సాధారణంగా తల్లిదండ్రులు – అందులో అత్యంత వైభవోపేతమైన జీవితం గడిపేవాళ్ళు – తమ పిల్లలు ఇంకా ఉన్నత వర్గానికి ఎదగాలని, సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందాలని, తమ కంటే విలాసవంతమైన జీవితం గడపాలని కోరుకుంటారు. కాని సెర్దర్ ఓజ్కాన్ ‘ఒక రోజా కోసం’ నవల లోని తల్లి తన కూతురు అంతరాంతరాల్లో ఉండే ‘నేను’ ని కనుగొనాలని కోరుకుంటుంది.
ఈమె చాలా చిన్న వయసులోనే భర్తను పోగుట్టుకుంటుంది. ఎంతో ఆత్మవిశ్వాసంతో, ఎరుకతో బ్రతికే ఈమె ఇతరుల కళ్ళల్లో ఆరాధనని చూడటం కోసం తన కలని కూడా విస్మరిస్తున్న కూతురు డయానాని చూసి బాధపడుతుంది. ఇతరుల కోసం కాక తనకై తాను స్వేచ్ఛగా బ్రతకడానికి అడ్డుపడుతున్న అహాన్ని డయానా తొలగించుకోవాలని, తాను ప్రవేశించిన ఆనందపు తోటలోని గులాబీలతో మాట్లాడుతూ తన కూతురూ తిరుగాడాలని, కూతురు తన లోలోపలి పరిమళాన్ని ఇతరుల కోసం కోల్పోకూడదని కోరుకుంటుంది.
డయానాకి రచయిత్రి అవాలనే కల బలంగా ఉంది కాని మంచి రచయిత్రి కాకపోతే సమాజం నుండి నిరసన ఎదురవుతుందేమోనన్న భయంతో, ,తను సమాజంలో గొప్పగానే ఉండాలన్న అహంతో తన కలను చంపుకుని లాయరు అవాలనుకుంటుంది. చుట్టూ తిరిగే స్నేహితుల మెప్పుదల కోసం బ్రతుకుతున్న కూతురు డయానాని వ్యక్తిత్వం కలిగిన బిడ్డగా మార్చుకోవాలని ప్రయత్నిస్తుంది తల్లి. అయితే తన బిడ్డకి నెమ్మదిగా తెలియచెప్పడానికి ఆమెకి భగవంతుడు సమయం ఇవ్వలేదు. మరో ఐదు నెలల్లో ఆమె చనిపోతుందని డాక్టర్లు చెప్పడంతో తను చనిపోయిన తర్వాతైనా సరే డయానాలో మార్పు రావాలని పటిష్టమైన పథకం తయారు చేసుకుంటుంది ఆ తల్లి. తన బిడ్డను విచార మార్గంలో పయనింప చేయడానికి చనిపోయిన భర్త బ్రతికి ఉన్నాడని అంటుంది. లేని మరో కూతురిని (మేరీ) సృష్టిస్తుంది. మేరీ రాసినట్లు ఉత్తరాలు రాసింది. తన స్నేహితురాలైన జైనప్ హనీమ్ అనే తాత్త్వికురాలిని తన బిడ్డని దివ్యత్వానికి దగ్గరగా వచ్చేట్లు చేయమని కోరింది. ఆఖరికి బిచ్చగాడి సహాయాన్ని కూడా అర్థిస్తుంది.
చనిపోయేముందు రోజు తనకి మరో కూతురు ఉందని, తన భర్త తన నుంచి విడిపోతూ ఆ కూతురిని తీసుకువెళ్లాడని, ఇప్పుడు మేరీ ఇంటి నుండి ఎక్కడికో వెళ్లిపోయిందని డయానాకి చెప్తుంది. మేరీ రాసినట్లుగా తనే రాసిన ఉత్తరాలను డయానాకిచ్చి ఆ ఉత్తరాల ఆధారంతో మేరీని అన్వేషించమని ఆఖరి కోరికగా కోరుతుంది. ఆ అన్వేషణా మార్గంలో తన స్నేహితురాలు, తాత్త్వికురాలు అయిన జైనప్ హనీమ్ ని కలుసుకునేట్లు చేస్తుంది.
తన కవలసోదరిని వెతుకుతానని తల్లికిచ్చిన మాట కోసం ఇల్లు వదిలి జైనప్ హనీమ్ ని కలుసుకుంటుంది డయానా. అక్కడ – జైనప్ హనీమ్ దగ్గర ‘తన గులాబీకి బాధ్యత వహించడం అంటే ఏమిటో తెలుసుకుంటుంది. గులాబీలతో మాట్లాడటం, వాటి మాటలను వినడం నేర్చుకుంటుంది. దేవుడు మన జీవితంలోని అన్ని విషయాల్లోనూ భాగస్వామి అవుతాడని తెలుసుకుంటుంది. ప్రగతిని సాధిస్తుంది. చివరికి “నీ వరకు - మిగిలిన అన్ని తోటలకంటే నీ తోట వేరేదే అయితే - మిగిలిన అన్ని గులాబీలకంటే నీ గులాబి వేరేదే అయితే - ఆ తేడా నీకు ఆధిక్య భావనని కాక నిన్ను భూమి మీద నిలిపి ప్రపంచమంతటినీ హత్తుకునేలా చేస్తే నీకు దివ్యత్వం లభించినట్లే బిడ్డా! ఇక నువ్వు నన్ను కోల్పోవు. నీ జ్ఞాపకాల వెనక ప్రతి ఒక్క దాని ద్వారా నేను నీతో మాట్లాడతాను” అని అమ్మ రాసిపెట్టిన ఉత్తరం డయానాకి దొరుకుతుంది.
అప్పుడు – ఆ క్షణంలో డయానా అంతరంతరాల్లో ఉన్న ‘నేను’ ని కనుగొంటుంది. ముఖంలో అద్వితీయమైన మెరుపుని పొందుతుంది.
క్లుప్తంగా ఇదీ కథ
సెర్దర్ ఓజ్కాన్ కి జీవనయానానికి సంబంధించిన లోతైన అర్థాలు వెలికి తీసే రచనలు చేయడం ఇష్టమట. ‘The Missing Rose’ – ‘ఒక రోజా కోసం’ ఇతని తొలి నవల. ఈ పుస్తకం ఇప్పటికి 27 భాషల్లోకి అనువదింపబడి ఎంతో ఆదరణ పొందింది. దీన్ని తెలుగులోకి మంచిపుస్తకం.నెట్ (సురేష్ ) వాళ్లు అనువదించి ప్రచురించారు.
- ఇతరుల కంటే భిన్నంగా ఉండటానికి మాత్రమే విచారమార్గంలో పయనించేవారికి గర్వం తప్ప ఏమీ మిగలదు.
- మేథోశక్తితో ఊహించడం ద్వారా అసలైనదేదో తెలుసుకోలేము.
- హృదయం ద్వారా ప్రకృతిని వినగలిగే శక్తి పుట్టుకతో అందరికీ ఉంది కానీ ఎందుకో కాలం గడిచేకొద్దీ గుండెలు చెవిటివవుతున్నాయి.
- శిఖరాన్ని చేరుకోవాలని ఉన్నా చేరుకోలేమోనన్న భయంతో ప్రయత్నాన్ని విరమించుకుంటాం. పట్టు వదలకుండా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళితే శిఖరాన్ని చేరుకోగలము. మనకి శిఖరాన్ని చేరుకోవాలనే ఇచ్ఛ కలిగితే అన్ని వైపులనుండీ సహాయం అందుతుంది.
- నువ్వు అలవి కావు ఒడ్డుని ఢీ కొని మాయమైపోతానని భయపడటానికి. నీవు సముద్రానివి.
- గులాబీగా ఉండటం అంటే ఇతరులు పొగిడినపుడు బ్రతికి వాళ్లు తిరస్కరిస్తే అంతరించిపోవడం కాదు.
- ఇప్పుడు నిన్ను ఇంతగా ఆరాధిస్తున్నవారే ఏదో ఒక రోజు నిన్ను త్యజిస్తారు. ఎందుకంటే వాళ్లు ఆరాధిస్తున్నది నిజంగా నిన్ను కాదు. వాళ్ల కోరికల్ని. వాళ్ల పొగడ్తలలో నీ ఉనికి ఉన్నప్పుడు వాళ్లు నిన్ను త్యజించగానే నువ్వు లేకుండాపోతావు.
- నువ్వు మోజుపడే ఆత్మ తియ్యటి మృత్యువుని చవి చూసిన తర్వాత నీకు పునర్జన్మ లభిస్తుంది – ఇలాంటి వాక్యాలు ఎన్నో పుస్తకం నిండా. జీవితం పట్ల ఎంతో పరిణితి ఉంటేనే రాయగలిగిన వాక్యాలు.
మనకి నిజంగా ఇష్టమైన పని ఒకటైతే డబ్బు సంపాదన కోసమో, అధికారం కోసమో, ఎంచుకున్న రంగంలో పరిణితి సాధించలేకపోతే ఎదుర్కొనబోయే పరిస్థితులని ఊహించుకొనో ఇష్టమైన రంగాన్ని వదిలేసి సమాజ ఆమోదయోగ్యమైన రంగాన్ని ఎంచుకుంటాం. మనల్ని అర్థం చేసుకోలేని ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కోవడానికి భయపడతాం. దాని వలననే మనకి లోలోపల సంఘర్షణ, అసంతృప్తి. తద్వారా జీవితం పొడవునా అశాంతి.
తమ బిడ్డలు ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు కావాలనే కాంక్షతో పిల్లల మనస్సుకి నచ్చినదేమిటో తెలుసుకోలేకపోతున్న తల్లిదండ్రులు, ఇతరుల ఆరాధనతో బ్రతుకుతూ, ఇతరుల కళ్లల్లో తమని చూసుకుంటూ మరుగుజ్జులుగా మారుతున్న యువతీయువకులు తప్పకుండా చదవవలసిన పుస్తకం ఇది.
అప్పుడు కనీసం కొన్నైనా నాట్యం చేయవలసిన చేతులు గరిటను తిప్పుకుంటూ (ఇక్కడ నా ఉద్దేశం ‘వంట చేయడం మంచిది కాదు’ అని కాదు) , సంగీత కచ్చేరీలు ఇవ్వవలసిన నోళ్లు గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉండవు.
మన కలని అనుసరించకపోవడానికి అడ్డుపడే అహాన్ని చంపుకుని చేరుకోవలసిన శిఖరాన్ని ఎలా చేరుకోవాలో, శాంతిని పొందుతూ ప్రపంచాన్ని ప్రేమతో ఎలా హత్తుకోవాలో ఈ నవల ద్వారా విశదపరిచిన సెర్దర్ ఓజ్కాన్ చిరస్మరణీయుడు.
- రాధ మండువ
పాఠకులకు – నమస్కారం
‘ఒక రోజా కోసం’ నవల manchipustakm.in
Address:
Manchipustakam Publications
H.No 12-13-450,
Street No:1, Tarnaka,
Secunderabad- 500 017,
Andhra Pradesh, India.
info@manchipustakam.in
Contact Person – P. Bhagyalakshmi
Mobile: +91 9490746614
E-mail: baghyalakshmi@manchipustakam.in,
లో దొరుకుతుంది.
వ్యాసం లో ఈమెయిలు అడ్రస్ తప్పుగా పడింది.
క్షమాపణలతో
మీ రాధ
రచనని చేరువగా తెచ్చి చూపించారు…నేను ఇదివరలో పట్టించుకోని ఈ పుస్తకాన్ని చదవాలని అనుకుంటున్నాను. రాధ మండువ గారి ఈ చక్కని పరిచయపు ఉద్దేశం నా పట్ల నెరవేరింది.
మైథిలి గారూ,
అందరూ తప్పకుండా చదవవలసిన పుస్తకం. మీలో చదవాలనే అభిలాష కలిగినందుకు సంతోషంగా ఉంది.
Thanks & Regards,
Radha