శల్యుడు చెప్పిన కాకి-హంస కథ

కర్ణుడు: నువ్వు పాపదేశంలో పుట్టావు. దుర్బుద్ధి తప్ప నీకు సద్బుద్ధి ఎలా వస్తుంది? క్షత్రియాధముడివి. నీచుడివి. లోకంలో ఆబాలగోపాలం చెప్పుకునే వాక్యం ఒకటుంది.  మద్రదేశంవాడు కుటిలబుద్ధి, దేనికీ కలసిరాడు, స్నేహానికి అపకారం చేస్తాడు, చెడే మాట్లాడతాడు, దుష్టుడు, అతి కష్టుడు.  ఆ వాక్యం ఇప్పుడు ప్రత్యక్షంగా రుజువవుతోంది.

మీలో ఆడా, మగా  వావీ వరసా లేకుండా కలుస్తారు. అది మీకు తప్పుకాదు. మీరు మొదట కల్లు, ఆ తర్వాతే తల్లిపాలు తాగి పెరుగుతారు. మీ రెంత గుణవంతులో ప్రత్యేకించి చెప్పాలా?

అనేకమందికి పుట్టి, కల్లు తాగుతూ పెరిగే మీకు శీలమూ, సభ్యమైన మాటా ఎలా అబ్బుతాయి? మాటలు కట్టిపెట్టి యుద్ధానికి పద.

(మరికొంత సంభాషణ జరిగాక)

శల్యుడు: ఈ పనికిమాలిన మాటలెందుకు? విను కర్ణా…వేయి మంది కర్ణులైనా సరే, కిరీటిని గెలవగలరా?

కర్ణుడు: (కోపంతో ఎర్రబడిన కళ్ళతో నవ్వుతూ) ఒకసారి ధృతరాష్ట్రుని కొలువులో ఉత్తములైన పండితుల గోష్ఠిలో సకల దేశాచారాలూ తెలిసిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు చెప్పగా విన్నాను. బాహ్లిక దేశీయులు గోమాంసం నంజుకుంటూ మద్యపానం చేస్తూ అసందర్భ ప్రేలాపన చేస్తూ నగ్నంగా తిరుగుతూ ఉంటారట. ఇలా అనేకవిధాలుగా బాహ్లిక దేశీయులను నిందిస్తూ ఆయన మాట్లాడాడు. నువ్వు అలాంటి బాహ్లికులకు దగ్గరివాడివి. కనుక వాళ్ళు చేసే పుణ్యపాపాలలో ఆరోవంతు నీకు సంక్రమిస్తుంది. వాళ్ళ అనాచారాన్ని నువ్వు వారించలేదు కనుక పూర్తి పాపం నిన్నే చుట్టుకుంటుంది. బాహ్లికుల కంటే మద్రదేశీయులు మరింత అనాగరికులని పెద్దలు చెబుతుంటారు. నీ గురించి చెప్పేదేమిటి? నోరుమూసుకో.

శల్యుడు: బలాబలాలను, రథ, అతిరథ సంఖ్యను నిర్ణయించే సందర్భంలో భీష్ముడు (నీ గురించి) చెప్పలేదా? ఆ మాటలు ఓసారి గుర్తు చేసుకో. కోపమెందుకు? అంగదేశం వాళ్ళు డబ్బు కోసం ఆప్తుల్ని, బంధువుల్ని కూడా విడిచిపెట్టేస్తారు. కులకాంతల్ని అమ్ముకుంటారు. అలాంటి జనానికి రాజువైన నువ్వు ఇంకొకళ్ళ ప్రవర్తనను ఎంచడం దేనికిలే…                                                                                                             

                                                                                                                        -తిక్కన

(శ్రీమదాంధ్ర మహాభారతం, కర్ణపర్వం, ద్వితీయాశ్వాసం)

          ***

నేను కేవలం మహాభారతం గురించి మాత్రమే రాస్తున్నానని పాఠకులు ఈపాటికి ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటారు. నిజానికి మహాభారతం గురించి మాత్రమే రాయడానికి ఈ వ్యాసపరంపర ప్రారంభించలేదు. గొలుసుకట్టుగా ఒక విషయంలోంచి ఒక విషయంలోకి వెళ్లవలసిరావడంతో మహాభారతం చుట్టూనే ఈ వ్యాసాలు పరిభ్రమిస్తున్నట్టున్నాయి.  ఇప్పటికే అనేకఅంశాలను ప్రస్తావించి విడిచిపెట్టడం చూసే ఉంటారు. వాటిని పూరించుకుంటూ వెడితే ఎక్కడ తేలతానో నాకే తెలియడం లేదు. మహాభారత కథనం కూడా ఇలాగే ఉపాఖ్యానాల మీదుగా సాగడం ఓ విచిత్రమైన యాదృచ్ఛికత కావచ్చు. నాకు ఇంకోటి కూడా అనిపిస్తూ ఉంటుంది. నా జన్యువులలో బహుశా ఒక పౌరాణికుడు దాగి ఉన్నాడు!

అంతకంటే ముఖ్యమైన ఒక వివరణ ఇచ్చుకుంటాను. కేవలం మహాభారతానికీ లేదా గతానికీ పరిమితం కావడం నా ఉద్దేశం కాదు. పురా కాలం, నేటి కాలాల కొసలు రెండూ ముడి వేయడం మీదే ప్రధానంగా నా ఆసక్తి. రెండు కాలాల మధ్య గొప్ప గుణాత్మక విభజన ఉందని నేను అనుకోను. ఊహాప్రాయాలైన  విభజనలను చీల్చుకుంటూ రెండు కాలాల మధ్యా ఒక పొడవైన సరళరేఖను గీయడానికే నా ప్రయత్నం. ఈ ప్రయత్నం ఎంతవరకు విద్వజ్జనాలను ఒప్పించి మెప్పిస్తుందో ఈక్షణాన నాకు కూడా తెలియదు.

విషయానికి వస్తే, బాహ్లిక, మద్ర జనాలకు అంత మంచి పేరు లేదన్న వాక్యంతో కిందటి వ్యాసం ముగించాను కనుక అక్కడినుంచి ఈ వ్యాసాన్ని ఎత్తుకున్నాను.

కర్ణుడు అంగరాజు. అంగరాజ్యం నేటి బీహార్ తూర్పున కొంతభాగం. చంపానగరం దాని రాజధాని. నేటి భాగల్పూర్ ను అంగరాజ్యంలోదిగా గుర్తించారు. ఇక శల్యుడు మద్రదేశీయుడు, క్షత్రియుడు, పాండురాజు రెండో భార్య మాద్రికి సోదరుడు. గమనించే ఉంటారు, పైన ఉటంకించిన సంభాషణలోని కులనింద, ప్రాంత నిందల ఘాటు నసాళానికి అంటేలా ఉంది. అందులోనూ కర్ణుని మాటలు మరింత పరుషంగా ఉన్నాయి. అయితే, వాస్తవంగా నింద ప్రారంభించింది శల్యుడు. అతని మాటలు ఇంకా పరుషంగా ఉంటాయి. అంటే, కర్ణుని నింద ప్రతినింద మాత్రమే.

కర్ణుడు యుద్ధానికి బయలుదేరగానే శల్యుడు నిందకు తెరదీశాడు. కర్ణుని కులాన్ని ఎత్తి చూపి మాటి మాటికీ ‘సూతపుత్రుడి’గా అతనిని సంబోధిస్తూ తూలనాడాడు. అర్జునుడి పరాక్రమాన్ని అదేపనిగా ఆకాశానికి ఎత్తి ఈసడింపు మాటలతో కర్ణుని కుళ్లబొడిచాడు. ఎంగిళ్లు తిని కొవ్వెక్కిన కాకితో అతనిని పోల్చుతూ కాకి-హంస కథ చెప్పాడు.  ఉబికి వచ్చే కోపాన్ని కర్ణుడు మొదట్లో బలవంతాన అణచుకున్నాడు కానీ,  శల్యుడు ఎంతకీ తగ్గకపోవడంతో తనూ నోరు చేసుకున్నాడు. మొత్తానికి ఇద్దరూ కలసి కుల, ప్రాంత విద్వేష భారతస్వరూపాన్ని అత్యంత నగ్నంగా ఆవిష్కరించారు.

కులనింద, ప్రాంత నింద చరిత్ర పొడవునా జరుగుతూనే ఉన్నాయి. వాటి బీజాలు ఒకనాటి సామాజికమైన అమరికలోనే కాక, నాటి నిరంతరాయమైన వలస జీవితంలోనూ ఉన్నాయి.  మనదేశంలో పశ్చిమ, వాయవ్యాల నుంచి తూర్పుకు వలసలు జరుగుతూ వచ్చాయి. ఆ వలసల క్రమంలోనే వర్ణ లేదా కులవ్యవస్థ; రాజ్యం; నాగరికత, సభ్యత, సంస్కారం, శీలం, గుణగణాల గురించిన భావనలు వృద్ధి చెందుతూ వచ్చాయి. ఇంకొంచెం అర్థమయ్యే పోలికతో చెప్పుకోవాలంటే, నేడు పల్లె నుంచి పట్నానికి మారడం లాంటిదే ఇది కూడా. పట్న జీవితంలోని నాజూకును, వేషభాషలను అలవరచుకున్న కొద్దీ పల్లె జీవితం మోటుగా, అనాగరికంగా కనిపిస్తుంది. పల్లె జనాన్ని పల్లెటూరు బైతులని వెక్కిరించడం ఇప్పటికీ చూస్తుంటాం.

అందరూ కట్ట కట్టుకుని వలసపోరు. కొంతమంది ఉన్నచోటే ఉండిపోతారు. అప్పుడు వలస పోయేవారికీ, వీరికీ మధ్య భౌగోళిక దూరమే కాక; జీవనవిధానాలలో కూడా దూరం పెరుగుతుంది. శల్యుడు ఇంకా బాహ్లిక, మద్రదేశాల దగ్గరే ఉంటే, సాటి క్షత్రియులతో సహా అనేకమంది జనాలు తూర్పుకు వచ్చేశారు. బాహ్లిక, మద్ర దేశాలలో అప్పటికింకా వెనకటి సామాజిక రూపమే కొనసాగుతోంది. కర్ణుడు దానినే ఎత్తిచూపి ఆక్షేపించాడు. అది మాతృస్వామ్య సామాజిక రూపం కావచ్చునా అనే చర్చను ప్రస్తుతానికి పక్కన పెడితే, శల్యుడు కులం రీత్యా ఉన్నతస్థానంలో ఉండగా, కర్ణుడు ప్రాంతం రీత్యా ఉన్నతస్థానంలో ఉన్నాడు. శల్యుడు కర్ణుడి కులాన్ని ఎత్తి కించపరిస్తే; శల్యుని క్షత్రియాధమునిగా కర్ణుడు సంబోధిస్తూ అతని ప్రాంతాన్ని ఎత్తి కించపరిచాడు.

కులదర్పం ఇంతగా కరడుగట్టిన శల్యుడు కర్ణునికి రథసారథి కావడానికి అసలెందుకు ఒప్పుకున్నాడు? అదెలా జరిగిందంటే, శల్యుని తనకు సారథిని చేయమని కర్ణుడే దుర్యోధనుని అడిగాడు. అది కూడా శల్యుని పట్ల ప్రశంసా భావనతోనే. కృష్ణుని సారథ్యంలో అర్జునుడు మరింత అజేయుడవుతున్నాడు కనుక, అశ్వజ్ఞానంలో కృష్ణునికి సాటి వచ్చే శల్యుని నాకు సారథిని చేస్తే అర్జునుని అవలీలగా గెలుస్తానన్నాడు. దుర్యోధనుడు కర్ణుని వెంటబెట్టుకుని శల్యుని దగ్గరకు వెళ్లాడు. అతన్ని అనేకవిధాలుగా ఉబ్బేసి కర్ణునికి రథసారథ్యం చేయమని కోరాడు.

ఆ కోరిక శల్యునిపై ఎంత పిడుగుపాటు అయిందో తిక్కన అద్భుతంగా చిత్రిస్తాడు.  అప్పుడు శల్యుని కళ్ళు కోపంతో జేవురించాయి. నుదుట చెమటలు పట్టేశాయి. ఇంత నీచమైన పనికి నన్నెలా నియోగిస్తావు, నీకు వర్ణధర్మాలు తెలియవా, మూర్ధాభిషిక్తులైన రాజులు ఎన్నడైనా శూద్రులకు పరిచర్యలు చేశారా అని దుర్యోధనుని నిలదీశాడు. సూతపుత్రుడైన కర్ణుని దొరగా చేసుకుని నన్ను సారథ్యం ఎలా జరపమంటావు, అదీగాక కర్ణుడు నాకన్నా బలవంతుడా అని ప్రశ్నించాడు. తెలియక నువ్విలా కోరి ఉంటావు, ఒకవేళ తెలిసీ కర్ణుని మీద పక్షపాతంతో నన్నిలా అవమానించదలచుకుంటే ఇప్పుడే మా దేశానికి వెళ్లిపోతానంటూ రాజుల మధ్యలోంచి చివాలున లేచి బయటకు నడిచాడు. అప్పుడు దుర్యోధనుడు అతనిని ఆపి బుజ్జగించాడు. ఒక్క కర్ణుడే దేనికి, నిన్ను మించిన వీరులు ఎక్కడా లేరు; అశ్వహృదయం తెలియడంలో కృష్ణుని కన్నా కూడా నువ్వు ఎక్కువ కనుకే ఈ కోరిక కోరానన్నాడు. ఆ మాటతో శల్యుడు చల్లబడ్డాడు. ఇంతమంది రాజుల మధ్య నన్ను కృష్ణుడికంటే ఎక్కువన్నావు కనుక ఒప్పుకుంటున్నాను; అయితే ఒక షరతు, నేను కర్ణునితో విచ్చలవిడిగా, తోచినట్లు మాట్లాడతాను, నన్ను తప్పుపట్టకూడదు అన్నాడు.

శల్యుని కులనిందా ప్రతిధ్వనులు ఇప్పటికీ భారతదేశమంతా వినిపిస్తూనే ఉండడం చరిత్ర అవిచ్ఛిన్నతకు సాక్ష్యం. కులనింద; కులం, ప్రాంతం, మతం, ఆచారాలు, విశ్వాసాల పట్టింపు; ఆ పట్టింపుతో ఎంతటి అమానుషానికైనా తెగించడం-ఇవన్నీ ఒకే మానసికప్రవృత్తికి చెందినవి. ఈ మానసిక ప్రవృత్తి కొన్ని ప్రాంతాలలో, కొన్ని వర్గాలలో చాలా ఎక్కువగా, కొన్ని ప్రాంతాలలో సాపేక్షంగా తక్కువగా వ్యక్తమవుతుంది. ఇందుకు చారిత్రక, భౌగోళిక కారణాలు ఉన్నాయి. దక్షిణభారతంతో పోల్చితే ఉత్తరభారతం, అందులోనూ పశ్చిమ, వాయవ్య ప్రాంతాలే చరిత్రకు అసలైన వారసులు. ఉత్తరభారతమే ఈ దేశానికి అన్నివిధాలుగా ప్రయోగశాల. ఈ దేశంపై జరిగే దాడులను తట్టుకున్నవీ, ప్రతిఘటించినవీ ప్రధానంగా ఆ ప్రాంతాలే. అందుకే అక్కడినుంచే వీరులూ ఉద్భవించారు; అక్కడే రకరకాల మౌఢ్యాలూ  పెద్ద మోతాదులో తిష్టవేశాయి. ఆడశిశువుల భ్రూణ హత్యలూ, పరువు హత్యలూ, మతకల్లోలాల చిరునామా ఇప్పుడు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఇండియా-భారత్ అని రెండు ఉన్నాయంటారు. నా ఉద్దేశంలో వాటికి మరో రెండు కలుపుకోవాలి: ప్రైవేట్ భారతం, పబ్లిక్ భారతం. భారతదేశ వాస్తవికత ప్రైవేట్ భారతంలోనూ, ప్రైవేట్ సంభాషణల్లోనే ఉంది.

అదలా ఉంచితే, శల్యుడు చెప్పిన కాకి-హంస కథ వేరే కారణంతో అపురూపంగానూ, ఆసక్తికరంగానూ అనిపిస్తుంది. ఆ కథ ఇదీ:

సముద్రంలో ఒక గొప్ప ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో ధర్మవర్తి అనే రాజు పురంలో ఒక సంపన్న వైశ్యుడు ఉండేవాడు. అతనింట్లోకి ఓ రోజు ఓ కాకి ప్రవేశించింది. ఆ వైశ్యుని కొడుకులు ఎంగిళ్ళు తినిపించి దానిని పోషిస్తూ వచ్చారు. దాంతో దానికి  కొవ్వెక్కింది. ఎలాంటి పక్షి అయినా తనకు సాటి రాదన్న అహంకారం పెరిగిపోయింది.  అంతలో ఒకనాడు కొన్ని హంసలు ఆ సమీపంలో కనిపించాయి.  ‘తారతమ్యం తెలియని’ ఆ వైశ్యపుత్రులు వాటిని కాకికి చూపించి, పక్షులలో నీ అంతవారు లేరు కనుక ఆ హంసలతో పోటీ పడి ఎగిరి వాటిని ఓడించు అన్నారు. అప్పుడు కాకి వాటి దగ్గరకు వెళ్ళి, ఓ హంసను గుర్తించి, తనతో సమానంగా ఎగరమని సవాలు చేసింది.  అప్పుడా హంసలన్నీ నవ్వుతూ, మేము మానససరోవరం దగ్గర ఉండేవాళ్లం, మా బలాన్ని వేగాన్ని అన్ని పక్షులూ పొగడుతాయి. మేము ఎక్కడికైనా, ఎంతదూరమైనా వెళ్లగలం, మాకు ఎలాంటి అలసటా రాదు, హంసలను పోటీకి రమ్మని కవ్వించిన కాకిని మేమింతవరకూ చూడలేదు, పైగా మా అందరిలోనూ బలశాలినే ఎంచుకున్నావు, అన్నాయి.

అప్పుడా హంసతో  కాకి, నూటొక్క గతుల్లో నేను ఎగరగలను, ఒక్కొక్క గతిలో వందయోజనాలు వెళ్లగలనంటూ తను చేయగల విన్యాసాలను వర్ణించింది. దానికా హంస, నాకా మార్గాలన్నీ తెలియవు, పక్షులన్నీ ఎగిరే ఒక్క మార్గమే తెలుసు, ఎగురుదాం పద, అంది. రెండూ సముద్రం మీద ఎగరడం ప్రారంభించాయి. చూస్తుండగానే కాకి హంసను దాటిపోయింది. ఇక హంస పని అయిపోయిందని నిర్ణయానికి వచ్చేసి గాలిలో తన విన్యాసాలను మొదలుపెట్టింది. మధ్య మధ్య మళ్ళీ వెనక్కి వచ్చి హంసను వెక్కిరించింది. హంస మాత్రం నిబ్బరంగా సమగతిలో సాగిపోయింది.

కొంతసేపటికి కాకి అలసిపోయింది. వేగం తగ్గిపోయింది. మనసులో అలజడి మొదలైంది. కాలు మోపడానికి ఎక్కడా ఓ చెట్టూ, పుట్టా లేవే అనుకుని కలవరపడింది.  దైన్యం ఆవహించింది. ఎరక్కపోయి ఇరుక్కున్నాననుకుంది. క్రమంగా కిందికి దిగిపోవడం ప్రారంభించింది. అది గమనించిన హంస, ఎన్నో గతులు తెలుసన్నావుగా, ఇది ఏ గతి అని పరిహాసమాడింది.  చివరికి ఎగిరే ఓపిక పూర్తిగా నశించి సముద్రంలో మునిగిపోయే దశలో, ఎంగిళ్ళు తిని కొవ్వెక్కి నీతో పోటీపడ్డాను, బుద్ధొచ్చింది, నన్ను కాపాడి కాకుల్లో కలుపు అని కాకి ఆ హంసను ప్రార్థించింది. అప్పుడు హంస తన కాళ్లమధ్య కాకిని ఇరికించుకుని పైకిలాగి తన వీపున ఎక్కించుకుని తెచ్చి ఒడ్డున పడేసింది.

సరే, శల్యుడు ఈ కథ చెప్పడంలో ఉద్దేశం కర్ణుని ఎంగిలి కూడు తినే కాకి తోనూ, అర్జునుని హంసతోనూ పోల్చడమని తెలిసిపోతూనే ఉంది. దానినలా ఉంచితే, ఇక్కడ కుతూహలం కలిగించే అంశం, పరుగు పందెంలో పాటించే ఒక ముఖ్యసూత్రాన్ని ఇది వెల్లడించడం. ఒలింపిక్స్ లో చూసే ఉంటారు, ముందే వేగంగా పరుగెత్తినవారి కన్నా పరుగులో వెనకబడిన వారిలోనే ఒకరు అంతిమంగా ముందుకొచ్చి పతకం గెలుచుకుంటూ ఉంటారు. అంటే సమగతిలో మొదట పరుగెత్తి, తద్వారా శక్తిని కాపాడుకుంటూ చివరి అంచెల్లో దానిని ఒడుపుగా వాడుకుంటారన్నమాట. కాకి-హంసల పరుగులో కనిపించినది ఆ తేడాయే.

ఇంతకీ ప్రశ్న ఏమిటంటే,  భారతదేశంలో కూడా ఆనాడు పరుగుపందేలు ఉండేవా? ఉంటే, అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? లేక శల్యుని కథనం వెనుక నాటి గ్రీసు ఒలింపిక్స్ గురించి విన్న ముచ్చట్ల ప్రభావం ఉందా? నాడు భౌగోళికంగా అది సాధ్యమే కూడా.

పరిశీలించవలసిన కోణమే…

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

—కల్లూరి భాస్కరం

 

 

 

 

                                      

Download PDF

5 Comments

  • ఎన్ వేణుగోపాల్ says:

    భాస్కరం గారూ,

    మీ ఈ ధారావాహిక చాల ఆసక్తిదాయకంగా సాగుతోంది.

    ఈ సారి మీరు అలవోకగా (అని నేననుకుంటున్నాను, మీరు ఉద్దేశపూర్వకంగానే, పూర్తి అవగాహనతోనే రాసి ఉంటే మరీ సంతోషం) రాసిన రెండు వాక్యాలు — “రెండు కాలాల మధ్య గొప్ప గుణాత్మక విభజన ఉందని నేను అనుకోను” “…ఇప్పటికీ భారతదేశమంతా వినిపిస్తూనే ఉండడం చరిత్ర అవిచ్ఛిన్నతకు సాక్ష్యం” — చాల కీలకమైనవి. భారత చరిత్రలో, రాజకీయార్థిక శాస్త్రంలో ఈ చర్చ చాల జరిగింది. జరుగుతోంది. భారత సమాజంలో సమాజాన్నీ, వ్యక్తినీ గుణాత్మకంగా మార్చగల విప్లవం (పాశ్చాత్య సమాజాలలో బూర్జువా ప్రజాస్వామిక విప్లవం లాంటిది) రాలేదని, ఉత్పత్తి సాధనాల, ఉత్పత్తి సంబంధాల అవిచ్ఛిన్నత సాగుతున్నదని ఒక వాదన.

    ఆ వాదనలు ఎలా ఉన్నా మీ రచన చాల చాల బాగుంది. కొనసాగించండి.

    • కల్లూరి భాస్కరం says:

      వేణుగోపాల్ గారూ,

      మీ స్పందన చాలా సంతోషం కలిగించింది. ధన్యవాదాలు.

      ‘ఈసారి మీరు అలవోకగా రాసిన రెండువాక్యాలు’ అన్నారు కనుక కొంచెం వివరణ అవసరమనిపించింది. ఆ వాక్యాలలోని అభిప్రాయాన్ని నేను ఈసారి మాత్రమే వ్యక్తం చేయలేదు. కనీసం పదేళ్లుగా నేను ఆ అభిప్రాయాన్ని బహుముఖాలుగా వ్యక్తంచేస్తూనే ఉన్నాను. ఈ ధారావాహికలోని వ్యాసాలలోనే (‘దేవదాసు’ ఇంకో ప్రేమకథ కాదు, ఎవరి రహస్యం వాళ్ళదే, ఎవరి భాష వాళ్ళదే) కాక, ఈ మధ్యకాలంలో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన నా వ్యాసాలు రెండు మూడింటిలోనూ, సూర్య పత్రికలో మహాభారతంలోని సర్పయాగంపై 21 వారాలపాటు నేను రాసిన వ్యాసాలలోనూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరచాను. దేనినైనాసరే, అలవోకగా రాయడానికి నేను ఇష్టపడను. పురాచరిత్ర, చరిత్ర, మతం, సాహిత్యం,సంస్కృతి వగైరాల మార్గంలో నేను పై అభిప్రాయానికి వచ్చాను. ఇందులో రాజకీయార్థికశాస్త్ర కోణం కూడా ఉండడాన్ని నేను గుర్తించడమే కాక ఆ విషయాన్ని నా సర్పయాగం వ్యాసాలలో కొంతమేరకు చర్చించాను కూడా. ఇది ఇంకా కొనసాగుతున్న వ్యాసపరంపర కనుక ముందు ముందు ఆ కోణం మరింత చర్చలోకి రావచ్చు.

      మీ ప్రోత్సాహకర స్పందనకు మరోసారి ధన్యవాదాలు.

  • వేణు says:

    భాస్కరం గారూ! ఆసక్తికరంగా ఉంది మీ వ్యాసం.

    శల్యుడి ‘కాకి- హంస’ కథనంపై గ్రీసు ఒలింపిక్స్ ప్రభావం ఉందేమో అనే మీ పరిశీలన బాగుంది.

    వ్యక్తిగత నిందకు పరిమితి ఉంటుంది. అందుకే ఇంకా తీవ్రంగా అవమానించటానికి కుల- ప్రాంత పరమైన దూషణ! భారత రచనాకాలం నాటి మన సమాజ చిత్రం స్థూలంగా చూస్తే ఏమీ మారలేదన్నమాట.

    • కల్లూరి భాస్కరం says:

      వేణు గారూ..,

      కుల-ప్రాంత నింద గురించి మీరన్నది నిజం. స్పందనకు ధన్యవాదాలు.

  • MSK Kishore says:

    చాల బావుంది అంది మీ వ్యాసము… థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్…
    ఠంక్ యు
    మస్క్ కిశోరే

Leave a Reply to కల్లూరి భాస్కరం Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)