ఒకే దారిలో నడుస్తున్నాం
ఒకరికొకరం తారసపడాలంటే
ఎదురెదురుగా నడవాల్సిందే
ఎవరికి వారు ముందుకు సాగిపోవాల్సిందే..
కనపడిన దారిలోనే
కనుమరుగు కాకూడదనుకుంటే
ఒకే వైపుకు నడవాల్సిందే
దగ్గరి దూరాలనూ చవి చూడాల్సిందే
ఎప్పటికప్పుడు పలకరించుకుంటూనే
పరిచయాలని పదిలపరుచుకుంటూ
అడుగుల్లో దూరాలను
లెక్కల్లో జీవితాలను
సరిచూసుకుంటూ
ఒకే రేఖకి రెండు చివర్లలా మిగిలిపోవాల్సిందే
ఎంతోకొంత దూరం వచ్చాక
మనం చేయగల్గిందల్లా ఒక్కటే
అపరిచితుల్లా విడిపోవడమో
ఆనందక్షణాలుగా మిగిలిపోవటమో
ఎదురెదురుగా కదలటమో
ఎటు కదిలినా యదలో నిలవటమో..
- పూర్ణిమా సిరి
పూర్ణిమ గారికి
మీ కవిత చదివాను. రాస్తున్నవాళ్లు బరువు దించుకోవడానికి లేదా వాళ్ళు దించుకున్న బరువు చదివిన పాపానికి పాఠకుల నెత్తి మీద బరువుగా మారడానికి ఉపయోగపడటానికా అన్నట్లు ఇపుడొస్తున్నకవితల్తో పోలిస్తే మీ కవిత కొంచెం భిన్నంగా కొంచెం ఖిన్నంగా, కొండొకచో విషణ్ణంగా కూడా అనిపించింది. కాకపోతే రెండు అనుమానాలు. ఒకే వైపుకు నడవటం ఎదురెదురుగా నడవటం అవుతుందా. అలా నడిస్తే కలవటం సాధ్యం అవుతుందా. యద మీ దోషమా ముద్రారాక్షసమా. ఆ ఒక్క తప్పూ కవిత ఇచ్చిన కుండెడు పాల అనుభూతిలో విషపు చుక్క అయింది. అవునా.
భవదీయుడు
టి. చంద్రశేఖర రెడ్డి
09866302404
మంచి కవిత పూర్నిమ గారు.
చాలా రోజులతర్వాత ఆన్ లైను రాగానే మీ అక్షరాలూ చదివాను
అభినందనలు
జీవన సుదీర్ఘ యానంలో కలిసి విడిపోవడం విడి కలవడం రెండు తప్పనిసరి అయిన కాలం ఇది. కవిత సరళంగా లోతైన భావంతో హత్తుకుంది. అభినందనలు పుర్ణిమాజీ..
బావుంది.
ఇది ఒక అనుభవం కావచ్చు ఒక observation కావచ్చు .సంబంధాల్లో ప్రకంపనలు .ఆ ప్రకంపనల ప్రతిధ్వనుల్లాగా కవితా పాదాలు.బావుంది.
అపరిచితుల్లా విడిపోవడమో
ఆనందక్షణాలుగా మిగిలిపోవటమో
ఎదురెదురుగా కదలటమో
ఎటు కదిలినా యదలో నిలవటమో
ఎంతో సునాయాసంగా అంతే లోతుగా చక్కగా రాసారు