నాకు నచ్చిన చాసో కథ: “ఎందుకు పారేస్తాను నాన్నా?”

chaganti somayajulu copy
images

చాసోని కథకుల కథకుడుగా వర్ణించారు కొకు. ఆ మాటేమో నిజమే. కానీ అందుకు నిదర్శనం? చాసో ఏ కథ తీసుకున్నా అందుకు నిదర్శనం కనపడుతుంది. ముఖ్యంగా ఆయన శిల్పాన్ని గమనిస్తే అందుకు తార్కాణాలు కథ కథలోను కనిపిస్తాయి. “వాయులీనం”, “ఏలూరెళ్ళాలి”, “బొండుమల్లెలు”, “ఎంపు”, “కుంకుడాకు” ఇంకా ఎన్నో…! ప్రతి కథలో ఓ వైవిధ్యమైన కథా వస్తువు, అలవోకగా సాగిపోయే నడక, అమాంతంగా వచ్చి మీదపడే ముగింపు. ఇవన్నీ గమనించుకుంటూ చదివితే ప్రతి కథకుడూ ఓ మెట్టు పైకెక్కడం ఖాయం. అలా ఎదిగిన ప్రతి కథకుడూ మళ్ళీ అదే మాట అంటాడు – “చాసో కథకుల కథకుడు” అని.

చాసో కథలలో బాగా నచ్చిన కథ ఏది అంటే చెప్పటం చాలా కష్టం. “ఎంపు” నేను మొట్టమొదట చదివిన చాసో కథ. అందులో నిష్కర్షగా, కఠోరంగా ఓ చెప్పిన జీవిత పాఠాన్ని ఆకళింపు చేసుకోడానికి గడిపిన ఒంటరి రాత్రి గుర్తొస్తుంది. “వాయులోనం” కథ చదవడం అయిపోయినా అందులో లీనమై బయటపడలేక గిలగిలలాడిన సందర్భం గుర్తుకొస్తుంది. కనీసం పది కథలు గుర్తొస్తాయి. అయితే ఇవన్నీ పాఠకుడిగా. ఈ మధ్యకాలంలో ఓ కథకుడిగా ఆయన్ని మళ్ళీ చదివినప్పుడు నాకు చాసోలో కనపడ్డవి జీవిత పాఠాలే కాదు, కథా రచన పాఠాలు కూడా. ఆ దృష్టికోణంలో చూస్తే నాకు చాలా బాగా నచ్చినది, ప్రభావితం చేసినది “ఎందుకు పారేస్తాను నాన్నా” అనే కథ.

(కథ చదవనివారుంటే ఆ కథని చదివి ఈ వ్యాసం కొనసాగించగలరు. ఇక్కడినుంచి తొలిపఠనానుభూతిని తగ్గించే సంగతులు వుండగలవు)

కృష్ణుడనే కుర్రవాడు. చదవాలని ఆశ. పేదరికం వాడి చదువుని మింగేసిన భూతం. తండ్రి చుట్టలు తెమ్మంటాడు. బడిమీదుగా పోక తప్పదు. నామోషీగా అటు వైపు వెళ్తాడు. నరిశింహం, శకుంతల అనే సహాధ్యాయులతో మాట్లాడతాడు. బడి మొదలైనా అక్కడి వరండాలో స్తంభానికి జేరబడి వుండిపోతాడు. తండ్రి వెతుక్కుంటూ వస్తాడు. కొడుకు బాధని తెలుసుకుంటాడు. కొడుకు బాధని తనూ పడతాడు. చుట్టాలు తెమ్మని ఇచ్చిన డబ్బులు వున్నాయా పారేశావా అంటాడు. – “ప… ప్ప… ప్పారీలేదు. జేబులో ఉన్నాయి… ఎందుకు పారేస్తాను నాన్నా?” అంటాడు కృష్ణుడు.

ఆ వాక్యంతో కథ అయిపోయింది. అదే వాక్యంలో మాట కథకి శీర్షిక అయ్యింది.

అదలా పక్కనపెడదాం. ఏమిటీ కథలో గొప్పదనం? చెప్పాలనుకున్న విషయం చిన్నదే. స్పష్టంగా చెప్పేడు కూడా. “ఎందుకు పారేస్తాను నాన్నా?” అన్న ఒక్క ప్రశ్న ఎన్ని ప్రశ్నలు పుట్టిస్తుంది? “ఎందుకు పారేస్తాను? ఎలా పారేస్తాను? నాకు బాధ్యత తెలుసు కదా నాన్నా. నా చదువాపేసిన పేదరికం గురించి కూడా తెలుసు కదా నాన్నా. ప్రతి రూపాయినీ పారేయకుండా ఉంచుకుంటే అవి నా పుస్తకాలకు పనికొస్తాయనీ తెలుసు కదా నాన్నా..” అంటూ పిల్లాడు అడిగనట్లు అనిపిస్తుంది. అంతకు ముందే పుస్తకం కొంటానని మాట ఇచ్చిన నాన్న, చుట్టలు మానేస్తే కృష్ణుడి జీతానికి సరిపోతుందనుకున్న నాన్నా, పిల్లాడు పారేయకుండా వుంచిన డబ్బుతో అప్పటికప్పుడు ఇంగ్లీషు పుస్తకం కొన్నాడా? ఎమో తెలియదు. కానీ తెలుసుకోవాలనిపిస్తుంది. కథ అయిపోయిన తరువాత ఏం జరిగుంటుందో అన్న ఆలోచనపుడుతుంది. ఇలా జరిగి వుంటే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చేదాకా వెంటాడుతుంది. అదీ గొప్ప ముగింపు లక్షణం. చాసొ ప్రతి కథలో, (ప్రత్యేకించి ఈ కథలో) ఇలాంటి ముగింపులే వుంటాయి. తెలుగు కథలలో వచ్చిన అత్యుత్తమ ముగింపు వాక్యాలు రాస్తే అందులో పదింట అయిదు చాసోవి వుండితీరాల్సిందే..!

ముగింపుకు అంత బలం ఎక్కడ్నుంచి వచ్చింది? కథ మొదటి ముగింపుకి బలాన్ని ఇస్తూనే వుంటాడు చాసో. వాతావరణ చిత్రణ, పాత్ర చిత్రణ అన్నీ క్రమంగా ఈ సొరంగం తొవ్వుతున్నట్లు నిర్దేశించిన ముగింపు వైపు వెళుతూనే వుంటాయి. పాఠకుడి గమనించినా గమనించకపోయినా.

(కేవలం ఆరు పేజీల కథ ఇది. నేను పూర్తిగా విశ్లేషిస్తే అంతకన్నా ఎక్కువే అవుతుందేమో)

chaganti somayajulu copy

కృష్ణుడి పాత్రని తీసుకుందాం –

మూడో వాక్యంలోనే అనేస్తాడు – “కృష్ణుడి వీధి ముఖం చూడకుండా, మొగుడు చచ్చిన విధవలాగ ఇంట్లో దూరి కూచుంటున్నాడు” అని. చదువు మానేయడం వల్ల కలిగిన నామోషి కారణంగా బయటికి వెళ్ళని కుర్రాడు. ఇది కథ మొదలౌతూనే పాఠకుడి తెలిసేలా చెప్పేశాడు కథకుడు. తరువాత కథలో కృష్ణుడి మానసిక స్థితిని వర్ణిస్తాడు -కళకళలాడుతున్న “బడి చూడగానే బెంగ పట్టుకుంది”. ఒక చోట “నామోషి” అయితే మరో చోట “నామర్దా” అంటాడు. “చదువుతున్న కుర్రాళ్ళమీద ఈర్ష, తనకి చదువులేకుండా పోయిందన్న దుఃఖము – రెండూ రెండు లేడిక పాములై అతని బుర్రని కరకర లాడిస్తున్నాయి” అంటాడు. “తనకు చదువుపోయింది కదా అని కుమిలిపోతున్నాడు”. “(డిస్కంటిన్యూడ్ అన్న..) పదం జ్ఞాపకం రాగానే అతనికి దుఃఖము పొర్లుకుంటూ వచ్చింది…” ఇలా అడుగడుగునా కృష్ణుడి బాధని మన బాధ చేసేస్తాడు కథకుడు.

నరిశింహంతో మాట్లాడినప్పుడు కృష్ణుడు వాడి ముందు ఎంత అల్పుడో చెప్తాడు. నరిశింహం వేసుకునే డబుల్ కప్పు చెక్కా, హవానా పేంటు గురించి చెప్పి కృష్ణుడి నిక్కరులో వున్న పోస్టాఫీసు, చినిగిపోతే కుట్టగా బుట్టలా భుజాలు పైకి లేచే చొక్కా గురించి చెప్తాడు. అక్కడితో ఆగకుండా – “పేంటుకైతే బట్ట ఎక్కువ పడుతుంది. బట్ట ఎక్కువైతే డబ్బు ఎక్కువవుతుందని వాడికి తెలుసు” అంటాడు. ఈ వాక్యాన్ని కథ ముగింపు వాక్యంతో కలిపి చదవండి. ఆర్థిక అవసరాలు, డబ్బుల విలువ తెలుసుకున్న పిల్లాడు కృష్ణుడు. కాదూ పేదరికం నేర్పించిన పాఠాలను ఆకళింపు చేసుకున్నవాడు. వీడు కథానాయకుడు.

మరో నాలుగు వాక్యాలు ప్రయాణించగానే నరిశింహం ముందు అల్పుడిలా కనపడ్డ కృష్ణుడ్ని వెంటనే వామనావతారంలా పెంచేస్తాడు. “కృష్ణుడు మార్కుల గొడవ తేగానే గొప్పవాడైపోయాడు. తెలివైనవాడు కాబట్టే నలుగురూ గౌరవిస్తున్నారు” అంటాడు. తెలివితేటలు వుండి చదువుకోలేని అశక్తత ప్రదర్శించడం వల్ల ఆ పాత్ర మీద సింపతీ పెరుగుతుంది కదా..! అక్కడ్నుంచి కథంతా అదే ప్రదర్శన కొనసాగుతుంది.

enduku

శకుంతల కూడా తెలివైనదే. ఆ పిల్ల ఇంగ్లీషులో ఫస్టు. కృష్ణుడు తెలుగులో, లెక్కల్లో ఫస్ట్. గమనించండి లెక్కల్లో ఫస్ట్. డబ్బుకి లెక్కలకి వున్న సంబంధం డబ్బు పట్ల వుండే జాగ్రత్తే కదా..!! లెక్కలు బాగా వచ్చిన పిల్లాడికి డబ్బు విలువ తెలియకుండా ఎలా వుంటుంది. కలిసిన ఇద్దరు పిల్లలూ బడిలోకి రమ్మంటారు. కృష్ణుడి రానని చెప్పడు. అప్పటికే తన తల్లి తండ్రికి నచ్చజెప్పినా, తండ్రిమాటే నెగ్గుతుందనీ “చదువుకి స్వస్తి చెప్పడమే ఖాయమనీ” అప్పటికే నిర్థారించుకోని వుంటాడు. అయినా కలిసిన పిల్లలతో (ఒకటికి రెండుసార్లు) సోమవారం నుంచి బళ్ళో చెరుతానని చెప్తాడు. తన మనసులో వున్న ఆశని వాళ్ళ మీద ప్రొజెక్ట్ చేస్తాడు. ఓ క్షణం శకుంతలని వెనక్కి పిలిచి చెప్పేయబోతాడు కానీ తమాయించుకుంటాడు.

బళ్ళో వొంటరిగా స్తంభానికి జేరిబడి కూర్చోని తాను లేకుండా జరిగిపోతున్న క్లాసులను వింటాడు. గత సంవత్సరం జరిగిన క్లాసుల్లో తన ప్రతిభను గుర్తుచేసుకుంటాడు. స్కూలు మానేసిన మరో కుర్రవాడి పేరు కొట్టేసి “డిస్కంటిన్యూడ్” అని రిజిస్టర్లో రాసిన సంగతి గుర్తు చేసుకుంటాడు. తన భవిష్యత్తు ఏమిటా అని ఆలోచిస్తాడు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది.. మూడింటిని కలిపితే “దుఃఖం పొర్లుకుంటూ” వస్తుంది.

“నేను ఇంటికి వెళ్ళను” అని అనుకుంటాడు. ముక్కు దిబ్బడేసిపోతుంది. “ముక్కుని ఎగబీల్చుకుంటూ పొంగుకొస్తున్న దుఃఖానికి ఆనకట్టలు” వేస్తాడే తప్ప ఏడవడు. మరెప్పుడు ఏడుస్తాడు? వాళ్ళ నాన్న వచ్చాక.

“వాళ్ళంతా బడికెళ్ళారు!”

“వెర్రి నాగమ్మా. అదిరా” అన్నాడు తండ్రి.

అప్పుడు ఏడ్చాడు. “వెక్కి వెక్కి చుట్టుకుపోతూ ఏడుపు మొదలెట్టాడు. కొడుకు బాధంతా తండ్రికి బోధపడ్డాది. కొడుకు బాధంతా తండ్రి పడ్డాడు.” అంటాడు చాసో. ఒక్క వాక్యం. ఆ ఒక్క వాక్యంతో కృష్ణుడు ఆపుకున్న ఏడుపుకి ఓ ప్రయోజనం చేకూరుస్తాడు.

ఈ కథలో విలన్ ఎవరు? మనకి బాధ కలుగుతుంది నిజమే. కోపం కూడా వస్తుంది. ఎవరి మీద? తెలియదు. పరిస్థితులా? పేదరికమా? అసమానతలా? ప్రభుత్వమా? తెలియదు. కోపం ఎవరి మీదో తెలియక అది కూడా దుఃఖంగా మారుతుంది.

తండ్రి మీద కోప్పడగలమా?

“చదువు మానిపించానని అంత బాధపడుతున్నావా? బడి వరండాలు పట్టుకుని దేవుళ్ళాడుతున్నావా నాయనా? పద ఇంటికి” అన్న తండ్రి మీద మీకు కోపం వస్తోందా?

“(పుస్తకాలు) కొందాం, పద. ఏడవకు నాయనా, నే చచ్చిపోయాను, ఏడవకు!” అని తండ్రిని చూస్తే మీకు ఏడుపొస్తుందా కోపం కలుగుతుందా?

అదే తండ్రి తాగుబోతు అయ్యింటే? కొడుకు అత్తెసరు విద్యార్థి అయితే? ఏ పాత్ర ఎలా వుండాలో. ఏ వాక్యం ఎంత వుండాలో. ఏ పదం ఎక్కడ వెయ్యాలో. ఏ అక్షరం ఏ భావాన్ని కలిగిస్తుందో – తూకం వేసినట్లు రాయటమే చాసో గొప్పదనం.

ఇలా లెక్కలు వేసి కథలు రాయవచ్చు. ఆలోచించి కథని అల్లవచ్చు. కానీ చాసో లెక్కలు వెయ్యలేదు. ఆలోచించి రాయలేదు. వాటంతట అవే వచ్చి అలా కూర్చున్నాయి. ఇప్పుడు మనం వాటినికి “బైసెక్ట్” చేసి వాటిని ఫార్ములా కనిపెట్టుకోడానికి వాడుకుంటున్నాం. అంచేత, చాసో కథకుల కథకుడే కాదు. కథకుల పాలిటి ఓ లైబ్రరీ, ఓ లాబరేటరీ కూడా.

- అరిపిరాల సత్యప్రసాద్

aripirala

Download PDF

8 Comments

 • ఈకథకి శారద (ఆస్ట్రేలియా) చేసిన అనువాదం తూలిక.నెట్ లో చూడవచ్చు. ఇక్కడ ప్రచురించిన చిత్రం కూడా ఆ అనువాదంకోసం ప్రత్యేకంగా గీసి ఇచ్చినవారు రాంబాబు ఆర్లె.

 • ఈ కధ “టీచర్ – కధాకమామీషు” కధల సంపుటిలో కూడ ఉంది. స్టేట్ టీచర్స్ యూనియన్ వాళ్ళు ప్రచురించారు. మీ పరిచయం బాగుంది.

 • జంపాల చౌదరి says:

  ఈ కథ గురించి దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం రాసుకొన్న కొన్ని మాటలు
  http://eemaata.com/em/issues/201111/1848.html

  కథ ఇక్కడ http://eemaata.com/misc/enduku_parestanu_caaso.pdf

 • కల్లూరి భాస్కరం says:

  “ఎందుకు పారేస్తాను నాన్నా?”…నిన్నటి నుంచీ ఇదే శీర్షిక నన్ను వెంటాడుతుతోంది…”ఎందుకు పారేస్తాను నాన్నా?”…ఈ శీర్షికలో వెంటాడో లక్షణం ఏదో ఉంది! అందులో ఏదో దైన్యం, దుఃఖం ధ్వనిస్తున్నాయి. అందులో చదువుకునే స్తోమత లేని అబ్బాయి దైన్యం ఉంది, దుఃఖం ఉంది, చదువుకోవాలన్న తపన ఉంది, డబ్బులేనివాడికి డబ్బు విలువపట్ల ఎంత స్పృహ ఉండాలో అంత స్పృహ ఉంది, కొడుక్కి చదువు చెప్పించలేని తండ్రి దైన్యం, దుఃఖం, కొడుక్కి చదువు చెప్పిస్తే బాగుండునన్న తండ్రి తపన, కొడుక్కి చదువు చెప్పించలేకపోతున్న తన అశక్తత పట్ల తనకే జాలి, అసహ్యం కూడా ఉన్నట్టున్నాయి. తన చుట్టల్ని త్యాగం చేసే తండ్రి త్యాగం కూడా ఉన్నట్టుంది. ఆ ఒక్క మాట ఆ కుటుంబం చరిత్రనే కాక అలాంటి అనేక కుటుంబాల చరిత్ర చెబుతుంది. కథ రాయడం తేలికానూ, శీర్షిక పెట్టడం కష్టమూ నేమో! వెంటాడే శీర్షికను పెట్టడం మరీ కష్టం! మంచి కథను గుర్తుచేసి, మంచి పరిచయాన్ని అందించారు సత్యప్రసాద్. మీకు అభినందనలు.

 • Thirupalu says:

  పరిచయము చాలా బాగుంది.

 • reddi ramakrishna says:

  కథ ఆద్యంతము చాలా ఆసక్తితో చదివిస్తున్ది.కళ్ళు చెమర్చె లా రాయబడింది.చాసో గొప్ప కధకుడు గనకనే అలా రాయగలిగాడు.కానీ వ్యక్తీ సమస్కరననె ప్రతిపాదించింది.గాందేయవాదాన్ని సమర్ధించింది. చాసో కమ్మూనిస్ట్ రచయిత గదా .మరి ఈవాదాన్ని ఎలా ప్రతిపాదించాడో.. బహుసా ఈకధరాసేనాటికి తను మార్క్సును చదవలెదనుకున్దామా ..

  • మంజరి లక్ష్మి says:

   ఈయన ఏలూరెళ్ళాలి, లేడి కరుణాకరం చదివితే కూడా నాకూ అలాగే అనిపించింది. జీవిత భద్రత (డబ్బు, ఆస్తి, హోదాలు) కోసం మాణిక్యమ్మగారు, శారద పక్క దోవంబడి పోయినా (లౌక్యంతో వాళ్ళ స్థానాలను పదిలం చేసుకొన్నారు) వాళ్ళని రచయిత సమర్ధించటం ఆశ్చర్యంగా ఉంటుంది. కమ్యూనిష్టు భావాలున్న వ్యక్తి అలా రాయరు కదా. బుచ్చిబాబు, గోపిచంద్ కూడా ఇలాంటి కధలు రాశారు కానీ వాళ్ళ కధల్లో మోహం కోసమో, ప్రేమ కోసమో పోయినట్లుంటాయి. కానీ ఈ కధలు జీవిత భద్రత కోసం డబ్బునే హైలెట్ చేసి చూపించటం పరిణామ క్రమంలో అభివృద్ధికరమైందను కోవాలా?

 • Radha says:

  చాలా బాగా విశ్లేషించారు కథని సత్య ప్రసాద్ గారూ – అభినందనలు

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)