మామూలుగా కనిపించే అమామూలు కథ!

images
చాసొ కథల్లో ఏది నచ్చిందీ అంటే కొంచం చెప్పడం కష్టమే . ఒక్క కథ గురించే మాత్రం మాట్లాడలేము. కానీ ఇక్కడ శీర్షిక నాకు నచ్చిన చాసో కథ అన్నారు కనుక నా మనసును బాగా  ఆకట్టుకున్న కదిలించిన కథ ” లేడీ కరుణాకరం”.
ఈ కథ నాకు ఎందుకు నచ్చిందీ అంటే చాలా కారణలున్నాయి :
ముందుగా ఈ కథలోని ఆర్ధిక కోణాన్ని రచయిత వివరించిన తీరు. మధ్య తరగతి జీవితాల్లో విద్య కూడా ఒక అందని ఫలమనిపిస్తుంది. దాని కోసం శారద తల్లి తండ్రి అవలంబించిన పద్ధతి మంచిదా కదా అన్న చర్చ లో నైతికత అనేదానికి తావు లేదు. రచయిత ఎక్కడా తన అభిప్రాయాన్ని కానీ ఏ సిద్ధాంతాన్ని కానీ చెప్పడు. సమస్యను కేవలం సమస్యగా దానికి ఆ దిగువ మధ్య తరగతి వారు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రమే చెప్తాడు. ఇలాంటి కథ ను నిర్మమంగా చెప్పడం చాలా కష్టం.
ఈ కథ గురించి చాలా విమర్శ ఉంది. కేవలం తన భర్త చదువు కోసం శారద వ్యభిచరించాలా , ఆ మార్గం పైగా తన తల్లి తండ్రులే సూచిస్తారు. ఇది ఎంతవరకు సమంజసం?
ఇక్కడ సమంజసమా కదా అన్నది ప్రశ్న కాదు. కానీ ఏ చదువూ లేని శారదకు వాళ్ళ తల్లి తండ్రులు సూచించిన పరిష్కారం ఇది.
అసలింతకీ ఈ కథ ఇతివృత్తం దేని గురించి?
ఈ కథ ఒక మనిషి జీవన పరిష్కారం కోసం ఏమి చేసిందనీ కాదు , ఈ కథ చదువు గురించి . ఈ కథ విద్యా గురించి అన్న ఆలోచనతో చూస్తే ఈ కథ వెనకాల రచయిత దృక్కోణం కనిపిస్తుంది. శారద ఎందుకు వ్యభిచరించింది ? తన భర్త చదువు కోసమే కదా. ఆ పైన అతనికి ఒక మంచి పదవి రావడం కోసం. పేదరికం చాలా మంది సమస్య కానీ ఇక్కడ ఈ సమస్యను శారద తన తల్లి తండ్రులు చెప్పిన పద్ధతి లో పరిష్కరించుకుంటుంది. పెళ్లి చేసుకుని హాయిగా భర్తతో కాపురం చెయ్యాలనుకునే ఏ ఆడ పిల్ల ఇలా చెయ్యాలనుకోదు. ఎవరూ కావాలని ఆ దారి తొక్కరు.
ఆమె భర్త కి కూడా శారద పట్ల ఆ కృతజ్ఞత ఉంటుంది. ఇదంతా నీవు పెట్టిన భీక్షే కదా శారద నీవు సరస్వతి వి అంటాడు. అతనికీ పిల్లలు తనకు పుట్టిన వారు కాదని తెలుసు , అతనిలోనూ బాధ ఉంటుంది , అసహనం ఉంటుంది కానీ కేవలం ఆమె చేస్తున్న పని వెనుక ఉన్న కారణాన్ని అర్ధం చేసుకుంటాడు కనుక గమ్మున ఉంటాడు.
చివరికి అతనికి సర్ బిరుదు వస్తుంది . అప్పుడు అంటుంది శారద అయితే నేనిప్పుడు “లేడీ కరుణాకరం ” అన్న మాట అని. అన్న తర్వాత ఒకే వాక్యంలో చాసో అంటాడు “శారద మహా పతివ్రత ” అని. భర్త నపుంసకుడైనప్పుడు అతను నియోగించిన వారితో రమించి తల్లి అయిన కుంతి మహా పతివ్రత అయితే మరి శారద ఎందుకు కాదు? భర్త చదువు కోసం శారద అదే పని చెయ్యాలా అని అడగచ్చు. అందరి సమస్యకి ఇదే పరిష్కారమా అని కూడా ప్రశ్నించవచ్చు . కానీ వారికి తోచిన పరిష్కారం వారు ఎన్నుకున్నారు అన్నదే ఇక్కడ రచయిత చెప్పే విషయం.
శత కోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు , అలాగే వారి దారిద్రానికి వారికి తోచిన పరిష్కారం అది. అనుకున్నది సాధించుకుంటారు కరుణాకరం దంపతులు.
ఈ కథ చదివి హృది చెమరించని వారుండరు. వ్యంగ్యాత్మకంగా చెప్పినా ఈ కథలోని విషాదం మనల్ని కదిలిస్తుంది. ఈ కథ ఖచ్చితంగా పాఠకుడి మనసులో నిలిచి పోతుంది. ఆలోచింపజేస్తుంది. ఆ నాడు చదువు కోసమే ఒక శారద ఈ పని చేస్తే. నేటి ఈ ప్రైవెటైజేషన్ కాలం లో పేదవారికి  అందక , ఎందరో   సమర్ధత ఉండీ కూడా చదువు కోలేకపోతున్నారు. అసలీ విద్యా రంగాన్ని ఎందుకు ప్రభుత్వం తీసుకోదు ? విద్యా వైద్య రంగాలను ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అతి సాధరణంగా కనిపించే ఈ కథలో ఎన్నో విషయాలున్నాయి  అందుకే ఈ కథ అంటే నాకు ఇష్టం .
                                     -జగద్ధాత్రి
1231658_539630582777569_2120927918_n
Download PDF

2 Comments

  • Manjari Lakshmi says:

    చదువు కోసం ఆ ఆమ్మాయి అలా చేసిందని జగద్ధ్ధాత్రి గారు చెపుతున్నారు కానీ ఈ కధ చదివితే అల్లా అనిపించదు. ఈ కధకు ముందర ఏం జరిగి ఉంటుందని ఆలోచిస్తే, మనం దాన్ని ఇలా ఊహించవచ్చు. తల్లి తండ్రులు పిల్ల పెళ్లి కోసం ప్రయత్నం చేసి ఉంటారు. పిల్లాడి తల్లి తండ్రులు `మా పిల్లవాడికి చదువు కయ్యే ఖర్చు మీరే భరిస్తే మీ పిల్లను చేసుకుంటామని’ అని ఉండవచ్చు. ఆ విధంగా కట్నం గాని కట్నంగా అల్లుడికి డబ్బు పంపించటం కోసం తల్లి, తండ్రి ఎక్కడా లేని ఈ విచిత్రమైన దారిని కనిపెట్టారు. ఈ మధ్య భువన చంద్ర గారు కూడా ఈ విషయమే రాశారు. కట్నం ఇచ్చుకోవటం కోసం ఆడపిల్లలు ముందరే వ్యభిచారానికి దిగినట్లు. అయితే ఇందులో శారద పెళ్ళైన తరువాత ఆ పనికి పూనుకుంది. అయితే శారద ఇట్లా చెయ్యటం భర్తకు ఏమాత్రం ఇష్టం లేదు. అతను ఈ సంగతి తెలుసుకోగానే నేను వదిలేస్తాను అనటంతో, శారద తప్పంతా తన తల్లి తండ్రులదని చెప్పి తాను అమాయకురాల్నని చెప్పి (నటించి) కరుణాకరం కాళ్ళ మీద పడి అతనితో వెళ్లిపోతుంది. అతను చదువు మానేసి ఉద్యోగం చేస్తూ సంసారాన్ని లాక్కోస్తూనే వుంటాడు. కానీ మళ్ళా శారద నాయుడుతో సంబంధం పెట్టుకోవటం అతని కళ్ల పడుతుంది. అతను సహించ లేక దాని గురించి అడిగినప్పుడే అతన్ని తన దగ్గరున్న డబ్బులు తీసుకొని చదువుకొమ్మని ఆశ చూపింఛీ, కొంత బెదిరించీ తాను వ్యభిచరించటానికి అంగీకారం భర్త నుంచి పొందుతుంది. కాబట్టి ఆమె డబ్బుతో వచ్చే అంతస్థుతో పాటు ఇతరులతో వ్యభిచరించటం కూడా వదులుకోలేదని దీన్ని బట్టి అర్ధం అవుతుంది. తన వ్యభిచారాన్ని భర్త ఒప్పుకోవటం కోసం ఆవిడ భర్తకు చదువు, గొప్ప ఉద్యోగం, ఇంకా దానిలో ఉన్నతి పొందటం, చివరకు సర్ బిరుదు పొందటం ఇవన్నీ యెరలుగా వేస్తుంది. కరుణాకరం(తన బలహీనత వల్ల) అన్నిటికీ తలవొగ్గి చివరకు తన పిల్లలు కాని పిల్లలకు కూడా తండ్రిగా ఉంటూ ఉద్యోగ ఉన్నతిలోనూ, సర్ బిరుదులతోనూ సంతృప్తి పడుతూ, ఆమె ప్రియులందరి లిస్టులో చివరన నిలబడటానికి కూడా బాధపడని తాత్విక, మానసిక స్థాయికి చేరుకోవటంతో కధ సుఖాంతమవుతుంది. అయితే రచయిత ఈ కధను వ్యంగ్యంగా రాయటం వల్లా, చివర కొంత కొంటితనంగా ద్రౌపదితో పోల్చడం వల్లా, రచయిత శారదను సమర్ధిస్తున్నాడా లేదా అనేది పాఠకుడు కొంత అనుమాన పడేటట్లుగా చేస్తుంది. కధకు రచయిత కప్పిన ఆ మాయ పొరను చింపేసి కధను నగ్నంగా నిలబెట్టి జగద్ధ్ధాత్రి గారు చాలా గొప్ప పని చేశారు. దానికి ఆమెని ఎంతైనా అభినందించాలి. కట్నమిచ్చి పెళ్లిచేసుకోలేక నిజాయితీగా ఏదో ఒక పని చేసుకుంటూ అలాగే మిగిలిపోయిన స్త్రీలనూ, గంతకు తగ్గ బొంతను చేసుకొని ఆర్ధిక ఇబ్బందులు అనుభవిస్తూ అలాగే సంసారాన్ని లాక్కొచ్చే స్త్రీలనూ, సంసారానికి ఆర్ధిక సాయంగా ఉంటుందని చెప్పి తెల్లవారుజామున 4 గంటలకే లేచి భర్తకు పిల్లలకు వండి పెట్టి బస్సులు, రైళ్లు ఎక్కి వేరే ఊళ్ళకు కూడా వెళ్ళి ఉద్యోగాలు చేసే స్త్రీలనూ శారద తో పోలిస్తే హీనులని అనుకోవాలా? మానవ సంబంధాలకు సమానత్వమూ, ప్రేమా, ఆత్మగౌరవాలు ప్రాతిపదికగా ఉండాలే గానీ, అవకాశ వాదం, విశృంఖలత్వం, కపటత్వం, వంచన(కధలో కరుణాకరం చేసుకుంది ఆత్మ వంచన) ఇవి కాదు ఆదర్శం ఎవరికైనా. భూస్వామ్య వ్య్వస్థని దెబ్బ తీయటానికి, సమాజంలో ద్వంద్వ నీతినీ, స్త్రీల అణచివేతను ఎదిరించటానికి ఫ్యూడల్ పురుషుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేట్టు చెయ్యటానికీ చలం గానీ, చాసో గానీ ఇటువంటి తిరుగుబాటు చేసే విశృంఖల నాయికలను సృష్టించారు. ఈ కధలను ఆ చారిత్రక నేపద్యంలోనే చదివి వదిలెయ్యాలి తప్ప, వ్యవస్థలో ఉన్న తప్పుడు పధ్ధతులను ఎదిరించటానికి, ఇంకో తప్పుడు దోవలను పోవటం ఆదర్శంగా చూపించకూడదు. ఏ కధైనా ఎంత కష్టమైనా స్త్రీలు సమానత్వం, ఆత్మ గౌరవాల కోసం నిజాయితీగా పోరాడటమే సరైందనేది చెప్పాలి.

  • Thirupalu says:

    చాసో కధను గురించి మంచి చర్చ జరిగింది.
    ‘శత కోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు , అలాగే వారి దారిద్రానికి వారికి తోచిన పరిష్కారం అది.’ ఇదే నిజమైతే ఈ కధ రాయల్సిన అవసరం చాసో గారికి లేదు. మంజరి గారు చెప్పినట్లు ‘సమాజంలో ద్వంద్వ నీతినీ, స్త్రీల అణచివేతను ఎదిరించటానికి ఫ్యూడల్ పురుషుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేట్టు చెయ్యటానికీ చలం గానీ, చాసో గానీ ఇటువంటి తిరుగుబాటు చేసే విశృంఖల నాయికలను సృష్టించారు. ఈ భావమే ఈ కధకు పునాది అయి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం . అవసరం లేదు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)