ఈ కథ కింద నిజంగా నేల వుందా?!

khadeer babu
khadeer babu

khadeer babu

గతంలో మహమ్మద్ ఖదీర్‌బాబు కథల గురించి నేను రాసిన తర్వాత వునికీ, పేరూ చెప్పకుండానే ఒక మిత్రుడు ఫోను చేసి చాలా కోప్పడ్డారు.  తెలుగు భాషలో అన్ని నెగటివ్ పదాలు వున్నాయని అప్పుడే  తెలిసింది. ఒక మేధావి రచయిత గురించి నీకేం తెలుసని నువ్వు రాశావూ? అన్నది తాత్పర్యం. మరో మిత్రుడు మాట్లాడుతూ ఆంధ్రదేశంలో  ఆఖరి కథా రచయిత గురించి అవాకులూ, చెవాకులూ రాశావన్నారు. ఒక ప్రొఫెసర్ గారు ముఖస్తంగానే “నువ్వు ఓ ఫండమెంటలిస్టువి” అన్నారు.

చిన్నవయసులోనే (నాకంటే) ఇంత మంది గొప్ప అభిమానుల్ని సంపాదించుకొన్న రచయిత గురించి రాసే సమయంలో నా బద్ధకం ఇంత పని చేసిందని నాకు అర్ధం అయ్యింది. అందుకే ఆయన కథల్ని ఒక్కొక్కటీ చదవడం అవసరమనిపించింది. ముందుగా నేనెంచుకున్న కథ ” కింద నేల వుంది” అనేది. ఈ కథ ‘తెలుగునాడి’ జూన్, జులై 2005లో ప్రచురించబడి వుత్తమకథగా ఎన్నికైంది. వుత్తమోత్తమ కథగా ఎడిటర్ల ప్రశంసలందుకుంది. నలభై పేజీల కథని పరామర్శించేందుకు నాకోసం కొంచెం సమయం కేటాయించమని ముందుగా మనవి చేసుకుంటున్నాను.

లక్ష్మి అనే డాక్టరుగారు తన కొడుకు ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడం లేదనీ, చదువూ, ఎలక్ట్రానిక్ పరికరాల్తోనే వుండిపోతున్నాడని గ్రహించి బాధపడి సంగీతం నేర్పించాలనుకుని సహాయం కోసం కథకుడ్ని కలిసి తన జీవిత చరిత్ర చెప్పుకొని బాధ పడ్తోంది. చివర్లో ఆ కుర్రాడు మొక్కల పెంపకం మీద శ్రద్ధ చూపిస్తున్నాడని తెలిసి ఎంతో ఆనందపడ్తుంది.

అందుబాటులో వున్న పరికరాల సాయంతో ఒక్కొక్కటిగా విషయాలు చూద్దాం. ఖదీర్‌బాబు కథల్లో కొన్ని ప్రత్యేకతలుంటాయి. అవి పాఠకలోకాన్ని కొంత ఆకట్టుకొంటాయి. వాటిలో ఒకటి వాతావరణం. ఆయన కథలు శోకసముద్రంలో మునిగి తేలవు. పాత్రలు దుఃఖంలో కూరుకుపోయి కన్పించవు. న్యూ బాంబే టేలర్స్, ఖాదర్ లేడు, దావత్‌లాంటి కథల్లో కూడా విషాదం ఒక నేపధ్య శబ్దంగానే వుంటుంది కానీ ప్రధాన స్రవంతిగా వుండదు. పాఠకుల్లో అతి ఎక్కువ సంఖ్యగా వుండే ” తీరుబాటు శ్రేణుల”కి ఇది ఒక పెద్ద రిలీఫ్. ఆదివారం బద్ధకానికి ఈ వెసులుబాటు ఒక వెండి జలతారు. రైతులు, గ్రామీణ వృత్తికారులు, స్త్రీలు వగైరాల కన్నీటి కథలకి భిన్నంగా తమ చుట్టూ వున్న పట్టణం, నగర జీవితంలో సాగే కథలు చదవడం ఒక ఆత్మీయతని పెంచుతాయి. సరే విషయాల్లో కెళ్తే…

కథలోని పాత్రలు మూడు. మొదటిది.. ప్రధానంగా కన్పించే డాక్టరు పాత్ర. సాధారణంగా కథ రాసేటప్పుడు ఏదో ఒక పాత్ర పైన, ఆ పాత్ర చుట్టూ  వున్న పరిస్థితుల పైనో సానుభూతి కలిగించే విధంగా కథ రాస్తారు. మరీ సాధారణంగా ఆ పాత్ర ప్రధాన పాత్ర అయి వుంటుంది. కానీ ఈ కథలో రచయిత కానీ, కథకుడు గానీ అలాంటి ప్రయత్నమేమీ చెయ్యరు. ఈ పాత్రని చూస్తే.. పేజీలకు పేజీలు ఉపన్యాసంగా  సా… గిన ఆమె జీవిత చరిత్ర చూస్తే… ఆమె పరుగెడుతోంది. ఆ అలుపులో ఆయాసంతో తన మీద తనే జాలి పడుతోంది. తన కష్టాలు వినమంటోంది ??

“త్రీ బెడ్‌రూం ఫ్లాట్ అది. ఫైన్‌గా వుడ్‌వర్క్ చేసిన అల్మారాలు, డాంబికంగా కనిపించకపోవడమే ప్రత్యేకతగా కలిగిన ఖరీదైన వస్తువులు. కోడిగుడ్డు ఆకారంలో తెల్లగా మిలమిలా మెరిసిపోతున్న వాష్‌బేసిన్లు…: ఆ ఫ్లాట్ ఎక్కడ? నగరానికి దూరంగా కాదు. బషీర్‌బాగ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో పోష్ అపార్టుమెంట్లు వున్న కాలనీలో. ఆమె తిరిగేది కారులో. మిగతావన్నీ షరా మామూలే. ఇంట్లో పనమ్మాయి. సెల్‌ఫోన్లు. వీటన్నింటితో పాటు ఆమె రోజూ వైన్ తాగుతోంది. ఆమెకి ఎంత అలవాటంటే ఇంట్లో కొత్తవాళ్లున్నా కూడా తాగకుండా వుండలేనంత. కొడుక్కి, ఒక్కగానొక్క కొడుక్కి, అన్నం తినిపించి కబుర్లు చెప్పడం కూడా మానేసి కూచుని తాగేంత. విపరీతమైన వేగంతో చాలా ఎక్కువ తాగేంత. అంతటి పక్కా తాగుబోతు ఆమె.

ఇక ఆమె ప్రవర్తన చూస్తే ఎంతో వెకిలిగా వుంటుంది. ముక్కూ మొహం తెలియని ఒక కథా రచయితని ఒక వర్షం కురుస్తున్న రాత్రి మొగుడు లేనప్పుడు ఇంటికి తీసుకొచ్చేస్తుంది. అతనితో రెండోసారి ఫోనులో మాట్లాడుతూ “ఆమెకామె మురిసిపోతూ” “కిసుక్కుమని నవ్వుతూ” మాయా జలతారు కప్పుతుంది. పెద్ద పరిచయం లేని మగాడి ఏకాంతంలో “నైటీలోకి మారి”పోతుంది.

ఇంత అవకతవకగా, ఇంత వెకిలిగా ప్రవర్తించే ఒక స్పెషలిస్టు, ఆడ డాక్టర్లు మన సమాజంలో అత్యంత చిన్న మైనార్టీగానే వుంటారని నేను నమ్ముతున్నాను. మరి ఆ నూటికో కోటికో ఒక్కరి గురించి రాసి లక్షలాది మంది చదివే పత్రికల్లో ప్రచురించడం ఎందుకు? రచయిత ప్రణాలిక, ఆశించిన ప్రయోజనం ఏమిటి? అని చూస్తే మనం రెండో పాత్రని చూడాలి.

డాక్టరుగారి కొడుకు, చిన్నూ. “అతనికి పన్నెండు ఉండొచ్చు. కానీ వేరేగా వున్నాడు. ఆ వయసుకే చాల పెద్దరికంతో కన్పిస్తున్నాడు. చనువు తీసుకుని ముట్టుకోవాలన్నా భయంగా అనిపించేంత”.  చిన్నూ “నలుగురిలో కలిసే రకం కాదండి” మాట్లాడటమే తగ్గించేశాడు. తన పక్కన ఇద్దరు మాట్లాడుకుంటున్నా పట్టించుకోడు. సెల్‌ఫోన్‌తోనే ఆడుకుంటాడు. విపరీతమైన చదువు. ఇంగ్లీషులోనే మాట్లాడతాడు. వాననీ, ప్రకృతినీ చూసే, ఆనందించే ఆసక్తే లేదు.  ఇవన్నీ సరేకానీ, ఎక్కువ చనువు లేని వాళ్ల ముందే తల్లితో వాళ్ల గురించి తప్పుగా మాట్లాడతాడు. అతను తల్లికే రంకు కడతాడు .. తల్లి మాటల్లోనే “కొత్తల్లో వాడు పదే పదే ఫోను చేస్తూ నా వేరెబౌట్స్ తెలుసుకుంటుంటే కన్శర్న్‌తో చేస్తున్నాడేమో అనుకునేదాన్ని. కాదు. నా మీద లైకింగ్ అన్నమాట. తల్లిని అనుమానించే కొడుకు. మీరు నమ్మరు. నా మగ స్నేహితులందరూ మా లాండ్‌లైన్‌కి చేయడమే మానేశారు. వీడు ఎత్తాడంటే అవతలి పక్షాన్ని ఏదో విధంగా అవమానించేవాడు”

“ఆ వయసు పిల్లల్లో ఉండాల్సిన అమాయకత్వం లేదు. హుషారు లేదు. ఎప్పుడు చూసినా నంబ్‌గా ఉంటాడు. విపరీతమైన చదువు. కంప్యూటర్లో గేమ్స్. నా మీద నిఘా. ఈ మూడు పనులే వాడు చేసేది” అంటుంది.

పిల్లాడి మాటలు చూద్దాం.

“రోజూ తాగుతున్నావ్. ఇవాళ ఇంకెవరినో తెచ్చిపెట్టుకుని తాగుతున్నావ్. నాన్నతో చెబుతాను ఉండు” అని వూరుకోడు.

“రాక్షసి, నాన్నను వదిలేసి ఇంకెవరితోనో… మర్యాదగా అతన్ని బయటకు పంపు లేకుంటే…”

అదీ విషయం. లావుగా, వూబగా పెరిగిన శరీరంతో చిన్నూ ఇంత వికృతంగా తయారయ్యాడు.

కథలోంచి చూస్తే ఇది కార్యకారణ సంబంధం. తల్లి అలా వుండబట్టే కొడుకు ఇలా తయారయ్యాడు. అయితే తల్లి అలా అవడానికి కారణాలేంటి? డాక్టరు మాటల ప్రకారం ఫ్రస్ట్రేషన్ (అశాంతి), రోజుకి పన్నెండు గంటలు పని చెయ్యడం, డిప్రెషన్, అవసరమైన వేళలో భర్త తోడు లేకపోవడం, పెద్దల్ని ఎదిరించి చేసుకున్న కులాంతర వివాహం వల్ల “కుటుంబం” లేని ఒంటరితనం, సొఫిస్టికేటెడ్‌గా మోసం చేయ్యడం, వంచన.. ఇదంతా ఎందుకంటే కెరీర్ కోసం. డబ్బు కోసం. అందుకోసం డాక్టరు అలా అయ్యింది. అందువల్ల కొడుకు ఇలా అయ్యేడు. వెరశి “ప్రాణం ఉసూరుమంటోందండి ఈ సొసైటీని చూస్తే. ఈ స్పీడు మంచిది కాదు” అందుకోసం మనుషులు మారాలి. ప్రజలతో కలిసి నేలమీద నడవాలి. సహజంగానూ, సంతృప్తితోనూ జీవిస్తే చిన్నూలు బాగుంటారు. అదీ కథ.

అయితే ఈ కథని మనం కథకుని మెదడులోంచి చూస్తాం. అతని ఆలోచనల్లోంచి చూస్తాం. కథకుడి పాత్రని చూస్తే అతనొక జర్నలిస్టు. కథా రచయిత. అయితే అతను రాసిన కథ ఎలాంటిదో, ఏ ప్రయోజనం ఆశించి రాస్తున్నాడో తెలీదు. కథారచన అతని ప్రతిష్టలో భాగమా? అతని ఆశయాల వ్యక్తీకరణా? అతని ఆచరణా మార్గమా? వివరాలు తెలీవు గానీ అతని వ్యక్తిత్వాన్ని అంచనా వెయ్యడానికి కొన్ని ఆధారాలు దొరుకుతాయి. నికార్సైన వెకిలిపాత్ర ఇది. ఒక మామూలు రచయితకి ఒక స్పెషలిస్టు డాక్టరు “పడిపోయినట్టు” అన్పించేలా మాట్లాడతాడు.

“మీ ఆవిడ ఎదుట నేరుగా చెప్పడం సిగ్గుగా అనిపించింది” అని కిసుక్కున నవ్వింది. అని తనలో తనే మురిసి పోతుందని రాయడం, తన ఎదురుగా నైటీలోకి మారిందని రాయడం కేవలం అతని రహస్య ఆకాంక్షలే కాకపోతే, ” ఆ రంగుల నైటీలో ఆకర్షణీయంగా వుంది” “తడిసిన పెదాలు మెరుస్తూ కనిపిస్తున్నాయి” అని చెప్పడానికి కథకీ ఏమిటి సంబంధం? అతని మాటల్లోనే “నాకు ఆమె ముఖ్యం. ఆమె కోరినట్లుగా ఆమెతో కాసేపు మాటలు ముఖ్యం” దయచేసి ఒక్కొక్క పదం చదవండి. పైగా “ఆమె కథ తెలుసుకోవాలి. అందుకు ఈ ఒక్కరోజు ఏం జరిగినా భరించాలి” భరించి, తెలుసుకొని కథగా రాసి కీర్తి కొట్టెయ్యాలి. ఇక తన కళ్లముందున్న, తన తప్పేమీలేని చిన్నపిల్లవాడి పాత్రని కూడా సానుభూతితో వివరించకుండా “ఈ దెయ్యంగాడ్ని (వేరే మాట అనుకున్నాను)” అని చెప్పే ఈ రచయిత ఎలాంటి కథలు రాస్తాడో సుళువుగానే అర్ధం అవుతుంది. ఇతర్ల జీవితాల్లోకి తొంగి చూసే (వోయర్) స్త్రీని శరీర అంగాలుగా చూసే (ఎగ్జిబిషనిజం) కథకుడు నాకు వెకిలిగానే కన్పించాడు. అందుకే ఇతనికి ఎవరి పట్లా సానుభూతీ లేదు. సహాయం కోరి వచ్చిన స్త్రీకి ఏ విధమైన సహాయమూ చెయ్యడు.

కధంతా చదివిన తర్వాత మనకి అంతా గందరగోళం మిగుల్తుంది. ఇది సాహిత్య ప్రయోజనానికి భిన్నం. వ్యతిరేకం. కధో, కవితో, వ్యాసమో చదివిన తర్వాత పాఠకులకి కొత్త  తెలివిడి కలగాలి. అస్పష్టతలు విడిపోయి స్పష్ఠత పెరగాలి. ఈ కధలో అతి పెద్ద గందరగోళం డాక్టరుగారి జీవితం.. ఆవిడ దుఃఖానికి, విషాదానికి కారణం వ్యక్తిగత జీవితమా? సాంఘిక కట్టుబాట్లా? ఆర్ధిక సూత్రాలా? ఎక్కడా స్పష్టత లేదు. పిల్లాడు అలా తయారవ్వడానికి తల్లే కారణమా? ఆమె కాస్త బాధ్యతగా వుంటే సరేనా?

ఈ గందరగోళానికి కారణం సమస్యల్ని వ్యక్తుల వైపు నుంచి చూడడం. సమాజాన్ని నడిపించే శక్తుల పట్ల అవగాహన లేకపోవడం. పిల్లాడు లేదా తల్లి సంఘం నుంచి వేరు చెయ్యబడడానికి కారణాలు తెలియక పోవడం. పిల్లాడు సెల్‌ఫోన్‌తో ఆడుకోకుండా కుక్కల్నో, మొక్కలనో పెంచుకుంటే అంతా బాగున్నట్టేనా? అతను ‘జన జీవనస్రవంతి”లో కలిసిపోయినట్టేనా?

వాస్తవం చూస్తే ఈ కధలోని పిల్లాడు మనకు కనబడినట్టే  వుంటుంది. నిజమేగదా అనిపిస్తుంది. కానీ ఇక్కడే, సరిగ్గా ఇక్కడే రచయిత లేదా వ్యాఖ్యాత దృష్ఠికోణం అవసరం అవుతుంది. కనిపించే జీవితాన్ని సరైన దృక్పధంతో చూసి మన కళ్లముందు వుంచే ప్రయత్నం. దానికి కావలసిన అధ్యయనమూ, కృషీ రచయిత చెయ్యకపోతే ఇలాగే వ్యక్తుల పట్ల ద్వేషాన్ని, అసహనాన్నీ పెంచుకుంటూ పోతాం. అప్పుడు పాత్రలపట్ల, మనుషుల పట్ల కలగవలసిన కనీసపు సానుభూతిని కలిగించలేకపోతాం.

పెద్ద పెద్ద డాక్టర్ల, బాగా డబ్బున్నవాళ్ల పిల్లలే కాదు, దాదాపుగా అందరూ అలాగే వున్నారు. సెల్‌ఫోన్, టీ.వీ. ఇంటర్నెట్‌లు  ఆ ప్రత్యక్ష కారణాలుగా వున్నాయి. ఈ అంశం మీద రాసిన పాపినేని శివశంకర్‌గారి కథ మనం చదవొచ్చు. ఆటలు లేవని బాధ సహజమే. అయితే నగరీకరణ మనుషులు తిరిగే ప్రదేశాన్ని హరించి వేస్తోంది. నగరాల్లో మనిషి సగటున కేవలం మూడు నాలుగు అడుగుల జాగాలో గడుపుతున్నాడు. నిలువునా పాతేసినా చాలనంత. ఉమ్మడి స్థలాలు ‘సరుకుగా మారిపోయేక, కాంక్రీటు రోడ్ల మీద కబడ్డీ ఆడలేరు. ఏ క్రికెట్టో ఆడదామన్నా వున్న రోడ్లన్నీ కారు పార్కింకులకే సరిపోవడం లేదు. ఒకే ఆర్ధిక స్థాయి వున్న పిల్లలంతా ఒకే స్కూల్లో చదవడంతో, వాళ్లు నగరం నాలుగు మూలల్లో వుండడంతో వారి మధ్య ఆడుకునేంత సాన్నిహిత్యం ఏర్పడదు.

పోష్ ఏరియాల్లో “నేల మీద” వుండే జనం వుండలేరు. తల్లీ, తండ్రీ ఇద్దరూ కష్టపడకపోతే పొట్ట గడవదు. ఒంటరితనంలో గడీపే పిల్లలకి సెల్‌ఫోన్లు, కంప్యూటర్ గేమ్సు, టెలివిజనూ తప్పించి మనం ప్రత్యామ్నాయం ఏం చూపించగలం? ఇంట్లోకి కొత్త పిల్లలొస్తే ఏం పోతాయో అన్న భయంతో మనం పిల్లలకి స్నేహితుల్ని ఎలా చూపించగలం?

ఇక్కడ డాక్టర్లకి వచ్చే ఆదాయం కంటే వేరే చోట ఎక్కువ వస్తున్నప్పుడు పెళ్లాం పిల్లల్ని వదిలిపోవద్దంటూ మనం ఇచ్చే అధర్మ నినాదాలు ఏ మేరకి మనుషుల్ని పట్టి వుంచుతాయి? కూలీకైనా, సాఫ్ట్‌వేర్ కూలీకైనా, డాక్టరుకైనా సూత్రాలు తేడాగా లేనప్పుడు జీవితం తేడాగా ఎలా వుంటుందీ?

సమస్యల కుదుర్లోకి పోకుండా విడివిడిగా చూడ్డం మొదలుపెడితే ఆకుల్ని చూసి చెట్టుని వర్ణించినట్టుగా ఇలాగే గందరగోళంగానే వుంటుంది.

ఇంతకీ, ఈ పాత్రల్ని సానుభూతి రగిల్చే విధంగా, కన్నీటి ముద్దలుగా తయారుచేస్తే నాకు సరేనా? పిల్లాడు మొక్కల్నో, కుక్కల్నో పెంచడం కాకుండా మురికివాడలోని పిల్లల్తో కర్రాబిల్లా, కోతి కొమ్మచ్చి ఆడుకున్నట్లు రాస్తే నాకు సరేనా? అంటే కాదు.

ఈ పాత్రల పట్ల నాకు పెద్దగా సానుభూతి లేదు. అయితే నా కారణాలు నాకున్నాయి.

అవేంటో చెప్తాను. కొంచెం ఆగాలి.

—చిత్ర

-చిత్ర

Download PDF

13 Comments

 • M.santhamani says:

  చిత్రాగారు,ఆఖరున చెప్తామని చెప్పకుండా ఒదిలి వెయ్సారేమిటి.మంచి విమర్శ.ఏ బతుకులు ఏ ఆలోచనలు చేస్తాయో రచయిత తెలుసుకోకపోతే ఎలా.ఖద్దీర్ కధ వస్తువు,పాత్రలు,సంవిధానము వాటికీ సమాజానికీ ఉండే సంబంధము తెలుసుకోవాలి .కాని అతనికి ఆ అవసరం లేకుండా పెద్ద రచయిత అయిపోయాడు…ఆఖరి రచయిత అనేసారు….

  • CHITRA says:

   SIR/ MADAM. నమస్తే ఆఖరి రచయితా అన్నది నా మాట కాదు. ఈ వ్యాసం మూడు భాగాలుగా వస్తుంది .కొంచెం ఆగండి. చదివినందుకు థాంక్స్.

 • moida srinivasarao says:

  చిత్ర గారు ఆకాశంలోకి చూసి నడుస్తున్న రచయతలకు నేలను చూపించే మీ ప్రయత్నం బావుంది. మీ మిగతా రెండు వ్యాసాలకై ఎదురుచూస్తూ. . .

 • sarada says:

  బాగుంది మెదెమ్
  మిగతా భాగాల కోసం చూస్తున్నాము

 • reddi raamakrishna says:

  మీ వ్యాసం ఆసక్తిని కలిగిస్తూ ఉంది.విశ్లేషణ బాగుంది .మిగతా భాగాలు కొరకు చూస్తున్నాం .

 • Nageswara Rao says:

  చాలా బాగుంది..మీ విశ్లేషణ !

 • noone says:

  చిత గారు,

  గతం లో మీరు ఖదీర్ బాబు కథల గురించి ఏమి రాసారో ఆ వ్యాసం కూడా ఇక్కద ఇస్తే వీలుగ్ అవుంతుంది చదువరికి.

  ధన్యవాదాలు,

 • mani says:

  చిత్ర ది నెగెటివ్ అప్రోచ్ తప్ప పాజిటివ్ విమర్శ కానే కాదు. ఇలాంటి విమర్శల్ని పల్లకీ కెక్కించి మనమేం సాధిస్తాం?

  • CHITRA says:

   సారూ నమస్తే బావుంది ఈ కథ మీద మీరు ఒక మంచి పాజిటివ్ విమర్శ శివ ఖేరా లాగ రాస్తే నా ఖర్చులతో ప్రింట్ చేసి అందరికీ పంపిస్తా . తర్వాత మాట్లాడుకుందాం .

 • mani says:

  నేను పాజిటివ్ విమర్శ రాసి మిమ్మల్ని ఖర్చుల పాలు చెయ్యటం బాగోదు. మీరే ఒక పాజిటివ్ కథ రాస్తే తెలుగు కథాలోకానికి మోడల్ సెట్ చేసిన వాళ్ళవుతారు.

  • CHITRA says:

   రాస్తున్నాను ఒకటి కాదు ఒక సిరీస్ మీ మెయిల్ అడ్రస్ ఇస్తే పంపుతూ ఉంటా

 • సంపాదకులకి,
  ఇక్కడ ఇచ్చిన పి డి ఎఫ్ ఫైల్ ఎందుకు ఇచ్చారో, అర్ధం కాలేదు. అందులో అక్షరాలు ??? తో కనపడుతున్నవి. యూనికోడ్ ఫాంట్ లో అయితే బాగానే ఉండవఛ్చు. ఒక సారి దృష్టి సారించగలరా?

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)