వీలునామా – 25 వ భాగం

శారద

శారద

 

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం  తరువాయి)

ఆత్మలతో సంభాషణ

       ఆత్మలతో జరిపే సంభాషణకి తానొస్తానని డెంస్టర్ కిచ్చిన మాట ఫ్రాన్సిస్ మరచిపోలేదు. అన్నట్టే ఒకరోజు ఆ కార్యక్రమం చూడడానికి డెంస్టర్ ఇంటికెళ్ళాడు. అక్కడ అప్పటికే ఇంకొందరు స్నేహితులు వచ్చి వున్నారు. కొందరు చూడాలన్న కుతూహలంతోటైతే, కొందరు పాలు పంచుకోవాలన్న ఉత్సాహంతో. ఆత్మలతో మాట్లాడబోయే అబ్బాయి (అతన్ని మీడియం అని పిలుస్తారట)  లేతగా వున్న పంతొమ్మిదేళ్ళ కుర్రాడు. కొంచెం బిడియంగా, బెరుగ్గా వున్నాడు. మనిషి మాత్రం చాలా నమ్మకస్తుడనీ, ఎట్టి పరిస్థితిలోనూ అబధ్ధాలాడడనీ అన్నాడు డెంస్టర్.

తన చుట్టూ జరుగుతున్న ఏర్పాట్లనీ, హడావిడినీ చూసి ఫ్రాన్సిస్ విస్తుపోయేడు. ఆత్మలు కొన్ని కుర్చీలూ బల్లలూ పడవేయడం చూసి అతనికి ఒకింత చిరాకు కూడా కలిగింది. అయితే అతనికి తన చుట్టూ వున్న వాళ్ళ గాఢ విశ్వాసం చూసి కలిగిన ఆశ్చర్యం ఇంతా అంతా కాదు. ‘ఇలాటివన్నీ ఇంత గట్టిగా నమ్మగలిగే వాళ్ళుంటారా?’ అనుకున్నాడతను విస్మయంగా. వాళ్ళందరూ ఎవరో ఒకరిని పోగొట్టుకున్నవారే అవడం అతనికి పట్టిచ్చినట్టయింది. అనంతమైన అపనమ్మకమనే సముద్రం మీద ప్రయాణిస్తూ, మృత్యువనే చేదు నిజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు వారంతా.

అయితే ఆత్మలు ఆ మీడియం ద్వారా చెప్పిన విషయాలతనికేమీ ఉత్సాహకరంగా అనిపించలేదు. అన్ని ఆత్మలూ తాము సంతోషంగానే వున్నామన్నాయి. అతనికి చిన్నతనం నించీ మరణించిన తర్వాత మనిషికి ఉనికీ, అస్తిత్వమూ వుండివుండొచ్చన్న ఆలోచనలో పెద్ద నమ్మకం లేదు. అందువల్ల ఆ ఆత్మలూ, అవి చెప్తున్న విషయాలూ అన్నీ పెద్ద వేళాకోళంగా అనిపించాయి. దానికి తోడు అతను ఏ ఆత్మీయులనూ కోల్పోలేదు. అందువల్ల అతనికి ఏ ఆత్మతోనూ సంభాషించడంలో ఆసక్తి లేదు.

నిజానికతడు బ్రతికి వున్న మనుషుల గురించీ, అందులోనూ తన మేనత్త కూతుర్లయిన జేన్, ఎల్సీల గురించీ ఆలోచిస్తున్నాడు. వారికేరకంగా సహాయం చేయలేని తన నిస్సహాయ స్థితి గురించి ఆలొచిస్తున్నాడు. బ్రతుకులో ఇంత కష్టమూ, బాధా వుందగా అందరూ మృత్యువు గురించే ఎందుకు ఆలో చిస్తారో, అనుకున్నాడతను. ఒకవేళ నాన్నగారికి ఇంకా వునికి వుండి వుంటే తను రాసిన విల్లుని గురించి పశ్చాత్తాప పడివుండేవారా, అన్న ఆలోచనలో అతను కొట్టుకుపోతూండగా, వున్నట్టుండి ఎవరో అతనితో, “ఇప్పుడిక్కడికి మీ తండ్రిగారి ఆత్మ వొచ్చి వుంది,” అన్నారు.

ఫ్రాన్సిస్ నమ్మలేకపోయాడు. “ఆ ఆత్మ ఆయనదేనని ఏమిటి నమ్మకం?” అన్నాడు ఆ చెప్పిన అతని వంక వింతగా చూస్తూ.

డెంస్టర్ కలగజేసుకుని, “ఆయన మాట్లాడతారా, లేక సంకేతాలు పంపుతారా?” అడిగాడు అతని తరఫున.

“బల్ల మీద సంకేతాలు ఇస్తారట,” అన్నాడు ఆ చెప్పిన వ్యక్తి.

“సరే, అయితే మనం అక్షరాలు రాసి వున్న బల్ల దగ్గరకి వెళ్దాం రా!” ఫ్రాన్సిస్ చేయి పట్టుకుని బల్ల దగ్గరకి తీసికెళ్ళాడు డెంస్టర్.

“ఆ అక్షరాల మీద చేయి పెట్టు. ఆ ఆత్మే నీ చేయిని కదులుస్తూ నువ్వడిగే ప్రశ్నలకి జవాబిస్తుంది,” అన్నాడు డెంస్టర్ ఫ్రాన్సిస్ తో.

ఫ్రాన్సిస్ ఇంకా అపనమ్మకంగా చూస్తూ, బల్ల మీద వున్న అక్షరాల మీద చేయి పెట్టాడు. పెట్టి, ఆత్మని పేరు చెప్పమని అడిగి తన వేళ్ళవంక చూసుకున్నాడు.

“చేయి వరసగా అక్షరాల మీద కదల్చు. సరియైన అక్షరం మీదకొచ్చాక ఆత్మ చేయి కదలనివ్వదు,” చెప్పాడు డెంస్టర్.

అతని చెప్పినట్టే చేసి చూసాడు ఫ్రాన్సిస్. ఒక్కో అక్షరం దగ్గరా అతని చేయి ఆగిపోయింది. ఆఖరికి వచ్చిన అక్షరాలన్నీ పేర్చుకుని చూస్తే, “హెన్రీ హొగార్త్” అయింది.

వెంటనే, “మీరు నాతో మాట్లాడాలనుకుంటున్నారా?” అని అడిగాడు.

“అవును,” అనే సమాధానం వచ్చింది.

“నేను ఎస్టేటు లో చేసిన మార్పులు మీకు నచ్చుతున్నాయా?”

“చాలా!”

“మీరు రాసిన విల్లు తలచుకుని బాధపడుతున్నారా?”

“అంతా మన మంచికే!”

“మీ మేనకోడళ్ళకి అన్యాయం చేసినందుకు ఎప్పుడైనా బాధ పడ్డారా?”

“అదంతా వాళ్ళకి అనుభవాన్నిస్తుంది. నీక్కూడా.”

“నా జేబులో వున్న ఉత్తరం రాసింది నిజంగా మా అమ్మేనా?”

“అవును.”

“ఆవిడకి మీరు డబ్బిస్తూ వున్నారా?”

“లేదు.”

“మరి ఆవిడ నన్నెలా వొదులుకుంది?”

“ఒకేసారి బోలెడు డబ్బిచ్చాను.”

ఫ్రాన్సిస్ కి ఇదంతా విచిత్రమైన అనుభవం లాగుంది.

“ఒక్క సంగతి చెప్పండి నాన్నా! ఈ ఉత్తరం రాసిన ఆవిడకి నేను సాయం చేయాలా?”

“వద్దు!”

“పోనీ ఉత్తరం రాయనా?”

“అవసరం లేదు. ఆవిడ జోలికెళ్ళకు.”

“నా మనసులో వున్న ఆశ నెరవేరుతుందా?” ఆత్రంగా అడిగాడు ఫ్రాన్సిస్.

“ఓపిక పట్టు. నేనెప్పుడూ నిన్ను కనిపెట్టే వుంటాను.”

“మీరిప్పుడక్కడ ఏం చేస్తున్నారు?”

“నేనెంతో ప్రేమించిన వ్యక్తి నుంచి జీవితం గురించి తెలుసుకుంటున్నాను.”

“ఆవిడ పేరేమిటి?”

తన మనసులోని మాటలే జవాబుల రూపంలో వస్తున్నాయేమోనన్న అనుమానం వుంది ఫ్రాన్సిస్ కి. అందుకే తను వూహించిన స్త్రీ పేరు మనసులోంచి చెరిపే ప్రయత్నం చేసాడు. అయినా అతని చేయి ఆ పేర్లోని అక్షరాల మీదే ఆగిపోయింది.

“మార్గరెట్.”

“ఆవిడేనని అనుకున్నా. మీకిష్టమైన మనిషి మీకు పై లోకంలో కనిపించింది కదూ, ఇహ అంతా మన మంచికే అనిపిస్తుంది. కానీ నాకు జేన్ ని పై లోకంలో కాదు, ఈ లోకంలోనే కలుసుకోవాలని వుంది,” అక్కసుగా అనుకున్నాడు ఫ్రాన్సిస్.

“అది జరిగే సమయానికి అవుతుంది.”

“ఓహో! మీకు మనసులో అనుకున్న మాటలు కూడా వినపడతాయన్నమాట. అది సరే, ఫిలిప్స్ గారికీ, ఈ ఉత్తరం రాసిన ఎలిజబెత్ కీ ఏమిటి సంబంధం?” మళ్ళీ మనసులోనే అనుకున్నాడు.

ఏ జవాబూ రాలేదు.

“ఇప్పటికైనా నమ్ముతారా, ఆత్మలుంటాయని?” ఆత్రంగా అడిగాడు డెంస్టర్.

“తప్పకుండా! కొన్ని పేర్లు ఆయనకీ నాకూ తప్ప మూడో మనిషికి తెలిసే ప్రసక్తి లేదు.”

“అవును, పేర్లు చెప్పగానే చాలా మంది ఆత్మలని నమ్మడం మొదలు పెడతారు,” సంబరంగా అన్నాడు డెంస్టర్.

“అది సరే, ఆత్మలకి భవిష్యత్తు గురించి తెలుస్తుందా? నేను భవిష్యత్తు గురించి కొన్ని ప్రశ్నలడిగాను మరి!”

“తప్పకుండా తెలుస్తాయి.”

“అదెలా సాధ్యం? భవిష్యత్తు గురించి భగవంతుడికి తప్ప ఇనెకెవరికీ తెలిసే అవకాశం లేదు. భగవంతుడి మనసులో ఏముందో తెలుసుకోవడం తరం కాదు కదా?” అనుమానంగా అన్నాడు ఫ్రాన్సిస్.

“మన భౌతిక ప్రపంచంలో వుండే అడ్డుగోడలు ఆధ్యాత్మిక ప్రపంచంలో వుండవు కాబోలు. అందువల్ల ఆత్మలు ఇతరుల మనసుల్లోకి తొంగి చూడగలుగుతాయి. దాని వల్ల భవిష్యత్తుని కొంతవరకు ఊహించగలవేమో!”

“అంతే కాని, ఇలా జరిగి తీరుతుందని చెప్పలేవు కదా?”

“అవును.”

“కానీ, వర్తమానం గురించి మాత్రం చెప్పగలవు.”

“అబధ్ధాలాడని ఆత్మలైతే!”

“అబధ్ధాలాడే ఆత్మలుంటాయా?” ఇంకా ఆశ్చర్యపోయాడు ఫ్రాన్సిస్.

“వుంటాయి. అయితే మంచి ఆత్మలు అనైతికమైన పని చేయలేవు.”

“ఆగాగు! మంచీ చెడూ, నీతీ అవినీతికి కొలమానాలు భౌతిక ప్రపంచానికి వర్తిస్తాయి. వాటిని ఆత్మలకి ఎలా వర్తింప జేస్తావు?”

“కాదు! నీతీ, అవినీతీ, మంచీ చెడూల నిర్వచనాలు విశ్వమంతటా ఒకటే. భగవంతుడు కూడా మంచిని చెడు లా, చెడుని మంచిలా మార్చలేడు!”

ఇంతలో ఎవరో డెంస్టర్ ని పిలవడంతో అటు వెళ్ళాడు.

ఫ్రాన్సిస్ లేచి చల్ల గాలిలో నడుస్తూ ఇంటి దారి పట్టాడు. అతనికంతా కలలా వుంది. అందరూ కలిసి తనని మోసం చేస్తున్నారనుకోవడానికి వీల్లేదు. తను మనసులో అనుకున్న ప్రశ్నలకి కూడా సరైన సమాధానం వచ్చింది.

“రేపు జేన్ తో దీన్ని గురించి మాట్లాడాలి. నేను రాకుండా ఇదంతా నాతో ఎవరైనా చెప్పి వుంటే నేను నమ్మే వాణ్ణి కాదు. రేపు జేన్ నా మాట నమ్ముతుందో నమ్మదో!”

 ***

(సశేషం)

Download PDF

3 Comments

  • Radha says:

    శారద గారూ, చాలా బాగుంది ఈ నవల. ప్రత్యేకంగా కొన్ని భాగాలు సూపర్బ్ అసలు.

    * అనంతమైన అపనమ్మకమనే సముద్రం మీద ప్రయాణిస్తూ, మృత్యువనే చేదు నిజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు వారంతా.
    * నీతీ, అవినీతీ, మంచీ చెడూల నిర్వచనాలు విశ్వమంతటా ఒకటే. భగవంతుడు కూడా మంచిని చెడు లా, చెడుని మంచిలా మార్చలేడు!” ఈ భాగం లో నాకు చాలా బాగా నచ్చిన వాక్యాలు
    ంక్ యు

    • శారద says:

      రాధిక గారూ,
      ధన్యవాదాలు.
      అనువాదాల్లో, నాకు ఏ మాట కా మాట అనువదించడం కంటే (word to word translation) కంటే భాషకి తగిన idiom పలుకుబడులతో భావాన్ని తర్జుమా చేయడం ఇష్టం. అలా చేసినప్పుడు కొన్ని భావాలూ, వాక్యాలూ చాలా అందంగా వస్తాయి. అలాటి వాక్యాలకి పాఠకులు స్పందించినప్పుడు ఆ శ్రమకి తగిన ఫలితం దొరికినట్ట్టనిపిస్తుంది.
      మీ ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు.
      శారద

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)