ప్రతి చిత్రం.. నాలోపలి ఒక అలసట లేని నది..!

IMG_1792

ashok1

ఒక చిత్రం చూడగానే  ఒక్కొక్కరికి ఒక్కో విధమైన స్పందన కలుగుతుంది..  ఆ  భావాలు, భావనలు  ఆ చిత్రకారుడి ఆలోచనలతో ఏకీభవించవచ్చు లేదా విభిన్నంగా ఉండొచ్చు. తన మనసులోని ఆలోచనలకు, భావాలకు, సంఘర్షణలకు  రచయిత తన రాతలలో ఒక రూపాన్నిస్తే, చిత్రకారుడు వాటిని తన చిత్రంలో పొందుపరుస్తాడు. ఆర్టిస్ట్ తన చిత్రంలోని భావాలకు అక్షరరూపం కూడా ఇస్తే… ఆతని చిత్రంలో ఆ భావాలన్ని  అద్భుతంగా ప్రతిఫలిస్తాయి.. కళ ఒకరి సొత్తు కాదు. కాని ఒక్కో వ్యక్తికి ఒక్కో ప్రత్యేకమైన కళ ఉంటుంది. అది కొందరు జీవనోపాధిగా మార్చుకుంటారు. మరికొందరు తమ జీవితానికి అన్వయించుకుంటారు. ఈ చిత్రకారుల  చేతుల్లో ఏం మాయ ఉందో? ఏం మంత్రం ఉందో కాని వాటినుండి ఎన్నో అద్భుతమైన చిత్రాలు అలా జాలువారతాయి. చిత్రాలు గీయడం అంత సులువైన పని కాదు.  ప్రతీ చిత్రంలోని ఒక్కో గీత కూడా ప్రాణం పోసుకుని  మనకు ఎన్నో ముచ్చట్లు చెబుతాయి. ఎందుకంటే అవి ఆ చిత్రకారుడి చేతిలోని కుంచెనుండి కాక అతని  మనసు నుండి వచ్చినవి కాబట్టి. మనీకోసం వేసిన చిత్రాలు పోస్టర్స్ అవుతాయి, ఆత్మతో సమ్మిళితమైన మనసుతో వేసిన చిత్రాలు పెయింటింగ్స్ అవుతాయని చిత్రప్రేమికులందరూ అంగీకరించే మాట.. అది రోడ్డు మీద గీసిన దేవుడి చిత్రమైనా, కాన్వాస్ మీద గీసిన బొమ్మైనా కావొచ్చు..

IMG_1792

ఎవరన్నారు చిత్రాలు మాటలాడలేవని? నిశితంగా పరిశీలిస్తే ఆ చిత్రాలు చెప్పే కధలెన్నో, కబుర్లెన్నో… కళాప్రేమికుల హృదయాలను కొల్లగొట్టి, మధురమైన జ్ఞాపకాలను వెలికితీసే రంగులు, గీతలు ఎన్నో ఎన్నెన్నో..ఇలా ఎన్నో రంగుల మేళవింపుతో వేసిన తన విభిన్నమైన చిత్రాలతో  ఇటీవల హైదరాబాదులో చిత్రప్రదర్శన ఏర్పాటు చేసిన చిత్రకారుడు కృష్ణ అశోక్ గారితో చిన్న మాటామంతి.. అతని మాటలలో అతనిగురించి, అతని కళ గురించి తెలుసుకుందాం.

ashok2

అశోక్ గారు నమస్కారం. ముందుగా మీగురించి కాకుండా, మీ చిత్రంగురించి మీ మాటల్లోనే తెలుసుకోవాలని ఉంది..  పైన చిత్రం  చెప్పే ఊసులేమిటి?

హ హ హా …. ఇది ‘అంతర్యామి’ సిరీస్ కోసం వేసిన చిత్రం ..ఇంకా చెప్పాలంటే ఓషియానిక్ నుండి అంతర్యామికి సంధ్య కాలానికి చెందిన చిత్రం… అందుకే ఓషియానిక్‌కి  సంబంధించిన అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి.. ఇక్కడ అంతర్యామి ఫ్లవర్‌వాజ్‌ని పట్టుకుని ఎదో సుదీర్ఘాలోచనలో వున్నట్లు చిత్రించాను.. ఫ్లవర్‌వాజ్‌ ఒక మనిషి తలలాగా వుంది.. తలలో నుండి తల’పూ(పు)లు’ మొగ్గ నుండి వికసిస్తున్నాయి.. ఆలోచనలకి సింబాలిక్‌గా చేపల్ని చూపాను.. చుట్టూవున్న ప్రాపంచిక ప్రపంచాన్ని రిప్రజెంట్ చేస్తూ కొన్ని ఇళ్ళు చిత్రించాను…అంతర్యామి మనలో వుండి మనలని నడిపించే ఒక అద్భుత శక్తి. ఆతని ఆజ్ఞానుసారమే మనం నడుస్తాం అని నా నమ్మకం…  ఆ అంతర్యామి చేతుల్లో మనం మామూలు పరికరాలము మాత్రమే.. కాని ఇక్కడ నేను చెబుతుంది ఒక దేవుడు అని కాదు.. అది ఒక అద్భుత శక్తి అంతే.. దానికి మనం ఏ రూపం అయినా ఆపాదించుకోవచ్చు..

మీగురించి చెప్పండి..

నేను చాలా ధనవంతుల ఇంట్లో పుట్టి పెరిగాను .చిన్నప్పటినుండి ఆర్ట్ అంటే చాలా ఇష్టం.. విధివశాత్తు  డిగ్రీ అవ్వగానే పొట్ట చేత పట్టుకొని, ఈనాడు పత్రికలో ఆర్టిస్ట్ జాబు  కోసం హైదరాబాద్ వచ్చాను. తర్వాత దాసరిగారు ప్రారంభించిన ఉదయం పత్రికలో చేరాను.. అక్కడే  పదేళ్లు వేరు వేరు విభాగాల్లో ఆర్టిస్ట్ గా  పని చేశాను.ఆ తర్వాత సొంతంగా సృష్ఠి పేరుతో స్టూడియో  పెట్టుకొని గ్రాఫిక్ డిజైన్ వర్క్స్ చేస్తూ, నాదంటూ సొంత శైలిలో పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టాను.. క్రమక్రమంగా  ఫుల్ టైమ్ ఆర్టిస్టుగా మారి దేశవిదేశాల్లో  ఇప్పటి వరకు సుమారుగా 35 చిత్ర ప్రదర్సనలు (గ్రూప్ & సోలో)  ఇచ్చాను..

మిమ్మల్ని ఆర్టిస్ట్ గా ప్రభావితం (inspire) చేసినదేంటి? చిత్రకళా సాధనలో మిమ్మల్ని ప్రభావితం చేసిన ఇతర చిత్రకారులెవరు? ఏ విధంగా ప్రభావితం చేశారు?

నన్ను ఆర్టిస్ట్ గా ప్రభావితం చేసింది.. చేస్తుంది..నా చుట్టూ వున్న మనుషులు, వారి మనసులు.. నా చిత్రకళా ప్రస్ధానంలో ఎక్కువగా ప్రభావితం చేసింది పికాసో and M F హుస్సేన్.  I love their work and color scheme..

ఇప్పడు మీరు  ఒక ప్రముఖ ఆర్టిస్ట్ గా పేరు పొందడానికి ఎంతో కృషి. సంఘర్షణ చేసి ఉంటారు. మీ ప్రస్ధానాన్ని కాస్త వివరించగలరా?

నేను ప్రముఖ అవునో కాదో కాని .. ఆర్టిస్ట్ అనేవాడికి నిరంతరం  భావోద్వేగ సంఘర్షణతో పాటు, బతుకు తెరువు కూడా ఒక పెద్ద సంఘర్షణే..సంపన్న కుటుంబంలో పుట్టిన నాకు ఆర్ట్ ఒక హాబీగా వుండేది.. కొన్ని కారణాల వల్ల అతి తక్కువ కాలంలో మా ఆస్తులు కరిగిపోయి, తప్పనిసరై  జీవనోపాధికోసం  అదే ఆర్ట్‌ని ఆశ్రయించాను.. ఆర్టిస్ట్‌గా వుద్యోగం చేస్తూ నాలోని కళకు పదును పెట్టే ప్రయత్నం చేశాను కాని నాలోని కళాతృష్ణ తీరలేదు. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేసి commercial గా designing works చేస్తూ, నా తృష్ణని తీర్చుకునే ప్రయత్నం మొదలుపెట్టాను. అలా క్రమంగా నాకంటూ ఒక ప్రత్యేక  శైలి వచ్చింది.. మెల్లిగా చిత్రాలు వేయడం మొదలు పెట్టాను.. పత్రికలో పనిచేసేటప్పుడు రాయడం కూడా అలవాటుండడం వల్ల నాలోని భావోద్వేగానికి రంగులు, గీతలు మేళవించి తదనుగుణమైన చిత్రాలను వేయగలిగాను. ఏదో ఒక చిత్రం అని కాకుండా వేర్వేరు అంశాలతో  సిరీస్‌లుగా  ప్రదర్శనలు ఇచ్చాను. ఎన్నో పెయింటింగ్స్ అమ్మాను. అలాగే ఒక్కోసారి ప్రదర్శనలో ఒక్క పెయింటింగ్ కూడా అమ్మని సందర్భాలు కూడా వున్నాయి..కాని నిజం చెప్పాలంటే  ఒక ఆర్టిస్ట్‌గా జీవితం సాగించడం చాల కష్టం.. అందరికి వుండే సాధారణ అవసరాలే ఆర్టిస్ట్‌లకు ఆడంబరాలు. అందరికీ కాకున్నా చాలామందికి  పేదరికం వెన్నంటే వుంటుంది. అంతేకాదు ఈ ప్రస్ధానంలో ఎన్నో అవమానాలు చవిచూడక తప్పలేదు. కాని నా చిత్రాలకు ప్రజలు, కళా ప్రియులు ఇచ్చే గౌరవం  చూస్తుంటే ఆర్టిస్ట్‌గా అన్నీ మరచి ఆత్మసంతృప్తితో కూడిన ఆనందం కలుగుతుంది.

DSC05277

మీరు అందరిలా పెద్ద చదువులు, వైట్ కాలర్ జాబ్ లాంటివి ఎన్నుకోకుండా ఈ చిత్రలేఖనాన్ని అందునా విభిన్నమైన కంటెంపరరీ ఆర్ట్ ని ఎందుకు ఎన్నుకున్నారు? ఈ పెయింటింగ్ మొదలెట్టినప్పుడు మీకు ఎదురైన సవాళ్లు, సమస్యలు ఎటువంటివి?

అందరిలా నేనూ చదివాను. కాని  కళ పట్ల వున్న ఆసక్తి, passionవల్ల ఈ చిత్రలేఖనాన్ని, మాడర్న కంటెంపరరీ (modern or contemporary art) ఆర్ట్‌ని ఎన్నుకున్నాను..ఇక సమస్యలు సవాళ్లు అంటారా.. చాలానే వున్నాయి. బేసిక్ గా అందరికి  ఆర్ట్ అనేది ఒక అభిరుచి మాత్రమే అని భావిస్తారు. కాని  ఇదే ఆర్ట్‌ని నమ్ముకొని, ఆర్ట్‌ని అమ్ముకొని, డబ్బు సంపాదించి బ్రతకొచ్చు అని చాలామందికి తెలీదు.అందువల్ల తల్లిదండ్రులు కాని, మిత్రులు కాని దాన్ని బ్రతుకు తెరువుగా అంగీకరించరు, ప్రోత్సహించరు.  కాని నా విషయంలో  మాత్రం అదే నాకు జీవన మార్గం అయ్యింది.

ఈ పెయింటింగ్ మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది. చేస్తుంది?

పెయింటింగ్ అనేది నిరంతరం నాలో ప్రవహించే ఓ నదీప్రవాహంలాంటిది. దానికి అలసట లేదు. ఆగదు . నా చుట్టూ కనిపించే, వినిపించే, పరిమళించే ప్రతిదీ నన్ను, నాలోని కళాకారుడ్ని ప్రభావితం చేస్తుంది.. గుండెలో లావా లాగా ఎన్నో ఆలోచనలు వుబుకుతూ, నన్ను పెయింటింగ్స్ వేసేందుకు ప్రేరేపిస్తాయి. దీని ప్రభావం నా జీవితంలో చాలా విచిత్రంగా ప్రతిబింబిస్తుంది.. నా కళాప్రపంచంలో నేను అన్నీమరచి హాయిగా విహరిస్తూ వుంటే..ఈ లోకానికి సంబంధించిన సాంఘిక  బంధాలు, బాధ్యతలు తిరిగి నన్ను కిందికి లాగుతూ వుంటాయి.  అది ఆర్టిస్ట్‌కి చాల కష్టమైన విషయం.. ఒక తపస్సులాంటి కళ అలా భంగం అయినప్పుడు మళ్ళీ ఆ స్ధితిలోకి రావడానికి చాలా సమయం పడుతుంది.. ఇది కళాకారులందరికి అనుభవేకవేద్యమే.

ఏ సమయంలో మీరు వేస్తున్న చిత్రం పూర్తయిందని మీకు అనిపిస్తుంది..

నాకు బాగా వచ్చింది అని అనిపించే వరకు, ఇక వేయాల్సింది ఏమీ లేదు అన్న తృప్తి కలిగేవరకు ఆ చిత్రం పూర్తయిందనిపించదు..

మీ జీవితాన్ని (ఫామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్), మీ వర్క్ ని ఎలా మానేజ్ చేస్తారు.

అదృష్ఠవశాత్తు  మా ఇంట్లో ఆర్ట్ గురించి సదభిప్రాయమే (దానివలన మంచి ఆదాయం ఉండడం వల్లనేమో) ఉంది.. ఫ్రెండ్స్ విషయానికి వస్తే నా స్నేహితుల్లో ఎక్కువమంది ఆర్టిస్ట్‌లే. వాళ్లందరూ ప్రముఖ పత్రికల్లో పని చేస్తున్నవారే. ఎవరి శైలి వాళ్లదే.. కాని మేము కలిసినప్పుడు మాత్రం మా మధ్య  ఆర్ట్ గురించి సంభాషణలు నిజానికి తక్కువే. వర్క్ కి మిగతా వాటికి సంబంధం తక్కువే.. బయటకి వచ్చినప్పుడు,  బంధువులతో కాని, ఇతర మిత్రులతో కాని, నేను ఆర్టిస్ట్‌ని అనే భావన రానీకుండా ప్రయత్నిస్తాను, జాగ్రత్తపడతాను. ఎందుకంటే… ఆ భావన  నన్ను ఒక మునిలా మౌనంగా ఉండేలా చేస్తుంది…

ఒక ఆర్టిస్టు లేదా మీతో పనిచేసేవాళ్లకు ఎటువంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటారు?

ఆర్టిస్ట్ కి ప్రత్యేకమైన క్వాలిటీస్ వుండాలని అనను కాని, కొన్ని ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉన్నవాళ్ళే ఆర్టిస్ట్‌లుగా అవుతారు అని అనగలను ( నవ్వుతూ).

ఎప్పుడైనా మీరు ఆర్టిస్టు కాకుండా ఉంటే బావుండేది అనిపించిందా? ఇతర ఉద్యోగాలు, వ్యాపకాల కంటే ఆర్టిస్టు కావడం మంచిది/మంచిది కాదు అనిపించిందా?

ఒక్కోసారి అనిపిస్తుంది..అందునా ఆర్ధికంగా ఇబ్బందులు వున్నప్పుడు..మళ్లీ  వెంటనే ఒక చిన్న  ప్రోత్సాహం, ప్రేరణ ఆ ఆలోచనని తుడిచి వేస్తుంది..

మీరు ఒక ఆలోచనతో వేసిన చిత్రాన్ని ఇతరులు మరో కొత్త అర్ధంతో విశ్లేషిస్తే, వివరిస్తే మీరెలా ఫీల్ అవుతారు.

అది నా చిత్రాన్ని వాళ్ళు చూస్తున్న దృక్కోణంగా భావించిసంతోషిస్తాను. కొన్నిసార్లు ఈ ప్రతిస్పందన నా భావాలకు సమంగా ఉన్నాయనిపించినా ఒకోసారి వారు చెప్పిన అర్ధాలు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అప్పుడు మరింత గర్వంగా ఉంటుంది..

మీ చిత్రాలు మీ వ్యక్తిత్వంలో భాగమేనా?

అవును.. నా ప్రతి చిత్రం నా హృదయ స్పందనే.. “Face is the index of the mind” అన్నట్లు “ Art is the index of an artist” అనొచ్చేమో! నేను వేసే ప్రతి పెయింటింగ్ వెనుక నన్ను  inspire చేసిన సంఘటనలు కాని, జీవితాలు కాని, మనస్తత్వాలు కాని ఉంటాయి.. వాటికి నా మనసులో కలిగే ప్రతిస్పందనే కాన్వాస్ మీద నా కుంచెని కదిలిస్తుంది.. అంటే ఒక సంఘటనకి నేను ఎలా రియాక్ట్ అవుతానో అదే నా మనసు, నా వ్యక్తిత్వం కాబట్టి నా చిత్రాల్లో కనిపించేది నా మనసు, ఆత్మ అనే చెప్పోచ్చేమో.. అదే నా వ్యక్తిత్వం కూడా ఏమో..!! అంతేకాక నా చిత్రాల్లో ఎక్కువగా స్త్రీ పాత్ర ఒక ప్రముఖ పాత్రని పోషిస్తుంది. నా జీవితంలో కూడా స్త్రీ ఒక ప్రముఖపాత్రని పోషిస్తుంది అని చెప్పొచ్చు( ఏ రకంగా అని అడక్కండి, అది నా వ్యక్తిగతం) …అందుకే ఆమె నా చిత్రాల్లో   ప్రతిబింబిస్తుంది..

మీరు ఈనాడు, ఉదయం మొదలైన పత్రికలలో ఇలస్ట్రేటర్ ఆర్టిస్టుగా ఉద్యోగం చేసారు. ఆ తర్వాత సొంతంగా ఒక విభిన్నమైన శైలితో చిత్రాలు వేయడం మొదలెట్టారు. ఇలా మారడానికి కారణమేమిటి?

ముందే చెప్పాను… ప్రత్రికల్లోఇలస్ట్రేషన్స్ అంటే.. ఓ కథకో లేక కవితకో లేక ఒక వ్యాసానికో తగిన చిత్రం వేయాలి. అలా వేయడం ఒక ఛాలెంజ్ లాంటిది కాని దానికి ఒక పరిధి వుంటుంది. నా మనోభావాలని పూర్తిగా ఆవిష్కరించేందుకు కాన్వాస్ సరైన మాధ్యమం అని అనుకుని పెయింటింగ్స్ వేయడం పట్ల నాకున్న passion ని పూర్తి చేసుకోవాలని అనుకున్నాను.. అందుకే ఉద్యోగం వదిలేసి సొంతంగా స్టూడియో పెట్టుకున్నాను.. చిత్రాల మీద నాకంటూ ఒక ప్రత్యేక శైలి కోసం కృషి చేసి సాధించాను. నా చిత్రాలు ఎంతో మంది కళాప్రియులని, కళావిమర్శకులని, ఆర్ట్ బయర్స్ ని ఆకర్షించాయి.. దాదాపు దేశ విదేశాల్లో ఒక 35 వరకు ప్రదర్శనలు ఇచ్చాను..ఇంకా ఇస్తున్నాను..

 

మీరు randomగా చిత్రాలు కాకుండా ప్రత్యేకమైన అంశాలతో  సిరీస్‌లా  వేసారు. అంతర్యామి, విండోస్,మెమరీస్. ఓషియానిక్, వీటి గురించి వివరించండి

ఇంతఃకు ముందు చెప్పినట్టుగా   జీవితానికి నా మనో స్పందనే నా చిత్రం ..  మొదట కొన్ని భావాల్ని ఒక్కొక్క చిత్రంగా కాన్వాస్ పైన చూపాను, దానికి ప్రత్యేక మైన సిరీస్‌గా ఏమి పేరు పెట్టలేదు.. తరువాత  నేను జీవితాన్ని చూసే దృక్కోణం మారుతూ వచ్చింది.. వాటిని ఒక్కో అంశం (series) లా తీసుకొని చిత్రించడం జరిగింది… మొదట ‘memories’ అనే అంశం తీసుకున్నాను… మనిషి జీవితంలోని  విభిన్న సందర్భాల్లో విభిన్నమైన ఎమోషన్స్ ని వెలికితీసే  ప్రయత్నం చేశాను…వాటిలో ఎక్కువగా ఇద్దరి ప్రేమికుల మధ్య కలిగే ఎమోషన్స్‌ని memories గా  చిత్రించాను.

ashok3

ashok4

ashok5ashok6

పైన చూపిన చిత్రాలు అన్నీ నా “memories” series లోనివే.. వాటికి మంచి స్పందన వచ్చింది… చాలా మంది  ఆర్ట్ కలెక్టర్స్ ఇష్టపడ్డారు… ఇతర దేశస్తులు కూడా చాల మంది ఈ series లోని చిత్రాల్ని సేకరించారు..

Memories తర్వాత ‘windows’ సిరీస్ వేసాను…ఇక్కడేమిటంటే… “windows’ సిరీస్ అంతా కూడా ఒక స్నేహితురాలు నాతో మాటల్లో  పంచుకున్న తన జీవితపు విశేషాలకి ప్రభావితుడనై వాటి  ఆధారంగా వేసిన చిత్రాలే ఈ series అంతా… చాలా గొప్ప ప్రతిస్పందన వచ్చింది… హైదరాబాద్, చెన్నై, బెంగళూర్, ముంబై వంటి చోట కూడా మంచి ఆదరణ లభించింది.. కొన్ని చిత్రాలు విదేశాల్లో కూడా గ్రూప్ షోలలో ప్రదర్శించడం  జరిగింది.

ashok7

ashok8

పైన పొందుపరచిన చిత్రాలు ‘windows’ sries లోని కొన్ని మాత్రమే…

ఆ తరువాత నా ఆలోచనాస్రవంతి ఇంకొంచెం లోతుగా ప్రవహించిందేమో.. దాని ఫలితమే ‘ఓషియానిక్’ అనే సిరీస్.. ఈ సిరీస్‌లో ఎక్కువగా స్త్రీయొక్క అంతర్మధనాన్ని చిత్రించే ప్రయత్నం చేశాను.. ఇక్కడ ఓషన్ అంటే స్త్రీ యొక్క మనసు, స్త్రీ మనసులోతు, దాని వైశాల్యం , దానిలోని ఆలోచనలు, కోరికలు, పరిధులు, ఆశలు నిరాశలు ఇంకా ఎన్నో, ఆమె మనసులోని సంఘర్షణలు అన్నీ చూపించే ప్రయత్నం చేసాను.. ఈ భావాలు అన్నిటినీ విభిన్నమైన రూపాల్లో సింబలైజ్ చేశాను …స్త్రీని ఒక మత్స్యకన్య(mermaid) గా చూపించాను..సగం మనిషి సగం చేప…అంటే సగం తన సాంఘిక జీవనం మరో సగం ఆమె అంతరంగం…మీకు అర్ధమవ్వాలంటే ఇక్కడ కొన్ని చిత్రాలు చూపిస్తాను.

ashok9

ashok10

పైన చూపినవి కొన్ని ఉదాహరణలు..

వీటిల్లో స్త్రీయొక్క ఆలోచనల్ని ప్రోత్సహిస్తూ.. చేపల్ని, శంఖాలనీ, సముద్రపు గుర్రాన్ని, శంఖాలని చూపాను… ఒక్కో చిత్రాన్ని వివరించాలంటే ఇక్కడ సమయం and చోటు చాలదు ..వీలైతే తదేకంగా కొంత సేపు చూస్తూ వుండండి… నేను నా పెయింటింగ్స్ ద్వారా చెప్పదలచిన భావాలే  మీకు కూడా స్పురించవచ్చు…ప్రయత్నించి చూడండి ( నవ్వుతూ)

ఆ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది… కొన్నాళ్ళు బ్రేక్ తీసుకున్నాను … నాలో అంతర్యామి అనే అంశం పైన అంతర్మధనం మొదలయింది… మదిలో నిరంతరం ఒక వేదన, ఏంటి? ఎలా వేయాలని?.. మెల్లిగా నా వర్క్ స్టైల్ కూడా మార్చుకొని కొత్తగా చూపే ప్రయత్నం చేసాను..

దానిలోని కొన్ని ఇక్కడ ఇస్తున్నాను.

ashok11ashok12

ఈ సిరీస్‌లో స్త్రీ మనోభావాల కన్నా, మనిషిలోని మనసును ప్రేరేపించేది ఒక అద్భుత శక్తి అని చూపించే ప్రయత్నం చేసాను.. ఎంతో మంది  కళా ప్రియులు  ఈ అంతర్యామి సిరీస్‌ని చాలా ఇష్టపడ్డారు, ఇంకా ఇష్టపడుతున్నారు..  నేను అనుకున్నంత స్పందన రాలేదు… కాని ఒక ఆర్టిస్ట్ గా మంచి సంతృప్తినిచ్చింది..

ఇక ..నా పయనం అంతర్యామి నుండి…మరో దిశగా మరలుతుందేమో ఇంకా పూర్తిగా నాకు కూడా తెలీదు.. నన్ను నడిపించే నా “అంతర్యామి’ నా మార్గాన్ని ఎలా నిర్దేశించారో ..చూడాలి..!!

మీ బొమ్మలోని రూపాలలో మీది అంటూ ఒక శైలి కనిపిస్తున్నది. ముఖాలు ఒకమాదిరి పొడుగ్గా, పలచగా, పదునుగా ఉన్నట్టు ఉంటాయి. బొమ్మలో మిగతా శరీరమంతా కనబడిన సందర్భాల్లో ఆ శరీరాల తీరుకి కూడా ఒక ప్రత్యేకమైన శైలి ఉన్నది. ఈ శైలి ఎలా వచ్చింది? బొమ్మలో దీనికేమైనా ప్రాముఖ్యత ఉన్నదా?

మొదట్లో నేను కొంత మంది పాశ్చాత్య చిత్రకారుల  ద్వారా ప్రభావితుడని అయ్యాను.. నాదంటూ ఒక స్టైల్ కోసం ఎంతో కృషి చేసేవాడిని… ఎన్నో పేపర్స్, రంగులు , కాన్వాస్‌లు పాడు చేశాను. చివరికి సాధించాను, ఆ తర్వాత నాకే తెలియకుండా నాకు ఒక శైలి ఏర్పడింది.. అదంతా దైవదత్తమేమో…

మీరు వేసే బొమ్మల్లో  రంగుల కలయిక, రంగులు అద్దడంలో కూడా మీ స్వంత శైలి ఉన్నది – ఇది మరెక్కడా కనబడదు. ఇది ఎలా అభివృద్ధి చేసుకున్నారు? ఈ రంగులను ఎంచుకోవడానికి ప్రత్యేకమైన కారణమేమైనా ఉందా?

దానికి ప్రత్యేకమైన కారణాలు ఏమి లేవు..  కాన్వాస్ పైన పెయింటింగ్ వేయడం మొదలు పెడితే..ఆ రంగులు ఎందుకు ఎక్కడ ఎలా వేస్తానో నాకే తెలేకుండా జరిగిపోతుంది.. నా ఉద్దేశం sub contious లో ఆ రంగుల అమరిక జరిగిపోతుందేమో..!!

బొమ్మ వెయ్యడానికి అవసరమైన క్రమశిక్షణ గురించి చెప్పండి. ఆర్టిస్టులు అనగానే అందరూ ఒక సమయం, డిసిప్లిన్ పాటించని వారుగా, ఒక మాదిరి స్వేఛ్ఛా జీవులుగా అనుకుంటూ ఉంటారు. ఆర్టిస్టుకి స్వేఛ్ఛ ఎంత అవసరం? క్రమశిక్షణ ఎంత అవసరం?

ఎవరికైనా సంతోషమైన జీవితం కావాలంటే. క్రమశిక్షణతో కూడిన స్వేచ్చే వుండాలి.హద్దులు దాటితే ఏదైనా ఇబ్బందే కదా..!!

ఒక కొత్త బొమ్మ వెయ్యాలి అనుకున్నప్పుడు మనసులో జరిగే క్రియేటివ్ ప్రాసెస్ గురించి చెప్పండి.

అది చెప్పడం చాల కష్టం.. అది అనుభవిస్తేనే తెలుస్తుంది..

మీరు వేసిన చాలా బొమ్మలు చూశాక. మీకు కృష్ణుడంటే అభిమానం అనిపిస్తుంది.కృష్ణుడి ప్రాముఖ్యత ఏవిటి? ఆ కృష్ణుడు మిమ్మల్ని మీ చిత్రాలని ఎలా  ప్రభావితం చేస్తాడు.

కృష్ణుడి కన్నా..కృష్ణ తత్వం నాకు చాల ఇష్టం..

He is detached and witness..అందుకే నాకిష్టం.

మీ చిత్రాలలో ఎక్కువగా , దాదాపుగా అన్నీ న్యూడ్ వే ఉంటాయి. దీనికి కారణం ఏమిటి?

Nudity is innocence… నా చిత్రాలు నిజానికి మనుషులు కాదు…మనిషి లోని అమాయకమైన మనసులు.అందుకే నా చిత్రాలు నగ్నంగా వుంటాయి.

ashok13

మీ చిత్రాలలో కనిపించే వస్తువులు :  కమలాలు, పక్షులు, రెక్కలు తొడిగిన వ్యక్తులు, నీరు, చేపలు,మత్స్యకన్యలకు గల అర్ధాలు ఏంటి??

ఒక పెయింటింగ్ చూస్తున్నప్పుడు అర్ధం కన్నా…భావం ముఖ్యం, ఆ భావం ఏర్పడటానికి కొన్ని ఎలిమెంట్స్ ని తీసుకొని సింబాలిక్‌గా చూపుతారు… అందులో భాగంగానే.. కమలాలు ఒక పవిత్ర ప్రేమకి, పక్షులు మనిషిలోని ఆత్మకి, రెక్కలు తొడిగిన వ్యక్తులు స్వేచ్చకి, నీరు అంతరంగానికీ, చేపలు ఆలోచనలకీ..ఇలా రకరకాల భావాల్ని ప్రతిబింబించడానికి అనేక వస్తువుల్ని  వాడటం జరిగింది.. కాని ఒక పెయింటింగ్ చూస్తున్నప్పుడు వాటి అర్ధాల కన్నా ఫీలింగ్ ముక్యం అని నేను అనుకుంటాను… అలా అయితేనే మనం ఆ చిత్రాన్ని సంపూర్తిగా ఆస్వాదించ గలం అని నా నమ్మకం.. Don’t try to find the meaning of the painting.. just feel it and enjoy it..!!

ధన్యవాదాలండి కృష్ణ అశోక్ గారు.. మీ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించి  మీ గురించి, మీ చిత్రాల ఇంత వివరంగా చెప్పినందుకు…

నా ఈ ఇంటర్వ్యూ చదివిన వారు, వారి ప్రతిస్పందన నాకు తెలియచేస్తే నేను వేసే మరిన్ని చిత్రాలకు ఇన్స్పిరేషన్ అవుతుందని మర్చిపోకండి..!!

ధన్యవాదాలు…!!

 ముఖాముఖి:
జ్యోతి వలబోజు

19175_339384976094_6173599_n

 

Download PDF

13 Comments

 • kalasagar says:

  చాల ఇన్స్పిరింగ్ ఇంటర్వ్యూ ……

 • DrPBDVPrasad says:

  పెయింటింగ్ నిరంతరం ప్రవహించే నదిలాంటిదే.చిత్రకారుని గుండె నుండి,కుంచె నుండి
  కొండల్లో కోనల్లో ఆ సౌందర్యాన్ని చూసితీరాల్సిందే(సౌందర్యారాధకుని కళ్ళ నుండి
  తీర్థాల్లో మునకలు వేయాల్సిందే
  పుష్కరాలొచ్చినప్పుడు(art exhibitions) సంబరాలు చేసుకోవాల్సిందే
  చిన్నరాగిచెంబుతో నయినా ఇంటికి తెచ్చుకోవాల్సిందే(purchase at least one small piece)
  చిత్రకారునిని చక్కగా ఆవిష్కరించారు

 • div says:

  కృష్ణుడి కన్నా.. ‘కృష్ణ’ తత్వం నాకు చాలా ఇష్టం…!

 • జ్యోతి గారు

  ఇంటర్వ్యూ చాల చాల బావుందండి ! చిత్రాలు స్పష్టంగా , సుందరంగా , ఆలోచనాత్మకంగా ఉన్నాయి . చక్కని ప్రశ్నలు అడిగారు , కృష్ణ అశోక్ గారి నుంచి ఎన్నో మంచి జవాబులు, మంచి ప్రతి స్పందన వచ్చేలాగా ! వారికీ , మీకూ అనేక కృతజ్ఞతలు !

 • BHUVANACHANDRA says:

  చాలా చాలా బాగుంది ఇన్నర్ —-వ్యూ……కృష్ణ అశోక్ గారూ ఆయుష్మాన్ భవ ……జ్యోతి గారూ కమెండ బుల్ జాబ్ …..కంగ్రాట్స్

 • malathi says:

  Congrats Both Of You Jyoti Garu superb and Commendable Interview and Very Inspirational Replays from Krishna Garu .

 • sujana says:

  నదికి అలసట ఏమిటి?

  • sujana says:

   నదికి అలసట ఏమిటి?! ఎవరైనా సందేహం తీర్చండి ప్లీజ్

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)