స్త్రీవాద విమర్శలో కాత్యాయని కొత్త దారి!

కాత్యాయని విద్మహే
కాత్యాయని విద్మహే
కాత్యాయని విద్మహే

కాత్యాయని విద్మహే

(కాత్యాయనీ విద్మహే గారికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు సందర్భంగా)

తెలుగునాట స్త్రీవాద సాహిత్య విమర్శ అనగానే గుర్తుకు వచ్చే అతి కొద్ది విమర్శకుల్లో కాత్యాయని విద్మహే ఒకరు. స్త్రీవాదమంటే విదేశాలనుండి దిగుమతి చేసుకున్న వాదంగానే ఇంకా అనేకమంది వ్యాఖ్యానిస్తుండగా, స్త్రీల జీవితాల్లోని ఆరాట, పోరాటాల చరిత్ర ఈనాటిది కాదు,సంప్రదాయ సాహిత్య కాలం నాటికే వుందని సహేతుకంగా నిర్ధారించి, సాధికారికంగా చెప్పిన విమర్శకురాలు విద్మహే. ప్రాచీన సాహిత్యం పవిత్రతని నెత్తిన పెట్టుకోడమో, లేదా పరమ ఛాందసమని తీసిపారెయ్యడమో కాకుండా ఒక సమన్వయంతో, సదసద్వివేచనతో ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక దృష్టికోణం నుండి చూడాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ దిశగా తన విమర్శనా మార్గాన్ని ఎన్నుకున్నారు విద్మహే.ఈవిధంగా చేయడం వల్ల అటు ప్రాచీన సాహిత్యానికి, ఇటు స్త్రీవాద విమర్శకు ఆమె సరైన న్యాయం చేయగలిగారు. కాత్యాయని లాంటి విమర్శకులు చేసిన ఇలాంటి కృషి వల్ల ‘దేశీయ స్త్రీవాదచైతన్యం’ మూలాలు తెలుకునే వీలు కలుగుతోంది. అయితే ఈ దిశగా తరువాత స్త్రీవాద విమర్శకులెవరూ పెద్దగా కృషి చేసినట్టు కనిపించడంలేదు.

రెండు దశాబ్దాల పైబడి తెలుగు సాహిత్య విమర్శలో కాత్యాయని చేస్తున్న కృషి ప్రముఖంగా చెప్పుకోదగ్గది. కేవలం సమీక్షాత్మకంగా కాకుండా,’లోనారసి’ విశ్లేషణ చేయడం ఆమె విమర్శలో ప్రధానమైన లక్షణం. ఈ లక్షణమే ఆమెకు, ఆమె విమర్శకు ఒక విశిష్టత చేకూర్చగలిగింది.

కాత్యాయని సాహిత్య విమర్శ కృషి ని రెండు పాయలుగా విశ్లేషించి చూడటం అవసరం. స్త్రీవాద సాహిత్య విమర్శ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టినా అంతకుందు ఆమె చేసిన కృషి మరింత ముఖ్యమైంది. కవులు, కవిత్వ విమర్శల ఆకర్షణల నుండి తప్పుకొని తథ్భిన్నంగా కవిత్వేతర సాహిత్య ప్రక్రియలైన కధ,నవల మీద దృష్టి నిలిపి ఏకాగ్రతతో కృషి చేసిన, చేస్తున్న విదుషి విద్మహే. 1977లో ఎమ్మే పూర్తి చేసి ఆధునిక సాహిత్యంలో మరీ ముఖ్యంగా నవల,కథానిక ప్రక్రియల మీద అభిరుచితో పరిశోధన ప్రారంభించారు విద్మహే.సాహిత్య చరిత్ర నిర్మాణంలో భాగంగా ఆమె వివిధ వాఙ్మయ జీవిత సూచికలు రూపొందించారు. కొడవటిగంటి కుటుంబరావు వాఙ్మయ జీవిత సూచిక, నవలా రచయతల పరిచయ విమర్శనల సూచిక ఈ కోలోనివే. కాత్యాయని 1986లో రూపొందించిన కొ.కు.వాజ్మయ జీవిత సూచిక విశేష కృషిగా చెప్పుకోవాలి.

1980లో కొ.కు. చనిపోయిన తర్వాత మొదలెట్టి కనీసం ఆరేళ్ల పాటు పరిశోధించి ఆమె ఈ సూచిక తయారుచేశారు. ఈ సూచిక తయారీ అంతా ఒక ఎత్తు, దీని కోసం ఆమె తయారు చేసిన క్షేత్ర పర్యటన మరో ఎత్తు. ముఖ్యంగా ఈ పుస్తకానికి కాత్యాయని రాసిన పీఠిక ప్రముఖంగా పేర్కొనతగినది. ఇలాంటి విస్తృతమైన కృషినే ‘తెలుగు నవలా, కథానికా విమర్శనా పరిణామం’లో కూడా చూడవచ్చు.

1995లో ప్రచురితమైన ఈ పుస్తకం మొదటి అరవై పేజీలు కధ,నవలాసాహిత్య విమర్శనా పరిణామం చెపుతుంది.తెలుగు లో మొదటి నవల ఏది లాంటి చర్చల్ని తిరగతోడకుండా ప్రస్తుత సాహిత్య సందర్భంలో వచన సాహిత్యానికి సంబంధించిన దృక్పథాంశాల్ని ఈ పుస్తకం చర్చల్లోకి తీసుకు వచ్చింది. తెలుగు సాహిత్య ప్రపంచంలో కథ,నవల ప్రక్రియలపై కలిగిన చైతన్యాన్ని చరిత్రాత్మకంగా రికార్డు చేయడం ఈ పుస్తకం సాధించి్న విజయం.

వీటికంటే ముందు 1986లో అనంతపురం లోని ‘కదలిక’ పత్రిక నుంచి పునర్ముద్రించిన ‘తెలంగాణా పోరాట తెలుగు కధ-నవల’ అనె పెద్ద వ్యాసం ప్రస్తుత సాహిత్య సందర్భంలో ప్రత్యేకించి పేర్కొనతగినది.తెలంగాణా పోరాట సందర్భాన్ని కథ, నవల సాహిత్యంలో ఎలా వ్యక్తీకరించాయన్నది ఈ వ్యాసంలో ఆమె చెప్పారు.అప్పటి రైతాంగ పోరాటంతొ, ఇప్పటి జీవన పోరాటాన్ని సరిపోల్చుతూ వచ్చిన కధల్ని కాత్యాయని విశ్లేషించారు. తెలంగాణ వాస్తవికతని, సాహిత్యంలో దాని ప్రతిఫలనాన్ని మన కళ్ళ ముందుంచే ఈ వ్యాసం అప్పటికంటే ఇప్పుడు మరింత ఉపయోగకరమైందని చెప్పవచ్చు.

ఈ పరిశోధనాత్మక రచనలన్నింటిని ఒక్క సారిగా చదవడం మొదలుపెడితే, కాత్యాయని విద్మహే సాహిత్య దృక్పథం ఏమిటో మనకు స్పష్టమవుతుంది.మొదటి నుంచి కూడా చరిత్ర దృష్టి నుంచి సాహిత్యాన్ని విశ్లేషించే విమర్శకురాలిగా ఒక ప్రత్యేక రచనని ఎలా విశ్లేషించవచ్చో చూపించే ప్రయత్నం చేశారు మరో విమర్శ పుస్తకం’చివరకు మిగిలేది:మానసిక జీవన స్రవంతి నవలావిమర్శ’(1987)లో. స్త్రీవాద దృక్పధం నుంచి కాత్యాయని రాసిన మొదటి విమర్శ గ్రంధం బహుశా ఇదే కావచ్చు. ముఖ్యంగా ఒక పురుష పాత్రకు ఫెమినిస్టు దృక్పధాన్ని ఆపాదించి, విశ్లేషించడం ఈ అధ్యయనంలో విశేషంగా చెప్పు కోవాలి.

ఆ తర్వాత నుంచి కాత్యాయని విమర్శ దృక్పధంలో మార్పు వచ్చింది. ఈ మార్పుకు దర్పణం 1998లో వచ్చిన ‘సంప్రదాయ సాహిత్యం-స్త్రీవాద దృక్పధం’.ఆమే స్వయంగా చెప్పుకున్నట్టు ‘సామాజిక,సాంస్కృతిక రంగాల్లో ఉద్యమ స్థాయిలో ప్రచారంలోకి వచ్చిన స్త్రీవాద భావజాలం, యూనివర్శిటి పరిశోధనా రంగంలోకి చొచ్చుకొచ్చిన మహిళా జీవన అధ్యయన విధానం’ రెండూ కాత్యాయని సాహిత్య జీవిత దృక్పధాన్ని ప్రభావితం చేశాయి. ప్రధానంగా ఈ పుస్తక రచన ఆమెలో వచ్చిన గాఢమైన మార్పుని చూపిస్తుంది.

ప్రాచీన సాహిత్యంలో స్త్రీ-పురుష సంబంధాల విశ్లేషణ, వాటిని స్త్రీవాద దృక్పధం వెలుగులో చూడడం ఈ పుస్తకం వుద్దేశ్యం.భారతంలో భార్యాభర్తృ సంబంధాలతో మొదలై, మహిళావాద భూమిక నుంచి కావ్య శాస్త్ర దర్శనం వరకూ ‘మిరుమిట్ట్లు గొలిపే కొత్త ప్రతిపాదనవలతో’ ఈ విశ్లేషణ సాగుతుంది.సాంప్రదాయ సాహిత్యంలో కనిపించే స్త్రీల జీవితానికి వెనుక వుండే కనపడని పితృ స్వామిక హింసా రూపాలను, ఆ సాహిత్యంలోని కధ నిర్మాణాన్ని,మాటలను,సంభాషణలను బట్టి ఎంత సమగ్రంగా తెలుకునే వీలుందో అన్వేషిస్తాయి ఈ వ్యాసాలు. స్త్రీవాద విమర్శ దిశను మార్చిన రచన ఇది. నిజానికి ఈ పుస్తకంలోని ఒకొక్క వాక్యం విస్తృతంగా చర్చించతగినదే. ఈ వ్యాసాల్లోని ఆలోచనలు ప్రసరించే వెలుగులోసంప్రదాయ సాహిత్యం మన ముందు కొత్త అర్థాల్ని స్పురింప చేస్తుంది. బహుశా ఈ విధమైన రచన కాత్యాయని లాంటి కొద్దిమంది మాత్రమే చేయగలరేమో!

(‘ఈమాట’ వెబ్ పత్రిక సౌజన్యంతో)

Kalpana profile2- కల్పనా రెంటాల

Download PDF

10 Comments

  • Thirupalu says:

    ఈ సందర్భంగా కాత్యాయనీ విద్మహే గారికి అభినందనలు. ముఖ్యంగా రావి శాస్త్రి దృక్పదంలోస్త్రీల గురించి అమె రాసినవ్యాసం ఆమె స్త్రీ వాధ దృక్పదానికే హైలెట్‌.

  • attada appalanaidu says:

    కాత్యాయనీ గారికి అభినందనలు

  • ఎన్ వేణుగోపాల్ says:

    కాత్యాయని గారి సాహిత్య విమర్శ విశిష్టత గురించి రాసిన కల్పనకు కృతజ్ఞతలు.
    ఈ సందర్భంలో కాత్యాయని గారి గురించి రెండు మాటలు. నేను 1979-81 రెండు సంవత్సరాలు ఆమెకు ప్రత్యక్ష విద్యార్థిని. నా లెక్క ప్రకారం ఆమె తొలి సాహిత్య విమర్శ పుస్తకం (అప్పటికే విమర్శిని లో, సృజనలో రాసిన వ్యాసాలు కాక) మా బ్యాచ్ బి.ఎ. తెలుగుకు నాన్ డిటెయిల్డ్ టెక్స్ట్ గా ఉండిన వాసిరెడ్డి సీతాదేవి గాని నవల ‘రాబందులు – రామచిలుకలు’ పై ఆమె రాసిన సుదీర్ఘ వ్యాసం. ఆ నవల పంచాయతి రాజ్ గురించి, గ్రామీణ సంబంధాల గురించి కాగా, అప్పుడు వరంగల్ జిల్లా గ్రామీణ ప్రాంతాలలో సాగుతుండిన రైతాంగ పోరాటాల నేపథ్యంలో, మా ఆర్ట్స్ కాలేజిలో ఉండిన విప్లవ విద్యార్థి ఉద్యమ నేపథ్యంలో ఆ నవలను ఆమె మాకు అద్భుతంగా చెప్పారు. రామకోటిశాస్త్రి గారి లాగ ఆమె కూడ తాను చెప్పే విషయాన్ని తరచి తరచి ప్రశ్నించడం, అన్వేషించడం, రచించడం అలవాటు చేసుకున్నారు గనుక ఆ పాఠాలు అప్పుడే పుస్తకంగా వచ్చాయి. కొకు జీవిత వాంగ్మయ సూచి, చివరికి మిగిలేది మీద సిద్ధాంత పత్రం కన్న చాల ముందే. ఈ ముప్పై సంవత్సరాలలో కాత్యాయని గారి నిశిత ఆలోచన మరెన్నో రంగాలకు వ్యాపించి, చాల రచనల్లో, ఉపన్యాసాలలో వ్యక్తీకరణ పొందింది. సాహిత్య అకాడమీ పురస్కారం ఆమెకు గౌరవం అనడం కన్న, ఆమె ప్రతిభను గుర్తించడం సాహిత్య అకాడమీకి గౌరవం అనుకుంటాను.

  • balasudhakarmouli says:

    కాత్యాయని విద్మహే అభినందనలు

  • balasudhakarmouli says:

    కాత్యాయని విద్మహే గారికి అభినందనలు

  • rama.p says:

    కాత్యాయనీ విద్మహే గారికి అభినందనలు.
    రమ.పి. కరీంనగర్

  • K.Geeta says:

    కల్పనా! చాలా బాగా రాసేరు. కంగ్రాట్స్- (వ్యాసం చివర మీ ఫోటో భలే బావుంది)
    -కె.గీత

  • rajaram.thumucharla says:

    కాత్యాయని విడ్మహే గారి రచనల్నీ తెలుగు కవిత్వంలో స్త్రీ వాదం అనే అంశం మీదా పి.హెచ్.డ్ చేయాలని రిజిస్టర్డ్ చేసినప్పుడు చదివాను.వారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చినందుకు అభినందనలు.విద్మహే గారిని,వారి విమర్శనా దోరణిని మీరు పట్టుకొని విశ్లేషించారు.అనంతపురం ను మరువ లేదు.

    కాత్యాయని విడ్మహే గారి రచనల్నీ తెలుగు కవిత్వంలో స్త్రీ వాదం అనే అంశం మీదా పి.హెచ్.డ్ చేయాలని రిజిస్టర్డ్ చేసినప్పుడు చదివాను.వారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చినందుకు అభినందనలు.విద్మహే గారిని,వారి విమర్శనా దోరణిని మీరు పట్టుకొని విశ్లేషించారు.అనంతపురం ను మరువ లేదు.

    కాత్యాయని విద్మహీ గారికి అభినందనలు. వారి రచనలు కొన్ని చదివాను.ఆవిడ విమర్శలోని గొప్పదనాన్ని మీ రచన బాగా విశ్లీషించింధి .అనంథపురంని మరచిపోకుందా కదలికను ప్రస్తావించారు.

  • KOLIPAKA SHOBHA RANI says:

    కాత్యాయనీ విద్మహే…….గారిని ‘కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు’ వరించినంధులకు ఆనందానుభూతులతో
    శుభాభినందనలు…….

  • buchireddy gangula says:

    కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు —– ఏ రాజకీయం లేకుండా
    కాత్యాయిని గారికి యివ్వడం —సరి అయిన నిర్ణయం —-
    కంగ్రాట్స్ —-కాత్యాయిని గారు
    ——————————————————
    బుచ్చి రెడ్డి గంగుల

Leave a Reply to balasudhakarmouli Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)