అనిపిస్తోంది…మనిషి ఉనికి మనిషితోనే లేదని…!

manishi -uniki
కొన్ని కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. ఉదాహరణకు మనిషి.
+++

చాలా ఏళ్ల క్రితం వదిలేసిన కెమెరాను మళ్లీ పట్టుకున్నాక మనిషి రహస్యం ‘మనిషి’ మాత్రమే కాదన్న విషయం అవగతమవుతూ ఉన్నది. మనిషితోసహా పరిసర ప్రపంచం పట్ల తెలియకుండానే ఒక అవగాహన ఏదో మెల్లగా కలుగుతూ ఉన్నది.  ఎలాగంటే తీస్తున్నది మనిషి ఛాయనే. కానీ ఆ ఛాయ అన్నది మనిషిదే కాదన్నవిషయం బోధపడుతూ ఉన్నది.కెమెరా కన్నులతో చూడగా ‘మనిషిని చూస్తున్నాననే’ అనుకున్నాను. కానీ అతడు పెరుగుతున్నాడు. అతడి ఆవరణా పెరుగుతున్నది. మీదు మిక్కిలి, అతడున్న ఆవరణ పట్ల స్పృహా కలుగుతున్నది. కానీ రచయితగా దర్శించినప్పటిలా కాకుండా- కెమెరాతో చూసినప్పుడు ఆ మనిషి ఫొటో నేను ఇదివరకు గమనించినట్టు రాలేదు. రావడం లేదు. అదొక ఆశ్చర్యం!

అంటే నేను భావించినట్లు కాకుండా-ఉన్నది ఉన్నట్టుగా- ఆ మనిషిని సరిగ్గా చూపించే మాధ్యమంతో పనిచేస్తున్నాను అన్న గ్రహింపు కూడా వచ్చింది, క్రమక్రమంగా. ఇది నిజం. ఒక మనిషి మనకు బాగా పరిచితుడే అనుకుంటాం. కానీ అతడిని లేదా ఆమెను ఫొటో తీసినప్పుడు ఆ మనిషిలోని అనేకానేక మార్పులు, ఛాయలు కనిపిస్తయ్. అంతకు ముందు మనం చూడలేనివి, బహుశా చూడ నిరాకరించినవీ కనిపించడమూ అగుపించి, ఆశ్చర్య చకితులం అవుతాం. మీరు చూస్తున్నదృశ్యం అలాంటివాటిల్లో ఒకటి.

+++

ఆమెను నేను ఎరుగుదును. పార్సీగుట్ట దాటి పద్మానగర్ చేరుకున్నాక ఆ స్కూలు చప్టా దగ్గర ఉంటుంది.   కానీ ఒకానొక ఉదయం ఆమెను ఫొటో తీశాక నేను వెనక్కి వెనక్కి జరిగాను. ముందు ఆమెను  చూశాను. తర్వాత ఆమె మౌనంగా ఏకాంతంలో ఒకానొక నిర్లిప్త ధ్యానంలో, వైరాగ్యంలో ఉన్న సంగతి కెమెరాలో గ్రహించి వెనక్కి జరిగాను. తర్వాత్తర్వాత ఆమె  చట్టూ ఉన్న ఆవరణ అంతా కూడా గ్రహించడం మొదలెట్టి ఆమెను ఇదిగో ఇలా అర్థం చేసుకున్నాను, ఫొటో ద్వారా.
ఒక వ్యధార్థ బాధిత హృదయం తాలూకు ఖండిక ఇలా చిత్రీకరించిన పిదపే తెలిసింది, ఆమె వీధి మనిషి అని. ఆమెతో పాటూ ఒక శునకమూ అనీ. ఇంకా చాలానూ…అప్పటినుంచీ ఆ ఫోటో నాకు నేర్పిన అనభవంతో ఆమెను నేన గమనించడం మొదలెట్టాను. గమనిస్తూ ఉన్నాను, కెమెరాతో….
+++

తీసిన ఫొటోలు చూస్తూ ఉండగా, నేను మామూలుగా చూసన దానికీ చిత్రీకరించి చూసిన దానికి ఆశ్చర్యంతో పాటు ఒక సహానుభూతిని ఫీలయ్యాను. నా బాధ్యతను గుర్తెరిగినట్టు అనుభవాన్ని పొందాను. ఇదే విశేషం అనుకుంటే మరో విశేషం, ఆ మనిషితో పాటు చుట్టుముట్టున్న విషయాలన్నీ  black humor లాగానూ, స్పష్టంగానో అస్పష్టంగానో నమోదయ్యాయి. ఇంకా ఇంకా ఫొటోలు తీసుకుంటూ పోతుంటే, ఇంకా ఇంకా… విషయాలు అనుభవ గ్రాహ్యం కావడం మొదలైంది. ఇది ఎలా ఉన్నదీ అంటే, రచనా వ్యాసంగంలో కంటే ఈ వెలుతురు రచనలో, కెమెరా ప్రపంచం కారణంగా, ప్రస్ఫుటంగా నా వరకు నాకే అర్థమవుతూ ఉన్నది. ఇదొక తారతమ్యం. ఇదొక ఆశ్చర్యం! ఒక experience…అలాగే సత్యం తాలూకు ఒక experiment అని కూడా అనిపిస్తూ ఉన్నది.+++

ఈ ఫొటో అనేకాదు, ఎట్లా అంటే ఒక మనిషిని లాంగ్ షాట్లో ఫొటో తీస్తూ ఉన్నప్పుడు ఆ మనిషి తీరు వేరు. బస్టు సైజులో ఫొటో తీస్తూ ఉన్నప్పుడు ఆ మనిషి వేరు. ఆ మనిషి ఏదైనా పనిలో -అంటే యాక్షన్లో ఉన్నప్పుడు అతడు అగుపించే విధానం మరీ వేరు. ఇక అతడు నలుగురిలో ఉన్నప్పుడు మరీ భిన్నం. పదుగురిలో ఉన్నప్పుడు వేరు. అప్పుడు తన అస్తిత్వం ఒక్కటే ప్రాధాన్యం వహించని కారణంగా- బృందంలో ఒకడిగా, ఒక్కోసారి ‘గుంపులో గోవిందయ్య’గా అతడి వ్యక్తిత్వం అప్రధానం కావడమూ జరిగి అతడు వేరుగా అగుపించసాగాడు.

ఒక మనిషిని జూమ్ చేయడమూ, క్లోజపులో చూపడమూ కాకుండా లాంగ్ షాట్లో, వైడాంగిల్లో తీయడమూ చేస్తూ ఉండగా ఆ మనిషి తాలూకు మనిషితత్వం విడివడుతూ అంతకు ముందు పరిచయమైన మనిషి కాకుండా సరికొత్త మనిషి ఆవిష్కారం అవడమూ మెలమెల్లగా అర్థమైనది.

అంటే మరోలా చెబితే, అతడు లేదా ఆమె స్థానం మనకు తెలిసిందే అనుకుంటాం. కానీ కాదు. కెమెరా తన స్థలమూ కాలమూ విశ్వమూ సరిగ్గా పట్టిస్తుంది. ఆ కెమెరా ఆమెను భిన్న కోణాల్లో నమోదు చేయడమూ జరుగుతున్నది. కావున మనిషిని చూడటంలో కన్నుకు ఉన్న పరిధి కెమెరా కన్ను దాటింది, దాటి చూపుతున్నదనీ కూడా. ఈ  గ్రహింపు వల్ల  మనిషి చిత్రం బహుళం అని, సామాజికమూ అని అవగతం అవుతూ ఉన్నది.

+++

మరీ చిత్రం ఏమిటంటే-  ఆ మనిషి మామూలుగా కనిపించడానికీ తలపై కొంగు చుట్టుకుని ఆగుపించడానికీ తేడా విపరీతంగానూ ఉన్నది. ఇంకోసారి దగ్గరగా తీసినప్పుడు, ఆ మనిషి పెదవులు ముడుచుకుని ఇచ్చిన ఫోజుకు పెదవులు తెరచి ఉండగా తీసిన ఫొటొకూ జీవన వ్యాకరణంలోనే పెద్ద తేడా కనిపించింది.

ఒక రకంగా- పెదవులు ముడిచినప్పుడు అతడు అతడుగా లేదా ఆమె ఆమెగా అంటే ఒక నామవాచకంగా, ఒక ప్రత్యేక అస్తిత్తంలో ఫ్రీజ్ అయిన మానవుడిగా ఉండటం గమనించాను. కాగా,  పండ్లు కనిపిస్తూ ఉండగా తీసిన ఫొటోలో అతడు సహజంగా అగుపించి, ఒక క్రియలాగా తోచడమూ మొదలైంది. అది ఆ మనిషికి తెలియకుండా జరిగే చర్యలాగూ ఉన్నది. ఇంకా,  ప్రత్యేకంగా ఒకరిని ఒక స్థలంలో అమర్చి, తగిన వెలుగు నీడల్లో అందంగా, విశిష్టంగా ఫొటో తీసుకోవడం ఉందే అది ఒక విశేషణంగా తోచింది. మొత్తంగా, మనిషి ఒక్కడే – అక్షరమాలలోని పదం మామూలే. కానీ అతడితో కర్తకర్మక్రియలన్నీ మారిపోతూ ఉన్నవి, అక్షరం- పదం -వాక్యమైనప్పుడు. అయితే ఇదంతా తనతో కాకుండా తనతోటి పరిసర ప్రపంచంలో ఆ మనిషి మార్పు నాకు అవగతం అవుతూ ఉన్నది.

+++

ఇదంతా ఒకెత్తయితే నేను సూటిగా చెప్పదలచుకున్న విషయం,  ఈ మనిషి కేవలం సాహిత్య వస్తువుగా ఉన్నప్పుడు చీమూ నెత్తురూ రక్తమాంసాలు మూలుగు ఆత్మా ఉన్న వాడుగా, అనుభవాల సెలయేరుగా, ముందు చెప్పినట్టు ఒక చెట్టులా ఉన్నాడు. ఉన్నది. గతంలో నేను అలా ఆవిష్కరించాను కూడా. ఇది పరిమితమే అని ఇప్పుడు అనిపిస్తున్నది. ఎందుకంటే, ఛాయాచిత్రలేఖనానికి వస్తే ఆ మనిషి ఒక ఉమ్మడి అంశంగా, పంచభూతాల్లో ఒకరిగా ప్రతిబింబించసాగాడం నాకే ఆశ్చర్యంగానూ ఉన్నది. చూడగా చూడగా తనకంటూ ఒక ప్రపంచం, అతడికో ఆమెకో ఒక ప్రపంచం అన్నది లేదు. విశ్వంలో మపిషి ఉన్నాడనే అనిపిస్తున్నది.

దాని విస్తీర్ణం ఛాయాచిత్రలేఖనంలో కొంచెం కొంచెం అగుపిస్తూ ఉన్నదన్న నమ్మకమూ కలుగుతున్నది.

దాన్నే ఇలా చెబితే, మనిషి ఫొటోగ్రఫి కారణంగా ప్రకృతిలో భాగంగా, ఒక ఎండుటాకుగా లేదా ఒక వికసిస్తున్న ఫలంగా సమైక్యంగా కనిపిస్తూ ఉన్నాడనిపిస్తూ ఉన్నది.  వేరు వేరు చ్ఛాయలు. కానీ అవన్నీ తనవే కావనీ తెలుస్తున్నది.

+++

చివరగా, మనిషి పంచభూతాల్లో ఒకడిగా, నేలా నింగితో, నీరూ నిప్పు గాలితో ప్రాణిగా ఉన్నాడు. వీటన్నిటి ప్రయోజనంగా, సంక్షిప్తమై ప్రత్యేక అస్తిత్వంగా సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. అందుకే అతడిని చూస్తే, తన స్థిరమైన లక్షణాన్ని గమనిస్తే మట్టిలా పరిమళంలా ఉంటాడు. ఆ సజల నేత్రాలను చూస్తే అది నీరు… ఆవేశకావేశాలతో ఎగిరిపడే అతడి హృదయం నిప్పు… ఆహ్లాదంతో తేలియాడినప్పుడు గాలి…. తన ఊహా ప్రపంచం, కల్పానమయ జగత్తును చూస్తే అది ఆకాశమో స్వర్గమో అనిపించసాగింది. ఒక్కోసారి ఇవన్నీ కాకుండా  దిక్కుతోచని స్థితిలో ముడుచుకుని ఉన్నప్పుడు, తన పట్ల తనకే అనాసక్తి కలిగినప్పుడు, ఒక గడ్డిపరకలానూ ఉన్నాడు. అదీ ఒక అస్తిత్వం అన్న సంగతీ తెలుస్తూ ఉన్నది.

తీయగా తీయగా అనిపిస్తూ ఉన్నది ఇదే…మనిషి ఉనికి మనిషితోనే లేదని!

~కందుకూరి రమేష్ బాబు

ramesh

Download PDF

2 Comments

  • కల్లూరి భాస్కరం says:

    దృశ్యాదృశ్యం చూస్తున్నాను, బావుంది రమేష్ బాబూ…ఎలా ఉన్నారు?

  • సర్, బాగున్నాను. మేరు ఇక్కడే, హైదరాబాద్ లో ఉన్నారా? మే మొబైల్ మారిందా? మాట్లాడుతాను. ఇవ్వ గలరు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)