవసరముంది అంటున్న స.వెం.రమేశ్ గారి ఆర్తినీ, అభ్యర్థననూ గూర్చి ప్రతి తెలుగు పరిశోధకుడూ సానుకూలంగా స్పందించాల్సిన అవసరాన్ని ఈ పుస్తకం నొక్కి వక్కాణిస్తుంది.

 డా .రాయదుర్గం విజయలక్ష్మి

 

 

Download PDF

6 Comments

  • cbrao says:

    హోసూరు చుట్టుపక్కల చాలమంది తెలుగు ప్రేమికులున్నారు. వారి సాహిత్యాన్ని చదివితే అక్కడి మాండలీక సౌందర్యం తెలియగలదు. మొరసునాడు కతలు అక్కడి ప్రజల జీవనానికి దర్పణం.

  • మొరుసునాడు కతలను పరిచయం చే స్తూ ఆయా ప్రాంతపు చారిత్రక నేపథ్యాన్ని కూడా సమీక్ష పరిది లొకి తెచ్హుకొని రాయ డం విజయలక్ష్మి గారి సాహితీ పరి ణితిని తెలియచే స్తొంది. కొండని అద్దం లొ చూపించారు ఆమె. ఒరిస్సా మధ్యప్రదేశ్ ప్రాంతాల్లొ ఉన్న తెలుగు వారితొ కూడా ఇలాటి కథలు రాయించే ప్రయత్నం ఎవరయినా చేస్తే బాగుండేది .
    – జగదీశ్వర్ రెడ్డి

  • తెలుగు నేలలో మరచి పోతున్న, కనుమరుగవుతున్న కొన్ని తెలుగు పదాలను మొరుసునాట పట్టుకోవచ్చు. తల్లి భాషను కాపాడుతూ, ఆ భాషాభివృద్దికి, సాహిత్యాభివృద్దికి కృషి చేస్తున్న మొరసునాడు రచయితలకు, భాషాభిమానులకు అభినందనలు. మొరసునాడు జీవన సౌందర్యాన్ని పరిచయం చేస్తూ చక్కని సమీక్ష అందించిన విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు

  • pudota.showreelu says:

    మరచిన తెలుగుమాటలు దొరకు చోటు ,మరువలేని తెలుగునాడు మొరసునాడు .బౌగోళికంగా వేరు ఐన సంస్క్రుతికముగా మనమంతా తెలుగువారమే అనే హోసూర్ రచయితల ఆవేదన అర్ధం చేసుకోవలసిన అవసరం ఎంతో ఉన్నది

  • నాకు ఇష్టమైన కథల పుస్తకం మీద మీ వ్యాసం చాలాబాగుంది. వీథి అరుగు అన్న వ్యాసంలో కృష్ణశాస్త్రిగారు పల్లె గురించి “చేల నడుమ పడుచులా చేయెత్తి పిలిచేదో” అని చక్కగా వర్ణిస్తారు. తెలుగుదేశానికి భౌగోళికంగా దూరంగా ఉంటూ మూడు రాష్ట్రాల సరిహద్దుల మధ్య చిక్కుకున్న మొరసునాడు ఈనాడు అలా చేలనడుమ పడుచులా చేయెత్తి పిలుస్తూ ఉంది, హోసూరు కథకులు కమ్మని మాండలికంతో సరిహద్దులు చెరిపేస్తున్నారు. భౌగోళికంగా ఎక్కడ ఉన్నా సాంస్కృతికంగా అంతా ఒకటే అని నిరూపిస్తున్నారు. గ్రామీణజీవితపు మొనాటనీతో విసుగెత్తిన తెలుగుకథకు కొత్త అలంకారం వీరి కథలు. వారిని అక్కున చేర్చుకుందాం.
    బి . అజయ్ ప్రసాద్

  • avula venkata subrahmanyam says:

    చాలా బాగున్నాయి

Leave a Reply to pudota.showreelu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)