హత్యనో, ఆత్మహత్యనో, సహజ మరణమో తెలియని అవస్థ!

drushya drushyam-10ఎందుకో చిన్నప్పటి నుంచీ నడక ఒక అలవాటు.
ముందు ఒక్కడిని…తర్వాత దోస్తులు కలిసేవారు.
చిన్ననాడు భుజంపైన పుస్తకాలు పెట్టుకుని నడుచుకుంటూ బడికి వెళ్లేవాళ్లం.
చిన్న చిన్న గల్లీలనుంచి నడుస్తూ నడుస్తూ పెద్ద రోడ్డు వచ్చేదాకా అలా సానుపు చల్లిన ఇరుగు పొరుగు వాకిళ్ల మధ్య నుంచి చిన్నదారి…అందులో స్లిప్పర్లతో నడక….అది క్రమంగా పెద్ద రోడ్డును కలిపేదాకా నడిచేవాళ్లం.
కొంచెం పెద్దయ్యాక ఇంటినుంచి బస్టాండ్ దాకా గబగబా నడక. ఆ నడకలోనూ మళ్లీ చిన్ననాటి అనుభవాలతో మళ్లీ రోడ్డును చూస్తూ, ఆ డాంబర్ రోడ్డుపై చూపు ఆనిస్తూ నడిచేవాళ్లం.
బస్టాండ్లో బస్సెక్కి కాలేజీ ఉన్న సిరిసిల్లకి వెళ్లాక మళ్లీ బస్టాండ్ నుంచి కాలేజీ దాకా నడక.
కొద్ది దూరమే అయినా కొంచెం పట్నంలో నడక.
తర్వాత నిజామాబాద్, అటు తర్వాత హైదరాబాద్…ఇక్కడా చాలా ఏళ్లు నడకే.
జీడిమెట్ల, హైదరుగూడ, బషీరుబాగ్, నల్లకుంట, రాం నగర్, డీడీ కాలనీ, మళ్లీ రాం నగర్, ఇప్పుడు పార్సీగుట్ట…గంగపుత్ర కాలనీ…బండి కొన్నాక కూడా నడక ఉండనే ఉన్నది.
అయితే నడక నేర్పిన చూపు ఒకటి అప్పుడూ ఇప్పుడూ ఉండనే ఉన్నది.
ఆ చూపే అనేక చిత్రవిచిత్రాలు పోతూ ఉన్నది.నిజమే మరి.
అప్పుడు వీధుల్లో చూపు సాగేది. పెద్దయ్యాక విశాలమైన రోడ్డుపైనా చూపు ప్రసరిస్తూనే ఉన్నది.
అప్పుట్లో ఒకసారి పది పైసల బిళ్ల దొరికేది. ఇంకోసారి పిన్నీసు కనిపించేది. గుండీలూ కనిపించేవి.
మరోసారి రెవెన్యూ స్టాంపూ కనబడేది. అలాగే దువ్వెన, ఇంకా పెద్దవీ కనిపించేవి.
అయితే, ఇప్పుడూ నడకలో అవి కనబడుతూనే ఉన్నయి. కనబడ్డప్పుడల్లా వాటిని తీసుకునే తీరు మారింది.

నడకతో వయసు నడుస్తుందేమో లేదా అనుభవమేమో!
ఇంకా చెబితే చాదస్తమూ కూడా…

నడవగా నడవగా అది అక్షరాల్లోకి అనువదించడమూ మొదలైంది.
మళ్లీ ఛాయచిత్రాల్లో వాటిని ఒడిసి పట్టుకోవడమూ జరూరు అయింది.
ఎందుకూ అంటే అది బాల్యం అనాలా? గతంలో సాగిన నడకకు కొనసాగింపు అనుకోవాలా?
తెలియదు.

కానీ మూడేళ్లలో నడక ఒడిసి పట్టిన చిత్రాలోన్నో…
ఆగి నడిచిన దాఖలాలూ ఎన్నో…
అలాంటి ఎన్నో చిత్రాల్లో ఇదీ ఒకటి.

+++

చిన్నప్పుడు నడుస్తూ ఉంటే, ఎండలో ముందుకు సాగుతూ ఉంటే, నా చిన్ననాటి మిత్రుడు సొన్నాయిల శీను ఒక గమ్మత్తు నేర్పించాడు.  కుడిచేతి పిడికిలి బిగించి …మధ్యన చిన్న సందు వదిలి ..ఆ వదులు పిడికిలితో ఎండలో అలా నడుస్తుంటే ఆ రంధ్రం గుండా ఒకానొక గుండ్రటి ఛాయ నేలమీద పడుతూ ఉంటే మనకిష్టమైన ఛాయచిత్రం ఒడిసి పట్టుకున్న తృప్తి. అదీగాక ఒంటరితనం తెలియనివ్వని సరదా అది!
మనతోపాటు ఒక నీరెండ వంటి అపూర్వమైన ఛాయ నొకదాన్ని మోసుకెళ్లడం అప్పటి ప్రయత్నం. జ్ఞాపకం!

ఇప్పుడు ఫొటోలు తీస్తూ ఉంటే, ముఖ్యంగా నేలమీద పడ్డ వాటిని కెమెరా కంటితో భద్రపరుస్తూ ఉంటే, ఎన్ని జ్ఞాపకాలో…మరెన్ని బాధలో…ఎంత అపూర్వమైన నడకో అనిపిస్తుంది, బతుకుది. అలాగే, మరెంతటి విషాద సమ్మోహనమో ఈ ప్రయాణ భరితమూ అనిపించేది.

ఒకటని కాదు, కొన్ని వందలు.
నా కలెక్షన్లో అలాంటి మహత్తరమైన జ్ఞాపకాల ఛాయలు వందలకు వందలున్నాయని సగర్వంగా చెబుతాను.
వాటిల్లో రాలిపడిన పారిజాతాలు నాకిష్టమైన ఒకానొక అందమైన చిత్రం. అలాగే పొగడపూల వాకిలి నేనే మెచ్చిన మరో  చిత్రం. అంతేకాదు, ఒకనొక ఉషోదయాన ఒక పేపర్ ప్లేట్ తడిసి నేలను అతుక్కుపోయి ఉండగా చూశాను. అది అచ్ఛం చందమామను తలపిస్తే ఎగిరి గంతేశాను. ఆ చిత్రమూ నా ఛాయాచిత్ర వాకిలిలో కదిలీ కదలాడే వెన్నెల దోసిలి.

ఇంకా పిన్నీసూ తీశాను, పండ్లు వూడిపోయిన దువ్వెననీ తీశాను.
ఒక మగువ తన భర్తను అభిమానంగా కావలించుకుని స్కూటర్ మీంచి వెళుతుంటే, పాపం! నా దిష్టే తగిలిందేమో, తన జుట్టులోంచి రాలిపడ్డ గులాబీని చిత్రించాను. చితికిపోయిన టమాటనూ చిత్రించాను.
ఇక ఈ కప్ప సంగతి సరేసరి, అది నన్ను ఇంకెంతో గాయపర్చింది.

+++

జీవితం సాగుతూ ఉంటే, నడక మున్ముందుకు కొనసాగుతూ ఉంటే, సుఖమే కాదు, దుఃఖమూ ఉండనే ఉంటుంది.
దాన్నీ అంగీకరించి నడిస్తేనే బతుకు నిండుదనం తెలిసి వస్తుందేమో!

బహుశా ఎన్నో జ్ఞాపకాలు. చూస్తూ చూస్తూ ఉండగానే ఎందరో పోయారు.
తాతమ్మ పోయింది. నాయినమ్మ మరణించింది. బాబాయి కూడా చనిపోయాడు. వాళ్లను చివరగా మంచం మీంచి నేలమీదికి అక్కడ్నుంచి కాటికి తరలిస్తుంటే చూడనే చూశాను.

బంధువులూ మిత్రులూ సహచర కార్యకర్తలూ ఎందరో పోయారు. హత్యకు గురైన పౌరహక్కుల పురుషోత్తం అయితే ఆ నేల, దిల్ సుఖ్ నగర్లో ఆ నేలపైన నెత్తుటి చెమ్మని ఇప్పటికీ వెళ్లి తడుముకుంటుంటాను.

ఆయన స్మారకార్థం ఒక పాటల క్యాసెట్టు తెచ్చినప్పుడు మిత్రులు “వొద్దు వొద్దూ’ అన్నా వినకుండా రక్తం చిందిన నేలమీద ఆ తెగిపడిన తల, దేహాన్నీ, పక్కనే భోరున విలపిస్తున్న జ్యోతక్కను – ఆ ఫోటోను అట్లే ముద్రించాను, రంగుల్లో- కవర్ పైన!

ఇదంతా అప్పటి వర్తమానం కోసం. ఒక భయ విహ్హలమైన గతం…దాన్ని మరచిపోకుండా ఉండే భవిష్యత్తు కోసం,
ఒక వాస్తవికతను చెప్పడానికి అలా ఆ ఛాయచిత్రాన్నీ అట్లే ప్రకటించాను.

ఇప్పుడూ అంతే. చిన్న చిన్న ఛాయల్లో ఒదిగే చరిత్రను, స్థితీగతినీ చిత్రాలు చెప్పక తప్పక చెబుతూనే ఉంటే చూస్తూనే ఉన్నాను, ప్రేక్షకుడినై!

అనుకుంటాం గానీ నేలమీద కనిపించే ఇసుక, కంకర, మొరం, డాంబరు, పూలు, ఇనుప రజను, కోడి రెట్ట, ఇంకా ఇంకా  నిదానంగా శిథిలమౌతున్న కప్పా ..అంతా కూడా వికృతి కాదు, ప్రకృతే. ఒక పురావలయం. చరిత్ర.

మట్టిలో వికసించి మట్టిలో కలిసే మహా కవిత్వం. చరిత్ర చరణాల ధూళి.
అది వినిపిస్తుంది తీసింది మీరైనా కూడా! అదీ చిత్రమే!!

చిత్రం నాదా మీదా అనికాదు, చూస్తూ ఉంటే- నడిచినంత మేరా ఎవరికైనా అనుభవాలు తగులుతూ ఉంటై.
మనం సుప్తావస్థలో ఉన్నా కూడా ఎప్పుడో ఒకప్పుడు బయటకి వస్తనే ఉంటయి.

ఇదొక అనివార్యమైన అవస్థ.

మరి, ఆ నడకకు వందనం. అది పంచే బతుకు చిత్రాలకూ అభివందనం.

~ కందుకూరి రమేష్ బాబు

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)