కళారవికి అభివాదం

drushya drushyam-21...

ఒక సామాన్యమైన విషయాన్ని పంచుకున్నట్టే పంచుకున్నాడు గానీ ఆ మనిషి ఓ అసామాన్యమైన విషయాన్నే బోధించాడు. మరేం లేదు. “మానవుడు అన్నవాడు ఒక గంటలో కనీసం ఐదు నిమిషాలైనా ఆనందంగా గడపాలి’ అని చెప్పాడాయన.

ఆ మాటలు చెప్పింది ఏసు. ఆయన నేను పని చేసే ఆఫీసు క్యాంటీన్లో పని చేస్తాడు. ఎప్పుడూ తానొక అద్భుతం. టీవీలో ఒక పాట వస్తుంటే, అందులోని సాహిత్యం వింటూ ఆ పదలాలిత్యాన్ని అనుభవించి పలవరిస్తాడు. పంగీతం వింటూ తానే తరంగమై తనలో తాను చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. అతడితో మాట్లాడితే ఒక ఎడ్యుకేషన్. ఒకసారి, ‘సమోసా ఎలా తినాలో తెలుసా?’ అని అడిగాడాయన. బిత్తరపోయాను. అడిగితే, ఇలా వివరించాడు. “మూడు భుజాలు ఉండే సమోసాను ఏ భుజం నుంచి తినాలీ అంటే మసాలా ఉన్న వైపు కాకుండా ఇవతలి నుంచి తినాలి’ అని చెప్పాడు. ‘…అంటే, ఒకేసారి సమోసాలో కూరిన మసాలాను తినేయ కూడదు. అది కొంచెం కొంచెంగా రుచి చూడాలి. అందుకోసమే ఈ భుజాలు…మసాలా కూర్చిన రెండు భుజాలను ఒదిలి ఇవతలి భుజం నుంచి కొంచెం కొంచెం తింటూ పోవాలి. మూడవ భుజం తినేశాక సమోసా రుచిని పూర్తిగా ఆస్వాదించినట్టవుతుంది’ అని కూడా విశదం చేశాడు.

ఆయన మాస్టర్.
చిన్న చిన్న విషయాల పట్ల ఆసక్తిని పెంచే ఒకానొక మాస్టర్ నాకు.
“ముందే ఇటువైపు నుంచి తినేస్తే చివరికంటా ఏమంత మజా ఉండదు…అందుకే తినే పద్ధతి కూడా తెలియాలి’ అంటూ ఆ సంగతిని అలా తెలియబర్చాడు. ఇట్లా ఆయన చెబుతూ, అంతకు ముందు విన్న ఒక పాట చరణాన్ని మరోసారి మననం చేసుకుంటూ, ఆనందంతో అరమోడ్పు కనులతో ఆగాడొక క్షణం. అప్పుడు చెప్పాడు పై మాటల్ని.

‘మానవుడనే వాడు కనీసంలో కనీసం గంటకు ఐదు నిమిషాలైనా ఆనందించాలని!’ ఆ ఆనందం ఏ విధంగానైనా కావచ్చును. కానీ, ఒక స్పృహతో, అవగాహనలో ఉంటూ జరగాలన్నాడు. అప్పట్నుంచీ క్యాంటిన్ కు వెళుతుంటే ఒక ఉత్సాహం. అతడు ఈ రోజు ఏం చెబుతాడా! అన్న సంతోషం. తానే కాదు, ఇటువంటి ఎందరో, ఎన్నో జీవిత రహస్యాలు తెలియపరుస్తుంటారు. అప్పుడు నిదానంగా ఆనందించే ఘడియలను అనుభవంలోకి తెచ్చుకుంటూ జీవితానందాన్ని పెంచుకుంటూ పోవడం, ఇదొక జీవన శైలి. అందులోకి చేరిన సరికొత్త రచనే దృశ్యాదృశ్యం. ఆ క్రమంలోనే ఈ చిత్రం కూడా.

+++

తండ్రి చిత్రం ఇది.
మా వీధిలో ఉండే వ్యక్తే అతడు.
చిన్న ఇల్లు. బీరువాలు తయారు చేసే చిరుద్యోగం…అతడు.
ఆ ఇంట్లో తానూ భార్యా కాపురం పెట్టినప్పట్నుంచి చూస్తూనే ఉన్నాను.
ఆమె ప్రెగ్నెంట్ అవడం, సీమంతం చేసుకోవడం, బంధువుల హడావిడీ… అన్నీ నవమాసాలుగా చూసిన వాణ్ని.
కొంతకాలం కనిపించలేదు. ఆ తర్వాత పాపతో తిరిగి రావడం, వాళ్లమ్మ మరికొన్ని నెలలు ఇక్కడే కనిపించడం… అటు తర్వాత ఇద్దరే మిగిలారు, ఈ పాపతో….

ఒకానొక ఉదయం ఆ నెలల పాపాయిని సూర్యరశ్మి తాకేలా ఉంచడం చూశాను. అంతకుముందూ చూశానుగానీ ఇంత బాగా చూడటం అన్నది “గంటలో ఐదు నిమిషాలైనా’ అన్న పాఠం తర్వాతే బాగా కుదురుకున్నది. వాళ్లిద్దరినీ చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉండగా ఇద్దరూ ఒకర్నొకరు చూస్తూ ఉండటం చూశాను. అప్పుడు క్లిక్ మనిపించాను ఈ దృశ్యాన్ని.
అదొక సమోస. వేచి ఉండి, ఎలా తినాలో తెలిశాక వేచి వేచి ఉండి, పూర్తిగా ఆస్వాదించిన త్రిభుజం వంటి చిత్రం నాకు.

గంటలో కాదు, రోజులో కూడా కాదు, పక్షానికి ఒక రోజైనా ఇటువంటి చిత్రం తీసినప్పడు పొందిన ఆనందం వంటిది అనుభవించడం అదృష్టం. ఏసు గుర్తొచ్చాడు ఈ అదృష్టం కలిగినప్పుడు!

+++

మళ్లీ ఈ చిత్రం. ఇందులో ఉన్నది ఆనందమే. అందులో ఉన్న వెచ్చని వెలుతురే ఆ గొప్ప ఆనందం.
మామూలుగా వెలుతురు రోజూ పడుతుంది. సూర్యుడు రోజూ ఉదయించినట్లే చూడగా చూడగా అది మామూలే అయిపోయింది. కానీ, ఒక తండ్రి తన బిడ్డను ఒడిలో పెట్టుకుని ఆ వెలుతురులో కాసేపు కూచున్నప్పుడు ఏదో ఒక వెలుతురు…జీవితాన్ని ఆనందించమని చెప్పే వేకువ వెలుతురు…అది మొత్తం మానవ నాగరికతలో ఉదయించే ఒకానొక ఉదయం వంటి ఆనందాతిశయం. గర్వకారణం వంటి చిత్రం. దాన్ని తీశాను నేను…

చిత్రమేమిటంటే, మెల్లగా మెల్లగా ఆ బిడ్డకూ చూపు ఆనడం, తల్లిని గుర్తుపట్టడం, తండ్రి కళ్లల్లోకి సూటిగా చూసి నవ్వేయడం! అదొక అద్భుతమైన పర్యవసానం. దాన్ని బంధించడం మాటలు కాదు. ఒక అపూర్వమైన చేతనమే!

తండ్రి అవడాన్ని ఆనందంగా అనుభవించే మహోన్నతమైన ఒక ఘడియను దృశ్యం చేయడం ఒక వెలుతురు రచన.
సూటిగా. కళ్లు కళ్లు కలిసే ఆ రెండు తరాల స్పర్శ, అదొక మానవీయ వెలుతురు కావ్యం. దాన్ని బంధించిన వైనం నిజానికి ఒక ఐదు నిమిషాలు కూడా కాదు. రెప్పపాటు క్షణమే. కానీ, గంటకు ఐదు నిమిషాలైనా మనతో మనం ఉన్నప్పుడే ఇటువంటిదేదో నిలుస్తుంది. తద్వారా అ నిమిషాలు నిలిచిపోయే ఆనందాలైతాయి. అలాంటిదే ఈ.దృశ్యం చిత్రితమై నిలిచిపోవడం…అది ఎప్పటికీ జ్ఞాపకాలను తారాడించడం…అదొక చిరస్మరణీయమైన ఆనందం.

+++

నిజానికి ఛాయా చిత్రలేఖనం అన్నది వెలుతురు రచన. ఆ వెలుతురును ఆస్వాదిస్తూ ఆ ఉదయానంతర రశ్మిలో నవశిశువు ఉల్లాసాన్ని, తండ్రి అభిమాన ధృక్కుల్నీ పరిచయం చేయగలగడం అన్నది చిత్రకారుడికీ కూడా ఆ పాప వలే పొందే ‘విటమిన్ డి’ అనే చె్ప్పాలి. ఇటువంటి ఫొటోలు తీస్తూ పొందే బలం వేయి రచనలు చేసిన దానికన్నా ఎక్కువే అనుకోవాలి. అందుకే నిలబడాలి. గంటలో ఒక ఐదు నిమిషాలైనా ఒక లిప్తకాలంలో పొందే ఇలాంటి దృశ్యంలో ఉండటం కోసం జీవించాలి.

అలా నిలబడితేనే జీవితం. వాళ్ల జీవితంలో మనమూ జీవిస్తాం. అదే చిత్రం…దృశ్యం.
అలా జీవించేందుకు పాఠం నేర్పిన ఏసుకు, అవకాశం కల్పించిన ఆ బిడ్డకూ తల్లిదండ్రులకూ, మీదుమిక్కిలి వెలుతురు రచనకు ప్రామాణికమైన కళారవికి శిరసు వంచి అభివాదాలు.

~ కందుకూరి రమేష్ బాబు

Download PDF

5 Comments

  • గుండెబోయిన శ్రీనివాస్ says:

    `నిజానికి ఛాయా చిత్రలేఖనం అన్నది వెలుతురు రచన. ఆ వెలుతురును ఆస్వాదిస్తూ ఆ ఉదయానంతర రశ్మిలో నవశిశువు ఉల్లాసాన్ని, తండ్రి అభిమాన ధృక్కుల్నీ పరిచయం చేయగలగడం అన్నది చిత్రకారుడికీ కూడా ఆ పాప వలే పొందే ‘విటమిన్ డి’ అనే చె్ప్పాలి. ఇటువంటి ఫొటోలు తీస్తూ పొందే బలం వేయి రచనలు చేసిన దానికన్నా ఎక్కువే అనుకోవాలి. అందుకే నిలబడాలి. గంటలో ఒక ఐదు నిమిషాలైనా ఒక లిప్తకాలంలో పొందే ఇలాంటి దృశ్యంలో ఉండటం కోసం జీవించాలి.’
    పై వాక్యాలు బాగున్నాయి .

    • pentaiah says:

      రమేష్ బాబు గారు ఫోటో తీయడానికి ఎంత కష్టపడ్డాడో ఆ విశయాన్నీ మాటల్లో చెప్పడం వలన ఫోటోలు తీయడం చాల కష్టమైన పనే అనీ , ఆ ఫోటో వెంట ఆ ఫోటో ఏమి చెబుతున్నదో అన్న విషయం అంత సుదీర్ఘంగా రాసి పంపే అవకాసం ఉంటె ఆ ఫోటో ఇంకా చాల గొప్పది అవుతుంది అని అర్థం అయ్యింది నాకయితే.

  • నిజానికి ఫోటో మాట్లాడేది ఫోటో మాట్లాడుతుంది, ఎవరి అనుభవ ప్రపంచానీ బట్టి వారితో.
    కాని, ఫోటోగ్రాఫర్ అ ఫోటో గురించి రాయడం వాళ్ళ తన ప్రాపంచిక అనుభవం ఒకటి నిదానంగా రీడర్స్ కు అందుతుంది. తద్వారా ఒక జీవన వ్యాపకంగా ఉన్న ఈ మధ్యమము, అందులో ఇతరులు చేస్తున్న ప్రయత్నాలు మరింత బాగా అర్థం అవుతాయి. ఉదాహరణకు కవులు, సంగీత విద్వాంసులు, ఇతర సృజనాత్మక వ్యక్తుల క్రుశుని అర్థం చేసుకోగలిగినట్లే ఫోటోగ్రాఫర్స్ ను కూడా ఇలా చదువుకోవచ్చు. ఐతే ఇది ఎంతో సాధన చేసిన వారు నిర్వహించాల్సిన ఫీచర్, నాకు అవకాశం దొరకడం అదృష్టమే. నా తొలి కవిత్వాని అచ్చు వేసిన అఫ్సర్ అన్న నా మలి ప్రయత్నంగ ఉన్న ఫోటోగ్రఫీ గురించి రాసే అవకాశం కల్పించి నందుకు కృతజ్నతలు, గుండెబోయిన శ్రీనివాస్ గారికి, pentaiah గారికి -మీ స్పందనకు అభివాదాలు.

  • Radha says:

    Ramesh babu garu, పుత్రోత్సాహం ఆ తండ్రి కన్నుల్లో పట్టేసారు. బావుంది. ఆ షాట్ తీయడానికి మీరు పడ్డ శ్రమ తెలుస్తుంది – అభినందనలు

Leave a Reply to కొత్తావకాయ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)