పర్యావరణం తెల్లదుప్పటి కాదు!

ఎస్. నారాయణస్వామి

ఎస్. నారాయణస్వామి

అమెరికా వచ్చి నేను తెలుసుకున్న విషయాల్లో పర్యావరణ స్పృహ కూడా ఒకటి. ఎనభైలలో వరంగల్లో బి.టెక్ చదువుతున్న రోజుల్లో, అప్పటికే భారత్‌లో కూడా కొన్ని పర్యావరణ సంరక్షణ ఉద్యమాలు జరుగుతూ ఉన్నా, ర్యాడికల్ నక్సలిజం నా దృష్టిని ఆకట్టుకున్నంతగా పర్యావరణాన్ని గురించిన ఆలోచన ఆకట్టుకోలేదు. ఐనా మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన పుణ్యానికి, అందునా ఇంటర్నల్ కంబస్చన్ నా అభిమాన శాస్త్రం కావడం వల్లనూ, ఇంజన్లద్వారా జరిగే వాతావరణ కాలుష్యాన్ని గురించి కొంత అధ్యయనం చేస్తూ వచ్చాను. అమెరికా వచ్చిన కొత్తల్లో ఒక రోజు మా విశ్వవిద్యాలయం నడిబొడ్డున ఏదో నిరసన ప్రదర్శన జరుగుతున్నది. అప్పటికి ఎక్సాన్ వాల్డెజ్ దుర్ఘటన జరిగి ఒక యేడో, రెండేళ్ళో పూర్తయి (ఏనివర్సిరీ అనడానికి తెలుగులో వార్షికోత్సవం అని తప్ప ఇంకో మాట లేదా? దుర్ఘటనల ఏనివర్సరీలని ఏమనాలి? సాంప్రదాయకంగా తద్దినం అంటే పోతుందేమో?) ఆ సందర్భంగా ఎక్సాన్ కంపెనీని ఉద్దేశించి ఆ నిరసన ప్రదర్శన జరుగుతున్నది. పర్యావరణ సంరక్షణ ఉద్యమంతో అదే నాకు తొలి పరిచయం. ఆ తరవాత ఈ సంఘటనని తలుచుకుని నిరసన అనే పేరుతో నేనొక చిన్న సెటైరు రాసుకున్నాను.

అటుపైన పుస్తకాల ద్వారా, మిత్రులతో చర్చల ద్వారా, ఇంకా ఆ తరవాత ఇంటర్నెట్ ద్వారా చాలా ఉద్యమాలు పరిచయమయ్యాయి. కొన్నిటితో అనుబంధాలు పెరిగాయి, నేను కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే వరకూ. చాలా మట్టుకు పబ్లిగ్గా జరిగే ఈ నిరసన కార్యక్రమాలు ఏదో ఒక కంపెనీని వ్యతిరేకిస్తూ నడిచేవి. కంపెనీలకి ముఖ్య బలం వాటి లాభాలు కాబట్టి, దుష్టకంపెనీలకి బుద్ధి చెప్పాలంటే వాటి ఉత్పత్తులని కొనడం మానెయ్యాలనే సిద్ధాంతం ఒకటి అప్పుడే బయల్దేరింది. ఇది నిజమేనని నమ్మి (ఎంతైనా మొదట మార్క్సు శిష్యుణ్ణి కదా! సంబంధాలన్నీ ఆర్ధికమే!!) కొన్ని ఉత్పత్తులని బహిష్కరించాను ఆ రోజుల్లో. ఆయా కంపెనీలని తీవ్రంగా శిక్షిస్తున్నానని దృఢంగా నమ్మాని. అంతేకాక ఇదే సరైన మార్గమని మిత్రులతో చాలా తీవ్రంగా వాదిస్తుండేవాణ్ణి కూడాను. ఐతే, మెల్లమెల్లగా ఇంకొక స్పృహ మేలుకోవడం మొదలుపెట్టింది. ఇంధన జ్వలనం మీద రీసెర్చి చేసే పూరిండియన్ గ్రేడ్యువేట్ స్టూడెంటుగా నేను అందుకుంటున్న గొర్రెతోక ఉపకారవేతనం ఒక చమురు కంపెనీ చలవ. వారమంతా కోకు పెప్సీ ఉత్పత్తులేవీ ముట్టకుండా పవిత్రంగా గడిపి వారాంతానికి బీరు తాగబోతే ఆ బీరు తయారుచేసే కంపెనీ తాగునీటిని విపరీతంగా కలుషితం చేస్తోందని తెలియవచ్చింది. ఒక బయాలజీ మిత్రుడితో చర్చిస్తున్నప్పుడు, అప్పటి నా తీవ్రమైన నమ్మకాలకి వ్యతిరేకంగా, జన్యుమార్పిడి పంటలు మంచివేననీ, వాటివల్ల చాలా ఉపయోగాలున్నాయనీ నన్ను ఒప్పించాడు ఆ మిత్రుడు. ఇలా తగిలిన ఎదురు దెబ్బలతో పర్యావరణ సంరక్షణ అంతా తెలుపూ, కాలుష్యం నలుపూ కాదనీ, మధ్యలో ఓ యాభై రంగులు పట్టేటంత ‘గ్రే” ఉన్నదనీ తెలియవచ్చింది.

 

ఖాండవ దహనం అని ఒక కథ రాశాను 2005 లో. అప్పట్లో తానా సావనీరులో వచ్చిందది. ఆ కథ పర్యావరణ రక్షణ గురించి కాదుగానీ, నల్లమల అడవుల్లో చెంచు గూడేలలో నేను చూసిన కొన్ని విషయాలు అందులో చర్చకి వచ్చాయి. ఉదాహరణకి అడివంతా పర్యావరణ పరిరక్షణ అనీ, పులుల అభయారణ్యం అనీ చెంచువారి వేట మీద సవాలక్ష ఆంక్షలు విధించారు. దానికి పరిహారంగా చెట్లు నాటమనీ, గోతులు తవ్వమనీ, ఇంకా ఇలాంటివే ఏవో పది రకాల పనులు కల్పించి (ఇది ఉపాధి కల్పన అన్న మాట) ప్రతి ఫలంగా జొన్నలో సజ్జలో ఇప్పిస్తున్నారు. పర్యావరణ సంరక్షణ ఎప్పుడూ ఆ పర్యావరణానికి అతి చేరువులో ఉన్న మనిషి మనుగడని దెబ్బతీస్తూ వస్తున్నది. అంతే కాక, ఆ సంరకషణ కోసం చేపట్టే కార్యక్రమాలు ఎంత అనాలోచితంగా, ఎంత అశాస్త్రీయంగా ఉంటాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

images

నిజానికి తెలుగు సాహిత్యంలో పర్యావరణ స్పృహ కొంచెం తక్కువనే అనిపిస్తోంది. గట్టిగా చూస్తే చంద్రలతగారి దృశ్యాదృశ్యం నవల ఒకటి కనబడుతున్నది, భారీ ఆనకట్టలు అటు సహజ వనరులకీ, ఇటు ఆ ప్రాంత ప్రజల జీవనానికీ రెండిటికీ ముప్పు తెస్తాయనే అంశంతో. డా. చంద్రశేఖర్రావు గారి కథలు కొన్నిట్లో ఈ అంశాలు అక్కడక్కడా తొంగి చూస్తుంటాయి. దాదాహయత్ రాసిన మురళి ఊదే పాపడు కథ మనుషుల దురాశకి బలై పోతున్న సహజవనరుల్ని గురించి ఒక ఫేంటసీ ధోరణిలో ఆర్ద్రంగా చెప్పిన కథ. చంద్రలత గారే జన్యుమార్పిడి విత్తనాలను గురించీ, మరికొన్ని ఇతర పర్యావరణ సంబంధిత అంశాలను గురించీ ఇతర పుస్తకాలు కూడా రాశారు. కవిత్వంలోనైనా ఇటువంటి అంశాలు సూచనప్రాయంగా దర్శనమిచ్చాయే తప్ప, కేవలమూ పర్యావరణ స్పృహ సాహిత్యాన్ని డిక్టేట్ చేసిన సందర్భాలు తక్కువే.

 

ఉద్యమ కారణం ఏదైనా – అంతరించి పోతున్న పక్షి జంతు జాతులని రక్షించడం కావచ్చు, సహజ వనరుల సంరక్షణ కావచ్చు – అక్కడ రక్షించవలసిన అంశాన్ని బహు సున్నితమైనదిగా, నాజూకైనదిగా వర్ణించడం, ఆ రక్షణ ఉద్యమాన్ని ఒక యుద్ధంగా అభివర్ణించడం పరిపాటి అయింది. అంతే కాదు, రక్షణని సపోర్ట్ చెయ్యని సామాజిక శక్తి ఏదైనా (ప్రజలు, సంస్థలు, వ్యాపారాలు, ప్రభుత్వాలు) దాన్నొక కౄరమైన శత్రువుగా చిత్రించడం కూడా వారి వ్యూహంలో భాగమే. కానీ పర్యావరణ సంరక్షణ ఏ కొద్దిమంది జన్మహక్కో కాదు. నిజానికి ఇక్కడ గమనించాల్సిన ధర్మసూక్ష్మం ఒకటున్నది. మానవులు చేస్తూ ఉండిన అకృత్యాలవల్ల పర్యావరణానికీ, భూగోళానికీ వచ్చిన ముప్పు ఏమీ లేదు. వాటి బాగుకోసం అవసరమైన సవరణలు అవి చేసుకోగలవు. ఎటొచ్చీ అవి చేసే సవరణలు మానవజాతికి అంత సౌకర్యంగా ఉండవు. అంచేత పర్యావరణ సంరక్షణ, భూగోళ సంరక్షణ అంటూ జరిగే ప్రయత్నాల్లో ముఖ్యమైన ఉద్దేశం మానవజాతి తమని తాము రక్షించుకోవడమే. అంటే, ఈ ప్రయత్నం అంతా మొత్తం మానవజాతి మనుగడకి సంబంధించినది కాబట్టి ఇందులో అందరికీ భాగస్వామ్యం ఉండాలి, అందరికీ బాధ్యత కూడ ఉండాలి. అంతేకాని, ఏ నూటికి ఒక్కరో మేమే హీరోలం, మేమే రక్షణ కార్యకర్తలం అని (వారికి వారు ఎంత ఫీలైపోయినా సరే) ఉప్పొంగిపోతే పెద్దగా ఉపయోగపడే పనేమీ అక్కడ జరగదు.
వెరసి ఈ యుద్ధ కథాకథనంలో పర్యావరణ కార్యకర్త ఒక ఉదాత్తుడైన హీరోగానూ, అంతర్జాతీయ వ్యాపారవేత్త ఒక భయంకరమైన విలన్ గానూ ముద్ర పడిపోతారు. ప్రజల ఊహల సంగతి యెందుకూ, ఆయా రక్షణ సంస్థలే తమ ప్రత్యర్ధులని ఎంత ఏహ్యభావంతో చూస్తాయంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళతో కలిసి మాట్లాడ్డానికి కానీ, కనీసం వాళ్ళతో ఒకే గదిలో కూర్చోవటానికి కూడా ఇష్టపడరు. తీవ్రవాద పద్ధతులలో పనిచేసే గ్రీన్ పీస్, ఎర్త్ ఫస్ట్ వంటి సంస్థలే కాక సంయమనంతో వ్యవహరిస్తాయని ప్రపంచ వ్యాప్తంగా పేరున్న సంస్థలు, సాధారణ పౌరులవద్ద మంచి ఇమేజి ఉన్న సంస్థలు కూడా తమ సంరక్షణ కార్యకలాపాల దగ్గరికి వచ్చేసరికి ఇటువంటి మొండి వైఖరి అవలంబించడం స్పష్టంగా కనిపిస్తూన్నది, సంరక్షణ ఉద్యమాల చరిత్రని చూస్తే.

 

కానీ నిజంగా పనికొచ్చే పని జరగాలంటే, అందులో కౄర పరమ నీచనికృష్టులని పేరుబడిన వారు కూడా ఉండక తప్పదు. ఒకానొక కాలంలో ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఆహారం అంటే చిన్న విక్రేతల దగ్గర మాత్రమే దొరికేది ఇప్పుడు సర్వత్రా లభ్యమవుతున్నట్లే, పర్యావరణ సంరక్షణ మీద కూడా ఉద్యమకారుల మొనాపలీ వెనుకబడిందని చెప్పుకోవాలి గత పాతికేళ్ళలో. అనేక బహుళజాతి కంపెనీలు సహజ వనరుల నిలకడ గురించి, మారుతున్న వనరుల వాతావరణ పరిస్థితులలో తమ తమ కంపెనీల మనుగడని గురించీ తీవ్రంగా కృషిచేస్తున్నాయి. నేరుగా విద్యుత్, చమరు, బొగ్గు రంగాలలో ఉన్న కంపెనీల విషయంలో ఈ కృషి నేరుగా కనిపిస్తున్నది. ఉత్పత్తి రంగంలో – ఉదాహరణకి ఆటో, ఎలక్ట్రానిక్ రంగాలలో, ఉత్పత్తిదారులైన కంపెనీలు ఈ విషయమై చాలా పట్టుదలగా ఉన్నాయి. వనరుల నిలకడ విషయమే కాకుండా పెద్ద కంపెనీలన్నీ తమ తమ కార్బన్ ఫుట్ ప్రింట్ (ఒక సంస్థ కార్యకలాపాల వల్ల ఎంత కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో విడుదలవుతున్నది తెలిపే ఒక కొలమానం) గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నాయి. అంతేకాక ఏ జెనరల్ మోటర్స్ వంటి కంపెనీనో ఉదాహరణకి తీసుకుంటే .. ఎన్ని దేశాలలో ఎన్ని లక్షలమంది ఉద్యోగులతో, ఎంత భారీ యెత్తున వారి కార్యకలాపాలు సాగుతున్నాయి? వాళ్ళు తయారు చేసే కార్లు కాలుష్యాన్ని పెంచుతున్నాయి, వారి ఉత్పాదన పద్ధతులు బాగులేవు అని చెప్పి, అసలు వాళ్ళతో మాట్లాడం పొమ్మంటే ఎవరికి నష్టం?

ఇంకొక కీలకమైన విషయం, పర్యావరణం దగ్గరికొచ్చేసరికి అన్ని రకాల విషయాలూ కలగలిసి తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీనికి సంబంధించిన శాస్త్రీయ పరిజ్ఞానం కూడా ఎప్పటికప్పుడు మారుతున్నది, ఎప్పటికప్పుడు విస్తరిస్తున్నది. ఇప్పుడున్న అవగాహన పదేళ్ళ కిందట లేదు. ఏ విషయాన్నీ, ఏ అంశాన్నీ వేరువేరుగా డిఎస్క్ట్ చేసి పరిశీలించడానికీ, అదుపు చెయ్యడానికీ వీలుపడదు. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకునే కార్యాచరణ కావాలి. ఈ ప్రణాళిక ఎప్పటికప్పుడు ఎదుగుతూ ఉండాలి. ఇదంతా సాధ్యపడాలంటే ఉద్యమకారులు మడికట్టుకుని కూర్చుంటే సరిపోదు. అటు వివిధ ప్రాంతాల ప్రభుత్వాలతోనూ, ఇటు వివిధ వాణిజ్య సంస్థలతోనూ చేతులు కలిపి పని చెయ్యాలి.

ఒకటి గుర్తుంచుకోవాలి. మనుషులు రాకముందూ భూమి ఉంది. మనుషులు పోయాకా ఉంటుంది. భూమికేం ఢోకాలేదు. వచ్చిన బాధల్లా మనుషుల మనుగడకే. ఇకనైనా మనం తెలివిన బడితే మంచిది.

 

References:

Exxon Valdez

http://en.wikipedia.org/wiki/Exxon_Valdez_oil_spill

My satire

http://eemaata.com/em/issues/199911/867.html

My Story

http://kinige.com/kbook.php?id=58

Works of Chandralatha

http://kinige.com/kbrowse.php?via=author&name=Chandra+Latha&id=19

 

Download PDF

6 Comments

 • pavan santhosh surampudi says:

  //ఏనివర్సిరీ అనడానికి తెలుగులో వార్షికోత్సవం అని తప్ప ఇంకో మాట లేదా? దుర్ఘటనల ఏనివర్సరీలని ఏమనాలి? సాంప్రదాయకంగా తద్దినం అంటే పోతుందేమో?//
  మరీ తద్దినం కాదు గానీ సంవత్సరీకం అనవచ్చేమో చూడండి.

 • వ్యాసం బాగుంది నారాయణ స్వామీ! ఆధునిక జీవన విధానంలో పర్యావరణ రక్షణ ఒక సవాలుగా మారింది.
  ఒక విషాద సంఘటనని గుర్తు చేసే రోజుని “వార్షిక దినం” గా ఎక్కడో చదివిన గుర్తు.
  భానుమతి.

 • రమణ మూర్తి says:

  వ్యాసం చాలా బాగుంది, నారాయణ స్వామి గారూ! తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి గారు ఈ ఉద్యమాల్లో ఉన్నట్టు విన్నాను – మీకు తెలిసి ఆయన కథలు/నవలల రూపంలో ఏవైనా రాసారా ఈ విషయం మీద?

 • తల్లావఝలవారి వర్కు గురించి నాకు బాగానే పరిచయం. అయన కథల్లో అయన పనికి సంబంధించిన అంశాలు రాయలేదు.

 • కరిముల్లాఘంటసాల says:

  …”మానవులు చేస్తూ ఉండిన అకృత్యాలవల్ల పర్యావరణానికీ, భూగోళానికీ వచ్చిన ముప్పు ఏమీ లేదు. వాటి బాగుకోసం అవసరమైన సవరణలు అవి చేసుకోగలవు. ఎటొచ్చీ అవి చేసే సవరణలు మానవజాతికి అంత సౌకర్యంగా ఉండవు. అంచేత పర్యావరణ సంరక్షణ, భూగోళ సంరక్షణ అంటూ జరిగే ప్రయత్నాల్లో ముఖ్యమైన ఉద్దేశం మానవజాతి తమని తాము రక్షించుకోవడమే. అంటే, ఈ ప్రయత్నం అంతా మొత్తం మానవజాతి మనుగడకి సంబంధించినది కాబట్టి ఇందులో అందరికీ భాగస్వామ్యం ఉండాలి, అందరికీ బాధ్యత కూడ ఉండాలి.” – ఈ వాక్యం లో లోతైన అర్ధమే ఉందనుకుంటాను.

 • కరిముల్లాగారు , తప్పకుండా ఉన్నది. అందరూ భాగస్వాముల మయితే తప్ప పని జరగదు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)