డైరీలో ఒక పేజీ

 

వినోద్ అనంతోజు

వినోద్ అనంతోజు

 

 

 

 

 

 

 

అనుషాని పిక్ చెస్కోడానికి బెంగళూరు రైల్వే స్టేషన్ కి వెళ్ళాను. సరిగ్గా సంవత్సరం క్రితం చూశాను తనని.

ఎన్నో రోజుల తరవాత కలుస్తున్నాను. ఏదో ఆత్రుత, ట్రైన్ టైమ్ కి గంట ముందే వచ్చేశాను స్టేషన్ కి. స్టేషన్ బయట ఒక ౩౦ ఏళ్ల ఆవిడ నీరసంగా, చిన్న చిన్న దెబ్బలతో పడి ఉంది. చిరిగిపోయిన బట్టలతో, వొళ్ళంతా దుమ్ముతొ. ఆమె పక్కన ఆమె తాగుబోతు మొగుడు నలుగురితో గోడవపడుతున్నాడు. వాళ్ళ సంభాషణ అంతా కన్నడ లో జరుగుతోంది. నాకు అర్థమైనదాన్ని బట్టి వాడు ఆమెని కొడుతుంటే అటుగా వెళ్తున్న కొంతమంది అతన్ని ఆపి వాదులాటకి దిగారు. 

“నా భార్య నా ఇష్టం” అన్నాడు వాడు. ఆది విని కొంత మంది వెళ్ళిపోయారు అదేంటో..!! ఇద్దరు మాత్రం అతన్ని రెండు దెబ్బలు వేసి తరీమేశారు. వాళ్ళు కుడా వెళ్ళిపోయారు. ఆమె అక్కడే పడుంది. బలహీనంగా మూలుగుతోంది. జనం వస్తున్నారు, పోతున్నారు. కొందరు ఆమెని సరిగా గమనించకుండానే, అడుక్కునే ఆవిడ అనుకుని చిల్లర వేసిపోతున్నారు. నేను ఆ పక్కనే నిలబడి చూస్తున్నాను. ఇంతలో ఆ మొగుడు ఎక్కడినుంచో వచ్చి ఆవిడ ముఖం మీద బలంగా గుడ్డాడు. ఆవిడ గట్టిగా రోదించడం మొదలుపెట్టింది. అటు ఇటు పొర్లుతోంది. తాగుబోతు ఏదో గట్టి గట్టి గా అరుస్తూ అటు ఇటు తులుతూ తిరుగుతున్నాడు. జనం ఆవిడని దాటుకుని, తప్పుకుని వెళ్ళిపోతున్నారు. 25 ఏళ్లు ఉండే ఒకావిడ ఆమె భర్తతో అటుగా వెళ్తూ ఆగి ఆవిడతో మాట్లాడాలని ప్రయత్నించింది. మంచి నీళ్ళు తాగించింది. ఏదో జరుగుతోందని జనం గుమిగూడి చూస్తున్నారు. ఆవిడ కన్నడలొ ఏవో ప్రశ్నలడిగింది. ఆమె రోదిస్తూ సమాధానం చెప్తోంది. ఇంతలో అందరు తాగుబోతు మొగుడిని తిట్టడం మొదలుపెట్టారు. పోలీసాయన్ని పిలిచి అతని గురించి చెప్పారు. వాడు పోలీసు ని చూడగానే పారిపోయాడు. పోలీసాయన వెనకే పరిగెత్తాడు. ఆవిడని ఏం చెయ్యాలి అనే ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండానే వెల్లిపొయాడాయన. నేను ఆ 25 ఏళ్ల ఆవిడని అడిగాను.

“డూ యూ నో కన్నడ? ”

“యస్”

“వాట్ ఇస్ షీ సేయింగ్?”

“ఈ డిడ్ నాట్ గెట్ హర్. షీ ఇస్ క్రైయింగ్ ఏ లాట్.”

ఆవిడ భర్త వచ్చెయ్యమని ఇందాకటి నుంచి లాగుతున్నాడు. కొద్దిసేపు నిలబడింది. ఎం చెయ్యాలో తోచక తన వాటర్ బాటల్ ఆమెకిచ్చేసి వెళ్లిపోయింది. జనం మళ్లీ ఎవరిదారిన వాళ్ళు వెళ్లిపోవడం మొదలుపెట్టారు. అప్పటిదాకా అక్కడ నిల్చున్న ఒకతన్ని ఏమైందని అడిగాను.

“వదిలెయ్యండి సార్… మనమేం చెయ్యలేము.. వాళ్ళ పాపాన వాళ్లే పోతారు !! ” అన్నాడు.

నేనిక చూడలేక పోయాను. వెళ్ళి ఆమెని అడిగాను.

“అమ్మా తెలుగొచ్చా?” వచ్చు అని చెప్పింది.

ఆవిడది మదనపల్లి అంట. మొగుడు పిల్లలు అక్కడే ఉన్నట్టున్నారు. ఈ తాగుబోతు ఈమెని ఇక్కడికి తీస్కొచ్చాడట. అక్కడే స్టేషన్ దగ్గరే అడుక్కుంటూ ఉంటారట. రోజూ తాగొచ్చి తంతూ ఉంటాడట. ఈ రోజు ఎందుకో నువ్వు ఛస్తే డబ్బులొస్తాయి అని ఛంపుతానని కొడుతున్నాడట. నేను ఆమెతో మాట్లాడుతుంటే ఏదో జరుగుతోందని జనం గుమిగూడారు.

చాలా నీరసంగా ఉంది ఆమె. చేతులు కదిలించడం కూడా కష్టంగా ఉంది ఆమెకి. మాటలు కూడా స్పష్టం గా అర్థం కావడంలేదు. ఆమె ముఖం మీద దెబ్బల నుంచి బాగా రక్తం కారుతోంది. రైల్వే స్టేషన్ లో క్లినిక్ ఏదైనా ఉందేమో అని ఒకతన్ని అడిగాను.

ఫర్స్ట్ ప్ల్యాట్‌ఫార్మ్ మీద ఉంది కానీ ఎలా తీస్కెళ్తాము అన్నాడు. స్ట్రెచర్ ఏమైనా ఉంటుందేమో చూద్దాము అన్నాను. వీల్ ఛైర్ ఒకటుంది. దాన్నే తీస్కొచ్చాం. ఆవిడని ఎత్తి దాంట్లో కుచోబెట్టాలి. ఆడమనిషిని ముట్టుకోవడం సరికాదన్నాడు ఒకడు. నాకు ఆవిడ ఒక దీనురాలు అంతే. ఆడా మగా సమస్య కాదు. ఆమె చేతులు పెట్టుకుని పైకి లేపడానికి ప్రయత్నించాను. అందరు నిలబడి నిశ్చేష్ఠులై చూస్తున్నారు కానీ ఎవరూ ఆమెని ముట్టుకోడానికి ముందుకి రాలేదు.

పక్కనే ఒక కార్పెట్ ఉంటే తీస్కొచ్చి పరిచాను. ఇద్దరు ముగ్గురు సాయం పట్టారు. ఆమెని కార్పెట్ లో పడుకోబెట్టి, ఎత్తి ఛైర్ లో కూచోపెట్తి తీస్కెళ్తున్నాం. ఆ తాగుబోతు భర్త మళ్లీ వచ్చాడు. తాను కూడా క్లినిక్ కి వస్తా అన్నాడు. ఛైర్ నెడుతున్నాడు. ఆవిడ వాడిని చూడగానే భయపడి ఏడుస్తోంది. వద్దని చెప్తోంది. నేను అతనిని తెలుగులో వెళ్ళిపొమ్మని చెప్పాను. వాడికి అర్థం కాలేదు. పక్కన ఉన్న ఒకాయనకి చెప్పాను అతనిని పంపించెయ్యమని.

“ఎంతైనా మొగుడు కదా.. రావోద్దని ఎలా చెప్తాం” అన్నాడు.ఆ మాట విని నాకు ఒక్క క్షణం మతిపోయింది. మొగుడు ఎంత నీచుడైనా భార్య మీద అన్ని అధికారాలు ఉంటాయి అని నమ్మడం, హు.. మధ్యయూగాల వాసన ఇంకా అలానే ఉంది. ఇంతలో ఆ పోలిసాయన అటుగా వచ్చాడు. ఆ తాగుబోతు పారిపోయాడు అక్కడ్నుంచి.

 

ఒక ఐదుగురం కలిసి ఆవిడని వీల్ ఛైర్ మీద క్లినిక్ కి తీస్కెళ్తున్నాం. జరుగుతున్నదంతా గమనించి ఒక 20 ఏళ్ల కన్నడ యువతి కూడా మాతో జాయిన్ అయ్యింది. ఏం జరిగింది అని నన్ను అడిగింది. జరిగిందంతా ఇంగ్లీష్ లో చెప్పాను. ఆ అమ్మాయి ఆవిడతో కన్నడలొ ప్రేమగా మాట్లాడి ధైర్యం చెప్పింది. నీకేం కాదు, మేమంతా ఉన్నాం అని చెప్పింది నాకు ఆ అమ్మాయి మీద గౌరవం కలిగింది.

 R_Tagore_Veiled_Woman

క్లినిక్ లో 25 ఏళ్ల కుర్ర డాక్టర్ ఉన్నాడు. లోపలికి తీస్కెళ్లగానే ఆవిడని చూసి కొంచం ఆశ్చర్యపొయినప్పటికీ, ఎటువంటి ఏవగింపు లేకుండా ఆ దెబ్బలకి మందు పూయడం మొదలుపెట్టాడు. “ఈమె ఫుల్ గా తాగి ఉంది” అని చెప్పాడు.

“ఏమ్మా ఫుల్ గా తాగావా?” అడిగాడు.

ఆవిడ సత్య ప్రమాణంగా తాగలేదని చెప్పింది. అతను వెటకారంగా నవ్వి “ఇది మాములే సార్.. ప్ల్యాట్‌ఫార్మ్ మీద అడుక్కోవడం, రాత్రికి తాగి తన్నుకోవడం. మీరంతా ఎందుకు సార్ అనవసరంగా టైమ్ వేస్ట్ చేసుకున్నారు.” అన్నాడు.

అక్కడున్న వారంతా ఈ మాట విని ఏదో పెద్ద సానుభూతి భారం గుండెల మీద నుంచి దిగిపోయినట్టు రిలీఫ్ గా ఫీల్ అయ్యారు.

నేనేం మాట్లాడలేదు. ఆ కన్నడ యువతి ఇంగ్లీష్ లో అంది “వీళ్ళకి తినడానికి డబ్బులుండవు గాని .. తాగడానికి మాత్రం ఉంటాయి.”

 

ట్రీట్‌మెంట్ అయిపోయింది. డాక్టర్ దెబ్బలకి కట్టు కట్టాడు. ఇప్పుడామెని ఎం చెయ్యాలి అనేది ప్రశ్న.

బయట వదిలేస్తే మళ్లీ ఆ తాగుబోతు మొగుడు వస్తాడు. క్లినిక్ లోపల ఉంచడానికి కుదరదు.

ఆవిడని అడిగాను. “అమ్మా.. ఎక్కడికెళ్తావు?” అని.

సగం మూసుకుపోతున్న కళ్ళతో, నీరసంగా ఏమో అన్నట్టు చెయ్యి ఉపింది. నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

నా మనసులో కలుగుతున్న భావాన్ని జాలి అనాలో, సానుభూతి అనాలో, వ్యవస్థ మీద కోపం అనాలో అర్థం కావట్లేదు.

“మదనపల్లి వెళ్తావా” అని అడిగాను. డబ్బుల్లెవు అంది. తమిళాయాన భోజనం పార్సల్ తీస్కొచ్చాడు. ఆవిడని ప్ల్యాట్‌ఫార్మ్ మీదనే ఒక చోట కూచొపెట్టి ఎవరికి తోచినంత వాళ్ళిచ్చారు. ఆ కన్నడ యువతి ట్రైన్ టైమ్ అవుతోందని చెప్పి వెళ్లిపోయింది.

ఆవిడకి చెప్పాను ” అమ్మా ఈ డబ్బులు జాగ్రత్త. ఆ తాగుబోతు వాడికి చూపించొద్దు. ముందు భోజనం చేసి కొంచం శక్తి వచ్చాక మదనపల్లి ట్రైన్ ఎక్కెయ్యండి.” ఆవిడకి నేను చెప్పింది ఎంతవరకూ బుర్రకెక్కిండో తెలియదు. ఏడుస్తూ దండం పెట్టి కాళ్ళు పెట్టుకొబోయింది. ఆపి, వద్దని చెప్పి, జాగ్రత్త అని చెప్పి లేచాను.

మొదట్నుంచి మాతోపాటు ఉన్న ఒక తెలుగాయన వాష్ బేసిన్ చూపిస్తూ “చేతులు శుభ్రంగా కడుక్కోండి సార్” అని చెప్పాడు. నాకేం అర్థం కాలేదు.

“ఆహా… అదంతా పట్టుకున్నారు కదా… చేతులు కడుక్కోండి.” అన్నాడు. సరే అన్నట్టు తల ఊపాను.

అనూష వచ్చే ట్రేన్ అనౌన్స్మెంట్ వచ్చింది. వెనక్కి తిరిగి ఆవిడని చూస్తూనే ముందుకి నడిచాను. ఎన్నో సమాధానం చిక్కని ప్రశ్నలు మనసుని ముసురుతూండగానే అనుషాని రిసీవ్ చేస్కున్నాను. తను ఏదో మాట్లాడుతోంది గాని, నా మనసు అక్కడ లేదు. తిరిగి ప్ల్యాట్‌ఫార్మ్ 1 మీదుగా వస్తూ ఆవిడ కోసం వెతికాను. కనిపించలేదు.

 

ఒక్క గంటలో ఎన్ని రకాల మనుషులని, ఎన్ని రకాల మనస్తత్వాలని చూసాను.

ఆ దీనురాలి సమస్య కి పరిష్కారం ఏమిటి? దాన్ని పరిష్కారం చేసేవారెవరు?

ఆ సమస్యని నెత్తికెత్తుకుని ఆమె జీవితాన్ని చక్కదిద్దే స్థోమత, శక్తి నాకున్నాయా?

ఆవిడని అలా ప్ల్యాట్‌ఫార్మ్ మీద వదిలేసి రావడం సరైన పనేనా? నాతో పాటు ఉన్నవాళ్ల ప్రవర్తన సమంజసమేనా?

ఆవిడ తాగి ఉంది అనగానే ఆమె పట్ల, ఆమె పరిస్థితి పట్ల చులకన భావం ఎందుకు కలిగింది?

ఆమె సంస్కారహీనతని లోపం గా చూపి, తమ బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం కాదా ఆది?

చిన్నప్పటి నుండీ రోజూ కడుపునిండా తిండితో, తీరైన పోషణతో, ఉన్నతమైన చదువులు చదువుతూ పెరుగుతాం మనం. మనకి మంచేదో చెడేదో ముందుగానే ప్రిడిఫైన్ చెయ్యబడి ఉంటాయి. ఎవరితో ఎలా మాట్లాడాలి, గౌరవం ఎలా ఇవ్వాలి, మర్యాద ఎలా సంపాదించుకోవాలో పెంపకంతోపాటే నేర్చుకునే మనకు ఒక సంస్కార స్థాయి ఉంటుంది.

రోడ్ల మీద పుట్టి, రోడ్ల మీద పెరిగినవాళ్ళు, ఏరోజుకారోజు ఉనికి సమస్యనెదుర్కునేవాళ్ళు, జీవితంలోని అన్ని రకాల దౌర్భాగ్యాలని, దుర్మార్గాలని ఎదుర్కుంటూ పెరిగినవాళ్ళు, ఎక్కడికెళ్లినా అవమానాలు, ఛీత్కారాలు, రుచిచుసే వాళ్ళు, మాంచేదో చెడేదో చెప్పే దిక్కులేనివాళ్ళు అలా కాక ఇంకెలా ఉంటారు? వాళ్ళకి కూడా మనకున్న సంస్కార స్థాయి ఉండాలనుకోవడం తప్పు. ఆ మాటకొస్తే.. పదిమందిలో ధైర్యంగా, బాధ్యతగా నిలబడి ఒక దీనురాలికి సహాయం చేస్తున్న భార్యని వెనక్కి లాగిన భర్తదేమి సంస్కారం?

రోడ్డు మీద ఒక మనిషి వేదనలో ఉంటే ఆడమనిషి కాబట్టి ముట్టుకోను అనడం ఏం సంస్కారం? అడుక్కునే ఆవిడ అయినంతమాత్రాన ముట్టుకున్నాక చేతులు కడుక్కోమని సలహా ఇచ్చిన పెద్దమనిషిది ఏం సంస్కారం?

ఒక మనిషి సమస్య మనం అర్థం చెస్కోవాలంటే ఆ సమస్య  సామాజిక మూలం గ్రహించగలగాలి. ఆది గ్రహించలేకపోతే ఆ మనిషి బ్రతుకు మనకి అర్థం కానట్టే. ఆ దీనురాలి పరిస్థితి ని అర్థం చెస్కోవాలంటే ఆమె స్థానంలో, ఆమె స్థాయిలో నిలబడి ఆలోచించాలి. ఆమె అనుభవిస్తున్న వేదన మనమూ అనుభవించాలి, ఆమె మోస్తున్న సామాజిక భారాన్ని మనమూ మొయ్యాలి, ఆమె అవివేకాన్ని మనమూ పంచుకోవాలి. దీన్నే సానుభూతి (సః అనుభూతి) అంటారు అనుకుంటాను.

నాలో ఆ సానుభూతే కలిగింది. అంతకంటే ఎక్కువగా కోపం కలుగుతోంది. వ్యవస్త మీద. జరిగిన దాంట్లో నాకు మొత్తం హింసే కనపడుతోంది. భార్య మీద భర్త చేసిన హింస కాదు. వాళ్ళిద్దరి జీవితాల మీద సమాజం చేస్తున్న హింస. వాళ్ళ ఈ పరిస్థితికి కారణం ఆ హింసే కదా. సమాజం లో అడుగడుగునా వేళ్ళూనుకుపోయిన హింసాస్వభావమే కాదా.

 

“ఏంటి అలా ఉన్నావ్?” అమాయకంగా అడిగింది అనూష. నా మనసు తన మీద లేదని గమనించింది కాబోలు. ఏమని చెప్పను తనకి. నాలో కలుగుతున్న ఆగ్రహం తనకి అర్థమౌతుందా. నా మూడ్ బాలేదు అనుకుంటుంది. నిజానికి నా మూడ్ ఇప్పుడే బాగుంది. ఏదో ఒక పనికొచ్చే ఆలోచన వైపు పరుగులు తీస్తోంది.

“ఏం లేదే… బానే ఉన్నా…!! నువ్వే జిడ్డు మొహం వేస్కుని ఉన్నావ్..!” :P

“20 గంటలు జర్నీ బాబూ..”

– వినోద్ అనంతోజు

 

 

Download PDF

17 Comments

  • నాకేంటో అక్కడ జరిగిన విషయం పక్కన పెడితే నువ్వు వివరించిన తీరే ఎక్కువ ఆలోచింప చేస్తోంది సోదరా…ఎందుకంటే…ఏదో ఒకటి చేసే వారికన్నా ఏదో ఒకటి చేద్దాం అనుకుని చూస్తూ నిలబడి ఇంటికొచ్చి పస్చ్యాత్తాప్పడే తీరే మనలో నాటుకుపోయి ఉంది. కథ కాదని తెలుస్తోంది. ఈ రోజుల్లో నాకు తెలిసిన రచయితలలో నేను చదవటానికి అమితంగా ఇష్టపడే రచనలు నీవే. వినోద్ అనంతోజు అనే పేరు చూస్తే చదివి తీరాల్సిందే. త్వరలోనే నిన్ను కలవాలనుంది. సెలవు!

    -కిట్టు విస్సాప్రగడ

    • Sasidhar Kanda says:

      మారదు లోకం, మారదు కాలం, అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని, గొర్రె తాటు మందకి నీ జ్ఞాన బోధ దేనికి .. అని సిరివెన్నెల చెప్పినట్టు, ఇప్పుడు ఉన్న సమాజం లో జనాలంతా ఒక సైకిల్ లో పడి కొట్టుకు పోతున్నారే గానీ వేరే వాడి కష్టాల గురించి ఆలోచించాలని ఉన్నా ఆలోచించే సమయం లేదు భయ్యా !

    • Vinod Anantoju says:

      తప్పకుండా కలుస్తాను. ధన్యవాదాలు మిత్రమా..

  • aparna says:

    చాలా బావుంది. నిజంగా జరిగిన విషయం కాబట్టి మిమ్మల్ని మెచ్చుకోవాలన్నా..సిగ్గేస్తుంది. మామూలుగా అందరం స్పందించ వలసిన విషయాన్ని అభినందిన్చెంత కష్టమైన విషయంగా ఎండకు మారుస్త్న్నాం అని. నేనైతే ఫీల్ అయ్యి, అయ్యో అని ఊరుకుంటాను..అక్కడితో వదిలేస్తాను. బహుశా నాలాంటి వారే నెమో ఎక్కువమంది. నాకాశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే ఇంత మంచి విషయానికి ఒకటే రెస్పాన్స్ ఏంటి, అని?!!

  • sreekanth says:

    మీరు చేసిన పని ప్రతి ఒక్కరు చేయగలిగిందే… కాని ఎవరు చేయరు… కారణం ఇలాంటి ఘటనలు చాలా సాధారణం అని బలంగా మన మనస్సులో నాటుకుపోయింది…. మొదటగా మీకు ధన్యవాదాలు…. గౌతమ బుద్ధుడే ఈ సమాజాన్ని మార్చడానికి చాలా కష్టపడ్డాడు…. ఇక మనం ఎంత… ? ప్రయత్నిద్దాం …. ఆశతో…… :)

    • Vinod Anantoju says:

      నిజం… మనిషి మొద్దుబారిపొతున్నాడు. జీవితంలోని మృదువైన విషయాలని స్పృశించలేకపోతున్నాడు..

  • chandrakanth says:

    నైస్ స్టొరీ,,,ఐ జస్ట్ ఫెల్త్ తట్ ఇట్ ఇస్ హప్పెనింగ్ బెఫొరె మీ.క్లైమాక్స్ లైన్స్ వేరే అవెసొమె,ఐ జస్ట్ రెమెంబెరెద్ ది ఫస్ట్ హాఫ్ వ్హిలె రీడింగ్ ది క్లైమాక్స్ లైన్స్…..

    • పోతు అవినాష్ says:

      మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూనే, నన్ను నేను ప్రశ్నించుకునేలా చేశారు.
      సంఘటనని వివరించిన తీరు అభినందనీయం

    • Vinod Anantoju says:

      ధన్యవాదాలు చంద్రకాంత్ గారు …

  • పోతు అవినాష్ says:

    మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూనే, నన్ను నేను ప్రశ్నించుకునేలా చేశారు.
    సంఘటనని వివరించిన తీరు అభినందనీయం

  • Dr. Madhuri says:

    Diary lo oka page. story made me think of many issues related in and around society, where we r living. Thanks for sharing, wishes to writer.

  • S.Shivakumar says:

    ముందుగ వినోద్ అనంతోజు కు అభినందనీయం,

    నువ్వు చెప్పిన సంఘటన నాకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.
    నా ఎదురుగ జరుగుతుంది అనట్టుగ కనిపిస్తుంది.
    నువ్వు చెప్పే ఈ సంఘటన నన్ను ఆలోచించేలా చేసింది
    ఆవేదన కలిగించింది.

    ఈ సమాజంలో మనిషి మనసుకి మానవ సంబదానికి మద్య వుండే ఆ ఆనకట్ట ఎపుడో కూలిపోయింది . నేడు సమాజంలో సాయం, సానుబూతి, జాలి, కరుణ అనే పదాలు మూసీలో మునిగాయే తప్ప జీవితం అనే నదిలో ప్రవహించడం లేదు, మనిషి నాకెందుకు లే అనే గట్టి బ్రమలో నే వున్నాడు. నా అనే వాళ్ళనే చూస్కొని ఈ రోజుల్లో బయటి ప్రపంచాన్ని పట్టించుకునే వాళ్ళు తక్కువ అయిపోయారు, మనిషి సమాజంలో సహజంగా కన్నా కృతిమంగా (artificial ) బ్రతకడం మొదలు పెట్టాడు.

  • naveen pedamalla says:

    manushula yokka sthannanni prashnistunay vaadi sthannani gurthuchesav.., akkadunna manasulaani parisheelinchav… mari akkada lekunda tera venuka dakkoni katha (vastavama?) ni anta nadipistunna dabbuni neladeeyava… adi shaasistunna manishinay na… chala daarunam!!!

  • naveen pedamalla says:

    మనుషుల యొక్క స్థానాన్ని ప్రశ్నిస్తూనే వాడి స్థాయిని గుర్తుచేసావ్… అక్కడున్న మనసుల్నీ పరిశీలించావ్.. మరి అక్కడ లేకుండా తెర వెనుక దాక్కొని కథని (వాస్తవమా??) నడిపిస్తున్న డబ్బుని నిలదీయవ.. అది శాశిస్తున్న మనిషినేన ?
    చాల దారుణం !!!

    –ని ఆలోచనలకి అభిమాని.

  • Anil Raj says:

    ఒక సామాజిక అంశాన్ని స్తుతించిన మీకు ధన్యవాదాలు.
    ఇది నా అవగాహనలో కేవలం వ్యవస్థ లోపం మాత్రమే. ఈ ఇలా ఎందుకు అంటున్నానంటే ఇక్కడ(మన దేశం లో) మనిషి జీవన ప్రమాణం చాలా తక్కువ. కుప్పలుగా పెరుగుతున్న జనం, నిత్యావసరాలు కూడా అందరికి అందించలేని అసమర్థత. వెరసి ప్రభుత్వ వైఫల్యం. మనిషి జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు ఇలాంటి సామాజిక సమస్యలు తోలగుతయనడం లో సందేహం లేదు. ప్రతి రోజు ఇలాంటి వాళ్ళు వందమంది మనకు కనిపిస్తూనే ఉంటారు ఎంతమందిని మనం పట్టించుకోగలం?, ఎంతమందికి సామాజిక స్పృహ లేదని అంటాం?. రోజూ మనపని మనం చేసుకువడమే కాకుండా సామాన్యుడు ఎంతమందిని పట్టించుకోగలడు. మన సమాజం లో నేను, నా కుటుంబం, నా ఆర్థిక వ్యక్తిగత సమస్యలు అని అనుకునే లోపే రోజు గడిచిపోతుంది. ఇలా మన సామాన్యుడు తన గురించి ఆలోచించే లూపే రోజు గడిచి పోతుంటే, పక్కవాడికి కోసం ఎక్కడ సమయం ఉంటుంది?. ఉన్న ఇలా కుప్పలు కుప్పలు గ కనిపించే వాళ్ళకోసం ఎంతని చెయ్యగలడు?. చాలామంది మన సమాజంలో మీరు చూసిన వాళ్ళు ఎదురవుతున్నారు అంటే అది వ్యవస్థ లోపం మాత్రమే అని నా అభిప్రాయం.
    నువ్వు అన్నది ఒక రకంగా correct. ఇంతమంది తలరాత ఇలా మారడానికి మనమే పరోక్షంగా కారణం. మంచి నాయకులని ఎన్నుకోవడం లో విఫలం అయ్యాం కాబట్టి.
    ఈమధ్య US వెళ్లినప్పుడు, ఒక taxi లో ప్రయాణిస్తూ ఆ కార్ నడుపుతున్న driver తో జరిగిన సంబాషణ ఒకటి చెప్తాను. అతని వయస్సు 70 సంవత్సరాల పైనే ఉంటాయి. ఈ వయస్సులో నీకు ఇలా పని చెయ్యాల్సిన అవసరం ఏముంది అని?. మనవాళ్లు, మనవరాళ్ళతో కాలక్షేపం చెయ్యకుండా ?
    దీనికి అతను చిన్నగా నవ్వి, ఇలా సమాధానం ఇచ్చాడు.
    My son doesn’t stay with me, he lives his own life with his wife and kids. They have their own space and life.
    I said: Don’t you get a feel of loneliness in the home without your son and their children.
    He said: I stay with my wife. She works in a hospital as a nurse. We enjoy our time in work and home. My children visit us every weekend or we visit them. Everyone have their interests and work accordingly. This is my life, I like to live in my way, as wife and son do the same. This is quite common in US.
    Oh..Then I asked him: What is your dream/ambition at this age of working?.
    He said: I love travelling, that’s why I have chosen driving profession. I traveled US, Canada and some nearby countries. I would like to travel some of places which I haven’t visited till now like Great Wall of China, TajMahal, Egypt pyramids, etc..with my wife. I have some money..and looking forward to gain some more money. So finally I would like to travel till my last breath.
    ఇక్కడ నాకు అతనీతో మాట్లాడిన తరువాత అనిపించినదేంటంటే, ఇక్కడ ఒక కార్ డ్రైవర్ కి కూడా ఒక డ్రీం ఉంది. అదే నా దేశం లో పరిస్థితి మాత్రం వేరే ల ఉందే అని. ఇక్కడ ఎంత మందికి డ్రీం ఉంది?. తనకు నచ్చిన పని, చిన్నదైన పెద్దదైనా చేయడానికి ఎంతమంది ఉన్నారు?. ఎవరో చేస్తే కుర్చుని తిందాం అనే negligence వాళ్ళు ఉన్నంతకాలం మనం ఇలానే ఉంటాం.
    ఇక్కడ తాగి వచ్చి తన్నే భర్త. అడుక్కునే బార్య. చదివినా ఉద్యోగం వస్తుడో లేదో అని భావిష్యత్హు మీద ఆశలేని విద్యార్థి. ఇలా ఎందరో. ఇవన్ని చూస్తుంటే ఇది కేవలం వ్యవస్థ, సరయిన ముందుచూపు లేని ప్రభుత్వం వలన ఏర్పడిన సమాజం అని తెలుస్తుంది.
    మనిషి కంటే వస్తువుకి విలువనిస్తున్నంత వరకు మన సమాజం లో ఇలాంటి సందర్భాలు ఎదురవుతూనే ఉంటాయి.
    ఇవన్ని బాగుపడినప్పుడు, మనకి ఇలాంటి సందర్భాలు కనిపించడం తగ్గుతాయి. అప్పుడు మనం ప్రస్తుతమున్న సమస్య కంటే భావిష్యత్హు గురుంచి మాట్లాడుకుంటాం.

Leave a Reply to Dr. Madhuri Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)