అవును
నేనేమాట్లాడేది
తడిగుడ్డలతో
కోయబడ్డ గొంతును
తేనెపూసిన
కత్తి అంచు నుండి
నేనే మాట్లాడుతున్నా
ఏ ప్రజాప్రతినిధీ
నాకోసం కన్నీటిని కార్చలే
అందుకే
నేనే మాట్లాడుతున్నా
ఈ నేలను ముద్దాడిన పాపానికి
చావును
చింపబడ్డ చెంగుకు కట్టుకొని
కళ్ళల్లో వొత్తులేసుకొని నాయం కోసం సూత్తున్నా
ఒక్కరన్నా
నన్ను చెరిచిన వాడ్ని
గొంతుపిసికి చంపాలన్నంత కోపాని తెలుపుతారని
ఆశగా నలపబడ్డ ఎంట్రుకల్ని నల్లరిబ్బనుతో ముడేసుకొని
దసాబ్దాలసంది చూస్తూనేవున్నా
మాల గా…
మాదిగ గా…
మాతంగి గా…
మాస్టినిగా…
ఆదిమవాసీగా….
నాకోసం ఇన్ని దినాలసంది
ఏ ఒక్కరూ రోడ్డెక్కలే….
ఏబారికేడు తన్నలే
ఏ రోడ్డూ నిండలే
ఎందుకనో…?
నేను
నిలువునా
చీల్చబడ్డ పెయ్యనే
పొత్తికడుపుల కొయ్యబడ్డ పేగుల్ని
ముడేసుకున్నదాన్ని
నిస్సహాయపు చూపులతో
నెత్తుటి గడ్డలతో
నేనింకా బతికేవున్నా…
మహిళల్లారా
యువకుల్లారా
యువతుల్లారా
నలగని గుడ్డని కలిగినవారా
నలిగిన
నా
మనసుగురించి
పపంచకానికి చెప్పండి
సిగ్గులేని పాలకుల చెవ్వుల్లో వూదండి
మాత్రుమూర్తుల్లారా
అక్కల్లారా
నాపచ్చిగొతునుండి కారుతున్న
రక్తపు దొబ్బల సాచ్చికంగా చెబుతున్నా
నానేలను మీపాదలు ముట్టల్సినంతగా ముట్టకనే
నేనిప్పుడు మాట్లాడుతున్నా
అడవినుండి
తండనుండి
గూడెం నుండి
పల్లెనుండి
పిల్లలా
చెరచబడ్డ తల్లిలా
నాలోనేను
కుములుతూ
కొత్తపొద్దుకోసం
నన్నునేను నిల్పుకుంటూ……
(దళితుల అత్యాచారాలపై మాటపెగల్చని, కలం కదల్చని దౌర్భాగ్యపు స్థితి ఈ దేశంలోనేవుందేమో…నాలోనేను రగిలిన క్షణాల్నిమీముందిలా…)
- సైదులు ఐనాల
బాగుంది సర్
ఆర్థిక వత్యాసాలు — కుల మత పట్టింపులు ఉన్నంత కాలం
మార్పు రావడం -కష్టం –రాదూ —
పోరు –నా జెండా
తెగబడటమే — నా అజెండా కావాలి
———————–బుచ్చి రెడ్డి గంగుల
నిజం చెప్పారు
బాగుంది నిజమే ఈ సమాజంలో దళితుల గురించి ఆదివాసిల గురించి ముక్యంగా అణగారిన వర్గాల తరపున స్పందిస్తే ప్రతి మనిషిలో ఒక కవిత్వం ఉద్బవిస్తాదేమో కానీ స్పందిచేది చాల స్వల్పం అందుకే మీలాంటి వాళ్ళనుండి ఇలాంటి అద్బుత కవితలు వస్తున్నై
…………………..
మీ ఆవేదన, చాల అర్ధవంతంగా కవిత్వీకరించారు సైదులు గారు. ఆలోచింప చేస్తుంది మీ కవిత
ధన్యవాదాలు
నిజంచెప్పాలంటే అఫ్హసర గారు ఇచ్చిన ప్రోత్సాహం నాహృదయాన్ని అక్షరం వైపుకు నడిపిస్తుంది.అందుకు నిదర్శనమే ఈకవిత
ఈదేశంల దళితుల గోస ఎవ్వరికి పట్టదు.ఏదో అద్భుతం జరిగినట్టు ఇంతకు ముందు అటువంటి సంఘటన అసలే జరగనట్టు
పదే పదే టీ.వీ ల్లో చూపించే మనువాద ఛానల్లు, మనువాద ప్రభుత్వాలకి తెలియదా ఎంతమంది నిర్భయలు గతంలో..,వర్తమానంలో…..కన్న తండ్రి కండ్లముందే చెరబడి ఈదేశపు దౌర్భాగ్య చరిత్రలో లిఖించబడని వ్యదార్థ..,యదార్థ గాధలెన్నో…… ఒక ఖైర్లాంజి..,ఒక వేంపేట .ఇలా ఎన్నోఎన్నెన్నో….చెప్పుకుంటూపోతే ఎంతకీ ఒడవని గోస ఈదేశపు దళితులది..అందుకే ఇప్పుడు ఈదేశపు ఎజెండానే మార్చాలి.సైదులు లాంటి కవుల ద్వారా ఒక సాంస్కృతిక విప్లవం వస్తే తప్ప ఈదేశ దళితుల పరిస్తితిలో మార్పురాదు…….మంచి కవితను అందించారు సైదులు గారు అభినందనలు….జైభీమ్
ముందుగా మీకు జైభీమ్ లు
ఈదేశచరిత్ర చాలామట్టుకు రాయిం చుకున్నావానిది
అదీకాకపోతే రాసుకున్నవానిది.అక్షరానికి దూరమైన మనం చరిత్రకు అమ్దలేకపోయమ్ .అందుకే అక్షరాన్ని హత్తుకుం ధామ్. రాబోయే సాంస్కృతిక విప్లవానికి నీ నా లాంటి వారంతా సారధులమే …..
మీ
ఐనాల
సైదులు గారు మన దేశం లో ఆడ వాళ్ళలో దళితులూ లేరు ఆడ జాతంతా దళితులే అణగ తొక్కబడిన వారె, మీ కవిత చాల బాగుంది.
అవును అణచబడ్డ ప్రతి ఒక్కరు ఐక్యం కావాల్సిన అవసరంవుంది పద్మజ గారు.
సైదులు గారూ…!బావు౦ది మీ ఆవేశ౦. ! కలర్ , కాస్ట్ ల వివక్ష లు ఎన్ని తరాలు మారినా కనిపిస్తూనే ఉన్నాయి. అవి చాలా బల౦గా పాతుకొన్నాయా? లేక వాటిని పారద్రోలడానికి ప్రయత్ని౦చే మేధావుల ప్రయత్న౦లో లోపమా? అర్థ౦ కాని పరిస్థితి. వివక్ష ఉన్న౦తవరకు ఇలా౦టి కవితలకు జీవమ్౦టు౦ది. అక్కడక్కడ ఉపన్యాస ధోరణి కనిపి౦చి౦ది. కవిత మొత్తానికి చాలా బావు౦ద౦డి…
సురేష్ గారికి ధన్యవాదాలు