సాహిత్య వ్యాప్తికి మాండలికం ఒక అడ్డంకి: ‘అంపశయ్య’ నవీన్

naveen

నవీన్1

తన రచనే ఇంటి పేరుగా మారి, పాపులర్ అయిన వచన రచయిత నవీన్. కథ, నవలా రచనల్లో తనదైన శైలినీ, వస్తు సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న నవీన్ ప్రధానంగా సమకాలీన ఆధునిక పట్టణ జీవన సంక్లిష్టతని తన రచనల ద్వారా ప్రతిభావంతంగా ఆవిష్కరించారు. “అంపశయ్య” నవల ఒక ట్రెండ్ ని సృష్టించడమే కాకుండా, తెలుగు వచన రచనకి నవీన అభివ్యక్తిని నేర్పింది. నవీన్ చూపించిన మార్గమే నవీన వచనరచనా మార్గంగా మారింది. ఆధునిక సంస్కృతీ, పాపులర్ కల్చర్, కొత్త చదువూ, కొత్త సంస్కారాలూ కొత్త వ్యక్తిత్వాలు నవీన్ రచనల ద్వారా ఆవిష్కృతమయ్యాయి. తెలుగు కథా, నవలా, వచనం ఇంకో మలుపు తిరుగుతున్న ప్రస్తుత తరుణంలో నవీన్ తో ఈ కాఫీ సమయం ఒక అడుగు వెనక్కి వెళ్లి, రెండడుగులు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. నవీన్ తో కేయల్వీ ప్రసాద్ ముఖాముఖి:

Qనవీన్ గారూ, మీరు విద్యార్ధి దశలోనే ప్రయోగాత్మక నవల రాసి రికార్డు సృష్టించారు. అది మీకు గొప్ప పేరు తీసుకురావడమే కాక రచయితగా నిలదొక్కుకోడానికి దోహదకారి అయింది. చివరికి ఆ నవల పేరే మీ ఇంటి పేరుగా మారిపోయింది. ఈ రచన నేపథ్యం  గురించి చెప్పగలరా?

ఉస్మానియా యూనివర్సిటీలో చదివే రోజుల్లోనే ఈ నవలను (అంపశయ్య) రాయడం మొదలుపెట్టాను. అక్కడ పనిచేస్తున్న సీతారామారావు అనే కామర్స్ లెక్చరర్ కు నేను రాస్తున్న నవలలోని కొన్ని భాగాల్ని చదవమని ఇచ్చాను.  ఆయన ఆ పేజీలని  చదివి “దీన్ని చైతన్యస్రవంతి శిల్పం అంటార”ని చెప్పి “జాయీస్ రాసిన యూలీసేస్ చదివావా?” అని అడిగారాయన.  “లేదు” అన్నాను.  ఆ పుస్తకం మన కాలేజీ లైబ్రరీ లో వుంది. నేనే తెప్పించాను. దాన్ని చదవండి. అలాగే తెలుగులో బుచ్చిబాబు చైతన్యస్రవంతి పేరుతోనే  ఒక కథ రాసాడు చదవండి”  అన్నాడు. నేను వెంటనే ఆ పుస్తకాల్ని చదివాను జాయీస్ –యులీసేస్ చదివాను గాని పెద్దగా అర్ధం కాలేదు. “స్టువర్ట్ గిల్బర్ట్  అనే ఆయన   GUIDE TO ULYSSES  అనే పుస్తకం రాసాడు.  దాన్ని పక్కన పెట్టుకొని   ULYSSES  చదవండి అప్పుడర్ధమవుతుంది”  అన్నాడు సీతారామారావు.  ఆ పని కూడా చేసాను. అయినా 50 శాతం కంటే ఎక్కువ అర్ధం కాలేదది. మొత్తం మీద 1967లో ‘అంపశయ్య’ నవల ఎవరినీ అనుకరించకుండా, నాకు తోచిన పద్ధతిలో రాసి పూర్తిచేసాను. 1969లో అది పుస్తకంగా వెలువడింది. పుస్తకం వెలువడిన తర్వాత పాఠకుల నుండి , అద్భుతమయిన, అనూహ్యమయిన, అపూర్వమయిన స్పందన వచ్చింది. ఆ నవల వచ్చిన కొత్తలోనే 1970లో శ్రీశ్రీ గారి షష్టిపూర్తి ఉత్సవాలకు విశాఖపట్నం  వెళ్ళినప్పుడు రోణంకి అప్పలస్వామిగారు నన్ను గట్టిగా కౌగలించుకొని  “అద్భుతమయిన   ప్రయోగం చేశావయ్యా! జాయిస్స్  రచించిన ULYSSES లాంటి నవలను తెలుగులో ఎవరయినా రాస్తారా అని ఎదురు చూస్తున్నాను.  నువ్వాపనిని విజయవంతంగా చేసి చూపించావు “ అన్నారు. అలాగే ఆంధ్రాయూనివర్సిటీ లో చదువుతున్న విద్యార్దులొచ్చి”మా హాస్టల్స్ లో జరుగుతున్న ఎన్నో సంఘటనలని గూర్చి మీకెవరు చెప్పారు? మా మనస్సుల్లో జరుగుతున్న సంఘర్షణంతా మీకెలా తెలిసింది?” అని  అడిగారు. మొదట్లో తెలుగు విమర్శకులెవ్వరూ, ”అంపశయ్య”ను పట్టించుకోలేదు.  కానీ క్రమంగా ఈ నవలకు, పాఠకులనుండి వస్తున్న ఆదరణను చూసి నవల గొప్పతనాన్ని గుర్తించారు.

Qఅంపశయ్య రావడానికి ముందు మీరు కథారచన  కాని ఇతర రచనలు కాని చేసారా?ampasayya

అంపశయ్య నవలకంటే ముందు  నేను కొన్ని కథలు రాసాను.  ఆ కథలన్నింటిలోనూ  పాత్రల మనసుల్లో జరుగుతున్న సంఘర్షణనే చూపించాను. మానసిక విశ్లేషణతో  కూడుకున్న కథలనే రాసాను.  “అథోలోకం” అనే ఒక కథను చైతన్య స్రవంతి  శిల్పంలోనే రాసాను.  ఇదే నేను రాసిన ముఖ్యమయిన మొదటి కథ.   దీన్ని ”జయశ్రీ” అనే మాసపత్రిక 1965 లో ప్రచురించింది. అసలు ఈ కథను ముందు ”భారతి”, ”ఆంధ్ర పత్రిక”, ఆంధ్ర ప్రభ” లాంటి పత్రికలకు పంపిస్తే  వాళ్ళు తిప్పి పంపించారు.

Q మీరు చదువుకునే రోజుల్లో మీ చుట్టూరా వున్న మీ మిత్రులు, శ్రేయోభిలాషులు చాలా మంది వామపక్ష భావజాలాన్ని కలిగి వుండడం, విరసం వంటి సాహిత్య సంస్థల్లో బాధ్యులుగా వుండడం ఇప్పటికీ చూస్తూనే వున్నాం. మరి  మీరు వారికి భిన్నంగా వ్యవహరిస్తూ మంచి రచయితగా నిలదొక్కుకున్నారు. ఇది ఎలా సాధ్యపడింది?

నేను కోరుకునే ప్రజాస్వామ్యం ఏమిటంటే చాలా చెప్పాల్సి వుంటుంది.  అదిక్కడ సాధ్యం కాదు. అయితే నేను చదువుకునే రోజుల్లో వామపక్ష భావాలున్న చాలామంది మిత్రులు మారారు. ఒక్క వరవరరావు  తప్ప. వరవరరావు అతివాద, వామపక్ష భావాలకు పూర్తిగా అంకితమైపోయాడు.  చదువుకునే రోజుల్లో స్థూలంగా ఆయనకు వామపక్ష భావాలు ఉండేవి గాని, ఇప్పుడున్నంత తీవ్రమయిన వామపక్ష భావాలుండేవి కావు. అప్పుడు మేమందరం నెహ్రు గారి సోషలిస్ట్ విధానాల పట్ల సి.పీ.ఐ, ప్రజాస్వామ్య పంధా పట్ల  ఆకర్షితులమయినవాళ్లమే.  నేను రాసిన అనేక నవలల్లోను, కథల్లోనూ, వామపక్షభావాలు, స్త్రీవాద దృక్పథం , సెక్యులరిస్ట్ విధానాలు, శాస్త్రీయ దృక్పథం, కుల, మత, ప్రాంతాలకు అతీతమైన మానవత్వ భావాలు, తీవ్రవాద-హింసాత్మక  విధానాలకు వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తాయి.  ఇవే నన్ను రచయితగా నిలబెట్టాయి. రచయిత అయినవాడు ఏ ఒక్క విధానానికో, రాజకీయ పార్టీకో  చెందినవాడు కాకూడదు. అలా అయితే అతడు తన స్వేచ్చా-స్వాతంత్ర్యాలని కోల్పోతాడు.  రచయితకు తాను ఫీల్ అయింది రాసే స్వాతంత్ర్యం తప్పనిసరిగా వుండాలి అని నేను భావిస్తాను.  అందుకే పార్టీలకు, ఇతర సంస్థలకు అతీతంగా ఉంటున్నాను. ఎవరి విధానాలు నచ్చినా సమర్దిస్తాను కాని సభ్యత్వం మాత్రం తీసుకొను.

Q మీ రచనల్లో రాజకీయ ప్రస్తావనలు, వాటిపై చర్చలు తప్పక వుంటాయి. దీనికి ప్రత్యేకమయిన కారణాలు ఏమైనా ఉన్నాయా?

నా నవలల్లో రాజకీయ ప్రస్తావనలుంటాయి. విభిన్న వాదాల మధ్యన చర్చలుంటాయి.  ఎవరి వాదాన్ని వాళ్ళు వినిపిస్తారు. నా నవలల్లోని పాత్రలు వెలిబుచ్చే అభిప్రాయాలు నావే అని కొందరనుకుంటారు. అది చాలా పొరపాటు. నేను సమాజంలో వ్యాప్తిలో వున్న వివిధ వాదాలని గ్రంధస్తం చేస్తానే తప్ప, ఏ వాదంతోను మమేకం కాను. ఎవరికయినా  సరే, తమ వాదాన్ని వినిపించే హక్కు వుందని నేను భావిస్తాను. ఆ వాదంతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు.   ఇప్పుడు జరుగుతున్న  ఘటనలని, వాదాలని, పర్యవసానాలని  చిత్రించటంలో  నేను సాధ్యమయినంతవరకు objectiveగా ఉండడానికే ప్రయత్నిస్తాను.

అంపశయ్య నవీన్ తో ప్రసాద్

అంపశయ్య నవీన్ తో ప్రసాద్

Qప్రాధమిక దశలో మీరు విశ్వనాథ రచనలకు బద్ధ విరోధి అని, ఆ తరవాత మీరు ‘ఏకవీర’ని మెచ్చుకున్నారని చెప్తారు. ఈ మార్పుకి కారణం చెప్తారా?

నిజమే!…. నేను విశ్వనాధ రచనల్ని —ముఖ్యంగా ఆయన నవలల్ని, ఆ నవలల్లోని ఆయన చాంధసభావాలని, తీవ్రంగా వ్యతిరేకించిన మాట వాస్తవమే! ఇప్పటికీ ఆ విషయంలో పెద్ద మార్పేమీ లేదు.  ”ఏకవీర” నవలను నేను మెచ్చుకోలేదు. ఆ నవలలోని కొన్ని మహిమల్ని (miracles) అలాంటివి నవలల్లో ఉండకూడదని స్పష్టంగా చెప్పాను. విశ్వనాధ కవిత్వాన్ని నేను చదవలేదు.  నవలాకారుడిగా ఆయన నవల నిర్మించే విషయంలో గొప్పవాడు.  ఆయన భావాలతోనే నేను అప్పుడు వ్యతిరేకించాను. ఇప్పుడూ వ్యతిరేకిస్తాను.  ఆయన రాసిన కొన్ని చిన్న నవలలు బావుంటాయని అప్పుడూ అనుకున్నాను.  ఇప్పుడూ అనుకుంటాను.

Qచలం సాహిత్యం పట్లనే కాకుండా వ్యక్తిగతంగా కూడా చలంతో మీకు ఉత్తరప్రత్యుత్తరాలు నడిచేవని విన్నాను.

చలం  అంటే నాకు చాలా అభిమానం. ఆయన సాహిత్యం నన్ను గాడంగా ప్రభావితం చేసింది. ఆయన వచన శైలి , ఆయన స్త్రీవాదభావాలు, వ్యక్తి స్వేచ్చకు ఆయన ఇచ్చే  ప్రాధాన్యం, హిపోక్రసీని, తీవ్రంగా ఖండించడం,”సహజంగా మీకిష్టమయిన పనిచేస్తూ  హాయిగా జీవించంఢిరాబాబూ –”అని ఆయన చెప్పే మాటలు, రచయితలు ఏమి రాసినా,  వాళ్ళ హృదయాల్లో కలం ముంచి రాయాలని ఆయన రచయితలకు చేసిన ఉద్భోద, ప్రకృతిపట్ల ఆయనకున్న స్వచ్చమైన ఆరాధన  ఇవన్నీనన్ను ప్రభావితం చేసాయి.  విద్యార్ధి దశలోనే నేను చలాన్ని, శ్రీశ్రీ ని, బుచ్చిబాబుని, చదివి ఉండకపోతే నా వ్యక్తిత్వం ఇలా ఉండేది కాదు.

 Qస్వర్గీయ కాళోజీ పర్యవేక్షణలో మిత్రమండలి మొదటి కన్వీనర్ గా వరవరరావుగారు వుండే వారు. ఆ సమయంలో మిత్రమండలిలో మీ పాత్ర ఏమిటి?

కాళోజీ రామేశ్వర రావుగారు 1957లో  ”మిత్రమండలి” అనే సాహిత్య సంస్థను స్ధాపించారు. అప్పటినుంచి నేను దాంట్లో సభ్యుడిని.  వరవరరావు ఈ సంస్థకు మొదటి కన్వీనర్ అయితే నేను సంస్థకు రెండవ కన్వీనర్ ని .  ఆ సంస్థను “WRITERS WORKSHOP”  అనవచ్చు. నేను కొత్తగా కథలు రాస్తున్న రోజుల్లో  ఆ కథల్ని  మిత్రమండలిలో చదివినప్పుడు, కాళోజీ రామేశ్వరరావులాంటి పెద్దలిచ్చిన  సూచనలు రచయితగా నేనొక స్థానాన్ని సంపాదించటానికి చాలా దోహదం చేసాయి.   I am a product of  MITHRAMANDALI  అని గర్వంగా చెప్పుకుంటాను.  మిత్రమండలి ఈనాటికీ వరంగల్ లో సజీవంగా వుండడం నాకెంతో గర్వకారణం.

Q మీ రచనల్లో చాలా వాటిల్లో కాలేజీ రాజకీయ వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు అనేక కళాశాలల్లో పని చేయడమే దీనికి కారణమా?

నాకు బాగా తెలిసిన జీవితాన్నే నేను నా నవలల్లో చిత్రిస్తాను. నేను 35సంవత్సరాలు.  (1964–1996) అనేక కళాశాలల్లో పని చేయడమే అందుకు కారణం అయితే కళాశాలల జీవిత నేపధ్యంగా లేని నవలల్నీ , కథల్నీ కూడా నేను రాసాను.

నవీన్

Q కాలరేఖలు మీకు అకాడెమీ అవార్డు సాధించింది కదా? ఆ రచన గురించి చెప్పండి

కాలరేఖలు ” నవలకు కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించింది 2004లో.  కాలరేఖలు కంటే ముందు కేవలం రెండు నవలలకు మాత్రమే (పండిత పరమేశ్వర శాస్త్రి –  వీలునామా–గోపిచంద్,/ హృదయ నేత్రి –మాలతి చందూర్) కేంద్ర సాహిత్య అకాడమీ  పురస్కారం లభించింది. అంటే  1955లో కేంద్ర ప్రభుత్వం ఈ సాహిత్య అవార్డులను ఇవ్వడం మొదలుపెట్టాక  కేవలం రెండు నవలలకు మాత్రమే ఈ అవార్డుల్ని ప్రధానం చేయడాన్ని బట్టి చూస్తే, మన సాహితీ విమర్శకులకు ”నవల” పట్ల ఏమాత్రం గౌరవం వుందో తెలుస్తుంది.  ‘కాలరేఖలు’  నవల ఇతివృత్తం నా మైండ్ లో 20 సంవత్సరాలు నలిగాక నవలా రూపంలో 2001 లో వెలువడింది.  1940ల నాటి తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్ని ఈ నవలలో చిత్రించాను.

ఈ నవలకు sequel గా  ”చెదిరిన స్వప్నాలు”,  ”భాంధవ్యాలు”అనే నవలల్ని రచించాను.  ఈ మూడు నవలలు ఇటు తెలంగాణా ప్రాంతంలోను, అటు భారతదేశంలోను, గత 50 సంవత్సరాలలో,(1944–1994) జరిగిన అనేక సంఘటనల్ని ఈ కాలంలో  ప్రజల ఆర్ధిక, రాజకీయ, సాంఘీక, జీవనాల్లో వుత్పన్నమయిన పరిణామాల్ని చిత్రిస్తాయి.

Q మీ రచనలు చదువుతున్నప్పుడు మీపైన ఆంగ్ల సాహిత్య ప్రభావం అంతో ఇంతో వుందని ఇట్టే అర్థమయిపోతుంది. ఆంగ్ల సాహిత్య ప్రభావం  మీ మీద  ఎంత వరకూ వుంది?

అంతో – ఇంతో  ఏమిటి? నామీద ఆంగ్ల సాహిత్య  ప్రభావం  గాఢంగానేవుంది.  నేను కాలేజీలో, చదువుకునే రోజుల నుండి ఈనాటివరకూ ఎన్నో ఇంగ్లీష్ నవలల్ని చదివాను, చదువుతున్నాను.  నవలా నిర్మాణాన్ని, పాత్ర చిత్రణను , సంభాషణల ద్వారా నవలను, కథను నడిపించే రచనా విధానాన్ని నేను ఇంగ్లీష్ నవలలు చదవడం ద్వారానే నేర్చుకున్నాను.  తెలుగులో సంభాషణల ద్వారా కథలు, నవలలు నడిపించే విధానానికి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి రచనల్ని ఉదాహరణలుగా మన తెలుగు విమర్శకులు చెబుతుంటారు. కానీ నేను నా కథల్లోను, నవలలలోను శ్రీపాద వారికంటే, ఎక్కువగా ఈ శిల్పాన్ని(నాటకీయ శిల్పం అంటారు) పోషించానని పాతనే పట్టుకుని వేలాడే మన విమర్శకులు గుర్తించినట్టులేదు.

Q ఈ వయసులో కూడా ఇంత రచనావ్యాసంగాన్ని, సాహిత్య ఉపన్యాసాలను జోడెద్దుల బండిలాగా ఇంత క్రమశిక్షణతో ఎలా సాగిస్తున్నారు?

మీరన్నట్టు క్రమశిక్షణే నన్నుఈనాటికీ రచయితగా ఉత్సాహంగా అనేక రచనలు , అనేక ప్రసంగాలు చేసేలా చేస్తున్నది. రచయితకు ఆమాటకొస్తే ఏ కళాకారుడికయినా క్రమశిక్షణ , ఆదర్శవంతమయిన నడవడి (character) చాలా ముఖ్యమయినవి.  ఇవి లేని ఎందరో గొప్ప కళాకారులు చాలా త్వరగానే వాళ్ళ కళ నుండి కనుమరుగై పోయిన ఉదంతాలు ప్రపంచ చరిత్రలో ఎన్నో వున్నాయి

 Qనేడు వస్తున్న రచయితల గురించి/ రచనల గురించి మీరేమంటారు? మీ పేరున ప్రారంభమయిన పురస్కారం గురించి చెప్తారా?

నేడు జటిలమయిన సాహిత్యం కుప్పలు తెప్పలుగా వెలువడుతోంది కానీ దాన్ని చదివే పాఠకులు లేకపోవడం నేటి సాహిత్యం ఎదుర్కొంటున్న జటిలమయిన సమస్య.  ఈనాటి రచయితలు కూడా తమ రచనలన్నీ మాండలికంలో చేయాలన్న అత్యుత్సాహాన్ని కనబరుస్తూ పాఠకులకు దూరమయిపోతున్నారు.  మాండలికాల్ని సంభాషణల వరకే పరిమితం చేయాలన్న నియమాన్ని మన వర్ధమాన రచయితలు పాటించడం లేదు.

ఇక నేను ప్రవేశ పెట్టిన పురస్కారం గురించి ఒక నవలాకారుడు రచించిన మొదటి నవలకు,10,000/-రూపాయలు పురస్కారాన్ని ఇచ్చి, కొత్తగా నవలలు రాస్తున్న నవలాకారులని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో 2012వ సంవత్సరం నుండి నేను ”నవీన్ సాహిత్య సమితి” ద్వారా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నాను.  భవిష్యత్తులో ఈ పారితోషికాన్ని ఇంకా పెంచాలని కూడా వుంది. నేను రాసిన మొదటి నవల ”అంపశయ్య”ను ప్రచురించుకోవటానికి నేను ఎన్ని కష్టాలు పడ్డానో నేనెప్పటికీ మరచిపోలేను. అలాంటి కష్టాలు ఒక ప్రతిభావంతుడయిన నవలాకారుడు పడకూడదనే ఉద్దేశ్యంతోనే  ఈ పురస్కారాన్ని ఇస్తున్నాను. ప్రతి సంవత్సరం December 24 నాడు ప్రధానం చేయడం జరుగుతుంది.

 Qమీ రచనలు అనేక భాషల్లో అనువాదమయ్యాయి. వాటి వివరాలు చెప్పగలరా?

నా రచనలు చాలా ఇతర భాషల్లోకి అనువదించబడి పుస్తకాలుగా వెలువడ్డాయి.  ”అంపశయ్య”ఆంగ్లం లోను, హిందీలోనూ వెలువడింది.  త్వరలో తమిళ, కన్నడ భాషల్లో రాబోతున్నది.  ”చీకటిరోజులు” ఆంగ్లంలోను, ”కరుణ”, “మౌనరాగాలు” , “మనోరణ్యం”, ”నిష్కృతి” కన్నడంలోనూ, ”రక్తకాసారం” హిందీ, ఆంగ్లం,లోనూ, ”భాంధవ్యాలు” హిందీలోనూ వెలువడ్డాయి. ”నిష్కృతి”, ”అవాస్తవికుడు” అనే నా రెండు రచనలు సంస్కృతం లోనూ వెలువడ్డాయి. కేంద్ర సాహిత్య పురస్కారం పొందిన ”కాలరేఖలు” నవల త్వరలో భారతీయ భాషలన్నింటిలోనూ వెలువడబోతున్నది.

 Qమీ భవిష్యత్ కార్యక్రమాల గురించి చెప్పండి.

1994 నుండి అంటే నా ”భాంధవ్యాలు” నవలకు సీక్వెల్ గా ప్రపంచీకరణ, సరళీకరణ విధానాల వల్ల మానవసమాజంలో ఉత్పన్నమవుతున్న ఆర్ధిక/సాంఘీక/రాజకీయ మార్పుల్ని ముఖ్యంగా ఒక సగటు మనిషి జీవితం ఎలా మారిందో  చిత్రిస్తూ ఒక నవల రాస్తున్నాను ఈ December 24 న దాన్ని రిలీజ్ చేయాలని నా ప్రయత్నం. చలం జీవితాన్ని చిత్రిస్తూ ఒక ”జీవిత కథాత్మక నవల’, ‘ biographical novel ఇర్వింగ్ స్టోన్  రచించిన లస్ట్టఫుల్ లైఫ్ లాంటిది వచ్చే సంవత్సరం మొదలుపెట్టి రాయాలని అనుకుంటున్నాను.  ప్రస్తుతం  THE HANS INDIA  అనే ఆంగ్లదిన పత్రికలో ”VIGNETTES OF LIFE”  అనే  కాలమ్ గత రెండేళ్ళుగా రాస్తున్నా. ఇలాగే ఆంగ్లంలో ఇంకా కొన్ని రచనలు చెయ్యాలని కూడా ఆలోచిస్తున్నాను.

ఇంటర్వ్యూ : కేయల్వీ ప్రసాద్

Download PDF

8 Comments

 • veldandi sridhar says:

  ప్రపంచీకరణ మనిషి జీవితంపై అడుగు పెట్టిన నాటి నుండి ప్రపంచ వ్యాప్తంగా ఎవరి భాషను వారు, ఎవరి సంస్కృతిని వారు కాపాడుకోవడం మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది రచయితలు తమ తమ మండలికాల్లోనే రాస్తున్నట్టు గమనిస్తున్నాము. ఈ సందర్భంలో మాండలికాల్లో రాయడం సాహిత్య వ్యాప్తికి ఆడ్డంకి ఎలా అవుతుందో తెలుసుకోవాలని వుంది. అంతేగాక కన్యాశుల్కం నాటకానికి అంత జీవత్వం రావడానికి కారణం అది ఆ ప్రాంత మాండలికంలో రాయబడడమేనని ఏంతో మంది విమర్శకులు గుర్తించారు. రావిశాస్త్రి, కారా మాష్టారు, కేతు, సింగమనేని, స్వామి, సన్నపురెడ్డి, చక్ర వేణు, సుంకోజు దేవేంద్రాచారి, ఖదీర్ బాబు, యశోదా రెడ్డి, గూడూరి సీతారాం, బి. యస్. రాములు, పెద్దింటి అశోక్ కుమార్, ఇలా ఎంతో మంది రచయితల రచనల్ని మాండలికానికి దూరంగా జరిగి ఊహించలేము. కేవలం సంభాషణల్ని మాండలికంలో రాసి కథనం అంతా ప్రామాణికం లో నడపడం ఇప్పుడున్న పరిస్థితిలో సరైనది కాదేమో తెలుసుకోవాలనుంది.

  వెల్దండి శ్రీధర్

 • buchireddy gangula says:

  కష్టాలు
  కన్నీళ్ళు
  భాధలు
  ఆకలి అరుపులు
  బానిసత్వపు బతుకులు
  మోసం– దగా — దోపిడి —తెలంగాణా లో
  చూస్తూ — చదువుతూ —
  జై తెలంగాణా –ప్రజా ఉద్యమాన్ని — నవీన్ గారు ఎందుకు సమర్ధించ లేదో
  అడుగుగావలిసి ఉండే ప్రసాద్ గారు —
  రచయితలు ఏ రాజకీయ పార్టీ కో చెందిన వాడు కాకూడదూ ??ఎందుకు –వివరణ అవసరం
  యిక వారి పేరు మార్పు కు కారణం — రాష్ట్రం లో వాసి రెడ్డి నవీన్ గారు రచయిత కాకున్నా
  తెలుగు సాహితీ ప్రపంచం లో — అన్ని చోట్ల వారి పేరు — వారి ఉనికి —వ్యాప్తి చెందటం తో — నవీన్
  గారు — యిన్ని రాసిన తనను — జనం –గుర్తించడం లేదని — వారు అంపశయ్య నవీన్ గా పేరు
  మార్చుకోవడం జరిగింది –(వారు నాకు చెప్పిన మాటలు )
  నగ్నముని గారి కన్కాభిషేఖం తో —రచయితలు కూడా — రాజకీయ నాయకుల్లా — రంగులు మారుస్తూ ???
  ————————————————బుచ్చి రెడ్డి గంగుల

 • buchireddy gangula says:

  శ్రీధర్ గారు
  మీ ఒపీనియన్ తో నేను ఏకీభవిస్తాను — యిక
  ఆధునిక సంస్కృతి — పాపులర్ కల్చర్ — కొత్త్హ చదువూ
  కొత్త వ్యక్తివాలూ –కొత్త సంస్కారాలూ – Naveen గారి
  రచనల ద్వారా అవిష్కిత మయ్యాయి — అని రాయడం లో
  Prasad గారు మీరు నాలుగు అడుగులు ముందుకు వేసారనుకుంటా —
  కొంచం ఎక్కువే రాసారు — అని నా ఒపీనియన్ —
  ————————————————————————–
  బుచ్చి రెడ్డి గంగుల

 • Mercy Margaret says:

  “అంపశయ్య నవీన్ ” గారితో ఇంటర్వ్యు బాగుంది. నేర్చుకునే కొన్ని అంశాలు తెలియజేసారు .ధన్యవాదాలు ప్రసాద్ గారు

 • రమాసుందరి says:

  మాండలీకం వేరు, యాస వేరు. వివిధ మాండలికాల్లో విశేష పదసంపద ఉంది. అది కాపాడుకోవాలంటే ఆయా మాండలికాలలో కధలు రావాల్సి ఉంది. ఇక యాస ను అనుసరించటం కష్టం అయినా కధలో బలం ఉన్నప్పుడు అది అంత ప్రయాస అనిపించదు. కధాబలం ఉన్న కధలు ఏ యాసలో రాసిన రాణిస్తాయి. అది లేనప్పుడు, వీరంటున్న” ప్రామాణిక భాష” లో రాసినా ఎవరు చదవరు. ఈ విషయాన్ని సాహితి చరిత్ర రుజువు చేసింది.

 • Mohan says:

  నవీన్ గారి ఇంటర్వ్యూ చాల బాగుంది. తెలుగు సాహిత్యంలో టాప్ 3 రైటర్స్ లో నవీన్ గారు ఒకరు. నా దృష్టిలో అంపశయ్య తెలుగు సాహిత్యం లో వచ్చిన బెస్ట్ నవల. దీంతో చాల మంది తెలుగు సాహిత్యాభిమానులు ఏకీభవిస్తారు.

  బుచ్చి రెడ్డి గారు నవీన్ గారిని కావాలని విమర్శిస్తున్నారు, అతని విమర్శలో లాజిక్ లేదు. నవీన్ గారు చాల క్లియర్ గా చెప్పారు మాండలికం అనేది సంభాషణల్లో ఉండొచ్చు కానీ పూర్తి మాండలికంలో ఉంటె బాగుండదు అని అన్నారంతే. అది చాలా కరెక్ట్. ఇక నవీన్ గారి పేరు గురించి బుచ్చి రెడ్డి గారు చేసిన కామెంట్స్ హాస్యాస్పదం. నవీన్ గారి పేరుకి వాసి రెడ్డి నవీన్ గారి పేరుకు అసలు సంబందమే లేదు. నవీన్ గారికి ఆ పేరు 1965 లోనే అతని క్లోజ్ ఫ్రెండ్ వర వర రావు గారు పెట్టారు.మీతో నవీన్ గారు ఆ విషయం చెప్పడమనేది పూర్తిగా అబద్దం, ఎందుకనంటే మీరు ఆయనకీ అంత క్లోజ్ కాదు మీతో ఆయన ఇలాంటి విషయాల్ని షేర్ చేసుకునేంత సీన్ లేదు. మీరు ఆయన్ని ఇంతగా విమర్శిస్తున్నారంటే మీరు ఆయనకి శత్రువు కాని మిత్రుడు కాదు. నవీన్ గారు మన తెలుగు లో ఉన్న గొప్ప రైటర్ అతని నవలలని చదివి ఎంజాయ్ చేయాలి కానీ కారణం లేకుండా విమర్శించడం సరి కాదు.

  తెలంగాణా ఉద్యమం గురించి నవీన్ గారికి చాల మంచి అవహగాహన మరియు సింపతీ ఉంది, ఈ విషయం గురించి ఆయన చాల సార్లు చెప్పారు. .తెలంగాణా ఉద్యమానికి ఆయన ఎల్లప్పుడూ సపోర్ట్ చేసారు.రీసెంట్ గ ఆయన ఈ విషయాన్నీ తి న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ లో క్లియర్ గ చెప్పారు కూడా.

  తెలుగు సాహిత్యంలో ఆయనకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన ఇంకా ఎన్నో గొప్ప నవలలు రాయాలని ఆశిద్దాం.

 • anveshi says:

  నాకు అంపశయ్య నచ్చింది. కానీ ఫర్వాలేదనిపించేదే తప్ప గొప్ప నవల కాదని నా అభిప్రాయం. కారణాలు అనేకం. చైతన్య స్రవంతి అంటే చైతన్య స్రవంతిలా రాయడం కాదు. నవీన్ గారి నవలలో ఆ ఫేక్ తనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంపశయ్య చైతన్య స్రవంతిలా భ్రమింపచేసే సాధారణ నవల.

  కంపేర్ చెయ్యటం కాదు కానీ చైతన్య స్రవంతిలో రాసిన తెలుగు నవలగా కేశవ రెడ్డి “సిటీ బ్యూటి ఫుల్” ఒక్కటే నేను కన్సిడర్ చేస్తాను.

  మరో విషయం ధృక్కోణాలు విషయంలో కూడా నవీన్ గారిని నేను పొగడలేను. విషయం ఏంటంటే అకుతగవా రాసిన పది పేజీల కథను కురసోవా పూర్తి నిడివి సినిమాగా చేశారు. నవీన్ గారు ఆ సినిమా చూసి రెండొందల పేజీల నవల రాశారు. పది పేజీలు దాటి చదవలేని ఆర్టఫిషియాలిటీ ఈ నవల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది.

  ఏదో నాకు తోచింది చెప్పాను అంతే!

 • mohan says:

  అన్వేషి గారి విమర్శ సరి కాదు అని నా అభిప్రాయం. అంపశయ్య లాంటి గొప్ప నవలని సరి ఐన కారణం లేకుండా విమర్శించడంలో అర్ధం లేదు. ఆ నవలకి ఉన్న లక్షలాది అభిమానుల్ని అడిగితే అప్పుడు ఈ నవల గొప్పతనం మనకి తెలుస్తుంది. దృక్కోణాలు కూడా చాల మంచి నవల ఏదో ఇంగ్లీష్ మూవీ తో పోల్చి ఈ నవలని విమర్శించడం సరి కాదు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)