కళింగాంధ్ర వారసుడు

daalappa1

రెండు జీవిత దృశ్యాల మధ్య పోలిక చూడటం కవిత్వమైతే, వైరుధ్యాన్ని చూడటం కథగా రూపొందుతుంది. కొన్నిసార్లు దు:ఖమయంగానూ, కొన్నిసార్లు హాస్యాస్పదంగానూ ఉండే ఈ వైరుధ్యాల్ని చూసి మౌనంగా ఉండటం కష్టం. అనాదికాలం నుంచీ కథనకుతూహలానికి  ప్రేరణ మొదలయ్యేదిక్కణ్ణుంచే..

ఈ జీవిత వైరుధ్యాలు బహుశా కళిగాంధ్రలో మరీ స్పష్టంగా కనబడతాయేమో. లేదా కళింగాంధ్ర దృక్పథంలోనే ఈ వైరుధ్యాల్ని పసిగట్టే స్వభావం అంతర్లీనంగా ఉందో తెలియదు గానీ, అక్కడ పుట్టిన కథలు కంచికి వెళ్లవు. అవి అక్కడే తచ్చాడుతూ ఉంటాయి. కన్యాశుల్కం చూడండి . సమాజాన్ని కాపాడవలసిన పోలీసు కానిస్టేబుల్ లోకంపోకడ అర్థం కాక తెల్లమొహం వేస్తాడు. లోకం దృష్టిలో ఏగాణీ విలువ చెయ్యని అసిరిగాడు అగ్రవర్ణ సమాజపు టక్కుటమారాలన్నీ అపోశన పట్టినట్టు కనిపిస్తాడు. కనకనే లోకంలో అన్ని చోట్లా కథలు పుడుతూనే వుంటాయి గానీ, ఒక చాసో, ఒక రావిశాస్త్రి, ఒక పతంజలి కళింగాంధ్రలో మాత్రమే పుడతారు. ఇదిగో ఇప్పుడీ కథలది కూడా అదే దారి. చింతకింది  శ్రీనివాసరావు చెబుతున్న ఈ కథలు చోడవరానికి నెల్లిమర్లకీ మధ్యలో కళింగాంధ్ర నడ బొడ్డులో జనం చెప్పుకుంటూ వస్తున్న కథలు. ఈ కథలకి కులం, మతం, వర్గం, వర్ణం లేవు. ఇందులో వాస్తు సిద్ధాంతి పిడపర్తి విశ్వేశ్వర సోమయాజులు మొదలుకొని పాయఖానాలు శుభ్రం చేసే పెంటపాలెం దాలప్ప దాకా అందరూ ఉన్నారు. ఈ కథల్లో కనిపించే జీవితం ఎవరో ఒక సోషియాలజీకి తలుపులు తెరుస్తుంది. మేమంతా గురూజీ అని పిల్చుకునే రవీంద్ర కుమారశర్మ, అదిలాబాద్‌లో చేతివృత్తుల వాళ్ల కోసం అహర్నిశలూ తపించే కళాకారుడు, సంస్కర్త. ఒకసారి నాతో ఒక మాట అన్నారు. ‘మన సమాజంలో రెండు రకాల వ్యవస్థలున్నాయి. ఒకటి కలెక్టర్ల వ్యవస్థ. మరొకటి ప్రజలు తమకోసం తాము స్వయంగా ఖాయం చేసుకుని నడిపే వ్యవస్థ. మొదటిది చూడండి . దానికో బడ్జెట్‌ ఉంటుంది. మందీమార్బలం ఉంటారు. అయినా అది ఏ ఒక్క పని కూడా సక్రమంగా చెయ్యలేదు. ఆ వ్యవస్థకెప్పుడూ మీటింగులతోనే సరిపోతుంది. కాని ప్రజలు నడుపుకునే వ్యవస్థ చూడండి . పండుగల్లో, పురస్కారాల్లో కొన్ని లక్షల మంది జమవుతారు. కొన్ని కోట్ల లావాదేవీలు జరుగుతాయి. కాని ప్రజలు ఏ మీటింగులు పెట్టుకుంటారు? ఏం రూల్స్‌ రాసుకుంటారు? అయినా ఆ సంతలూ, జాతరలూ ఎంత బాగా జరుగుతాయో చూడండి అని ఆయనే ఇంకో మాట కూడా అన్నారు. అలాంటి జాతరల్లో కూడా ఒకటీ రెండు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎందుకో తెలుసా? ప్రజల వ్యవస్థను సరిగ్గా అర్థం చేసుకోకుండా కలెక్టర్ల వ్యవస్థ అడ్డుపడటం వల్ల!

dalapppa

ఈ కథల్లో కనిపించే జీవిత దృశ్యాలు మనకు చెప్తున్నదిదే. బస్టాండులో సీట్లు రిజర్వు చేసే  తాతయ్యలు, ఊళ్లో పసిపిల్లలకు పాలుకుడిపే పాలమ్మలూ చూపించిన మానత్వం పాఠశాలల్లో చదివింది కాదు. చట్టసభల్లో చేర్చించి ఆమోదించిందీ కాదు. కాని జీవితానికి పనికివచ్చే చదువుకి, అనుశాసనానికీ వాళ్లదే ఒరవడి  అవుతుంది. జీవిత వైరుధ్యాల్ని పట్టుకోవడం తోటే ఒక మనిషి కథకుడుగా మారినా, అతడి ప్రయాణం అక్కడతో ఆగిపోదు. వైరుధ్యాల్ని దాటిన ఒక సుందర దృశ్యాన్ని మనతో పంచుకోవాలన్న కవి కూడా ప్రతి కథకుడిలోనూ దాగి ఉండదు. దీనికి కూడా గురజాడదే అడుగుజాడ. చాసో ‘మాత ధర్మం’ కథ చూడండి. అది ఒక అపురూప కావ్య గీతిక. రావిశాస్త్రి కథలన్నిటా ఒక ఆకుపచ్చని పార్శ్వం కనిపిస్తూనే ఉంటుంది. కార్నర్‌ సీటు, మామిడి  చెట్టు. ఎన్ని కథలయినా గుర్తు చేసుకోవచ్చు. చింతకింది శ్రీనివాసరావు కథల్లో కూడా ఆ అమాయకమైన కవిత స్వప్నం కనిపిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది.

 

వాడ్రేవు చినవీరభద్రుడు

Download PDF

2 Comments

  • CHITRA says:

    ఇంతకీ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు సృస్తించారు ఎవరు ఎవరికీ వారసత్వ పట్టాలు ఇస్తున్నారు?

  • ‘దాలప్పతీర్థం’ చదివాను. కళింగాంధ్ర నుండి మరో ప్రామిసింగ్ రైటర్ అని మురిసాను. ‘దాలప్పతీర్థం’ ఎలా పుట్టిందో అంతకంటే ఒడుపుగా మరెవరూ చెప్పలేరేమో కూడా! గురజాడ అడుగుజాడలని వీడిన కళింగాంధ్ర కథకుడు లేడన్నమాట ఎంత వాస్తవమో, ఒకే చాసో, ఒకే రావిశాస్త్రి, ఒకే ఒక్క పతంజలి అన్నమాటా అంతే సత్యం. ఆమాటకొస్తే ఒకే చింతకింది అనేసుకోవచ్చు కదా! పోలికలూ, తేడాలూ పక్కన పెడితే, కవితాస్వప్నంలోంచి బయటికి వచ్చి, ‘చింతకింది కథల’ గురించి చినవీరభద్రుడు రాసే పరిచయవాక్యాల కోసం ఎదురుచూస్తున్న పాఠకులలో నేనూ ఉన్నాను. :)

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)