‘ఆర్గానిక్’ కూడా ఒక మార్కెట్ మాయ!

ఎస్. నారాయణస్వామి

ఎస్. నారాయణస్వామి

 

సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథల్లో భోజనచక్రవర్తి అని ఒక కథ ఉన్నది. అప్పంభొట్లు అసామాన్యమైన తిండిపుష్టి కలవాడు. ఒకసారి పోటీమీద రెండు గంగాళాల ఆవడలు పెరుగుతోసహా జుర్రిపారేసి ఊరి ప్రజలందరినీ దిగ్భ్రాంతుల్ని చేసిన మూర్తీభవించిన జఠరాగ్ని అతను. ఇంకో కథలో బావగాడు అనబడే కనకారావు కార్తీకసమారాధన వనభోజనాలలో రకరకాల తెలుగు వంటల్ని, కాయల సెలెక్షన్ దగ్గర్నించీ, ఏ కూర ఎలా వండాలో, ఏ రుచి ఎలా ఉండాలో దగ్గరుండి వండించి, స్వహస్తాలతో అందరికీ వడ్డించి పరవశించినవాడు. 

రెండు మూడు తరాల కిందట గోదావరి జిల్లాల సంపన్న బ్రాహ్మణ కుటుంబాల్లో పంక్తిభోజనాల పద్ధతుల్నీ మర్యాదలనీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు అనేక రచనల్లో చాలా విపులంగా వర్ణించారు. అడివి బాపిరాజు గారి నారాయణరావు నవల్లో ఆంగ్లో ఇండియన్ వారి దగ్గర్నుండీ వివిధరకాల ప్రజల ఆహారపు పద్ధతుల్ని వర్ణించారు. అంతదాకా ఎందుకు, ఈ మధ్యకాలంలో సినిమా ద్వారా కూడా తెలుగువారికి బాగా దగ్గరైన కథ ‘మిథునం’ (శ్రీరమణ)లో అప్పాదాసు మొదణ్ణించీ చివరిదాకా వంటకి సంబంధించిన ఏదో ఒక విషయం మీద భార్యతో గొడవపడుతూనే ఉంటాడు. 

timthumb.php

ఇదంతా చెప్పుకు రావడం ఎందుకంటే ఒక జాతి సాంస్కృతిక అస్తిత్వంలో భోజనానికీ, భోజన పద్ధతులకీ చాలా ముఖ్యమైన భూమిక ఉన్నది అని చెప్పడానికి. మా అమ్మానాన్నల పెళ్ళైన కొత్తలో అప్పుడు బాగా కరువురోజులు. మా నాన్నగారు అత్తారింటికి వెళ్ళిన సందర్భంలో భోజనంలోకి నెయ్యి లేకపోయేటప్పటికి – ఇంటికొచ్చిన కొత్తల్లుడికి నెయ్యి లేకుండా భోజనం పెట్టాల్సొచ్చిందని మా అమ్మమ్మా తాతయ్యా మహా గుంజాటన పడిపోయారుట. కేవలం ఒక్క తరం కిందట నెయ్యి లేకుండా భోజనం చెయ్యడం, పెట్టడం అమర్యాదయే కాదు, అనాగరికం కూడా అనిపించుకునేది. అదే ఇవ్వాళ్టి రోజున – విందుభోజనాల సంగతి పక్కన పెట్టండి – ఆంధ్రదేశంలోనే ఎవరైనా బంధుమిత్రుల ఇంటికి భోజనానికి వెళ్తే, నెయ్యి వడ్డించడం సంగతి దేవుడెరుగు, అసలు ఇంట్లో నెయ్యి ఉన్నదో లేదో అనుమానించవలసిన పరిస్థితి. అలాగే ఆచారాల ప్రకారం మన వంటల్లో విరివిగా వాడుతూ ఉండిన కొబ్బరి, నువ్వులు, బెల్లం, ఇవన్నీ కూడా మరుగున పడిపోయాయి – ఏవిటయ్యా అంటే, ప్రతీ వాళ్ళకీ షుగరు, బీపీ, కోలెస్టరాలు భయం.
తమాషాగా, మెక్డొనాల్డ్స్, పిజ్జా హట్, కెంటకీ ఫ్రైడ్ చికెన్ వంటి మెగా ఆహార వ్యాపారాలకి పుట్టినిల్లైన అమెరికాలోనూ గత ఇరవయ్యేళ్ళగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని గురించి అవగాహన పెరుగుతూ వచ్చింది. ఆ అవగాహన అందోళనగా పరిణమించి, కొండకచో ఉద్యమంగా ఎదిగి ఇంతింతై అన్నట్టు అదొక విశ్వరూపాన్ని దాల్చిందిప్పుడు. ఈ విశ్వరూపానికి బహుముఖాలున్నాయి. స్థానికంగా పెంచిన ముడిపదార్ధాలని వాడడం, ఆర్గానిక్ గా పెంచిన ముడిపదార్ధాలని వాడడం, తినుబండారాల ఉత్పత్తిలో భారీ యంత్రాలని ఉపయోగించకపోవడం, అన్నీ “సహజమైన” ముడిపదార్ధాలని వాడడం .. ఈ ముఖాలలో కొన్ని. అమెరికా ఎప్పుడూ Meat and Potatoes దేశమే. తరతరాలుగా తక్కువ ఖరీదుకి బర్గర్లు, పిజ్జాలవంటి జంకు ఫుడ్డు తినడం మరిగి, వొళ్ళు కొవ్వు పట్టి ఉన్న అమెరికను ప్రజానీకానికి ఒక్కసారిగా జ్ఞానోదయమైనట్టు, దేశం మొత్తం ఒక్క మనిషిలాగా ఈ ఆరోగ్యకరమైన ఆహార విశ్వరూపాన్ని ఆహ్వానించింది. ఎటొచ్చీ ఎంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటున్నా దేశపు ఆరోగ్యం మెరుగుపడ్డం లేదట.
జంకు ఫుడ్డు వొంటికి మంచిది కాదు అని ప్రత్యేకంగా పనిగట్టుకుని చెప్పక్కర్లేదు – విపరీతమైన కొవ్వు, ఉప్పు, చక్కెరతో నిండి ఉన్న ఈ తిండి సంగతి స్పష్టంగా తెలుస్తూ ఉన్నదే. పైగా అవన్నీ ఎక్కడో ఫేక్టరీలో తయారై, ఎన్నెన్నో రోజులు ఫ్రీజర్లలో నిలవచెయ్యబడి, అప్పటికప్పుడు వేడిచేసి వడ్డిస్తున్న వ్యవహారం. దీనికి పూర్తి వ్యతిరేకంగా స్థానికంగా పండించిన కూరగాయలు, పండ్లు, ఇతర ముడి పదార్ధాలు, సహజ ఉత్పత్తులు, .. ఆహా ఎంత స్వఛ్ఛంగా, ఆరోగ్యంగా ఉంటుందో ఆ వంట! అనిపించక మానదుగదా! అసలే కేలిఫోర్నియాలో ఆ ఆరోగ్యం పిచ్చ బాగా ఎక్కువ. హాలీవుడ్ ప్రాంతాల్లో ఆరోగ్యకరమైన స్వఛ్ఛమైన భోజనానికి బాగా పేరుపడ్డ రెండు రెస్టారెంట్లలో బాగా జనాదరణ పొందిన కొన్ని వంటకాలని ప్రయోగశాలల్లో విశ్లేషించినప్పుడు కొన్ని ఆసక్తి కరమైన సత్యాలు బయటపడ్డాయి. వొళ్ళు పెరగడానికి బాగా దోహదం చేసే కొవ్వూ, పిండిపదార్ధాలూ ఈ వంటకాల్లో చాలా హెచ్చుగా ఉన్నాయి. ఇందులో వాడిన ముడి సరుకు స్థానికమైనదీ, తాజాదీ అయితే అయుండవచ్చునుగానీ, శరీరానికి కొవ్వు పట్టకుండా ఉంచడానికి మాత్రం ఎటువంటి సహాయమూ చెయ్యదు ఇటువంటి ఆహారం.
images12
ఇదే కాదు, మంచి ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం అని విపరీతంగా ప్రకటనలు గుప్పించే అనేక సూపర్ మార్కెట్లలో షెల్ఫుల మీదున్న ఉత్పత్తులని చూసినా మనకి ఈ విషయం తెలుస్తూనే ఉన్నది. ఈ మాత్రానికి ఏ లేబరేటరీకో వెళ్ళనక్కర్లేదు – రకరకాల పొటేటో లేక వెజెటబుల్ చిప్సు, రకరకాల తీపి వంటకాలు, చాక్లెట్లు, మరెన్నో రకాల పాస్తా వంటి పిండిపదార్ధాలు – వాటి మీద “సహజం, ఆర్గానిక్, ఫలానా ఆరోగ్యకరమైన అంశాలతో  వృద్ధి చెందినది” ఇత్యాది పదజాలంతో మన కళ్ళనూ మనసునూ మాయజేసే వర్ణప్రపంచం కనిపిస్తుంది, కానీ లేబుల్ ని కాస్త విశదంగా పరీక్షిస్తే – ఔన్సుకి ఔన్సు, కేలరీకి కేలరీ – ఇవన్నీ మెక్డనాల్డ్సు వాడు అమ్మే బర్గరు + ఫ్రెంచి ఫ్రై భోజనానికి తీసిపోకుండా ఉన్నాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే, కొన్ని సందర్భాల్లో జంకు ఫుడ్డే మెరుగ్గా ఉన్నదేమో కూడాను. మొత్తానికి తెలుస్తున్నదేవిటంటే – వొళ్ళు పెరగడానికి ముఖ్య కారణం భోజనంలో ఉండే కొవ్వు, పిండిపదార్ధాలూ కాగా, ఇప్పుడు మంచి ఆహారం పేరిట చెలామణి అవుతున్నదానిలో చాలా భాగం ఆ విషయంలో తినేవారి ఆరోగ్యానికి దోహదం చేసేలా లేదు.
సహజమైన ఆహారంకూడా జంకు ఫుడ్డు లాగానే వ్యాపార సంస్థల వ్యాపార సూత్రం మాత్రమే అయుంటే అదొక తీరుగా ఉండును. కానీ, ఈ విషయం, ఈ సూత్రం వ్యాపారాన్ని మించి – వ్యాసం మొదట్లో చెప్పినట్టు – ఒక ఉద్యమంగా, ఇంచుమించు ఒక సరికొత్త మతంగా పరిణమించింది. కొందరు పేరు పొందిన పాత్రికేయులు (E.g. Michael Pollan) ఈ మతానికి ప్రధాన మతాచార్యులు. టీవీలోనూ పత్రికల్లోనూ తారలుగా వెలుగుతున్న వంటవారు (Chefs, e.g. Mark Bittman) ప్రధాన అర్చకులు. పుస్తకాల ద్వారా, పత్రికల ద్వారా, టీవీలో, విడియోల్లో వీరందరూ కలిసి చేస్తున్న ప్రబోధాలు మధ్యతరగతి అమెరికన్ల మనసుల్ని చాలా ప్రభావితం చేస్తున్నాయి. తద్వారా వారి అలవాట్లని ఎంత ప్రభావితం చేశాయో తెలియదు గానీ వారి కొనుగోళ్ళని మాత్రం చాలా మార్చివేశాయి.
గత ఇరవయ్యేళ్ళలో ఈ “సహజ ఆహారం” ఒక స్వతంత్రమైన ఇండస్ట్రీగా ఎదిగింది. వచ్చిన తంటా ఏవిటంటే ఈ ప్రవచనాలు చెప్పే మహానుభావులెవ్వరూ వైద్యంలో కానీ, శరీరతత్వ శాస్త్రంలో కానీ, ఆహార శాస్త్రం (Nutritional science)లో కానీ పట్టభద్రులు కారు. ఆహారపు అలవాట్లు, శరీరతత్వం మీదనూ, ఆరోగ్యం మీదనూ వాటి ప్రభావాన్ని గురించి కొన్ని పరిశోధనలు జరిగాయి కానీ శాస్త్రీయమైన గమనికలు గానీ, ఇతర నిర్ణయాలు కానీ బయటికి రాలేదు. ప్రజల జీవితాలని ప్రభావితం చేసే అనేక సమస్యలకి శాస్త్రీయంగా జవాబులను వెతెకడానికి ఇష్టపడే అమెరికను సమాజం, ఆధునిక టెక్నాలజీలని ఒక ముఖ్యమైన సాధనంగా వాడుకునే అమెరికన్ సమాజం ఇలా ఆహారం విషయంలో మాత్రం ఎక్కడో వెనకబడిన ప్రాంతాల్లో మూఢనమ్మకాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆదిమ సమాజం మాదిరిగా ఈ ఆరోగ్య ఆహార మతాన్ని నమ్ముకుంటున్నది, తన అమిత బరువు సమస్యని పరిష్కరించడానికి.
స్వఛ్ఛమైన, సహజమైన ముడి సరుకు మంచిదే – కాదనడం లేదు. జంకు ఫుడ్డు చెడ్డదే – అదీ కాదనడం లేదు. కానీ శరీరపు బరువుని గురించీ, ఆరోగ్యాన్ని గురించీ సైన్సు చెబుతున్న మౌలికమైన విషయాలను పట్టించుకోకుండా సహజమైనది కదా అని ఏది పడితే అది, ఎంత పడితే అంత తింటూ పోతే వచ్చేది ఆరోగ్యం కాదు, అకాల మృత్యువే. మా మిత్రుడు ఒకడు అంటూ ఉంటాడు –  పాము విషంకూడా సహజమైనదే, ఆర్గానిక్‌గా, ఎక్కడా ప్రాసెస్ చెయ్యకుండా ఉత్పత్తి అయినదే – అలాగని, విషం తింటామా? అది విషమే అయినప్పుడు, అది ఆర్గానిక్ అయితేనేమి, ఏదో యంత్రాల్లో తయారైనది అయితేనేమి ప్రాణం తియ్యడానికి.

organic garden

మన ఇంటి వెనకాల పెరడులో పెద్దగా ఎరువులూ, క్రిమిసంహారకాలూ అవీ వాడకుండా మనం పెంచుకున్న కూరగాయల్ని మన చేత్తో కోసుకొచ్చి వండుకుని (అదీ ఎక్కువ ఉప్పూ, నూనెలూ లేకుండా) తింటే – అది కచ్చితంగా జంకుఫుడ్డు కంటే ఆరోగ్యంగా ఉంటుందని ఒప్పుకోవచ్చు. అంతేగానీ “సహజ సూపర్ మార్కెట్”లో షెల్ఫుల మీద అమ్మబడుతున్న సహజ పాస్తాలు, సహజ చిప్సు, సహజ ఐస్ క్రీములు తింటూ ఉండడం ఆరోగ్యం కాదు. అది మన మనసును .. కాదు కాదు – శరీరాన్ని – మనమే వంచన చేసుకోవడం.
References:

“The cure for Obesity”, David H. Freedman, The Atlantic (monthly) July 2013

 

– ఎస్. నారాయణ స్వామి

Download PDF

11 Comments

  • ఇంటివెనుక పెరడు లేకపోతే ఏం చెయ్యాలి అన్నది ప్రశ్న.. :-)
    బాగుందండి ఆర్టికల్.

  • DrPBDVPrasad says:

    మంచి వ్యాసాన్ని మంచి కథలు నవలలోని పాకశాస్త్ర విషయాలను గుర్తుచేస్తూ అందివ్వటం బాగుంది
    మీరు ఉదాహరించిన విషయాలను నేను మాత్రమే తిండి యావతో గుర్తు పెట్టుకున్నానేమో అనుకోన్నాను
    అప్పంబొట్లు ప్రక్క ఊరువచ్చినప్పుడు అటక మీద సంవత్సరమంత వాడటానికి పెట్టుకొన్న ఊరగాయని లాగించేయటం
    అలాగే నారాయణరావు నవల లో బాపిబావగారు వంకాయకూర ని ఆవపెట్టి వండిన రామయ్యగారనే పాకశాస్త్ర ప్రవీణుడిని మెచ్చుకోవటం (ఆయన వండిన వంట 10 రోజులైన తాజాగ ఉంటుందట)
    సరె మిథునం గూర్చి చెప్పేదేముంది ?పశుపక్షిసుతాదుల్లో మొక్కల్ని ంచేర్చనందుకు అప్పాదాసు ఎలాను నొచ్చుకున్నాడు

    నా ఇంటి పెరడులో పెంచుకొన్నాడ నొక్క కరివేపాకు మొక్క అని అందరు అనుకోవాలి

  • డా. ప్రసాద్ గారు, భలే చెప్పారు. నేను భోజనప్రియుణ్ణనే విషయం జగద్విదితం :)

    తృష్ణ, ఒక్ఖ అంగుళం సాగు నేల లేకుండా కూడా అపార్టుమెంట్లలో కుండీలలో అద్భుతమైన మొక్కల్ని పెంచి కూరగాయల్ని పండిస్తున్నవారున్నారు. మనసుంటే మార్గాలు చాలానే ఉన్నాయి.

  • కల్లూరి భాస్కరం says:

    మీ వ్యాసం బాగుంది నారాయణస్వామిగారూ, ఒక జాతి సాంస్కృతిక అస్తిత్వంలో భోజనానికీ, భోజన పద్ధతులకీ ఒక ముఖ్యమైన భూమిక ఉందనడం ఇంకా బాగుంది, మీరు ఉదహరించిన అప్పంభొట్లు లాంటి భోజనచక్రవర్తులు ప్రతి ప్రాంతంలోనూ ఉండేవారు కాబోలు. నిజంగా లేకపోయినా జనం సృష్టించుకునేవారేమో! ఆ సృష్టించుకోవడం వెనుక కరువు లాంటి కారణాలు ఏమైనా ఉండేవేమో! చాలా ఆసక్తికర పరిశీలన. మా అమ్మ ‘ఉండ్రాజవరం బ్రాహ్మ’ డనే ఒక భోజనపరాక్రముని కథ చెబుతుండేది.

  • నెనర్లు భాస్కరం గారూ.
    మీకు వీలైనప్పుడు ఈ వరుసలో ఇంతకు మునుపు రాసిన వ్యాసాలు కూడా చూడండి దయచేసి.

    పాఠకులకు ఒక గమనిక. ఇప్పుడే మిత్రుడు రామారావు హెచ్చరించారు – ఇక్కడ షెఫ్ గా ఉదహరించిన Mark Bittman షెఫ్ కాదనీ, ఆయనకూడా భోజన వ్యవహారాల మీద రాస్తుండే జర్నలిస్టనీ. My mistake.

  • విషం పోలిక ఒక్కటి అంతగా అతకలేదు. మిగతా వ్యాసం అంతా సూపరు.

  • gsrammohan says:

    బాగుందండీ! ఇలాంటి అభిప్రాయాలు మరింత ఎక్కువమందికి చేరాల్సిన అవసరముంది. మీ అమెరికా సంగతేమో కానీ ఇండియాలో మాత్రం ఆర్గానిక్‌ యావలో ఆరోగ్య పిచ్చ మాత్రమే కాక ఇంకా చాలా విషయాలు కలిసిపోయి ఉన్నాయి. మీరు దూరంగా ఉండబట్టి బతికిపోయారు కానీ ఇక్కడైతే కొరికేసి కరిచేసి చాలా చాలా చేసేసి ఉందురు. బొడ్డుచుట్టూ ఇంజెషన్లు చేసుకోవాల్సి వచ్చేది. మంచి వ్యాసం. థ్యాంక్స్.

  • ప్రవీణ, ఓకే.
    రామ్మోహన్ గారు. మీ వ్యాఖ్యకి నెనర్లు. కొంతకాలంగా నేను గమనిస్తున్నది, అనేక ముఖ్యమైన విషయాలపై, సరైన ఆలోచన, అవగాహన, విశ్లేషణ లేకుండానే, బాగా చదువుకున్నవారు, తెలివైనవారు కూడా మూఢనమ్మకాల వంటి పిడివాదాలలో కూరుకుపోతున్నారు. అటువంటి పిడివాదాలని ప్రశ్నించడం కూడా ఇక్కడ నేను రాస్తున్న వ్యాసాల ఉద్దేశాల్లో ఒకటి.

  • లియో says:

    నా వరకు నేను EWG వారి ఏవి ఆర్గానిక్ కొనాలి ఏవి అక్కరలేదు చిట్టా చూసుకొని కొంటుంటాను. హార్మోన్లు, ఆంటీబయాటిక్లు, జన్యు మార్పిడి లేని ఆహారపదార్థాల కోసం, కొంచం అయినా పురుగు మందులు తక్కువుగా వాడి పండించే ఆహార పదార్థాల కోసం ఖరీదు ఎక్కువయినా ఆర్గానిక్ కొంటుంటాను. ఆర్గానిక్ అన్నంత మాత్రాన బలవర్థకమైన ఆహారం అనే అపోహ లేదు. ఆర్గానిక్ లేబుల్ చుట్టూ జరిగే రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తుంటాను.

    http://www.aap.org/en-us/about-the-aap/aap-press-room/pages/American-Academy-of-Pediatrics-Weighs-In-For-the-First-Time-on-Organic-Foods-for-Children.అస్ప్క్ష్

    http://www.ewg.org/foodnews/

    http://www.cornucopia.org/

  • PB Anand says:

    ఆర్గానిక్ ఫుడ్ ఇప్పుడు ఫాషిన్ అవ్వడానికి ముందు 19 శతాబ్ది వరకు అన్ని ఆహారాలు ఆర్గానిక్ ఆహారలే కదా. ఇప్పుడు ఆర్గానిక్ ఆహారం ధర ఎక్కువ కనుక సాధారణ వ్యక్తులకు అందకుండా ఉండడం ఒక ముఖ్యమైన ఛాలెంజ్. ఇన్ని సంవత్సరాల తరువాత మీ పేరు చూడంగానే చాల సంతోషము కలిగింది.

  • PB ఆనంద్ గారు, మీరు వరంగల్ ఆర్యీసీ ఆనంద్ గారా? మీ వ్యాఖ్య ఇప్పుడే చూస్తున్నాను.
    Please mail me at kottapali at gmail.com

Leave a Reply to DrPBDVPrasad Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)