
ఫొటోగ్రఫీకి సంబంధించి ఏది ముఖ్యం, ఏది కాదు – అన్న చర్చ కాదుగానీ, నా వరకు నాకు దృశ్యం, అదృశ్యం రెండూ ముఖ్యమే అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ చిత్రం…నిజం.
అర్థవంతమైన లేదా అవతలి వారికి అర్థమయ్యేట్టు ఒక ప్రధాన దృశ్యం ఉంటుంది.
అలాగే, అగుపించీ అగుపించని అప్రధాన అదృశ్యమూ ఉంటుంది చిత్రంలో.
ఈ రెండింటి సమాసమే ఈ దృశ్యం.
+++
నిజానికి ఈ చిత్రం తీసి చాలా రోజులే అయింది. కానీ, ఎప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తుంది!
పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యం కలగక మానదు.
అయితే, నా ఆశ్చర్యం నాది. అవతలి వారికి మల్లే ఆ బొమ్మను నేనే చిత్రీకరించినప్పటికీ నాకూ మరో వ్యాఖ్యానం ఉంటుంది. అది అవతలి వాళ్లు తమ వ్యాఖ్యానాన్ని విన్పించినప్పుడు గుర్తొచ్చి ఆశ్చర్యపోతూ ఉంటాను.
‘ఇటువంటిది నాకూ ఒకటి ఉంది’ అని చెప్పకుండానే కాలం గడచిపోతుంది! నావే ఎన్నో చిత్రాలు ప్రచురితమై, దానికి ఎందరెందరో వివిధ వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే నా వ్యాఖ్యానం నా చిత్రం ముందే అదృశ్యంగా ఉంటుంది.
అదే సిసలైన ఆశ్చర్యం నా వరకు నాకు!
నాకే అని కాదు, కళ ముందు ఏ మనిషైనా ఇలాగే ఆశ్చర్యచకితులు అవుతూ ఉంటారు కాబోలు!
అయినా సరే, అవతలి వ్యాఖ్యానాలతో చిత్రం మొదలుపెడతాను.
+++
ఒకరంటారు ఇది ‘క్రాంక్రీట్ జంగల్’ అని!
‘నగర జీవనంలో మనిషి అమానుషత్వానికి సజీవ దృశ్యం’ అనీ!
ఇంకొకరంటారు ‘ప్రేమ’ అని!
అది స్త్రీపురుషులను ఎట్లా ఒకటిగా ఎట్లా కట్టిపడేసి, ఒకే ప్రపంచానికి ఇద్దర్నీ వేలాడదీసి, ఇక నిదానంగా పెంచే ఆ తీయటి బాధ ఉంటుంది చూడండి. అదీ ఈ బాధనట! ఎడబాటు, విరహమూ కూడా నట!
వాళ్లు ఎంతో ప్రేమతో చెప్పారా మాటలు.
ఆశ్చర్యమే, ఈ బొమ్మ ప్రేమకు ప్రతిబింబం అంటే ఆశ్చర్యం కాక మరేమిటిఝ
సరే, ఇంకొకరంటారు…ఇద్దరి మధ్య అకస్మాత్తుగా పరుచుకునే దూరం, అడ్డుగోడ అని!
అది క్రమంగా ఆ ఇద్దరి మనసుల్ని గాయపర్చే గునపమై తీవ్రమైన బాధకు గురిచేస్తుందని!
చూసిన వారికి చూసినంత…
ఇవన్నీ చెబుతుందీ పిక్చర్!
కానీ, నేనైతే హైదరాబాద్ లోని ‘సాక్షి’ కార్యాలయం వద్ద ఉన్న ఫుట్ పాత్ పై ఒక టీ బంకు ఉంది. అక్కడ తీశాను దీన్ని.
అక్కడకు వెళ్లి ముందు నిలబడ్డాను. టీ తాగుతూ ఉన్నాను. ఇంతలో అక్కడొక చెట్టు, దానికి కొట్టిన మొలను(మేకు) చూశాను. వెంటనే కెమెరాను చేతుల్లోకి తీసుకుని దాన్ని ‘క్లిక్’ మనిపించాను.
ఆ క్షణాన అప్పుడొక మొలను మాత్రమే చూశాను.
ఆ తర్వాత మెల్లగా వ్యూఫైండర్ లోంచి కన్నుతో చూడసాగాను.
మొలను అలాగే వుంచి ఆ చెట్టును దాని బెరడును క్లియర్ చేసుకుని మరో చిత్రాన్ని చిత్రించాను.
ఆ చిత్రం మాత్రం వేరుగా ఉంది. బహుశా అదేం చెబుతుంతో తెలియదు!
ఆ తర్వాత అలాగే చూస్తూ ఉన్నాను.
వ్యూ ఫైండర్ నుంచి చూస్తూ ఉండగా బ్యాగ్రౌండ్ లో మనుషులు…వాళ్లు వేళ్లేదీ వచ్చేదీ కనిపించసాగింది.
చూడసాగాను.
సడెన్ గా ఒక పిచ్చితల్లి వచ్చింది వ్యూ లోకి!
కెమెరాలోంచి కళ్లెత్తక తప్పలేదు.
+++
ఆమె లావుగా ఉంది. బొద్దుగా ఉంది. జుత్తు రేగి ఉంది.
అది కాదు ఆశ్చర్యం…. ఆమె ఒంటిపై దుస్తులు సరిగా లేవు. సరిగా అనేకంటే పైన వక్షం ఓపెన్గా ఉంది. ఆమెను కళ్లారా చూడలేం. మన పేదరికం నిర్లక్ష్యం నిర్లజ్జగా కనబడుతోంది మరి!
పైన అలా ఉండగా కింద మాత్రం ఒట్టి లంగా ఉంది.
దిసమొలగా ఆ లంగా ఒక్కటే… అది కూడా చిన్నది…అది కూడా కాదు… ఆ లంగా పూర్తిగా రక్తంతో తడిసి ఉన్నది.
ఆమె అలా నడుస్తూ నడుస్తూ ఈ మొలదాకా వచ్చేసరికి హఠాత్తుగా కెమెరా వ్యూ ఫైండర్ గుండా నా కంట పడీపడగానే వెంటనే భయమేసి కెమెరాలోంచి తలెత్తి చూశాను. కనిపించిన నిజం ఇది.
ఆమె లంగా… మెన్సెస్ కారణంగా అనుకుంటాను, పూర్తిగా తడిసిపోయి ఉంది.
ఆమె ఏదో గొణుక్కుంటూ ఉన్నది. ఆ రణగొణ ధ్వనుల్లో గొణుక్కుంటూ ఆమె అట్లా నడుచుకుంటూ వచ్చేసరికి..అంటే అక్కడ ఆ క్షణాల్లో ఒక దృశ్యం అట్లా ఆమె నడుచుకుంటూ వచ్చేది ఉందన్నమాట.
ఇటువైపు దృశ్యం ఏమిటంటే, అది నేను….అప్పటిదాకా మొలను, చెట్టు బెరడును, వెనకాలి బ్యాక్ గ్రౌండును చూస్తూ నేను. ఈ దృశ్యాల మధ్య కెమెరా వ్యూఫైండర్లో ఒక దృశ్యం. అందులో మొలా ఆ చెట్టు బెరడు…వెనకాలి బ్యాగ్రౌండ్లో కొంత ఆవరణ… ఆమె ‘ఆ ఆవరణ’ను దాటేసి వెళ్లిపోవడమూ ఉంది.
ఆము “ఆ ఆవరణను’ దాటేయడం క్లిక్ మన్పించనందున అది దృశ్యంగా కెమెరాలో రికార్డుకాలేదు.
ఆ తర్వాతి దృశ్యం నేను తల పైకెత్తడం…ఆమెను నేరుగా చూస్తూ ఒకట్రెండు ఫొటోలు తీసుకోవడం.
ఇవీ దృశ్యాదృశ్యాలు, ఈ చిత్రానికి సంబంధించి!
+++
చిత్రమేమిటంటే, ఇక అప్పట్నుంచీ నాకు ఈ ఫొటోను చూడగానే చెట్టు బెరడుకు దిగిన “ఆ మొల’ కనిపించడం మానేసి ‘ఆమె’ కనిపించడం మొదలౌతుంది. అప్పుడు గుండె లయతప్పిన సంగతి నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది.
ఆమె వెళ్లిపోయేదాకా చూసి కెమెరాను సవరించుకుని మళ్లీ వ్యూ ఫైండర్లోకి చూశాను.
మళ్లీ ఆ మొలను చూశాను. నిజానికి ఎప్పుడైతే ఒక కదలని మెదలని వస్తువునో రూపాన్నో చిత్రిస్తున్నప్పుడు దానికి మరింత జీవితం ఇవ్వడానికి వెనకాల కదిలే బ్యాగ్రౌండ్ ను చిత్రించడం అలవాటులోకి తెచ్చుకుని చాలా రోజులే అయింది.
ఈ సారి కూడా అట్లా తీయాలా అనిపించింది. ఎందుకంటే, ఇంతకుముందే చెప్పినట్టు, ఆ మొల నాకు గుచ్చుకుంది. ఇంతకుముందరి అర్థనగ్న స్త్రీ మూర్తిని చూశాక ఇక ఆ మొల గునపమే!
కానీ, ఎంతైనా నేను అనుకున్నదే ఫొటో కాదు. ఫొటో ఎవరి అనుభవాన్ని వారికి పంచుతుంది కదా! అనుకుని మళ్లీ నా నుంచి దూరం జరిగి మరొక ఫొటో చేయాలని ప్రయత్నించసాగాను. మెల్లగా వ్యూ ఫైండర్ లోంచి చూడసాగాను. ఇంతలో ఒక మగమనిషి ఇటు పోయాడు. మరో ఆడమనిషి అటు పోయింది.
అప్పుడు తట్టింది. కాసేపు వేచి ఉండి ఆ అధోజగత్ స్త్రీ వంటి వారు మన మధ్య, మన వీధుల్లో, మన రోడ్ల మీదే తారాడుతున్నప్పటికీ జీవితంలో మనం ఎవరి అవసరాలతో వాళ్లం వెళ్లిపోతూనే ఉంటాం కదా! దాన్ని చిత్రిద్ధాం అనుకున్నాను.
అలా అనుకున్నానో లేదో ఒక యువకుడు వచ్చి ఆ చెట్టును ఆనుకుని టీ త్రాగుతూ ఉన్నాడు.
అతడికి ఆ స్త్రీ అలా ఇదే ఆవరణలోంచి నడిచి వెళ్లిన సంగతి తెలుసో లేదో!
ఆ ఆలోచనను అదిమేసి మళ్లీ చూడసాగాను, వ్యూ ఫైండర్లోంచి!
ఇంతలో ఒక యువతి వచ్చింది ఫ్రేంలోకి…
ఇటు మగా ఇటు ఆడా ఇద్దరినీ ఒకే ఫ్రేంలో ఉండేలా ఆ మొలను క్లియర్ చేసుకుని క్లిక్ మనిపించాను.
ఇదే ఆ చిత్రం.
+++
నిజానికి ఇది మొల కావచ్చు…
కానీ, నా వరకు నాకు దిసమొల అంతా రక్తసిక్తమైన చిత్రం.
నిశ్శబ్ధంగా వినిపించే ఒక సంకీర్ణ దృశ్యం.
~ కందుకూరి రమేష్ బాబు
“అలా అనుకున్నానో లేదో ఒక యువకుడు వచ్చి ఆ చెట్టును ఆనుకుని టీ త్రాగుతూ ఉన్నాడు.
అతడికి ఆ స్త్రీ అలా ఇదే ఆవరణలోంచి నడిచి వెళ్లిన సంగతి తెలుసో లేదో! “
ఇంత గొప్పగా ఎలా రాస్తారు…! ప్రతీసారీ జీవితాన్ని ఇంకో కోణం లో చూసినట్లే ఉంటుంది.
అదే అర్థం కాదు అపర్ణ గారు, మనసులో ఉన్నదీ అక్షరాల ఎలా రాస్తానో నాకే అర్థం కాదు,
రచన గొప్పతనం వలన ఎంత మంది ఎంత ఆనందంగా ఉంటున్నారో!
+++
Rajasekhar Gudibandi గారు అ రెండు లైన్లను గుర్తు చేయడం బాగుంది.
మరో సారి వ్యాసం చదివి ఆనందించాను. థాంక్ యు ప్లీజ్.