నేనూ అమ్మనవుతా !

vnl photo

వారణాసి నాగలక్ష్మి

      

  పుట్టింది పెరిగిందీ నూజివీడు దగ్గర ప్లీడర్ గారి తోటలో. ఆలంబన కథా సంపుటి 2005 లోనూ , ఆసరా కథా సంపుటి 2010 లోనూ వెలువడ్డాయి .రచయిత్రిగా లేఖిని నించి ‘కథ’ పురస్కారం, స్వర్గీయ యమ్వీయాల్ సాహితీ సత్కారం వంటి కొన్ని ప్రోత్సాహకాలు లభించాయి. కారా మాస్టారు , ఛాయా దేవి గారు , మునిపల్లె రాజు గారు వంటి సాహితీ ప్రముఖుల నుంచి అందిన ప్రశంస, పురస్కారాల కన్నా ఎక్కువ సంతోషాన్ని , ప్రోత్సాహాన్ని ఇచ్చిందని చెప్పాలి.  కారా మాస్టారు చెప్పినట్టు ప్రముఖుల ప్రశంస , రచయితని గొప్ప కథలు మాత్రమే  రాయాల్సిన పరిస్థితిలోకి నెట్ట కూడదని నమ్ముతాను . మామూలు కథలు కూడా హాయిగా రాసుకోగలిగే  స్వేచ్చని రచయిత కాపాడుకోవాలని, పాఠకులు  expectations  లేకుండా రచయితని స్వీకరించాలనీ నా అభిప్రాయం, నా ఆకాంక్ష  !– వారణాసి నాగలక్ష్మి 

***

హాల్లో ఫోను మోగుతోంది.రోజూలా ఆయన తీస్తారేమో అని ఆగకుండా గబా గబా వెళ్లి రిసీవర్ తీశా. విజయ్ నించీ నీలిమ  నించీ ఇంకా ఫోను రాలేదు. వాళ్ళ నించే అనుకుంటూ హలో అన్నా. అటునించి నవీన పలికింది.

” ఏం తల్లీ? “అన్నా మళ్ళీ చేసిందేమిటా  అనుకుంటూ.

” అమ్మా ! ఎలా గడిపావు ఈ రోజు ?”అంది.

” చెప్పారు గదమ్మా నాన్న. ఐస్ క్రీం తెచ్చారు మధ్యాహ్నం .ఇవాల్టికి షుగరు మాట మర్చిపోయి తినేశా. అన్నం లోకి నాన్నకిష్టమని కొబ్బరి పచ్చడీ, నాకిష్టమని పులిహారా చేశా…” ఇంకా నా మాటలు పూర్తి కాకుండానే

“ఊ .. అంతే మీరు !  పుట్టినరోజు పూటా వండుకుంటూ కూర్చున్నావా? ఇన్నాళ్ళూ మా చడువులనీ, పరీక్షలనీ, నాన్నకి ఆఫీసులో కుదరకా, చుట్టా లొచ్చారనీ  ఏదో ఒక కారణం తో ఇంట్లోనే గడిపేదానివి. ఇప్పుడైనా హాయిగా ఎంజాయ్ చెయ్యచ్చు కదా ” కోప్పడుతూ అంది నవీన.

” ఇప్పుడేం కష్ట పడుతున్నా తల్లీ? హోటలు భోజనం నిండా ఉప్పు కారాలూ ,నూనెలూ ఎక్కువ. దాని బదులు ఇంట్లో సింపుల్ గా చేసుకుని ఇలా ఐస్ క్రీమో, స్వీటో తెచ్చుకుంటే నయం కదా!” అన్నా .

” సర్లే  ..ఏదో ఒకటి చెప్తావు. సాయంత్రం అయినా ఎటైనా వెళ్తున్నారా?” అంది నిష్ఠూరంగా  .

దాని బుంగమూతి ఊహించుకుంటూ ” ఊ.. కాలనీ గుడిలో ఏదో పురాణ కాలక్షేపం ఉంది. ఇద్దరం వెళ్తున్నాం ” అన్నాను .

“నీకింకా అరవై కూడా రాలేదే బాబూ!  చక్కగా ఆదివారం నాడొచ్చింది  పుట్టినరోజు! కాస్త ఓ సరదా సినిమాకో, పార్కుకో వెళ్లకూడదూ ? నాన్న కివ్వు ఫోను ” అంది విసుక్కుంటూ.

“నాన్న భోంచేసి  పడుకున్నారమ్మా. నువ్విలా అన్నావని చెప్తాలే.. అలాగే వెళతాంలే.. .  సినిమాకి కాదుగాని ఏదైనా పాట కచేరీ ఉంటే వెళ్తాం ” అన్నా.

“నాన్నకి నీ ఇష్టాయిష్టాలేవీ పట్టవు. నేనక్కడ జాబ్ చేసినన్నాళ్ళూ ఎలా వెళ్ళేవాళ్ళం మనిద్దరం?..అలా గుర్తొచ్చినపుడల్లా వెనక్కి వచ్చెయ్యాలనిపిస్తుంది…. కానీ ఇక్కడి జీవితం అలవాటు పడ్డాక అలా వెనక్కి రాలేం..” అంది.

నవీన మాటలకి నా మనసు పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అప్పట్లో విజయ్ అమెరికా లో ఎమ్మెస్ చేస్తుండేవాడు . నవీన చదువై ఉద్యోగంలో చేరింది. రెండేళ్ళ పాటు దాదాపు ప్రతీ సాయంత్రం సరదాగా ఏదో ఒక ప్రోగ్రాంకి వెళ్ళేవాళ్ళం. దానికి పెయింటింగ్  అంటే ఇష్టం. నాకు సంగీతం ప్రాణం. ఇద్దరం కలిసి ఆర్ట్ ఎగ్జిబిషన్ కో, సంగీత కచేరీకో నవీన స్కూటీ మీద వెళ్ళిపోయేవాళ్ళం.

అప్పట్లో ఆయన ఇంటికొచ్చేసరికి దాదాపు ఎనిమిదయ్యేది. మేమూ సాధారణంగా ఆ సమయానికి ఇల్లు చేరేవాళ్ళం. ఎప్పుడైనా కచేరీ చాలా బావుంటే ఇంకా లేటయ్యేది. అప్పటికాయన స్నానం చేసి టీవీ చూస్తూ ఉండేవారు. ముందుగానే వంట పూర్తి చేసి భోజనాల బల్ల మీద పెట్టి వెళ్ళేవాళ్ళం గనక రాగానే కబుర్లు చెప్పుకుంటూ భోజనం పూర్తి చేసేవాళ్ళం. నా జీవితంలో ఆ రెండేళ్ళూ చాలా  స్పెషల్ !

నవీన పెళ్లి చేసి పంపాక నాకు చాలా కాలం పట్టింది తేరుకోడానికి. ఆయనకి లలిత కళల మీద అభిరుచి లేదు. అలిసిపోయి ఇల్లు చేరేవారేమో నాతో మళ్ళీ బయటికి  రావడానికి ఆయనకి ఇష్టం ఉండేది కాదు.మిత భాషి కావడంతో మా ఇల్లు ఎక్కువ సేపు నిశ్శబ్దం గానే ఉంటుంది. పిల్లలతోపాటు పరుగులు పెట్టే రోజులు ఎలా గడిచాయోగాని ఇప్పుడు మాత్రం తరచుగా విసుగనిపిస్తోంది జీవితం. ఆయన  రిటైరయినా పెద్ద  తేడా  ఉండక పోవచ్చు. ఈ యాంత్రికజీవనం లో  విజయ్ నించీ, నవీన నుంచీ వచ్చే ఫోన్ కాల్స్ , వాళ్ళు పంపించే ఫోటోలు, ఈ మెయిల్స్ , ఏడాదికో రెండేళ్ళకో ఒకసారి వాళ్ళ రాక …ఇవే నా జీవితంలో మెరుపు తునకలు !

ఇవాళ నా పుట్టిన రోజు. చాలా మందికి లాగే నాకూ పుట్టిన రోజు నాడు నా ఆప్తులు కొద్దిమందీ నన్ను పలకరించాలనీ, నా పట్ల వారి ప్రేమ వ్యక్తమయ్యేలా ఏవో చిట్టి పొట్టి బహుమతులో, శుభాకాంక్షలో అందించాలనీ ఎదురు చూడడం అలవాటు. పిల్లలకి  జ్ఞానం  రాక ముందు, ఆయనకి గుర్తుకూడా ఉండక, నా పుట్టినరోజులన్నీ చప్పగా గడిచి పోయేవి. పిల్లలకీ, మా ఆయనకీ  వాళ్ళ పుట్టినరోజులన్నీ గుర్తుపెట్టుకుని వాళ్ళ కిష్టమైన పిండివంటలు చేసి, కొత్తబట్టలు కుట్టించి పండుగలా సెలబ్రేట్ చేసినా, నా పుట్టినరోజు ఎవరికీ గుర్తుండక ఉక్రోషం వచ్చేది.  నవీన కొంచెం  పెద్దదైనప్పటి నుంచీ అమ్మ పుట్టినరోజు అంటూ గుర్తు పెట్టుకుని ఆ రోజు అన్న తో కలిసి రహస్యంగా చర్చించి ఏవో సర్ప్రైజులు ఏర్పాటు చెయ్యడం , ఇంట్లో అన్ని పనుల్లో సాయం చెయ్యడం మొదలు పెట్టింది….అవన్నీ మధుర స్మృతులు !

ఇద్దరినీ ఒకలాగే పెంచినా విజయ్ కి ప్రేమ ప్రకటన చేతకాదు. వాడి భార్య నీలిమ  కూడా మంచి అమ్మాయే. కానీ పెళ్లవుతూనే విజయ్ తో  కలిసి విదేశాలకి వెళ్లిపోవడంతో నాతో పెద్దగా అనుబంధం ఏర్పడలేదు. ఎప్పుడైనా  వాడు ఫోన్ చేసి నాతో మాట్లాడమని ఇస్తే మాట్లాడుతుంది. ఈ విషయంలో నాకెంతో బాధగా ఉంటుంది. నవీన మాత్రం దాదాపు రోజూ ఫోన్ చేసి పలకరిస్తుంది. తరచూ ఈ మెయిల్స్ కి పిల్లల ఫోటోలు జతచేసి పంపుతుంది. పుట్టినరోజు పెళ్లిరోజులకి ఏవో బహుమతులు పంపిస్తుంది . ఒక్కోసారి డబ్బు పంపి ” ఆ డబ్బు దాచిపెట్టి మళ్ళీ నాకే ఏదో ఒకటి కొంటావు..అలా చెయ్యకు. ఏదైనా మంచి చీర కొనుక్కో. పని మనిషి ఎక్కువ డబ్బిచ్చి పనులన్నీ చేయించుకో ” అంటూ తాపత్రయ పడుతుంది . పనితో ఎంత సతమతమౌతూ  ఉన్నా పిల్లలచేత మాట్లాడిస్తుంది. వాళ్ళు’ అమ్మమ్మా తాతా’ అంటూ చిలక పలుకులు పలుకుతారు. నా జీవితంలో నవీన పంచే ఆనందం వర్ణన కందనిది.

Kadha-Saranga-2-300x268

కిందటి వారం విజయ్ ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఇప్పుడు బహుశః వెనక్కి కాలిఫోర్నియా ప్రయాణంలో ఉండుంటాడు. ప్రయాణం హడావిడిలో మెయిల్స్ చెక్ చేసుకుని ఉండడు. నవీన వాడికి గుర్తు చేసే వుంటుంది !!

పిల్లలు మరీ చిన్న వాళ్లవడంతో ప్రస్తుతం నీలిమ  ఉద్యోగం చెయ్యడం లేదు. ఒక్కసారి ఫోన్ చేసి  మాట్లాడకూడదూ? చివుక్కుమనిపించింది. మా అత్తగారిని నేనెంత  బాగా చూసుకునే దాన్ని! పెద్ద కోడలిగా ఎన్ని బాధ్యతలు నెరవేర్చాను! మరుదులూ, ఆడపడుచులూ అందరి పెళ్ళిళ్ళూ,చదువులూ అన్ని విషయాల్లోనూ అందిపుచ్చుకుని ఎలా నిభాయించాను? అందులో పావు వంతైనా తన నించి ఆశిస్తే తప్పు కాదు కదా! మనసు చిన్నబోయింది.

మళ్ళీ ఫోను మోగింది. ఈ సారి తప్పకుండా విజయ్ నించో, నీలిమ నించో అనుకుంటూ రిసీవర్ తీశాను. అబ్బే.. ఆయన కోసం ఆఫీసు వాళ్ళెవరో చేసారు. లేచారో లేదో చూసి కార్డ్లెస్ ఫోనందించి వంటింట్లోకి నడిచా కాస్త టీ పెడదామని. జీవితం చప్పగా ఉంది పోనీ టీ లోనైనా కాస్త మసాలా వేద్దామనిపించింది. యాలకులా ,దాసించెక్కా, సోంపా అని అలోచించి చివరికి అల్లం దంచి వేశా. రెండు కప్పుల్లో వేడి టీ పోసి పది చదరపు అడుగుల బాల్కనీ లోకి తెచ్చేసరికి ఆయన కూడా లేచి వచ్చారు, పొద్దుటి పేపరు చేతిలో పట్టుకుని.

టీ తాగుతూ అమ్మాయి ఫోన్ చేసిన విషయం చెప్పి ,”చూశారా విజయ్ గాని, నీలిమ గాని ఫోనే చెయ్యలేదు.వాళ్ళకసలు నా పుట్టిన్రోజన్న విషయమే గుర్తులేదు!” అన్నాను ఉక్రోషంగా .

తలాడించారు మౌనంగా.

” నేనెంత చేసేదాన్ని అత్తయ్య కోసం ?ఆవిడ కనుసన్నల్లో తిరుగుతూ,ఆవిడ చెప్పినట్టుగా నడుచుకుంటూ , ఇంటి బాధ్యతలన్నీ ఎంత పట్టించుకున్నాను? ఆఖరి వరకూ ఆవిడ అవసరాల్లో ఎంత వెన్నంటి ఉన్నాను? ” అన్నాను బెంగగా.

ఆయన నా కళ్ళలోకి చూసారు.

నా బాధ తనకి అర్ధమైనట్టే అనిపించింది.

చెయ్యి చాచి నా చేతిని నొక్కుతూ “నవీన మళ్ళీ ఫోన్ చేసిందన్నావ్?”అన్నారు.

నా కళ్ళు మెరిసి ఉండాలి. దాని ఫోను వివరాలు చెప్పాను.

ఆయన కొంత సేపు ఏదో ఆలోచిస్తున్నట్టు ఉండిపోయారు .

తర్వాత గొంతు సవరించుకుని “చూశావా భానూ! నీ కూతురు నీకు చేస్తున్న దానిలో పావు వంతైనా మీ అమ్మ గారికి నువ్వు చేసావా? ఆవిడకి డెబ్భై దాటినా ఇప్పటికీ పుట్టింటికెళ్ళి అంతో ఇంతో చేయించుకుని వస్తావు! ఈ నాటికీ వాళ్ళనించి పెట్టుపోతలు అందుకుంటూనే ఉన్నావు. అదే మరి నవీన పుట్టింటికి వచ్చినపుడల్లా నీకు పనికొచ్చేవీ, నచ్చేవీ ఏవేవో తెస్తూనే ఉంటుంది. దాని డెలివరీలకి మీ అమ్మ గారు నీకు చేసిన దాంట్లో పావువంతు కూడా నువ్వు దానికి చెయ్యలేదు. అక్కడికి మనని తీసుకెళ్ళి అమెరికా అంతా తిప్పి చూపించింది. ఇప్పటికీ మన పుట్టినరోజులకీ, పెళ్లిరోజులకీ ఏవేవో బహుమతులూ, చెక్కులూ పంపుతుంది. అటువైపు ఆలోచించావా?”అన్నారు మృదువుగా.

ఒక్కసారిగా నాకు కళ్ళు తెరుచుకున్నట్టయింది. నిజమే .. మా అమ్మ కు ఇంతవరకూ  నేను చేసిన సేవ ఏమీ లేనట్టే! పాపం ఇవాల్టికీ మేం వెళితే పక్కన కూర్చుని కొసరి కొసరి వడ్డిస్తుంది. వద్దన్నా వినదు. వంటకి వంట మనిషీ, పనికి పని మనిషీ ఉన్నా , ఏవో పచ్చళ్ళూ, పొడులూ ,చేసి ‘నీకిష్టమని చేసానే’ అంటుంది. ‘ వంకాయ కారంపెట్టి చేస్తే అతనికిష్టం కదే! ..కొబ్బరి పచ్చడి చేస్తే మళ్ళీ వేయించుకుంటాడు’ అంటుంది!

నేనూ ‘ఆవిడకి అలానే తృప్తి ‘ అని హాయిగా అనుభవించి ఊరుకుంటాను. రాత్రి పడుకునే ముందు జండూ బామ్  వాసన వస్తుంది. అమ్మ రాసుకుంది కాబోలు అని నిట్టూరుస్తాను. రెండు రోజులుండి మళ్ళీ మా ఊరు చేరుకుంటాను. అమ్మ మా ఇంటికి వస్తే ఆవిడకిష్టమని ఎక్కడికీ తీసుకెళ్ళిన జ్ఞాపకం లేదు. ఏదో పెళ్లి ళ్ల కీ, పేరంటాలకీ ,తప్పనిసరి అయిన చోట్లకీ తప్ప. అదే నవీన మాకోసం ఎంత ప్లాన్ చేస్తుందో. ఎంత ఆలోచిస్తుందో!

ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ శ్రీవారి మాటలు వినిపించాయి…

“అప్పటి కోడళ్ళకి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు కావడంతో అనుబంధం గాఢంగా  ఏర్పడేది. ఎదిగే చెట్టు మట్టిలో వెళ్ళు విస్తరించుకున్నట్టు కనపడకుండా అత్తింటితో బంధం బలపడేది.. కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలున్నా కష్ట సమయాల్లో, అనారోగ్యాల్లో, పిల్లల పెంపకంలో అత్తా కోడళ్ళు ఒకరికొకరు చేదోడు వాదోడుగా నడవడంతో ఒకరి లోపాలొకరు అర్ధం చేసుకుని తేలిగ్గా తీసుకోగలిగేవారు. ఒకరి మీదొకరు మానసికంగా ఆధారపడేవారు! ఇప్పుడు పెళ్లవుతూనే విదేశాలకి  వెళ్లిపోవడంతో పెద్దగా అనుబంధం ఏర్పడక పోవడం, ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో టైము దొరక్క పోవడం, అయిన వాళ్ళు లేని చోట భార్యా భర్తలిద్దరే కష్ట సుఖాలన్నీ ఎదుర్కోవడంతో అత్త మామలతో అంత ఇంటరాక్షన్ లేకుండా పోతోంది.” అన్నారు.

నిజమే ! కుటుంబ బాధ్యతలు నిర్వహించడంలో నేనూ అత్తగారి సహకారం , మాట సాయం  పొందాను. అనేక సందర్భాలలో ఆవిడ ప్రేమాభిమానాలు, ప్రశంసలూ పొందాను. చిన్న తనం నించీ ఆవిడ దగ్గరే  ఉండడంతో ఆవిడతో ఎంతో అనుబంధం ఏర్పడింది. తరవాత్తరవాత ఈయన ఉద్యోగ రీత్యా  వేరే రాష్ట్రాలలో ఉన్నప్పుడు కూడా  ఆవిడా వస్తూ ఉండేవారు, అవసరాలకి  నేనూ పిల్లలతో వచ్చి ఆవిడ దగ్గరుంటూండే దాన్ని. ఆయనొకరే ఎలాగో మానేజ్ చేసుకునేవారు………

ఆలోచనల్నించి బయట పడుతూ ” సరే లెండి… ఇప్పటి తరం తమకు సమ్మత మయిందే చేస్తారు గాని ఇతరులేమనుకుంటారో అనో , ఇతరులు ఆశిస్తారనో  ఏదీ చెయ్యరుగా !” అన్నాను నవ్వుతూ.

“అవును సరిగ్గా చెప్పావు! ఇంకో విషయం చెప్పనా ? ఇప్పటి పిల్లలకి,  చాలా కాలం…. అంటే దాదాపు పాతికేళ్ళ పాటు  చిన్న  కుటుంబంలో తల్లీ తండ్రీ, ఒక తోబుట్టువూ మధ్య పెరగడం, బాగా చదువుకుని ఉద్యోగం లో చేరి, కొన్నాళ్ళు సంపాదించాక పెళ్లిళ్లు జరగుతున్నాయి. వాళ్ల ఉన్నతిలో తల్లిదండ్రుల పాత్ర అర్ధమై, వాళ్లతో అనుబంధం గాఢమై,  అదే వాళ్ళ మనసులో నిలిచిపోతోంది. వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలనే తాపత్రయం కలుగుతోంది ! దానికి  తోడు సొంత సంపాదన ! ఏమంటావు?”అన్నారు.

ఏమంటాను? నిజమే..

మళ్ళీ ఆయనే ” పెళ్ళైన వెంటనే దూర దేశానికి వెళ్ళడం, అన్ని కష్ట సమయాల్లోనూ ఇరుగు పొరుగుల సహకారం అవసరమై, వాళ్ళతోనే  అనుబంధం ఏర్పడడం ! దూరంగా ఉన్న అత్త మామలు బాధ్యతలుగానే గాని, తీయని బంధాలుగా అనిపించే ఆవకాశం ఏదీ?

“నీలిమ విషయంలో  తను చెయ్యక పోయినా నువ్వే చెయ్యి. … ఆశించకుండా అందిస్తూ పోతే ఎప్పుడో ఒకప్పుడు నువ్వూ తల్లిలా కనిపిస్తావేమో!!” అన్నారు నవ్వుతూ.

అన్నీ వింటూ ‘ అవును .. నీలిమకి నేనూ అమ్మనవాలి ‘ అనుకున్నా.

 

***

 –  వారణాసి నాగలక్ష్మి

Download PDF

4 Comments

  • మణి వడ్లమాని says:

    మిత భాషి అయిన భర్త అనుకోకుండా అంతసేపు ఆవిడతో అనునయంగా మాట్లాడడం కొంత ఆశ్చర్యం అనిపించినా తరాల అంతరాలని ,అందు లోని లోటుపాట్లన్ని భార్యకు అర్ధమయ్యేలా చెప్పడం బావుంది నాగలక్ష్మి గారు.

  • సింపుల్‌గా అనిపిస్తునే, భావోద్వేగాలను బాగా డీల్ చేసిన కథ. బావుంది.

    “మామూలు కథలు కూడా హాయిగా రాసుకోగలిగే స్వేచ్చని రచయిత కాపాడుకోవాలని, పాఠకులు expectations లేకుండా రచయితని స్వీకరించాలనీ నా అభిప్రాయం, నా ఆకాంక్ష !” – వెల్ సెడ్ వారణాసి నాగలక్ష్మి గారు.

Leave a Reply to varanasi nagalakshmi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)