పదనిసల ఈ పిల్ల!

పదనిసలు
ఈ బొమ్మలో కాదుగానీ దీనికి ముందూ తర్వాతా ఈ చిన్నారిని చూస్తే మీ హృదయం ద్రవించిపోతుంది. చేతులు చాపే అభాగ్యులు, నిస్సహాయులు, అధోజగత్ సహోదరులెవరిని చూసినా మనసు కలుక్కుమంటుంది. చిత్రమేమిటంటే మన కళ్లలో ప్రతిఫలించే భావాలను వాళ్లూ గ్రహించగలుగుతారు. కానీ బయటపడరు.

మనకిష్టం లేదని వాళ్లకు తెలుసు. కానీ కిమ్మనరు. మనవి జాలిచూపులని తెలుసు. కానీ క్షమిస్తారు. మనం విదిల్చే కాసులకు మనలోనే తృప్తిల్లే ఏవో అజ్ఞాత ఆదర్శాలకూ వాళ్లు  నిందించరు. కానీ సతాయిస్తారు.

రూపాయో రెండ్రూపాయలో ఇచ్చేదాకా విసిగిస్తారు. అయితే, కొన్నిమార్లు తమనూ మననీ మరచిపోయి వాళ్లూ గెంతులేస్తారు. ఈ పిల్ల అలాంటిదే.

రింగ్ ఆఫ్ ట్రూత్ అంటాడు సత్యజిత్ రే – సాంగ్ ఆఫ్ ది రోడ్-పథేర్ పాంచాలి గురించి. సత్యం కాదు, ధర్మం నాలుగు పాదాల చెంత నిమ్మళంగా ఒకేచోట కేంద్రీకృతమైనప్పుడు ఇలాంటి చిత్రాలే అధికంగా కానవస్తాయి. అలా అని నిత్యనృత్యం  ఆగిపోతుందా? లేదు. అదే ఇక్కడి విశేషం.

భారతదేశపు రాజధాని ఢిల్లీలో ఒకానొక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద – వాహనాలు, అందులోని బడాబాబులతో నిమిత్తం లేకుండా చిన్నగా నృత్యం చేస్తున్న ఈ దృశ్యం అప్రమేయంగా, అనాలోచితంగా చిందులేసే వ్యధార్థ మానవుడి హృదయ సంగీతానికి  తొలి అడుగు అనే అనిపిస్తుంది. ‘తొలి అడుగు’ అనడం ఎందుకూ అంటే, ఏమో! ఆ పాప పెద్దయినాక ఏమవుతుందో! మానవేతిహాసంలో ఆ ఎద ఎలాంటి స్వరాలు సంకలనపరుస్తుందో! అందుకు మనని సంసిద్ధం చేయడంలో భాగమో ఏమో, ఈ పిల్ల పదనిసలు.

– కందుకూరి రమేష్ బాబు

ramesh

Download PDF

7 Comments

  • ఈ ఫోటో ఏమంత గొప్పగా లేదే అనుకుంటూ కింద వాక్యాలు చదివితే అప్పుడు అర్థం అయ్యింది ఫొటో గొప్పదనం.. కెమెరా కన్నే కాదు భయ్యా… తడి వున్న మనసు కూడా కనిపిస్తుంది మీ ఫొటోలలో… అభినందనలు

  • చిత్రమేమిటంటే మన కళ్లలో ప్రతిఫలించే భావాలను వాళ్లూ గ్రహించగలుగుతారు. కానీ బయటపడరు.

    మనకిష్టం లేదని వాళ్లకు తెలుసు. కానీ కిమ్మనరు. మనవి జాలిచూపులని తెలుసు. కానీ క్షమిస్తారు. మనం విదిల్చే కాసులకు మనలోనే తృప్తిల్లే ఏవో అజ్ఞాత ఆదర్శాలకూ వాళ్లు నిందించరు. కానీ సతాయిస్తారు.

    నిజమే ఎంత ఆర్తిగా చెప్పారు సత్యాన్ని. తడిగల మీ కెమెరా కన్నుకు వందనాలతో..

  • Rasool Oruganti says:

    చాలా బాగా చెప్పారు, కొత్తగా అనిపిస్తుంది, ఈ సారి వీళ్ళు కనబడినప్పుడు మీ మాటలు గుర్తుకోచేటట్టు రాసారు!!

  • అలాంటి దృశ్యాలు చాలా సార్లు చాలా మంది చూస్తూనే ఉంటారు. ఒక్కొకరి దృష్టి కోణం ఒక్కోలా ఉంటుంది.
    కందుకూరి రమేష్ బాబు దృష్టికి మాత్రం చిన్నగా నృత్యం చేస్తున్న ఈ దృశ్యం అప్రమేయంగా, అనాలోచితంగా చిందులేసే వ్యధార్థ మానవుడి హృదయ సంగీతానికి తొలి అడుగు అనే అనిపిస్తుంది. అతి సాధారణ చిత్రానికి వ్యాఖ్యానం ఎంత గొప్పగా చెప్పారు !!

  • ఈ ఫోటో ఏమంత గొప్పగా లేదే అనుకుంటూ కింద వాక్యాలు చదివితే….(అరిపిరాల సత్యప్రసాద్ )

    ఈ సారి వీళ్ళు కనబడినప్పుడు మీ మాటలు గుర్తుకోచేటట్టు రాసారు!! (Rasool ఓరుగంటి)
    .అతి సాధారణ చిత్రానికి వ్యాఖ్యానం ఎంత గొప్పగా చెప్పారు (వి. శాంతి ప్రబోధ)!!

    ~థాంక్స్ ..థాంక్స్ ..మరింత సామాన్యత కోసం ప్రయత్నిచాలని అనిపిస్తోంది…ఈ ఫీడ్ బ్యాక్ కు..

  • Elanaaga says:

    సారీ, ఈ ఫోటో ఏమంత గొప్పగా లేదనటం అన్యాయం. క్రిస్టల్ క్లియర్ నెస్ సంగతిని అటుంచితే ఇందులోని ప్రతీకాత్మకతను గ్రహించాలి మనం. రమేశ్ బాబు గారూ! ఫోటోయే కాక, దాని కింద మీరు రాసిన టెక్స్ట్ కూడా చాలా బాగుంది. రామా చంద్రమౌళి రాసిన అంతర అనే కవితా సంపుటిలో సంభాషించు ఇంకా, అంత్య బిందువులు మొదలైన కవితలున్న కొన్ని పేజీల్లోని మీ ఫోటోలు కూడా మిమ్మల్ని ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ గా నిలబెడతామని నా నమ్మకం. అభినందనలు.

  • Radha says:

    ఫోటో ఏమంత గొప్పగా లేదు కాని మీరు రాసిన వాక్యాలు అద్భుతం.
    మనకి సహాయం చేయడం ఇష్టమో, లేదో – మనది జాలిగల మనసో కాదో చాలా సులభంగా గుర్తించగలరు. పసితనంలోనే అంత అనుభవం సంపాదించినందుకు బాధగా ఉంటుంది నాకు వాళ్ళని చూస్తుంటే.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)