
+++
ఒట్టి కలయిక. పనిమీద పోతూ పోతూ అట్ల నిలబడి చివరకు ఆ పనినే మర్చిపోయేంతటి కలయిక. ఒక భాషణం. దేహం కూడా చేతులు ముడుచుకుంటుంది. పెదాలపై వేలుంచుకుని విస్మయం వ్యక్తం చేస్తుంది. అంత సూటిగా, నిశితంగా సాగే ముఖాముఖి.
ఇరువురూ మాటలాడుతూ ఉండగా ఒకింత బీరిపోయి, వింటూ వింటూ కొంగుతో కన్నీళ్లు తుడ్చుకుని లేదంటే ఆ కొంగునే నోట్లో దోపుకుని దుఃఖాన్ని ఉగ్గబట్టుకోవడం, అదీ కాకపోతే ఎవరేమనుకుంటున్నారో చూడనైనా చూడకుండా గొడగొడ ఏడ్వడం, అల్మిచ్చుకుని వెన్నుతట్టడం,…ఇట్లా ముఖాముఖిలోనే అన్నీనూ…
+++
‘ఓసినీ’ అని అశ్చర్యపడేందుకు, “ఏ పోవే…’ అని పరాష్కాలు ఆడుకునేందుకు, “సుప్పనాతి’ అని చురచుర తిట్టుకునేందుకు కూడా ఈ ముఖాముఖి.
+++
పక్కపక్క గల్లిలోనే ఉంటాం. కానీ కలిసినప్పుడు ఇట్లా ముఖాముఖి.
కావలసి కలసినప్పుడూ ఇట్లా ముఖాముఖి.
వీలైనంత వరకూ కలవక కలవక కలిసినప్పుడు నిజమైన ముఖాముఖి…
ఎన్నో రకాలుగా ముఖుమాఖిగా అదొక సుఖం దుఃఖం.
ఇది జగను ఓదార్పు కాదు. మరొక రాజకీయ విజయోత్సవ సభా కాదు. సిసలైన సామాజికం ఇట్లా ఎదురుపడటం. కలవడానికి విరామంలేని జీవితంలో అట్లా కలయిక. అంతే.
గన్ మైకూ లేదు. టెలీ ప్రాంప్టర్ లేదు. టేకులూ లేవు. నేరుగా ప్రసారం. ప్రత్యక్ష ప్రసారం.
ఒకరి మనసులో ఇంకొకరి స్థానంతో జరిగే నిజమైన జీవన ప్రసరం.
ఇదంతా బహిరంగం. మాట్లాడుతున్నప్పుడే రహస్యం. ఎంత వాల్యూం పెంచాలో మరెంత తగ్గించాలో, ఎలా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలో ఆ అక్కలకు తెల్సినంత మనకెవరికైనా తెలిస్తే అది నిజమైన ముఖాముఖి.
+++
ఈ ఇద్దరి ఏకాంత ప్రపంచం అంతా చుట్టూ ఉన్న రణగొణ ప్రపంచంలోనే! అదే నిజమైన కమ్యూనికేషన్. మిగతాదంతా గాలివాటం. అదే ముఖాముఖి.
ఇది ఎక్కడంటారా?
హైదరాబాదులోని పార్సిగుట్టలో దండోరా కేంద్ర కార్యాలయం ఉన్నది. అక్కడ మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణ మాదిగ తరచూ పెద్ద ఎత్తున్న పత్రికా సమావేశాలు ఏర్పాటు చేస్తుంటాడు. ఆ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి టెలివిజన్ చానళ్లు తమ ఒబి వ్యాన్లను కూడా పంపుతాయి. అవన్నీ ఆ ఇరుకు రోడ్డులో… నాలుగైదు, ఒక్కోసారి ఐదారు నిలిచి ఉంటై. చిత్రమేమిటంటే, ఒక వర్షం వెలిసిన ఉదయం ఒక వ్యాను పక్కన ముచ్చట్లలో మునిగిపోయిన ఈ అమ్మలక్కలను చూశాను. చూస్తే! ఈ వారం దృశ్యాదృశ్యం.
+++
ఒక చిన్న తుంపర కురిసి వెలిసింది. అప్పుడీ ముఖాముఖి.
మనసులోని రందిని పెంచే ఒక తుంపర. అలాగే మనసును పంచుకున్నాక వెలిసిన తుంపర కూడా.
ఇది కవిత్వం కాదు, కళా కాదు- సమస్తం. అది కనుల ముందు తారాడి వెలసిపోకుండా ఒక దృశ్యంగా ఉంచేందుకే ఛాయచిత్రణం. అదే నా ముఖాముఖి.
ధన్యవాదాలు, అమ్మలక్కల్లా కలిసిన మనందరికీ.
~ కందుకూరి రమేష్ బాబు