అలసట లేని కొన్ని అలల స్వగతం!

Palaka-Pencil Cover (2)

పూడూరి రాజిరెడ్డి సాహిత్యపు దారిలో తనదైన ప్రకాశాన్ని ముద్రిస్తూ సహస్ర తేజంగా వెలగాలి అని ముందుకు వెళుతున్న ఒక సంతకం .

 ఈ పుస్తకం ”పలక -పెన్సిల్ ”ముందు మాటలో కృతజ్ఞతలు చెపుతూ  ”నా అక్షరం చూడగానే బై లైన్ వైపు చూడగలిగే   ఆత్మీయులు ”అన్నారు .  బహుశా నేను ఈ కోవలో ఉండవచ్చు . ఎండలో వెళుతున్న వారికి అక్కడక్కడా ఇంగ్లీష్ పొడ కనపడుతున్నా తన చల్లని ,చక్కని తెలుగు వచనం తో సేద తీర్చే  మర్రిచెట్టులాగా  కనపడతారు ‘ఈయన’ నాకు.

కొత్తగా మా బడి  ఐదో తరగతిలో చేరిన పిల్లలు మిగిలిన వాళ్ళతో కలవకుండా తమ  జ్ఞాపకాలు, వస్తువులు  ఒక పెట్టెలో పెట్టుకొని బిడియంగా ఎవరినీ తాకకుండా ఎలా  కూర్చుంటారో ….. తన బంధాలు, ఊరి జ్ఞాపకాలు, చదివిన పుస్తకాల దుమ్ము,  చివరికి ఆశ్చర్యార్ధాకాలు, అరసున్నాలతో సహా తన పెట్టెలో దాచుకొని, బరువైనా దించని ఒక అమాయకపు ప్రేమతో, రెటమతంతో ఆ పిల్లలులాగే కనిపిస్తారు ఈ రచయిత కూడా .

”ఏమున్నాయి అందులో ?”

”పూలు, ఆకులు, పుస్తకాల నుండి సేకరించిన దుమ్ము ”

”అదీ కారణం….. బరువుకి కారణం దుమ్మే”  విదిలించమని చెప్పిన అపరిచితుడితో ….

”బరువైతే బిడ్డను చంక మార్చుకుంటాము కాని, వదిలేసి చక్కగా పోతామా?” (పెన్ను విభాగం లోనిది బరువు ) తన సేకరించుకున్న జ్ఞానం పై ” కన్నతల్లి కంటి కోలుకులో ముత్యమై  తన బిడ్డపై మెరిసిన ప్రేమలా ”కనిపిస్తుంది .

రెండో వైపు  ”నా ఆలోచనలలోనే నాకు సుఖం ఉందని ఎందుకు అనుకోరు ” అంటూనే అనిజ మనుషుల్లో ఆప్యాయతని వెతుక్కుంటూ ”జీవితం ముగిస్తేనే కాని సరైన దారి ఏమిటో తెలియదు కదా …. ముగిసాక చెప్పడానికి ఏముంది ?” అని తన ప్రశ్నలకు తానే సమాధానం దొరకని తాత్వికునిలా నిలబడినపుడు …..

(పెన్ను విభాగం, సరైన తోవ)

కనపడని అమ్మ ప్రేమకోసం  దిండులో గుబులుగా మొహం పెట్టి కన్నీళ్ళ కలల్లో  వెతుక్కుంటూ, అమ్మానాన్నలను వదిలిపెట్టి మరీ ఇంతగా చదువుతున్న చదువు అవసరం  ఏమిటి? అని మదనపడే హాస్ట ల్ పిల్లవాడు గుర్తుకు వస్తాడు

దీనిలోని విషయానికి వస్తే దినపత్రిక తోటలో తిరుగాడే పక్షిగా ఈయన వ్రాసిన ‘ఆర్టికల్స్ పూలు’ దారిలో అక్కడక్కడా తగిలినా దాని పేరు ఏమిటి అని ఎప్పుడూ ఆలోచించలేదు . ఒక్క సారి ఆ పూల పరిమళం ”పదాలు – పెదాలు” గా గుప్పుమన్నప్పుడు అరె ‘ఇలాంటి పూలు’ ఇంకా చూసామే! అని వెనక్కి తిరిగి అవలోకిస్తే వీటన్నిటి వెనుక గల సిరా వర్ణం ”పూడూరి రాజిరెడ్డి ”గారిది అని తెలిసింది . అన్నిటికి లేని ప్రత్యేక  పరిమళం ఈ పదాలు పెదాలికి ఎక్కడిది అనే నా ప్రశ్నకు ఈయన ముందుమాటలో సమాధానం దొరికింది . ”అవన్నీ నేను ఇష్టంతో వ్రాసినప్పటికి అవి వ్రాయడానికి ఏదో కారణమో, సందర్భమో ఉన్నాయి . అలా కాకుండా ఏ అవసరం, కారణంతో పని లేకుండా కేవలం వ్రాయడం కోసం వ్రాసిన ఖండికలు ఈ పదాలు – పెదాలు ”

అదీ సంగతి హృదయవనంలో ప్రకృతికి పరవశించి తమకు తామే విరిసిన స్వచ్చమైన అడివి పూలు ఇవి . అందుకే అంత పరిమళం. సాహిత్య ప్రియుల హృదయాలు కట్టేసెంత పరిమళం . తాత్వికులు ఆగి ఏమి ఉందా అని చూసేంత  ఏదో ….. ఏదో ఏమిటి ?ఆ ఫీలింగ్ కి పేరు లేదా అంటే …. కొన్నిటికి ఉండవు . కావాలంటే దీనిలోని ”నేనేమిటి ?” చదవండి.  మీరు కూడా ఒప్పుకుంటారు తెలుగు బాషలో పదాల కొరత ఉందని …. ఇలాటి వర్ధమాన రచయితలు రావాలి అని .”

అలా నా సాహిత్య ప్రయాణంలో చదివిన ఈయన ఆర్టికల్స్ దీనిలో  ఉన్నప్పటికీ చిరు అలల పై సాయంసంధ్య వేళ సేద తీర్చేతెప్ప ప్రయాణం లాంటి ఈయన అక్షర ప్రయాణం వీటికి  ‘రీరీడింగ్’ అర్హతను మనకు తెలీకుండానే కల్పిస్తుంది .

పుస్తకం గూర్చి ఇంకో మూడు మాటలు .

జీవితం ఎలా అయితే ఉభయ సంధ్యలతో  మధ్యందిన బాలుడ్ని కలుపుకొని ఒక వలయం గా మారిపోతుందో ….. బాల్యాన్ని, యవ్వనాన్ని, ఇప్పటి పెద్దరికాన్ని కలుపుతూ చేసిన తన సాహిత్య ప్రయాణాన్ని బలపం, పెన్సిల్, పెన్ను అనే ‘మూడు’ విభాగాలుగా చేసి ఈనాడులో, సాక్షిలో జర్నలిస్ట్ గా తాను వ్రాసిన ఆర్టికల్స్ తో పాటు …. ‘నేనేమిటి ‘? అనే ఒక భావాల డైరీని (దీనికి ఏ పేరు పెట్టాలో తోచక చాలా సేపు కీ బోర్డ్ మీద వేళ్ళు ఆపే ఉంచాను. ఈ పేరుతో కూడా నాకు తృప్తి లేదు . కాకుంటే నా వ్రాతలు ఏదో ఒక పేరులో ఎందుకు ఉంచాలి …. వాటి కధ వాటిదే అని వ్రాసిన రచయిత మాటలే కొంత ఓదార్పు) కూడా ఇందులో కలిపారు . కాకుంటే మూడు పేజీ లు తిప్పగానే చూసిన ‘ నలుగురు చిన్న పిల్లల ఫోటో ‘ దాని కింద వ్రాసిన మాటలు మనసులో టన్నుల బరువును పెట్టేసి చదవడమే ఆపేసింది.  ఒక అన్నకి తన తమ్ముడి పై ఆ తమ్ముడికి కూడా తెలీని పెద్దరికంతో కూడిన ప్రేమ ఉంటుంది. ఎంత అంటే తాను హీరో కావాలి అని చెప్పుకొని తమ్ముడిని సైకిల్ పై తీసుకొని వెళ్ళేంత , తాను హీరో కావాలి అని మాత్రమే వాడికి చలి తగలకుండా తన నీలపు అంగీని వానలో కప్పాను అని చెప్పేంత ….. అలాంటి తమ్ముడు  తిరిగి రాని  లోకాలకి వెళ్ళినపుడు అక్షరాల వానలో తన దుఃఖాన్ని తుడుచుకోవడం తప్ప రచయిత ఏమి చేయగలడు .

బలపంలో తన చిన్నప్పటి ముచ్చట్లు, ఊరితో గల అనుబంధాలు, హాస్టల్ ప్రయాణాలు, చదువుల బరువులు చర్చిస్తూ మెల్లిగా మనలను కూడా కాలేజ్ జీవితపు పెన్సిల్ ప్రయాణానికి లాక్కోస్తారు .  ఆ వయసు మాయలో వెతుక్కున్న ప్రేమని, కలం స్నేహాలని, ఆవేశాలని అశ్లీలం లేకుండా ముచ్చటైన తన వచనంతో ఎంతో మంది ఆ అనుభవాలను ఓన్ చేసుకునేలా ”పెన్సిల్” విభాగం లో కనపరిచి …… వామనుడు అంతై ఇంతై అని పెరిగినట్లు తనలోని ప్రశ్నలని నేల విడిచి సాము చేసే ఆలోచన రూపాలుగా మార్చి అక్షర మధనం చేస్తూ తాత్విక భావాలను మనలో కూడా ప్రవేశ పెట్టి మనం కూడా మన అస్తిత్వపు లోతుల్లోకి తొంగిచూసుకోనేలా ‘పెన్ను’ లో  మంత్రిస్తాడు . ఇంతా వ్రాసి ”నేను ఈ జీవితం లో స్వేచ్ఛగా బ్రతుకలేను. ఇలా కాలి బూడిద కావాల్సిందే ”అంటూనే పుస్తక ప్రియుల ర్యాక్ లో బందీ అయిపోతాడు .

అఫ్సర్ గారి మాటల్లో  ”రాజి రెడ్డి వచనం ఆకు మీద నీటి బిందువు జారుతున్నంత మెత్తగా ,చలికాలపు బవిరి గడ్డాన్ని కోస్తూ మొండి బ్లేడు రాల్చిన నెత్తుటి గీరలా ”

భగవంతం గారి మాటల్లో  ”వీరిది ప్రత్యేకమైనమైన అభివ్యక్తి ”

ఇక’ నా’ మాటల్లో

విసుగుచెంధక విరుచుకు పడే ఈయన ఆలోచనల అలలు దాటి చూస్తే సుదూర తీరాలలో నింగితో కలిసి కనిపిస్తూ తనలోకి లాక్కొనిపోయి మన అస్థిత్వాన్నే ప్రశ్నార్ధకం చేసే సముద్ర నీలపు శక్తి వీరి వచనం .

”ఒక మగవాడి డైరీ ”అని పెట్టడంలో ఔచిత్యం నాకు కనిపించలేదు . డైరీ అంటే క్రమం లేని రాతలు అని చెప్పొచ్చు అని రచయిత చెప్పినా ఈ మాట వ్రాయకపోతే బాగుండును అనిపించింది . చక్కటి రచయిత అక్షరాలకు ఆసరాగా నిలిచి పుస్తకాన్ని పందిరిపై అల్లించి నీడలో  సేద తీర్చిన  ”సారంగా పబ్లికేషన్స్ ” వారి మంచి అభిరుచి అభినందనీయం

ముగింపుకు ముందు ఇంకో ఆలోచన ఈయన ”రియాల్టీ చెక్ ”కింద వ్రాసిన ”అనిజ మనుషులు’ ‘దీనిలో చేర్చడం రాబోతున్న ”రియాల్టీ చెక్” బుక్ కి సంకేతమా అని ఒక సందేహం . నిజం అయితే బాగుండును అనే ఆశ . జరగాలి అనే ఆకాంక్ష . ఎందుకంటే ఒక్క అడుగు వేసేవరకే ప్రయాణం లో గుంజాటన. అడుగు పడిన తరువాత ఒక పుస్తకం నుండి ఇంకో పుస్తకానికి సాహిత్య పుటలలో తన పుటను ఏర్పరుచుకుంటూ ముందుకు సాగడమే రచయిత చేయగలిగింది .

 

***

 

పుస్తకాలు నవోదయ , విశాలాంధ్ర తో సహా  రాష్ట్రం లోని ఆన్నీ ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తాయి.

 

హైదరాబాద్ లోని నవోదయ బుక్ హౌస్ వారి అడ్రెస్ :

Navodaya Book House

Opposite Arya Samaj Mandir,

Near Kachiguda crossroads, Hyderabad 500027

Phone No: 040 24652387

 

ఒక్కో పుస్తకం వెల రూ. 75 /- మాత్రమే.

-వాయుగుండ్ల శశికళ

sasi

Download PDF

6 Comments

  • ఆ మధ్యన రాజిరెడ్డి గారి “మధుపం” చదివాను కానీ ఇది ఇంకా కొనలేదండి.. వెంఠనే చదవాలనిపించేలా బాగా రాసారు శశికళ గారూ.

  • sasikala says:

    థాంక్యు తృష్ణ గారు . అసలు మధుపం వేరే కోణం అండి.ఇది వేరే
    ఈయన శైలి నాకు నచ్చుతుంది .నాలాగా నచ్చే సాహితీ ప్రియులు
    ఉండవచ్చు వారికి తెలియాలి అని వ్రాసాను .

  • Tahiro says:

    శశికళ గారూ … చేమంతులు , కనకాంబరాలు , పారిజాతాలు , బంతులు, గులాబీలూ , డిసెంబరాలూ, సన్నజాజులూ , దేవ గన్నేరులూ , వెయ్యి వరహాలూ , నంది వర్ధనాలూ , సంపెంగలూ , మందారాలూ, విరజాజులూ , చంద్ర కాంతలూ, రాధా మనొహరాలూ, పొన్నలూ, పొగడలూ … లిల్లీ , రేరాణీ … ఒక్కటా వంద రకాల (అక్షర) సుమాల కుప్పను ముందేసుకుని చేతికి దొరికిన పువ్వు ని తీసుకుని కలగాపులంగా దండ గుచ్చేసి సారంగ మెడలో వేశారు. దండ అల్లాలనే గాభరాలో బంతికి చేమంతికి మధ్యలో పొగడ, పారిజాతం లాంటి పూలను పెట్టేస్తే …. అవి కనబడతాయటండీ?! ఒక్కొక్కటి ఏరుకుని ఏరుకుని వాటి పరిమళం ఆఘ్రాణించె సరికి ఐదు రోజులు పట్టింది .
    పోనీలెండి … మాతో వందసార్లు చదివించారు. పూడూరి రాజి రెడ్డి గారు పూర్తిగా ఆవహించారు మమ్మల్ని .
    – తహిరో

  • sasikala says:

    హ…హ…:)) తహిరొ గారు భలే వారు అండి.భలే వ్రాసారు .ఎంత చక్కని విమర్శ .చాలా సేపు నవ్వుకున్నాను .
    థాంక్యు . ఏదైతే ఏమిటి ఎన్నో రకాల పీచులు వలిచి కొబ్బరి నీరు కమ్మగా తాగినట్లు నా అక్షర సుమాల
    పరిమళం అర్ధం అయింది . థాంక్యు . ఈ సారి ఈ విషయాలు గుర్తు ఉంచుకుంటాను .

  • Kiran Kumar says:

    శశికళ గారు,

    చక్కగా రాసారు, మీరు రాసింది చదువుతుంటే ఆ పుస్తకం పై మరింత ఆసక్తి కలుగుతుంది. ధన్యవాదములు.

  • sasikala says:

    కిరణ్ గారు అలాగే చదవండి థాంక్యు

Leave a Reply to Tahiro Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)