మూగవాడి పిల్లనగ్రోవి

drushya drushyam-12

drushya drushyam-12

అజంతా గుర్తొస్తాడు చాలాసార్లు.
చెట్లు కూలుతున్న దృశ్యాలు చూస్తున్నప్పుడు.
కూలకుండా చెట్టు అలా నడుస్తూ వెళుతున్నప్పుడు కూడా.

+++

ఇతడు కూడా అలాంటివాడే.
రిక్షా లాగి పొట్టపోసుకుంటాడు.
నిజానికి “రిక్షా తొక్కి’ అని రాయాలి. కానీ, తనకి రిక్షా తొక్కే పరిస్థితి లేదు. బోదకాలు మరి!
దాంతో రిక్షా లాగి తన జీవికను తాను వెళ్లదీస్తున్నాడు.

ఒకానొక ఉదయం.
హైదరాబాద్ లోని ముషీరాబాద్ డివిజన్ సమీపంలోని మేకలమండి. అక్కడ అతడ్ని చూశాను.
ఆ వీధిలోకి వెళ్లే ముందే ఒక గుడి వస్తుంది. ఆ గుడి దగ్గరకు రాగానే ఎందుకో నాకు తనను ఫొటో తీయబుద్ధి అయింది.
ఆ టైమ్ కి అక్కడ గుడి ఉందని కూడా నాకు తెలియదు. అతడు అలా రిక్షా లాక్కుంటూ వస్తున్నాడు. చూశాను. ఒకట్రెండు చిత్రాలు తీసుకున్నాను. ఆ తర్వాత అర్థమైంది, వెనకాల నర్సింహస్వామి ఉన్నాడని.
దాంతో మరొక మెరుగైన ఫొటోకోసం వ్యూ ఫైండర్లోంచి చూస్తున్నాను. అప్పుడు తెలిసింది, నర్సింహస్వామి ఏమోగానీ అతడికి బోదకాలు ఉందని!
ఆ కాలుతో రిక్షాను లాగుతున్న తీరు చూశాక ఇక చాలనుకున్నాను.

నిజానికి ఆ ఒక్క చిత్రం ఇక చాలనే అనుకున్నాను. కానీ మనసూరుకోలేదు.
అతడు చెట్లు కూలుతున్న దృశ్యమే. కానీ కూలకుండా నడుస్తున్న చెట్టు కూడా అని అర్థమైంది.
తీస్తూనే పోయాను. అతడితో పాటు నేను పోతూనే ఉన్నాను. పోతూ ఉండగా అర్థమైంది!
అతనొక వృక్షమని. తాను నలుగురికీ నీడనిచ్చే వృక్షమేగానీ పిల్లలో మరొకరో తనను పట్టించుకోవడం లేదంటూ విచారంతో కృంగిపోయే మనిషి కాదని!

ఏవో వేళ్లను నాలో నాటాడు.
కొత్త లిపినేదో నేర్పాడు. ఇక ఆ వృక్షం శాఖోపశాఖలై నాలో కుదురుకున్నది.
సరికొత్త పద చిత్ర దృశ్యాలు వాటంతటవే పేనుకొని నేనే ఒక చిత్రమై పోయి కొత్త కొత్త పాటలు పాడుతున్నాను.
ఏవోవో కవితలు అల్లుతున్నాను.

+++

తీరుబడిగా చూస్తూ ఉంటాను నన్ను నేను.
ఒకానొక రోజు మళ్లీ ఆ చిత్రాలన్నీ చూశాను.
వాటిల్లో అతను మరింత ఉత్సాహంగా కనిపించాడు. నోట్లో వేపపుల్లతో అతడు…ఏమీ ఆలోచించకుండా కులాసాగా నడుస్తూ రిక్షాను లాక్కెళుతున్న వయో వృద్ధుడు!
వెనకాల నర్సింహస్వామి! గాఢమైన రంగుల లిపితో కూడిన ఈ ఛాయాచిత్రాన్ని ఎంపిక చేసుకున్నాను.
అతడి వెనకాల ఉన్న కారు కూడా అతడు బతుకుతున్న స్థితిపట్ల కొన్ని భావ ప్రకటనలు చేస్తూ ఉన్నది.
అదీ మంచిదే అనుకున్నాను.

+++

ఈ ఫొటోను తర్వాత కాలంలో పెద్దది చేసి ప్రదర్శనకు పెట్టినప్పుడు, ఆ ఫొటో ప్రింట్ చేసిన శేఖర్ తన భార్యతో సహా ఎగ్జిబిషన్ కు వచ్చాడు.
అప్పుడు అతడి భార్య పవిత్ర ఈ చిత్రం వద్ద ఆగి ఆ ముసలాయన్ని గుర్తు పట్టి ఆశ్చర్య పోయింది.
“ఈ తాత నాకు తెలుసు. నీకెలా తెలుసు?” అని అడిగింది.
ఏకవచనం! ఎంత బాగుందో’ అనుకుంటూ, “నేను ఆ తాతను చూశాను’ అని మెల్లగా చెప్పాను.
“మేకలమండిలోనేనా?’ అందామె.
అవునన్నాను.
“ఇతడు మా ఇంటికి దగ్గర్లోనే ఉంటాడు. చాలా మంచివాడు. ప్రేమగా మాట్లాడుతాడు’ అంది.
“పిల్లలు పట్టించుకోరు. దాంతో ఇప్పటికీ కష్టపడుతుంటాడు” అని కూడా వివరించింది.
“అవును. పాపం…బోదకాలు’ కదా!” అన్నాను నేను.
ఆమె నా వైపు సాలోచనగా చూసి, “ఇతడికే కాదు, ఈయన భార్యకు కూడా’ అని ఆగింది.

+++

నాకు నోట మాట రాలేదు.
“ఇద్దరికా?” అన్నానో లేదో గుర్తులేదు గానీ, ఒక్కపరి నా జీవగ్రంథం రెపరెపలు పోయింది.
ఒక తల్లివేరు నిస్సత్తువగా తలవాల్చినట్టయింది.
నేను మెల్లగా మామూలు స్థితికి రావడానికి కొంత టైం పట్టింది.
ఇంకా ఆమె చెప్పింది, “ఇతడు రిక్షా లాగి కాసిన్ని డబ్బులు తెస్తే, తాను కూరగాయలు అమ్మి మరికొంత సంపాదిస్తుంది, కూచున్న చోటే!’ అని వివరించింది.
ఇప్పుడు నాకు మళ్లీ ఆశ్చర్యం కలిగింది.
“నయమే!” అన్నాను నేను.

“ఏం నయమో ఏమో! ఈ వయసులో కూడా వాళ్లు కష్టపడాలా?’ అంది తాను.
ఈ మాటకు మళ్లీ డోలాయమానం. ద్వైతం.

“తప్పదు. అనివార్య జీవన ప్రస్థానం” అనుకున్నాను నేను, మనసులో!

+++

ఏమైనా ఇదంతా జరిగింది.
ఇంకా చాలా జరిగింది, ఈ ఫోటో వల్ల.
తాత గురించి, తాత అవస్థ గురించి, తాత భార్య దుస్థితి గురించి…
వీటన్నిటీనీ మించి ఉల్లాసంగా వేపపుల్లతో నడుస్తున్న ఒక యువకుడి గురించి కూడా.
మస్తు మాట్లాడుకున్నాం.

విశేషం ఏమిటంటే, ఇదంతా మాట్లాడుకునే వీలు కల్పించిందీ చిత్రం.
అందుకే అంటాను, ఒక దృశ్యం చెట్లు కూలుతున్న వైనాన్ని చెబితే,
మరో చిత్రం కూలకూడదని చెబుతుంది.  ఒకటి ఉంటే మరొకటి ఉంటుంది.
ఉన్నదానికీ ఉండాల్సిన దానికీ మధ్య ఒక ఊహ, ఒక ఆశ, మరి ఆదర్శం….
ఇవన్నీ ఉంటేనే…ఒకానొక స్వప్నలిపి గురించిన ప్రేమపూర్వక ఆకాంక్షలు ఇలాగే ఉనికిలోనికి వచ్చినయి.

కళ ఆదర్శం బహుశా ఇదేనేమో!

అందుకనే దృశ్యాదృశ్యంగా జీవితం – కళ పెనవేసుకుని జీవించాలని నాకు మహా ఇది!
అటువంటి దార్శనికతను పంచిన ఎందరికో…
కేశవరెడ్డికి, అజంతాలకి కృతజ్ఞతలు.
ఆ తాతకు, తాతమ్మకు వందనం!!

~ కందుకూరి రమేష్ బాబు

Download PDF

8 Comments

 • DrPBDVPrasad says:

  సారంగలో ఈ దృశ్యాదృశ్యం దృశ్యకవితే.నాకయితే ఇది నాలుగుపేటల కవిత్వంలా వుంటుంది
  ఒకటి దృశ్యం రెండు వ్యాఖ్యానం మూడు అనుభూతి నాలుగు ఆలోచన
  రమేష్జీ అభినందనలు

 • హమ్మయ్య ఓకే ప్రశంస ఎంత బలాన్ని ఇస్తుందో…
  వెళ్లి చాయ తాగి వస్తాను.
  థాంక్ యు సర్.

 • raamaa chandramouli says:

  రమేశ్…ఇది జీవితం..సకల సృజనాత్మక ప్రస్తావనలన్నింటినీ మించిన మహాద్భుతం.
  నీ ప్రతి ఫోటో సంభాషిస్తుంది..కవిత్వాన్ని ఆవిష్కరిస్తుంది. .శభాష్.
  – రామా చంద్రమౌళి

 • surabhi says:

  రమేష్ బాబు గారు
  ఎంత అద్బుతంగా ఉందో ! అసలు ఆ చిత్రమే దాని రహస్యం చేఫ్ఫుకుంటునట్లు వుంది
  మీ ఆలోచనలు ఇంకా సూపెర్

  సురభి

 • రామ చంద్రమౌళి గారు, సంతోషంగ ఉంది.
  మీ ‘అంతర’ పుస్తకావిస్హరణ సంధర్బం లో, మీకు గుర్థుందే ఉంటుంది, ‘చిత్రానువాదం’ అన్న పద ప్రయోగం జరిగింది.
  బహుశ అప్పుడే ‘దృశ్యా దృశ్యం’కు అంకురం పడినట్టు ఉంది.

  సురభి గారు, ‘చిత్రమే దాని రహస్యం చేఫ్ఫుకుంటునట్లు వుంది’ అన్నారు.
  బాగుందండి. ఏమైనా, ‘జీవన వాస్తవికత’ గొప్ప కల్పన.
  అది సత్యము, సుందరము, శివము…చిత్రము కూడా.

  కృతజ్ణతలు.

 • Narayana says:

  రమేష్ బాబు గారు,
  నమస్తే. నేను మీ సామాన్యశాస్త్రానికీ, మీ ఫోటోలకు, మొత్తంగా మీ అభిరుచులకు ఎప్పటినుండో (గత మూడు సంవత్సరాలుగా) అభిమానిని.
  మీ ఫొటోలు చిన్నపిల్లల ముందు పోసేసిన గోళీల మాదిరిగా ఒక సారి, కరెంట్ పోయినప్పుడు విసనకర్ర అందించే స్నేహ హస్తంలో మరోసారి, వానగాలికి పులకరించే నెమలి మాదిరి ఇంకొకసారి …. మొత్తానికి అనేకసార్లు జీవితాన్ని పొట్లాలు విప్పి అందిస్తున్నంత సహజంగా ఉంటాయి.
  ఈ శీర్షికలో రిక్షా బతుకు తెరువు అనేది ఆ కాలు బాగులేని అతనికి ‘మూగవానికి పిల్లనగ్రోవిలా’ కాక, పిల్లనగ్రోవికి చేసిన రంద్రపు గాయంలా అనిపిస్తోంది. ఎందుకంటే, ఆ గాయమయ్యేది ఒక్కసారే కానీ, మురళిని ఊదే ప్రతిసారీ రాగానికి తగ్గ స్వరాన్ని సమకూర్చడంలో తన సహాయాన్ని అందిస్తూనే ఉంటుంది.
  ఫొటోలతో, వ్రాతలతో ఎప్పటిలా బతుకును పట్టుకుంటూ బతికిస్తూ పొండి.
  ధన్యవాదాఉ మరియు అభినందనలతో,
  నారాయణ గరిమెళ్ళ.

 • నారాయణ గరిమెళ్ళ.గారికి, మీకు నా వ్య్యాపకాలన్ని తెలియడం సంతోషంగా ఉంది. దాంతో నా చిత్రానువాదానికి ఉన్న నేపథ్యం సామాన్యశాస్త్రం అని గుర్తు పట్టడం ఎంతో అన్నందాన్న్నికలిగిస్తుంది. జీవితాన్ని పొట్లం కట్టడం ! బాగా చెప్పారు. పిల్లలు విసనకర్ర గోలీలు నెమలి ఇటువంటి దృశ్య దృశ్యాలు సహజంగా సుందరంగా వుంటై కదా. అ సహజత్వం కోసమే నా రచనా వ్యాసంగం.

  ధన్య వాదాలు.

  ఈ శీర్షికలో రిక్షా బతుకు తెరువు అనేది ఆ కాలు బాగులేని అతనికి ‘మూగవానికి పిల్లనగ్రోవిలా’ కాక, పిల్లనగ్రోవికి చేసిన రంద్రపు గాయంలా అనిపిస్తోంది.

  బాగా చెప్పారు.

  +++

  సందర్బం కాదు గాని, ఎవరో రాసారు!
  వెదురును ఊదితే వేణువు అని!

  +++

  వేను గానపు జీవన సమరం, రావూరి బరద్వాజ గారే కాదు,
  మీరు, నేనూ అ తాత కూడా.
  కదా!

 • Gabriel says:

  These topics are so consnfiug but this helped me get the job done.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)