అంకురం

afsr

balaji

పలమనేరు బాలాజీ అసలు పేరు కె.ఎన్.బాలాజీ. పుట్టిన ఊరునే ఇంటి పేరుగా మార్చుకుని రచనలు చేస్తున్నారు. జనవరి 19, 1974లో చిత్తూరు జిల్లాలో పుట్టారు. తొలికథ “ఎగురలేని విహంగం’ 1991లో ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. “గదిలోపలిగోడ’ పేరుతో ఒక కథాసంపుటి తెచ్చారు. ఇప్పుడు మరో కథాసంపుటి తెచ్చే పనిలో ఉన్నారు. కవిత్వమూ రాశారు. ఒక కవితా సంపుటి, రెండు నవలలు, ఒక వ్యాస సంపుటి ప్రచురించారు. ఈయన రచనలు వివిధ భాషల్లోకి అనువాదమయ్యాయి. వివిధ పురస్కారాలు అందుకున్నాయి. ప్రస్తుతం చిత్తూరుజిల్లా పెద్దపంజాణిలో ఎంపిడీవోగా పనిచేస్తున్నారు బాలాజీ. — -వేంపల్లె షరీఫ్

***

Kadha-Saranga-2-300x268

దుర్గమ్మ గుడి ముందు సందడిగా ఉంది.

ఇందిరమ్మ కాలనీలో ఆరోజు గ్రామసభ జరుగుతోందని, ఒకరోజు ముందే దండోరా కొట్టడం వల్ల, జనం అక్కడ గుమిగూడి పోయారు.

మధ్యాహ్నం మూడు దాటింది. ఎండ చుర్రుమంటోంది. ఆ పంచాయతీలో ఉపాధి హామీ పనుల్ని పర్యవేక్షించే ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రమణ వేపచెట్టు నీడలో చాపపరిచి కూర్చుని ఉన్నాడు. రెండు పాత చాపలు ఒకదాని పక్కన ఒకటి పరచి  ఉన్నాయి. ఆ రెండు చాపల చుట్టూ నాలుగు ఇనుప కుర్చీలు, రెండు ప్లాస్టిక్‌ కుర్చీలు పహారా కాస్తున్నట్లు ఉన్నాయి. చాపపైన తెల్లకాగితాలు, గ్రామసభ రిజిష్టరు, హాజరు పట్టిక, ఇంక్‌ ప్యాడ్‌, ప్లాస్టిక్‌ సంచిలో కొన్ని అర్జీలు రమణ ముందు పేర్చబడ్డాయి.

‘‘పంచాయతీ కార్యదర్శి, సర్పంచు వచ్చారంటే ఎంత… అరగంటలో అయిపోతుంది మీటింగ్‌. వాళ్లింకా రాలేదు. ఎండ చూస్తే మనుషుల్ని కాల్చేసేలా ఉంది’’ తనలో తాను గొణుక్కుంటున్న రమణ మాటలు అక్కడికి సమీపంలో ఇండ్ల అరుగుల పైన కూర్చున్న వారి చెవిన పడ్డాయి.

కుయ్యప్ప అరుగుపైనుండి లేచి నిలబడి, వదులైన లుంగీని సర్దుకుని గట్టిగా బిగించి కట్టుకుని, మురికి కాలువలోకి వక్కాకు ఎంగిలి ఊసి, మళ్లీ అరుగు పైన సర్దుకుని కూర్చుంటూ ‘‘ఎంతసేపు సూడాలా అబ్బోడా?’’ అన్నాడు విసుగ్గా మొహం పెట్టి.

అసలామాటే వినబడనట్లు, తనకా మాటతో ఏ సంబంధమూ లేదన్నట్లు రమణ తన ముందున్న ప్లాస్టిక్‌ సంచిలోంచి అర్జీల్ని, దరఖాస్తుల్ని బయటకు లాగి ఒక్కదాన్నే పరిశీలనగా చూస్తూ, కాగితాలు అటూ ఇటూ తిప్పుకుంటూ ఉండిపోయాడు.

గూని సుబ్రమణ్యం ఇంటి ముందున్న చేతి బోరులోంచి ఎట్లాగైనా నీళ్లు రప్పించాలనే లక్ష్యంతో ఇద్దరమ్మాయిలు పైట కొంగుల్ని నడుములకు బిగించి ఎదురెదురుగా నిలుచుని బోర్‌ హ్యాండిల్‌ని నాలుగు చేతులతో బలంగా ఒడిసి పట్టుకుని, పైకి కిందకి ఊపుతూ ఉంటే ఆ ఊపుకి అనుగుణంగా వాళ్లిద్దరి శరీరాలూ ముందుకూ వెనక్కూ కదులుతూ ఉన్న దృశ్యాన్ని కళ్లప్పగించి చూస్తున్నాడు నాగవేలు. అతడి కళ్లు ఎదుటి దృశ్యం వైపే కేంద్రీకరించబడి ఉన్నాయి. మెడ మీద, ముఖం పైన కారుతున్న చెమటను ఎంత మాత్రం పట్టించుకునే స్థితిలో అతడు లేదు. అతడి నోట్లోంచి చొంగ కారిపోతున్న సంగతిని కూడా అతడు విస్మరించాడు.

మునిరాజులు తన టీ అంగడి ముందు నిలబడ్డాడు. సన్నగా పొడవుగా చామన చాయలో ఉన్నాడు. పాతికేళ్లు దాటకపోయినా వయసుకు మించిన ముదురు తనమేదో అతడి ఒంట్లో, మొహంలో కనబడుతోంది. టీ బాయిలర్‌ ముందు నిలబడి, నిప్పు కణికల్ని రాజేస్తూ, బొగ్గుల్ని వేస్తూనే ఆ ఆడవాళ్లిద్దరి వైపు కళ్లార్పకుండా చూస్తున్నాడు.

ఆ టీ అంగట్లోనే కూర్చుని, చినిగి పేలికలైన ఆనాటి దినపత్రికలోని ఒకానొక భాగంలో కనబడుతున్న సినిమా హీరో హీరోయిన్ల వైపు, మునిరాజులు వైపు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రమణ వైపు, నాగవేలు వైపు, బోరింగ్‌ వద్ద నీళ్ల కోసం నానా తంటాలు పడుతున్న ఆ పడుచువాళ్లు వైపు తలతిప్పి మార్చి మార్చి చూస్తున్నాడు అరవయేళ్ల శంకరయ్య. అతడిది పూర్తి బట్టతల. తల్లో ఒక్క వెంట్రుకైనా లేదు. బట్టతల పై నుండి కారిపోతున్న చెమటను తువ్వాలుతో తుడుచుకుని బీడి ముట్టించుకున్నాడు.

టివిఎస్‌ మోపెడ్‌ శబ్ధం, హారన్‌ రెండూ ఒకేసారి వినిపించేసరికి, కాగితాలు మరోసారి సర్ది రమణ చాప పైనుండి లేచి నిలుచుని, వీథి మొదలువైపు చూసాడు. వస్తున్న వాళ్లు సర్పంచు, పంచాయతి కార్యదర్శే అని నిర్ధారించుకున్న తర్వాత చేతులు ఊపుతూ చుట్టూ అక్కడక్కడా గుమిగూడిన జనాల్ని, అక్కడికి దూరంగా ఇండ్ల అరుగులపైన కూర్చున వాళ్లని, టీ అంగడిలో కూర్చున్న శంకరయ్యని.. పేర్లు పెట్టో, వరసలు పెట్టో పిలుస్తూ… ‘‘రండి రండి సెక్రటరి మేడం, సర్పంచు అన్న ఇద్దరూ వచ్చేసినారు. మీరందరూ బిరీన్నా వస్తే మీటింగ్‌ స్టార్ట్‌ చేసేద్దాం. ఈ మీటింగ్‌ అయినాక నేను మళ్లీ పలమనేరుకు పోవల్ల. యంపిడిఒకి రిపోర్ట్‌ రాసివల్లంట. తొందరగా రండి’’ పెద్దకంఠంతో గొంతెత్తి జన సమీకరణ మొదలుపెట్టాడు రమణ.

చాలాసేపు బోరింగ్‌ కొట్టీ కొట్టీ ఆడవాళ్లిద్దరూ అలసిపోయారు. రెండు బిందెల నిండా నీళ్లు నింపుకుని అక్కడి నుండి కదిలారు. వాళ్ల వంతు అయిపోగానే అక్కడే కాచుకుని ఉన్న మరో ఇద్దరు నడి వయస్కురాళ్లు, బోరింగ్‌ హ్యాండిల్‌ను చెరో వైపు పట్టుకుని, ముందుకూ వెనక్కూ ఊగిపోతూ నీళ్లకోసం తమ ప్రయత్నాన్ని ప్రారంభించారు.

‘‘పుష్పావాళ్లు నిలపక ముందే మనంగానా ఇంకొంచెం ముందుగానే మొదలెట్టి ఉంటే.. నీళ్లు లోపలికి ఎనెక్కి పోయిండేవి కావు. రొంత లేటయ్యిందానికి ఇప్పుడు చూడుమే. నీళ్లు లోపలికి ఎళ్లిపోయినట్లుండాయి. ఈ నా బట్టలు బోరింగ్‌ సంగతి పట్టించుకుంటే కదా. బిందె నీళ్ల కోసం ఎండలో బోరింగ్‌ కొట్టీ కొట్టీ చేతులు బొబ్బలెక్కి పోతావుండ్లే’’ అంది విజయమ్మ కసాబిసా వక్కాకు నములుతూ.

ఇంకొకామె వక్కాకు ఎంగిలి దూరంగా ఊస్తూ ‘‘అరుగులపైన కూర్చుని ఆడోళ్ల నడుముల గురించి, పిర్రల గురించి మాట్లాడమంటే మాట్లాడతారు కానీ మన మొగాళ్లు ఆ సర్పంచు కాడనో, ఎండిఒ కాడనో పోయి నాలుగు పైపులు ఇప్పించుకుని, ఆ మెకానిక్‌ కృష్ణయ్యని తోడుకుని వచ్చి బోరింగు రిపేరు చేయించే సత్తా మాత్రం వీళ్లకు లేదమ్మే విజయా’’ అంటోంది గసపోస్తా గోవిందమ్మ.

afsr

ఆ మాటలు గుడి ముందు చేరిన జనాల చెవులకు వినబడుతూనే ఉన్నాయి. కుర్చీలపైన నింపాదిగా కూర్చున్న సర్పంచుకూ వినిపించాయి. పంచాయతీ కార్యదర్శికి వినిపించాయి. అందరికీ వినపడాలనే గట్టిగానే ఇద్దరూ మాట్లాడుతున్నారనే సంగతి అర్థమయ్యాక శంకరయ్యకు నవ్వొచ్చేసింది.

ప్లాస్టిక్‌ కుర్చీలో కూర్చుంటూనే సర్పంచుతో మాట కలిపాడు.

‘‘ఏమిరా మునస్వామి, ఆ ఆడోళ్ల మాటలు విన్నావు కదా. బిందె నీళ్ల కోసం కన్నగసాట్లు పడతా ఉండార్రా నాయినా. ఈ మీటింగ్‌లు, లోన్లు మళ్లింకా సూద్దాం. ముందు నీళ్ల కత సూడ్రా, పుణ్యం ఉంటుంది.’’

‘‘ఆ… ఆ.. చూస్తాంలే తాతా. బోరింగ్‌ మెకానిక్కు క్రిష్టప్పకు జ్వరమని ఆఫీసు తావకే రావడం లే. వారం దినాలవతా ఉండాది మనిషి కనబడి. బోరింగ్‌ రిపేర్‌ అని ఎవరైనా మాకు ముందుగా చెప్పినారా? ఆ ఎండిఒ ఆఫీసుకో, నాకో, సర్పంచుకో ఎవరికో ఒకరికి ఫోనయినా చేసిండ కూడదా? ఊర్లో ఇంతమంది జనాలుండారు కదా. అందరి చేతుల్లో సెల్లులు కూడా ఉండాయి కదా’’ అంది పంచాయితి కార్యదర్శి లలితమ్మ.

‘‘మంచి స్కీం ఉండాది. డబ్బులిస్తాం. ఇంటింటా మరుగుదొడ్డి కట్టుకోండయ్యా అంటే మాత్రం వినబడనట్లు ఉంటారు. మాకాడ డబ్బేడ ఉందమ్మా అని అంటారు. సెల్‌ఫోన్లు మాత్రం ఇంటికి రెండు మూడయినా ఉండాయి కదా. ఆ బడాయికేం తక్కువ లేదు జనాలకి’’ మెల్లగానే అయినా లలితమ్మ గొణుగుడు అందరికీ వినబడిరది. ఆమె మాటలు అయిపోగానే సర్పంచు గొంతు విప్పాడు.

‘‘మేడం ముందు మనం వచ్చిండే పని సూడండ. ఊరన్నాక సమస్యలు ఉండనే ఉంటాయి. ఈ రోజు ఇదొకటి. రేపు ఇంకొక్కటి. ఈ రోజు ఈ ఊర్లో, రేపు ఇంకొక ఊర్లో. మొన్నాడు ఇంకో ఊర్లో. మనకిది మామూలే కదా. ఎంత చేసినా చేసిండే మంచిని జనాలు నిముషాల్లో మరచిపోతారు. మళ్లింకా ఏం ఊరికే చేస్తా ఉండావప్పా అని మొహం పైనే అడిగేస్తారు. నా గ్రహచారం బాలేక, శనేశ్వరుడు నెత్తిపైన కూర్చుని ఉంటే సర్పంచుగా నామినేషన్‌ ఏశాను. మన బాధలు ఈ జనాలకు అర్థం కావులే. జనాలు ఏమైనా అడగొచ్చు కానీ నేను కడుపు కాలి ఏమైనా అంటే మాత్రం జనాలు అడ్డం తిరగతారు.’’ అని ఆగాడు. చుట్టూ చూసి మళ్లీ కొనసాగించాడు.

‘‘ఏదైనా అంటే మాత్రం, అంతే లేబ్బా. మీకు మా ఊరంటే చులకన. నీకు మీ ఊరే గొప్ప. అన్ని పనులూ మీ ఊరికే చేస్తా ఉండావే కానీ ఏ పొద్దయినా మా ఊరివైపు ఎగాదిగా చూసిండావా? నిన్ను మీ ఊరోళ్లు మాత్రమే ఓట్లేసి ఎన్నుకోలా? ఈ పంచాయితీలో ఉండే పన్నెండూరోళ్లు నిన్ను సర్పంచుగా ఎన్నుకోనుండారప్పా. నువ్వా సంగతి మరచిపోతాండావు అని నాకే పాఠాలు చెప్తారు జనాలు. ఏం చేసేది మేడం? వాళ్లు అడిగేదానికే నన్ను సర్పంచును చేసిండారు. సిగ్గు మానం లేకుండా నేను జనం దగ్గర అయిన కాడికి అడిగించుకునే దానికే సర్పంచు అయి కూర్చొండాను. అంతా నా ఖర్మ’’ అని ఎడమ చేత్తో నుదురు కొట్టుకున్నాడు.

శంకరయ్య ముందుకు వచ్చి సర్పంచును సముదాయించే ప్రయత్నం చేసాడు.

‘‘ఇప్పుడేమయ్యిందిరా అబ్బోడా. నీ గురించి అందరికీ తెల్సు కదా. ఏదో జనం బాధల్లో ఉండేప్పుడు కోపంలో బాధతో నాలుగు మాటలంటారు. దానికే నువ్వు ఇదయిపోతే ఎట్లా చెప్పు. నీకు ఓపికుండాల. ఇంకా ఎన్ని పదవులు చూడాల నువ్వు ముందు ముందు’’ ఆ మాటలు విని అడ్డంగా తలూపుతూ నవ్వాడు సర్పంచు.

‘‘నేనా.. ఇంకోసారా? నేను గానా ఇంకోసారి ఎలక్షన్లో నిలబడితే నీ ఎడమకాలి చెప్పుతో నన్ను కొట్టు తాతా. అయినా బుద్దీ జ్ఞానం ఉండేవాడు ఎప్పుడూ రాజకీయాల్లోకి రానేరాడు. తెలివైనోడయితే ముఖ్యంగా సర్పంచు పదవి మాత్రం కావాలనుకోడు.’’

సర్పంచు మాటలకు మధ్యలోనే అడ్డమొచ్చాడు కుయ్యప్ప.

‘‘ఏమైందన్నా ఇప్పుడు. పంచాయతీలో పనులు చేసుకునేది, బిల్లులు వసూలు చేసుకునేది, చెక్కులు రాసుకునేది అంతా నువ్వే కదన్నా. పంచాయతీలో అయినా మండలంలో అయినా, కలెక్టర్‌ ఆఫీసులో అయినా యాడైనా నీకుండే పరపతి నీకు ఉండనే ఉంటుంది గదా’’ నవ్వుతూనే అడిగినా కుయ్యప్ప మాటల్లోని వెటకారం అర్థమయ్యి సర్పంచు అతనికి సమాధానం చెప్పే ప్రయత్నం చేసాడు.

‘‘మీరంతా ఇండ్ల కాడ, అరుగుపైన, రచ్చబండ దెగ్గిరా కూర్చుని ఇట్లే అనుకుంటా ఉండారు. సర్పంచు.. పదవికే సర్పంచు. మీరనే గుర్తింపు, గౌరవం మాట ఎట్లా ఉన్నా, ముందు చేతిలోంచి దుడ్లు పెట్టి పనులు చేయించల్ల. కాలువలు శుభ్రం చెయ్యల్ల. ట్యాంకులు శుభ్రం చెయ్యల్ల. ఎక్కడైనా పైప్‌లైన్‌ దెబ్బతినింటే దాన్ని మార్చాల్నా. గేట్‌ వాల్వ్‌ మార్చల్ల. ముందు మనం డబ్బు పెట్టి పనిచేసేటప్పుడు ఎవురూ రూల్స్‌ మాట్లాడరు. పనయిపోతే చాలంటారు. నాకత మళ్లీ కదా ఉండేది.’’

కొంతమంది ఆడవాళ్లు ఖాళీ బిందెలతో అక్కడికి చేరుకున్నారు. వాళ్ల వైపే చూస్తూ తలాడిరచి, ఏదో ఆలోచించుకుని, మళ్లీ గొంతు సవరించుకుని మాటలు కొనసాగించాడు.

‘‘మనం సొంతంగా ఖర్టు పెట్టిండే దుడ్లు గవర్మెంటోడి లెక్క ప్రకారం రూలు ప్రకారం మన చేతుల్లోకి రావల్లంటే మాటలు కాదు. మా తాత మా ముత్తాతలు దిగివస్తారు. ఏయి రికార్డింగ్‌ చేయాలంటే తీర్మానం కావల్లంటాడు. తర్వాత ఎస్టిమేట్‌ అంటాడు. వారం పది దినాలు ఏయి దగ్గరకు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ దగ్గరకు తిరిగితే ఎస్టిమేట్‌ పనవుతుంది. తర్వాత యంబుక్‌ కోసం ట్రెజరీతో చలాన్‌ కట్టాల్నా. ఆ తర్వాత ఆ చలాన్‌ చూపించి ఎండిఒ ఆఫీసులో ఎంబుక్కు తీసుకోవల్ల. మళ్లీ ఇంజనీర్‌ దగ్గరకు పోయి బిల్లు రాసుకోవల్ల. ఆయనడిగే బిల్లులు, రశీదులు, మస్టర్లు అన్నీ తెచ్చివ్వల్ల ` మళ్లింకా డియీ సార్‌ని కలవల్ల. ఆయన ఒక పట్టాన దొరకడు. అక్కడ చెక్‌ మెజర్‌మెంట్‌ అయినాక చెక్కు రాసుకుని ట్రెజరీకి పోతే అక్కడ వాళ్ల దయాదాక్షిణ్యాల పైన మన చెక్కు పాసవుతుందా లేదో ఎంత డబ్బు ఎప్పుడు చేతికొస్తుందో తెలీదు. ఇదంతా ఒక ఎత్తైతే.. వీళ్లెవురూ మనం పోయిన టయానికి దొరకరు. ఇంటి కాడనో, ఆఫీసు కాడనో ఐదారుసార్లు తిరిగీ మళ్లీ వాళ్లను పట్టుకుని వాళ్ల దగ్గర సంతకాలు చేయించుకునే సరికి దేవుడు కనబడతాడు. టౌనుకు పోతే టీలకే ఎంత డబ్బు ఖర్చవుతుందో తెల్సా తాతా. మర్యాదకి టీలు తాపేదానికి, సిగిరెట్లు ఇప్పించే దానికి, వీళ్ల కోసం తిరిగి దానికే నూర్లకు నూర్లు ఖర్చయిపోతాయి. దీనికంతా లెక్కేడవుంటుంది. ఇదంతా అనామత్తు ఖర్చు. ఇదంతా అయినాక సంవత్సరానికోసారి ఆడిట్టోళ్లు వస్తారు. మా అల్లుళ్లని కూడా నేను ఏ పొద్దూ అంత మర్యాదగా చూసిండనంటే నమ్ము. వాళ్లకి ఏ లోటూ ఉండకూడదు. బిర్యానీలే తింటారు వాళ్లు. కంపెనీ నీళ్లే తాగుతారు. మామూలు జనం తినే తిండి, తాగే నీళ్లు వాళ్ల ఒంటికి పడవంట. ఎవురైనా సరే తాత ఏ డిపార్ట్‌మెంటు ఆఫీసరన్నా అయిపోనీలే. ఊర్లోకి రాగానే ఎవుర్ని అడగతాడో మీరే ఇంతకు ముందు చెప్పినారు కదా. వచ్చే వాళ్లందరికీ వాళ్లు ఏం తింటారో దాన్ని వండయినా పెట్టల్ల. లేదా టౌన్‌ లోంచి తెప్పించయినా పెట్టల్ల. ఆ కల్లా సూడు ఆడోళ్లంతా సర్పంచు నా బట్ట వచ్చిండాడు కదా అని ఖాళీ బిందెలు ఎత్తుకుని వచ్చిండారు’’ అని అక్కడ చేరిన ఆడవాళ్లవైపు చూసాడు సర్పంచు. అతని గొంతులో వణుకు స్పష్టంగా తెలిసిపోతోంది.

‘‘మీకు బోరింగు రిపేరు చేయించాల. అది నా బాధ్యత. నాకు బోరింగ్‌ రిపేర్‌ అయిందని నీళ్లు సరిగ్గా రావటం లేదని ఈ ఇలాకాలో ఎవరైనా ముందుగా చెప్పినారేమో… మీరే చెప్పండమ్మా. మీ ఊర్లో నీళ్ల సమస్య ఉండాదని నాకు ముందుగా తెల్వదు. ఇప్పుడే తెల్సింది. మీకూ ఆ బోరింగ్‌ కృష్టప్ప కథ తెలిసిందే కదా. మనిషి ఒక పట్టాన దొరకడు. ఇక్కడంటే అక్కడంటాడు. అక్కడంటే ఇక్కడంటాడు. వాడ్ని పట్టుకుని రెండు రోజుల్లో మీ బోరింగ్‌ రిపేర్‌ చేయిస్తానమ్మా. మీరు ఎలబారండి. ఈ దినం ఈడ ఏదో లోన్లు కోసం పేర్లు రాసుకునేదానికి వచ్చిండాం. లోన్లు కావల్సినోళ్లు ముందుకు రాండి. ఏమ్మా సెక్రటరీ మేడం… ఆ పేర్లు చదువమ్మా…’’

ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గ్రామ సభను ఏదో విధంగా ముగించి ముందు అక్కడి నుండి బయట పడాలనే అతడి ప్రయత్నం కొందరికి అర్థమయ్యింది. కొందరు మాత్రం వేళాకోళంగా నవ్వుతూ సర్పంచు మొహంలో మారుతున్న హావభావాల్నే గమనిస్తున్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అందించిన కాగితాన్ని చేత్తో పట్టుకుని, నిలుచుంది పంచాయతీ కార్యదర్శి.

ఖాళీ బిందెలతో అక్కడకు చేరిన ఆడవాళ్లల్లో కొందరు బిందెలతో వెనుతిరిగారు. నిలబడి జరుగుతున్న తతంగాన్ని చూస్తూ అక్కడే నిలబడ్డారు కొందరు. ఐదారు మంది మాత్రం బిందెల్ని దూరంగా ఉంచి లోన్ల వివరాలు వినేందుకు ఆసక్తిగా గుడి ముందుకొచ్చి నిలబడ్డారు.

పంచాయతీ కార్యదర్శి లలితమ్మ మొహంలో ఎందుకో విసుగు స్పష్టంగా కనబడుతోంది. ఎండ వేడిమికి మొహం పైన కారిపోతున్న చెమటను ఖర్చీప్‌తో తుడుచుకుంది.

ఇద్దరు చిన్న పిల్లలు చెంబులో మజ్జిగ తీసుకుని వచ్చారు. ప్లాస్టిక్‌ గ్లాసులు రమణ ముందుగానే సిద్ధం చేసి ఉంచాడు. వాటిల్లో మజ్జిగ నింపి సర్పంచుకూ పంచాయతీ కార్యదర్శికీ శంకరప్పకూ అందించాడు రమణ.

మజ్జిగ తాగి మరో గ్లాసు మజ్జిగ అడిగి మరీ తీసుకుంది లలితమ్మ. చీర కొంగుతో పెదాలు తుడుచుకుంటూ, రుణపథకాల వివరాలు చెప్పసాగింది.

ఫలానా స్కీం క్రింద పంచాయతీకి ఇన్ని రుణాలు మంజురైనాయని, ఆసక్తి, అర్హత ఉండేవాళ్లు పేర్లు చెపితే తాను రాసుకుంటానంది. ఆమె చెప్పడం ఆపగానే ఒక్కసారిగా అక్కడ కలకలం చెలరేగింది.

‘‘మా పేర్లు రాసుకోండి మేడం. ముందు నాది రాసుకోమ్మా తల్లా. అక్కా మా పేర్లు రాసుకో అక్కా. మేడం ఇంట్లో ఎందరికిస్తారు? ఇంటికి ఒకటేనా? ఎన్నయినా ఇస్తారా? మేడం నేనూ మా ఆయనా ఇద్దరూ రాసుకోవచ్చా? మేడం ఏయే లోన్లు ఇస్తారు? సబ్సిడి ఎంత? బ్యాంకు లోన్‌ ఎంత? ష్యూరిటీ ఏం అడగరా బ్యాంకోళ్లు. అయినా తల్లీ ఈ లోన్లన్నీ నిజంగా వస్తాయంటావా?’’

ఒక్కసారిగా ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడ్డం మొదలయ్యే సరికి అక్కడ ఎవరేం మాట్లాడుతున్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. గొంతు పెంచి అరచలేక నిస్సహాయంగా రమణ వైపు చూసి ‘‘రమణా’’ అంది పంచాయతీ కార్యదర్శి.

రమణ చప్పట్లు తడుతూ గట్టిగా అరిచాడు ‘‘అన్నా, అక్కా అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. దయచేసి ఎవరూ మాట్లాడవద్దు. మేం అడిగినదానికి మాత్రం జవాబు చెప్పండి. ఒక్కొక్కళ్లనే అడుగుతాం. అంతా కూర్చోండి. ప్లీజ్‌’’ పెద్ద గొంతుతో చెప్పిందే రెండు మూడు సార్లు రమణ అరచి చెప్పాక అక్కడ అంతా సద్దుమణిగింది. ఉన్నట్లుండి గుంపు చెదిరిపోయింది. జనాలు పక్కకు తప్పుకుంటుంటే, ఏం జరిగిందా అని సర్పంచు, పంచాయతీ కార్యదర్శి, రమణ ముగ్గురూ ఒకేసారి తలలు తిప్పి అటు వైపు చూసారు.

శంకరయ్య చివాలున లేచి నిలబడ్డాడు. ‘‘ఎన్ని తూర్లు చెప్పాలమ్మే నీకు. గుడిసె వదిలి బయటకు రావద్దని. మానం మర్యాద, చిన్నా పెద్దా అనే భయమే లేదు. ముందిక్కడ నుండి ఎలబారి పోమ్మే. నీకు ఇక్కడేం పని’’ అంటూ కసురుకున్నాడు.

‘‘అసలా అమ్మాయిని ఊర్లోంచే దూరంగా ఎక్కడికైనా తరిమేద్దాం అంటే పిలకాయలు ఒప్పుకోలే. పోనీలే ఆడబిడ్డ బతికింది, ఏదో ఒక మూలన పడి ఉంటుంది అనుకుంటే.. గుడిసె వదిలి ఊర్లోకి వస్తా పోతూ ఉంటే ఊర్లో జనాలకు రోగాలు రాకుండా ఉంటాయా? ముందు ఆ ఆడదాన్ని ఇక్కడి నుండి పంపేయండి’’ గట్టిగా అరుస్తున్నాడు కుయ్యప్ప.

చెదిరిపోయిన గుంపు మధ్యలో బెదురు చూపులతో, ఎముకల గూడులా నిలుచుని ఉందామె. జుట్టు రాలిపోయింది. చీరను బట్టి ఆ ఆకారాన్ని స్త్రీగా గుర్తించాల్సి వస్తోంది.

రెండు చేతులూ జోడిరచి ‘‘గవర్మెంటోళ్లు వచ్చిండారంట కదా. నాకేదైన సహాయం చెయ్యండయ్యా. పుణ్యం ఉంటుంది’’ అని మాత్రం అంది. ఆ గొంతు స్త్రీ గొంతులా లేదు. మగ గొంతులానూ లేదు. అసలా కంఠస్వరాన్ని ఎవరిదో పోల్చుకోవడం కూడా కష్టమే.

ఆ మాట మాత్రం అప్పచెప్పి ఆమె అక్కడి నుండి కదిలింది. ఆమె కనుమరుగయ్యేంత వరకూ చూసి, తర్వాత కూర్చున్నాడు శంకరయ్య. తలవంచుకునేశాడు మెల్లగా.

‘‘ఎవరామె ఇంతకు ముందెప్పుడూ ఊర్లో కనబడినట్లు లేదే’’ రమణవైపు చూస్తు అడిగింది పంచాయతి కార్యదర్శి. మెల్లగా తలపైకెత్తాడు శంకరయ్యా. అతని మొహం నిండా బాధ కనబడుతోంది.

రమణ ఏం చెప్పాలా అన్నట్లు తడబడి శంకరయ్య వైపు చూసాడు. అతడి అవస్థ గమనించి శంకరయ్యే నోరు మెదిపాడు.

‘‘నాకు మనవరాలి వరస అవుతుందిలేమ్మా. మొగుడు చచ్చిపోయాడు. వాడు పోయాక తెలిసింది. ఆమెకు ఎయిడ్స్‌ అని. దాని మొగుడు జబ్బు విషయం దాచిపెట్టి వాడి దారిన వాడు దీన్ని అనాథలా వదిలేసి పోయాడు. దాని అదృష్టం దానికి పిల్లోల్లు లేరు. ఎవరో ఒకరు దయపెట్టి అంత సంగటి వేస్తే తిని బతకతా ఉండాది. దాని జబ్బు బాగవ్వాలంటే మంచి తిండి, మందూ మాత్రలు, పండ్లు, కూరగాయలు తినాలంటారు. అవన్నీ ఎక్కడ కుదురుతుంది లేమ్మా. దాని టయిం అట్లా ఉండాది. దేవుడు చిన్నసూపు చూసినాడు లేమ్మా. దాని పేరు విశాలాక్షి.’’

జనంలో అక్కడక్కడా గుసగుసలూ మొదలయ్యాయి.

‘‘మీరందరూ ఒప్పుకుంటే, సరేనంటే మేం సర్వే చేసి, విచారించి గుర్తించిన అర్హుల పేర్లు మీకు ఇక్కడే ఇదే గ్రామసభలో చదివి వినిపిస్తాం. మీరందరూ సరేనంటే వీళ్లకి గవర్నెంటు ద్వారా సబ్సిడీ, బ్యాంకుల ద్వారా అప్పులు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఏమంటారు?’’

తడబాటు లేకుండా స్పష్టంగా మాట్లాడుతున్న పంచాయతి కార్యదర్శి మాటలకు ఈసారి ఎవరూ అడ్డొచ్చే ప్రయత్నం చెయ్యలేదు.

సర్పంచు లేచి నిలబడ్డాడు. అందరి దృష్టీ అతడిపైనే నిల్చింది. ‘‘ప్రతి సంవత్సరం గవర్నెంటు, బ్యాంకులు కలిసి అప్పులూ, సబ్సిడీలూ ఇస్తానే ఉంటాయి. ఊర్లో ఉండే పెద్ద మనుషులు వాళ్లూ వాళ్లూ మాట్లాడుకుని ఏవో నాలుగు దొంగ పేర్లు రాసి బీనామీల్ని చూపించి సబ్సిడీ సొమ్ము స్వాహా చేస్తా ఉంటారు. ఎవురికి ఏం లోన్‌ మంజూరైందో ఎవరికీ తెలియదు. ఇప్పుడట్లా కాకుండా మీ అందరికీ తెలిసే రకంగా, మీ అందరి ఆమోదంతోనే రుణాలు మంజురుకు పేర్లు సిఫారసు చేద్దాం అనుకుంటున్నాం. మాకు మీ సహకారం అవసరం. మీరు కాదూ కూడదూ అంటే మా ఎంపిక మేం చేసుకుంటాం. మా పద్ధతులేవో మాకు ఉండనే ఉన్నాయి.’’

సర్పంచు కూర్చున్నాక ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. మెల్లగా ఎవరో గొణుక్కుంటున్నారు. కానీ పెద్దగా ఎవరి దగ్గర నుండీ వ్యతిరేకత రాలేదు.

హఠాత్తుగా గుంపులోంచి ఓ కుర్రాడెవరో ఇరవయ్యేళ్ల లోపు వయస్కుడు, ముందుకొచ్చి బొంగురు గొంతుతో అరవటం మొదలుపెట్టాడు.

‘‘అయినా మీరే ఎంపిక చేసేటట్లయితే ఇంక ఈ గ్రామసభ ఎందుకు? మాకేం పనీ పాటా లేదని ఇక్కడికి రమ్మన్నారా? మా అందరికీ నచ్చేలా మీరే ఎంపిక చేస్తామని అంటున్నారు కదా. ముందా పేర్లేమిటో చదివి వినిపించండి. వాళ్లకంత అర్హత ఉందో లేదో మేం తేలుస్తాం.’’

ఆ కుర్రాడి మాటలు పూర్తయ్యేంత వరకూ ఆగలేకపోయాడు రమణ.

‘‘ఒరే హనుమంతూ కూర్చోరా. ఎందుకట్లా అబ్బరిస్తా ఉండావు’’ అన్నాడు రమణ ఆ కుర్రాడికి అడ్డొస్తూ.

రమణ అట్లా మాట్లాడేసరికి ఆ కుర్రాడికది అవమానంగా అనిపించినట్లయ్యిందేమో. గొంతు మరింత పెంచాడు.

‘‘రమణా మీది ఈ ఊరు కాదు. మా కులమూ కాదు. నువ్వెందుకు మధ్యలో తల దూరుస్తావు? నీ పని నువ్వు చూసుకో. ఇది మా ఊరి వ్యవహారం. ఏదైనా అడిగే హక్కు, తెలుసుకునే హక్కు మాకుంది’’ అన్నాడు హనుమంతు. అతడికి తోడుగా మరో ఇద్దరు కుర్రాళ్లు అతని పక్కన నిలబడ్డారు.

ఏదో మాట్లాడబోతున్న రమణను వారించి, పంచాయతి కార్యదర్శి హనుమంతుకు సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది.

‘‘నిరుపేదల్లో నిరుపేదల కోసం ఉద్దేశించిన రుణాలు చాలా వరకు బినామీల పేరుతోనే స్వాహా అయిపోతూ ఉన్నాయి తమ్ముడూ. నేను కింది స్థాయి కులాల నుండి వచ్చినదాన్ని. మన ఎంపిడిఒ కూడా రిజర్వ్‌డ్‌ కులాలకు చెందిన వ్యక్తి కావడం వల్లే ఏదో ఎండిఒ ఆఫీసులో కూర్చుని నాయకులు, విలేకరులు, కుల నాయకులు, దళారులు చెప్పే పేర్లు రాసి రుణాలు మంజూరు చేసే పురాతన సంప్రదాయాన్ని కాదని, ఇట్లా నన్ను మీ ఊరికి పంపించారు. ఒక మంచి వ్యక్తి మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు అతనికి సహకరించాలని నేను, సర్పంచు అనుకున్నాం. ఎవ్వరూ ఈ లబ్ధిదారుల ఎంపికలో చెయ్యేత్తి చూపించని విధంగా అర్హుల జాబితా ఉండాలనుకున్నాం. ఇదంతా మీకు అర్థం అవుతుందనే అనుకుంటాను. మీకు తెలుసో తెలియదో ఒక నాయుడో, రెడ్డో, ఇంకో అగ్రవర్ణాల అధికారో కులపిచ్చి చూపిస్తే చెల్లుబాటు అయినట్లు ఒక ఎస్సీనో, ఎస్టీనో, బీసీ అధికారో తన కులం వాళ్లకు ఏదైనా మంచి చేద్దామని చూస్తే అదెంత మాత్రమూ జరగనివ్వరు పెద్దోళ్లు. నా సర్వీసులోనే నేను మొదటిసారి చూస్తా ఉండాను. ఒక తపన కలిగిన పేదల పక్షపాతి అయిన ఆఫీసర్ని. ముందు మేం రుణాల మంజూరు కోసం ఎంపిక చేద్దామనుకోనుండే వాళ్ల పేర్లు, వివరాలు మీ అందరికీ చదివి వినిపిస్తాను. అంతా నెమ్మదిగా విని మీ అభ్యంతరాలు, సూచనలు ఏవన్నా ఉంటే చివర్లో చెప్పండి’’ అంది లలితమ్మ.

ఆ మాటలంటున్నప్పుడు ఆమె మొహంలో ఏదో వెలుగు తళుక్కుమంది. సూటిగా గుండెలోపల నుండి వచ్చిన ఆ మాటలు హఠాత్తుగా అక్కడొక నిశ్శబ్ధకర వాతావరణాన్ని ఏర్పరచాయి. చాలా మందికి ఆ మాటలు స్పష్టంగా అర్థమైనట్టే అనిపించాయి వాళ్ల మొహాలు చూస్తే. కొంతమందికి అర్థం కాకపోయినా, ఏదో వింత జరగబోతుంటే చూస్తున్నట్లు చూస్తుండిపోయారు.

చంటి బిడ్డ ఎక్కడో కేర్‌మని ఏడుపు మొదలు పెడితే, వాళ్లమ్మ ఆ పసిబిడ్డను సముదాయిస్తూ పాలు తాపించే ప్రయత్నం మొదలుపెట్టింది. క్షణాల్లో ఆ చంటి బిడ్డ ఏడుపు కూడా ఆగిపోయింది. మళ్లీ అంతటా నిశ్శబ్దం అలుముకుంది.

కుయ్యప్ప, నాగవేలు, మునిరాజులు, శంకరయ్య, చివరికి హనుమంతు, రమణ కూడా మంత్రించినట్లు నిశ్చలంగా లలితమ్మ వైపే నిశ్శబ్ధంగా చూస్తుండిపోయారు.

‘‘మేనపాటి శాంతమ్మ. ఈమె భర్త యాక్సిడెంట్‌లో నెల క్రితం చనిపోయాడు. ఐదు మంది పిల్లలున్నారు. ఇప్పుడామె ఎనిమిదో నెల గర్భిణి… ఇంకొక పేరు కావాటి నారాయణప్ప. కుడి చేయి లేదు. మీకూ తెల్సు. చెరుకు గానుగాడుతూ చెయ్యి పోగొట్టుకున్నాడన్న సంగతి. మూడో లోన్‌ ఇందాక ఇక్కడికి వచ్చి వెళ్లిందే.. ఆ విశాలక్ష్మమ్మకు. ఇప్పుడు చెప్పండి. ఏవైనా లోటుపాట్లు ఉంటే’’ లలితమ్మకు ఎవరూ జవాబు చెప్పే ప్రయత్నం కానీ ఆమె మాటలకు బదులు మాట్లాడే ప్రయత్నం కానీ చెయ్యలేదు. కానీ హనుమంతు ఆమె ముందుకొచ్చి నిలబడ్డాడు.

‘‘మేడం పొరపాటుగా మాట్లాడినాను. ఏం అనుకోకండి. మీరు ఇందాక చదివిండే పేరు నారాయణప్ప మా నాయినే. మేం లోన్‌ అడక్కపోయినా, మా అవసరాన్ని గుర్తించారు చాలా థ్యాంక్స్‌ మేడం’’ అంటూ కళ్లనిండా నీళ్లు పెట్టుకునేసాడు హనుమంతు. ఏడుపు అడ్డు రావటం వల్ల అంతకు మించి మాట్లాడలేకపోయాడు.

శంకరయ్య నమ్మలేనట్లు అయోమయంగా లలితమ్మ వైపు చూస్తూ చేతులు జోడిరచి ‘‘చాలా సంతోషం తల్లీ’’ అని మాత్రం అనగలిగాడు.

గుంపులోంచి పెద్దవాళ్లెవరో ముందుకు బలవంతంగా తోస్తే ఇద్దరాడపిల్లలు లలితమ్మ ముందుకొచ్చి బిత్తర చూపులు చూస్తూ నిలబడ్డారు. గుంపులోంచి ఎవరో నోరు కదిపారు.

” మేడం మీరు ఇందాక చెప్పిండ్లా…శాంతమ్మ.. ఆయమ్మ బిడ్డలే వీళ్లు”

భయపడుతూ వెనక్కి వెనక్కి నడుస్తున్న ఆ ఆడపిల్లలిద్దర్నీ రెండు చేతులూ చాపి తన ముందుకు లాక్కుంది లలితమ్మ. కిందకు వంగి చాపపైన స్టీలు పళ్లెంలో రమణ తెప్చించి ఉంచిన బిస్కెట్‌ పాకెట్స్‌ చెరొకటి అందించింది.

ఆ పిల్లలిద్దరికీ ఒంటి నిండా సరైన బట్టలైనా లేకపోవడాన్ని, ఎండిపోయినట్లున్న ఆ దీనపు ముఖాల్ని చూస్తుంటే లలితమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

గ్రామసభ ముగించుకుని పంచాయతి కార్యదర్శి, సర్పంచు ముందుగా అక్కడి నుండి కదిలారు. వారి వెనుకే రమణ మిగతా సరంజామా అంతా బ్యాగ్‌లో సర్దుకుని బయలుదేరాడు. పిల్లలు కొందరు గుడి ముందు చేరి ఆటలు మొదలుపెట్టారు. ఎవరి తాలూకు కుర్చీలు, చాపల్ని వాటి యజమానులు తీసుకుపోతున్నారు.

రెండు కుక్కలు ఒకదాన్నొకటి తరుముకుంటూ వీథుల వెంట అరుచుకుంటూ పరుగులు తీస్తున్నాయి.

బాయిలర్‌లో బొగ్గుల్ని, నిప్పుకణికల్ని కలిపి కలబెడుతూ, కళ్లు మూసుకుని నోటినిండా గాలి ఊదుతూ నిప్పురాజేసాడు మునిరాజులు. కాసేపట్లో అక్కడ చేరిన అందరికీ టీ గ్లాసులు అందాయి.

బోరింగ్‌ దగ్గర మళ్లీ కిర్రుమని చప్పుడు కావటంతో అందరూ తలలు తిప్పి అటు వైపు చూసారు. యాభై దాటి ఉంటుంది వయసు. మొహం నిండా, చేతుల పైనా ముసలితనం తాలూకు మడతలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి.

‘‘కడుపాత్రం పిలకాయలు బెంగుళూరు చేరిపోయినా ముసలోళ్లు మాత్రం రేషన్‌ బియ్యం కోసం, పించనీ డబ్బు కోసం ఊర్లోనే నిలిచిపోయినారు. ఈ వయసులో ఈ గోవిందమ్మకు ఏం కష్టమో చూడప్పా. బిందెడు నీళ్లు సాధించేదానికి ఆ ముసలామె వల్ల అవుతుందా ఏమైనా’’ అంటున్నాడు కుయ్యప్ప.

‘‘ఇది ఊరు కదా. మనిషిని మనిషే ఆదుకోవల్ల. లేదంటే దీన్ని ఊరని ఎట్లా అంటారు. రేయ్‌ అబ్బోడా నువ్వు పోయి ఆ నీళ్ల కతేందో చూడ్రా’’ అన్నాడు శంకరయ్య ఖాళీ అయిన టీ గ్లాసును మునిరాజులు చేతికి అందిస్తూ.

ముందు హనుమంతు కదిలాడు. అతడి వెనుకే చురుగ్గా నాగవేలు కూడా కదిలాడు. ఇద్దరూ కలిసి ముసిలామెను పక్కకు జరిపి బోరింగ్‌ హ్యాండిల్‌ను చెరోవైపు పట్టుకుని, ముందుకూ వెనక్కూ ఊగిపోతే, హుషారుగా, జోరుగా భూమి లోతుల్లోంచి నీటిని పైకి రప్పించే ప్రయత్నం ప్రారంభించారు.

‘‘రమణగాడ్ని అడిగి బోరింగ్‌ క్రిష్టప్ప సెల్‌ఫోన్‌ నంబరెందో తీసుకోవాల తాతా. వాడు అదీ ఇదీ అంటావున్నాడంటే మనమే ఎవరో ఒకర్ని స్కూటరిచ్చి పంపించాల. ఎవర్దో ఎందుకు? నా స్కూటరే పంపిస్తా. రెండు పైపులు దించితే చాలు నీళ్లు పైకి వస్తాయి. రేపీ పాటికి బోరింగు రెడీ అయిపోవల్లంతే. ఆరూ నూరయినా, నూరు ఆరయినా రేపీ పాటికి బోరింగ్‌ రెడీ అయిపోవల్ల అంతే’’ మునిరాజులు గొంతు కొత్తగా ఉంది. ఆ గొంతులో ఏదో ఉత్సాహం, ఏమిటో ఉత్తేజం ధ్వనించాయి.

బోరింగు శబ్ధం అంతకంతకూ పెరుగుతూ ఉంది. బిందె నిండుతూ ఉంది.

కథ : పలమనేరు బాలాజీ

కథాచిత్రం: కాశిరాజు

కథాసారంగ టైటిల్ : మహీ పల్లవ్

Download PDF

10 Comments

 • aparna says:

  మీరింకా చాల కథలు రాయాలి సర్! ఇలా కొన్ని కథలే రాస్తే ఎలా..ఈ కథ బావుంది అని మామూలు కామెంట్లు ఇవ్వడం సరికాదనిపిస్తుంది. చాలా హ్ర్దయం గ ఉంది. ఇలాంటి కథలు ఇంకా వస్తే బావుంటుంది. థాంక్ యు!

 • kaasi raaju says:

  మంచి కథ , అందరికంటే ముందుగా చదివే అదృష్టం నాకు కూడా దక్కింది ! బాలాజీ గారికి ధన్యవాదాలు !
  సారంగ నిర్వాహకులకు కూడా ధన్యవాదాలు .

 • Radha says:

  బాలాజీ గారూ,
  చాలా బావుంది. నిజంగా ఎవరికి అవసరమో వాళ్లకి లోన్లు ఇచ్చే ఆఫీసర్స్ ఉంటారు. కాని పల్లెల్లో వాళ్ళే పోటీలతో అవసరమైన వాళ్లకి రానీయకుండా అడ్డుపడుతుంటారు. తర్వాతైనా సరే వీలయితే ఈ కథ ఎక్కువ మందికి చేరేట్లు చూడండి. ముఖ్యంగా పల్లెల్లో ఉండే వాళ్లకి.
  అభినందనలతో,
  రాధ

 • KUPPIREDDY AMAR says:

  ఈ కథ కొత్తగా స్పష్టంగా ఉంది.పల్లెలు మారాలి.అధికారులు మారాలి.మన కథలూ మారాలి.ఒక మంచి కథ.శుభాకాంక్షలు

 • మణి says:

  ఒక మంచి కథ.అభినందనలు.

 • పంచాయతీరాజ్ సంస్థలతోనూ, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా మరియు పారిశుధ్య విభాగంతోనూ, ఎయిడ్స్ కు సంబంధించిన కార్యక్రమంతోనూ పనిచేసిన అనుభవాలు నావి. ఇలాంటి సందర్భాలు, ఘటనలూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ లలో ఫస్ట్ హ్యాండ్ గా అనుభవించాను. గ్రామ సభను, ఆ ప్రాసెస్ ను, వాద్వివాదాలను, సమస్యలను చక్కగా ఎత్తిచూపడమే కాకుండా ఒక లోతైనా సామాజిక నిర్మాణానికి సంబంధించిన సూచనను చూచాయగా అందించిన అద్భుతమైన కథ ఇది. ఇలాంటి కథల ద్వారానైనా ఈ తరం గ్రామీణ సామాజిక రాజకీయ తీరులకి సంబంధించిన నిజాల్ని తెలుసుకుంటుందేమో. మిగతా ఆర్ట్ ఫార్మ్స్ లో ఆ ఆస్కారం లేకుండా పోయింది ఈ మధ్య. నాకు కథ బాగా నచ్చింది.

 • లలిత మేడం, రమణల్తో మేం కూడా ఆ ఊరికి వెళ్లిపోయాం. చాలా బాగా వ్రాశారు బాలాజీ గారు. ఆ ఋణం మంజూరు యువతలో ఎంతటి ఉత్సాహాన్ని నింపిందో.. చివర్లో కళ్లు చెమ్మగిల్లాయంటే అతిశయోక్తి కాదు. అటువంటి అధికార్లు అన్ని ఊర్లలో ఉంటే ఎంత బాగుండు..

 • Thirupalu says:

  బాలాజీ గారూ!
  కధ చాలా అద్బుతంగా రాసారండి. కానీ, ఇది ఒక కలేనా లేక మనపల్లెల్లో ఇలాటివి జరుగుతున్నాయా? జరిగినా జరగక పోయినా మీ కధ చదివి జరిగినట్లే సంతోషం కలుగుతుంది.

 • manibhushan says:

  చాలా బాగుంది. ఈమధ్య కథల్లో కాల్పనికత ఎక్కువై జీవితం తరిగిపోతోంది. ఆ లోటును బాలాజీలాంటివాళ్ళు పూరించే ప్రయత్నం చేస్తున్నందుకు అభినందనలు.

  ఓ చిన్న లోపంకూడా ఉంది. ఆది నుంచి అంతానికి వచ్చేసరికి మాండలీకం వ్యావహారికంలోకి మారింది. బహుశా కథ రాస్సేక రచయిత చదివి ఉండరు.
  ——-
  ఓ జర్నలిస్టుగా తెలంగాణ ప్రాంతంలో గ్రామ సభలకు, డ్వాక్రా గ్రూపుల మోటివేషన్ మీటింగులకు, గ్రామీణ మహిళా విలేకరుల తరగతులకు వెళ్ళాను. వాటిలో ఎక్కడా -కథలో మాదిరిగా- కుర్చీలలో అధికారులు కూర్చోవడాన్ని చూడలేదు. పి.ఓ. అయినాసరే, అందరితో పాటే చాపలమీద కూర్చోనేవారు. మొయినాబాద్ మండలం (RR dist)లో మహిళా శిశు భవన్లోనైతే తాము తిన్న కంచాల్ని వారే కడిగి పక్కన పెట్టడం నాకు తెలుసు.

 • mahamadali a1 xerox says:

  mee kathalu chala baguntai sir

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)