ఏడుగురు అన్నలు – చెల్లి

అనగనగా ఒక ఊరు. ఎలాంటి ఊరు అదీ? ఎలాంటి ఊరంటే…  పంటలే పండని వట్టి బీడు భూముల ఊరు. పంటలు పండకపోతే ఏమవుతుందీ? మనుషుల తిండి సంపాదించడానికి వేరే ఊర్లకి వలసలు పోతారు. అట్లా అనగనగా ఒక ఊర్లోని ఏడుగురు అన్నలు వాళ్ళ ఏడుగురు భార్యల్ని, ఒక్కగానొక్క చిట్టి చెల్లెల్నీ వదిలి పనులకోసమని పరాయి దేశాలకు వెళ్ళిపోయారు.

ఇంట్లో భర్తలు లేని భార్యలు, అన్నలు లేని చిన్ని చెల్లి మిగిలిపోయారు. ఆ ఊర్లో వానలేపడవు, ఎప్పుడో ఒకసారి ఒక చినుకు అర చినుకు అంతే. మిగిలినదంతా ఎండే, ఊరిపైన మండే సూర్యుడ్ని బోర్లేసినట్లు ఒకటే వేడి. ఆ ఎండలకూ , తిందామంటే రెండు పూటలా తిండిలేనితనానికి ఆ ఏడుగురు భార్యలకీ తమ తమ భర్తల పైన చాలా కోపమొచ్చేది. కోపం చూపటానికి భర్తలేమో దగ్గర లేరు. మరి ఎవరిపైన చూపాలి?  కోప్పడితే ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు, అందుకని భర్తల చెల్లి పైన తమ అక్కసునంతా ప్రదర్శించేవారు.

ఇంట్లో ఉండే కుండెడు ఆవాలు తీసుకొచ్చి ,మట్టిలో పోసి, ఒక్కటి కూడా పొల్లు  పోకుండా కుండ నింపు అనేవాళ్ళు. పాపం ఆ అమ్మాయి చాలా చిన్నది. ఎలా ఎదురు చెప్పకలదూ? అందుకని ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ కష్టపడి కుండను  నింపేది. అట్లా ఒక రోజు ఆ పాప ఏడుపు, కష్టమూ చూసి చూసి చుట్టుపక్కల చెట్లపైన ఉన్న పిట్టలకు జాలి కలిగి “పాపా ఏడవకమ్మా” అని చెప్పి ఆవాలన్నీ ఏరి కుండ నింపాయి. కుండ నిండిపోగానే అమ్మాయి “వదినలూ వదినలూ మీరు చెప్పిన పని చేసేశాను, కుండ నిండిపోయింది, నాకు అన్నం పెట్టండి ” అని చెప్పి వదినల దగ్గరకు వెళ్ళింది. అది చూసి వదినలు ఆశ్చర్యపడ్డారు.

ఎదిగే బిడ్డకి ఆకలెక్కువ కదా! అట్లా అని చెప్పి వాళ్ళ స్వంత కడుపులు కాల్చుకుని అస్తమానూ ఆ పిల్లని మేపడానికి ఆ అమ్మాయి వాళ్ళ స్వంత బిడ్డ కాదు కదా ? అందుకని చెప్పి ఒక కుండ తీసుకుని రెండు మూడు రంద్రాలు చేసి ఆ అమ్మాయి చేతికిచ్చి “వెళ్ళు వెళ్లి చెరువు నుండి నీళ్ళు తెచ్చి ఆ తొట్టి నింపు” అని చెప్పారు. చెల్లి సరే అని చెప్పి ఆకలి అదిమిపెట్టి చెరువుకెళ్ళింది. కుండ చిల్లుది కదా అందుకని నీళ్ళు తేలేకపోయింది.ఏడుస్తూ చెరువొడ్డున కూర్చుంది .  ఆ ఏడుపు వినీ వినీ చెరువులో కప్పలు” ఎందుకు పాప ఏడుస్తున్నావు ”అన్నాయి . అప్పుడు ఆ అమ్మాయి చెప్పిందంతా విని “సరే ఏడవకు మేము ఆ రంధ్రాలను మూసి పెడతాం నువ్వు నీళ్ళు తీసుకెళ్ళు” అన్నాయి. ఆ పాప అలాగే తొట్టి నింపి వదినలతో “వదినలూ వదినలూ తొట్టి నిండిపోయింది, ఇంక అన్నం పెట్టండి, ఆకలేస్తుందీ” అన్నది .

వదినలకి కోపమొచ్చేసింది. ” ఛీ ఛీ వెధవ పిల్ల ఎప్పుడూ అన్నమో రామచంద్రా అంటుందేమిటో” అని మెటికలు విరుచుకుని ”సరే … సరే అన్నం పొయ్యి మీదుంది ఉడికే లోపల కొన్ని కట్టెలేరుకురా” అని చెప్పి పంపేశారు. పాప మంచి ఆకలి మీదున్నా  మట్టసంగా కట్టెలేరింది. కానీ మోపు కట్టడానికి తాడేది? ఏడుస్తూ కూర్చుండిపోయింది. అప్పుడేమో అటుగా వెళ్తున్న మంచి పాము ఒకటి ఆగి ,పాపని చూసి “ఎందుకమ్మా ఏడుస్తున్నావ్? ” అని చెప్పి అడిగింది. పాప పామూ పామూ నా దగ్గర కట్టెలు మోపు కట్టడానికి తాడు లేదు,ఈ  కట్టెలెట్లా మోపు కట్టేది” అని అడిగింది ఎక్కిళ్ళు పెడుతూనూ . అప్పుడు  పాము “సరేలే ఇంతమాత్రం దానికి ఏడ్వాలా బంగారు తల్లీ నన్ను తాడులాగా కట్టుకో” అని చెప్పింది. పాప అలాగే చేసి కట్టెలు తెచ్చి దొడ్లో పెట్టి అబ్బా ఇప్పుడు ఉడుకుడుకు అన్నం తినొచ్చని చెప్పి ఆశగా “వదినలూ వదినలూ మీరు చెప్పిన పని చేసేశా నాకింక అన్నం పెట్టండి” అని అడిగింది.

అది విని వదినలకి చాలా కోపం వచ్చింది. అయినా తమాయించుకుని “సరే అట్లాగే పెడతాం ముందెళ్ళి అరయిర్ చెట్టెక్కి కాయలు కొయ్యి” అన్నారు. అదివిని ఆ పాప భయ పడిపోయి “అయ్యయ్యో అరయిర్ చెట్టు చాలా ఎత్తు . నేను ఎక్కలేను, ఒకవేళ ఎక్కినా దిగలేను” అని చెప్పేసింది. అది విని సరేలెమ్మని వదినలేం ఊర్కోలేదు. ఆ పిల్లని బలవంతంగా అడివికి పట్టుకెళ్ళి చెట్టెక్కించి పీడా వదిలిందని చెప్పి చేతులు దులుపుకుని సంతోషంగా ఇంటికి వచ్చేశారు.

అడవిలో అరయిర్ చెట్టుపైన ఆ పాప గుండెలవిసేలా ఏడుస్తూ కూర్చున్నది. అంతలో దేశాంతరం వెళ్ళిన అన్నలు తిరిగి వస్తూ వస్తూ అదే అరయిర్ చెట్టుకింద అలసట తీర్చుకునేందుకు ఆగారు. అట్లా చెట్టుకింద పడుకున్న ఒక అన్న మీద నీటిచుక్క ఒకటి పడింది. వాళ్ళు పేదవాళ్ళు కదా. అందుకని వంటిపైన ఎవరికీ చొక్కాలు లేవు. నీటి చుక్క స్పర్శ తెలియగానే అతను పక్కనున్న తమ్ముడితో అన్నాడు “వానొస్తూ ఉన్నట్లుంది ఇదిగో నాపైన చినుకు పడింది” అని అందుకు ఆ తమ్ముడు ఆకాశం వంక చూసి “అన్నా! మిటమిటమని అంత ఎండకాస్తూ ఉంది . చూద్దామన్నా ఒక్క నీటి మబ్బూ లేదు . వాన ఎక్కడ్నుండి వస్తుంది? నీటి చుక్క రుచి చూడు ఏంటో తెలిసిపోతుంది” అన్నాడు. అది విని ఆ అన్న అట్లాగే రుచి చూశాడు. ఉప్పగా ఉంది. ఉప్పగా కన్నీళ్ళే ఉంటాయి కాబట్టి ఎవరో చెట్టు పైన ఉన్నారని కనిపెట్టి తలపైకెత్తి చూశాడు. ఇంకేవుంది, వాళ్ళ గారాల చెల్లి చిటారు కొమ్మని గట్టిగా కావలించి కూర్చుని గుక్కపట్టి ఏడుస్తూ ఉంది. అంతే కడగట్టు అన్న గబగబా చెట్టెక్కి చెల్లిని దింపి తీసుకొచ్చాడు. అందరూ చుట్టూ చేరి “చెల్లి అక్కడున్న కారణమేంటని” అడిగారు. అప్పుడు ఆ పాప ఏడుస్తూ ” సాతో బహుజీ డూం బేర్ ఖలాయ్ / సాతో దాదా మలంగ్ గెలాయ్ / ఏకె సొన్ కిర్లా బిందాబాన్ / తీన్ గగరా సర్సో బిఛాలో అరయిర్ గాచే హెరాలో

/సాత్ గగ్ రామే పానీ లానాలో /దాదా అరయిర్ గాచే హెరాలో/చేడోరా ఖాళీ మొయ్ లానాలో/దాదా అరయిర్ గాచే హెరాలో

(ఏడుగురు అన్నలు చిన్న చెల్లిని వదిలి పరదేశం వెళ్ళారు, ఆ వదినలేమో మంచిగున్నారు/నేనేమో మూడు కుండల ఆవాలు ఎత్తా/ ఏడు కుండల నీళ్ళు తెచ్చా/పెద్ద మోపు కట్టెలు తెచ్చా/ అయినా అరయిర్ చెట్టు ఎక్కించారు) అంటూ పాట పాడింది.

అదంతా విని అన్నలకి దుఃఖమొచ్చింది. పాపని ఓదార్చి అడవిలోనే కొన్నిరోజులు ఆగి,తమ వెంట తెచ్చిన తినుబండారాలన్నీ తినిపించి ఆ పిల్లని ఆరోగ్యవంతురాలిని చేసి ఊరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఒకచోట దాచి ఇంటికెళ్ళారు. భర్తలను చూసిన భార్యలు చాలా సంతోషపడ్డారు. ఆ కబుర్లూ ఈ కబుర్లూ అయ్యాక అన్నలు భార్యల్ని “మా చెల్లి ఏది ?ఎక్కడా కనిపించడం లేదే ” అని అడిగారు. అందుకు వదినలు కూడబలుక్కున్నట్లు “మీ చెల్లి అస్తమానూ అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటుంది , ఒక్కపని కూడా చేయదు, మేం ఆ పిల్లకి తల్లులం కాదు కదా.చనువుగా తిట్టలెం కదా , అందుకని చూస్తూ ఊరుకుంటాం ఇప్పుడు ఎక్కడుందో ఏమో” అనేశారు. అదివిని అన్నలు చాటునున్న చెల్లిని పిలిచారు. చెల్లి బయటకి వచ్చి “సాతో బహుజీ డూం బేర్ ఖలాయ్ / సాతో దాదా మలంగ్ గెలాయ్ / ఏకె సొన్ కిర్లా బిందాబాన్ / తీన్ గగరా సర్సో బిఛాలో అరయిర్ గాచే హెరాలో

/సాత్ గగ్ రామే పానీ లానాలో /దాదా అరయిర్ గాచే హెరాలో/చేడోరా ఖాళీ మొయ్ లానాలో/దాదా అరయిర్ గాచే హెరాలో “అంటూ పాడుతూ  ఏడ్వటం మొదలు పెట్టింది. అప్పుడు ఆ అన్నలు “మా ఒక్కగానొక్క చెల్లెల్ని, తల్లీ తండ్రీ లేని దాన్ని ఇంత హింసించారు. మీ చేతివంట తిననే తినం , మీరు ముట్టిన ఆ బావిలో నీరుకూడా తాగం” అని చెప్పి వేరేగా బావి తవ్వడం మొదలు పెట్టారు.

ముందే చెప్పా కదా ఆ ఊర్లో మొత్తం మెట్టనేల. అందుకని ఎంత తవ్వినా ఒక్కచుక్క నీళ్ళన్నా పడలేదు. అది చూసి చూసి భార్యలు దుఃఖపడి, భర్తల్తో “అంత కష్టపడటం ఎందుకు? ఏదో తెలియక తప్పు చేశాం క్షమించండి” అన్నారు. అందుకు ఆ భర్తలు మూకుమ్మడిగా “సరే మేం తవ్విన ఈ గుంటలోకి దిగి నీళ్ళు పడాలని పూజలు చేయండి అప్పుడు క్షమిస్తాం” అని చెప్పారు. ఆ భార్యలు సరే అని గుంటలోకి దిగగానే మట్టితో వాళ్ళని సజీవంగా పూడ్చేశారు.

అప్పుడైనా ఎప్పుడైనా ఒక భార్య పోతే ఇంకో భార్య దొరకడం మగవాడికి సులువే కదా. అందుకనిచెప్పి  వాళ్ళు అంత సులభంగా భార్యలని  పాతి పెట్టేసారనమాట. సరే ఆ తరువాత ఏమైందీ అంటారా ?ఇంకేముందీ ఆ ఏడుగురు అన్నలు ఆ మురిపాల చెల్లీ సంతోషంగా ఉండినారు.

samanya_300x250_scaled_croppకథనం: సామాన్య

Download PDF

1 Comment

  • rajani says:

    ఈ కథ ద్వారా సామాన్య గారు చెప్పదల్చుకున్నది ఏమిటో అర్ధం కాలేదు.మన చిన్నప్పుడు ఏడుగురు అక్కచేల్లెల్లం కథ గుర్తొచింది. కాని కథ ఏదో ఒక సందేశాని ఇవ్వాలి కదా. నాకు అనిపించింది చెప్పాను

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)