సూడో రియాల్టీస్

aparna“చెత్తా… ” అనే అరుపు, తర్వాత కాలింగ్ బెల్ మోత.

బద్ధకంగా నిద్రలేచి టైం చూశా. ఏడైంది. ‘లేటైందే’ అనుకుంటూ లేచి  తలుపు తీసాను. “చెత్తున్నదామ్మా?” చేత్తో పెద్ద చెత్తబుట్టను పట్టుకుని అడిగింది. ఉండమని లొపలికొస్తున్నాను.  బెడ్ రూమ్ లోనుంచి ప్రకాష్ లేచి వచ్చాడు.
“చెత్తనేనిస్తాలే, నువ్వెళ్ళి టీ పెట్టు” అని డస్ట్ బిన్ తెచ్చాడు.
” సాయి రాలేదా?” ప్రకాష్ చెత్త తీసుకోవడానికి వచ్చినమనిషిని అడగడం వినిపిస్తోంది.  వంటింట్లోకి దారితీసాను.
” సాయి కి యాక్సిడెంట్ అయ్యిందంట” డస్ట్ బిన్ లోపలికితెస్తూ  ప్రకాష్ చెప్పాడు.
“ఔనా, ఎలా… ?!!”
“ఏమో, బండి మీద నుంచి పడ్డాడు అంది . ఎలా పడ్డాడో ” ఆలోచిస్తూ అన్నాడు.నిన్న  పనమ్మాయి రాక వంటింట్లొని  అంట్లతొ కుస్తీ పడుతూ అంతకన్నా ఎక్కువ అడగలేదు నేను.
సాయి మా ఇళ్ళల్లో చెత్త తీసుకెళ్ళే అతను. కానీ అంతకు మించిన పరిచయం మా మధ్య లేదు. ఎప్పుడూ మా అపార్ట్ మెంట్ లోనో, లేక చుట్టూ పక్కల అపార్ట్ మెంట్స్లోనో చెత్త తీసుకెళ్తూ  కనిపిస్తుంటాడు. ఎప్పడైనా అతని బదులు అతని భార్యో, చెల్లెలో వస్తారు. కూడా వారి పిల్లలు.
అప్పుడప్పుడూ పనమ్మాయి రాకపోతేనే ఐఎస్ డి  కాల్ కి సరిపడా ఇన్ఫర్మేషన్ అయ్యేంత విషయంలా ఉండే నాకు సాయి జీవితం ఒక వెక్కిరింపులా  ఉంటుంది. నేనీ ధోరణిలో మాట్లాడితే ప్రకాష్ కి చిరాకు. “ఎందుకలా సుపర్ఫిషియల్గా మాట్లాడతావు?’ అని విసుక్కుంటాడు. చిన్నప్పట్నించీ చదివిన సాహిత్యం, పెరిగిన వాతావరణం వల్ల పేదవారు అలా ఉండటానికి డబ్బున్నవారి బాధ్యత చాలా  ఉందని నా నమ్మకం. కాని నా ఆత్మావలోకనం వల్ల సాయి కి పెద్దగా ఒరిగిందేం  ఉంది? అప్పుడప్పుడు పిల్లలకు చాక్లెట్లు ఇవ్వడం, పండుగ  ఈనంలు మినహా నా వల్ల అతనికి ఏమి లాభం లెదు. నాకే ఎప్పుడైనా మొలకెత్తే ఈ అనవసరపు  అపరాధపు భావన నుండి కొంత తెరిపి.
***
“డబ్బులేమన్నా  ఇచ్చావా ?” బ్రేక్ ఫాస్ట్ చేస్తూ అడిగా.
“ఆ.. రెండు వందలిచ్చాను.”
“రెండు వందలేనా,  ఏం సరిపోతాయి? డబ్బులేని వారికి అనారోగ్యానికి మించిన కష్టం లేదు తెలుసా?”
“ఎంతివ్వను? మొత్తం ఇవ్వలేముగా.. ఐనా ఎంతయ్యిందో ఎలా తెలుస్తుంది?అడిగితే  చూద్దాం. “
అడగరని తెలుసు మాకు. “……  మొన్న సూపర్ బజార్ కి వెళ్తుంటే చుసాను. రోడ్డు పక్కన కూర్చుని అన్నం తింటున్నాడు. పక్కనే చెత్త బండి. తనతోనే తన బావమరిది అనుకుంటా. ఎవరో అన్నం ఇచ్చినట్టున్నారు. వీళ్ళందరికీ కనీసం తిండి తినడానికి అనువైన చోటు కూడా లేదు. చాలా బాధనిపించింది.”
“ఎందుకెప్పుడూ ఇలాంటి విషయాలు చెప్తావ్?  నీకేం తెలుసు, రోడ్డుపక్కన కూర్చుని తినడానికి అతనికంతగా బాధలేకపోతే? అతను చెత్త తీసుకెళ్తాడు. ఎవరూ ఇంట్లో పిలిచి భోజనం పెట్టరు. డిస్క్రిమినేషన్ కాదు, సానిటరీ రీజన్స్. అసలు ముందు, నువ్వు పెడతావా?
“………. “
“ఊర్లలో అయితే ఇంటి బయట వరండానో, అరుగో, పెరడో ఉంటుంది.  అపార్ట్ మెంట్ లో ఎలా అవుతుంది?  ఒకవేళ వాళ్ళను పిలిచినా  ఎంత కంఫర్టబుల్ గా తినగలడు ? దాని బదులు రోడ్డే బావుందనుకున్నాడేమో..”
మన కోసం పనిచేసే ఒక మనిషి ‘డిగ్నిటి’ అనే పదం అర్థమయ్యే మార్గం తెలియక రోడ్డు పక్కన రాజీ పడి తింటేనే కంఫరటేబుల్ గా ఫీల్ అయి తింటుంటే  ఏమనుకోవాలి? నిట్టూర్చాను.
నా సుడో అభ్యుదయవాదం, ప్రకాష్ కన్వినియంట్ వాదం అర్థమయ్యాయి నాకు.
 చాలా కాలం క్రిందటి విషయం  గుర్తు వచ్చింది.
***
అప్పటికి రెండు వారాలబట్టీ ఊర్లోలేము. ముఖ్యమైన బంధువులు చాల కాలం తర్వాత ఇంటికొస్తున్నారు. ప్రకాష్ కూడా నాతో పాటే లీవ్ పెట్టి ఇల్లు శుభ్రం చేస్తున్నాడు. కానీ నా క్లీనింగూ, ప్రకాష్ సౌందర్యాభిలాషా సరిపోవు. ఎవరన్నా బాత్రూములు కడగటానికి దొరుకుతారేమోనని  సాయినడిగా. “మా బావమరిది ఉండమ్మా, బాత్రూంకి వంద  అడగతడు”, అన్నాడు. పంపించమన్నాను.
అన్నట్లుగానే పదకొండింటికి వచ్చాడు అతని బావమరిది.  ఒక కవరు పట్టుకొచ్చాడు. ముందు షర్టు విప్పేసి,మడిచి బాత్రూం బయట తలుపు పక్కగా పెట్టాడు.  పాంటు మడిచి కవర్లోంచి ఆసిడ్ బాటిలు, కొద్దిగా కొబ్బరి పీచూ, ఐదు రూపాయల సర్ఫ్ పాకెట్టు తీసాడు. చెప్పులు వేసుకోమని చెప్పాలనిపించింది కాని చెప్పలేదు. బెడ్ రూమ్ లోకి వెళ్లి ఏమన్నా ఖరీదైన వస్తువులున్నాయేమోనని  చెక్ చెసి వంట గదిలోకొచ్చి,టీ పెట్టా.  ప్రకాష్ నా దగ్గరికి వచ్చివచ్చినతనికి తినడానికి కూడా ఏమన్నా పెట్టిమన్నాడు.
కొద్దిగా టిఫిను, టీ పట్టుకెళ్ళి పిలిచాను. పనిలో ఉండి వినిపించలేదనుకుంటాను. బాత్రూంలోకి చూస్తే అతను పీచుతో కమ్మోడ్లో చెయ్యిపెట్టి కడుగుతున్నాడు. అతను నన్ను చూసి, చేతిలో పని ఆపి, చేతులు కడుక్కుని టీ , టిఫిను అందుకున్నాడు.
వంటగదిలోకి వెళ్లాను గానీ ఎంత ఆపుకున్నా సొంత ఎద్దేవాను తట్టుకోవడం కష్టం అయింది.  చిన్నప్పుడు మా అమ్మ స్నేహితురాలి పుట్టింటికి వెళ్తే, అక్కడ టాయిలెట్ సౌకర్యం లేక ఇంటివెనుక దొడ్డిని వాడేవారు. రొజూ ఒకావిడ దొడ్డి వెనుక తలుపు తీసుకువచ్చి  శుభ్రం చేసి వెళ్తూ ఉండేది. పెద్దయ్యాక ఆలోచిస్తే ఆ పని చేయించుకోవడం ఎంతో హీనంగా అనిపించింది . కానీ ఇప్పుడు అపార్ట్ మెంట్ కల్చర్  వచ్చాక మాత్రం ఏమి తగ్గింది?
పిండాకూడు దళితోద్యమాలూ, పనికిమాలిన సాహిత్యం. ఊరికే  ఉండనివ్వట్లేదు. విసురుగా బాత్రూం వైపు చూశాను.
అతను తిని కడిగి బాత్రూంకి కాస్త ఎడంగా పెట్టిన, కప్పు, ప్లేటు. పక్కనే మడిచిన షర్టు.
ప్రకాష్ బెడ్ రూమ్ సర్దడం పూర్తయినట్లుంది. నెమ్మదిగా  దగ్గరికి వచ్చి, ” బ్రష్షు వాడొచ్చుకదా? ఎందుకు?’ గుసగుసగా అడిగాడు.
“చేత్తో రుద్దితే బాగా పోతుందనేమో”. అభావంగా  అన్నాను. “ఎవరైనా అలా చెయ్యమన్నారేమో ….” కలుక్కుమంది.
ఇంకో గంట తర్వాత రెండో బాత్రూం కూడా కడిగి, ” అయిపోయిందమ్మ..” అన్నాడు. చేతిలో ఇంకా మడిచిన షర్ట్. వళ్ళంతా తడి. నీరు, చెమట కలిసిపొయాయి.
బాత్రూములు చూసి వచ్చాను. అందులో నేను హర్పిక్ తో తోమినా  రాని  తెల్లని మెరుపు.  కొద్దిగా ఆసిడ్, సర్ఫ్, కొబ్బరి పీచుతో హ్యాండ్డన్ క్లీనింగ్! ఒక్కో బాత్రూం కీ వంద.  రెండు బాత్రూములకీ  రెండు వందలు.  ఇంకో వంద ఎక్కువ ఇచ్చాను.
ఈ బాధ, ఒక వందతోనో, నాలుగు చాక్లేట్లతోనో తీరేటట్లు అనిపించడం లేదు నాకు. డబ్బులు తీసుకుని గుమ్మం దాటుతున్నాడు. క్షమించమని ఎలా అడగాలి?
“చెప్పులు వేసుకుని కడగొచ్చుగా కాళ్ళు పాడవ్వవా?
” అలవాటైపోయిందమ్మ.” నవ్వాడు “మళ్ళీ ఎప్పుడన్నా కావాలంటే  చెప్పండి.”
లోపలికొచ్చి మళ్ళీ పని మొదలు పెట్టా ..”వెళ్ళిపోయాడా?” ప్రకాష్ అడిగాడు.
తలూపాను. “ఛీ, ఇంకో సారి బాత్రూంలు వేరే వాళ్లతో కడిగించొద్దు. ఐనా  ఎవరి బాత్రూములు వాళ్ళే కడుక్కోవాలి.”  ఏమి మాట్లాడలేదు నేను.
***
మళ్లీ కాలింగ్ బెల్ మోగింది. ప్రస్తుతానికొచ్చి తలుపు తీశా. పనమ్మాయి.  ” ఏంటి  లేటు. నిన్న కూడా రాలేదు ” గయ్యిమన్నాను.
“ఔమా, రాలె. జరా పెయ్యిలో బాలె.” చీపురు తీసుకుని ఊడ్చటం  మొదలుపెట్టింది . ” గా సాయిని నిన్న దొంగతనం జేస్తుంటె జూషి తన్నిన్రు. “
“ఎక్కడా?”
“అగొ , ఆ అపార్ట్ మెంట్ల  షాదీ అవుతున్నది గదా.. అక్కడ ఒక సిలిండరు, స్టవ్వు ఎత్కవోతుంటే జూషిన్రు . వర్షమొస్తన్నదని ఎక్కనివక్కన్నే వదిలేసిన్రు. ఇగనెవ్వరూ లేరని  ఎత్కవొనికి జూషిన్రు.”
” నిజంగా తీసుకెళ్తుంటే చూసారా…?!!”
” జూషిన్రమ్మా. చెత్త బండిలో  బెడతంటే   సూషి ఒర్లిన్రు. అందరూ  గాల్చి  పరేషాన్ జేసి కొట్టిన్రు. రెండు నెల్లయెన్క  బీ ఇట్లనే చోరి చేస్తే తన్నిన్రు. ” మేటర్ అఫ్ ఫాక్ట్ లా చెప్పుకుపోతోంది.
” అందుకేనా వాళ్ళావిడ యాక్సిడెంట్ అయ్యిందని చెప్పింది?” ప్రకాష్ ఆశ్చర్య పో తూ  అడిగాడు. ” లే, యాక్సిడెంట్ గాలే, తన్నిన్రు.”
***
కొన్ని రోజుల తరువాత మళ్ళీ సాయి రావడం మొదలు పెట్టాడు. అతని మొహంలో  భావాలను చదవాలని కష్టపడ్డాను గానీ చదవలెకపోయాను. తిరుగుబాటో, లొంగుబాటో, నిర్లక్ష్యమో ఏదోకటి  కనిపిస్తే  స్థిమితంగా ఉండేదేమో  నాకు.
ఒక నెల గడిచింది. నాలో ఆవేశం చల్లబడింది.  ఇంట్లో ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేశాను. మొదట్లో ఉన్న ఆవేశం తగ్గినట్లే బాత్రూం ల పై శ్రద్ధ కూడా తగ్గింది.  బాత్రూంలు శుభ్రం గా అనిపించట్లేదు నాకు. ఐనా  నేను పిలవక పోయినంత మాత్రాన అతను తన పనిని  మానేస్తాడా? అతనికి కుడా డబ్బులు రావొద్దా?  నేను కుడా అంత  హీనంగా చూసేమనిషినేమీ కాను. సమర్దించుకుని సాయిని బాత్రూం లు కడిగేవారుంటే పంపమని అడిగాను.  
“ఇప్పుడెవరు దొరకట్లేదమ్మ ..బాత్రూములు లు కడిగే పని చెయ్యమిగ అంటున్రు .” కళ్ళలోకి చూస్తూ అన్నాడు.
ఏమనాలో తెలియక అతనివైపే చూస్తున్నా.” నేను మా బామ్మర్ది ఇద్దరం గీ పని ఇడిషివెట్టి రేపటిసంది మెకానిక్ బంకు లో  పనికి వోతున్నం.” చెత్తడబ్బా పట్టుకుని మెట్లుదిగుతూ చెప్పాడు వెనక్కి తిరగకుడా చెప్పాడు. నా సంఘర్షణా, సమర్ధింపూ మధ్య సమస్య దానికదే పరిష్కారమైపోయి ఎక్కడో దాక్కున్న ఇబ్బంది తేలికైపోయిందా?
లోపలికోచి తలుపేస్తున్నా, వద్దన్నా పెదవులమీద నవ్వు పూస్తూనే ఉంది.
నడుము తిప్పుతూ,  కూనిరాగాలు తీస్తూ  చీపురు పట్టుకుని బాత్రూం  లోపలికెళ్తున్న నన్ను ప్రకాష్ అయోమయంగా  చూస్తున్నాడు.
—-అపర్ణ తోట
Download PDF

54 Comments

 • శారద says:

  చాలా బాగుంది.
  కథా, కథనమూ, పేరూ.. అన్నీ
  శారద

  • aparna says:

   థాంక్యూ మేడం. మీకు చాలా పెద్ద ఫ్యాన్ని నేను. :)

 • MADHAV says:

  కథ చాల బాగుంది.
  రియాల్టీ నే కళ్ళకు కట్టి నట్టు వ్రాసారు.
  టైటిల్ తెలుగు లో వుంటే బాగుండేది.
  -madhav

  • aparna says:

   థాంక్యు మాధవ్ గారు! ఇంగ్లీష్ ఎక్కువ దొర్లకుండా ఉండటానికి ప్రయత్నిస్తా..

 • సాయి పద్మ says:

  బావుంది అపర్ణా.. స్వగతానికీ ..గతానికీ సంధి లాంటి వర్తమానం లో ఉన్నాం మనం . హ్మ్మ్ .. ఎండింగ్ కూడా చాలా బాగుంది ..కుడోస్

  • aparna says:

   స్వగతానికీ ..గతానికీ సంధి లాంటి వర్తమానం లో ఉన్నాం మనం . ఎంత బాగా చెప్పారు సాయి..

 • jagaddhatri says:

  బాగా రసావమ్మ అపర్ణ …. నీలో ఉన్న ఆత్మాను శీలన తో ఇంకా లోతుల్లోకి వెళ్లి మరింత మంచి సబ్జెక్ట్స్ ను రాయగలవు …. ఇంకా మంచి కథలు నీ కలం నుండి ఆసిస్తూ …. అభినందనలు ….ప్రేమతో …జగతి

 • srujan says:

  కథ చాలా బావుంది.సాయి నిర్ణయం సరైనది అనిపించింది.
  కథ పేరు తెలుగులో ఉంటే బావుండేది

  సృజన్

  • aparna says:

   సాయి కి ఆప్షన్లు ఎక్కువ లేవండి. ఉన్నా ఎదగడం అంత ఈజీ కాదు. సూడొఅ భావాలున్న వారు ప్రశ్నించుకొవాలి. మన అభ్యుదయం వాళ్ళ ఎంత మందికి మీలు జరుగుతుందీ అని. కథ నచ్చినందుకు థాంక్ యు :)

 • rajendra says:

  ముగింపు అద్భుతంగా ఉంది..

 • krishnapriya says:

  బాగా నచ్చింది.

  ముఖ్యం గా ఈ లైన్..

  నా సుడో అభ్యుదయవాదం, ప్రకాష్ కన్వినియంట్ వాదం అర్థమయ్యాయి నాకు.

  • aparna says:

   మీకు వీరఫాన్ని. నేను బ్లాగ్ లోకం లోకి వచ్చిన దగ్గర నుంచీ మీ రచనలు చదువుతున్నా. మీరు బావుందంటే చాల ఆనందంగా ఉంది. :)

 • మొత్తమ్మీద బాగుంది. చర్చకు రావాల్సిన అంశం. కానీ కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాల్ని పైపైన స్పృశించి వదిలేశారు. ఉదా. సాయి నిజంగా దొంగతనం చేశాడా? ఆ దొంగతనం వాళ్ళ అతనికి ఒరిగిందేవిటి? .. ముగింపు కూడా కొంచెం తమాషాగా ఉంది. ఇంకా మంచి కథలు రాస్తారని ఆశిస్తున్నాం.

  • aparna says:

   దొంగతనం అతని పరిస్థితిని ఎక్కడివరకు లక్కోచ్చిందని చెప్పటమే. అందరు కలిసి తన్నడం- అతనికి జరిగిన అవమానం. అందుకే ప్రస్తావించాను. ముగింపు ఇంకాస్త ఇంప్రూవ్ చెఅసిఉండాల్సిన్ది.

 • చర్చించాల్సిన, ఆలోచించాల్సిన విషయం తీసుకుని రాసారు . కథనమూ బాగుంది.

 • మణి వడ్లమాని says:

  బావుంది అపర్ణా! కధ! ఒక్కక్కప్పడు కొన్ని విషయాలు మనచుట్టూ మనద్వారానే జరుగుతున్నవి మనము గుర్తుంచలేము.ఆ తరువాత గ్రహించుకొని భాధపడ్డము.

  నమ్ము!నమ్మక పో! నీ ముగింపు ‘నడుము తిప్పుతూ, కూనిరాగాలు తీస్తూ చీపురు పట్టుకుని బాత్రూం లోపలికెళ్తున్న నన్ను ప్రకాష్ అయోమయంగా చూస్తున్నాడు’ మా ఇంట్లో కూడా అమలు అవుతోంది.
  ఇవన్ని అవసరమా మనకు కాళ్ళు చేతులేవా? మన మలినాన్ని వేరేవాళ్ళు శుభ్రపరచడమా అని ప్రశ్నవేసుకొని నేను మా అమ్మాయిలు కూడా ఒక నిర్ణయం తీసుకొన్నాము రెండు నెల్ల కిందట. అది మా ముగ్గురు పని ఒక్కొక్కళ్ళ టర్న్ 4 మంత్స్ కో సారి అన్న మాట.

  • aparna says:

   మణి..కరక్ట్ గా నాకూ అలాగే అనిపించింది. సహానుభూతికి థాంక్స్..:)

 • యాజి says:

  మీరు ఎంచుకొన్న టాపిక్ చాలా బాగుంది, కొద్దిగా క్లిష్ఠమైనది కూడా, చదివించేటట్లుగా వ్రాయాలంటే, తొలి రచన కాబట్టి. కానీ, మీరు చాలా వరకూ సక్సెస్ సాధించారు మీ ప్రయత్నంలో. ఆ దొంగతనం ప్రస్తావన కథా నేపధ్యంలో ఎలా ఉపయోగపడిందో నాకు అర్థం కాలేదు. కొన్ని వాక్యాలు అర్థం చేసుకోవాలంటే కష్టంగా అనిపించింది.

  ఉదా: “అప్పుడప్పుడూ పనమ్మాయి రాకపోతేనే ఐఎస్ డి కాల్ కి సరిపడా ఇన్ఫర్మేషన్ అయ్యేంత విషయంలా ఉండే నాకు సాయి జీవితం ఒక వెక్కిరింపులా ఉంటుంది.”

  నేను మీ బోటు లోనే ప్రయాణం చేస్తున్నాను కాబట్టి (ఇప్పుడిప్పుడే కథలు వ్రాస్తున్నాను) ఒక ఫ్రీ సలహా :) మీ ఫ్రెండ్ లిస్టు లో ఉన్న మీరు గౌరవించే ఒకరిద్దరు రచయితల ఫీడ్బ్యాక్ తీసుకుంటే, ఇంకా పదును వస్తుంది.

  Overall, I enjoyed reading the story and the different subject that you picked! I’m sure there are more you are waiting to tell. Just take care of the cosmetic blemishes.

  • aparna says:

   “అప్పుడప్పుడూ పనమ్మాయి రాకపోతేనే ఐఎస్ డి కాల్ కి సరిపడా ఇన్ఫర్మేషన్ అయ్యేంత విషయంలా ఉండే నాకు సాయి జీవితం ఒక వెక్కిరింపులా ఉంటుంది.” బహుశా చాలా చెప్పెద్దామనె కంగారనుకుంటా.. :) థాంక్స్ ఫర్ రైసింగ్ ది పాయింట్!

   నా అర్థం ఏంటంటే పనమ్మాయి రాక పోయినా హడావిడి చేసే నేను, సాయి జీవితం లో పరిస్థితి తో అప్పుడప్పుడూ అంచనా వెఅసుకుంటానని. (అర్థమైతే మన్నించండి, అసలు అర్థమే లేదనుకుంటే క్షమించండి. :))

   Just take care of the cosmetic blemishes. నాకీ మాట చాలా నచ్చింది. గుర్తుంచుకోవలసిన విషయం.

 • బావుందండీ! కధనం చాలా నచ్చింది..

  • aparna says:

   థాంక్యు నిశిగాధ గారు..మీరన్దరూ నాకు ఇన్స్పిరేషన్. :)

 • కథ బాగుంది

  “అప్పుడప్పుడూ పనమ్మాయి రాకపోతేనే ఐఎస్ డి కాల్ కి సరిపడా ఇన్ఫర్మేషన్ అయ్యేంత విషయంలా ఉండే నాకు సాయి జీవితం ఒక వెక్కిరింపులా ఉంటుంది.”
  నేను కూడా ఈ వాక్యం రెండు మూడు సార్లు చదివా… ఎక్కడా ఇన్ఫర్మేషన్ అందలేదు.. అపర్ణ గారు

  కానీ కథ చాల నచ్చింది. జస్ట్ ఈజీ ప్లెయిన్ నేరేషన్.

  • aparna says:

   “అప్పుడప్పుడూ పనమ్మాయి రాకపోతేనే ఐఎస్ డి కాల్ కి సరిపడా ఇన్ఫర్మేషన్ అయ్యేంత విషయంలా ఉండే నాకు సాయి జీవితం ఒక వెక్కిరింపులా ఉంటుంది.” ఈ వాక్యం సుట్టిలా ఉందని నాకర్థం అయ్యిన్దండీ. ఈ సారికి క్షమించెయ్యండీ.. :) కథ నచ్చిందుకు చాలా సంతోషం :)

 • manibhushan says:

  కథాంశం బాగుంది. నడక స్పష్టంగా ఉంది. దొంగతనం జోలికి రాకుండా ఉంటే బాగుండేది. “వీళ్ళంతా ఇంతే, వీళ్ళిలాగే ప్రవర్తిస్తారు. వాళ్ళ నైజమే అంత” అనే అర్థం ధ్వనిస్తోంది. అదీగాక, Aparnaగారూ మీ పాత్రలతో మీరే సంఘర్షించినట్టయ్యింది.
  మీరే చివరి పేరాలో…”“ఇప్పుడెవరు దొరకట్లేదమ్మ ..బాత్రూములు లు కడిగే పని చెయ్యమిగ అంటున్రు .” “నేను మా బామ్మర్ది ఇద్దరం గీ పని ఇడిషివెట్టి రేపటిసంది మెకానిక్ బంకులో పనికి వోతున్నం.” అని ఆయా పాత్రలకొక పాత్రతను చేకూర్చారు. అలాంటప్పుడు వాళ్ళను దొంగలుగా చిత్రించడం అభావ్యంగా అనిపించింది.
  మరో మాట..,<> అనడంద్వారా కన్వీనియంటే బెటర్ అనిపించారు.

  తొలి కథకు కథాంశం మంచిది ఎంచుకున్నారు. రాయగా రాయగా రాయి రవ్వగా మారుతుంది. రాస్తూనే ఉండండి.

  • aparna says:

   వాళ్ళను దొంగలుగా చిత్రించడం అస్సలు నా ఉద్దేశం కాదు. కష్టపడ్డా అందుబాటులోకి రాని నిత్యవసారాల గురించి ఎవరైనా దొంగతనానికి పాల్పడితే ఆ తప్పు మనందరిదీ. అది చెప్పాలనే ప్రయత్నించాను.
   స్పష్టమైన మీ విమర్శకు బోల్డన్ని ధన్యవాదాలు.
   “మరో మాట.., అనడంద్వారా కన్వీనియంటే బెటర్ అనిపించారు.” దీనర్థం ఏమిటండీ?

 • ramachandra joshi ponna says:

  సూడో రెఅల్తిఎస్
  చక్కగా కుదిరింది పేరు
  చాల బాగా రాసారు అండి.

 • Radha says:

  ఇలాంటి పని చేయించుకుంటున్నాం కనుక వాళ్ళకి ఎక్కువ డబ్బు ఇస్తున్నాం కదా! అనుకుంటాను కాని లోపల లోలోపల ఎంత సంఘర్షణ పడుతుంటానో. అందుకే నాకు ఈ వాక్యం భలే నచ్చింది. ” నా సంఘర్షణా, సమర్ధింపూ మధ్య సమస్య దానికదే పరిష్కారమైపోయి ఎక్కడో దాక్కున్న ఇబ్బంది తేలికైపోయిందా?”
  అభినందనలతో
  రాధ

  • aparna says:

   రాధగారు, చాల బాగా అర్థం చేసుకున్నారు. నేను కథ లో చెప్పదలచున్న మెయిన్ పాయింట్ అదే. థాంక్యు సో మచ్!

 • Samvi says:

  మొదటి ప్రయత్నం అన్నారు. బావుంది.

  ఒకటి అర్ధం కాలేదు…
  ఆ పనికి వాళ్ళు ఇప్పుడు సుముఖంగా లేరు ఇప్పుడు అన్న realization ద్వారా మన పనిని మనం చెసుకోవాలి అన్న బాధ్యత గుర్తు చెసుకున్నట్లు అనిపించింది. అదే realization గిల్ట్ తగ్గించుకొవటానికి కూడా ఉపయోగపడి సాంత్వన లభించినట్టు ఫీల్ అవ్వటం… అంతా… మరొ సైకిల్ కి రేడీ అవుతున్నట్టు అనిపించింది. దైనందిన జీవితం లో మన సొ కాల్ద్ ఫార్వర్ద్ థింకింగ్ జనాల రెగ్యులర్ ఇంటర్వేల్స్ లొ తీసుకునే గిల్ట్ ట్రిప్ లా…

  మనం చూడండి….
  ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పిల్లలు యాచిస్తూ కనిపిస్తే, కొన్ని సార్లు కఠినమై, కొన్ని సార్లు కరిగి, ప్రతీ సందర్భానికీ ఒక జస్టిఫికేషన్ వెతుక్కున్ని జీవించేయటం లా…

  ఎదైన కానీ, ముగింపుని అంతఃకలహంగా వదిలేస్తే బావుండేదెమో.
  ఇంకా లేదు అనుకుంటే ఒక ఆత్మపరిశీలనలా, ఒక Insight లా..
  ఇంకాస్త ఊరట కావాలనిపిస్తే, మన లొ మొదలైన ఒక మంచి స్థిరమైన మార్పుకు శ్రీకారం లా..

  …………….

  ఎమో..నాకైతే మెకానిక్ పని కి వెళ్ళటం అనేది, కథకి మరో ఫీల్ గుడ్ ఫేక్టర్ లాగా, మరో రౌండ్ సూడో తనం లా అనిపించింది..

  మీరే చెప్పినట్లుగా “అర్థమైతే మన్నించండి, అసలు అర్థమే లేదనుకుంటే క్షమించండి”

  • aparna says:

   “మరొ సైకిల్ కి రేడీ అవుతున్నట్టు అనిపించింది. దైనందిన జీవితం లో మన సొ కాల్ద్ ఫార్వర్ద్ థింకింగ్ జనాల రెగ్యులర్ ఇంటర్వేల్స్ లొ తీసుకునే గిల్ట్ ట్రిప్ లా…”
   “నాకైతే మెకానిక్ పని కి వెళ్ళటం అనేది, కథకి మరో ఫీల్ గుడ్ ఫేక్టర్ లాగా, మరో రౌండ్ సూడో తనం లా అనిపించింది..

   ఎక్సాక్ట్లి నేను చెప్పాలనుకున్నది కూడా ade. మీకు కరక్ట్ గానే అర్థమైంది.

   ” ప్రతీ సందర్భానికీ ఒక జస్టిఫికేషన్ వెతుక్కున్ని జీవించేయటం లా…” నేనిచ్చిన ముగింపు అదేనండి.నరెటర్ ఆ ధోరణినే వెలిబుచ్చింది. అంతేకాని అతను మెకానిక్ బ్యాంకు లో పని వెతుక్కోవడం సుఖాంతం అని కాదు.

   మీరింకొంక్కసారి ఆ అంగెల్ లో చదవండి, మనిద్దరి అభిప్రాయమూ ఒకటే అని అర్థమవుతుంది. ఇంకో విషయం ఇది నీతి కథ అనుకుని రాయలేదు నేను. జెనరల్ గా ఉండె సుడో వాదుల గురించే రాసాను.

   ఇప్పుడు నా టర్న్ …” “అర్థమైతే మన్నించండి, అసలు అర్థమే లేదనుకుంటే క్షమించండి” :)

 • kuppilipadma says:

  అప్పు , కథని చదువుతున్నంతసేపే కాకుండా చదివేసాక వేరే పనుల్లో ఉన్నప్పుడు కూడా అందులోని మాటలు , మనుష్యులు చప్పున మనసులో మెదుల్తున్నారు. అభినందనలు .

 • bhasker says:

  -మీలో ఓ మంచి కథకురాలు ఉంది. గుక్కతిప్పుకోకుండా చదివించే గుణం ఉంది.
  మీ కథ నాకు బాగా నచ్చిందండీ..!
  కథా శీర్షిక తెలుగులో ఉంటె బావున్నన్న అభిప్రాయం నాదీనూ..
  అయినా తప్పేం లేదులెండి. ఎంతమంది గోప్పరచయితలు తమ కథలకు ఇంగ్లిష్ శీర్షికలు పెట్టలేదు..!
  హాట్స్ ఆఫ్ టు యు అండి!!
  -భాస్కర్ కూరపాటి.

  1

 • Sunil Kumar says:

  అరుణ గారూ … అభినందనలు. మీ మొదట పబ్లిష్ అయిన కధ అన్నారు. కధలో ఒక కోహేసివ్ నెస్ లోపించింది. మీరు ఏదో చెప్పెసేయ్యాలనే ఆత్రుతలో అనవసరమైన వివరణ.. అంటే బాత్ రూమ్ క్లీన్ చెయ్యటం గురించి చాలా సిరా వెచ్చించారని అనిపించింది. ఆ పాత్రకి దొంగగుణం ఆపాదించారు. అది పూర్తిగా అనవసరం అనుకుంటా. డిగ్నిటి ఆఫ్ లేబర్ మనందరి మనస్సులలో మెదులుతున్నా.. అదే మీకాన్సెప్ట్ అనుకున్నా .. చివర్లో అతను చేసే పని మానేసి ఇంకో పనికి వెళ్ళాడు అని చెప్పటం .. ఈ కధ యొక్క బేసిక్ ఎథొస్ ని అండర్మైన్ చేసింది. కధనం మరీ సాదా సీదాగా సాగింది. టూ ప్లెయిన్ జేన్ స్టఫ్. ఇంకా ఆసక్తి రేపే కధలు మీ కలం నుండి ఆశిస్తూ ..

 • Sunil Kumar says:

  క్షమించండి .. మీ పేరు అరుణ అని రాసాను .. అపర్ణ గారూ!

 • Praveena says:

  “నా సుడో అభ్యుదయవాదం, ప్రకాష్ కన్వినియంట్ వాదం అర్థమయ్యాయి నాకు.”…ఈ వ్యాక్యాన్ని ఎన్ని సార్లు చదివానో.
  చాలా బాగా రాసారు. మీ నుంచీ మరిన్ని మంచి కధలు, ఆలోచనాత్మక కధలు వస్తాయన్న గ్యారంటి మాకు వచ్చేసింది. కీప్ రైటింగ్

 • Naveen says:

  మనిషి విసర్జితాన్ని ఇంకో మనిషే ఎత్తి పడేసిన కష్టాన్ని చూసివున్నవాడిని కాబట్టేమో పాకీపనిలో నికృష్టాన్నితొలగించిన అపురూపమైన మానవీయ టెక్నాలజీ “ఫ్లష్ అవుట్” . అని ఎన్నోసార్లు అనుకున్న వాణ్ణి. దారిచూపని సానుభూతి సహానుభూతుల నిస్సహాయత నిజం…నిస్సహాయతల నుంచి టా్రన్స్ఫర్ మేషన్లు అనివార్యమన్నది మరీ మరీ నిజం …వీటన్నిటినీ మీ కధలో గప్పగా చెప్పారు. కృతజ్ఞతలు అభినందనలు

  ఈ మధ్య పంచాయతీ ఎన్నికల ఎన్నికలకు ఓటువేయడానికి హైదరాబాద్ నుంచి సొంతఊరు వచ్చిన వారిలో 58 ఏళ్ళ కనక మహాలకి్ష్మ అనే ఆవిడతో మాట్లాడాను. (నేను జర్నలిస్టుని). ఎండిపోతున్న, ఆక్రమించుకోబడుతున్న కుంటలు, మార్కెట్ లోకి వచ్చిన సర్ఫ్, రజకవృత్తిని వలసదారి పట్టించి అపార్ట్ మెంటు వాచ్ మెన్ గా ఎలా ఖరారు చేశాయో కనకమాటల్ని బట్టి అర్ధమైంది. పాలేర్ల, పనివాళ్ళ ఆడవాళ్ళు కూడా సొంత సొత్తులనుకునే మోతుబరుల అవమానాలనుంచి కులవృత్తుల్లో మహిళల గౌరవాన్ని వలసలు ఎలా నిలబెట్టాయో కూడా అర్ధమైంది.

  సమస్యే తన పరిష్కారాన్ని ఒక టా్రన్సఫర్మేషన్ గా ఇస్తుంది. ఆ రూపాంతరీకరణ (ఇలాంటి సాహిత్య) సృజనకారుల వల్ల వేగిరపడుతుంది

  • aparna says:

   థాంక్స్ అండీ.. నా కథకన్నా మీ విశ్లేషణా, పరిశీలనా, సహానుభుతీ బావుంది.

 • Mansoor Shaik says:

  ఇలాంటి ఒక పాత్ర ఉందని మరిచి పోయాను ….కథ కొత్త గా ఉంది ..ఐన నేను ఇపుడుదిపుడే కథలు చదువుతునను ..నాకు కూడా అపుడపుడు ఇలాగ అనిపిస్తుంది , కానీ విచిత్రం గా ఉంటుంది..u r the best madam…చాల బాగా రాసారు hatts off madam :)

 • Kiran Kallakuri says:

  aparna garu! Mee Katha bavundi.

 • m.a.basith says:

  అపర్ణ గారు,
  మీ కథ సరళ సహజాతంగా ఉంది. మనిషి విసర్జితాన్ని మాత్రమే గాక మనిషి లోపలి కల్మశాన్ని కదిగేసేలా ఉంది. మీ మొదటి కథే ఇంట బావుంటే ముందు ముందు ఇంకెంత బాగా రాస్తారో!
  బాసిత్.

 • sujan says:

  అపర్ణ గార్కి నమస్కారములు
  నేను మీ కథ చదివాను, నా మనసులోని భావాలకు అద్దం పట్టినట్టుంది మీ కథ కధనం.
  ప్రతి రొజూ మన చుట్టూ జరుగుతున్న సంఘటనలను చాల బాగా చెప్పారు
  మనం చేస్తున్న తప్పులను మనం ఎలా సమర్దించుకుంట్టునమో బాగా రాసారు.
  మీకు నా అభినందనలు

Leave a Reply to aparna Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)