క్షీరసాగరం

maithili

మైథిలి కి చదవటం చాలా ఇష్టం. ఇన్ని సంవత్సరాలలో ఇది నాలుగో కథ. మొదటి రెండు  కథలు 2001,2003 లలో వార్త లో వచ్చాయి.మొదటి కథ  ‘ నియతి ‘ 2001 తెలుగు యూనివర్సిటీ కథాసంకలనం లోనూ,జగతి పత్రికలోనూ , నాటా 2013 సంచికలోనూ పునర్ముద్రితమయింది. చక్కటి చదివించే శైలి ఆమె సొంతం. –వేంపల్లె షరీఫ్

***

 

 

కనుచీకట్లలో మెడికల్ హాస్టల్ కాంపస్.  ప్రవల్లిక కోసం వెతుకుతూ ఆ వెనకాల లాన్ లోకి నడిచింది ఆముక్త. అమ్మాయిలు చదువుకోవటానికి అక్కడక్కడా దీపాలూ అరుగులూ. ఏ వెలుగూ పడని ఒక మూల కూర్చుంది ప్రవల్లిక. దగ్గరగా వెళ్తే తలెత్తిచూసిందేగాని  నవ్వలేదు. అంత త్వరగా నవ్వదు ఆమె. కఠినంగా బిగిసిఉండే ముఖరేఖలు. మెల్లగా వెళ్లి పక్కన కూర్చుంది ఆముక్త.
బహుళ పాడ్యమి కాబోలు ఆ రోజు…అప్పుడే పైకిలేస్తూ ఉంది చంద్రబింబం.  పాలజలనిధిలోని తెలిపచ్చని మీగడ ముద్దకట్టి వెలుగుతూంది.

‘వల్లీ చూడు…ఎంత బావుందో ‘ …అప్రయత్నంగా అంది

. ‘ఏమిటి చూసేది…చాలాసార్లు చూశాలే…చందమామేగా. ‘

‘అది కాదు. ఏ రెండుసార్లూ ఒకేలా ఉండదు.’ మైమరపు.

‘ నీ మాటలకేంలే… వేరే ఎవరికైనా చెప్పు, నాకు కాదు.’  స్పష్టమైన తిరస్కారం.

పట్టించుకోకుండా అడిగేసింది  ‘ రేపటినుంచీ సెలవలుగా, మా ఊరు వస్తావా? ‘

‘ ఎందుకట అంత జాలి మామీద..’ చేదు ఉబికే  మాటలు.

‘ పండగ రోజుల్లో ఒక్కదానివీ ఏం చేస్తావు? మా ఇంటికి వస్తే బావుంటుందనిపించి అడిగాను. దీన్ని జాలి అనక్కర్లేదు నువ్వు ‘

కాస్త తగ్గింది ప్రవల్లిక. ‘ ఎందుకు రావాలి నేను? నేను ఉంటే ఎవరికైనా బాగుంటుందని ఎప్పుడూ అనుకోలేదే ‘ ఆముక్త జవాబు చెప్పలేదు. ‘సరేలే. వస్తాను. మంచి అమ్మాయిలా ఉండాలంటే మాత్రం నా వల్ల కాదు ‘

‘నువ్వు ఎలా ఉండగలిగితే అలాగే ఉండు. …  ‘ నవ్వేసింది.

ఎక్కడివాళ్లు అక్కడ ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్ ని అప్పటికే ఖాళీ చేసేసారు. ప్రవల్లిక గడిచిన నాలుగేళ్లుగా ఎక్కడికీ వెళ్లలేదు. ఆమెకి అసలు ఎవరైనా ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలియదు. హాస్యం లేని వ్యంగ్యం ఆమె సొంతం. ఆ వెటకారానికి అడ్డూ అదుపూ ఉండవు. తన మాటలు కనపడని చోట్ల సూదులు గుచ్చినట్లుంటాయి. చెప్పకూడని నిజాలని చర్చకి పెట్టినట్లుంటాయి. ఆ బెదురుతో ఎవరూ తనకి దగ్గరగా వచ్చే సాహసమే చేయరు. ఎక్కడా పరీక్ష తప్పకుండా రాగలిగేటంత చదువుతుంది. తక్కిన సమయాల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కనిపిస్తుంది. ఏమి పాటలు వింటుందో కూడా ఎవరూ అడగరు.

పరీక్షగా చూస్తే ఆ కళ్లు బంధించబడిన జంతువువిలాగా ఉంటాయి. ఆ తీరు ఎవరూ దాడిచేయకుండా రక్షించుకుంటున్నట్లుంటుంది.

ఆముక్త  వేరు. అక్షరాలా ఆనంద కర్పూర నీరాజనం ఆమె. ఉత్సాహమూ ఊరటా రెండిటినీ ఆమె సమక్షంలో గుర్తు పట్టిన కొందరు దగ్గరే ఉంటారు. అంతుపట్టని ఇంకొందరు వెంట తిరుగుతారు

ఎవరినీ తూలి ఒక మాట అనదు. పొరపాటున ఎవరయినా అంటే దెబ్బలాడదు. కష్టపడి చదువుతుంది.. ప్రసన్నమైన ముఖం. ఆమె సౌజన్యమే సౌందర్యమనిపిస్తుంది.

ksheera1

ప్రవల్లిక సడలి మాట్లాడటం కొంతకాలం క్రితం జరిగింది. హాస్టల్ వర్కర్ భార్య రెండేళ్ల బాబుని భర్త తో వదిలేసి తన బావతో వెళ్లిపోయింది. వారిద్దరి మధ్యా ఎప్పటినుంచో సయోధ్య ఉండేది కాదు. అందుకని ఎవరూ అంతగా ఆశ్చర్యపడలేదు. తేలికగా మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారిగా గట్టిగా అరిచింది . ‘ బుద్ధిలేదా? మనిషి పుటక పుట్టలేదా? ఇష్టం లేకపోతే పిల్లాడిని ఎందుకు కన్నది? ఇంతమందిమి ఉన్నాము ఇక్కడ, ఎవరిని అడిగినా చెప్పేవాళ్లం కదా జాగ్రత్తలు …ఇప్పుడు వాడి గతి ఏమిటి? ‘ కోపం కాస్తా బాధగా మారి గొంతు బొంగురు పోయింది. చరచరా అక్కడనుంచి వెళ్లిపోయింది.ఆమెలో ఆ మెత్తదనాన్ని  ఆముక్తఒక్కటే పట్టించుకుంది. కాలేజ్ లో చేరినప్పటినుంచీ ప్రవల్లికకి దగ్గర అవుదామని ప్రయత్నిస్తూనే ఉంది ఎందుకనో… తనకి నచ్చే విషయాలని ప్రయత్నించి తెలుసుకుంది. ధైర్యం చేసి ప్రస్తావించింది. భగీరథప్రయత్నం కొంత ఫలించి ఏదయినా  అడిగితే జవాబు చెప్పే దశ వచ్చింది.

ఆ చుట్టూ కట్టుకున్న గోడ బద్దలు కొట్టి లోపల ఏముందో చూడాలని, కుతూహలం ఒక్కటే కాదు. ఏదో అక్కర . ఈ  పరిసరాల నుంచి  నాలుగురోజులు దూరం చేయాలని.ఎందుకూ అని తనను ప్రశ్నించుకుంది ఆముక్త. ‘ తన ఇల్లు తనకి ఇష్టం, ప్రవల్లికకి నచ్చుతుందనేమిటి? ‘

ఏమో తెలియదు, పిలిచింది అంతే.

ఆ వేసవికి చివరిఏడాది అయిపోతుంది. హౌస్ సర్జన్ లుగా అంత తీరుబాటు ఉండదు. పోస్ట్ గ్రాడ్యుయేట్  ఎంట్రన్స్ కి చదువుకోవాలి పనిచేస్తూనే. . మళ్లీ కుదురుతుందో లేదో..!

తండ్రి స్టేషన్ లోఎదురు చూస్తున్నాడు.  .. కాస్త సన్నగా దృఢంగా పొడుగ్గా హరిచందనపుతరువు  లాగా ఉన్నాడు ఆయన.   వాత్సల్యం చిందేలా నవ్వి ఆముక్తని దగ్గరకి తీసుకుని ప్రవల్లిక  చేయి పట్టుకున్నాడు . ఆ పెద్ద అరచేతిలో ఆమె చేయి ఇమిడిపోయింది, సుభద్రంగా ఉన్న స్పర్శ.

ఒక మోస్తరు పట్టణం అది.ఊరు దాటుతూనే ఇంకొక ఊరు పేరు వచ్చేసింది. జనసాంద్రత ఎక్కువ అంటే ఇదేనేమో … ఈ కొత్తఊరికి కాస్త పల్లెటూరి వాలకం ఉంది.

ఆ దారిలోంచి ఒకవైపుకి తిరిగి పెద్ద ప్రాంగణం లోకి వెళ్లారు. . డా. ఎస్.టి.పి. కులశేఖర్ ఎం.డి. అని బోర్డ్. కిటకిటలాడుతూ పల్లె జనం.

అంతా హాస్పిటల్ వాతావరణం.

దాటివెళ్తే ఇంకొక ఆవరణ. ఆలోపల వింతగా కనిపించే వాళ్ల ఇల్లు…విశాలమైన ఉద్యానం మధ్యని. కాస్త దూరంగా తులసివనం.

వాకిట్లో చుట్టూ బంతిపూలు. అరచేయి అంత పెద్దపూలు విరగబూసి గుమిగూడి ఆకులే కనిపించటం లేదు. దగ్గరికి వెళ్లి ఒక పూవులోకి ముఖం వంచింది ఆముక్త , ముద్దుపెట్టుకుంటోందా అనిపించేలా.

‘ బంతిపూలకి  మంచి వాసన ఉంటుంది తెలుసా .. ‘

ఆ ఇల్లు ఇంచుమించు గుండ్రంగా ఉంది.చుట్టూ వరండా  .  ఒక వైపుకి వాలిన మంగళూరు పెంకుల కప్పు.గోడలంతా టెరకోటా.

లోపలికి అడుగు పెడుతూనే అగరు  పరిమళం  హాయిగా ఉంది ముంగిటిలోనే పెద్ద వర్ణచిత్రం. ఒక పెద్ద దేవాలయ గోపురం  పైన నిలబడి ఏదో చెబుతున్న యతీంద్రుడు. నొసట  ఊర్ధ్వపుండ్రాలు, ముఖంలో జాలువారుతూన్న కరుణ. చేతులు జోడించి వింటున్న జనం .

తక్కిన అన్ని వైపులా పెద్దవీ చిన్నవీ పెద్దవీ తైలవర్ణచిత్రాలూ నీటిరంగులవీ. కొన్నిచోట్ల చక్కటి  చట్రాలలో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి, ఇంకొన్నినమ్రంగా  ఒదిగిపోయాయి. గులాబీరంగు గోడలు, పాలపిట్ట వన్నె  పరదాలు.

‘ నాన్న పెయింట్ చేస్తారు ‘

“ఆరా” లని గుర్తుపట్టగలవారికి అక్కడ కెంపుజలతారు వంటి,  ఇంద్ర  నీలాకాశం వంటి,మెత్తగా మెరిసిపోయే  నెమలికంఠం వంటి కాంతివలయాలు కనిపిస్తాయేమో.

ఆ తర్వాతిరోజులలో  ప్రవల్లిక అనుకునేది, ఆ ఇల్లు చేతులు చాచి తనని పిలిచిందని.

.తల్లి మొహం ఇంత చేసుకుని ఎదురువచ్చింది. ‘ రండి, రండి! ‘  చాలా చక్కగా ఉంది ఆమె. ఆముక్త  కి అమ్మా నాన్నా ఇద్దరి పోలికలూ రానట్లుంది.

.’ పాలా? ఇష్టం లేదు ‘ ముఖం చిట్లించింది.

‘ ఒకసారి రుచిచూడు ‘

పచ్చకర్పూరం, కలకండ వేసి కాచిన పాలు..ఒక్క గుక్క తాగాక మొహమాటానికయినా ఆపాలనిపించలేదు … తెలియకుండానే మనసు చల్లబడింది.

ఆ ఇంట్లో కొన్ని చోట్ల  దీపాలు లేకుండానే వెలుతురు,ఇంకొన్ని  చోట్ల ఫాన్లు తిరగకుండానే వీస్తున్న గాలి అలలు.

‘ మయసభలా ఉంది మీ ఇల్లు ‘ ఆ వెటకారంలో వంకర లేదు.

‘ అవును, అలాంటిదే. లారీ బేకర్ అనే ఆర్కిటెక్ట్ పేరు వినేఉంటావు. వీలైనంతగా ప్రకృతికి దగ్గరగా ఉండటం ఆయన ఉద్దేశ్యం. అలా కట్టటం లో ఖర్చు కూడా తక్కువని చెప్పేవారు .కేరళలో చాలా కట్టారు  ఇలాంటివి. నాన్న విని వెతుక్కుంటూ వెళ్లి పరిచయం చేసుకుని ఒప్పించారట , అప్పటికే ఆయన పెద్దవారయిపోయారు . ‘

మనుషులు ఇలా కూడా ఉంటారా? నమ్మబుద్ధి కాలేదు .

తనకి ఒక చిన్న గది ఇచ్చారొక చివరన. పసుపురంగు  గోడలు, చిన్న పసుపుపూలు ఉన్న దుప్పటి మంచం మీద. ఇక్కడి పాశ్చాత్యచిత్రంలో నిశ్చింతగా  ఆడుకుంటున్న అక్కాచెల్లెళ్లు.

స్నానం చేసి వచ్చేటప్పటికి వంటగదిలోనుంచి అంతుపట్టని సువాసనలు  ..

తను ఎన్నడూ తినని పదార్ధాలే అన్నీ.  ఎర్రగా వేయించిన పల్చటి  దొండకాయ ముక్కలు, చారులో  ఇంగువ వాసన వేసే పోపు . మెంతిపిండి వేసిన మామిడిముక్కల పచ్చడి.. ఆశ్చర్యకరంగా సయించకపోవటమేమీ లేకపోగా ఇంకాస్త ఆకలి పెరిగిందేమో కూడా.

ఒక మూల ఎక్కడో టి.వి. కనపడింది. దాన్ని ఆన్ చేసే ధోరణిలో ఎవరూ లేరు. పొందికగా అందమయిన బట్ట కప్పి ఉంది.’  ఏమిటి చేస్తారు వీళ్లు నిద్రపోయేలోపు? ‘ ప్రవల్లిక సందేహం.

సమాధానంగా తంబురా తీసుకు వచ్చింది ఆముక్త .

‘ అమ్మ బాగా పాడుతుంది . సంగీతం ఇష్టమేకదా నీకు, ఎప్పుడూ వింటూనే కనిపిస్తావు ! కాసేపు పాడుకుంటాము, ఉంటావా ?…’

‘ ఉండనీ. ‘ మందలింపుగా నవ్వింది  వసంత.

శృతిచేసుకొని  పాడటం ప్రారంభించింది. ఆమె గొంతులో ఒదుగు ప్రత్యేకంగా ఉంది.. ఆర్ద్రంగా, లోలోపలినుంచి సరాసరి భగవంతుడికే పాడుతున్నట్లు. ముక్త గొంతు కలిపింది. సింధుభైరవి రాగం అది. విషాదం, వేదన…అంతలోనే ఉపశమనం వినేవారికి. అన్నిటికీ తానూ లోనయి లీనమై ఉండిపోయింది  ప్రవల్లిక.  కులశేఖర్ వాలు కుర్చీలో కళ్లు మూసుకొని వింటున్నాడు. తాను దారితప్పి ఏపాత పుస్తకం  లోకో దూరిపోయానా అనుకుంది . .. ప్రవల్లిక వింటూనేఉంది.

ksheera2

తొందరగా నిద్రపోయారు అందరూ. తెరచి ఉన్న కిటికీ లలోంచి తోట లోపలి పూల గాలి. ఎప్పుడూ వినే భారలోహ సంగీతం కాకుండా ఏదో మూడ్ లో డౌన్ లోడ్  చేసుకున్న  బ్రాహం  లల్లబీ ని వింటూ నిద్రని కనుగొన్నది ఆమె.

పెందలాడే నిద్రపోయిందేమో, ఒక రాత్రి వేళ మెలకువ వచ్చేసింది. గడియారం  చూస్తే నాలుగయింది.  ఎక్కడినుంచో సన్నగా ఏదో అంటున్నట్లు  వినిపిస్తోంది. మెల్లగా ఆ ధ్వనినిబట్టి, కర్పూరపు సుగంధం జాడను బట్టి  వెళ్తే అక్కడ పూజ గది. కులశేఖర్  ఎర్రటి పట్టుధోవతి కట్టుకుని ఉత్తరీయం కప్పుకుని   నెమ్మదిగా చదువుకుంటున్నాడు. అది సంస్కృతమూ తెలుగూ అయితే కాదు.చేత్తో చిన్న గంటని మోగించి హారతి ఇచ్చి పక్కనపెడుతూ వెనక్కి తిరిగాడు.వెడల్పుగా ఇంత పొడవున తెల్లని రెండు నామాల మధ్య సిందూరవర్ణపు నామం, కింద చిన్న పాదం. నిద్రకళ్లేసుకుని  చూస్తున్న ఆమెని  చూస్తే ముద్దొచ్చి నవ్వాడు. బదులుగా  కాస్త నవ్వేసి వెళ్లి పడుకుంది.

తెల్లారి  బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర క్లినిక్ కి వెళ్లే డాక్టర్ దుస్తులలోనే కనిపించాడు.కడిగిన ముఖం మీద నిలువుబొట్టు లీలగా కనిపిస్తోంది. వసంత మెత్తటి ఇడ్లీలతో కొబ్బరిపచ్చడి వడ్డించింది.

‘ ఆగు. ముందు ఇది తిను ‘

కిచిడీ లాంటిదేదో పెట్టారు ప్లేట్ లో.

‘ పప్పుపొంగలి. నాన్న ధనుర్మాసం చేస్తారుగా, ప్రసాదం తయారు చేశారు. .భలే ఉంటుంది. ‘

వసంత నవ్వుతూ అంది ‘ఎందుకు బావుండదూ, బోలెడు నెయ్యి పోస్తే !’

పరాచికానికేమిగాని దివ్యంగా ఉంది పొంగలి.

‘మీ ఇళ్లలో మగవాళ్లు వంట చేస్తారా ?’

‘ఇప్పటిసంగతేమో కాని, ఒకప్పుడు మగవాళ్లకి వంట రావటం తప్పనిసరి.’

‘ధనుర్మాసం అంటే?’

‘మార్గశిరం, పుష్యమాసం రెండింటిలోని 30 రోజులని కలిపి అలా అంటారు. బ్రాహ్మీ ముహూర్తం లో తిరుప్పావై చదువుతారు. నైవేద్యాలు పెడతారు.’

‘ అంటే తమిళమా, మీ నాన్నగారు చదివింది?అర్థమవుతుందా? ’

‘ కొన్నాళ్లు పాఠం చెప్పించుకున్నారు తెలిసినవారితో. తెలుగులో కృష్ణశాస్త్రి గారూ ఇంకొందరూ అనువదించారు కదా. ’

‘ మరి హాయిగా తెలుగులోనే చదువుకోవచ్చు కదా ? ’

‘వల్లీ అది దివ్యప్రబంధంలో భాగం.ఆండాళ్ నోటివెంట వచ్చిన మాటలని అలా  పైకి తలచుకోవటమే  విష్ణుప్రీతికరమని అనుకుంటారు. ఆమె ధరించి ఇచ్చిన మాలలని తప్ప ఇష్టపడని వాడు కదా ఆయన!

ఈ శ్రీవైష్ణవ పద్ధతిలో శ్రీ ని అర్చించకుండా విష్ణువు ని పూజించకూడదంటారు. ఆ తల్లి మన ఆర్తీ యోగ్యతా చూసి తండ్రితో చెప్తుందని.

ఆ బొమ్మ చూశావు కదా…నాన్నే వేశారు. ఆయన భగవద్రామానుజులు. గురువు ఆయనకి మంత్రోపదేశం చేసి , “తరింపజేసే ద్వయమంత్రం ఇది. రహస్యం సుమా, ఎవరికయినా చెప్పావా నరకానికి పోగలవు.” అన్నారట. చరచరా వెళ్లి గోపురం  పైకి ఎక్కి అక్కడ ఉన్న జనమందరికీ బహిరంగంగా ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉపదేశించారు రామానుజులు. ఇందరు జీవులు తరిస్తూ ఉండగా నేనొక్కడినీ నరకానికి పోతే ఏమనుకున్నారట. దైవాన్ని అంతమందికీ దగ్గర చేశారు. ఆయన గతించాక, కాలం గడిచాక, విశాలమైన ఆ సంప్రదాయం కుంచించుకుపోయింది.’

ఆ ఇంట్లో వారం రోజులు నిర్విచారంగా   కదలిపోయాయి…అది నిజమయిన సంతోష చంద్రశాల. పుస్తకాలు రెండు భాషల్లోవీ కలిపి  ఒక పాటి గ్రంథాలయం అనదగినన్ని ఉన్నాయి. కర్ణాటకమూ, పాశ్చాత్య శాస్త్రీయమూ,   హిందూస్తానీ మూడు పద్ధతులలోనూ సంగీతసరస్వతి కొలువై ఉంది. . ఎక్కడయినా మొదలుపెడితే నెలలు నెలలు గడిచిపోయేలా  ఉన్నాయి. ప్రవల్లిక లోని సున్నితత్వం మెల్లగా కళ్లు తెరిచి గమనించింది అంతా.

కులశేఖర్ మాటకారి, హాస్యప్రియుడు. అతని సమక్షంలో ఎప్పుడూ నవ్వనంతగా నవ్వింది .  వసంత సౌమ్యురాలు, ఆలోచించి మాట్లాడే స్వభావం. ఎందుకో ఆమెతో ఎప్పుడూ మాట్లాడనంతగా మాట్లాడింది. ఎవరూ తనని ఇబ్బంది పెట్టే ఏ ప్రశ్నా వేయలేదని ఆ తర్వాత అర్థమయింది. తమలో ఒకదానిలాగ సహజంగా ప్రేమించారు ,  తిరిగి ప్రేమించకుండా నిలవలేకపోయింది.

పూసిన పున్నాగ చెట్టుకింద కూర్చున్న  ఒక మధ్యాహ్నం అంది .  ‘ ఆంటీ అంకుల్  అసలు పోట్లాడుకోరా? ఆంటీ చదువుకున్నట్లున్నారు కదా, ఉద్యోగం చేయనందుకు బాధ పడరా? ‘

‘వీళ్ల పెళ్లి పెద్దవాళ్లు చేశారా ప్రేమ పెళ్లా?’

‘  రెండూ అవును, రెండూ కాదు.దూరపు బంధుత్వం, దగ్గరి స్నేహం ఉందట  కుటుంబాల మధ్య .పోట్లాడుకునే ఉండి ఉంటారు, కాకపోతే నేను చూడలేదు ఎప్పుడూ. అమ్మ తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లో మాస్టర్స్ చేసింది. ఉద్యోగం? ఏమో, తెలియదు మరి ‘

వసంతనే అడిగేసింది .

‘ ఉద్యోగం చేసే తీరాలని పట్టుదల లేదమ్మా . చేయకపోతే ఏమిటంటావు? ‘  సింపుల్ గా అడిగింది. ప్రవల్లిక తబ్బిబ్బయింది. నవ్వుతూ అంది వసంత ‘ ఎవరి ప్రాధాన్యతలని వారే నిర్ణయించుకోవాలనే కదా అంటున్నారు? నా జీవితం ఎవరి కొలమానాల ప్రకారమో గడవాలని అనుకోను నేను ‘  ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదీ స్త్రీత్వపు ఒక పార్శ్వ్యమేనేమోనని ప్రవల్లిక  అనుకోవలసి వచ్చింది.

ఒక చల్లటి సాయంకాలం వ్యాహ్యాళికి  వెళ్లారు.

ఆ దారి వెంట నడవటం  సుఖంగా ఉంది. దీవిస్తూన్నట్లు వంగిన మోదుగ  చెట్లమధ్యలోనుంచి రాలి పడిన ఆకులని రేపుతూ వీచే గాలి.

‘ మా స్కూల్ ఇక్కడే ‘

అక్కడా అక్కడా కట్టడాలు . ఎప్పటినుంచో పెరుగుతున్న బలమైన వృక్షాలు.

ఆ స్కూల్ లో వేరే  రాష్ట్రాలనుంచి వచ్చిన ఉపాధ్యాయులూ విద్యార్థులూ కూడా ఉంటారు. వేసవి లో తప్ప వూళ్లకి వెళ్లరు. ఇద్దరు టీచర్ లు కనిపించారు. ఆప్యాయంగా మాట్లాడారు. హాస్టల్ పిల్లలు చుట్టూ మూగారు. అప్పటి ప్రైమరీ   స్కూల్ పిల్లలు ఇప్పుడు పది, పదకొండు క్లాస్ లు చదువుతున్నారట. ఆయాలు, వాచ్ మన్ అందరూ ఇష్టంగా, చనువుగా పలకరించారు.

వెనకవైపున సరిహద్దు ఏమీ ఉన్నట్లు లేదు.జీడిమామిడి తోట అక్కడ.

‘ ఎవరిదో ఈ తోట?

‘మనదే, ఇష్టఫడటం చాలదూ సొంతం అవటానికి? ‘

ఈ లాజిక్ ఎంతమాత్రమూ అర్థం కాలేదు ప్రవల్లికకి.

ఎంతో అందమైన గుబుర్లు, క్రిందికి వాలిన కొమ్మలు.పువ్వులూ పళ్లూ లేకుండానే శోభాయమానంగా ఉన్న చెట్లు.ఆ నీడ లోకి కదలటం వృక్షపు కౌగిలిలోకి వెళ్లటం లాగా ఉంది. ఉండి ఉండి దూరం నుంచి వినపడే పిట్టల అరుపులు తప్ప ఎక్కడా ఏ శబ్దమూ లేదు, వాళ్లూ మాట్లాడుకోలేదు.  మార్మికమైన శాంతి ఏదో వెన్నెలలా పరచుకుంది. కథలలో రాసినట్లు రెండులోకాల మధ్యని సరిహద్దులాగా ఉంది, అక్కడనుంచి ఏ దేవలోకం  అడుగు పెట్టవచ్చునన్నట్లు. లోలోపలి ముడులేవో విడివడి  విప్పారుతూన్నట్లు.

చాలాసేపటికి వెనుదిరిగారు.

కాస్త తడిసిన కళ్లతో, గొంతుతో అంది , ‘ ఎంత అదృష్టవంతురాలివి ముక్తా. నీ ప్రపంచం ఇంత బావుంది! అన్నీ, అన్నీ.. ఉన్నాయి నీకు. నువ్వు ఎవరికీ అక్కర్లేకపోవటాన్ని ఊహించగలవా? నేనంతే, ఎవరూ లేరు నాకు. నా పుట్టుకే కోరుకోలేదెవరూ! అందుకు ఉంటాను ఇలాగ, నా మీద జాలి పడకూడదు ఎవరూ. భయపడాలి,పారిపోవాలి. నా మాటలే , వెక్కిరింతలే నా రక్ష, నా కవచం. ఎందుకు దాన్ని బద్దలు కొట్టాలని చూస్తున్నావు? మళ్లీ గాయపడిపోతాను, నువ్వుంటావా కాపాడటానికి ‘

‘ ఉంటాను, ఎందుకు ఉండను? నేనెవరికీ అక్కర్లేకపోవటం నాకెందుకు తెలియదు, చాలా బాగా తెలుసు. నమ్మవు కదూ? ఈ అమ్మా నాన్నా పెంచుకున్నారు నన్ను ‘

‘ ఆ. అయితే ఏమి? ఆ తర్వాత బావున్నావు కదా! నన్ను చూడు- ఇరవై ఏళ్లొచ్చాయి, నేను చచ్చిపోతే ఏడ్చేవాళ్లు లేరు తెలుసా! ‘

‘ష్..అలా అనకు.నువ్వు తలుపులన్నీ మూసేసుకుని ఊపిరి ఆడటం లేదంటున్నావు ‘

‘ మూశాను, లోకం మాటలు వినలేక! ‘

‘ మమ్మీకీ డాడీ కి  పెద్దవాళ్లే పెళ్లి చేశారు. మమ్మీకి ఇష్టంలేదట,  మరి ముందే ఎందుకు చెప్పలేదో తెలియదు. ఆమె అయిష్టం డాడీ కీ తెలిసిపోయింది. కలిసి ఎందుకు ఉన్నారో ! ఒకరిమీద ఒకరికి ద్వేషం, అయినా నేను పుట్టాను. తలచుకుంటే సిగ్గుగా ఉంటుంది . నా పేరు పెట్టటంలో మాత్రం ఇద్దరూ ఏకీభవించారట…వాళ్లకే అర్థమయిఉండదు నా పుట్టుక. కాస్త ఊహ వచ్చినప్పటినుంచీ ఆ ఇల్లు నరకానికి చిరునామా. మమ్మీ తన ప్రేమికుడితో వెళ్లిపోయేటప్పటికి నాకు ఎనిమిదేళ్లు. అంతకుముందు కూడా వాళ్లు కలుసుకుంటూనే ఉండేవారని తర్వాత తెలిసింది. డాడీ విపరీతంగా డిస్టర్బ్   అయాడు ఆమె వెళ్లటం వల్ల. అహం దెబ్బతినటం, సొసైటీ  లో తలవంపులు దానికి కారణాలేమో…మిస్ అయేటంత ప్రేమ వాళ్ల మధ్యన లేదు. రాను రాను డాడీ తన ఇష్టం వచ్చినట్లు బతకటం మొదలు పెట్టాడు. అలాంటి పరిస్థితులలో నేను తనతో ఉండకూడదని తనకే తోచిందో, ఎవరయినా చెప్పారో మరి, ఊటీ లవ్ డేల్ లో  వేశారు నన్ను. మంచి వాతావరణం, గొప్ప చరిత్ర ఉన్న స్కూల్ కదా అది. బా గానే ఉండేది. సెలవులలో  డాడీ వచ్చి చూసేవాడు…ఆ తర్వాత మమ్మీ కూడా వచ్చింది. నన్ను వదిలేసి వెళ్లినందుకు గిల్ట్ లాంటిదేమీ లేదేమో…చాలా మామూలుగా, రోజూ చూస్తున్నట్లుగానే మాట్లాడింది. నాకు రోషం, బాధ, కోపం…చివరికి ఒక ద్వేషం. తను ఎవరితో ఉండాలని వెళ్లిందో అలా ఎన్నో రోజులు లేదు. ఆ తర్వాత ఇంకొకరు, వేరొకరు. డాడీ,   మమ్మీ ఇద్దరికీ అంతే. ఆ కొత్త కొత్త స్నేహితులతో నాకు ఎలా ఉండాలో తెలిసేదే కాదు. కొందరు కొంత నచ్చేవారు, ఇంకొందరిని చూస్తే వెలపరంగా అనిపించేది.. నేను ఎవరికీ చెందను అని మాత్రం తెలిసింది. పేరెంట్స్ తో సహా అందరూ నా మీద చూపించింది ఛారిటీ  నే. చాలా ఏళ్లకి డాడీ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. డాడీ భార్యకీ నాకూ హేట్ ఎట్ ఫస్ట్ సైట్. బహుశా ఆమె ఇన్ సెక్యూరిటీ తోనేమో, డాడీ యు.ఎస్. వెళ్లిపోయాడు. మమ్మీ ఆ మధ్యే ఒక ఆశ్రమం లో చేరింది. తనని తాను తెలుసుకుంటుందట, నన్నూ రమ్మని. చచ్చినా రానన్నాను. అదీ కథ అమ్మాయీ, నాకు నేనే, ఏక్  నిరంజన్ ‘ తెలిసిపోయే ఉద్వేగం ఏదీ లేకుండా చెప్పుకొచ్చింది ప్రవల్లిక… ఆ వెనక  నిర్వేదం అలా స్పష్టమయిపోయింది.

‘ ఇదంతా , ఈ ఆలోచించటం- సబబుగానే ఉందా? ఆ తల్లిదండ్రుల ఇబ్బందులూ వారి వైపునుంచి వాదనలూ ఉంటాయి కదా?  ‘  సందేహం ఆముక్తకి. పైకి ఏమీ అనలేదు, బాధో, ఇంకా పైదో…పడినది ప్రవల్లిక గనుక.

‘ ఎందుకు నీకిదంతా చెప్పేస్తున్నానో! తర్వాత నన్ను నేను తిట్టుకుటానేమో , నీముందు బయటపడిపోయినందుకు! ‘

‘ ఊహూ.నేను అలా అనుకోను.చాలా దూరం నడిచాము, మనసులో బరువు దించుకున్నావు..అలిసిపోయి నిద్రపోతావనుకుంటున్నాను ‘

‘ నువ్వు ఇలాగే అంటావు,ఇలాగే ఉంటావు! ఎలాగో నాకు తెలీదు! ‘

‘ ఏముంది వల్లీ ! నాకు జరిగిన మంచిని ప్రతిదినమూ పండగ చేసుకుంటూనే ఉంటాను, ఎక్కడికీ మొహం మొత్తనిదే..’ నవ్వింది .

‘ నా అసలు పేరు చెప్పనా? మా నాయనమ్మ పేరు పెట్టారట. పరవస్తు చూడికుడుత్తమ్మ.’

‘ఈ ఇంటిపేరు ఎక్కడో విన్నట్లుందే ‘

‘ ఆ.గొప్పపండితుడు చిన్నయసూరి   గారి ఇంటి పేరు. నాకు తెలిసి మా వాళ్లెవరూ పండితులు కాదుగదా, పదో తరగతి కూడా పాసవలేదు.జరుగుబాటే కష్టమయిన కుటంబం మాది.చాత్తాద వైష్ణవులం మేము.’

‘ అంటే? బ్రాహ్మలు కారా ? ‘

‘ . ఊహూ.సాతాని వాళ్లంటారు కదా, అది మేము. ఎ ప్పుడో మధ్యయుగాలలో తీసుకున్న వైష్ణవ మతం. కాయగూరలు కానిదేదో తిన్నట్లే జ్ఞాపకం ‘

‘ నాకు నాలుగేళ్లున్నప్పుడు నాన్నకి హెచ్.ఐ. వి. ఉందని తెలిసిందట. సింగరేణిలో పనిచేసేవాడట , మంచివాడేనంటారు.ఆయన నీతీనియమాలని నేను ఎంచలేను కదా. అవమానం, నిరాశ. అమ్మతో సహా ఆత్మహత్యచేసుకున్నాడు. తాత అప్పటికే పెద్దవాడయిపోయాడు, ఆరోగ్యమూ బావుండేది కాదు. బాబాయిలకి ఇష్టం లేదు నేను ఉండటం, ఆజబ్బు నాకూ ఉందనుకునేవారో ఏమో. ఒకసారి తాతకి జబ్బు చేసి సింగరేణి హాస్పిటల్ లో చేరాడు. నాన్న అప్పుడు అక్కడ పనిచేసేవారు. నన్ను చూసి, నా పరిస్థితి  తెలిసి పెంచుకుంటానని అడిగారు, వాళ్లకి సంతానం కలగరని . తాత ముందు సంకోచించాడట.నాన్న  నచ్చజెప్పి తెచ్చుకున్నారు.ఏ పుణ్యం నన్ను వాళ్ల చేతుల్లో పడేసిందో ! అక్కడ ఉద్యోగం వదిలి ఇక్కడికి ప్రాక్టీస్ చేయటం కోసం వచ్చేశారు. ఇక్కడి తాతగారు అప్పటికి బ్రతికి ఉన్నారు, అభ్యంతరం చెప్పారు. నాన్న ప్రమాణాలు చూపించారు. బంధువులు ఎవరూ సమాధానపడలేదు. ఆ ఊరు మనం దిగిన స్టేషన్ కి అటువైపు ఉంటుంది.అంతా శ్రీవైష్ణవ  కుటుంబాలే ఎప్పటినుంచో. అక్కడ తనకి ఉన్నదేదో అమ్మేసి ఈ వైపుకి వచ్చేశారు నాన్న.. ఇంటినీ లోపలి సౌందర్యాన్నీ నిర్మించుకున్నారు. అమ్మ ఈ తోటనంతా పెంచింది.

శాస్త్రోక్తంగానూ, చట్టబద్ధం గానూ కూడా దత్తత చేసుకున్నారు.చూడికుడుత్తమ్మని ఆముక్తమాల్యద గా మార్చారు. రెండూ గోదాదేవి పేర్లే, అర్థం ఒకటే. సాహిత్యం చదివించారు, సంగీతం నేర్పించారు.  . వైష్ణవుల ఇళ్లలో సంగీతం ఎక్కువే ఉంటుంది. …అమ్మకి శ్రీరంగం గోపాలరత్నం గారు పెద్దమ్మ అవుతారట. మేమూ భజన కీర్తనలు పాడుకునేవాళ్లమే కదా, నేర్చేసుకున్నాను.

మెడిసిన్ లో సీట్ శ్రీమత్ తిరుమల పెద్దింట్ల ఆముక్తమాల్యద గానే వచ్చింది. ‘

అడగని సందేహానికి జవాబిచ్చింది.

‘ నాన్న  రోజుకి యాభయి , అరవై మందిని చూస్తారు. ఫీ యాభయి రూపాయలు. ఒకసారి ఇస్తే నెలవరకూ సరిపోతుంది. పరీక్ష చెశాక  ఆ డబ్బూ వెనక్కి ఇచ్చేస్తూ ఉంటారు కొంతమందికి.  అయినా కొత్తవాళ్లు వస్తూనే ఉంటారు. పేషంట్లు టెస్ట్  లు చేయించమన్నా  అవసరం లేనివి రాయరు. మందులూ అంతే. ఇందులోనుంచే అన్ని ఖర్చులూ!

‘ సరిపోతుందా మరి? ‘

‘ సరిపోవటానికి అంతు ఎక్కడుంటుంది ! నాన్న గుంటూరు స్టూడెంట్. అప్పట్లో  మహానుభావుడయిన సర్జన్ ఒకాయన ఉండేవారట శర్మ గారని. ఆయన అనేవారట ,  ఎనిమిది వేలు చాలక  పోతే ఎనభై  వేలూ చాలవు అని. ఆయన నాన్న కి, ఇంకా చాలామందికి  ఆదర్శమూర్తి. అత్యవసరమయితే ఏదో కొంత ఉందనుకుంటాను బాంక్ లో. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది మా ముగ్గురికీ ‘

‘  చాలామంది చదువుల కి సాయం  చేశారు, ఇంకా చేస్తూ ఉన్నారు..  విద్యలో, వైద్యంతో  సహాయపడటం  తప్పనిసరి అని అనుకుంటారు, ఆ పరిధిని తనకి గీసుకున్నారు.

జీవనం  సుఖంగా   సౌకర్యంగా  కొనసాగటానికి కొన్ని లెక్కలు సరిగ్గా వేయాలి, చేయాలి. ఆ తర్వాత అంతా వెసులుబాటే కదా ’

అవును, ఆ వెసులుబాటు అంతటా కనిపిస్తూనే ఉంది.  కాలం  ఇక్కడ తీరికగా ఆగినట్లుంది.

పూర్తిగా ఊపిరి ఆడుతున్నట్లుంది.

భోగి పండగ నాడు  ఆ ముక్త ఊదా రంగు  పట్టు చీర కట్టుకుంది. వంగపూవు రంగులో  అందమైన  సల్వార్ కమీజ్ ఇచ్చారు ప్రవల్లికకి. ఆ దుస్తులలో, ఆ ముక్త వెంట బడి  చేసిన అలంకారంలోతనని తాను  అద్దంలో చూసుకుంది, ఆశ్చర్యపడింది. తను కూడా బావుంటానని ఏనాడూ అనుకోనేలేదు.

భోగి పండగ రోజునే  ధనుర్మాసం ఆఖరట. కాస్త దూరంలో  కొండమీద ఉన్న అందమైన గుడికి వెళ్లారు. గోకుల పారిజాతగిరి అట అది, ఆ పేరే  కవిత్వంలాగా ఉంది. ! చాలా శాంతంగా ఉన్న పరిసరాలు. చుట్టూ ఒకే రకపు చెట్లు.

‘ ఏమిటి ఇవి? ‘

‘ పొగడచెట్లు. వకుళ అంటారు సంస్కృతంలో. శ్రీనివాసుడి తల్లి ఆమె. అందుకు ఇవి చాలా ప్రియం ఈ  దేవుడికి.’

వేయి తల్లిదనాలు రాశిపోసినంత సౌరభం  ఆపూలకి.

రాలిన పూలు గుప్పెళ్లనిండుగా ఏరుకున్నారు. ఆ కొండగాలి, ఆ శీతాకాలం, ప్రదోష వేళ ఆలయంలో వెలిగించిన దీపాలు…లోకాతీతం గా ఉంది.

తిరిగి వెళ్తూన్నప్పుడు

‘ ఇక్కడికే రా. మళ్లీ మళ్లీ రా. చదువు అయిపోయాక వచ్చేసి ఉండిపో ‘

ఆముక్త ఒక్కతే అలా అనుకుంటే సరిపోతుందా?  ..

బదులు చెప్పలేదు .

ఆ మరుసటిరోజున తిరిగి వెళ్లాలి. వసంతా కులశేఖర్ ఇద్దరూ కలిసి వచ్చేశారు ప్రవల్లిక బట్టలు సర్దుకుంటూ ఉంటే.

‘ మళ్లీ ఎప్పుడొస్తావమ్మా? ‘

కేవలం మర్యాదకి అడిగినట్లుగా లేదు…

‘ వస్తానండీ, వీలు చూసుకుని ‘

‘ అది కాదమ్మా. .’  సంకోచిస్తున్నాడు ఆయన.

వసంత అడిగేసింది ‘ నువ్వు..ఏమీ అనుకోకపోతే ప్రతి సెలవలకీ ఇక్కడికి వచ్చేయి… ‘.

ఆయన మొహమాటంగా అన్నాడు, ‘ తర్వాత కూడా…నేనూ పెద్దవాడినయిపోతున్నాను కదా, నాకు తోడుంటావా, ఆముక్తతోబాటు ?

బదులు చెప్పటానికి గొంతుకేదో  అడ్డుపడింది ప్రవల్లికకి.

‘ వస్తాను ‘

తెచ్చుకున్న పొగడపూలని సూట్ కేస్ లో దాచింది. ఆ పరిమళం చాలాకాలం అలాగే  ఉండిపోతుందట. దివ్యలక్షణం వాటిది, ఆ ఇంటిది !

— మైథిలి అబ్బరాజు

 

 

 

Download PDF

49 Comments

 • మణి వడ్లమాని says:

  చదివేసానోచ్!! ‘చూడరమ్మసతులాల …” నేను చదివేసాను మీ చూడికుడుత ముక్తని మంచి పొగడపూల గుబాళింపు ‘మా మైథిలి గారి కధ

  • mythili says:

   మణి గారూ…మీరు ‘ సిరి ‘ తల్లి, అందరికంటే ముందు చదివినందుకు…థాంక్ యూ..మీ ఆప్యాయతకి..

 • kameswari yaddanapudi says:

  సానుకూల కోణం నుంచి ప్రతికూల చర్య ప్రభావాన్ని చక్కగా చెప్పారు. జరిగిన పొరబాటును ఎలా దిద్దవచ్చో చూపారు. మంచి కథ. అభినందనలు.

  • mythili says:

   ధన్యవాదాలు కామేశ్వరి గారూ, నా ఉద్దేశ్యం అదేనండీ

 • యాజి says:

  వైష్ణవ సాంప్రదాయాన్ని గురించి కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాను – ధన్యవాదాలు.

  • mythili says:

   ధన్యవాదాలు యాజి గారూ, చెప్పాలంటే ఇంకా చాలా ఉంది..:)

 • Bh K Babuji says:

  aChaalag Konni చోట్ల ‘లత’ పుస్తకం చదువుత్న్నట్లని pinchindi.

 • సాయి పద్మ says:

  క్షీర సాగర మధనం లానే … అల్లకల్లోలంలో ఆహ్లాదంగా ఉంది కథ ..!

  • mythili says:

   ధన్యవాదాలు సాయి పద్మ గారూ, ఇది మహావిష్ణువు కొలువుండే శాంతసాగరం :)

 • lakshmi madhav says:

  ఆ పగడ పూల పరిమళం లానే ఈ కథ పరిమళం కూడా చాలా గుబాలిస్తున్దేమోననిపించింది మరి…..

 • lakshmi madhav says:

  ఆ పొగడ పూల పరిమళం లానే ఈ కథ పరిమళం కూడా చాలా గుబాలిస్తుందనిపించింది

 • DEVIKA says:

  మైథిలి గారూ కథ చాలా బాగుంది. కదిలించింది…

 • *హాస్యం లేని వ్యంగ్యం ఆమె సొంతం
  *ఆ చుట్టూ కట్టుకున్న గోడ బద్దలు కొట్టి లోపల ఏముందో చూడాలని, కుతూహలం
  *ఎవరి ప్రాధాన్యతలని వారే నిర్ణయించుకోవాలనే కదా అంటున్నారు? నా జీవితం ఎవరి కొలమానాల ప్రకారమో గడవాలని అనుకోను నేను ‘ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదీ స్త్రీత్వపు ఒక పార్శ్వ్యమేనేమోనని ప్రవల్లిక
  *ఎనిమిది వేలు చాలక పోతే ఎనభై వేలూ చాలవు అని…
  * చాలా దూరం నడిచాము, మనసులో బరువు దించుకున్నావు..అలిసిపోయి నిద్రపోతావనుకుంటున్నాను ‘
  కథలో ఈ పై వాక్యాలు బాగా నచ్చాయండి. సందర్భానుసారంగా చక్కని అర్ధాన్ని కలిగి, చక్కని సందేసాత్మకమైన వాక్యాలు అనిపించాయి.
  ఆమె మళ్ళీ రావాలనుకుంటున్న విషయాన్ని కూడా బాగా కన్వే చేసారు, పొయిటిక్ మాటల్లో.
  కానీ,
  నాదొక సందేహం.
  చివరిలో – పాత్రలను ఒక అస్పష్టాకారం లో వదిలేసారు.
  పాఠకుల ఊహకేమో..లేదంటె..
  ‘ఇతనే ఆమె తండ్రి’ అని, ఇంకా క్లియర్ గా చెప్పాల్సిందేమో!’ అని నాకనిపించింది. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
  కథ బాగుంది. ఎప్పటి లా మీ దైన మీ స్టైల్ లో!
  శుభాభినందనలతో..

  • mythili says:

   దమయంతి గారూ మీకు ఆ వాక్యాలు నచ్చినందుకు ధన్యవాదాలు. ఈమాటే ఇంకొక రచయిత్రి [ప్రచురణ కి మునుపు] అన్నారు…కాని నాకు అలాగే ఆపాలనిపించిందెందుకో…

 • pavan santhosh surampudi says:

  ద్వేషానికి ప్రేమని మించిన మందులేదు.
  ఇది మీ కథకీ దాని నేపథ్యానికీ కూడా వర్తిస్తోంది. ఎంతైనా ఒక డాక్టరుగా మీకు దేనికే మందు సరైనదో బాగా తెలుసు మరి.

 • చాలా బాగుంది అనడం చాలా చిన్న మాట ఈ కథకి.
  ఆ ఊరికీ, ఆ ఇంటికీ ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపిస్తోంది ఆ వర్ణనలు చదువుతుంటే. మానసిక విశ్లేషణ ఎంత బాగా చేశారో మైథిలి.. ఎంత చక్కని, స్వచ్చమైన, తేనెలొలుకు తెలుగు.. పొగడ పరిమళాలని గుబాళిస్తోంది.
  ఇటువంటి కథలు ఏడాది కొకటి రాసినా వందలు రాసినట్లే..
  అభినందనలు.

  • mythili says:

   మీ మాటలు చాలా శక్తినిస్తున్నాయి భానుమతి గారూ, కృతజ్ఞతలు.

 • Elanaaga says:

  పాత్రలను పరిచయం చేస్తున్నప్పుడు మనస్తత్వాల్ని వర్ణించిన తీరు క్రెడిబిలిటీని కలిగించేదిగా వుండటం విశేషం. భాషలో సీరియస్ నెస్, హుందాతనం లేకుంటే ఆ క్రెడిబిలిటీ రాదని నా నమ్మకం. అసాధారణమైన కథాంశాన్ని ఎంచుకుని, దాన్ని శక్తిమంతమైన వాక్యాల్లో చెప్పినందుకే కథనం రాణించింది. మనసును స్పృశించి, ఆహ్లాదాన్ని కలిగించటం ఈ కథలోని ప్రత్యేకత. వేయి తల్లిదనాలు రాశి పోసినంత సౌరభం ఆ పూలకి… ఈ వాక్యం ఎంత బాగుందో! కాంతివలయాలు అనే స్పష్టమైన మాటను వాడింతర్వాత మళ్లీ ఆరా అనే ఆంగ్లపదాన్ని వాడటం దాని అర్థం తెలియని పాఠకులను అయోమయం లోకి తోయవచ్చు. అయినా కథ చాలా బాగుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అభినందనలు మైథిలి గారూ.

  • mythili says:

   ఎలనాగ గారూ ధన్యవాదాలండీ.. మీరు అన్నమాట నిజమేనేమో…మనం దేవుళ్ల చిత్రపటాల చుట్టూ తేజోపరివేష్టం ఉండటం చూస్తాము.కాని ఒక వాతావరణానికో, మనిషికో ‘ ఆరా ‘ ఉండటం పాశ్చాత్యులనుంచి వచ్చిన విషయమేమో కదా..అందుకని ఆ మాట కూడా వాడాను

 • NS Murty says:

  మైథిలి గారూ,

  కథ చదవడం ఒక Exercise కాదు… ఒక Experience అనుకుంటే, మీ కథ దానికి సరిగ్గా సరిపోతుంది. వ్యక్తిత్వాలని పరిచయం చేస్తున్నప్పుడు మీరు ఉపయోగించిన పదాలు కథ లోని ఉదాత్తతగి తగ్గట్టుగా Classical గా ఉన్నాయి. ముఖ్యంగా “ఆనంద కర్పూర నీరాజనం” , “హరిచందనపు తరువు” అన్నప్రయోగాలు బాగున్నాయి. “వేయి తల్లిదనాలు రాశిపోసిన సౌరభం ఆ పూలకి” అన్న మాటలు అపురూపంగా ఉన్నాయి.

  చివరలో కథనం తొందరగా సాగిపోయిందని అనిపించింది. ప్రవల్లిక లాంటి Deeply Introvert లు అంత తేలికగా (మొదటిసారి కొత్తవాళ్ల ఇంటికి వెళ్ళగానే) కరుగుతారనుకోను. తనగురించి తాను తెలియజెప్పే సన్నివేశం రెండవసారి వచ్చిన తర్వాత జరిగినట్టు అయితే కథకి మరికొంత Credibility వచ్చేదేమో. (అయినా, అది పట్టించుకోవలసినంత అభ్యంతరం కాదు).

  ఏమైనా మీ కథ చాలా బాగుంది. హృదయపూర్వక అభినందనలు.

  • mythili says:

   ధన్యవాదాలు ఎన్.ఎస్. మూర్తి గారూ, మీకు నచ్చినందుకు . మీరు చెప్పినది నిజమేనేమోనండీ

 • prasuna says:

  మీ కథనమే ఓ కవిత్వంలా ఉందండి. నిజంగా ఇంతవరకు ఇంతగా హత్తుకున్న శైలి ఇదే.

  • mythili says:

   ప్రసూన గారూ సంతోషం మీకు దగ్గరగా రాగలిగినందుకు..

 • Aruna Pappu says:

  అంద‌రూ బాగుందంటే నేనింకెందుకు చెప్పాల‌ని మానేద్దామ‌నుకున్నానండీ మైథిలిగారూ. కాని అంద‌రూ పూజ చేస్తున్నార్లే నేనెందుకు చెయ్య‌డం అని మానెయ్యం క‌దూ. అందుకేన‌న్న‌మాట‌… మీ క‌థ చాలాచాలా బాగుంది.

  • Madipelly Babu Rao says:

   నాకు చాలా బాగా నచ్చింది. మల్లి మల్లి చదవాలనే కోరిక కలిగేల వుంది.

  • mythili says:

   అరుణ పప్పుగారూ …చాలా సంతోషమండీ…మీరు చెప్పకపోతే ఎలా?

 • Ramachandra Babu Amuri says:

  మీ అక్షరాలు నా కళ్ళ గవాక్షాలగుండా మదిలోకెళ్ళి ఒదిగిపోయయి..ప్రవల్లిక,అముక్త,వసంత..కులశెఖర్ ఒక్కొక్కరి జీవితం ఒక్కో సంహిత..ఎంత చక్కగా మాల కట్టారండి..ప్రవల్లిక మౌనం..కారణం..అముక్త ప్రేమ..కారణం..మానవత్వపు ఆత్మీయతలకి చక్కటి ముగింపు.. తెచ్చుకున్న పొగడపూలని సూట్ కేస్ లో దాచింది. ఆ పరిమళం చాలాకాలం అలాగే ఉండిపోతుందట. దివ్యలక్షణం వాటిది, ఆ ఇంటిది !!! పొగడ పూల పరిమళాల్లా మీ క్షీరసాగర పరిమళాలుకూడా అంత తొందరగా మది లోతుల్లొంచి వెళ్ళిపోవేమో…మీ మేధొసాగర మధనంలోంచి వెలువడిన ఆణిముత్యం..క్షీరసాగరం..అభినందనలు..

  • mythili says:

   రామచంద్ర బాబు గారూ మీ వ్యక్తీకరణ ఎంతో బావుందండీ .ధన్యవాదాలు

 • gorusu jagadeeshwar reddy says:

  మైథిలి గారూ … కథ చదివాను. ఏం చెప్పమంటారు? పుష్కరం నాటి మీ కౌముది తనయ అనన్య రూపాంతరం చెందిన ప్రవల్లిక కాదు కదా? ఇదే సారంగ లో భువన చంద్ర గారి సుచరిత కి మరో రూపం కాదు కదా? నిజం చెప్పాలంటే కథ చదవగానే బుర్ర పని చేయలేదు. ఈ కథ లో పాత్రలు నిజ జీవితం లో ఉన్నాయో లేవో కానీ సుచరిత మాత్రం ఉంది కదా. కల్పన కంటే వాస్తవం ఎంత ఘోరంగా ఉంటుందో అనిపించింది.
  మీవి అక్షర మాలలా … పొగడ దండలా … భావుకతకి పరాకాష్ట క్షీరసాగరం .
  ఇష్ట పడటం చాలదూ సొంతం అవటానికి … ఇప్పుడు ఆముక్త తో అనిపించారు కదా.. మరి అలనాటి మీ కౌముది అశోక్ విషయం లో అలా అనుకోలేక పోయింది ఎందుకు? దీపక్ లో కోరిక తప్పించి ప్రేమ ఉందా? ఉన్నా అది అశోక్ మౌనం కంటే స్వఛమైన్దా? క్షమించండి … ఇలా అడగటం ఇప్పుడు సందర్భమో కాదో కానీ … బరువు దించుకుంటే ప్రవల్లిక లా హాయిగా నిద్ర పోవచ్చని .
  – గొరుసు

  • mythili says:

   అరే.. మీకు గుర్తుందా? భలే ఉందే…అప్పుడు నేను ఉండిపోవటాన్ని బలంగా చెప్పాలనుకున్నాను, దురదృష్టవశాత్తు అది కౌముది అసంతృప్తిగా అర్థమయింది…ఆ భాషలో రాసినందుకు.రచయిత్రి జ్యోత్స్న వైపు ఉంది, కౌముది వైపు కాదు. ఏతావతా అనన్య- ప్రవల్లిక అవలేదు. సారంగ లో ఇంకా ఎవరికీ ధన్యవాదాలు పెట్టలేదు…మీరు నిద్ర పోతానన్నారు కదా అని… :)

 • కవితాత్మక వచనం హాయిగా, బావుందండీ.

  ఓ చిన్న నెరసు. (అది కూడా మీరు విశిష్టాద్వైత సంప్రదాయాన్ని ప్రత్యేకించి రూపుకట్టాలనుకున్నారు కనుక..) కావిరంగు నిషిధ్ధమండీ శ్రీవైష్ణవులకు. గమనించగలరు. జీయరులకు కాషాయం, గృహస్థులకు ధవళవస్త్రాలు… యుక్తం. అందునా మీ కులశేఖరుడేమో తిరువారాధన చేస్తూన్నాడు కూడాను.

 • mythili says:

  ధన్యవాదాలండీ…అంత శ్రద్ధగా చదివి చెప్పినందుకు. మా నాన్నగారు సిందూరం రంగు పట్టు ధోవతి కట్టుకునే పూజ చేసుకునేవారండీ మరి…ఇప్పుడే ఫోటో చూసి వచ్చాను. మా పుట్టింటివారు మూడు తరాలుగా పాంచరాత్ర విశిష్టాద్వైతసంప్రదాయం పాటించే నియోగి బ్రాహ్మణులు. మా పితామహులకి ఆ పద్ధతి బాగా తెలుసునని పేరు, వారెప్పుడూ ఊర్థ్వపుండ్రాలతోనే కనిపించేవారు. ఈ కథలో గంట విషయాన్ని మా అమ్మ తప్పుపట్టారు, జేగంట అని పిలిచే ప్రత్యేకమైన గంట మ్రోగిస్తారని చెప్పలేదని.

  • అసలు విషయం వదిలేసి కొసరు పై చర్చ ఇది. :)

   గొల్లపూడి కూడా “సాయంకాలమైంది”లో చాలా రాసారండీ నాకు అస్సలు అంతు చిక్కనివి. నియోగులకి తప్పులేదనుకుంటా మరి. వడగళ్, తెంగళ్ వైష్ణవులెవరిలోనూ మాత్రం లేదని చెప్పగలనండీ.
   శ్రీపాద వారి “అనుభవాలూ – జ్ఞాపకాలూను” 342, 343 పేజీలోమారు చూడండి.

 • gorusu jagadeeshwar reddy says:

  ధన్యవాదాలు మైథిలి గారూ జవాబు ఇచ్చినందుకు. మీరు జ్యోత్స్న వైపు ఉన్నారని చాలా పారదర్శకంగానే చెప్పారు. కానీ కవిరాజు గారు (నాటికి నేడు ) లో అన్నట్టు మనసు మహా చెడ్డది సుమండీ … అనేది గుర్తొచ్చి అలా అడిగానండి :)
  – గొరుసు

 • sivanageswarao says:

  తెచ్చుకున్న పొగడపూలని సూట్ కేస్ లో దాచింది. ఆ పరిమళం చాలాకాలం అలాగే ఉండిపోతుందట. దివ్యలక్షణం వాటిది, ఆ ఇంటిది ! – చివరి వాక్యం చివరి పదం చాల బాగా వ్రాసారు

 • Radha says:

  చాలా బాగుంది మైథిలి గారూ – అభినందనలు.
  ‘ఇష్టపడితే చాలు మన సొంతం అని చెప్పుకోవడానికి’ – ఎంత బాగా చెప్పారండీ.
  సంపాదిస్తేనే సొంతం అనుకోవడం వల్లనే లోకంలో ఇంత అశాంతి కదా!

 • mythili says:

  Radha గారూ కదా అండీ. అన్నింటినీ ‘ సంపాదించి ‘ దాచుకోనక్కర్లేదు కదా. కృతజ్ఞతలు ..

 • venkateswarlu poondla says:

  మాట రానీ వాడి ని అని చెప్పలేను కానీ బాగా వ్యక్తము చేసే బాష రాని వాడిని .. హరిచందనపు తరువు లాంటి దేహము ఆహ్హ ఎంత భాష వ్యక్తికరణము . అలాగే శ్రీ వైష్ణవ సంప్రదాయములు గురించి బాగా తెల్పినారు .
  పొగడపూల సువాసనలు దాచి వునిచిన పేటిక ఆ పూల సువాసనలు ఎక్కడికి పోవు అని చెప్పడము చాల బాగా ఉంది.. మీ పుట్టుయింటి గురించి చెప్పడము బాగా ఉంది.. వీలుయిననత వ్రాయడాని ఈ చిన్ని ప్రయత్నమూ..

  \\

 • mythili says:

  వెంకటేశ్వర్లు పూండ్ల గారూ ధన్యవాదాలండీ

 • suvarchala chintalacheruvu says:

  ఎప్పటిలా పూలమాలిక..ప్రతీసారీ కొత్తపూలే! సొగసు సౌరభాలే!! ఉండుండి పేర్చిన మరువాలు..దవనాలు లా మురిపించే భావ సుగంధాలు!! పొగడ్తలు కాదు మైథిలి గారు! పొగడలు!! ముందుగా..
  1. కథకి పెట్టిన “క్షీరసాగరం” పేరు బాగా కుదిరింది. మీరు కథలకి పెట్టే పేర్లు ఎప్పుడూ థీం కి చక్కగా నప్పేలా పెడ్తారు.
  2. భార లోహ సంగీతం..ఈ పదం నన్ను చకితురాల్ని చేసింది.
  3. పచ్చకర్పూరం కలకండల మిశ్రమ పాల రుచి మీ సంభాషణలకూ అబ్బింది.
  4. పాలపిట్ట వన్నెలు మీరు సృజించిన పాత్రల మనములు!!(మనస్సులు)
  5. జీవితానికి కావల్సిన శాంతినీ, తృప్తినీ స్పష్టపరిచారు. అవి ఎలాంటి జీవనవిధానంలో మాత్రమే దొరుకుతాయో ఘాట్టిగా చెప్పారు.
  6. మన పురోగమనానికి(అది మానసికం కావచ్చు..భౌతికమూ కావచ్చు) మనకున్న కష్టనష్టాలే అవరోధమనుకునే సంకుచిత ధోరణుల్ని ఖండించివేశారు. అవి వఠి వంకలు అని తేల్చిపారేశారు! బాగుంది.
  ఇక..
  “తాను దారితప్పి ఏపాత పుస్తకం లోకో దూరిపోయానా”
  ‘ ఉద్యోగం చేసే తీరాలని పట్టుదల లేదమ్మా . చేయకపోతే ఏమిటంటావు? ‘ నవ్వుతూ అంది వసంత ‘ ఎవరి ప్రాధాన్యతలని వారే నిర్ణయించుకోవాలనే కదా అంటున్నారు? నా జీవితం ఎవరి కొలమానాల ప్రకారమో గడవాలని అనుకోను నేను ‘ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదీ స్త్రీత్వపు ఒక పార్శ్వ్యమేనేమోనని”
  ‘మనదే, ఇష్టఫడటం చాలదూ సొంతం అవటానికి? ‘
  ఇలాంటి సాలోచనాలోచన పదాలు “తెరచి ఉన్న కిటికీ లలోంచి తోట లోపలి పూల గాలి” ని ఆస్వాదించినట్లనిపించింది.
  ఎంతో అందమైన గుబుర్లు, క్రిందికి వాలిన కొమ్మలు.పువ్వులూ పళ్లూ లేకుండానే శోభాయమానంగా ఉన్న చెట్లు.ఆ నీడ లోకి కదలటం వృక్షపు కౌగిలిలోకి వెళ్లటం లాగా ఉంది…ఇదేమైనా ఆ దంపతులకు సింబాలిగ్గా చెప్పారా అన్న ఆలోచనా నాకు రాకపోలేదు.
  చివరికి..
  ప్రవల్లికలో మానసిక పరివర్తనకి ఆముక్త, ఆమె తల్లిదండ్రులే. ఆ పెద్దవాళ్లు ఆమెను ఆప్యాయతతో ఆదరించిన మాటా వాస్తవమే! కానీ వారికి ఆమెపై అంత బంధమేర్పడినట్లుగా నాకు (పాఠకుడికి) తోచలేదు. ఆమెను వారితో ఉండిపొమ్మనేనంతలా కోరటం ఎందుకో కొంచెం అసహజంగా అనిపించింది నాకు. నేను చాలా దృష్టిలేమితో ఆలోచిస్తున్నానేమో తెలియదు. అలా ఐతే క్షమించండి. .
  ఇక సాతాను వాళ్లు..ఈ పేరును దాదాపు మర్చేపోయాను. గుర్తుచేసినందుకు సంతోషంగా ఉంది.(తెల్లవారు ఝామున మనల్ని మేలుకొలిపిన హరిదాసులు) ఇది విన్నాక దొమ్మరివాళ్లు గుర్తుకు వచ్చారు. కొండముది శ్రీరామచంద్రమూర్తి గారి నవల”చిరుమువ్వల మరుసవ్వడి” గుర్తుకుతెప్పించిందీ కథ. (ఆనంద భైరవి సినిమా)

 • mythili says:

  ధన్యవాదాలు సువర్చల గారూ.ఎన్నెన్ని మంచి మాటలో నాకు ! ఆ పూవూ పిందే లేని చెట్ల గుబురుల చల్లని కౌగిలింత ని మీరు మాత్రమే గుర్తు పట్టారు. ప్రవల్లికని ఉండిపొమ్మనటం ‘ ఇచ్చుటలో ఉన్న హాయి ‘ ని పుచ్చుకుందుకు అనుమతి అడగటం .. ఇంకాస్త స్పష్టత ఉండాలేమో అక్కడ.

 • పోతు అవినాష్ says:

  ఆ నీడ లోకి కదలటం వృక్షపు కౌగిలిలోకి వెళ్లటం లాగా ఉంది ………..
  నాకు ఇలాంటి వర్ణనలు చదివినప్పుడల్లా, నేను ఎందుకు ఇలా ఆలోచించలేకపొతున్నాననే బాధ కలుగుతుంది.

 • mythili says:

  ఆ మాటలు మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)