రజనీగంధ

పాపినేని శివశంకర్

పాపినేని శివశంకర్

పువ్వులంటే యిష్టం

ఇంటి ముందు గుప్పుమని పిలుస్తూ

పసితనానికి తావులద్దినపొన్నాయి చెట్టు –

పూలేరి కాడలు తుంచి

బూర లూదటమంటే యిష్టం

కిలకిలల పూలరేకులంటే యిష్టం

రేకుల కోమలత్వం ఇష్టం

విరిసిన ధనియాల చేల మీదగా

తావుల తలపులు మోసుకొచ్చే గాలులంటే యిష్టం

గాలుల్లో సోలిపోయి నిద్రించే రాత్రులంటే యిష్టం

రజనీ నీల మోహన రూపానికి

రాగాలద్దే రేరాణులంటే యిష్టం

images

పూలకు తల్లి ఒడి అయినందుకే

పులకిస్తుంది నేల

కల్మషలోకాన్ని కాస్త నిర్మలం చేసేందుకే

ఆ రెక్కల దేవకన్యలు ఇక్కడికి దిగి వచ్చాయి

పువ్వులంటే యిష్టం

పువ్వుల్లాంటి మనుషులంటే యిష్టం

మనుషుల్లో ప్రవహించే మలయ మారుతాలంటే యిష్టం

నడిచే దారమ్మట కనపడని పూలచెట్లేవో బారులు తీరితే యిష్టం

ప్రపంచం పూలతోటయ్యే

కోకిలల కాలం కోసం స్వాగత గీతాలు రాయటమంటే

మరీ యిష్టం.

-పాపినేని శివశంకర్

rajinigandha

Download PDF

6 Comments

 • Thirupalu says:

  ” పూలకు తల్లి ఒడి అయినందుకే
  పులకిస్తుంది నేల”
  అమ్మ ఒడిలో కాసేపైనా ఆధమరచి నిదురోయినట్లుంది కవిత.

 • raamaa chandramouli says:

  ‘మనుషుల్లో ప్రవహించే మలయ మారుతాలంటే…’
  వీటిని పట్టుకోగల్గుతున్నందుకు అభినందనలు శివశంకర్..శుభం
  – రామా చంద్రమౌళి

 • Vimala says:

  kavita sunnitamgaa , baagundi.

  vimala

 • rajaram.thumucharla says:

  ప్రపంచం పూలతోటయ్యే

  కోకిలల కాలం కోసం స్వాగత గీతాలు రాయటమంటే

  మరీ యిష్టం.-ప్రపంచం పూలతోటయ్యే

  కోకిలల కాలం కోసం స్వాగత గీతాలు రాయటమంటే

  మరీ యిష్టం.ప్రపంచం పూలతోటయ్యే

  కోకిలల కాలం కోసం స్వాగత గీతాలు రాయటమంటే

  మరీ యిష్టం పాపినేని గారి కవిత్వం నిజంగా పూవు లాగా సుకుమారంగా అద్భుతంగా వుంది..

 • K.Geeta says:

  కొత్త పుస్తకావిష్కరణ శుభాకాంక్షలు పాపినేని గారూ!
  మృదువైన కవిత!
  -కె.గీత

 • పంపోతు నాగేశ్వరరావు says:

  రజినీగంధ కవిత చదువుతుంటే పూలతోటల మధ్య మనం విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. ప్రపంచమంతా పూలతోటతో నిండి ఉందనే భావన కలుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే రజనీగంధ నీల మోహన రూపానికి నిలువెత్తు రూపం పాపినేని శివశంకర్ గారు.
  రజనీగంధ పుస్తకంలో మొత్తం 50 కవితలున్నాయి వాటిలో ఏ కవిత ఆకవిత ఒకప్రత్యేకతను సంతరించుకున్నాయి

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)