మనం కలిసి కన్న కలలున్నాయి, అవి జర భద్రం!

మిత్రమా,

చాలా రోజులయ్యింది ఉత్తరం రాసి..

ఈ మాటలు రాస్తున్నప్పుడు కోటానుకోట్ల అక్షరాలు పోటెత్తాయి. ఉద్విగ్నమైన, అమాయకమైన, బహుశా 1861 నుండి 1865 వరకు దక్షిణ ఉత్తర ప్రాంతాలకు జరిగిన భీభత్స అమెరికా అంతర్యుద్ధ భావజాలం, హింస మనం చూసినం కదా! అయినా ఆ యుద్ధం ఆంధ్ర, తెలంగాణా, ఇంకా మన దగ్గర ఇప్పటికీ కొనసాగుతుంది కదా!

అదిగో అక్కడినుండి ప్రవాసిలాగా ఇక్కడికి వచ్చాను. నేనిప్పుడు చుట్టూ ఆవరించిన ఎత్తైన ఓక్ చెట్ల మధ్య ఉన్నాను. మార్మికమైన ధ్వనులేవో విన్పిస్తున్నాయి. పేరు తెలియని పిట్టేదో తన భాషలో మాట్లాడుతోంది. ఎర్ర బుట్టు పిట్ట బద్ధకంగా, లాన్‌లో ఫురుగులేరుకుంటోంది. జులై మాసపు ఎండ పాకుతోంది. వాతావరణం వేడిగా ఉంది. నేనిప్పుడు న్యూయార్కుకు రెండు గంటల కారు ప్రయాణం దూరంలో ఎక్స్‌టన్ ఫిలడెల్ఫియా రాష్ట్రంలో ఉన్నాను. కాలం కత్తి అంచు మీద నడిచినట్టుగా ఉంటుంది. ఎన్నెన్నో జ్ఞాపకాలు చుట్టుముడతాయి. ఏదీ నిలువదు. ఏదీ కొనసాగదు. నిద్రో, మెలకువో తెలియకుండా విచిత్రమైన ఈ మానసిక స్థితి..

బహుశా ఒక కఠోర సమయంలో మాక్సింగోర్కి 1906లో న్యూయార్కుకు ప్రవాసం వచ్చాడు. అతి కష్టంగా. ఏమి చెయాలో తోచక, తన చుట్టే తిరిగినప్పుడు తను కలెగలిసి మెదిలిన మనుషులంతా, తన సహచరులంతా అతనికి కొత్తగా వింతగా కన్పించారు, విన్పించారు. తాము భాగమైన మొత్తం జీవితం కుదురు ఆరాటం అర్ధమయినట్టె అన్పించింది. ఆ వియోగ సంయోగంలో నుంచే అమ్మ నవల పుట్టింది. ప్రతి మనిషిలో లోపల ముట్టుకోవడానికి చేసిన ప్రయత్నమే అమ్మ నవల. అట్లాంటిదేదో రూపు కట్టినట్టే ఉంటుంది. నలభై సంవత్సరాల సుదీర్ఘ యుద్ధఘట్టాలేవో సలుపుతాయి. రకరకాలుగా నా జీవితంలో భాగమైన అనేకమంది సహచరులు పోటెత్తుతారు. వాళ్ల అడుగుల సవ్వడి తపన – వాళ్ళు అంతకంతకు చెట్టు తన ఆకును, బెరడును త్యజించి మళ్లీ కొత్త రూపం సంతరించుకున్నట్లుగా స్వంత ఊరు, ప్రాంతం, జీవితం నుండి మనుషుల్లోకి, మహారణ్యాల్లోకి విస్తరించడం తెలుస్తూనే ఉంటుంది. లోలోపలి విధ్వంసాల్ని ఎదుర్కొని నిలబడి మనుషులుగా రూపుదిద్దుకున్నందుకు. ఆ అపురూపమైన, అందమైన మనుషులను, పూర్తిగా విచ్చిన్నమైన మనుషులు వేటాడి సంహరించడం తెలుస్తూనే ఉంటూంది. సమస్త మానవ ప్రవర్తన తెలుస్తుంటుంది. అయినా ముందుకు సాగదు.

గత పదమూడు సంవత్సరాలుగా ఇక్కడెక్కడో చిక్కు దారుల్లో కాటగల్సిపోయినట్టుగా ఉంటుంది. టాల్‌స్టాయ్ రిజరక్షన్ కన్నా ముందుకు జరగాలి. అన్నా కరెనీనా ఒంటరిగా, దిగాలుగా రైల్వేస్టేషన్లో ఆత్మహత్య చేసుకోగూడదు. విధ్వంసంలో పూర్తిగా కూరుకుపోయిన 90% ప్రజలకు విధ్వంసం తెలియదు. దారి తెలియదు. ఆ దారి కనుక్కున్న ప్రపంచం పదే పదే కుప్పకూలింది. అయినా మళ్ళీ మళ్లీ నిర్మించే క్రమంలో నా సహచరులున్నారు. ఎక్కడికో పోతున్నాను. ఈ దేశంలో చాలా తిరిగాను. మనుమడు సాకేత్ సాన్వీల కోసం డిస్నీల్యాండు నాలుగు రోజులు తిరిగాను. అదో పెద్ద ప్రపంచం. బహుశా రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో పిల్లల కోసం నిర్మించిన ఒక అద్భుత కల్పనా ప్రపంచం. రాణులు, అరేబియన్ కథలు, పక్షులు, జంతువులు, అనేక దేశాల ప్రత్యేక కథలను యూనీఫాం వేసి కట్టిన కథలు…s-US-DIVERSITY-large1

అమెరిక అంతట సెలవులు కనుక చాలమంది పిల్లలు, తల్లిదండ్రులు వచ్చారు. అనేక జాతులవారు, మెక్సికన్స్, జూస్, జర్మన్, చైనీస్, ఇండియన్సు, అన్ని రకాల మనుషులను ఒక దగ్గర చూడడం అదొక అనుభవం.

లాస్ఏంజిల్స్ లోని ఇర్విన్‌లోనే గుగీ ఉంటారు. అతన్ని కలుద్దామా వద్దా అని ఊగీసలాడాను. అతను నాకు పూర్తిగా తెలుసు. నేనతనికి తెలియదు. కెన్యాలో తన వూరు, తన భాషను ప్రేమించినందుకు వేటాడబడినవాడు. ఇంకా ఎప్పటికైనా తన దేశం తాను పోతాననే కలలో బతుకుతున్న మనిషి. ఆ మధ్య ఎందరు చెప్పినా వినకుండా వెళ్లి హోటల్ గదిలోనే దుండగుల దాడికి గురై ఆయన సహచరిని అవమానపరిస్తే మళ్లీ అమెరికా వచ్చినవాడు. లోలోపల అతని స్థితి నా స్థితికి భిన్నమైంది కాదు. బహుశా ఈ స్థితి దాటిన తరువాత నేనతనికి తెలిసిన తరువాతనే కలువాలా? పిల్లలను అడగడానికి మొహమాట పడ్డాను. ఇది ఎలాంటి స్థితి అని చెప్పలేను. మన దగ్గర ఎప్పటిలాగే అనేకం పోటెత్తుతున్నాయి. పరిశుభ్రమైన తెల్లబట్టలేసుకున్నవాళ్లు తళతళలాడే సంపదలో ఓలలాడేవాళ్లు. వెగటు, వెలపరం పుట్టించే నాటకాలకు తెరదీస్తారు.

వార్తాపత్రికల నిండా వెంట్రుకవాసి కూడా నిజం కాని నటనలు.. నేనెందుకో ఆ ముఖాలు చూడలేను. సంపదతో, అధికారంతో కుళ్లిన ముఖాలవి. అప్పుడెప్పుడో బహుశా 1985లోనో యేమో కాళీపట్నం మాస్టారు చిన్న కొడుకు యింట్లో భూషణాన్ని చూశాను. అతనేమీ మాట్లాడలేదు. నేనేమీ అడగలేదు. అతనంతా చెప్పనే చెప్పాడు కదా! ఆ యుద్ధ భీభత్స, వీరోచిత గాథలన్నీ నేను చదివినవి, విన్నవే కదా! జీవితాన్ని, మనుషులను ప్రేమించడం నేర్చుకున్నదక్కడే కదా! ఆయన పక్కన కూర్చుంటే ఆ జీవితపు స్పర్శలోపలికి… ఆ తరువాతెప్పుడో విరసం సభలో అప్పలనాయుడు కార్మికుల కోసం ఏదో పత్రిక నడుపుతున్న ప్రసాదును పరిచయం చేశాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు. నేను ఏమీ అడగలేదు. అప్పటినుండి మళ్లీ చూడలేదు. కాని నిరంతరం వింటూనే ఉన్నాను.

మనుషులు మంచికో, చెడ్డకో మన జీవితంలోకి వచ్చిన తరువాత వాళ్లు మనం పోయేదాకా మన వెంట నడుస్తారు. మొన్న నెల్లూరులో చంపేశారతన్ని. ప్రసాదు సౌమ్యుడు. ఆయన పొరపాటున కూడా దురుసుమాట మాట్లాడినట్లుగా గాని, ఎవరికన్నా అపకారం చేసినట్టుగా కాని ఇన్ని సంవత్సరాలుగా వినలేదు. కాని అయన మనుషుల అద్భుత కలల గురించి అడుగుతున్నాడనిపించేది.

కథానిలయం కోసం శ్రీకాకుళం వెళ్ళినప్పుడల్లా అక్కడి ఆత్మీయులైన మనుషుల స్పర్శ తెలిసేది. ప్రసాదు కొడుకు మౌనంగా కనిపించేవాడు. ప్రసాదు సహచరి గురించి తెలిసేది. తనకంటూ ఏమీ లేనివాడు. ఎంత అందమైన మనసు అతనిది. ఆకాశంలా తెరిచిన హృదయం.. ఇరుకు ఇరుకు జీవితాల్లో కుట్రలు, కుతంత్రాలలో నిత్యము మునిగిపోయే వాళ్లు పైకి తెల్ల బట్టలతో అలంకరించుకొని కన్పిస్తారు. శ్రీకాకుళమంత అందమైన వాడు. కనుకనే రాక్షసులు, మనుషులు కానివాళ్లు అతన్ని  బతకనియ్యరు.

che

బహుశా స్పార్టకస్‌ను అందుకే… ఘనత వహించినవారు ఇలాంటి సంస్కారం నేర్పుతే వస్తుందంటారు. అదీ తెలంగాణాలొ పుట్టిందంట. అది మనిషితో పాటే పుట్టింది. స్పార్టకస్‌ను, లెనిన్‌ను, చేగువేరాను, మార్క్సును నేను చూడలేదు. కాని వాళ్లందరూ నాతో పాటు కోట్లాది మనుషులతో ఉన్నారు. ఈ జ్ఞాపకం తుడిచెయ్యగలమా? మహద్భుతమైన మనుషుల కలల్లో మెదిలిన ప్రసాద్‌ను తుడిచెయ్యగలమా?

కోట్లాది మానవులు పుట్టారు, చచ్చారు. కాని కాని.. ఈ వెలుగును కాపాడుతున్నదెవరు? ఈ వెలుగును ఊదేస్తున్నదెవరు? అయితే అంతకంతకు క్రూరమృగాల సంచారం పెరుగుతున్న చోట మనుషులు వాళ్ల ఆత్మ, కలలు జాగ్రత్తగా ఉండాలి.. మరింత తేజోవంతంగా ఉండాలి.. ఏమో? ఇదంతా నీకు తెలుస్తుందా?

 

నీ మిత్రుడు

 

Download PDF

4 Comments

 • ఎన్ వేణుగోపాల్ says:

  రాజన్నా,

  ఈ మరచిపోయిన ఉత్తరాలు చాల బాగుంటున్నయి. మనిషిలోపలి విధ్వంసం, మహదేవుని కల చదివినప్పటి లాగ దుఃఖం పొంగిపొర్లుతున్నది. నలభై ఏళ్లుగా గూడు గట్టుకుంటున్న దుఃఖం, సుళ్లు తిరుగుతున్న దుఃఖం. ఇవాళ మానేరు, కడెం, ప్రాణహిత, గోదావరి పోట్లెత్తుతున్నట్టు…

  గూగీని కలువు. ఒక్క పూట కోసమైనా సరే. నేను ప్రత్యేకంగా వెళ్లి కలిసిన. ఒక పూటంతా గడిపిన. చాల ప్రేమగ ఉన్నడు. వాళ్ల క్యాంపస్ లో ఒక ఇండియన్ రెస్టారెంట్ లో భోజనానికి తీసుకపోయిండు. నువ్వు కలిస్తే ఇంకా బాగుంటది.

  – తమ్ముడు

 • buchireddy gangula says:

  గూగి గారి ని — మిమ్ముల్ని ఇండియన్ రేస్తురాంట్ కు తీసుక
  పోయింది నేను —పే చేసింది నేను —నిజం రాయాలి విప్లవ కవి గారు ???
  ————————————————–
  బుచ్చి రెడ్డి గంగుల

 • ఎన్ వేణుగోపాల్ says:

  అయ్యో బుచ్చి రెడ్డి గారూ,

  మీ ఆతిథ్యాన్ని, మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మరచిపోను. ఇక్కడ రాజన్నకు చెప్తున్నప్పుడు అది అవసరమైన సమాచారం అనుకోలేదు. అంతే. మీ ప్రస్తావన తేనందుకు క్షమించాలి. నన్ను ఒకరోజు ఇంట్లో ఉంచుకుని, నన్ను గూగీ దగ్గరికి తీసుకుపోయిన మీ అభిమానాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. రెస్టారెంట్ లో మీరు పే చేసిన విషయం నిజంగానే నాకు గుర్తు లేదు. నా మతిమరపుకు కూడ క్షమించండి.

  ఇంతకూ నేను విప్లవ కవిని కాను, ఒక మామూలు మనిషిని. అంత వ్యంగ్యం అవసరం లేదు.

  వి.

 • m.a.basith says:

  ప్రియమైన సర్,
  మీ ఉత్తరాలు ఎంతో బావుంటున్నాయి. ‘తెలంగాణా ఒక ముందడుగు’ హృదయానికి దగ్గరగా అనిపించింది. అన్నట్లు మనం భువనగిరిలో ఆగి, లంచ్ చేసి, తిరిగి హనుమకొండ బస్సేక్కినప్పటి సంగతి కళ్ళముందు కదలాడింది. హఫీజా తో ఆనాడు కండక్టర్ మనుసుకు తాకేలా అనిపించినా సంభాషణ పంచుకున్నాను. మీరు ఫిలడెల్ఫియాలో September నెలాఖరు దాక ఉంటారన్కుంట.
  బాసిత్.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)