“పోయినోళ్ళు అందరూ…..అవును చాలా, చాలా మంచోళ్ళు….

అబ్బులు బావ, పెదన్నయ్య, హనుమంత రావు బావ

మా తాత గారి, బామ్మ  గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, మా అమ్మ, మా బాబయ్య గారు (అంటే మా నాన్న గారు) అంతకు రెట్టింపు ఆప్యాయత, బాధ్యతలతో పంచిపెట్టిన “బంధు ప్రేమ” అనే అపురూపమైన అనుబంధాన్ని తనివి తీరా అనుభవించిన తరం మాది. ముఖ్యంగా నా చిన్నప్పుడు ..అంటే 1950-60 దశకాలలో బంధువుల రాకపోకలతో, వాళ్ళు రాగానే సినిమా ప్రోగ్రాములతో, అడ్డాట, ఇస్పేటు మదాం లాంటి అచ్చ తెలుగు పేకాటలతో, కేరమ్స్, చదరంగాలతో, తెల్లారాదేకా అస్సలు ఏం మాట్లాడుకున్నామో ఎవరికీ ఏ మాత్రం జ్జాపకం లేక పోయినా చిన్నా, పెద్ద కలిసీ, ఎవరి వయస్సు  గ్రూప్ వారూ రాత్రి తెల్ల వార్లూ డాబా మీద పడుకుని కబుర్లు చెప్పేసుకుకోవడం మొదలైన వ్యాపకాలతో మా తరం వారి అందరి జీవితాలూ సరదాగా గడిచి పోయేవి. ఇక పెళ్ళిళ్ళ సీజన్ అయితే మరీనూ.

“ఆ పోదురూ, మీరు మరీనూ….మీ తరువాత “ఎర్ర త్రికోణం” రోజులు వచ్చేసి, చుట్టాల సంఖ్య కూడా తగ్గిపోయింది. తరవాత్తరవాత కంప్యూటర్లూ, గ్లోబలైజేషన్లూ వచ్చేసి ఎవరి కుటుంబం చుట్టూ వాళ్ళు  చుట్టూ గీతలు గీసేసుకున్నారు. “ అని చాలా మంది  అంటుంటారు. నా పాయింటు కూడా సరిగ్గా అదే. మా చిన్నతనం గడిచినంత ఆనందంగా ఈ తరం వారి చిన్నతనం లేదు అని మా బోటి వాళ్ళం అనుకుంటూ ఉంటాం. తమాషా ఏమిటంటే ఇప్పటి తరం వాళ్ళు పెద్ద వాళ్ళయి వారి ఆత్మ కథ వ్రాసుకున్నప్పుడు వారు కూడా సరిగా అలాగే అనుకుంటారు!

అన్నట్టు మా బంధువుల గురించి నేను చెప్పుకునేటప్పుడు మా ఇంట్లో ఉండే ఒక తమాషా అలవాటు గురించి ముందే చెప్పుకోవాలి. అదేమిటంటే అసలు బంధుత్వం ఏదైనా ఒక వ్యక్తిని పిల్లలందరరం ఒకే రకం గా పిలిచే వాళ్ళం. ఉదాహరణకి మా నాలుగో మేనత్త కొంత మందికి అక్క, మాకు మేనత్త, మరో కొంత మందికి పిన్నీ అయినా మా బంధువులకీ, స్నేహితులకీ ప్రపంచంలో  అందరికీ ఆవిడ  రంగక్కే.  ఈ వ్యాసం లో కూడా ఆ పద్ధతే పాటించాను. లేక పొతే ఎవరి గురించి వ్రాస్తున్నానో తెలియక గందర గోళం పడిపోతాను. “పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు కనక వారి గురించే ఎక్కువగా ప్రస్తావిస్తాను.

జయ వదిన, చిట్టెన్ రాజు బాబయ్య

జయ వదిన, చిట్టెన్ రాజు బాబయ్య

నా జీవితం  మీద  సాహిత్య పరంగా కాకపోయినా,  వ్యక్తిత్వ పరంగా చెరగని ముద్ర వేసి ఆత్మీయత విలువని చెప్పకనే చెప్పిన వారిలో మా చిట్టెన్ రాజు బాబయ్య & జయ వదిన లని మొట్టమొదటగా చెప్పుకోవాలి. వరసకి మేనరికం అయిన ఆ దంపతులు అన్ని శుభ కార్యాలకీ పది హీను రోజులు ముందే వచ్చి, అవాంతరాలకి తక్షణమే వాలి పోయి బాధ్యతలన్నీ నెత్తిన వేసుకుని మూడు-నాలుగు తరాల అన్ని కుటుంబాలకీ “మూల స్తంభం” లా నిలిచారు. వారికి పిల్లలు లేరు కానీ డజన్ల కొద్దీ బంధువుల పిల్లలందరినీ సొంత పిల్లల లాగానే చూసుకునే వారు. మా ఆఖరి మేనత్త సూర్య భాస్కరం (బాసు పిన్ని అని పిలిచే వాళ్ళం), & పండ్రవాడ సుబ్బారావు (పెద్దాపురం మామయ్య గారు)  దంపతుల పెద్ద కూతురు మా జయ వదిన. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటుంది. నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా జయ వదినని చూడకుండా ఉండను. మా చిట్టెన్ రాజు బాబయ్య మా నాన్న గారికి వరసకి పెద్ద తమ్ముడు. అంటే…మా తాత గారి సవితి తమ్ముడి పెద్ద కొడుకు. కాకినాడలోనే పుట్టి, అక్కడే చదువుకుని , చాలా సంవత్సరాలు మిలిటరీ లో పని చేసి కో- ఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ గా రిటైర్ అయాడు.  వైజాగ్ లో చదువుకునప్పుడు (1961-62)  మా బాబయ్య పనిచేసిన కశింకోట, విజయ నగరం, శృంగవరపు కోట మొదలైన అన్ని ఊళ్ళూ వెళ్ళి, అక్కడ కూడా వారు స్థానికంగా అందరికీ తలమానికంగా ఉండడం నేను స్వయంగా చూసాను.  ఒక సారి  తనే స్వయంగా అంధ్ర విశ్వవిద్యాలయం లో మా హాస్టల్ కి వచ్చి, భోజనం చేసి “రాజా గాడి హాస్టల్ భోజనం బాగా ఉంది. మీరేమీ బెంగ పెట్టుకోకండి” అని కాకినాడ మా అమ్మకి ఒక కార్డు రాసాడు.  ఆత్మీయతకి, అభిమానానికి అంతకంటే నిదర్శనం ఏం కావాలి?

1951 లో మా తాత గారు, బామ్మ గారు ఒకే రోజున పోయినప్పుడు, మా నాన్న గారు, అమ్మా పోయినప్పుడూ వారిద్దరే దగ్గరుండి కర్మకాండలు నిర్వహించడంలో సహాయం చేశారు. మా ఇంట్లో అందరి పెళ్లిళ్ల నిర్వహణ, మా తమ్ముడి పెళ్లి కుదర్చడం మొదలైన శుభ కార్యాలకి వారే సూత్రధారులు. మా బాబయ్య ఆదేశాలతో పది రోజులకి సరిపడా కూర గాయలు కొనడానికి నేను కూడా మా బాబయ్యతో ఎడ్ల బండ్ల మీద కాకినాడ సంత చెరువు దగ్గర పెద్ద మార్కెట్ కి వెళ్ళే వాడిని. రాత్రి పడుకోడానికి మా మామిడి చెట్టు కింద మడత మంచం నేనే వేసే వాడిని. కొంచెం పెద్ద వాడిని అయ్యాక , ఆయనతో పేకాట కూడా ఆడే వాడిని.  నాకు చిన్నప్పటి నుంచీ ఇప్పడూ కూడా గోళ్ళు కొరుక్కునే అలవాటు ఉంది. అది ఎప్పుడు చూసినా ఠకీమని తన వేళ్ళు నా నోటి దగ్గర పెట్టి “నా గోళ్ళు కొరకరా. యింకా రుచిగా ఉంటాయి రా” అని ఆ అలవాటు మాన్పించడానికి సరదాగా ప్రయత్నాలు చేసే వాడు.  మా చిట్టెన్ రాజు బాబయ్య పోయి పదేళ్ళు దాటింది. ఇందుతో మా చిట్టెన్ రాజు బాబయ్య & జయ వదిన ఫోటో జతపరుస్తున్నాను. అలాగే ఆయన తమ్ముళ్లు శంకరం బాబయ్య, రామం బాబయ్య కూడా మేమంటే ఎంతో అభిమానంగా ఉండే వారు. వారిద్దరూ కూడా దివంగతులే.

నాకు ఐదుగురు మేనత్తలు. ముగ్గురు మేన బావలు- అంటే మా మేనత్తల కొడుకులు. వాళ్ళని అమలాపురం బావ, దొంతమ్మూరు బావ, పెద్దాపురం బావ అనే వాళ్ళం అప్పుడప్పుడు. అందులో అమలాపురం బావ ..పెద్ద బావ..మా పెద్ద మేనత్త (ఆవిడని నేను చూడ లేదు)- పెద్ద మామయ్య గారి (గిడుగు వెంకట రత్నం గారు) కొడుకు. పేరు సూర్య ప్రకాస రావు..అంటే మా తాత గారి పేరే. అతను చామన చాయలో పొడుగ్గా భలే తమాషాగా ఉండే వాడు. ఆయన భార్య సుందరక్క , ఆరుగురు ఆడ పిల్లలు (నా మేనగోడళ్ళు) చాలా అందమైన వారు. వృత్తి రీత్యా అడ్వొకేట్ అయిన మా పెద్ద బావ ఎప్పుడు వచ్చినా మాట్లాడడం తక్కువ కానీ ప్రతీ మాటా, చేతా సరదాగానే ఉండేవి.

ఆ తరువాత రెండో మేనత్త (ఆవిడని కూడా నేను చూడ లేదు)  ని  తనని పెంచి పెద్ద చేసిన మేనమామ గారి కొడుకు కుంటముక్కుల కామేశ్వర రావు గారికి ఇచ్చి పెళ్లి చేసారు మా తాత గారు. మా బాసక్క (వరసకి వదిన), హనుమంత రావు బావ వారి పిల్లలే. ఆ మేనత్త పోయిన తరువాత ఆవిడ చెల్లెలు, మా నాలుగో మేనత్త అయిన రంగనాయకమ్మని (ఆవిడ నే రంగక్క అని పిలిచే వాళ్ళం) ఇచ్చి ద్వితీయ వివాహం చేసారు.  హనుమంత రావు బావ మా పెద్దన్నయ్య కంటే చిన్న, మా చిన్నన్నయ్య కంటే పెద్ద. వీళ్లు ముగ్గురూ ఎప్పుడూ కలిసే ఉండే వారు. కలిసే అల్లరి చేసే వారు. కాకినాడలో మా ఇంట్లోనే చదువుకుని నగరంలో సోషల్ సర్కిల్ లో బాగా తిరిగే వాడు. అలనాటి సినీ నటుడు రామశర్మ కి మంచి మిత్రుడు . అతనితో సినిమా తియ్యడానికి ప్రయత్నం చేసాడు కానీ మా నాన్న గారు ఒప్పుకో లేదు. మా కామేశ్వర రావు మామయ్య గారు  హఠాత్తుగా గుండె పోటు తో పోయినప్పుడు మా బావ చిన్న వాడు కాబట్టి మా నాన్న గారు వారి 400  ఎకరాల మిరాసీ పొలాన్ని ని తనే స్వయంగా వ్యవసాయం చేసి తరువాత మా చిట్టెన్ రాజు బాబయ్య మధ్యవర్తిగా మొత్తం ఆస్తి మా బావకి అప్పజెప్పారు.

ఇక్కడ ఒక చిన్న పిట్ట కథ…మా గాంధీ నగరం పార్కుకి మా హనుమంత రావు బావ ట్రస్టీ గా ఉండే వాడు. ఒక సారి నేను, కొంత మంది కోతి మూకతో కలిసి రాత్రి చీకటి పడ్డాక మట్టి తవ్వేసి పార్కులో ప్రతీ మూలా కలువ పువ్వులతో కళకళ లాడుతూ ఉండే చెరువు కప్పెట్టేసే ప్రయత్నంలో ఉండగా పెద్దులు అనే తోటమాలికి దొరికి పోయాను. ఆ పెద్దులు గాడు మా ఇంట్లో పాలు పితికే గొల్ల వాడే అయినా, చీకట్లో గుర్తు పట్టక నన్నూ, మిగిలిన కుర్రాళ్ళనీ  తాళ్ళతో కట్టేసి అక్కడే లైబ్రరీ లో ట్రస్టీ మీటింగ్ అవుతుంటే అక్కడికి లాక్కుని పోయి నిలబెట్టి “ఈ రౌడీ కుర్ర నాయాళ్ళు సెరువు కప్పెట్టేసి సింద్ర వందర సేసారండి. తవరు ఊ అంటే సంపేత్తానండి, ఆయ్య..” అనేసి పెర్మిషన్ కోసం చూస్తూ ఆ వెలుగులో నా మొహం చూసాడు. ఆ తరువాత మా బావ మొహం చూశాడు. అంతే సంగతులు. నేను చావు తప్పించుకుని మా బావ ధర్మమా అని బయట పడ్డాను. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకూ అరవై ఏళ్ళ  పాటు ఏ చెరువూ, ఆఖరికి అతి చిన్న గుంట కూడా కప్పెట్టే ప్రయత్నం చెయ్య లేదు. చేసినా పెద్దులు గాడి మొహము, మా బావ మొహమూ గుర్తుకు వస్తాయి. మా హనుమంత రావు బావ ఏకైక కుమార్తె లక్ష్మి కి పెళ్లి చేసిన  16  రోజుల పండగ నాడు ఊరేగింపులో గుండె పోటుతో మరణించాడు. మేనల్లుడి మరణాన్ని తట్టుకో లేక కాబోలు మరాక రెండు నెలలలో మా నాన్న గారు ఆ కూడా పోయారు. అప్పుడు నేను అమెరికాలో ఇరుక్కుపోయాను. మా హనుమంత రావు బావ ఎప్పుడూ తన సంగతి చూసుకోకుండా అందరికీ ఎంతో మంచి చేసే వాడు. అలా ఆయన దగ్గర సహాయం పొందిన ఒకాయన ఎవరో పిఠాపురం “హనుమంతరాయ కళాశాల” అని ఒక కాలేజ్ కి అతని పేరు పెట్టి ఆ ఋణం తీర్చుకున్నారు.

ఇక మా పెద్దాపురం  అబ్బులు బావ (ఆఖరి మేనత్త కొడుకు, జయ వదిన తమ్ముడు ) నా కంటే రెండేళ్ళు పై వాడయిన మా సుబ్బన్నయ్య వయసు వాడు. అతని పేరు కూడా (సత్య) సూర్య ప్రకాశ రావే. అబ్బు-సుబ్బు అని వాళ్ళిద్దరూ, రాజా-అంజి అని నేను, మా తమ్ముడూ కవల పిల్లల లాగే  పెరిగాం. అతను కూడా కాకినాడలో మా ఇంట్లోనే ఉండి పాలిటెక్నిక్ చదువుకున్నాడు. మా గేంగ్ అందరం పొద్దుట మా పెద్ద నూతి దగ్గర పంపు తో ఆదరా బాదరాగా నీళ్ళు కొట్టుకుని..అవును చన్నీళ్ళే…. స్నానాలు చేసేసి, తరవాణీయో మరోటో తినేసి ఎవరి స్కూళ్ళకో, కాలేజీలకో వెళ్లి పోయి, సాయంత్రం క్రికెట్ ఆడేసుకుని, శివాలయానికి వెళ్లి పురాణాలో, హరికథలో వినేసి జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించే వాళ్ళం. నేను ఇంజనీరింగ్ లో ప్రవేశించే దాకా మా అబ్బులు బావ టీ=స్క్వేర్ మరియు , స్లైడ్ రూల్ అనే ఇంజనీరింగ్ పరికరాలు భుజాన్న వేసుకుని సైకిల్ మీద వెడుతూ అందరిలోకీ హీరోలా కనపడే వాడు. ఆ పరికరాలు ఇప్పుడు ఎక్కడైనా మ్యూజియంలలో ఉంటాయేమో! అబ్బులు బావ ఎప్పుడూ గలగలా నిష్కల్మషంగా నవ్వే వాడు. పేకాట లో అయినా, కేరమ్స్ లో అయినా ఏ ఆటలో అయినా మా అబ్బులు బావ ఉంటేనే ఆటలు రక్తి కట్టేవి. అతను మా కుటుంబం మీదా, మా నాన్న గారి మీద అభిమానంతో వైజాగ్ లో రామలింగేశ్వర స్వామి దేవాలయం (మా నాన్న గారి పేరు) కట్టించడంలో ఎంతో సహాయం చేసాడు. అమెరికా ఎప్పుడు వచ్చినా హ్యూస్టన్ వచ్చి మా ఇంట్లో నాలుగు రోజులు ఉండే మా అబ్బులు బావని విధి నిర్దయగా రెండేళ్ళ క్రితం పొట్టన పెట్టుకుంది. ఇందుతో చిన్నప్పుటి (బహుశా 1955) మా అబ్బులు బావ, మా హనుమంత రావు బావ, మా పెద్దన్నయ్య (ముగ్గురూ దివంగతులే) ఏడిద కామేశ్వర రావు, మరొక మిత్రుడితో ఉన్న ఫోటో జతపరుస్తున్నాను. ఈ ప్రపంచంలో ఎవరికీ ఎంత మంది మేన బావలు ఉన్నా, మా అబ్బులు బావదే అగ్ర తాంబూలం.

అబ్బులు బావ, పెదన్నయ్య, హనుమంత రావు బావ

అబ్బులు బావ, పెదన్నయ్య, హనుమంత రావు బావ

ఇక మా నాన్న గారి తరంలో అతిముఖ్యమైన, అతి దగ్గర అయిన బంధువులలో మా సూరీడు బాబయ్య గారే  (రాజమండ్రి) మొదటి వారు. ఆయన మా నాన్న గారి పిన తల్లి (చెల్లంబామ్మ గారు) ఏకైక కుమారులు. ఆయనా, మా నాన్న గారూ చిన్నప్పటి నుంచీ  ఇద్దరూ న్యాయవాదులయ్యే దాకా కలిసే చదువుకున్నారు. ఇద్దరూ మద్రాసు లా కాలేజ్ లో చేరినా, మా నాన్న గారు త్రివేడ్రం లో డిగ్రీ పూర్తీ చేస్తే , మా సూరీడు బాబయ్య గారు మొత్తం మద్రాసు ఉమ్మడి రాష్ట్రానికే  మొదటి వాడి గా నిలిచి మద్రాసు లా కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. నేను యింకా చూడ లేదు కానీ ఆయన పేరు ఇప్పటికీ ఆ కాలేజ్ లాబీ లో చెక్కబడి ఉంటుందిట. ఆయన పూర్తీ పేరు అయినంపూడి సూర్యనారాయణ మూర్తి గారు ఆయన ప్రాక్టీస్ రాజమండ్రిలోనే కానీ దక్షిణ భార దేశం లో ఆయన అతి పెద్ద సివిల్ లాయర్ ఐఎనెన్ మూర్తి గా నాలుగైదు దశాబ్దాలు పేరు పొంది నేను అమెరిక రాక ముందే చనిపోయారు. మా చిన్నన్నయ్య ఆయన దగ్గరే జూనియర్ లాయర్ గా తన ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. నా వయసు వాడే అయిన అయన కొడుకు (రమణ మూర్తి తమ్ముడు)  ఇప్పుడు ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. సూరీడు బాబయ్య గారి భార్య (స్వర్హీయ మాణిక్యం అక్కయ్య)  మా  అమలాపురం బావకీ తోబుట్టువే!

ఇక్కడ మరొక పిట్ట కథ…..మా సూరీడు బాబయ్య గారికి నేనంటే ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే నా పదేళ్ళప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన. అప్పుడు వాళ్ళబ్బాయి అంటే ..మా రమణ మూర్తి తమ్ముడు కింద పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. నేనూ, మా నాన్న గారు వాణ్ణి చూడడానికి రాజమండ్రి వెళ్లాం బస్సులో. నాకు తెలిసీ నేనూ, మా నాన్న గారూ మాత్రమే కలిసి చేసిన ఒకే ఒక్క బస్సు ప్రయాణం అదే! అప్పుడు నేను ఒక్కడినీ ఇంట్లో ఉండగా ఎవరో ఒక పెద్దాయన కూడా మా తమ్ముణ్ణి చూడడానికే ఇన్నీసు పేటలో మా సూరీడు బాబయ్య గారి ఇంటికి వచ్చాడు. అందరూ హాస్పిటల్ కి వెళ్ళారు అని నేను చెప్పగానీ “నీకు ఆసుపత్రికి దారి తెలుసా?” అని అడిగారు. “మాది కాకినాడ సార్, రాజమండ్రి నాకు తెలీదు” అని వెర్రి మొహం వేసాను. ఆయన చతికిల పడి పోయి “ఓరి నాయనోయ్ ఇప్పుడు ఎలాగా?” అని బెంగ పడిపోతూ ఉంటే నా బుర్రలో ఒక వెలుగు వెలిగి “రిక్షా వాడిని పిలిచి జనరల్ హాస్పిటల్ కి పోనీ అంటే వాడే తీసుకేడతాడు గదా” అన్నాను ఆయనతో. ఆయన “అవును” సుమా…హాస్పత్రి దారి నాకెందుకూ తెలియడం. రిక్షా వెధవకి తెలిస్తే చాలుగా “ అని ఆశ్చర్య పడిపోయి ఆ నాటి నా “తెలివి తేటలని” ఊరంతా టాం టాం చేసి నాకు మంచి పేరు తెచ్చిపెట్టాడు. అదిగో అప్పటి నుంచీ మా సూరీడు బాబయ్య గారికీ మా కుటుంబంలో మిగిలిన వారికీ నేను తెలివైన వాడి కింద లెక్క. నాకైతే ఆ మాట మీద అంత నమ్మకం లేదు.

ఇలా మా చిన్నతనంలో నన్ను ప్రభావితంచేసిన బంధు కోటిలో మా అమ్మ వేపు వారైన  మా సుబ్బారావు  రావు నాన్న, లక్ష్ముడక్కయ్య, సీతక్క, జనార్దనం బావ, సీతారమణ మావయ్య,  సుబ్బారావు తాతయ్య గారు,  అటు తణుకు నుంచి తాళ్లూరి లక్ష్మీపతి తాతయ్య గారు మొదలైన వారందరూ దివంగతులే. వీలున్నప్పుడు వారి గురించి ప్రస్తావించి  వారి ఋణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను.

ఇప్పుడు కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా చూస్తున్న బంధువులు చాలా మంది ఉన్నా, ఇప్పుడు “ఉన్నోళ్ళందరూ తీపి గుర్తులే” అయినా  అప్పటికీ, ఇప్పటికీ “బందు ప్రేమ” డిపార్ట్మెంట్ లో చాలా తేడా ఉంది అని నాకు అనిపిస్తుంది. మా చిన్నప్పుడు ముందుగానీ “కాల్చేసి” , ఉత్తరం “తగలేసి” అప్పుడు రావడాలు ఎక్కువ అలవాటు లేదు. ఏకంగా పెట్టె, బేడాతో ఎప్పుడు పడితే అప్పుడు దిగిపోవడమే! ఇప్పుడు నేను తాత, మామయ్య, బాబయ్య, బావ మొదలైన ఏ హోదాలోనైనా సరే  “కాల్” చేసి మా బంధువుల ఇంటికి “ఎప్పాయింట్ మెంట్” తీసుకుని వెడితే ముందు పది నిముషాలు అందరూ చుట్టూ కూచుని పలకరిస్తారు. “ఎప్పుడొచ్చావు?, ఏ హోటల్ లో ఉన్నావు? ” అనే ప్రశ్న లోనే “ఎప్పుడు వెళ్తున్నావు?” అనే ధ్వని వినపడుతుంది. అరగంట తరవాత మెల్ల, మెల్లగా కొందరు ఎవరి గదులలోకి వారో, బయటకో జారుకుంటారు ”సీ యు లేటర్” అనుకుంటూ.  ఇక కూచోక తప్పని వారు వాచీలు చూసుకోవడం, టీవీ ఆన్ చెయ్యడం లాంటి చేష్టలు చేస్తారు. ఇక పెళ్ళిళ్ళు మొదలైన వాటిల్లో మండపాల్లోనే అన్ని మంతనాలూనూ.  అమెరికాలో బంధువులు అయితే ఆరు నెలలకో ఏడాదికో ఫోన్ లోనే మాటా, మంతీనూ. ఏం చేస్తాం. అమెరికా ఫ్రీ కంట్రీ కాబట్టి మనం ఎవరి ఇంటికీ వెళ్ళక్కర లేదు, వాళ్ళు రావక్కర లేదు. ఖర్చు తగ్గింది కదా అని ఆనందిస్తాం అందరూ “అమెరికూపస్థ మండూకాలే”.

chitten raju— వంగూరి చిట్టెన్ రాజు

Download PDF

2 Comments

 • “ఇస్పేటు మదాం”

  అబ్బ ఎన్నాళ్టికి విన్నాను ఈ మాట. మదాం మాడమ్ కు తెలుగు ఏ పండితుడి ఆర్భాటపు ప్రయత్నం లేకుండా, సామాన్యులు ఏర్పరుచుకున్న తెలుగు పదం.

  ఇప్పటి డ్రాయింగ్ రూం పండితు లైతే ఎలాంటి భ్రష్టు పదం సృష్టించి గిరవాట్టేసేవారో కదా అని వణుకు పుడుతుంది.

  మీ జ్ఞాపకాల పరంపర, 1950-60ల్లో పుట్టి పెరిగిన వారందరిదీ.

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   అవును, ఆ రోజుల్లో అమ్మలక్కలు, కుటుంబాలు ఇస్పేటు మదాం లేదా అడ్డాట ఆట, కుర్రాళ్ళు రమ్మీ ఆడుకునే వాళ్ళు. మీరన్నట్టుగా . న్నా చిన్నప్పటి జ్ఞాపకాలు 50-60 దశకాల్లో పెరిగిన వారికి కూడా వారి చిన్నతనాన్ని గుర్తు చేస్తే అంతకంటే కావలసినది ఏముందీ?

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)