బౌద్ధం… యుద్ధం… తవాంగ్ దృశ్యం

1

టూరిజం ఓ పెద్ద పరిశ్రమ అయిపోయాక మన మైదానాల సౌకర్యాలన్నీ మనతోపాటే  కొండలెక్కేశాయి. మంచి హోటళ్ళూ, బీరు బాటిళ్ళూ, ఫాస్ట్ ఫూడ్స్, మన ట్రాఫిక్ జాంలూ… చక్కగా వేటినీ వదలకుండా ప్రకృతి వొడిలోకి తెచ్చేసుకుని సెలవుల్ని ఆనందిస్తున్నాం. డార్జిలింగ్, నైనిటాల్, సిమ్లా, మసూరీ, ఊటీ, కొడైకెనాల్ లాంటి కొండ ప్రదేశాలకు పెద్ద పట్నాల వైభవం వచ్చేసి చాలా కాలమైంది.  కష్టపడి ఈ ఊళ్లకు వెళ్తే, ప్రకృతి పారవశ్యాల మాట అటుంచి, మన హైదరాబాద్ కో  ఢిల్లీకో కాస్త చల్లదనాన్ని పూసి, పాత సినిమాల్లో లాగా ఓ రెండు మంచు కొండలూ, ఓ సరస్సూ బ్యాక్ ప్రొజెక్షన్ పెట్టినట్టు ఉంటోంది. వీపున ఓ మూట వేసుకుని ఎవరూ పోని ప్రాంతాలకు ట్రెక్కింగ్ కి పోవటం ఉత్తమమే కానీ అది అన్నిసార్లూ కుదరదు.

మే లో మా కుటుంబం గువాహతి (అస్సాం) వెళ్లాం. అస్సాం వాతావరణం మేలో మన కోస్తా ప్రాంతాల మల్లే ఉంది.  షిల్లాంగ్ చల్లగా ఉన్నా అదీ ఓ పట్నమే కాబట్టి వద్దనుకున్నాం. అంతగా టూరిజం కోరల బారిన పడని అరుణాచల్ ప్రదేశ్ వెళ్తే బాగుంటుందేమో అని తవాంగ్ కు బయలుదేరాం. ఈ ప్రయాణంలో మార్గం కూడా గమ్యం అంత అందంగా ఉంటుందని విని  దీనిని ఎంచుకున్నాం.

బయలుదేరిన రోజున పొద్దున్నే ఏడు గంటలకల్లా ‘బొలెరో’ తో మా వాహనచోదకుడు సిద్ధం. ఈశాన్య రాష్ట్రాల్లో సూర్యోదయం వేసవిలో తెల్లారుజామున మూడున్నరకే అయిపోతుంది. అయినా మా వాళ్ళందరికీ ఒంట్లోని గడియారాలు ఆరుదాకా గంటలు కొట్టలేదు. బైటకొచ్చి చూస్తే,  పూబాలల్ని సున్నితంగా తడుతూ చిరుజల్లులు… మొత్తానికి ఎనిమిదికల్లా బయలుదేరాము.  ఎర్రటి నేలా,  లేత, ముదురాకుపచ్చ ఆకుల పరదాల మధ్యగా  సారవంతమైన పల్చని బూడిదరంగు నీటితో బ్రహ్మపుత్ర పరవళ్ళు… వీటిమధ్యలోంచి బద్ధకంగా ఆవులిస్తూ నిద్రలేస్తున్న గువాహతి ఊరిలోంచి మా ఎర్ర బొలెరో ప్రయాణం మొదలు పెట్టింది.

 

2

3

ఒక చిన్న ఫలహారశాల, బ్రహ్మపుత్ర

 

ఊరు దాటాక ఒక చిన్నపాటి భోజనశాలలో అల్పాహారం.  నన్ను చిన్నతనంలోకి ఒక్కసారిగా గిరాటు వేశాయి  బల్లమీద పెట్టిన ఇత్తడిపళ్ళెం, దానిలో అరిటాకులో పూరీలూ, ఒక చిన్న ఇత్తడి గిన్నెలో పల్చని శెనగపప్పు, ఆలుగడ్డ కూరా..  మా ఊళ్ళో నా చిన్నప్పుడు వాడకంలో ఉండిన కంచు, ఇత్తడి పాత్రలగురించి పిల్లలకు ఆనందంగా వర్ణిస్తూంటే, కాసేపు ఆ వస్తువులేంటో ఊహకందక,  వింత చూపులు ప్రసరించారు వాళ్ళిద్దరూ.

దారంతా అలాగే ఓ ముప్ఫై ఏళ్ల క్రితం మన పల్లెటూళ్ళు ఎలా ఉండేవో అలా కనపడింది.  అస్సాం అభివృద్ధి చెందలేదని అక్కడి ప్రజల బాధ. టాటాలూ అంబానీలూ అక్కడికి వెళ్ళరు. ఫలితం స్వచ్చమైన నీరూ, గాలీ, పంటా, పైరూ..   చమురు రిఫైనరీలు ఉన్నచోట అస్సాం అభివృద్ధి ఎలా ఉందో నేను చూడలేదు.  ఈ దారిలో కేవలమైన పచ్చదనంతో కూడిన పైర్లూ, గుబురు చెట్లూ,  వెదురుతోనూ, మట్టితోనూ కట్టిన ఇళ్ళూ.. అక్కడక్కడా సిమెంట్ ఇళ్ళు కూడా దిష్టిబొమ్మల్లా ఉన్నాయనుకోండి. మరీ ముఖ్యంగా ఎక్కడా వెదికినా కనబడని ప్లాస్టిక్ లూ, పాలితిన్లూ..  సైకిళ్ళమీద పాఠశాలకు వెళ్ళే పిల్లలు.. తేయాకు తోటలూ..  చక్కని రహదారికిరుపక్కలా ఈ అపురూప దృశ్యాలు తీరిగ్గా రాగాలాపన చేస్తుంటే మా వాహనం ఆ రాగాన్ని మింగేసే మెటల్ బ్యాండ్ హోరులా ఎనభై కిలోమీటర్ల వేగంతో పరుగెత్తడం మహా అసంబద్ధ దృశ్యం. ఇవాళ దేశమంతటా కూడా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్  అంటేనే అదో గగన కుసుమం.  మన సమయాన్ని ఆదా చేస్తూ ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళే ప్రైవేట్ ఆపరేటర్లు ప్రతీచోటా.

అస్సాం బాటకిరువైపులా...

అస్సాం బాటకిరువైపులా…

దారిలో దిరాంగ్ జిల్లా ఖరుపేటియాలో జనపనార బాగా కనిపించింది. ఈ జిల్లాలో ముస్లిం జనాభా కూడా ఎక్కువగా ఉంది. రౌతల్ గురి  చేరాక, ఇక్కడ బోడోలాండ్ ప్రభావం ఎక్కువని చెప్పాడు మా డ్రైవర్ రాజేష్. ‘బంగ్లాదేశ్ నుంచి  చొరబాట్లు ఈ ప్రాంతంలో సాధారణం’ అన్నాడు.  చొరబాట్ల మీద అదుపు, కాందిశీకులకు సరైన గుర్తింపు, స్థానికులకు సరైన భరోసా ఇవ్వని ప్రభుత్వాల వల్లనే కదా వేర్పాటువాదాలు!

మధ్యాన్నానికి తేజ్ పూర్ దాటి భాలుక్ పాంగ్ చేరుకున్నాం. ఇక్కడినుండి  అరుణాచల్ ప్రదేశ్ మొదలవుతుంది. అరుణాచల్ లో తిరగటానికి అక్కడి ప్రభుత్వపు అనుమతి పత్రం (inner line pass) ఈ వూరిలో తీసుకోవాలి.  భాలుక్ పాంగ్ నుంచి కొండ ఎక్కటం మొదలయింది. కొండ పక్కనే కామెంగ్ నది పరవళ్ళు తొక్కుతూ మా వాహనధ్వని తో జుగల్ బందీ సాగిస్తోంది.  ‘ఇది సతత హరితారణ్యం సుమా’ అంటూ పరచుకున్న పోక, అరటిచెట్లు, వెదురు పొదలు. కామెంగ్ నది చేస్తున్న గాన కచేరీకి పక్క వాద్యాల్ని అందిస్తున్నట్టు చిన్నా పెద్దా జలపాతాల ఝరీ నాదాలు.  ఈ పచ్చసముద్రాన్ని ఈదుకుంటూ టెన్గా లోయ చేరుకున్నాం. అదంతా మన సైన్యం నివసించే ప్రాంతం. చాలా పెద్ద సెటిల్మెంటు. టెన్గా దాటాక ఇంకో గంటలో బొమ్ దిలా చేరుకున్నాం. అప్పటికి చీకటి పడింది. మేము చేరేసరికి ఈ వూరిలో బజారంతా వస్తువులతో, విద్యుద్దీపాలతో వెలిగిపోతోంది. బస వెదుక్కుని, కిందకు భోజనం చేద్దామని వచ్చేసరికి అంతలోనే కర్ఫ్యూ పెట్టినట్టు అంతా నిర్మానుష్యం. అప్పటికి సమయం రాత్రి ఎనిమిదే అయింది. కష్టంమీద రొట్టెలూ, రాజ్ మా  సంపాదించి తినటం అయిందనిపించాం.

అరుణాచల్ అందాలు

అరుణాచల్ అందాలు

 

రెండో రోజు ఉదయాన్నే బయలుదేరాం. దారంతా ఒకటే వాన. మెత్తటి మట్టిలో ఇరుక్కుపోతున్న వాహనాలు. సరిహద్దు రహదారుల సంస్థ (బీ ఆర్ ఓ) ఇరవై నాలుగ్గంటలూ పని చేస్తున్నట్టు కనిపించింది. చాలా చోట్ల ప్రోక్లైనర్ లతో పని చేస్తున్నారు.  చంటి పిల్లల్ని వీపున కట్టుకుని పని చేస్తున్న ఆడవాళ్ళు కొంతమంది.  దారి విశాలంగానే ఉందిగానీ రాళ్ళు, బురదతో నిండి మా వాహన వేగానికి బాగానే కళ్ళెం వేసింది. అలా నెమ్మదిగా 13,700 అడుగుల ఎత్తులో ఉన్న సెలా పాస్ చేరుకున్నాం. అక్కడో పెద్ద సరస్సు. ఓ పక్క ప్రశాంతంగా గడ్డి మేస్తున్న జడల బర్రెలూ… కఠిన శిలా సదృశమైన కొండ కొమ్ము పక్కనే పసుపుపచ్చని పూలతో నిండిన లోయ.  హిమాలయాల్లో ఈ ఎత్తులో rhododendron పూలకోసం అప్రయత్నంగా వెదుకుతాయి నా కళ్ళు.   ‘నీకెప్పుడూ నిరాశ కలిగించలేదు కదూ’ అంటూ నవ్వుతున్న నేస్తాల్లా ఎర్రని, తెల్లని, రోజా రంగుల్లోని rhododendrons సమృద్ధిగా…

6

సెలా పాస్ దివ్యత్వం

సెలా పాస్ దివ్యత్వం

సాయంత్రానికల్లా కొండ దిగి జాంగ్ జలపాతం దగ్గరకు వచ్చాం. చాలా పెద్దదైన ఈ జలపాతం దగ్గర 3X2 మెగా వాట్ల జలవిద్యుత్ కేంద్రం ఉంది. ఉత్తరాఖండ్ లో, హిమాచల్ ప్రదేశ్ లో బోలెడంత సిమెంటూ, ఇనుమూతో చాలా పెద్ద పెద్ద జలవిద్యుత్ కేంద్రాలు కనిపిస్తాయి. ఇక్కడ ఇంకా ఆ జాడ్యం అంటుకోకముందే ప్రభుత్వాలు సౌరశక్తి మీద పడితే బాగుంటుందని అనిపించింది.

జాంగ్ జలపాతం,               కొండ దారుల వలయాలు

జాంగ్ జలపాతం, కొండ దారుల వలయాలు

చీకటి వేళకు తవాంగ్ చేరుకున్నాం.  ప్రయాణం మొదలైన దగ్గరనుంచీ ఒక ‘దీదీ’  రాజేష్ తో మొబైల్ ఫోనులో తెగ మాట్లాడుతూనే ఉంది. మమ్మల్ని తన హోటల్ లోనే దింపాలని ఆవిడ బాధ. ఇతనేమో ‘ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం’ అంటూ హామీలు ఇచ్చేస్తున్నాడు. మొత్తానికి అతని సలహా ప్రకారమే ఆ హోటల్ లోనే దిగాము.  ఈ రకం ప్రయాణాలలో చాలా వరకూ  క్యాబ్ డ్రైవర్ ల ఇష్టానుసారమే మనం నడిచేస్తూ ఉంటాం. మరో మార్గం ఉండదు. క్యాబ్ లో ద్రైవరయ్యకు నచ్చిన టపోరీ పాటల్ని భరించక తప్పదు. మధ్యలో వినయంగా విన్నవించి కాసేపు మనకి నచ్చిన  సంగీతాన్ని పెట్టబోయినా మొహం ముడిచేస్తాడు.  ‘ఏ పాటలూ వద్దు  ప్రకృతి సంగీతాన్ని విని లయించిపోదామ’ని  ప్రయత్నిస్తూ నేను  మా అమ్మాయితోనూ  క్యాబ్ డ్రైవర్ లతోనూ  ప్రత్యక్ష, ప్రచ్చన్న యుద్ధాలు చేస్తోంటాను.  అదో ఆట.

మొత్తానికి హోటల్ గది శుభ్రంగా కళాత్మకంగా ఉంది. తవాంగ్ హోటల్ లో వంట, వడ్డన, పాత్రలు శుభ్రం చేయటం, అతిథుల సామాను మోయటం కూడా ఆడపిల్లలే చేస్తున్నారు.  ‘ఇదేం బాధ?’ అనుకుని మా సామాన్లు మేమే పట్టుకున్నాం.  ఇక్కడ మగవాళ్ళకంటే ఆదివాసీ ఆడవాళ్లే ఎక్కువ కష్టపడతారని ఒకరిద్దరు చెప్పారు. బైటి పనుల్లో ఆడవాళ్ళు మునిగిఉంటే కొంతమంది మగవాళ్ళు ఇంటినీ, పిల్లలనూ చూసుకుంటారట.

పని పాటలు మన వంతేనప్పా!

పని పాటలు మన వంతేనప్పా!

 

10

తవాంగ్ టూరిస్టు ప్రాంతం అన్నదానికి గుర్తుగా ఊరంతా అక్కడక్కడ చిన్న ఝరుల మధ్య ఖాళీ  ప్లాస్టిక్ సీసాలూ, పాలితిన్ సంచులూ కనిపించాయి. ఘనీభవించిన  పచ్చదనాన్ని చేదిస్తూ రంగుల దుస్తుల్లో మనుషులు కనిపించాలి కానీ రంగుల చిరుతిళ్ళ రేపర్లు కాదుగదా!   ప్రకృతి పట్ల ఈ నిర్లక్ష్యాన్ని మనం ఎప్పటికైనా వదుల్చుకోగలమా?

మరునాడు ఎడతెగని వాన వల్ల అక్కడున్న ఒకటి రెండు సరస్సులు చూడాలన్న మా ప్రయత్నం నెరవేరలేదు. అరుణాచల్ ప్రదేశ్ లో  ఎత్తైన కొండలమీద వెయ్యి దాకా చిన్నా పెద్దా సరస్సులు ఉన్నాయట. తవాంగ్ మొనాస్టరీ అంతా తిరిగి చూసాం. మేము వెళ్లేసరికి బుజ్జి బుజ్జి అయిదేళ్ళ పిల్లల నుండి పదిహేనేళ్ళ పిల్లల వరకూ ఉదయపు అసెంబ్లీ లో ఉన్నారు. గురువుగారితో పాటు ప్రార్ధన అయాక అందరూ వరుసగా తరగతి గదులకు వెళ్ళిపోయారు.  మహాయాన బౌద్ధంతో పాటు, కాసిన్ని లెక్కలూ, హిందీ, సమాజ శాస్త్రం కూడా పిల్లలకు నేర్పిస్తామని ఒక గురువు చెప్పారు. తవాంగ్  మొనాస్టరీ  మన దేశంలోనే పెద్దది. చాలా పెద్ద గ్రంథాలయం ఉంది ఇక్కడ.  అయిదు వందల మంది దాకా బౌద్ధ సన్యాసులు ఇక్కడ ఉండి చదువుకుంటున్నారు. ప్రార్ధనాలయం గోడల మీద ఉన్న చిత్రాలు (murals) పాడవుతూ తమను కాస్త పట్టించుకోమంటున్నాయి. అయిదవ దలైలామా ఆధ్వర్యంలో ఈ మొనాస్టరీని పదహారవ శతాబ్దంలో నిర్మించారట. తవాంగ్ ఆరవ దలైలామా జన్మస్థలం కూడా.

11

తవాంగ్ మొనాస్టరీ

తవాంగ్ మొనాస్టరీ

ప్రార్ధనాలయం

ప్రార్ధనాలయం

ప్రార్ధనాలయంలో...

ప్రార్ధనాలయంలో…

తవాంగ్ లో మోంపా తెగకు చెందిన ఆదివాసీలు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ బౌద్ధం ఎక్కువ. బౌద్ధులు కాని మిగతా వారంతా ప్రకృతి ఆరాధకులే.  ఒకప్పుడు టిబెట్ లో భాగమైన తవాంగ్, బ్రిటిష్ వారు మెక్ మోహన్ లైన్ ను సరిహద్దుగా నిర్ణయించాక భారతదేశానిదయింది. 1962 చైనా-భారత్ యుద్ధం తరువాత ఒక ఆరునెలల పాటు చైనా ఆధీనంలోనికి వెళ్ళింది తవాంగ్ .  1962 లో తవాంగ్ దాటి, అస్సాంలోని తేజపూర్ దాకా చైనా సైన్యం వచ్చేసిందట. మొత్తానికి  ఆరు నెలల తరువాత చైనా దీనిని విడిచిపెట్టింది.  ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ టిబెట్ లో భాగమేననీ, తద్వారా అది తమకు చెందినదే అన్న భావం చైనా వారికి ఉంది. ఇక్కడుండే బౌద్దులకూ, ఆదివాసీలకూ చైనామీద ప్రత్యేక ఆసక్తి సహజంగానే లేదు. పైగా టిబెటన్లను అణిచివేసే చైనా విధానాలవల్లా, దలైలామా మన దేశంలోనే ఆశ్రయం తీసుకోవటంవల్లా, బౌద్ధులకు చైనావాళ్ళంటే గిట్టకపోవటమూ, మన దేశం అంటే కాస్త ఇష్టం ఉండటమూ కూడా సహజమే. తవాంగ్ భారతదేశంలో భాగంగా ప్రశాంతంగానే కనిపిస్తుంది. అయినా ఎటువంటి పొరపాట్లకూ, చొరబాట్లకూ ఆస్కారం ఇవ్వకుండా భారీగా మన సైన్యం అడుగడుగునా పహారా  తిరుగుతూ ఉంటుంది.

1962 లో చైనా మెరుపుదాడిని ఎంత మాత్రం ఎదుర్కోవటానికి సిద్ధంగా లేని భారత్  ఆదరా బాదరాగా దేశం  అన్ని మూలలనుంచీ సైన్యాన్ని తవాంగ్ కు పంపిందట. ఆ యుద్ధంలో సుమారు రెండు వేల మంది దాకా మన సైనికులు మరణించారు. వారందరి స్మృతి చిహ్నాన్ని తవాంగ్ లో కట్టిన  వార్ మెమోరియల్ లో చూసాం. జస్వంత్ సింగ్ రావత్ అనే సైనికుడు మరో ఇద్దరి సాయంతో  చైనా సైన్యాన్ని నిలువరించి, వారి మెషిన్ గన్ ను ఎత్తుకురావటం, చివరకు వారి చేతిలో మరణించటం వంటి సంఘటనలను వివరించే ఆయన స్మృతిచిహ్నం (జస్వంత్ గడ్)  కూడా తవాంగ్ వెళ్ళే దారిలో ఉంది.  ఇక్కడ యుద్ధంలో చనిపోయిన చైనాసైనికుల సమాధులు కూడా ఉన్నాయి.  ‘They also died for their country’ అని అక్కడ బోర్డు పెట్టారు.  మనసు బరువెక్కించే ఆ యుద్ధం ఆనవాళ్ళు నిండా నింపుకుంది తవాంగ్.

జస్వంత్ గడ్ స్మృతి చిహ్నం,               చైనా సైనికుల సమాధులు

జస్వంత్ గడ్ స్మృతి చిహ్నం, చైనా సైనికుల సమాధులు

 

 

జస్వంత్ సింగ్ రావత్ సమాధి,   ఆవరణ

జస్వంత్ సింగ్ రావత్ సమాధి, ఆవరణ

 

 

తవాంగ్ వార్ మెమోరియల్,                 ప్రార్ధనాలయంలో సైనికుల సేవ

తవాంగ్ వార్ మెమోరియల్, ప్రార్ధనాలయంలో సైనికుల సేవ

మరునాడు తిరుగు ప్రయాణం.  వరుణుడు తన ఆశీస్సులతో దారంతా ముంచెత్తాడు. సెలా పాస్ దగ్గరకొచ్చేసరికి ఎదురుగా అయిదడుగుల దూరంలో ఏముందో కనిపించటం లేదు. అక్కడ దిగి కాసేపు అటూ ఇటూ పరుగులు తీసి, అక్కడున్న ఒకే ఒక చిన్న ఫలహారశాలలో దూరాం. బయటి వర్షపు పొగలూ, లోపల వేడిగా మోమోలూ, నూడుల్స్ నుండి వస్తున్న పొగలూ… వణికించే చలిలో వేడి పొయ్యి సెగలలో సేదదీరి మోమోలూ, చాయ్ ఆస్వాదించాం.  ఈ షాప్ నడుపుతున్నదీ ఇద్దరు స్త్రీలే. అక్కచెల్లెళ్ళు.  పొయ్యి చుట్టూ అక్కడికి వచ్చిన వారంతా  చేరి  వాతావరణంగురించీ, బురదలో ఇరుక్కున్న వాహనాల గురించీ, ఒకనాటి  యుద్ధం గురించీ కబుర్లు చెప్పారు.  ఆ వర్షంలో రాజేష్  నిదానంగా బండి పోనిస్తుంటే, రోడ్డు విశాలంగానే ఉంది  గనుక ఎదురుగా ఏమీ కనిపించకపోయినా నిశ్చింతగానే కూర్చున్నాం.

సెలా పాస్ దగ్గరున్న చిన్ని ఫూడ్ జాయింట్ లో సేద తీరుతూ మేము.

సెలా పాస్ దగ్గరున్న చిన్ని ఫూడ్ జాయింట్ లో సేద తీరుతూ మేము.

సెలా పాస్ ఎత్తుల్లో ఇవీ ఇళ్ళు

సాయంత్రానికి వర్షం నెమ్మదించి, కొండా లోయల అందాలు బయటపడ్డాయి.  దారిలో  ‘కివి’ పండ్ల చెట్లు చూపించి ఇది మంచి వాణిజ్య పంట అని చెప్పాడు రాజేష్.  ఏమయినా డబ్బు, వ్యాపారం పెద్దగా తెలియని మనుషులు వీళ్ళు.  టెన్గా లోయలో వచ్చేటప్పుడు బస. ఆ హోటల్ లో పని చేసే నేపాలీ అతను అక్కడ హోటల్ వ్యాపారం ఎంత కష్టమో వివరించాడు. ఇక్కడ బయటినుంచి వచ్చి వ్యాపారం చేసేవాళ్ళే ఎక్కువ. స్థానికులు చాల మంది హోటల్ కు వచ్చి డబ్బులివ్వకుండా ఊరికే తిని వెళ్ళిపోతారట. వ్యాపారపు విలువలు వీరికి చాలా తక్కువగా అర్థమవుతాయేమో!  ఆ విలువలే తెలిసిన మనకు,  కొంత కాలం అక్కడ గడిపితే కానీ వీళ్ళ జీవితం అర్ధం కాదు.

మొత్తం అరుణాచల్ ప్రదేశ్ లో అయిదారు కళాశాలల కంటే ఎక్కువ లేవుట.  భారీ ఎత్తున టూరిజం పరిశ్రమా, పెద్ద తరహా వ్యాపారమూ అడుగు పెట్టని చోట ఆదివాసీ తెగలు ఎంత ప్రశాంతంగా బ్రతుకుతాయో కదా అనిపించింది తవాంగ్ ను ఇలా బయటినుంచి చూస్తే!  కానీ ఆ సమాజాలలో ఉండే అంతర్గత సమస్యలు వారితో కలిసి గడిపితే కానీ అర్ధంకావు కదా!

టూరిస్టుల కోసం దారంతా  స్త్రీల ఆధ్వర్యంలో చిన్న చిన్న భోజనశాలలున్నాయి. శుభ్రమైన సాదా సీదా భోజనం దొరికింది. మోమోలు, తూక్పా(మోంపాల సంప్రదాయ వంటకం), నూడుల్స్, గోధుమ రొట్టెలు, అన్నం, కూరలు వేడిగా దొరుకుతున్నాయి. పదహారు జిల్లాలతో విశాలంగా పరుచుకున్న అరుణాచల్ ప్రదేశ్ లో వ్యవసాయమే ముఖ్యమైన పని.  వాళ్ళ ఇళ్ళు నన్ను చాలా ఆకర్షించాయి.  గట్టి కలపతో చట్రాలు కట్టి, మధ్యలో వెదురు తడకలు బిగించి వాటిపై మట్టి పూసిన ఇళ్ళు కట్టటం వీరి సాంప్రదాయం.  ఉన్న చోటే దొరికే కలపతో కట్టిన ఇళ్ళూ, ఉన్నచోటే పండించుకునే తిండీ, అచ్చమైన గాలీ, స్వచ్చమైన నీటి గలగలలూ…

ఇంతకంటే ఇంకేం కావాలి జీవితానికి? అని కాసేపైనా అనిపిస్తుంది, మళ్ళీ మన నగరాలకు వచ్చేసేముందు.

కొంత సమాచారం :  గువాహతి నుంచి తవాంగ్ కు బొలెరోలలో వెళ్ళటం ఎక్కువ. కఠినమైన ఆ రోడ్లకు ఈ వాహనం బాగా సరిపోతుంది.  తేజ్ పూర్ నుంచి బస్సులు ఉన్నాయంటారు కానీ మేము వెళ్ళిన వర్షా కాలంలో ఏ బస్సులూ కనిపించలేదు. ఆరు రోజుల ఈ ప్రయాణానికి బొలెరో కి  Rs.25,000/- వరకూ తీసుకుంటారు. సైన్యం సులువుగా మసలటం కోసం వేసిన విశాలమైన రోడ్లు. దారంతా కన్నుల పండుగే.  సెప్టెంబరు నుంచి నవంబరు అనువైన సమయం. ఫిబ్రవరి, మార్చిలో కూడా సెలా పాస్ దగ్గర మంచూ, గడ్డ కట్టిన సరస్సులూ చూడవచ్చు. ఏప్రిల్ నుంచి ఇక వర్షాలే. తవాంగ్ నుంచి చైనా సరిహద్దు బూమ్ లా పాస్ కూడా  చూడాలంటే మొత్తం ప్రయాణానికి కనీసం ఆరు రోజులు పడుతుంది.     

Download PDF

14 Comments

 • pavan santhosh surampudi says:

  ట్రావెలాగ్ అంటే ఎంత విశిష్టమైన ప్రదేశానికి వెళ్ళామన్నది కాదు ఆ ప్రదేశం మన దృక్పథం వాళ్ళ ఎంత విశిష్టంగా కనిపించింది-దాన్ని మనమెంత విలక్షణంగా చెప్పగలిగాం అన్నదానిపైనే ఆధారపడి ఉంటుందని నా అభిప్రాయం. అవి లేకుంటే భవిష్యత్తరాలకు ఏమో గాని సమకాలినులకు విసుగే కలుగుతుంది.
  మీ వ్యాసంలో ప్రాంతాన్ని మీరు చూసిన పధ్ధతి గానీ, మీ దృక్కోణం కానీ పరమ రమణీయంగా ఉంది. దాన్ని చెప్పిన తీరు విలక్షణమ్గానూ ఉంది.

  • Lalitha P. says:

   థాంక్స్ సంతోష్ ! ఇప్పుడు చాలా మంది యాత్రలు చేస్తున్నారు. కానీ చూసే చూపు .. అది ముఖ్యమని నా అభిప్రాయం మీలాగే !

 • Vadrevu China Veerabhadrudu says:

  చాలా చక్కని యాత్రావర్ణన. చదివినందుకు సంతోషంగా ఉంది.

  • Lalitha P. says:

   థాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ !! నాకున్న హిమాలయాల పిచ్చి మొన్నటి కేదార్నాథ్ భీభత్సం తరువాత కాస్త తగ్గినా దేశం తిరగటమే కాదు విశేషాలు అందరితో పంచుకోవాలనీ అనిపిస్తోంది.

 • pudota.showreelu says:

  లలితాగారు యాత్రావిశేషాలు చక్కగా అందించారు మీతో పాటు మేము గూడా చైనా సరిహద్దు దాకా వెల్లెఛాము యాత్ర వర్ణనతో పాటు ఫొటోస్ పెట్టటం వలన చూసినంత అనుబూతి కలిగింది .ప్రొ. ఆదినారాయణ గారి యాత్రసాహిత్యం గూడా చాల బాగుంటుంది

  • Lalitha P. says:

   వ్యాసం మీకు నచ్చినందుకు సంతోషం. ఒకపాటి మంచి వయస్సులోనే పాదయాత్రలు చేసేసిన అదృష్టవంతులు ప్రో. ఆదినారాయణ.

 • devikarani says:

  లలిత గారూ మీ యాత్రావిశేషాలు బాగున్నాయి. ఈశాన్యరాష్ట్ర వాసుల జీవనవిధానాన్ని కళ్లకు కట్టారు. ఛాయా చిత్రాలు కూడా పోస్ట్ చేశారు కనుక… నాకూ అక్కడి అందాలమధ్య విహరించిన అనుభూతి కలిగింది. ధన్యవాదాలు….

  • Lalitha P. says:

   మీకుఈ యాత్రా విశేషాలు నచ్చినందుకు సంతోషం !!

 • naresh says:

  Delightful narrative and eloquent pictures are giving an elegant completeness to the chronicle !!

 • లలిత గారూ,
  ఈశాన్య భారతదేశపు మీ యాత్రానుభవాలను చాలా చక్కగా అక్షరబద్ధం చేసారు. మేమూ మీతో పాటు ఆ ప్రదేశాలు తిరిగిన ఫీలింగ్ కలిగింది మీ వ్యాసం చదివాక. ఆయా ఫోటోలు మీ వ్యాసానికి రంగులద్దాయి. విండో షాపింగ్ లానే…. విండో ట్రావెల్ చేయించేసారు మా చేత…
  ధన్యవాదాలు.

 • amarendra says:

  లలిత గారూ బావుంది మీ యాత్రా కథనం ..కీప్ travelling అండ్ కీప్ రైటింగ్ !!

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)