మణి మహేష్ ఇలా పిలిచింది మమ్మల్ని!

SAM_9392

(యాత్రాకథనాలకు ఆహ్వానం: ఎక్కడికో వెళ్ళాలి. ఏదో వెతుక్కోవాలి. ఏమేమో చూడాలి. ఎవరెవరితోనో మాట్లాడాలి.  రొటీన్ గా అనిపించే జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలెట్టాలి. ఈ తపన బహుశా వొక ప్రేరణ యాత్రలకూ…దూర ప్రయాణాలకు! అలాంటి యాత్రా సాహిత్యాన్ని అందించే ఉద్దేశంతో ‘యాత్రాస్మృతి’ అనే ఈ కొత్త శీర్షిక. మీ యాత్రా అనుభవాలను రాయండి. ‘సారంగ’కి పంపండి. ఈ వారం ఈ శీర్షిక ప్రముఖ కథా రచయిత, యాత్రా సాహిత్యకారుడు దాసరి అమరేంద్ర గారి రచనతో మొదలు పెడ్తున్నాము. చదివి, ఎలా వుందో చెప్పండి.)

“అమరేంద్రాజీ.. ఆగస్టు చివర్లో మణిమహేష్ యాత్ర ప్లాన్ చేస్తున్నాం. మీరు తప్పకుండా రావాలి” జులై మొదటివారంలో ఫోను చేసాడు మా డిల్లీ బీ.ఈ.ఎన్ లో  సహోద్యోగి సంజయ్ అగర్వాల్. ఇరవై ఏళ్ళ పరిచయం… నాలాగే ట్రెక్కింగ్ అంటే ఆసక్తి.

“తప్పకుండా.. నన్ను లెక్క వేసుకో.. కానీ ఓ మాట చెప్పు. అక్కడ గుర్రాల సదుపాయం ఉందా?” ముందు జాగ్రత కోసం అడిగాను. ఉందన్నాడు.    ఇలా గుర్రాల కోసం తాపత్రయపడడం ట్రెక్కింగు స్ఫూర్తికి విరుద్ధం. కానీ ఆ మధ్య షష్టిపూర్తి కానుకగా  ప్రకృతి మోకాలి నెప్పులు ప్రసాదించింది.  మే నెలలో ఓ మూడువారాలు ఫిజియోధెరపీ తర్వాతే కాళ్ళు కొంచం చెప్పిన మాట వింటున్నాయి. ‘ఇహ ట్రెక్కింగులకు చరమగీతం పాడాలేమో’ అనుకుంటున్న సమయంలో ఈ ప్రలోభపు ఆహ్వానం.!

నెట్‌లోకి వెళ్లాను. డిల్లీనుంచి పఠాన్‌కోట్, చంబాల మీదుగా 670 కిలోమీటర్లు వెళీతే హిమాచల్ ప్రదేష్‌లోణి ‘భర్‌మౌర్’ అన్న చిరు పట్టణం వస్తుంది. మరో పదిహేడు కిలోమీటర్లు రోడ్డున వెళితే ‘హడ్‌సర్’ అన్న చిరు గ్రామం…. అక్కడ్నించి మరో పదమూడు కిలోమీటర్లు కాలి నడకన కొండదారుల్లో వెళితే మధ్య హిమాలయాల మధ్యన, సముద్ర తలానికి 4115 మీటర్ల (13,500 అడుగుల) ఎత్తున ఈ మణిమహేష్ చిరు సరోవరం. దాని పక్కనే ధీరగంభీరంగా 5775 మీటర్ల  ఎత్తున్న మణిమహేశ కైలాస శిఖరం. శివుని (రెండోదో, పన్నెండోదో) ఆవాసమట. ప్రతి ఏడాది జన్మాష్టమి నుంచి పదిహేను రోజులపాటు భక్తులు యాత్రగా వెళ్లిరావడం తరతరాలుగా వస్తోన్న ఆనవాయితీ అట.

 

* * *

 2013, ఆగస్టు 20, రాత్రి ఎనిమిదిన్నరకు అంతా న్యూడిలీ స్టేషన్లో కలిసాం. సంజయ్, అతని భార్య ముక్త, పదమూడేళ్ల కూతురు సంజక్త, తోడల్లుడు సంజీవ్, ఆయన పన్నెండేళ్ళ కూతురు రూపాంశి., ఇరవై ఏళ్ల సంజయ్ మేనల్లుడు ప్రధి, నేను . వెరసి ఏడుగురం. “మన ఈ ఉత్తర  సంపర్క క్రాంది రేపు ఉదయం నాలుగున్నరకు పఠాన్‌కోట్ చేరుస్తుంది. ఓ ఇన్నోవా  మాట్లాడి ఉంచాను. పదీ పదకొండుకల్లా భార్‌మౌర్ చేరుకొంటాం. పగలు అక్కడి గుళ్లూ గోపురాలు చూసుకొని సాయంత్రానికి హాడ్‌సర్ చేరుకొంటాం… రోజంతా ట్రెక్కింగు. మణీమహేష్వర్‌లో రాత్రి మజిలీ,  ఒక ఉదయాన పూజలూ పునస్కారాలూ ముగించుకొని క్రిందకి దిగి సాయంత్రానికల్లా హాడ్‌సర్  చేరతాం.  వెంటనే ఇన్నోవా ఎక్కి రాత్రి చంబాలో హాల్టు. 24 రోజంతా చంబాలోనూ, అక్కడికి పాతిక కిలోమీటర్ల దూరాన ఉన్న ఖడ్జుయార్ పచ్చిక బయలు లోనూ, మరో ఇరవై కిలోమీటర్ల దూరాన ఉన్న డల్‌హౌస్ పట్టణంలోనూ, రాత్రికి పఠాంక్‌కోట్ చేరి డిల్లీ బండి పట్టుకొని 25 ఉదయానికల్లా గూటికి చేరతాం . టూకీగా కార్యక్రమ రూపురేఖలు వివరించాడు సంజయుడు.

SAM_9361

ఇన్నోవాలో అరగంట ప్రయాణించేసరికి వెలుగురేకలు విచ్చుకోవడం మొదలయింది. గలగలమని పారుతోన్న ‘రావి’నది ఒడ్డునే మా ప్రయాణం. తల ఎత్తి మరీ చూడవలసిన ఉన్నత గిరిశిఖరాలు. వాటి చెరియల్లో నిడుపాటి ‘పైన్’ వృక్షాలు. వర్షాకాలం గాబట్టి అన్నివైపులా పరిపూర్ణమైన పచ్చదనం. ‘ఎటు చూసినా అందమే’ అంటూ మనసు పాడటం మొదలెట్టేసింది.

సంజయ్‌తో పాటూ ముక్తకూ, వాళ్ల పాప సంజక్తకూ ట్రెక్కింగ్ అభిరుచి ఉంది. సంజీవునికి వాళ్ల పాప రూపాంశ్ కి  కూడా ట్రెక్కింగులో చెప్పుకోదగ్గ ప్రవేశముంది. ప్రధి సరేసరి. పిల్లలు ముగ్గురికీ చదివే అలవాటూ ఉంది. సంజక్త, రూపాంశి ఫేమస్ ఫైవ్, సీక్రెట్ సెవెన్లు దాటుకొని ఎనిడ్ బ్లైటమ్ దగ్గరకి చేరారు. రస్కిన్‌బాండ్ దారిలో ఉన్నారు. ప్రధీ అప్పుడే ఖాలిద్ హుస్సేనీ దగ్గర్నించి టాగోర్ దాకానూ, స్టీవెన్ స్పిల్‌బర్గ్ నుంచి సత్యజిత్ రే దాకానూ ఔపాసన పట్టేసి ఉన్నాడు. మరింకేం.. మాటలు సాగాయి. గంట గడిచేసరికల్లా స్నేహం పండింది. ఆటలు.. పాటలు.. కబుర్లూ.. కోలాహలం.

“మోకాలు ఇబ్బంది పెట్టొచ్చు. అయినా ప్రయత్నిస్తాను. అవసరమయితే గుర్రం. అదీ కుదరకపోతే మధ్యలో ఆగిపోయి మీరు తిరిగొచ్చేదాకా ఉంటాను” అని మాటల మధ్య అంటే..” అదెలా అంకుల్! ముందే అలా అనేసుకుంటే ఎలాగా? చివరిదాకా వెళ్లి తీరాలి అని సంకల్పం చెప్పుకోండి. జరిగి తీరుతుంది” అని  హితవు చెప్పింది తొమ్మిదో క్లాసు సంజక్త. భర్తృహరిగారి “ఉత్తమ పుత్రికా?” అని  అబ్బురపడ్డాను.

ఇంజనీరింగ్ చదువుతోన్న ప్రధి అడిగాడు.”ఎన్నెన్నో ట్రెక్కింగులు చేసారు గదా. అందుకు ప్రేరణ ఏమిటి? ఏం ఆశిస్తూ ఉంటారు?”  ఆలోచనలో పడ్డాను. “కారణాలు నాలుగు.. అద్భుతమైన ప్రకృతి. నాలోకి నేను చూసుకొనే అవకాశం. పదిమందినీ కలిసి తెలుసుకొనే అవకాశం. నా మానసిక, భౌతిక శక్తులను పునర్నిర్వచించుకొనే అవకాశం..”

* * *

 SAM_9381

 

ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో చంబా చేరుకొన్నాం.

జిల్లా కేంద్రమది. కొండలమధ్య ఊహాతీతమైన విశాల మైదానంలో ఆ పట్టణం ఊరు మధ్య ఐదారు ఫుట్‌బాల్ కోర్టులు వచ్చే బడా మైదానం. దిగువన పారుతున్న ‘రావి’ నది. ఎదురుగా కలెక్టరాఫీసు. కోర్టులు, సర్క్యూట్ హౌస్.. బ్రిటీషు కాలం నాటి బంగాళాలు.. కాస్తంత ఎగువన వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న లక్ష్మీనారాయణ మందిరం.  చేరువలోనే ఓ మ్యూజియం. ఊరు నాకు తెగ నచ్చేసింది. మళ్ళీ వెళ్లాలి.

చంబా దాటీ దాటగానే దిగువన పిక్చర్ పోస్ట్ కార్డ్‌లాంటి అందాలున్న చక్కని ప్రదేశమూ, అక్కడే ఓ డిగ్నిఫైడ్ మధ్యవయసు మహిళ నడుపుతోన్న  ఒక దుకాణమూ. అరగంట ఫోటోలు సరేసరి. అలా ఆడుతూ పాడుతూ, అనిపించిన చోటల్లా ఆగుతూ పదిన్నరా పదకొండు ప్రాంతంలో భర్‌మౌర్ చేరాం. వాకబు చెయ్యగా ఒకరికిద్దరు ఓ పంజాబీ ఢాభాకేసి చూపించారు. మరిహనేం. ఆనాటి ముఖ్యభోజనం అక్కడ. అన్ని పదార్థాలూ అతి రుచికరంగా ఉండగా అందరం ఒంటెల్లా భోంచేసాం!

భర్‌మౌర్ ఆలయాల నిలయం. ముఖ్యమైన భరణీ మాత మందిరం ఓ కొండ చిటారుకొమ్మన ఉందట. మణి మహేష్ వెళ్ళెవాళ్లంతా ఈ దేవి అనుగ్రహం పొంది మరీ ముందుకు సాగడం మర్యాదట. మా బృందం కొండెక్కడానికి సిద్ధపడిపోయింది. నా మోకాలును ఆచితూచి వాడుకోవాలి. రేపటికి దాచి ఉంచాలి అనేసి నేను  ఉండిపోయాను.

ఆగస్టు ఆపిళ్ళ సీజను. ఊళ్లో ఎక్కడ చూసినా యాపిలు చెట్లు. కాయలు. పళ్లు. మెల్లగా సాగగా ఊరిచివరి ఓ పేద్ద యాపిల్ తోట. ‘అపురూప ప్రదేశం’ అని అందులో తనివితీరా తిరుగాడాను.  రెండు మూడు గంటలే అనుకొన్నది మా బృందం తిరిగొచ్చేసరికి సాయంత్రం నాలుగయింది. వెంటనే హడ్సర్ ప్రయాణం చేరేసరికి ఆరు దరిదాపు. వర్షాకాలం గాబట్టి దారిలో లాండ్ స్లయిడ్లు ఉండవచ్చౌనని అనుభవజ్ఞులు అన్నారు గానీ మేం ఏ అడ్డంకి లేకుండానే చేఅరాం.

హడ్సర్ మరీ చిన్న పల్లెటూరు. అంతా కలిసి అయిదొందల జనాభా. అసలీ యాత్ర సమయంలోనే ఊరు మేల్కొనేది. అప్పుడే ఓ  లంగరు వెలిసింది. వసతి సౌకర్యం పూజ్యం. కానీ కొంచెం వెదగ్గా ఊరి పొలిమేరన ఎత్తైన కొండ చెరియన ఓ పి.డబ్ల్యూ. డి వారి గెస్ట్‌హౌస్ దొరికింది. సంబరం. రూములు బాగా విశాలంగా ఉందటమే గాకుండా వేడినీళ్ల సౌకర్యమూ ఉంది. మరిహనేం?

ఇలాంటి  యాత్రాసమయాల్లో యత్రికుల సౌకర్యం కోసం ఉచిత భోజన సదుపాయం కలిగించే ‘లంగర్లు” దారి పొడవునా విరివిగా వెలవడం ఉ త్తరభారతదేశంలో కద్దు. అలాంటి ఓ లంగర్లో డిన్నరు చేసాం. దాని నిర్వాహకుడు మాతో కబుర్లలో పడ్డాడూ. అతనికి ఏభై ఏళ్లుంటాయి. పంజాబు ప్రభుత్వ ఉద్యోగి. పఠాన్‌కోట్ నివాసి. గత ఇరవై ఏళ్లుగా ఈ దారిలో నాలుగయిదు లంగర్లు నిర్వహిస్తున్నాడట. యాత్రా సమయంలో మూడు నాలుగు వారాలు ఇక్కడే మజిలీ..

“ఏమిటి మీ ప్రేరణ?” అని అడిగాం. ” 1993లో మొదటిసారి యాత్రకు వచ్చాను. ఆ రాత్రి మణిమహేష్‌లో గడిపాం. తిండి దొరకలేదు. పైగా భయంకరమైన చలి. తలపైన ఏ కప్పూ లేదు. కంబళ్ళూ, రజాయిలూ సరేసరి. ఇదిగాదు పద్ధతి అనిపించింది. నలుగురినీ కూడగట్టుకుని ఈ లంగరు వ్యవస్థను ప్రారంభించాను. భోజనంతోపాటు ప్రాధమిక వసతి సౌకర్యమూ కల్పిస్తున్నాం” వివరించాడాయన.  సమ హృదయ భక్తులూ, స్నెహితుల పుణ్యమా అని డబ్బు సమస్యే లేదంట”

 

* * *

 

పచ్చని ప్రకృతి తోడుంటే...జీవితమే దాసోహం :దాసరి అమరేంద్ర

పచ్చని ప్రకృతి తోడుంటే…జీవితమే దాసోహం :దాసరి అమరేంద్ర

22 ఉదయం ఆరింటికల్లా ట్రెక్కింగు మొదలెట్టాం.

మామూలుగా మనం పార్కుల్లో అయితే గంటకు ఐదారు కిలోమీటర్ల వేగంతో  నడుస్తాం. సాధారణంగా అది ట్రెక్కింగులో రెండు మూడుకు పడిపోతుంది. ఎత్తులు ఎక్కాలి గాబట్టి. కాని మణిమహేశ్వర్ మార్గం మరీ ఎగుడు. హడ్సర్ ఉన్నది 2100 మీటర్లన అయితే మణిమహేశ్వర్ 4115 మీటర్లు.  అంటే మదమూడు కిలోమీటర్ల నడకలో రెండువేల మీటర్లు ఎత్తు ఎక్కాలన్నమాట. దుర్గమం. అంచేత కనీసం పదిగంటలయినా పడుతుందని తెలుసు. సాయంత్రం నాలుగు గంటలకల్లా గమ్యస్థానం చేరాలన్నది ఆనాటి మా లక్ష్యం.

“బాప్‌రే! ఆ కొండల్ని చూసారా? నిట్టనిలువుగోడల్లా ఉన్నాయి. వాటినన్నింటినీ దాటుకుని వెళ్లాలి మనం. గుండె గుభేలుమంటోంది” అన్నాడు సంజయుడు. నిజానికి మాలో అది అతి దిట్టమైన మనిషి అతనే. ముక్త బక్క పలచన. పైగా నిన్నటి భర్‌మౌర్ భ్రమణంలో జారిపడగా మోకాలు పట్టేసింది. ఆడపిల్లలు బాగా చిన్నవాళ్లు. సంజీవుడు ఒకప్పటి జాతీయ స్థాయి ఈతగాడే అయినా ఇపుడూ మాత్రం సేఠ్ జీ స్వరూపం. ప్రధి కూడా స్థూలకాయుడే. నా మోకాలు…. వద్దులెండి. ఎన్నిసార్లని దాన్ని కీర్తించడం? అయినా ఎవ్వరం గుర్రాల సంగతి ఎత్తలేదు. ఓ గంటన్నర నడక మహాచురుగ్గా సాగింది.
SAM_9351

 

దారిపక్కనే  పాలవరదలా పారుతోన్న ‘గౌరీనాలా’ అనే చిరునది. అడపాదడపా  నిడుపాటి కొండల్లోంచి పడుతోన్న  సుందర జలపాత ధారలు. ఇరవై పాటిక్ డిగ్రీల ఉష్ణోగ్రత – ట్రెక్కింగుకు అన్ని విధాల అనుకూలమైన వాతావరణమది. దారిలో కనిపించిన ఓ లంగర్లో అన్నమూ. పప్పులతో బ్రేక్‌ఫాస్ట్ ముగించాం. అందరమూ స్వేచ్చా విహంగాల్లా సాగిపోతూ ఉంటే అపశృతిలా రూపాంశ్‌ని అనవసరపు, అతి జాగ్రతల నియంత్రణలో ఉంచాలని ప్రయత్నించే  వాళ్ల నాన్నగారు.. చెలంగారుంటే సుబ్బరంగా దెబ్బలాడేవారే. నేనూ నర్మగర్భంగా చెప్పి చూసాను.

దారి నిర్ధాక్షిణ్యం రెండు గంటలు గడిచాకే స్పష్టమయింది. దారులూ, రాళ్లూ, రప్పలూ, బండలూ. వర్షాలవల్ల చిత్తడి. అదపాదడపా చీలమండలదాకా నీళ్లు. ఎత్తు ఎక్కవలసి రావడం సరేసరి. అయినా ఆ దారిలో అంతా ఉల్లాసమే. ‘బాధే సౌఖ్యం’ సన్నివేశమన్నమాట. మాతో పాటే వస్తున్న ఓ పాతిక ముప్పై మంది సహయాత్రికులు. యాత్ర ముగించుకొని వస్తోన్న వాళ్ల ప్రోత్సాహపు పలుకులు.. అలా ఆడుతూ, పాడుతూ పదిగంటల ప్రాంతంలో “ధాంభో’ అన్న  ఆరు కిలోమీటర్ల దూరపు ప్రదేశానికి చేరాం. సగం దారి గడిచిందన్నమాట. 2900 మీటర్ల ఎత్తు. చెట్లు కనుమరుగై పర్వత సానువుల్లో తుప్పలూ, పచ్చికా మాత్రమే. మిగులుతోన్న సమయం ఆ ధాంభోలో ఒకళ్ల నొకళ్ళం పరామర్శించుకొంటూ కొత్తవాళ్లను పలకరిస్తూ, సేద తీరుతూ ఓ గంట. “మా లంగరుకు రండి అంటే ఎమా లంగరుకు రండి’ అని నిర్వాహకుల ఆహ్వానాలు.

విరామం కలిగించిన ఉల్లాసంతో మళ్లా మార్గారోహణ మొదలెట్టాం. కాస్త సాగగా – ‘ధాంభో’ జలపాతం. భస్మాసురుడి బారినుంచి తప్పించుకొనే ప్రయత్నంలో పరమశివుడు ఈ జలపాతం వెనకాల దాక్కున్నాడని స్థలపురాణం. ఎక్కడా విడుపులేని ఆరోహణ ఆశ్చర్యమనిపించింది. ఏ మామూలు ట్రెక్కింగు మార్గంలో అయిన ఆరోహణలూ. అవరోహణలూ, సమతల ప్రదేశాలూ, అరుదుగా పీఠభూములూ ఉండడం సామాన్యం. ఇక్కడ మాత్రం ఒక్కటే రాగం. ఆరున్నొక్క ఆరోహణా రాగం..

ఆ కష్టమార్గంలో దొరికిన అలవోక సుఖం పిల్లల సాహచర్యం.

“మీరు వస్తోంది పుణ్యం కోసమా? ట్రెక్కింగు ఆనందం కోసమా? అని అడిగితే ఆనందం కోసమే అనేసారు రూపాంశీ, సంజక్త.

SAM_9352“అంకుల్. జీవితంలో డబ్బు పాత్ర ఏమిటి? అన్న గొప్ప ఫిలసాఫికల్ ప్రశ్న వేసి ఆశ్చర్యపరిచాడు ప్రధి. “అది మనకు బానిస అవ్వాలి. సేవలు చెయ్యాలి. డబ్బు అవసరమే. సందేహం లేదు. కానీ దాన్ని  నీ పదో ప్రయారిటీగా ఉంచు. సుఖపడతావు. మనలాంటి మహానగరపు  మధ్యతరగతి జీవులకు జీవనోపాధి సమస్య కానేకాదు. దురాశకు పోనంతవరకూ మనకు డబ్బును చిన్నచూపు చూసే శక్తి వుంటుంది. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలను డబ్బు పరంగా తీసుకోకు, సుఖం కోల్పోతావు” విపులంగా హితవు పలికాను. మరో రెండు అనుబంధ ప్రశ్నలు. నా శక్తిమేర జవాబులు .. తమకు ఆసక్తి ఉన్న సంగీతం, నటన, వక్త్రుత్వం, సాహితీపఠనం గురించి సంజక్త, రూపాంశ్ ప్రశ్నలడిగారు. “మనిషి మానవుడవడానికి ఇవన్నీ సమపాళ్లలో ఉండడం చాలా చాలా అవసరం. కానీ ఎంతైన ఇవి పక్క వాయిద్యాలే. చదువన్నదే అసలు సిసలు రాగం. చదువు విషయంలో రాజీ పడకండి. రాణించడం అవసరం” అన్నాను.

(రెండో భాగం వచ్చే వారం)

– దాసరి అమరేంద్ర

Download PDF

11 Comments

  • devika rani says:

    అమరేంద్ర గారూ…మీ యాత్రాస్మృతి అద్భుతం…చదువుతుంటే నాకూ హిమాలయాల్లో విహరిస్తున్నట్టుంది….గతేడాది మేం కుటంబసమేతంగా… సిమ్లా, కులుమనాలి వెళ్లాం…ఇది చదివి మా అమ్మాయి ఈసారి మణిమహేశ్ వెళ్దామని పేచీ మొదలుపెట్టింది. నాకూ చూడాలనిపిస్తోంది. హిమాలయ అందాలు నిజంగా వర్ణనాతీతం కదా…. అంతా బాగానే ఉంది కానీ…..రెండో భాగం వచ్చేవారం అన్నారు కదా…అది నచ్చలేదు..మీ మరిన్ని అనుభూతుల్ని మేమూ సొంతం చేసుకోవాలంటే…వారం రోజులు ఆగాలా…

    • amarendra says:

      దేవిక గారూ..ముందుగా థాంక్స్..ఒక చిన్న పొరపాటు వల్ల యాత్ర రెండు భాగాలు ఐయింది.. పోన్లెండి..మేము నాలుగు రోజులు నడిచాము గదా..ఓ వారం ఆగడం పొఎటిక్ జస్టిస్ అవదూ?

    • amarendra says:

      దేవిక గారూ , మరోమాట ..హిమాలయాల సౌందర్యం సంగతి ప్రస్తావించారు గదా ..నాకా కొండలంటే వెర్రి passion ! ‘వాటి సంపూర్ణ సౌందర్యం చూడాలంటే సిమ్లాలూ , ముస్సోరీలూ సరి అయిన ప్రదేశాలు కావు’ అని ఆ నగరాల చుట్టూ ఓ పదేళ్ళు తిరిగిన తర్వాత అర్ధమయింది !! అదిగో అప్పట్నించీ ఇలా లోపల లోపలి trekkingulu ! అన్నట్టు మీ పాప మాట మన్నించి manimaheswar వెళ్ళిరండి ..థాంక్స్ ఒన్స్ అగైన్!

  • adinenele says:

    manimahesh యాత్రాస్మృతి ..అంతా బావుంది కానీ ఆ అచ్చు తప్పులేమిటీ ? కాస్త చూసుకోవద్దూ ? అందులో యాత్ర కన్నా యాత్రికుని స్వగతాలూ ప్రకాశాలూ ఎక్కువయ్యాయనిపించింది ..పాపం ఆ పిల్లలు అడిగినంత మాత్రాన క్లాసు తీసుకోడమేనా !!ఫోటోలు బాగున్నాయి ..వ్యాసం కట్టిన పధ్ధతి బాగుంది ..తప్పకుండా ఇలాంటివి వేస్తూ ఉండండి ..రెండో భాగం కోసం చూస్తున్నాం ..

    • వలలుడు says:

      యాత్రా కథనం అంటే కేవలం ట్రావెల్ గైడ్ లాంటిది కాదు. ఒకే కృష్ణలో మునిగిన ఓ భావుకుడు పరవశంతో చలించిపోతే, అతని స్నేహితుడు ఈ చలిలో ఈ స్నానమేంటి, ఈ గోలేందిరా నాయనా అని చికాకు పడటం వస్తువుగా తీసుకుని అమరావతి కథల్లో ఓ కథ రాసారు సత్యం గారు.
      వారణాశి పైపైన చూస్తే ఇరుకిరుకు గొందులు, అందులో జనసందోహం, ఈ మధ్యలో ఆవులు, నేలంతా జిగటగా వాటి పేడ, ఇంతోసి కంతలోకి దూసుకొచ్చే మోటారు సైకిళ్ళు కనపడతాయి. ఆ విశేషాలు అలా రాసేస్తే యాత్ర కథనం ఐపోదు కదా.
      ఏ యాత్ర కథనం అయినా యాత్రికుని దృక్పథం వల్లనే నిలబడుతుంది.

      • amarendra says:

        అయ్యా వలలుడు గారూ నా వంటకం లోని అసలు రుచి పసిగట్టారు ..మెనీ థాంక్స్

  • amarendra says:

    మీ feedback కు థాంక్స్ ..యాత్ర అంటే గణాంక వివరాలే కాదు ,యాత్రికుని మనోభావాలూ అనుభవాలూ ముఖ్యం అని నమ్ముతాను ..అయినా మీరు చెప్పిన విషయం గుర్తుంచుకుంటాను ..చాలా థాంక్స్

  • adinenele says:

    థాంక్స్ నాసీ గారూ !!

  • అమరేంద్ర గారూ, హిమాలయాల్లో లాంగ్‌ ట్రెక్‌ చేశారా! చేసే ఉంటారేమో! చౌకలో సురక్షితమైన మార్గం యూత్‌ హాస్టల్ వారిది. నేషనల్‌ ట్రెక్‌ బాగుంటుంది. తెల్లవారుఝామున నాలుగున్నరకు చెవులు చిల్లులు పెట్టే గాయత్రి తప్ప మిగిలిందంతా బాగానే ఉంటుంది. ఏడెనిమదేళ్లక్రితం సార్‌కుండి చేశాం. 14,700 అడుగులు అనుకుంటాను. మర్చిపోలేని అనుభూతి. ఆరురోజులు ఎక్కడం, మూడు రోజులు దిగేయడం. ఐదు,ఆరు, ఏడు, మూడు రోజులు పూర్తిగా మంచుమీదే. ఆ తర్వాత తిరుమల అడవులు లాంటివి చేశాం కానీ హిమాలయాలు హిమాలయాలే. ఈ ఏడాది తప్పకుండా వెళ్లాలి అని ప్రతి యేటా అనుకుంటూనే ఉన్నాం. ప్చ్‌, పన్నెండు రోజుల సెలవు పెట్టగలిగే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటే మీరు మణిమహేశ్‌ గురించి రాసి ఊరించారు. ఈ సారైనా వెళ్లాలి. థ్యాంక్యూ, మంచి జ్ఞాపకాల్ని తట్టిలేపారు.

  • amarendra says:

    రామ్మోహన్ గారూ ..అవును .వెళ్ళాను.పిండారీ glasier ,హరికా డూన్, వాలీ ఆఫ్ ఫ్లవర్స్ లాంటి చోట్లకు వెళ్ళాను ..వాలీ నాకు ఇష్టమైన చోటు..చాలా సార్లు వెళ్లాను ..మీరు రండి ..మళ్ళా వెళదాం ..మీరు అన్నట్టు హిమాలయాలు హిమాలయాలే !!

Leave a Reply to amarendra Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)