బియాండ్ కావలి… బియాండ్ ఖదీర్!

 

అరిపిరాల సత్యప్రసాద్

అరిపిరాల సత్యప్రసాద్

 

ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి?

ఈ రెండు ప్రశ్నలకి సరైన జవాబు తెలుసుకోగలిగినవాడే గొప్ప రచయిత అవుతాడు. ముఖ్యంగా కథల విషయంలో ఈ ప్రశ్నల ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మనకన్నా ఇంకాస్త ఎక్కువ చదువుకున్నవాళ్ళు ఈ ప్రశ్నలనే మరో రకంగా “వస్తువు, శిల్పం/శైలి” అంటారు. అనేదేదైనా కథకుడు ఆలోచించి తీరాల్సిన రెండు ప్రశ్నలు అవే – ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? చెప్పాలనుకున్న వస్తువును ఆధారం చేసుకోని శైలి వుండాలనేది అందరూ ఒప్పుకునే సత్యం. ఈ రెండింటి సమన్వయం కుదిరితే ఆ కథ గొప్ప కథ అయ్యే అవకాశాలు మెండుగా వుంటాయి.

పై విషయాలు మనందరికీ తెలిసిన విషయాలైనా మళ్ళీ ఎందుకు చెప్పానంటే ఖదీర్ బాబు కొత్త పుస్తకం “బియాండ్ కాఫీ” గురించి చెప్పడానికి. ఈ పుస్తకంలో వున్న చాలా వరకు కథలను విశ్లేషించే ముందు వస్తువు, శిల్పం గురించి ఒకసారి పునశ్చరణ చేసుకోవడం అవసరం. సరే అదలా పక్కన పెడదాం.

కథకుడు ఖదీర్ బాబు పేరు చెప్పగానే నెల్లూరు జిల్లా కావలిలోని పేద కుటుంబాలు, మరీ ముఖ్యంగా ముస్లిం కుటుంబాలు గుర్తుకొస్తాయి. పేదరికం ముఖం మీదకి ఆత్మవిశ్వాసాన్నో, చిరునవ్వునో అయుధంగా విసిరి గెలిచిన వీరుల కథలు ఆయన “దర్గామిట్ట కతలు”, “న్యూ బాంబే టైలర్స్” సంపుటాలలో కనిపిస్తాయి. నామిని కథల స్పూర్తిగా ఆత్మకథల కథలు విరివిగా వస్తున్న సంగతి మనకి తెలుసు. అలాంటి కథలే “దర్గామిట్ట కతల”ని ఖదీర్ స్వయంగా చెప్పుకున్నాడు కూడా.

  ఇలాంటి కథలు రాయడంలో ఒక సౌకర్యం వుంటుంది. తాము (ముఖ్యంగా చిన్నప్పుడు) చూసిన జీవితాన్ని ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోని రాయడం వల్ల ఎక్కువగా ఊహించాల్సిన పని వుండదు. చెప్పే విధానం (శైలి/శిల్పం) మీద మాత్రమే దృష్టి నిలిపితే స్వతాహాగా వున్న వస్తు బలం వల్ల కథలకి మంచి పేరొస్తుంది. అందువల్ల ఇలాంటి కథలు రాయడం సుళువని నా ఉద్దేశ్యం. ఇదే విషయాన్ని ఖదీర్ బాబు కూడా ఒక చోట ప్రస్తావించారు – “రాయగా రాయగా మంచినీళ్ళు తాగడం కన్నా ఈ కతలు రాయడమే సులువుగా అనిపించింది నాకు” అని.

ఇలాంటి కథలు పాఠకులని మెప్పించే విషయంలో కూడా కొంత సౌలభ్యం వుంది. వీటిల్లో nostalgic effect వుండటం వల్ల “ఒకసారి మనూరు వెళ్ళి చూసొద్దాం” అన్నంత చనువుగా పుస్తకంలోకి వెళ్ళిపోతాం. అక్కడికి ఈయన రాసిన కథలు గొప్పవి కాదని నేను అనటంలేదు. ఈ సౌలభ్యాలని దాటి, ఇంతకంటే కష్టమైన ప్రయోగం చేశాడు కాబట్టి post facto  చూస్తే పెద్ద గీత ముందు చిన్న గీతలా ఈ కథలు ఆయన సులభంగానే రాసేసివుంటాడు అనిపిస్తుంది. అలా అనిపించడానికి దోహదం చేసిన కథల సంపుటి – “బియాండ్ కాఫీ”

***

beyond kaafee

ఖదీర్ బాబు ఈ పుస్తకం కోసం కావలి దాటి వచ్చేశాడు. ఇప్పటి దాకా మనకి పరిచయమున్న ఖదీర్ ని కూడా దాటి వచ్చేశాడు. కథా వస్తువును ఎన్నుకోవడంలోనే ఇప్పటి కథకులను దాటి నాలుగడుగులు ముందుకేసేశాడు.

ప్రస్తుతం మనం బతుకుతున్న ప్రపంచం ఎన్నో సంక్లిష్టమైన సమస్యలను మన ముందు ముళ్ళలా పేరుస్తోంది. పారిశ్రామీకరణలు, ప్రపంచీకరణలు దాటి సాంకేతిక విప్లవాలు, సమాచార విప్లవాల మీదుగా ద్రవాధునికతలోకి (liquid modernity) ప్రయాణిస్తున్నాం. మార్పు అనివార్యమైపోతోంది. మార్పుకి మార్పుకి మధ్య సమయం కుచించుకుపోతోంది. ఈ పరిస్థితుల్లో పుట్టుకొస్తున్న కొత్త ధోరణులను కథా వస్తువుగా కథలు రావాల్సిన అవసరం చాలావుంది. ఆ కథాంశాలతో కథలు రాసే సాహసం ఖదిర్ బాబు చేశాడు.

సాహసం ఎందుకంటే – ఇప్పటిదాకా ఖదీర్ బాబు అంటే వున్న ఇమేజ్ వేరు. ఆయన “సులభంగా” రాసేసినా బాగా పేరుపడ్డ కథలలా ఈ కథాంశాలకు ఆ ఎట్రాక్షన్ లేదు. పైగా ఈ కథలు మన ఉరుకుల పరుగుల జీవితాన్ని, మంచి చేడుల మధ్య లోలకంలా ఊగిసలాడే మన విలువలని నిర్లజ్జగా నగ్నంగా నిలబెడతాయి. ఇది చదివి కొంతమంది ఇలాంటి జీవితం జీవిస్తున్నామా అని అనుకోవచ్చు. ఇదంతా ట్రాష్… మన జీవితాలేం ఇంత దారుణంగా లేవని ఇసకలో తల పెట్టుకు బతికేయచ్చు. నిక్కచ్చిగా చెప్పే నిజాన్ని నిజం అని ఒప్పుకునే ధైర్యం అందరిలో వుండకపోవచ్చు. అయినా సరే ఇలాంటి కథలను రాసి, (ఏ పత్రికలోనో కాకుండా) నేరుగా పుస్తకంగా వెయ్యగలగడం సాహసం అని కాక ఇంకేమనగలం?

సరే, కథాంశాలు ఇలా వుంటే దానికి తగ్గ శైలి వుండాలని ముందే అనుకున్నాం కదా? ఖదీర్ బాబు అదే చేశాడు. ఇప్పటిదాకా సొగసుగా పలికిన నెల్లూరు జిల్లా యాసని వదిలిపెట్టాడు. ఆ వాక్య నిర్మాణ పద్ధతిని విడిచిపెట్టాడు. కొత్తగా కలం పట్టినంత సుళువుగా కొత్త వాక్యాలని నిర్మించాడు. ప్రపంచీకరణ, సమాచార విప్లవాల అనంతరం ఏర్పడిన “నియో రిచ్” మానసిక స్థితిని చెప్పడానికి ఒక కొత్త పరిభాషని అందుకున్నాడు. ఇది చూడండి –

నలుగురు వచ్చారు.

ఆగింది.

ముప్పయ్ రెండేళ్ళ స్త్రీ – ఒక సమస్య వల్ల సతమతమవుతూ ఆ సమస్యకు –

ముందుకు వచ్చారు.

భయపడింది.

ముప్పయ్ రెండేళ్ళ స్త్రీ – ఒక సమస్య వల్ల సతమతమవుతూ –

చుట్టుముట్టారు.

ముప్పయ్ రెండేళ్ళ స్త్రీ –

అబ్బ.. అబ్బ… ఏముందిరా.

ముప్పయ్ రెండేళ్ళ –

ఆత్రపడ్డారు (ఇంకోవైపు)

(ఇలాంటి వాక్యాలు ఈయనతోనే మొదలు అనేంత దుస్సాహసం నేను చెయ్యడం లేదు. ఇలాంటి వాక్యాలు ఖదీర్ బాబుకి కొత్త అని మాత్రమే నేను అంటున్నాను.)

దాదాపు అన్ని కథలలోనూ స్త్రీలను ముఖ్యపాత్ర చేశాడీయన. నేను పైన ప్రస్తావించిన పోస్ట్ గ్లోబలైజేషన్ – ద్రవాధునిక జమానాలో అన్ని కోణాలనుంచి ఒత్తిడికి లోనౌతున్నది స్త్రీ. ఉరుకుల పరుగుల మధ్య భర్తకి ఉదయాన్నే కారియర్ అందించే వంటమనిషిగానో, వారాంతంలో శృంగారావసరాలకి మాత్రమే పనికొచ్చే ఆటబొమ్మగానో మిగిలిన భార్యలు ఇప్పుడు మనకి కొత్తకాదు. అయితే పేరుకు కుటుంబం వున్నా ఒంటరైపోయిన ఇలాంటి వాళ్ళ జీవితంలోంచి కథలు తీసుకురావడంలో రచయిత సఫలీకృతులయ్యాడు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళ జీవితాలలో వున్న స్తబ్దతని, అనిశ్చితిని, నైరాశ్యాన్ని వాక్యాలతో నిర్మించిన తీరు చాలా గొప్పగా వుంది. (టాక్ టైమ్, మచ్చ, బియాండ్ కాఫీ). ఇది శైలి గురించి

మొత్తం మీద చెప్పేదేమిటంటే – ఈ పుస్తకంలో కొత్త వస్తువుతో, కొత్త శైలితో ఖదీర్ కొత్తగా పుట్టాడు.

***

ఇందులో పది డైరెక్ట్ కథలు (ఏ పత్రికలోనూ అచ్చు కానివి) వున్నాయి. అందులో “వహీద్” కథ ఒక్కటే Odd man out గా వుండిపోతుంది. మిగిలిన కథలన్నీ పోస్ట్ మోడరన్ సిటీలలో జరిగితే ఈ కథ ఒక్కటే నోస్టాల్జిక్‍గా వెనక్కి వెళ్తుంది. కథలో కొంత లిబరల్ అంశం వున్నా అది చాలా పల్చగా వుండటం వల్ల బహుశా ఈ సంకలనంలో వుండదగినది కాదేమో అనిపిస్తుంది. ఆ ఒక్క కారణం తప్పితే కథ బాగానే వుంది. మిగిలిన కథలన్నీ చదవాల్సినంత బాగున్నాయి. మనం బతుకున్న సమాజాన్ని ఒకసారి మనం అద్దంలో చూసుకోవాల్సిన అవసరం వల్ల చదవాలి.

అయితే ఈ కథలు చదివిన తరువాత కొంత అసహ్యం కలగవచ్చు, కొంత అసహనం కలగవచ్చు. నిక్కచ్చిగా నిజం తగిలిన చోట కోపం రావచ్చు. బహుశా రచయిత కోరుకుంది కూడా అదేనేమో..??

– అరిపిరాల సత్యప్రసాద్

(ఖదీర్ పుస్తకం కినిగె లో దొరుకుతోంది)

Download PDF

8 Comments

  • Vimala says:

    ఖదీర్ కధలు మంచి చెడుల నడుమ గల నీలి నీడల తెరలను తొలగించి
    మనిషి అంతరాంతరాల లోని అసలు రూపాన్ని నగ్న్నంగా బయట పెట్టె
    ప్రయత్నం చేశాఇ . దాదాపు అన్ని కధలు సెక్షువలిటి పైన రాసినవీ. చర్చ జరగల్సింది ఆ కోణము
    ఆడవాళ్ళ వైపునుండా కాదా అని. ఈ కధలు ఏమి చెబుతున్నాయి ? మనుషులు
    ఎలాంటి వారో చెప్పి, ఎవరి ఆలోచనలకు వాళ్ళని వదిలాయా ???
    మొత్తం మీద వదలకుండా చదివించిన , మనల్ని వెంటాడి వేటాడే కధల్ని
    రాసిన ఖదీర్కి అభినందనలు.

    విమల

  • సాయి పద్మ says:

    మంచి విశ్లేషణ. ముఖ్యంగా- “ద్రవాధునిక జమానాలో అన్ని కోణాలనుంచి ఒత్తిడికి లోనౌతున్నది స్త్రీ. ఉరుకుల పరుగుల మధ్య భర్తకి ఉదయాన్నే కారియర్ అందించే వంటమనిషిగానో, వారాంతంలో శృంగారావసరాలకి మాత్రమే పనికొచ్చే ఆటబొమ్మగానో మిగిలిన భార్యలు ఇప్పుడు మనకి కొత్తకాదు. అయితే పేరుకు కుటుంబం వున్నా ఒంటరైపోయిన ఇలాంటి వాళ్ళ జీవితంలోంచి కథలు తీసుకురావడంలో రచయిత సఫలీకృతులయ్యాడు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళ జీవితాలలో వున్న స్తబ్దతని, అనిశ్చితిని, నైరాశ్యాన్ని వాక్యాలతో నిర్మించిన తీరు చాలా గొప్పగా వుంది. “

  • పైన సాయిపద్మ గారు కోట్ చేసిన ఒక్క పేరా తప్ప కథల పరిచయం, ప్రస్తావన లేదు – ఖదీర్ కావలిని వదిలి బయటికొచ్చాడన్న ఒక్క గమనిక తప్ప .. :(

    • కథల గురించి రాయడం వల్ల పఠనానుభూతి తగ్గిపోతుందని నా వ్యక్తిగత అభిప్రాయం. పైగా పుస్తకం విడుదలైన రెండు రోజుల్లోనే ప్రతి కథని ఒక్క వాక్యంలోకి కుదిస్తూ చాలా మంది ఫేస్ బుక్ లోనూ బ్లాగుల్లోనూ ప్రస్తావించారు కాబట్టి ఆ అవసరం కనపడలేదు. ఈ పుస్తకాన్ని పరిచయం చేసి చదవడానికి ప్రిపేర్ చెయ్యడమే నా ఉద్దేశ్యం.

  • balasudhakarmouli says:

    khadeer baabu gaari kathalu- poleramma kathalu, dargaamitta kathalu chadivi.. goppa aandaaniki lonayyaanu…. new bomby tailors kathalu chadivi— dhukkaaniki koodaa lonayyaanu…. aayana kathalu chadavadam – oka manchi anubhavam… BIYAAND COFFEE kathalu yekkada dorukuthaayo cheppagalaru……. pusthakam roopamlo…..

  • Kamakshi says:

    అడ్డగోలుగా వుంది సమీక్ష. ‘ఈ పుస్తకంలో వున్న చాలా వరకు కథలను విశ్లేషించే ముందు వస్తువు, శిల్పం గురించి ఒకసారి పునశ్చరణ చేసుకోవడం అవసరం.’ అన్న వెంటనే మళ్ళీ ‘సరే అదలా పక్కన పెడదాం.’ అంటే అర్ధమేమిటి?

    “ద్రవాధునిక జమానాలో అన్ని కోణాలనుంచి ఒత్తిడికి లోనౌతున్నది స్త్రీ. ఉరుకుల పరుగుల మధ్య భర్తకి ఉదయాన్నే కారియర్ అందించే వంటమనిషిగానో, వారాంతంలో శృంగారావసరాలకి మాత్రమే పనికొచ్చే ఆటబొమ్మగానో మిగిలిన భార్యలు ఇప్పుడు మనకి కొత్తకాదు.” – స్త్రీ అంటూ మళ్ళీ ఒక్క భార్య రోల్ మాత్రమే మాట్లాడతారే! ఉదయాన్నే భర్తకి కారియర్ అందించేసి ఆ తర్వాత మిగిలిన రోజంతా, వారాంతంలో శృంగారావసరాలు తీర్చేసి మిగిలిన వారమంతా ఆనందంగా తానొక “స్త్రీ” గా బతకచ్చు కదా! అందులో బాధేమిటి?

    “నియో రిచ్” మానసిక స్థితి కి అక్కడ కోట్ చేసిన వాక్యాలకీ సంబంధమేమిటి?

    “పైగా ఈ కథలు మన ఉరుకుల పరుగుల జీవితాన్ని, మంచి చేడుల మధ్య లోలకంలా ఊగిసలాడే మన విలువలని నిర్లజ్జగా నగ్నంగా నిలబెడతాయి. ఇది చదివి కొంతమంది ఇలాంటి జీవితం జీవిస్తున్నామా అని అనుకోవచ్చు. ఇదంతా ట్రాష్… మన జీవితాలేం ఇంత దారుణంగా లేవని ఇసకలో తల పెట్టుకు బతికేయచ్చు. నిక్కచ్చిగా చెప్పే నిజాన్ని నిజం అని ఒప్పుకునే ధైర్యం అందరిలో వుండకపోవచ్చు. ” – ఇవెక్కడి అభాండాలు? ఇప్పటి విలువలు యివే అని ఒక రచయిత రాసాడే అనుకొండి, లేదు మేమలా లేము అని ఇక ఎవరూ అనడానికీ అనుకోడానికీ లేదా! మేము అలాగే ఉన్నామని అందరూ ఒప్పుకోవాలా? ఒప్పుకోకపోతే అది “ఇసకలో తల పెట్టుకు బతికేయడమా ?. నిక్కచ్చిగా చెప్పే నిజాన్ని నిజం అని ఒప్పుకునే ధైర్యం లేకపోవడమా?” ఇదెక్కడి బ్లాక్ మెయిల్?

  • ఖదీర్ బాబును కొత్తగా పాఠకలోకానికి పరిచయం చెయ్యనఖ్కరలేదు. కానీ ఖదీర్ బాబు కొత్తగా తన శైలిని, వస్తువుని ఆవిష్కరించుకున్న ఈ కొత్త పుస్తకాన్ని మాత్రం ఖచ్చితంగా పరిచయం చెయ్యాల్సిందే.

    ‘ఎ లాట్కెన్ హ్యాపెన్ ఓవర్ అ కప్ ఆఫ్ కాఫీ’ అని ఉంటుంది కేఫే కాఫీడేలో. ఆ లాట్ కన్నా ఇంకా ఎక్కువజరిగిపోతున్న మాడ్రన్…పోస్టుమాడ్రన్ జీవిత శకలాల్లోని హాలాహలపు చుక్కలని వడగట్టిన డికాషన్ ని, అంతరాలాల్లో మనుషులుగా విరిగిపోయిన మానవత పాలతో కలిపి వండి వార్చిన చిక్కటి కషాయం లాంటి కాఫీ మహ్మద్ ఖదీర్ బాబు “బియాండ్ కాఫీ” కథల సంకలనం.

    కాలపు వేగంలో నింపకుండా మిగిలిపోయిన శూన్యాలు. జీవితాదర్శాల ప్రమాణాల్లో పావర్టీని విజయవంతంగా తెచ్చిన పోస్ట్ లిబరల్ మార్కెట్ నేపధ్యంలోని నియోరిచ్ రుగ్మతలు. అర్బన్ మిడిల్ క్లాస్ ఎదగాలనే యాస్పిరేషన్లొ కోల్పోతున్న ఆనందాలు. పాల్పడుతున్న డీవియన్సులూ. మనచుట్టు ఉన్న మనుషులు, రోజూ కలుస్తున్న మనుషులు, మనకు బాగా తెల్సిన మనుషులే అన్ని కథల్లోనూ. కానీ వీటి గురించి మనం మాట్లాడం. ఒక ఇబ్బందికరమైన మౌనాన్ని ఆశ్రయిస్తాం. ఆ మౌనాన్ని ఛేధించిన కథలు ఇవి. చదువుతున్నంతసేపూ కొంత ఇబ్బందికి కలిగిస్తాయేమో. కొంత జుగుప్సకూ కారణమౌతాయేమో. కానీ చివరకు, సమకాలీన మానవ చరిత్రను డాక్యుమెంట్ చేసే క్రియేటివ్ ఎండెవర్ గా మిగిలిపోతుందేమో.

    ‘బియాండ్ కాఫీ’ నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో ఒక కొత్త కోణం. పది కథలు, కొన్ని వేల ప్రశ్నలు. తప్పక చదవండి.

    1. ఆస్తి: ఆస్తి ఒక మానసిక రుగ్మత అని ఒక మానవబలహీనతలతో ఆడుకునే ఒక ఫకీరుతో సజెస్ట్ చేయించడం ఒక గొప్ప మతలబు ఈ కథలో.

    2. ఘటన: కొన్ని తెలియని ఘటనలు జీవితాన్ని మళ్ళీ దార్లో పెడతాయి. గమ్యం తప్పినవాళ్ళని గతిలో పెట్టడానికి అప్పుడప్పుడూ అనుకోని ఘటనలే కారణమౌతాయి. వాటికి పెద్ద లాజిక్కులు ఉండవు. అలాంతి ఘటన ఇది.

    3. టాక్ టైం: టైం లేని కుటుంబ సభ్యులమధ్య కేవలం మొబైల్ ఫోనులోని టాక్ టైం జీవితానికి ఆలంబన అయిన ఒక స్త్రీ జీవితపు శున్యం కథ ఇది. ఆ శూన్యాన్ని పూరించుకునే డీవియంట్ ప్రయత్నం కథ ఇది. ఒక లోతైన మానసిక విష్లేషణ పెద్ద పదాలు, సాంకేతిక భాషా ఉపయోగించకుండా చేసిన కథ.

    4. వహీద్: బాల్యచాపల్యపు ప్రేమలగురించి చలం తర్వాత బహుశా ఖదీరే రాశాడేమో. ఇదొక ప్రేమకాని ప్రేమ కథ. మోహం లేని పరవశం కథ.

    5. మచ్చ: మానసిక రుగ్మతలు మచ్చలుగా బాహ్యశరీరంపైన కనిపిస్తాయంటారు. లోలోపలి అసంతృప్తులు అనారోగ్యాలుగా పరిణమిల్లుతాయంటారు. అలాంటి ఒక మచ్చకథ ఇది. కథలో ఈ మచ్చ ఒక మెటఫర్ కావొచ్చు, కానీ ఈ మచ్చ ఒక నిజానికి వార్నింగ్ లాగానే అనిపించింది నాకు.

    6. ఏకాభిప్రాయం: లౌక్యం దినచర్యగా మారినప్పుడు అనుబంధాలు కూడా కన్వీనియన్స్ ప్రకారం ఏర్పడిపొతాయి. ఏకాభిప్రాయం కుదరాలేగానీ మేక పులితో స్నేహానికైనా రెడీ అయిపోదూ ! ఖదీర్ ఈ కథలో చాలా చెప్పేసాడు. ఎంతమంది రోజువారీ జనాలు కనిపిస్తారో ఈ బుల్లి కథలో.

    7. పట్టాయ: పెరిగిన డిస్పోజబుల్ ఇన్ కం తోపాటూ పెరిగిన సెక్స్ ఆకలిని తీర్చే డెస్టినేషన్ బ్యాంకాక్ లోని పట్టాయ. ఆ సెక్స్ టూరిజం వీధుల్లో తీరే ఆకలితోపాటూ ఆ ఆకలితీర్చేవాళ్ళ వెనకున్న ఆకలిని తెలిపే కథ ఇది. పెరిగిన నిడివి, మరీ సాగతీసిన సంభాషణల్ని తట్టుకుంటే ఇదీ ఒక మోడ్రన్ ‘సాగా’ యే.

    8.అపస్మారకం : కామం కళ్ళు కమ్మేసినవేళ స్పృహలోకి రావడానికి ఒక కుదుపు అవసరం. ఆ కుదుపు ఈ కథ. అవసరానికి ఒకరు, ఆశగా మరొకరు ఒకటవ్వాలనుకోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా “స్పృహ” వస్తే. మంచి కథ. ఎవరికైనా జరగగలిగే కథ. మనం అంత ఈజిగా ఒప్పుకోలేని కథ.

    9. ఇంకోవైపు: సంసారం సమాజం ఏవైపుకెళ్ళినా స్త్రీకి దక్కే మానసిక శారీరక విఛ్ఛితికి ఉదాహరణ ఈ కథ. అంతగా డైజెస్ట్ అవని కోణం ఇది. నిజంగా తీసుకుంటే కడుపులో దేవేసె కథ. మెటఫర్ గా తీసుకుని కన్వీనియంటుగా పక్కకి తోసేసినా మనసుని కలిచేసే కథ.

    10. బియాండ్ కాఫీ: మాడ్రన్…పోస్టుమాడ్రన్ జీవిత శకలాల్లోని హాలాహలపు చుక్కలని వడగట్టిన డికాషన్ ని, అంతరాలాల్లో మనుషులుగా విరిగిపోయిన మానవత పాలతో కలిపి వండి వార్చిన చిక్కటి కషాయం లాంటి కాఫీ
    ఈ కథ అందుకే ఈ కథా సంకలం బియాండ్ కాఫీ అయ్యిందేమో.

  • balasudhakarmouli says:

    :బియాండ్ కాఫీ కథలు గురించి రెండు మాటలు:

    ‘బియాండ్ కాఫీ’ కథలు చాలా గొప్పవి. చేతులు ఊపుకుంటూ, భుజాలు ఎగరేసుకుంటూ ఆకాశంలో- అందనంత ఎత్తులో తీరిగ్గా తిరిగే కథలు కావు. పాత్రలు అలాంటి కావు. మరీ ముఖ్యంగా పట్టాయ..,మచ్చ,అపస్మారకం,ఇంకో వైపు,బియాండ్ కాఫీ కథలు- ఎప్పటికీ మరిచిపోలేని కథలు. ఇట్లా లోకం తగలడిందీ… దీనిని మరమ్మత్తు చేయాలీ… అని వొక స్పృహ, వొక ఆలోచనా ఇచ్చిన తర్వాత… ఈ కథలు గొప్పవి ఎందుకు కాదు!?

    ఏ అంచనాలూ లేకుండా… ‘ఖదీర్ బాబు’ గారి గత కథలు చదివినట్టే ఇవీ చదివాను. నిజంగా ఇవి మంచి కథలు.

    మహమ్మద్ ఖదీర్ బాబు- ఈ కథల ద్వారా ఎవరినీ తక్కువ చేయలేదు. సమాజాన్నే కళ్లకు చూపించారు. ఈ కథల్లోన్ని హృదయాన్ని అర్థం చేసుకుని హృదయంతోనే చదవాలి. బయటకూ హృదయంతోనే సంభాషించాలి. అప్పుడు ఈ కథల వాల్యూ తెలుస్తుంది.

    నేనొక పాఠకుడ్ని. నన్ను ఆ కథలు మెప్పించాయి.

    నిజంగా ఈ కథలు ‘యాంటీ డిప్రసెంట్స్’.

    1.’న్యూబాంబే టైలర్స్’ కథల సంపుటికి ‘గెట్ పబ్లిష్డ్’ ఎంత బలమో, ‘బియాండ్ కాఫీ’కి ‘బియాండ్ కాఫీ’ టైటిల్ కథ అంత బలం. రెండింటిలోనూ రైటర్ ముందుండి కథని నడిపిస్తారు. ‘బియాండ్ కాఫీ’ కథని.. చివరికంటా గొప్ప ఉత్కంఠతతో కొనసాగించారు. పర స్త్రీల మత్తులో పడి భార్యలను మానసికంగా వేధించే పురుషుల పట్ల- బాధితురాలైన ‘వో స్త్రీ యొక్క ఏహ్యభావంతో కూడిన మానసిక కల్లోలమే’ బియాండ్ కాఫీ కథ. కథ చదివాక ‘కథకుడు కథ కోసం బాగా శోధించారే..’ అని అనిపిస్తుంది.

    2.’ఇంకో వైపు’ కథ- ముగింపు విపరీతమైన దుఃఖాన్ని కలుగజేస్తుంది. ”ఈ దేశంలో ఎక్కడా.. స్త్రీలకు రక్షణ లేదా…!?”- కథ చదివాక మనందరిలో ఇదే ఆవేదన… గొప్ప స్ఫురణను కలుగజేస్తుందీ కథ. చెప్పుకోలేని దుఃఖాన్నీ కలుగజేస్తుంది.

    3.’అపస్మారకం’ కథ- ఈ దేశపు ఆకలి స్థితిని సూటిగా గుర్తు చేస్తుంది. కడుపుకు తిండి కోసం బాల్యంలోనే వొళ్లును అమ్ముకోవాల్సిరావడం ఈ వ్యవస్థలో ఆడపిల్లల దౌర్భాగ్యం. ప్రస్తుతం నగరాల్లో, నగరశివారుల్లో జరిగే వాస్తవ సంఘటననే కథగా మలిచారు. డబ్బులు కోసం వొక మగాడితో వెళ్లింది గాక…. ఆకతాయి కుర్రోళ్ల కామపు బరితెగింపునూ ఎదుర్కోవాల్సిరావడం విషాదకరం.

    4.మళ్లీ ఇదే అంశాన్ని మరింత గట్టిగా వ్యక్తీకరించిన కథ ‘పట్టాయ’. ఆకలి- గతిలేని ఆడవాళ్లను తమను తామే అంగడి సరుకుగా
    మార్చుకునేటట్లు చేస్తుందని వొక విషాదాన్ని మరింత విషాదంగా పొరలు పొరలుగా విప్పి కళ్లకు కట్టినట్టు చెప్పిన కథ ఇది.

    5.’మచ్చ’- కథ స్త్రీలకు గొప్ప ఊరట. ఖచ్చితంగా ప్రతీ ‘స్త్రీ’ చదవాల్సిన కథ ఇది.

    -మొత్తానికి ఈ కథలు ఏవీ కూడా ఉత్త పుణ్యానికి ఊసుపోకుండా రాసినవి మాత్రం కాదు. వాస్తవాన్ని వొక ప్రత్యేకమైన కోణంలో రచయిత సృజించారు.

    -సామజిక బాధ్యతతో మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన గొప్ప కథలివి.

    -బాలసుధాకర్ మౌళి… 6.9.2013

Leave a Reply to సాయి పద్మ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)